'Pelli Sambandhamlo Twist' - New Telugu Story Written By L. V. Jaya
Published in manatelugukathalu.com on 22/05/2024
'పెళ్ళి సంబంధంలో ట్విస్ట్' తెలుగు కథ (అత్తగారి కథలు - పార్ట్ 3)
రచన: L. V. జయ
కథా పఠనం: మల్లవరపు భవ్య
సమర్థ్ కి పెళ్ళి చెయ్యాలి అని నిర్ణయించుకుంది వాళ్ళ అమ్మ రాధ. కొడుకు వివరాల్ని మాట్రిమోనీ లో ఇస్తూ, ఇంజనీరింగ్ చదివి, అందంగా, తెల్లగా, సన్నగా ఉండే అమ్మాయిని చూడమని చెప్పింది. కొడుకు, మంచి కాలేజీలో MBA చేసి, ఉద్యోగం చేస్తున్నా, ఇంజనీరింగ్ చదవలేదన్న బాధ ఉండిపోయింది రాధకి. వచ్చే కోడలు అయినా ఇంజనీర్ అయ్యి ఉండాలి అనుకుంది.
"ఆనందరావు వాళ్ళ అమ్మాయి చంద్రిక కి, మీ అబ్బాయికి చదువు, ఉద్యోగం అన్నీ సరిపోతున్నాయి. ఫోటో, జాతకాలు పంపించమని వాళ్లతో చెప్పమంటారా?" అని మాట్రిమోనీ వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది రాధకి.
"ఆనందరావుగారిని మా ఇంటికి రమ్మని చెప్పండి. కలిసినట్టు ఉంటుంది, ఇక్కడే మాట్లాడుకోవచ్చు" అని చెప్పింది రాధ.
ఫోటో, జాతకం తీసుకుని రాధ ఇంటికి వెళ్ళాడు ఆనందరావు. చంద్రిక ఫోటో చూసిన రాధ, "అమ్మాయి తెల్లగా ఉంటుంది అని అన్నారు. ఫొటోలో చూస్తే అలా అనిపించటం లేదు" అని అనుమానంగా అడిగింది.
"మా అమ్మాయి, నాలా చామనచాయగా ఉంటుంది అండి" అన్నాడు ఆనందరావు.
"మీలా అంటే నలుపే అన్నమాట" అంది రాధ.
తన కూతుర్ని, తనని నల్లగా ఉన్నారని రాధ అనడం నచ్చలేదు ఆనందరావుకి. కోపాన్ని అణచుకుంటూ, "మరి, మీ అబ్బాయి చామనఛాయగా ఉంటాడని అన్నారు. ఉంటాడా మరి?" అన్నాడు రాధతో.
పెళ్ళి సంబంధం కోసం వచ్చిన అమ్మాయి తండ్రి, ఇలా అడగడం నచ్చలేదు రాధకి. "మేము తెల్లగా ఉండే అమ్మాయి కోసం చూస్తున్నాం. పుట్టే పిల్లలు తెల్లగా పుట్టాలి కదా. మాకు చామనచాయ పిల్ల వద్దు. మేము వేరే సంబంధం చూసుకుంటాం. " అని చెప్పింది.
'వీళ్లు, వీళ్ల పిల్లలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వచ్చే కోడలు, పుట్టబోయే మనవలు మాత్రం తెల్లగా ఉండాలి. వీళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ చదవకపోయినా, ఇంజనీరింగ్ చదివిన కోడలు కావాలి. ఏం మనుషుల్లో ?' అని మనసులో అనుకున్నాడు ఆనందరావు.
లేచి, వెళ్ళిపోతూ, ఎదో గుర్తు వచ్చినట్టు ఆగాడు. 'అబ్బాయి MBA చేసాడు. మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. ఈవిడ ఆలోచనలు ఎలా ఉన్నా, అబ్బాయి మంచివాడేనేమో. ఈ సంబంధం ఎందుకు వదులుకోవడం? జాగృతి ని చూడమని చెప్దామ్' అనుకుని, "నా కజిన్ వాళ్ళ అమ్మాయి ఉంది. తెల్లగా ఉంటుంది. ఇంజనీరింగ్ చదివింది. మీరు చూస్తానంటే, తన వివరాలు పంపమంటాను" అన్నాడు రాధతో. సరేనంది రాధ.
ఇది జరుగుతున్న సమయంలో, చంద్రిక తనతో పాటు పనిచేస్తున్న ఒక అబ్బాయిని తీసుకువచ్చి, జాగృతి కి పరిచయం చేసింది. "ఇతను పవన్. మా ఆఫీస్ లోనే చేస్తున్నాడు. నన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. పెళ్ళి చేసుకుంటే, నన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అంటున్నాడు. నాకు కూడా తనంటే ఇష్టం. " అని చెప్పింది.
జాగృతి, చంద్రిక చెన్నై లో ఉద్యోగం చేస్తున్నారు. 'చంద్రిక కి ఉద్యోగం వచ్చి, జాగృతితో పాటు ఉంటూ ఆరు నెలలు కూడా కాలేదు. అప్పుడే ప్రేమ, పెళ్ళి అంటోంది ఏమిటి?' అనుకుంది జాగృతి. "పవన్ నీకు ముందునుండే తెలుసా?" అని చంద్రికని అడిగింది.
"లేదు. ఆఫీస్ లో జాయిన్ అయ్యాకే పరిచయం అయ్యాడు. " అంది చంద్రిక.
"బాబాయ్ కి, పిన్నికి ఈ విషయం చెప్పావా మరి?" అని అడిగింది జాగృతి.
"నాన్నగారికి చెప్పాలంటే భయంగా ఉంది జాగృతి. నువ్వే చెప్పాలి. " అంది చంద్రిక.
"నీ విషయం నువ్వు చెప్తేనే బాగుంటుంది చంద్రిక. నువ్వు బాబాయ్ తో చెప్తున్నప్పుడు, నేను నీతోనే ఉంటాను. చూద్దాం ఏమంటారో" అంది జాగృతి.
చంద్రిక ప్రేమ విషయం తెలిసి, కోపంతో ఊగిపోయాడు ఆనందరావు. "ఇక్కడ నీ కోసం నేను సంబంధాలు చూస్తున్నాను. నల్లగా ఉంది అని అందరూ వద్దంటుంటే, నువ్వు అక్కడ ఉద్యోగానికని వెళ్లి, ఇలాంటి పనులు చేస్తావా? మంచి సంబంధాలు వస్తాయా ఇంక?" అంటూ అరిచాడు.
"ఒకసారి పవన్ తో మాట్లాడండి బాబాయ్. చంద్రిక ఇష్టపడుతోంది కదా. " అని బతిమాలుకుంది జాగృతి.
ఆనందరావు చెన్నై బయలుదేరి వెళ్లి, పవన్ ని కలిసాడు. "ఏం నచ్చింది ఈ అబ్బాయిలో నీకు?" అని కోపంగా అడిగాడు.
ఆనందరావు ఎందుకు అలా అడిగాడో అర్ధం అయ్యింది చంద్రికకి. "రంగులో ఏముంది నాన్నగారు? నేను కూడా రంగు తక్కువే కదా. పవన్ చాలా మంచివాడు. ఒప్పుకోండి. ప్లీజ్" అని బతిమాలుకుంది చంద్రిక.
కాసేపు అలోచించి, "మీ ఇంట్లోవాళ్ళకి తెలుసా ఈ విషయం?" అని పవన్ ని అడిగాడు ఆనందరావు.
"తెలుసండి. వాళ్ళు మా పెళ్ళికి ఒప్పుకున్నారు" అని చెప్పాడు పవన్.
"ఏం చదువుకున్నావ్ నువ్వు ? నీ సర్టిఫికెట్స్ అన్నీ తీసుకువచ్చి, రేపు నన్ను కలువు. అప్పడు ఆలోచిస్తాను. " అని అన్నాడు ఆనందరావు.
పవన్ తెచ్చిన సర్టిఫికెట్స్ చూసాక, పవన్ చదువు మీద నమ్మకం కుదిరింది ఆనందరావు కి. వాళ్ళ అమ్మానాన్నలతో కూడా మాట్లాడాక, వాళ్ళకి ఇష్టమేనని తెలిసి సంతోషించాడు ఆనందరావు. పవన్ కి అభ్యంతరం చెప్పడానికి, రంగు తప్ప ఇంకేమి కారణాలు లేనందున, వాళ్ళ ఇద్దరి పెళ్ళికి ఒప్పుకున్నాడు.
"మరి, నీ పెళ్ళి ఎప్పుడు? నువ్వూ కూడా ఎవరినైనా చూసుకున్నావా? చెప్పు. నీ పెళ్ళి కూడా చేయించేద్దాం" అని జాగృతి తో అన్నాడు ఆనందరావు.
"నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు బాబాయ్. పెళ్లంటే భయం" అంది జాగృతి.
"అలాగే అంటావ్. జరిగే సమయం వస్తే, ఎవరు వద్దన్నా ఆగదు" అన్నాడు నవ్వుతూ. జాగృతి వివరాల్ని, సమర్థ్ వాళ్ళకి పంపిన విషయాన్ని చెప్పలేదు ఆనందరావు.
జాగృతి ఫోటో చూసిన రాధ, "పిల్ల తెల్లగా ఉంది. కానీ, 40 ఏళ్ళు దానిలా ఉంది. ఏ స్టైల్ లేదు. వద్దని చెప్పేస్తాను" అంది సమర్థ్ తో.
"అందరు పెళ్లికూతుర్ల ఫొటోలలాగా లేదు ఈ అమ్మాయి ఫోటో. పెళ్ళి అంటే ఇష్టం లేకుండా, బలవంతంగా తీయించుకున్నట్టు ఉంది. అందుకే, నీకలా అనిపించింది ఏమో అమ్మా. 40 ఏళ్ళు దాటినదానిలా ఏమిలేదు. సింపుల్గా ఉంది. అయినా, వెళ్లి చూస్తే తెలుస్తుందిగా ఎలా ఉంటుందో" అన్నాడు సమర్థ్.
సమర్థ్ కి, అమ్మాయిని నచ్చిందన్న విషయం అర్ధం అయ్యి, పెళ్లిచూపులు పెట్టించమని జాగృతి వాళ్ళకి కబురుచేసింది రాధ.
పెళ్ళి చూపులలో, జాగృతిని చూసిన సమర్థ్, "ఫోటో లో పెద్దదానిలా కనపడింది అన్నావు కానీ, డైరెక్టుగా చూస్తే 20 ఏళ్లలోపు పిల్లలా ఉంది. అవునా? నాకు అమ్మాయి నచ్చింది" అని చెప్పాడు రాధ తో.
అందంగా, స్టైల్ గా ఉండే అమ్మాయి కోడలిగా రావాలి అనుకుంది కానీ, ఇంత సింపుల్గా ఉండే అమ్మాయి, సమర్థ్ కి నచ్చుతుంది అనుకోలేదు రాధ.
చంద్రిక, పవన్ ప్రేమించి, పెళ్లిచేసుకున్నారు. ఆనందరావు కి, పవన్ నచ్చకపోయినా పవన్, చంద్రిక ల పెళ్ళి జరిగిపోయింది.
జాగృతిని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు సమర్థ్. రాధకి, జాగృతి నచ్చకపోయినా, సమర్థ్, జాగృతి ల పెళ్ళి జరిగిపోయింది. జాగృతి ఇష్టా, అయిష్టాలని ఎవ్వరూ పట్టించుకోలేదు.
సమర్థ్, జాగృతిల పెళ్ళిలో, సమర్థ్ ని చూసిన ఆనందరావు, 'నల్లగా, పళ్ళ మధ్యలో గ్యాప్ తో, పొట్టతో ఉన్న ఈ అబ్బాయికంటే, నా అల్లుడే బాగున్నాడు' అని తృప్తిపడ్డాడు.
చంద్రిక పెళ్ళి ఫోటోలని చూసిన రాధ, "ఈ అమ్మాయి నల్లగా ఉందని వద్దనుకున్నాం మేము. అంతకంటే నల్లగా ఉన్న అల్లుడు వచ్చాడు మీ బాబాయికి. ప్రేమ పెళ్ళి అంట కదా. మరి, మా సంబంధం ఎందుకు కావాల్సి వచ్చిందో వాళ్ళకి?" అంది.
సమర్థ్ వాళ్ళ సంబంధం, ముందు చంద్రిక కి వచ్చిందని, చంద్రిక నల్లగా ఉందన్న కారణం చెప్పి, వాళ్ళు తనని చూసారన్న విషయం తెలిసి ఆశ్చర్యపోయింది జాగృతి.
'గురివిందగింజ, తనకున్న నలుపుని ఎరుగక, తాను చాలా అందంగా ఉన్నాననుకున్నట్టు, మనషులు కూడా తమలోనున్న లోపాలనెరుగక, పక్కవాళ్ళలో తప్పులు ఎంచుతూ బతికేస్తారు. ' అనుకుంది జాగృతి.
***
అత్తగారి కథలు - పార్ట్ 4 త్వరలో
L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : LV జయ
నా పేరు LV జయ.
https://www.manatelugukathalu.com/profile/jaya
నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం.
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
ధన్యవాదాలు
Comments