పెళ్ళిరోజు
- Pandranki Subramani
- Mar 29
- 5 min read
#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #పెళ్ళిరోజు, #Pelliroju, #TeluguStories, #తెలుగుకథలు, #TeluguHeartTouchingStories

Pelliroju - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 29/03/2025
పెళ్ళిరోజు - తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
అది మంగళవారం. భానుప్రసాద్ పెళ్ళిరోజు. ఎనిమిదేళ్ళ క్రితం సౌమ్యను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఎక్కడున్నా యేమి చేస్తున్నా, యింట ఉన్నా బైట ఉన్నా భానుప్రసాద్ పెళ్ళిరోజుని మాత్రం మరువడు. తెలుగు వారింట వయసుతో నిమిత్తం లేకుండా వివాహ వార్షికోత్సవం వచ్చిందంటే యవ్వన ప్రాయ సంబరమే కదా! మృదు మధురమైన మనోద్దీపన రథోత్సవమే కదా! పలవరింపుల పండగరోజు కూడా అదే కదా! మాంగల్య ధారణ జరిగిన రోజుని గుర్తుకి తెస్తుంది కూడా అదే రోజు కదా---
“మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా”అని మనసున మననం చేసుకుంటూ— పచ పచ్చటి వెచ్చ వెచ్చటి యవ్వనకాలపు పరిమళాలను గుండెల నిండా నింపుకుంటూ-- ఇక ముందుకు సాగితే-- ఎటువంటి పరిస్థితిలోనైనా ఆరోజు మాత్రం భానుప్రసాద్ భార్య చెంతన ఉండవలసిందే! అందుకేగా దంపతులిద్దరూ ఆరోజు కోసం మధురోహలలో తేలుతూ కళ్ళలో ఒత్తులు పెట్టుకుని యెదురు చూస్తారు! ఆ రోజువస్తే చాలు ఇద్దరూ తమకు తాము నవోత్సాహంతో ఓలలాడుతూ ప్రేయసి ప్రియులుగా మారిపోతారు. యవ్వన కాల ప్రాంగణాన రసోద్దీపన పొందుతూ వెన్నెల స్నానం చేస్తారు.
ఈసారి మాత్రం భాను ప్రసాద్ ఇంట్లో లేడు. పొరుగూరు క్యాంపులో అధికార పూర్వక డ్యూటీలో ఉన్నాడు. ఎట్టకేలకు సమయం చూసి ఆడిట్ ఆఫీసరు వద్ద స్పెషల్ లీవు తీసుకోగలిగాడు. అప్పుడు ఆడిట్ ఆఫీసరు యథాలాపంగా అన్నాడు- “భార్యాబిడ్డల వద్దకు వెళ్తున్నందుకు శుభాకాంక్షలు. కాని ఇప్పుడక్కడంతా వర్షం కుండపోతగా పడే సూచనలు ఉన్నట్టు విన్నాను. మనూరి వర్షాల గురించి మీకు బాగానే తెలుసు కదా! అనుకున్న టైముకి యెప్పుడూ చేరుకోని రైలుబండిలా వర్షాలు వస్తాయి. పైనుంచి ఎవరో సైగ చేసినట్టు చప్పున ఆగిపోతాయి. అంచేత పకడ్బందీగా గొడుగు గట్రా పట్టుకుని మరీ వెళ్లు యెందుకైనా మంచిది. ఏ కారణం చేతా ఆఫీసు ఫైల్స్ గాని మాన్యునల్స్ గాని పట్టుకెళ్ళకు”
భాను ప్రసాద్ ఆమాటకు చిన్నగ నవ్వాడు. నవ్వుతూ ఆడిట్ ఆఫీసర్ తో చేతులు కలిపాడు. చిరునవ్వు చిందిస్తూ కదిలాడు, అసలతను ఆడిట్ ఆఫీసరు చెప్పిన హితోపదేశం విన్నాడా! వినే మూడ్ లో ఉన్నాడా! ఊఁ హుఁ! ఆఫీసరుగారికి అలా అనిపించ లేదు. అతడి కళ్ళకు అంతరిక్షాన తేలుతూన్న వ్యోమగామిలా కనిపించాడు భాను ప్రసాద్. ఉన్నపాటున అతనికి ప్రాత తెలుగు పాట గుర్తుకొచ్చింది- “పందిట్లో పెళ్ళవుతున్నదీ కనువిందవుతున్నదీ! “ఎంతటి ప్రాత పాట! ఇప్పటికీ మధురంగానే ఉంటుంది. మనోల్లాసం కలిగిస్తుంటుంది.
స్టేషన్ చేరుకున్న వెంటనే అతడు చేసిన మొదటి పని- తాజా మల్లెపూలు మూడు మూరలు, దోసెడు సంపెంగ పువ్వులు కొని అరిటాకులో ప్యాక్ చేసుకోవడం. రెండవది-- భార్యకు యిష్టమైన మైసూర్ హల్వా అరకిలో, కారప్పూస అరకిలో కొని ట్రావల్ బ్యాగులో పదిలంగా పెట్టుకోవడం, అలా ట్రైనులో కూర్చున్న కొద్ది సేపటికి మరొక మారు బ్యాగులోకి చూపు నిలిపి తడిమి చూసుకున్నాడు; సౌమ్య కోసం కొన్న కొత్త చీర భద్రంగా ఉందోలేదోనని.
అతడా ఆరాటంలో చూడనిది గమనించనిది ఒక్కటే— అతడు ట్రైనులో కూర్చుని మరు మల్లెల గురించి, మరువం రెమ్మల గుభాళింపుల గురించి, పారిజాతాల తీయటి సువాసనల గురించి ఊహాగానం చేస్తున్నప్పుడే బైట వర్షం కురవ నారంభించిందన్నది--
స్టేషన్ లో దిగి ట్రావలింగ్ బ్యాగుతో ఆటోరిక్షాలో కూర్చున్న మరికొద్దిసేపటికి ఆదిలో హంసపాదులా మొదటి ప్రతి బంధకం యెదురైంది, ఆటోరిక్షావాడి అదలింపు ద్యారా-
“ఇకపైన ఆటో వెళ్ళదు సార్! అదిగో అటు చూడండి. మోకాళ్లకు మించి పోయేంత లోతున నీళ్లు”
భానుప్రసాద్ నిజంగానే ఉలిక్కిపడ్డాడు. అంతలోనే ఇంతటి భారీ వర్షం కురిసి వెలసిందా! ట్రావిలింగ్ బ్యాగు అందుకుని ఆటో గిరాకీ చెల్లించి పైకి చూసాడు. ఆకాశం చేయవలసిందంతా చేసేసి అమాయకంగా బిత్తర చూపులు చూసే కుర్రకుంకలా చూస్తూంది.
అతడలా నీళ్ళలో దిగి రెండడుగులు వేసాడో లేదో వర్షం భారీ క్రేను శబ్దంతో లంకించుకుంది. అతడు వెరవలేదు. భార్యను కొడుకునీ చూడాలన్న ధ్యాసతో నీళ్ళలో కదలుతూ కురుస్తూన్న వానలో తడుస్తూ ఇల్లు చేరాడు. భర్తను చూసి సౌమ్య కెవ్వున అరచినంత పని చేసింది- “అయ్యోరామ! ఈ కుండపోత వానలో యెందుకండీ అంత లావు రిస్క్ తీసుకుని వచ్చారు? ఇక్కడ భారీ వర్షంతో బాటు పిడుగులు నలువైపులా పడుతూనే ఉన్నాయి తెలుసా! మన పక్కింటి వాళ్ళ పాడి ఆవు పిడుగుపాటుకి కాలిపోయింది” భర్తను పెన వేసుకుంటూ లోపలకు తీసుకు వెళ్ళిందామె.
అతడు లోపలకు నడుస్తూనే కొడుకు నెత్తిపైన చేయి వేసి నిమురుతూ అడిగాడు- “స్కూలు యెలాగుందిరా! పిల్లకాయలు ఫ్రెండ్లీగా మూవ్ చేస్తున్నారా?”
వాసు బదులివ్వకుండా దూరంగా జరిగి నిల్చున్నాడు. అప్పడతను భార్యవేపు తిరిగాడు- “వాసుకి సుస్తీ చేసిందా! అదోలా కనిపిస్తున్నాడే”
“అబ్బే! అదేం లేదండి. రోజంతా తేమగాలి వీస్తూనే ఉంది కదా! మందకొడితనం కావచ్చు- ఇప్పుడిప్పుడే హార్లిక్స్ కలిపిచ్చాను”
భానుప్రసాద్ నవ్వుతూ కొడుకుని దగ్గరకు పిలిచాడు-
“పలకరించడానికి ఫ్రెండ్సు లేక డల్ గా బోరుగా ఉందా? ”
వాడు తల అడ్డంగా ఆడించాడు.
మరి- అన్నట్టు కొడుకు కళ్ళల్లోకి చూసాడతను.
ఎట్టకేలకు నోరు తెరిచాడు వాసు- “వేణు ఇల్లు పాతది. మునిగిపోతుంది”
సౌమ్య వెంటనే కలుగచేసుకుంది- “అదేం లేదండి. చూడటానికి పాత కట్టడంలా కనిపించినా గట్టి కట్టడమే! వీడు ఫ్రెండు కోసం తెగ ఫీలయిపోతున్నాడు”
భానుప్రసాద్ కాసేపాగి అన్యమనస్కంగా అన్నాడు- “వాళ్ళ యిల్లు లోతట్టు ప్రాంతంలో ఉందికదూ! ఒకసారి ఎందుకో వాళ్ళింటికి వెళ్ళినట్టు గుర్తు. వాళ్ళనాన్న యింట్లో ఉన్నాడు కదూ!”
సౌమ్య కాసేపు మౌనం వహించి బదులిచ్చింది- “లేనట్లున్నాడు. ఏదో ట్రైనింగ్ ప్రోగ్రాముకని యెక్కడికో వెళ్ళినట్టున్నా డు. మరేం కాదు. ఈలోపల డిజాస్టర్ రెస్క్యూ టీము వచ్చి చేరుతుంది లెండి”
అతడు తలపంకిస్తూ లేచాడు. వేణు వాళ్ళ తండ్రి అతడికి తెలుసు. జిల్లా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. భార్య, కూతురు, కొడుకుతో బాటు వితంతు అత్తయ్య కూడా అతడితోనే ఉంటూంది. వాళ్ళిల్లు కొత్తదో పాతదో అన్నది వేరే విషయం. కాని అసలు విషయం- ఆ ప్రాంతం లోతట్టు దిగువన ఉన్నదన్నదే..
అంచేత ముంపుకి లోనయే ప్రమాదం లేకపోలేదు. ఇంతకూ ఆ నలుగురూ వరద ముంపులాంటి తేమ వాతావరణంలో భోంచేసారో లేదో కూడా సందేహస్పదమే-- పాలమ్మి కూరగాయలమ్మి అక్కడకు చేరుకోగలిగితేనే కదా వంటా వార్పూ చేసి ఆకలి తీర్చు కోగలగడం— అంతేకాదు- ఎలక్ట్రిసిటీ వాళ్లు ముందు జాగ్రత్తగా కరంట్ కూడా కట్ చేసుంటారు. ఇల్లంతా అంధకార బంధురంగా తయారయి ఉంటుంది.
అప్పుడతనికి చప్పున తన దివంగత తండ్రి అన్న మాటలు మదిన ఢమరుకంలా మ్రోగాయి- “విపత్కర పరిస్థితిలో బంధువులకు గాని మిత్రులకు గాని యిప్పట్లో యేమీ కాదులే- తీరిక చూసుకుని వెళ్ళ వచ్చులే- అన్న నిర్లిప్తభావం పనికి రాదు. కీడెంచి మేలెంచ మన్నారుగా— వాళ్ళను చూసి పలకరించి రావడమే ఉత్తమ మానవ లక్షణం! ”
ఆ మాటల్ని తలచుకుంటూ పరిపరి విధాల ఆలోచించుకుంటా లోపలకు వెళ్ళి షర్టు విప్పి దళసరి గ్లావ్సు వేసుకుని రబ్బరు బూట్సు తొడొక్కుని భుజాన తాడు చుట్ట తగిలించుకుని హాలులోకి వచ్చాడు.
భర్తను ఆ రూపంలో చూసి సౌమ్య కంగారుగా అడిగింది “ఎక్కడికండి?”
బదులిచ్చాడతను- “వేణువాళ్ళుంటూన్న ప్రాంతానికి—”
“అయ్యోరామ! మీరిప్పుడక్కడకు వెళ్లలేరు. అక్కడెక్కడో ఉన్న చెక్ డ్యామ్ షట్టర్సు యెత్తేసినట్టున్నారు. వరద నీరు పొంగుకు వస్తూంది. నా కళ్ళముందే చెక్కపెట్టెలు, చెక్క బీరువాలతో బాటు రెండు కొత్త కార్లు తెప్పల్లా పొర్లుకొచ్చాయి. ఈ సమయంలో పాములూ జెర్రులూ ప్రాకుతుంటాయి.”
ఆ మాటల్ని మెడనున్న మాంగళ్యాన్ని కళ్ళకద్దుకుంటూ అందామె. భానుప్రసాద్ బదు లివ్వలేదు. ఆకాశంలోకి ఓసారి చూసి నీళ్ళలోకి దిగాడు. ఆకాశం అదేమీ పట్టనట్టు తన పని తను చేసుకుపోతూంది అలసట యెరుగని రౌతులా వర్షాన్ని కురిపిస్తూ— ఎక్కడో దూరాన పిడుగులు పడ్డ చప్పుడు-- అతడు ఆగలేదు. దాదాపు నడుం వరకు న్న వరద నీటిని తోసుకుంటూ— “ధైర్యే సాహసే లక్ష్మీ! “ అని మనసున మననం చేసుకుంటూ, తాడు చుట్టను పదిలంగా భుజాన సర్దుకుంటూ--
సౌమ్య గుడ్ల నీరు నింపుకుంటూ కొడుకుని అక్కున చేర్చుకుని- “పార్థా! పార్థా! “అని ధ్యానిస్తూంది.
అతడు కాస్తంత దూరం దూసుకుంటూ వరదనీళ్ళలో నడచిన తరవాత గ్రహించాడు; వర్షం తుఫానుగాలిని తోడుతీసుకుని బీభత్సకరంగానే కురిసిందని. నలువైపులా చెట్లూ మ్రానులూ ఒరిగిపోయున్నాయి. మరికొన్ని చెట్లు రోడ్డుకడ్డంగా పడి ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ యిండ్లనుండి ఊరిజనం బిత్తర చూపులతో కిటికీల గుండా చూస్తూ నిల్చున్నారు. డిజాస్టర్ రెస్క్యూటీము ఈ లోత ట్టు ప్రాంతానికి రావటానికి ఇంకెంత సమయం పడుతుందో!
తడుస్తూనే వరద నీళ్ళకడ్డంగా నడుస్తూనే ఆలోచించ సాగాడు భానుప్రసాద్. తను లోలోన కళ్ళ ముందు కనిపిస్తూన్న బీభత్స వాతావరణానికి చలించిపోతున్నాడు గాని. పూతలు రాలి వరి కంకులు ప్రక్కలకు వ్రాలి రైతులకు ఇంకెంత నష్టం వాటిల్లుందో—
అక్కడక్కడ కరెంటు వైర్లు యమపాశాల్లా తెగి వ్రేలాడుతు న్నాయి. తొడుక్కున్న గ్లావ్సుతో వాటిని తప్పిస్తూ యెట్టకేలకు అతడు వేణు వాళ్ళ యింటి ముందు నిల్చున్నాడు; దమ్ము అందుకోవడానికి ప్రయత్నిస్తూ యెగపీలుస్తూ-- అతడి అలికిడి విని పిల్లలిద్దరూ బారున వాకిలి తలుపు తెరచి “అంకుల్! అంకుల్! ”అని అరవసాగారు. అతడు ధైర్యంగా ఉండమన్నట్టు పిల్లల వేపూ స్త్రీల వేపూ చేతులతో సంజ్ఞ చేస్తూ అక్కడ చుట్టు ప్రక్కల తేలుతూన్న కలప ముక్కల్ని దుంగలుగా చేర్చి తెచ్చుకున్న తాడుతో ఒడుపుగా బిగించి దానిని తెప్పలా అమర్చ నారంభించాడు.
వంశానుగతంగా అతడి కుటుంబానికి వడ్రంగనం వృత్తి నేపథ్యం. అదెప్పుడో చిన్నప్పుడు తండ్రి వద్ద నేర్చుకున్న వడ్రంగనం యిప్పుడు సమయానికి ఆదుకోబోతుంది. కలప చెక్కలతో అలా అమర్చిన తెప్పపైకి నలుగుర్నీ యెక్కించకుని మిగిలిన తాడుతో దానిని బిగించి నీళ్లలోకి లాగాడు. అలా తెప్పను లాగుతూ శరీరానికి అంటుకుని పీలుస్తూన్న జలగల్ని ఒక చేత్తో కసుక్కున తీసి పారేస్తూ ఉన్నపళంగా వెనక్కి తిరిగి చూసాడు. గుండెలు అదరిపోయాయి. అంతకు ముందు గట్టిదను కున్న వేణు వాళ్ళ పెంకుటిల్లు నీటి మడుగులోకి ఒరిగి పోతూంది.
తాడుతో లాగుతూ వరద నీటిలో తేలుతూ తెప్పను యింటి ముందు నిలిపి నలుగుర్నీ ఒకరు తరవాత ఒకరుగా మోసుకుంటూ యింట్లోపలకు తీసుకువెళ్లాడు భానుప్రసాద్. చేతులెత్తి నమస్కరించబోయిన ఆడాళ్ళిద్దర్నీ వారించి“అదంతా తరవాత! ” అంటూ సౌమ్యకు కళ్ళతో సంకేతమిచ్చాడు.
ఆమె వాసుతో బాటు లోపలకు వెళ్ళి పొడి బట్టలు తెచ్చిచ్చింది. వాసు గబగబా ఫ్లాస్కునుండి వేడి కాఫీ కప్పుల్లో పోసి తన క్లాసుమేట్ వేణుకి వాడి చెల్లికీ అమ్మకూ అవ్వకూ యిచ్చాడు. వేణు తడి కళ్ళతో “మెనీ మెనీ థేంక్సురా వాసూ! ” అని దూరాన బిడియపడతూ ఒదిగి నిల్చుని అన్నాడు.
వాసు వెంటనే స్పందించాడు “థేంక్స్ నాకెందుకురా! అంతా మా గ్రేట్ శక్తిమాన్ ఫాదర్ కి చెందుతుందిరా!”
యింటిల్లిపాదీ నవ్వకుండా ఉండలేక పో యారు.
ఆరోజు భానుప్రసాద్ సౌమ్య దంపతులు పెళ్ళిరోజు జరుపుకోలేదు, వాళ్ళలా కళ్యాణోత్సవాన్ని జరుపుకోకుండా ఒకరినుండి ఒకరు దూరంగా యెడంగా ఉండటం అది మొదటిసారేమో!
శుభం
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

Comments