top of page
Writer's pictureDasu Radhika

పెళ్ళి పులిహోర


Pelli Pulihora Written By Dasu Radhika

రచన : దాసు రాధిక


"ఆ వస్తున్నానండీ"

‘ అబ్బ! ఎప్పుడూ కేకలు పెట్టి పిలిచి చేస్తున్న పనికి ఆటంకం కలిగించటమే ఈయనకు ఇష్టం’ అని గొణుగుతూ లోపలికి వచ్చింది సుగుణ చేతిలో ఫోను పట్టుకుని.

"కాస్త నా తువ్వాలు ఎక్కడుందో ఇవ్వు సుగుణ, తొందరగా వెళ్ళాలి. కడుపు కదులుతోంది" అన్నాడు రంగనాథం.

"అవతల పిన్నిగారు మళ్ళీ దొరకరు నాకు, ఇంకో గంట వరకు నేను పలకను, మళ్లీ పిలవొద్దు" అని తువ్వాలు రంగనాథం మొహాన పడేసి పెరట్లోకి పరిగెత్తింది సుగుణ. అక్కడైతే ప్రశాంతంగా మాటలాడుకోవచ్చు. రీడయిల్ నొక్కి పక్కింటి పిన్ని గారితో , " ఆ ఏమి లేదు మాకు కూడా ఇప్పుడే ఒక ఆన్లైన్ పెళ్ళి పిలుపు వచ్చింది, ఈయన అందుకే పిలిచారు నన్ను" అంది గర్వంగా. "మా వాళ్ళందరూ కరోనా వల్ల భయపడుతూ కూర్చున్నారు గాని, ఇప్పుడు ఒకొక్కళ్ళూ మొదలు పెడితే మాత్రము ఆన్లైన్ పెళ్లిళ్లు మీకంటే మేమే ఎక్కువ చూస్తాము లెండి, ఒక్క నెల ఆగండి" అని బిగ్గరగా మాట్లాడుతూ ఉంది సుగుణ.

"మొన్నటి ఆన్లైన్ పెళ్లి మరీ మామూలుగా జరిగిందిలే సుగుణా! నేనే పెళ్లికూతురు తల్లి కట్టిన చీర కంటే పెద్ద చీర కట్టాను. ఆ రోజు ఇంట్లో కూరలై పోయి ఏదో ముద్ద పప్పు, చారు పెట్టుకున్నాము మేము, అదీ ఒక పెళ్ళి భోజనమే నా... పది రోజుల క్రితం మా చెల్లెలి పినత్తగారి ఆడబడుచు మనవరాలి పెళ్ళికైతే ఎంచక్కా గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు, వడలు, బొబ్బట్లు, అప్పడాలు, వడియాలు అన్నీ చేసుకొని తిన్నాము తెలుసా? వాళ్ళైతే మేజువాణి ఏర్పాటు ,అదే ఇప్పుడు దాన్ని సంగీత్ అంటున్నారట, చేశారు.మా మనవడు, మనవరాలు సంగీత్ డాన్సులు చేశారు ఇంట్లో, ఆన్లైన్ వాళ్ళని చూస్తూ.

మొన్నటి పెళ్లి ఒక్క అరగంటే అంతా కలిపి .పైగా నెట్వర్క్ సరిగ్గా ఏర్పాటు చేయలేదు వాళ్ళు, బోలెడు అంతరాయాలు మాకు ఆ కాసేపట్లో…”

'వీళ్ల వైఫై పోతే తప్పు వాళ్లదా?' అని ఆలోచిస్తోంది సుగుణ,.

ఆవిడ ఆగకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతోంది... “పది మందిమే ఆన్లైన్ గెస్టులము, ఆ ముందు దానికైతే ఆస్ట్రేలియా, అమెరికా, శ్రీలంక నుండి కూడా వీక్షించారు దాదాపు 350 మంది. మాకు ఎవ్వరూ తెలీకపోతేనే...ఇంక రిటర్న్ గిఫ్ట్ మాట కొస్తే ఆ పెద్ద పెళ్లి కి వాళ్ళు చెల్లెలికి బ్లౌజ్ పీస్ తో పాటు ఉత్తరీయాన్ని పంపారు. మొన్న మటుకు కొరియర్ లో పసుపు కుంకుమ ప్యాకెట్ తో స్టీలు బౌలు వచ్చింది మాకు పోస్ట్ లో, పోస్ట్ ఖర్చు దండగ..." అంటూ పిన్నిగారు పాపం మొన్న పెళ్ళి కి పిలిచిన వాళ్ల పెళ్లి ని పులిహోర కలిపేసింది..

సుగుణ ఊరుకుందా, “అయితే పిన్నిగారు, మరీ మీ చెల్లెలి తాలూ కా వారు మీకేమి పంపారు?" "అంత పెద్ద వాళ్ళు మమ్మల్ని పిలిచారా ఏంటి? మా చెల్లెల్లు చెప్తే మేమే ఆ పెళ్లి లింకు పెట్టుకుని మూడు లాప్టాప్ లలో చూశాము. ఆ రోజు ఆదివారం కదా, పిల్లలకు ఆన్లైన్ సెలవు... మొన్నేమో ఒకే లాప్టాప్..చూసి పెట్టుకోవద్దూ ముహూర్తము” అని మళ్ళీ మొదలైపోయింది ఆవిడ పెళ్లి పులిహోర కలపటం... ఆన్లైన్ పెళ్లిళ్ల వల్ల ఖర్చులు కలిసొచ్చాయి సుగుణా !, చదివింపులు లేవుగా... దర్జాగా మన ఇంట్లో మనమే కూర్చోని చూడొచ్చు, ఎదురు పడితే ఇష్టములేని వాళ్ళ తో మాట్లాడాల్సి వస్తుంది పెళ్లిళ్లలో, ఆన్లైన్ లో మన ఇష్టం.మొగవాళ్ళు, పిల్లలకు పెళ్లి బట్టల ఖర్చులేదు. లోకల్ అనుకో, పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. ఇక పోతే మన నగలు మన దగ్గరే జాగ్రత్తగా ఉంటాయి లాకరులో, పోతాయి అన్న భయము లేదు, ఆన్లైన్ పెళ్లికి అన్నీ అవసరముండవుగా"...


"మొన్నటికిమొన్న ఈ వీధి చివరన ఉండే పార్వతమ్మ ఫోను చేసింది, ఎప్పుడూ చేయదు నీకు తెలుసుగా, వాళ్ల పనిమనిషి అన్నదిట "ఆమ్మగోరూ, మీకు ఆన్లైన్ పెళ్లి పిలుపులు రావా? కోటమ్మ పని చేసే జయ పిన్నిగారికి, సందు చివర ఉంటారు, వారానికి ఒక్కటైనా వస్తుంది, ఇద్దరమూ కలిసి చూస్తామని చెప్పిందిట కోటమ్మ...

‘ఆన్లైన్ పెళ్లంటే ఏంటి’ అని అడిగింది పార్వతమ్మ నన్ను, మరీ పల్లెటూరి సంత"... అంది జయ పిన్నిగారు.

ఈవిడ బడాయి పాడుగాను... ఎవరెక్కువ పల్లెటూరు, తెలుస్తూనే ఉంది, అనుకుంటూ

సుగుణ అవాక్కైపోయింది. లోపలి నించి రంగనాథం " ఏమేవు, గంట కాదు రెండు గంటలైంది నువ్వు పెరట్లోకెళ్లి... పులిహోర కలుపుతానని పొద్దునే అన్నము వoడానన్నావు, ఎప్పుడు పెడ్తావే? అని గావు కేక పెట్టాడు...

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి



రచయిత్రి పరిచయం

పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక

వయసు: 52 సం.

నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)

స్వస్థలం: తెనాలి

చదువు: BA English Litt., B.Ed

వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.

ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం

పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.

స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.

కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు,



435 views4 comments

4 Comments


Very nice


Like

Vasu Dasu
Vasu Dasu
Dec 29, 2020

తెలిసిన చిన్న కథ ఆకృతిలో కొత్త పరిభాషను ఉపయోగించడం; విజయవంతమైన ప్రయోగం. అభినందనలు

Like

dasutrivikram
dasutrivikram
Dec 19, 2020

చక్కటి కథ మరియు కథనం డిజిటల్ ప్రపంచం మీద.

Like

చాలా బాగుంది, ఈ నాటి వాస్తవికతను ప్రతిబింబిస్తోంది. సున్నితమైన హాస్యం, ఆసక్తికరంగా చెప్పిన తీరు బాగుంది.


Like
bottom of page