'Pendlichupulu' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 06/02/2024
'పెండ్లి చూపులు' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
ఫోన్ చేయబోయేముందు ఆ తండ్రి తన కూతురును.. "అమ్మా! బాగా ఆలోచించావా!" దీనంగా అడిగాడు.
"యస్.. నాన్నా! ’నేను నీకు తగను’ అన్నమాటతో నాకు వారి గొప్ప వ్యక్తిత్వం గోచరించింది నాన్నా! అందుకే!" నవ్వింది భూదేవి.
***
వీధి వాకిట్లో సీతాపతి ఆత్రంగా నిరీక్షిస్తున్నాడు..
అప్పటికి అరగంటలో మూడుసార్లు వీధిలోకి, ఇంట్లోకి నడిచాడు. కారణం.. పెద్దకూతురు భూదేవికి పెండ్లి చూపులు. అవస్రం తీర్చుకొనేందుకు రెస్ట్ రూముకు వెళ్ళాడు.
వాకిట్లో ఆటో వచ్చి ఆగింది.
ముందుసీట్లో డ్రైవరు ప్రక్కన ఉన్న పెండ్లికొడుకు బాలరాజు తలూపుకుంటూ దిగి.. ప్యాంట్ పాకెట్ నుంచి దువ్వెనను బయటకు తీసి చెరిగిన తలను సరిచేసుకొని రిక్షావాలాకు డబ్బులిచ్చాడు.
ఆ ఇంటి వీధివైపున ఉన్న కిటికీ ద్వారా వాకిటి ముందు దిగిన వారిని పెండ్లి కూతురు భూదేవి.. ఆమె చెల్లి శ్రీదేవి చూచారు.
బాలరాజు తల సింగారాన్ని ఇరువురూ చూచారు.
"చాలు.. చాలు" అంది శ్రీదేవి నవ్వుతూ..
ఆ మాటలు బాలరాజుకు వినిపించాయి. బిత్తరపోయి మూడువైపులా చూచాడు.
రిక్షా వెనుకనుండి బాలరాజు అమ్మ గౌరమ్మ, మేనమామ ముత్యాలరావు వారి సతీమణి చంద్రిక దిగారు.
"ఏయ్!.. నోరు మూయవే!" శ్రీదేవి నోటికి తన చేతిని అడ్డం పెట్టింది భూదేవి.
"ఏమండీ! వాళ్ళు వచ్చారండీ!" భర్తగారికి సిగ్నల్ ఇచ్చింది అర్థాంగి చంగాళమ్మ.
వీధిలోనికి పరుగెత్తాడు సీతాపతి. వారిని చూచి నవ్వుతూ.. "రండి.. రండి" స్వాగతం పలికాడు.
వీరు ముందు.. ఆ వెనకాల ఆ నలుగురూ ఇంటి వరండాలో ప్రవేశించారు.
"కూర్చోండి సార్!" అన్నాడు సీతాపతి.
నలుగురూ కుర్చీలలో కూర్చున్నారు.
సీతాపతి ఇంట్లోకి పరుగెత్తాడు.
ఐదు నిమిషాల్లో తనూ.. భార్య గ్లాసులు జగ్గుతో వరండాలోనికి వచ్చారు.
జగ్గులో వున్నది నిమ్మకాయ మజ్జిగ. అది చైత్రమాసం.. ఎండ తీవ్రత.. దాహ శాంతి కోసం గ్లాసులో మజ్జిగ నింపి నలుగురికీ అందించాడు సీతాపతి.
నలుగురూ వేగంగా త్రాగారు. అడిగి.. రెండో రౌండు గ్లాసుల్లో నింపాడు. ఆనందంగా చప్పరిస్తూ త్రాగారు. జగ్గు ఖాళీ అయింది. ఇంట్లో నిమ్మకాయలు లేవు. వారి వాలకం మరో గ్లాసు వేసేదానికి సిద్ధంగా వున్నట్టు సీతాపతికి అనిపించి.. భార్యను తట్టి ఇరువురూ లోనికి వెళ్ళారు. ఐదు నిమిషాల తర్వాత వచ్చి వారిని లోనికి ఆహ్వానించాడు సీతాపతి.
నలుగురూ లోన ప్రవేశించారు. కుర్చీలలో కూర్చున్నారు. వారి ముందు తుంగచాప.. దానిపైన రంగురంగుల బెడ్ షీట్..
’ఓహో! దీనిపై అమ్మాయిగారు వచ్చి కూర్చుంటారు కాబోలు!’ అనుకొన్నాడు బాలరాజు.
"చంద్రా!" ముత్యాలరావుగారి సంబోధన..
"ఏమండీ!" ఎంతో పతిభక్తితో కూడిన జవాబు.
"వెళ్ళి అమ్మాయిని తీసుకురా!"
"వద్దు.. వద్దు.." చంగాళ్ళమ్మగారి అభ్యంతరం.. వెంటనే నవ్వుతూ..
"మీకెందుకు ఆ శ్రమ? అది నా పాత్ర. అమ్మాయిని నేను తీసుకొని వస్తాను" వేగంగా ఎదుటి గదిలో ప్రవేశించింది.
"మామా!"
"ఏం బాలరాజా!"
దాహం అన్నట్టు సైగచేశాడు చేతితో బాలరాజు..
ప్రక్కన వున్న సీతాపతి పరుగున వంటగదికి వెళ్ళి జగ్గు, గ్లాసుతో వచ్చి.. గ్లాసులో నీరు నింపి బాలరాజుకు అందించాడు.
"సీతాపతీ! మీ నెల్లూరులో ఎండలు జాస్తయ్యా!.. పాపం మా బాలరాజు అల్లాడిపోతున్నాడు" అన్నాడు ముత్యాలరావు.
"అలాగనా సార్!.. మరి మన.. అదే తమరి అల్లూరిలో ఎలా వుంటుంది సార్!" అడిగాడు సీతాపతి.
’అల్లూరు ఏదో మహా ఊరు.. కోడైకెనాల్లా ఫీలవుతున్నారు’ అనుకొన్నాడు.
తల్లి, పెండ్లికూతురు వచ్చారు. ఆ బెడ్‍షీట్‍పై భూదేవి కూర్చుంది.
చంద్రిక కుర్చీ దిగి, అమ్మాయి ప్రక్కన కూర్చుంది.
బాలరాజు భూదేవిని ఆత్రంగా చూస్తున్నాడు.
కిటికీగుండా బాలరాజును చూస్తున్న శ్రీదేవి నవ్వుకొంటోంది..
"ఎంతవరకు చదివావు?" అడిగింది చంద్రిక.
"ఎం.ఎ, బి.ఇడి" భూదేవి జవాబు.
పెండ్లికొడుకు బాలరాజుకు ఆ మాట కరెంట్ షాక్!..
"ఆ.." ఆశ్చర్యపోయింది చంద్రిక.
"అవునండీ!" చిరునవ్వుతో చెప్పింది భూదేవి.
బాలరాజు ఆశ్చర్యంతో ముత్యాలరావు ముఖంలోకి చూచాడు విచారంగా..
"నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి!" మెల్లగా చెప్పింది భూదేవి.
అందరూ ఆశ్చర్యంతో భూదేవి ముఖంలోకి చూచారు.
"గతికితే.. అతకదని మేము టిఫిన్ ఏర్పాట్లు చేయలేదు" మెల్లగా చెప్పాడు సీతాపతి.
భూదేవి తండ్రి ముఖంలోకి చూచింది. లేచి "రండి సార్!" ఎదుటి గదిలోనికి వెళ్ళిపోయింది.
బాలరాజు కళ్ళల్లో నీళ్ళు.. దీనంగా మామ ముఖంలోకి చూచాడు.
"వెళ్ళు.. వెళ్ళి మాట్లాడు" బాలరాజు చేతిని పట్టుకొని లేపాడు ముత్యాలరావు.
బడికి అయిష్టంగా వెళ్ళే పిల్లాడిలా ఆ గదిలోనికి వెళ్ళాడూ బాలరాజు.
భూదేవి తలుపు ప్రక్కన నిలబడి ఉంది. బాలరాజు తలవంచుకొని గదిలో ప్రవేశించాడు. మెల్లగా తల ఎత్తి చూచాడు. భూదేవి కనిపించలేదు.
"కూర్చోండి"
ఆ భూదేవి పలుకుతో బిత్తరపోయి గది నాలుగువైపులా ఆశ్చర్యంతో చూచాడు.
"మీరు ఎంతవరకు చదివారు?" భూదేవి ప్రశ్న.. క్షణం తర్వాత మరలా "కూర్చోండి!" అంది చిరునవ్వుతో భూదేవి.
బాలరాజు ఒంటికి బంక చమటలు పట్టాయి. నిలబడలేక.. కుర్చీలో కూలబడ్డాడు.. తలవంచుకొని.
"నేను ప్లస్ టూ. సెంట్రల్ గవర్నమెంటు జాబ్. మీ అంత చదువు నేను చదువుకోలేదు. నేను మీకు తగను సారీ!" వేగంగా కుర్చీనుండి లేచి, మామ పిలుస్తున్నా ఆగకుండా వీధిలోకి వెళ్ళిపోయాడు.
అతని బృందం వీధిలో ప్రవేశించింది.
"మామయ్యా!.. మోసం చేశావు" అంటూ వేగంగా బస్టాండ్ వైపుకు నడవసాగాడు. ఆ ముగ్గురూ బస్టాండుకు ఆటో ఎక్కారు.
భూదేవి.. తనకు బాలరాజు చెప్పిన మాటలను తల్లిదండ్రులకు చెప్పింది.
మనస్సున అతని గురించి ఆలోచనలు..
వారంరోజుల తర్వాత.. సత్యమూర్తి ముత్యాలరావుకు ఫోన్ చేసి.. "మీ అబ్బాయిని మా అమ్మాయి ఇష్టపడింది. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చితే తెలుపండి. నేను వచ్చి మీతో మాట్లాడుతాను" వినయంగా చెప్పాడు సీతాపతి.
ఆనందపారవశ్యంతో ముత్యాలరావు.. "ఒరే బాలరాజూ!" బిగ్గరగా అరిచాడు.
*
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Yorumlar