top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

పెళ్లిచూపులు

#JeediguntaSrinivasaRao, #జీడిగుంటశ్రీనివాసరావు, #Pellichupulu, #పెళ్లిచూపులు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు



'Pellichupulu' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 21/10/2024

'పెళ్లిచూపులుతెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“యిదిగో! ఈ రోజు సాయంత్రం ఆడపిల్ల వాళ్ళు మన అబ్బాయిని చూసుకోవడానికి వస్తారుట, యిల్లు చూసి ఇల్లాలిని చూడాలి అంటారు, యిల్లు నీటుగా వుంచు” అన్నాడు భార్య సుగుణ తో రమేష్.


“విచిత్రం కాకపోతే మొగపిల్ల వాళ్ళు కదా పెళ్లిచూపులకి వెళ్ళాలి ముందుగా వాళ్ళు వచ్చి మన అబ్బాయి ని చూడటం ఏమిటండి” అంది సుగుణ. 


“రోజులు మారిపోయాయి, ఆడపిల్ల తల్లిదండ్రులకి మనం నచ్చాలి, మన అబ్బాయి నచ్చాలి, మనం పెట్టే స్నాక్స్ నచ్చాలి, నా పెళ్లి చూపులకి మీ నాన్న పెట్టిన వేరుశనగ పప్పు ఉండలు పెడితే మొహం మీద ఉమ్మేసి పోతారు, యిప్పుడు జీడిపప్పు పాకం పెట్టాలిసిందే” అన్నాడు రమేష్.


“అప్పుడు మా నాన్నకి అనుమానం వచ్చింది మీ పళ్ళు గట్టిగా వున్నాయో లేదో అని, అందుకే వేరుశనగ పప్పు ఉండలు పెట్టారు, అవి మాత్రం మిగిల్చారా, అన్ని తినేశారుగా, నన్ను చూడకుండా” అంది సుగుణ. 


“అందుకేగా యిప్పుడు బాధ పడుతున్నాను” అన్నాడు నవ్వుతూ రమేష్. 

“అమ్మా! మీ యిద్దరూ యిలా తగాదా పడుతోవుంటే యిహ నా పెళ్లి అయినట్టే, ఇప్పటికే ముప్పై వచ్చేసాయి, నాన్న కి కట్నం యిచ్చే వాళ్ళు కావాలి, నీకు అత్తగారి లంచాలు యిచ్చే వాళ్ళు కావాలి” అన్నాడు కాబోయే పెళ్ళికొడుకు శ్రీను.


“ఒరేయ్! ఆ జులపాల జుట్టు కత్తిరించుకుని చక్కగా క్రాఫ్ చేయించుకుని రా, సినిమాలు చూసి చెడిపోయావు, యిలా వుంటే ఏ ఆడపిల్లా నిన్ను పెళ్లి చేసుకోదు” అన్నాడు రమేష్. 


అక్కడే యిల్లు తుడుస్తున్న పనిమనిషి మల్లమ్మ కిసుక్కున నవ్వింది.


“యిదిగో! అలా బజారు వెళ్ళి సాయంత్రం వాళ్ళకి పెట్టడానికి స్నాక్స్, స్వీట్స్ తీసుకుని వస్తాను, నువ్వు ఆ పట్టు చీర కట్టుకో బాగుంటుంది” అన్నాడు రమేష్. 


“ఏ పట్టు చీర..? మీరు నా పెళ్ళికి పెట్టిన పట్టుచీర ఒక్కటే ఎన్నిసార్లు కట్టుకోవాలి, ఆ తరువాత ఒక్క చీర కొన్నారా మీ చేత్తో” అంది సుగుణ. 


“ప్రతీ నెల నీ జీతం తో ఒక చీర కొనుకుంటున్నావుగా, మళ్ళీ నేను కూడా ఎందుకు అని కొనడం లేదు అంతే” అంటూ బజారుకి బయలుదేరాడు రమేష్. “అయినా పట్టుచీర కి పట్టింపు లేదు ఎన్నిసార్లు అయినా కట్టుకోవచ్చు” అన్నాడు.


లంచ్ చేసిన తరువాత ఒక కునుకు తీయ్యడం అలవాటు భార్యభర్తలకి. అలా నిద్రపోయిన వాళ్ళ కి సాయంత్రం నాలుగు గంటలకు ఎవ్వరో తలుపులు బాదుతూవుంటే మెలుకువ వచ్చి అలాగే వెళ్ళి తలుపు తీసాడు రమేష్. 


ఎదురుగా ఒక మూడు జంటలు నుంచుని అనుమానంగా రమేష్ వంక చూసి “ఇది రిటైర్డ్ టీచర్ రమేష్ గారి ఇల్లేనా” అన్నారు. 


“అవునండీ! మీరు ఆడ పెళ్లివాళ్ళా, రండి” అంటూ అడ్డం తొలిగాడు.


“అలా కూర్చోండి, ఎండ తగ్గిన తరువాత వస్తారు అనుకున్నాను, కొద్దిగా కునుకు తీసాను, బట్టలు మార్చుకుని వస్తాను” అన్నాడు రమేష్. 


ఈలోపున సుగుణ వచ్చిన వాళ్ళు పెళ్లి వాళ్లే అనుకుని రెడీ అయ్యి వచ్చి, ఫ్రీజ్ తెరిచి చల్లటి నీరు తాగడానికి యిచ్చింది.


“డబల్ డోర్ ఫ్రీజ్ లేదా మీకు?” అంది, వచ్చిన వాళ్లలో ఒకావిడ. 


“మాకు కూల్ వాటర్ పడదు. అందుకే చిన్న ఫ్రీజ్ కొనుకున్నాము” అంది సుగుణ. 


“ఏమో! మా ఫ్రీడ్జ్ చూసిన తరువాత, ఈ ఫ్రీడ్జ్ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా వుంది” అంది ఆవిడ వూరుకోక.


సుగుణ కి ఒళ్ళుమండి, “యింతకీ పెళ్లికూతురు మీ అమ్మాయా” అంది. 


“లేదు. వీళ్ళ అమ్మాయి. మా అమ్మాయి పెళ్లి అయిపొయింది, మా అల్లుడు సినిమా యాక్టర్” అంది ఆ వచ్చిన ఆవిడ. 


“సినిమా యాక్టర్ అంటున్నారు, పేరు కూడా చెప్పేయ్యండి” అంది సుగుణ.


పేరు విన్న సుగుణ తెల్లబోతో, “అదేమిటి.. అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి అంటారు..” అంది. 


దానితో మొహం మాడిన ఆవిడ “మా అమ్మాయి పెళ్లి విషయం ఎందుకు యిప్పుడు, ఎండన పడి వచ్చాము, మీరు యిక్కడే కూర్చొని వున్నారు, ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అన్నట్లు మీ వారు యింత వరకు గదిలోనుంచి రాలేదు. కొద్దిగా టీ నీళ్లు అయినా పోస్తారా” అంది అక్కసుగా.


ఇంతలో ఫ్రెష్ అప్ అయి వచ్చిన రమేష్ కూర్చొని, “ముందు మిమ్మల్ని పరిచయం చేసుకుని తరువాత మీ అమ్మాయి విషయం చెప్పండి” అన్నాడు. 


సుగుణ ప్లేట్స్ నిండా జీడిపప్పు మిఠాయి, సమోసాలు పెట్టి తీసుకొని వచ్చి అందరికి తలో ప్లేట్ యిచ్చింది. జీడిపప్పు మిఠాయి ముక్క విరిచి నోట్లో వేసుకుంటో “మీ అబ్బాయిని కూడా పిలవండి” అన్నాడు పెళ్లికూతురు తండ్రి.


“మనం మాట్లాడుకునే అప్పుడు మా అబ్బాయి ఉండటం ఎందుకండి, యింతకీ మా సంబంధం గురించి మీకు ఎవ్వరు చెప్పారు.. మొదలగు వివరాలు చెప్పండి” అన్నాడు రమేష్, మనసులో వీళ్ళని చూస్తోవుంటే పెద్దగా కట్నం యిచ్చేడట్లు కనిపించడం లేదు అనుకుంటూ.


“మా అమ్మాయి పేరు వసుంధర. గవర్నమెంట్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్. మీ అబ్బాయి కూడా టీచర్ అని తెలిసి వచ్చాము” అంది పెళ్ళికూతురు తల్లి.   తండ్రి అంతేగా అంతేగా టైపు అనుకుంటా, దేనికైనా భార్య వంక చూస్తాడు.


“మా అబ్బాయి తెలుగు టీచర్, అదికాక ప్రైవేట్ స్కూల్ లో, మరి మీకు పరవాలేదా?” అన్నాడు రమేష్. 


“అందుకేగా వచ్చాము, మాకు పరవాలేదు. మీ అబ్బాయి ఫోటో యిస్తే మా అమ్మాయికి పంపుతాను. అది చూసి ఓకే అంటే మనం మిగిలినవి మాట్లాడుకోవచ్చు” అంది. 


“మీ అమ్మాయి ఫోటో చూపించండి, ఈలోపున మా అబ్బాయి వస్తాడు మీరు చూద్దురు గాని” అన్న రమేష్ తో, “ఏమిటో మీరు యింకా పాతకాలం లో వున్నారు, ముందు అబ్బాయి అమ్మాయి కి నచ్చితేనే అమ్మాయి ఫోటో యిస్తాము” అంది పెళ్లికూతురి తల్లి.


ఇంతలో టీ కప్పులతో వచ్చిన ఒక 22 సంవత్సరాల అమ్మాయి అక్కడ టేబుల్ మీద కప్పులు పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మాయి ని చూసి పెళ్లికూతురు తల్లి, “మీ అమ్మాయా?” అని రమేష్ ని అడిగింది. 


“అబ్బే లేదండి.. నాకు ఆడపిల్లలు లేరు, ఆ అమ్మాయి మా పనిమనిషి కూతురు” అన్నాడు రమేష్.


ఇంతలో పెళ్ళికొడుకు శ్రీను రావడం అతని ఫోటో నచ్చింది అని మెసేజ్ రావడం జరిగిపోయాయి. 


“అంతా సవ్యంగా జరుగుతోంది, మరి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. మా వంశం లో కట్నకానుకలు ఇవ్వడం అలవాటు లేదు. పెళ్లి బాగా చేస్తాము. యిప్పుడు మేము యిచ్చే డబ్బు కంటే మా అమ్మాయి సంపాదన అంతా మీదేగా” అంది నవ్వుతూ పెళ్లికూతురు తల్లి. 


ఆ నవ్వు చూసి రమేష్ “మీకు అలవాటు లేకపోయినా, మగపిల్లాడి పెళ్ళికి మేము ఎదురు ఖర్చు పెట్టలేము. మొన్న ఒక సంబంధం వాళ్ళు అయిదు లక్షలు యిస్తామన్నారు, ఈలోపు మీ సంబంధం రావడం తో ఆగాము” అన్నాడు.


“అయితే ఆ సంబంధం ఖాయం చేసుకోండి, మేము డబ్బు ఇవ్వలేక కాదు, ఎందుకు యివ్వాలి అని మా పట్టింపు” అంటూ లేచింది పెళ్లికూతురు తల్లి. 


ఆవిడ తో పాటు వచ్చిన ఆవిడ మూతి విరుస్తో, “అయిదు లక్షలు కావలి అంటే మీ అబ్బాయి కి పెళ్లి అయినట్టే” అంది. 


ఆ మాట విన్న శ్రీను తల కొట్టుకుంటో లోపల గదిలోకి వెళ్ళిపోయాడు.


“యింకా చూస్తావు ఎందుకు? ఆ జీడిపప్పు పాకం లోపల పడేసి, వాడికి కొద్దిగా కాఫీ యివ్వు, కట్నం లేకుండా ఎదురు డబ్బులు పెట్టి పెళ్లి చెయ్యాలి అంటే మాటలా” అన్నాడు రమేష్. 


“మీ కట్నం పాడు కాను,, అడిగినా అయిదు లక్షలు అడుగుతారా, రెండు వైపులా ఖర్చులు పెట్టుకోమని అడిగితే సరిపోయేది. చక్కని ఉద్యోగం, ఎంత కాదన్నా అరవై వేలు సంపాదించే పిల్ల, మీ మొండి పట్టు తనం తో యిప్పటికి పది సంబంధాలు పోయాయి” అంది సుగుణ.


“పెళ్లి ఖర్చులకి మీ నాన్న మనకి యిస్తాను అన్న పొలం అమ్మి డబ్బు పంపమను, కట్నం లేకుండా ఎదురు ఖర్చులు పెట్టి మరీ పెళ్లిచేస్తా” అన్నాడు కోపంగా రమేష్. 


“సిగ్గులేకపోతే సరి, మీ పెళ్లి ఖర్చులు మా నాన్న మీదకి తోసారు, మీ అబ్బాయి పెళ్లి ఖర్చులు కూడా మా నాన్న మీదకి నెట్టు్దామని ఎలా అనుకుంటున్నారు?” అంది సుగుణ.


“నా పెళ్లి కోసం మీరు కొట్టుకోవద్దు, మీకు కాణి ఖర్చు కాకుండా నేను చూసుకుంటా” అంటూ బయటకు వెళ్ళిపోయాడు శ్రీను. రాత్రి పది దాటినా కొడుకు ఇంటికి రాకపోవడం తో, “వీడు ఏ సినిమాకో వెళ్ళివుంటాడు, నేను పడుకుంటాను, నువ్వు వాడు వస్తే తలుపు తెరువు” అన్నాడు రమేష్.


సుగుణకి కూడా నిద్ర వచ్చి పడుకుంది, కొడుకు వచ్చినప్పుడు లేవచ్చులే అని. రోజు వారి లేచినట్లే లేచిన సుగుణ, ఇదేమిటి కొడుకు ఇంటికి రాకుండా ఎక్కడకి వెళ్ళాడు అనుకుంటూ వీధి తలుపు తీసి, వంటగదిలోకి వెళ్ళి కాఫీ కి డికాషన్ తయారు చేస్తోవుండగా బయట కొడుకు మాట వినిపించి హాలు లోకి వచ్చింది.


కొడుకు, కొడుకు తో పాటు పనిమనిషి కూతురు వేణి పూలదండలు వేసుకుని కనిపించారు. తెల్లబోయిన సుగుణ ఇదేమిటిరా అని అరిచింది. భార్య అరుపులు కి కంగారు పడి లేచిన రమేష్ పడక గది నుంచి బయటకు వచ్చి కొడుకు ని ఆ స్థితి లో చూసి “ఏమిటిరా ఈ పని?” అన్నాడు.


“నాన్నా! మీరు ప్రశాంతం గా వినండి. నాలుగు సంవత్సరాలనుండి నాకు వచ్చిన ప్రతీ సంబంధం కట్నకానుకులు నచ్చక ఒప్పుకోవడం లేదు. యింకా ఈ రోజులలో కట్నం యిచ్చి పెళ్లి చేసుకునే ఆడపిల్లలు ఎక్కడ వున్నారు నాన్నా.. అందులోనూ నేను చేసే టీచర్ ఉద్యోగం కి పెద్ద సంబంధాలు ఎక్కడ వస్తాయి? పేరు కి పనిమనిషి కూతురు అనే కానీ వేణి డిగ్రీ పాస్ అయ్యింది, అందం కి తక్కువ లేదు, నాకు కులం గోత్రం మీద పట్టింపు లేదు. మన వాళ్లలో సంబంధం దొరికితే సరే, దొరకనప్పుడు నాకు నచ్చిన అమ్మాయి ఏ కులం అయితే ఏమిటి?” అన్నాడు.


“నోర్ముయ్, నువ్వు చేసుకున్న ఈ అమ్మాయి మన యింట్లో గిన్నెలు తోమి, యిల్లు ఊడ్చేది తెలుసా, అటువంటి పిల్లని కోడలుగా తెస్తావా” అంది సుగుణ కోపంతో.


“అమ్మా! పని వాళ్ళు రానప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేదానివి కదా, అప్పుడు నీ గౌరవం తగ్గిపోయిందా? చేసే పని గురించి కాదు అమ్మా, మనిషి గుణం చూడాలి. తనని రెండు సంవత్సరాలనుండి చూస్తున్నాను, ఎప్పుడు కూడా తన పరిధి దాటి ప్రవర్తించలేదు. నేను ఉదయం గుళ్లో పెళ్లి చేసుకున్నాను. మీకు తను యిక్కడ ఉండటం యిష్టం లేకపోతే మేము వేరే వెళ్ళిపోతాము” అన్నాడు శ్రీను.


పనిమనిషి మల్లమ్మ, ఆమె భర్త కిష్టయ్య లోపలికి భయపడుతూ వచ్చి, రమేష్, సుగుణ కాళ్ళ మీద పడి, “మమ్మల్ని క్షమించండి అమ్మా, మాకు కూడా ఈ విషయం తెలియదు, తెలిసిన తరువాత బాబు కి ఎంతో చెప్పి చూసాము. మా అమ్మాయి కూడా ఎవ్వరింటికి పనికి వెళ్ళేది కాదు, మీ ఇంటికి అంటే వచ్చేసేది. మీరే పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని క్షమించండి” అన్నారు.


“లే మల్లమ్మా, దీనికంతటికి మీ అయ్యగారే కారణం, వచ్చిన సంబంధం అల్లా కట్నం కోసం చెడగొట్టేవాళ్ళు, యిప్పుడు అనుకుని చేసేది ఏముంది. మనం అందరం మనుషులమె, అయితే నాది ఒక కోరిక, నువ్వు మా ఏరియాలో ఎక్కడ పనిమనిషి గా చెయ్యకు, మీ ఆయన కి ఎక్కడైనా వాచ్మాన్ ఉద్యోగం చూస్తాం” అంది సుగుణ.


“వద్దమ్మా, యీ పిల్ల ఒక్కత్తె మాకు, దేముడు తీసుకుని వచ్చి మీకు అప్పచెప్పాడు, మాకు ఊళ్ళో మూడు ఎకరాల భూమి వుంది, మేము ఊరు వెళ్ళిపోతాము” అంది మల్లమ్మ కళ్ళు తుడుచుకుంటూ.


“యింకా చూస్తావే, కోడలిని లోపలికి తీసుకుని వెళ్ళు, కులం లో ఏముంది గుణం ముఖ్యం, అంతగా ఎవ్వరైనా ఏమైనా అనుకుంటారు అంటే మనమే వేరే కాలని కి వెళ్ళిపోదాం” అన్నాడు రమేష్.


 శుభం 


***

జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













55 views0 comments

Comments


bottom of page