'Picchuka Gullu' written by Dasu Radhika
రచన : దాసు రాధిక
సూపర్ మార్కెట్ మీదగా ఇంటికొస్తానని చెప్పి ఆఫీసు నుండి బయల్దేరిన అర గంటకు గౌతమ్ ఫోన్ చేసి స్వాతిని ఇంకో సారి సూపర్ మార్కెట్లో కావాల్సిన వస్తువులేంటో కనుకున్నాడు... ఆ తర్వాత పావు గంటకు స్వాతి కాల్ చేస్తే ఇదిగో వస్తున్నా అన్నాడు, ఇంకో అరగంట గడిచినా రాలేదు... మళ్లీ ఫోన్ చేస్తే ఈ సారి పోలీస్ స్టేషన్లో ఉన్నాను, వచ్చాక చెప్తాను, ఫోన్ పెట్టయ్యమన్నాడు... ఇంకో గంట గడిచింది. మధ్యాహ్నం లంచ్ వేళ దాటిపోయింది... మూడు దాటింది... అత పత లేడు...
స్వాతికి చాలా ఖంగారుగా ఉంది... ఆక్సిడెంట్ జరిగిందా... నిజం చెప్పట్లేదు తనకి... పోలీస్ స్టేషన్ ఎక్కడో ఏమి తెలీదు, ఊరికి కొత్త... అంతా అయోమయముగా ఉంది... ఇరుగు పొరుగు మాట్లాడుకోవడం, పలకరించుకోవటం ఏమి లేదు ఇక్కడ...
ఎవరికీ ఎవరూ తెలీదు... పొద్దున్న లేస్తే ఉరుకులు పరుగులు...
వచ్చి ఆరు నెలలయింది... ఊరంతా ఇలాంటి పిచ్చుక గూళ్ళు...ఆంగ్లము లో వాటినే అపార్టుమెంట్లు అంటాము... ఇళ్లు పడగొట్టి మరీ ఎడా పెడా కట్టేస్తున్నారు అన్నీ చోట్లా... ఇళ్ళెంత చిన్నవో, వాటిల్లో బస చేసే మనుషుల మనసులు కూడా అంతే చిన్నవి...
గంట నాలుగు అయింది... శోష వచ్చింది స్వాతికి. దాన్ని మించిన బాధ... అప్పుడు వచ్చాడు గౌతమ్...
"దెబ్బలు తగిలాయా? ఏమైంది? ఎం చెప్పరు? ఫోన్ లో వివరాలు చెప్తే మీ సొమ్మేoపోయేది?" ఇలా ప్రశ్నలు వేస్తోంది స్వాతి... "ఆకలేస్తోంది, అన్నం పెట్టు స్వాతి" అన్నాడు గౌతమ్... నోట్లో ముద్ద పెట్టుకుంటూ ఉండగానే ఫోన్ మోగింది... ఆఫీసు కాల్స్ మొదలైపోయాయి... మనిషిని అన్నం గూడ తిననివ్వరు అని గొణుక్కుంటూ "ఎందుకు ఎత్తుతారు, ప్రశాంతముగా భోజనం చెయ్యండి, ఆ తర్వాత చూసుకోండి ఫోన్లు, పని" అంది స్వాతి... పట్టిచ్చుకోకుండా ఫోన్ మాట్లాడుతూనే అన్నం తిన్నాడు గౌతమ్... జీవితం దాదాపు ఇలాగే సాగుతోంది ఉద్యోగస్తులందరికి ఈ రోజుల్లో...
హడావిడిగా తిని వెళ్ళిపోయాడు గౌతమ్ తిరిగి ఆఫీసుకు. తిరిగి రావడానికి గౌతమ్కు రాత్రి తొమ్మిదయింది ఆ రోజూ మధ్యాన్నం ఆలస్యం వల్ల... బాల్కనీ కూడా లేకపోయుంటే స్వాతి కి పిచ్చక్కేది ఆ వంటరితనము...
గౌతమ్ పడుకోబోతుంటే స్వాతి మధ్యాహ్నం జరిగిన విషయము కదిలించింది... అప్పుడు చెప్పాడు గౌతమ్ ... సూపర్ మార్కెట్ లో బిల్ కట్టేసి బయటికి వచ్చేసరికి అక్కడ ఒక మహిళ ఖంగారు పడుతూ ఏడుస్తూ ఉంది. ఆమెని అంతకు ముందే లోపల చూసాడు గౌతమ్... ఈ లోపలే ఏమైందనుకున్నాడు... దగ్గరకెళ్లి అడిగాడు... తన కారు అక్కడ ఉండాలి, పార్క్ చేసి లోపలికెళ్లి వచ్చేసరికే లేదు అని భయపడిపోయింది... అక్కడ సెక్యురిటి వాడినడిగతే పోలీసులు తీస్కెళ్ళిపోయారని చెప్పాడు... గౌతమ్ ఆవిడని తీసుకొని పోలీసు స్టేషన్ కెళ్ళి అదే విషయం అడిగాడు... నో పార్కింగ్ లో పెట్టింది, అందుకే తెచ్చామని చెప్పారు పోలీసులు... జరిమానా రెండు వేలయిదువందలు కట్టాలన్నారు... ఆవిడ మొగుడు కు ఫోన్ చేస్తే అతను తీసుకోలేదు కాల్ ఎన్ని సార్లు చేసినా... దాంతో చేసేదేమీ లేక ఆ డబ్బు గౌతమ్ కట్టి, కారు విడిపించి ఆమెకు ధైర్యం చెప్పి పంపిచ్చి ఇంటికొచ్చేసరికి అంత సేపు పట్టింది...
"నాకేం కాలేదు అని మధ్యాహ్నం ఒక్క మాట చెప్తే ఎంత బావుండేది" అన్నది స్వాతి మొగుడ్ని దగ్గరగా హత్తుకొని, "అయినా మీకెందుకీ ప్రజా సేవ? తిన్నగా ఇంటికిరాకుండా? ఆమె ఎక్కడుంటుందో ఎవరో ఏమి తెలీదు... రెండువేలయిదువందలు చిన్న మొత్తమా ఏంటి?" అంటూ స్వాతి గౌతమ్ వంక కోపంగా చూసింది... "ఆమెను చూసినప్పుడు ఆ స్థానంలో నువ్వుంటే అనే ఆలోచన వచ్చింది, అంతే, ఇంకేమి ఆలోచించలేదు స్వాతి" అని లాలనగా పెళ్ళాన్నీ దగ్గరకు తీసుకున్నాడు...
అలా ఊరు చూద్దామా? అని గౌతమ్ స్వాతిని అడుగుతున్నప్పుడు ఫోను మోగింది...కొత్త నెంబరు... హలో, యెస్... అన్నది స్వాతి... "థిస్ ఈజ్ కుక్సన్, కెన్ ఐ టాక్ టు Mr. గౌతమ్?" అవతలి నుండి ఒక స్వరం... ఐ ఆమ్ ఎట్ యువర్ డోర్" అనేసరికి ఖంగారుగా తలుపు తీసింది స్వాతి... ఎదురుగా ఒక ఎంగ్ కపిల్ ... ఆమె గౌతమ్ ను చూసి "హాయ్ Mr. గౌతమ్" అని నవ్వింది... " ప్లీస్ కమిన్" అన్నాడు గౌతమ్...
స్వాతికి కాసేపటికి అర్ధమయింది... ఆమెకే నిన్న గౌతమ్ హెల్ప్ చేశాడని. ఆ డబ్బులు తిరిగివ్వటం కోసమే భర్తను వెంటబెట్టు కొచ్చిoది. ఎన్నో దీవెన్లు దీవించి మళ్ళీ ఒకసారి జరిగింది తలుచుకొన్నది...తమాషా ఏంటంటే వాళ్లు కూడా ఇదే అపార్టమెంట్స్ లొ ఉంటారుట...ముందు రోజు గౌతమ్ దగ్గర అడ్రస్ తీసుకున్నా Mrs. షీబా కు అస్సలు ఆ టైం లో బుర్ర పనిచెయ్యలేదు... ఒక పక్క పిల్లలను స్కూల్ నుండి పికప్ చేసుకునే టైం దాటిపోయింది...ఆవిడ మాటల్లో తెలుసుకుంది స్వాతి...
ఆరు నెలల్లో ఒక్కసారి కూడా చూసినట్లు లేదు వీళ్లను!
ఇదండి పట్నాల లో పిచ్చుక గూళ్ల లో ఉండే వాళ్ళ దుర్దశ...
అప్పటినుండి జీసస్ దీవెనలతో రోజూ వాట్సాప్ లో Mrs. షీబా కుక్సన్ మేసేజస్ వస్తూండేవి గౌతమ్ కోసం...
ఇంకో పది నిమిషాల్లో బయల్దేరాలి స్టేషన్ కి... ఇప్పుడెవరు బెల్ అని తలుపు తీసింది స్వాతి... ఒక పదేళ్ల బాబు "ఆంటీ, టుడే ఈజ్ మై బర్త్డే" అంటూ చేతులో చాకలెట్స్ పెట్టాడు... "ఎక్కడుంటావని" స్వాతి ఇంగ్లీష్ లో అడిగితే, మీ ఫ్లాట్కు ఐమూలగా ఉండే ఫ్లాట్" అని చూపించాడు... ఆశ్చర్య పోయింది స్వాతి... ఏంటో పక్కనున్న వాళ్ళు కూడా ఒకళ్లకోకళ్ళు తెలీదు... ఆరు నెలల నుండి ఏ చెత్త బుట్ట ఏ ఇంటిదో చెప్పగలదు కానీ మనుషులు ఎవరో తెలీదు... కొంత వరకు చెత్త బుట్టలను పరిశీలిస్తే, ఆ ఆ ఇళ్లలోవాళ్ళ గురించి కొంత తెలుసు కోవచ్చు...ఉదాహరణకు స్వాతి పక్కింట్లో ఉండే వాళ్ళు అస్సలు వంట చేసుకోరు... వాళ్ళు ప్రతీ పూట స్విగ్గి నుండి ఫుడ్ పార్శిల్స్ తెప్పించుకుంటారు... వాళ్ల చెత్తబుట్ట సాక్షిగా... అలాగే మేడ పైకి వెళ్ళేటప్పుడు మెట్ల పక్కన ఫ్లాట్, ఐదో అంతస్తు లో- ఆయనకు రోజు మద్యం సేవించందే నిద్ర పట్టదని చెత్తబుట్ట చెబుతుంది... దాన్ని నిండా ఖాళీ సీసాలు బోలెడు కథలు చెప్తాయి... పొద్దున పదింటివరకు వాటికి మోక్షం ఉండదు పండుగ రోజైనా సరే...
ఒక వేళ ఇంట్లో వాళ్ళు లేరు అంటే ఆ ఇంటి ముందు న్యూస్ పేపర్లు, ఒకో సారి పాల ప్యాకెట్లు అక్కడే పడుంటాయి... ఎవ్వరూ పట్టించుకోరు...
ఇంతలో అదే ఇంట్లో నుండి ఒకావిడ "ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు" అని ఏ పరిచయం లేకుండానే స్వాతితో మాట కలిపింది..." మై మదర్" అన్నాడు పుట్టినరోజు పిల్లాడు జై... స్వాతి "ఊరెళ్తున్నాను" అని ఇంగ్లీషు లో జవాబిచ్చింది... రెప్పపాటులో ఆమె స్వాతి ఇంట్లో, మళ్ళీ మాట్లాడితే వంటింట్లో ప్రత్యక్షమైంది... "జస్ట్ 10 మినిట్స్" అని పిజ్జాలు వేడి చేసుకుంటోంది... ఇంట్లో మైక్రోవేవ్ పాడైనది అని చెప్పింది... ఒక పక్క తనకి లేట్ అవుతోంది... ముఖ పరిచయం కూడా లేకుండా ఇలా ఇంట్లోకి వచ్చేస్తారా? జన్మజన్మల బంధం లాగా మాట్లాడుతూనే ఉందామె ఆ పది నిమిషాల లో... ఆమె పేరు గజాల, మతాంతర వివాహము, నలుగురు పిల్లలు...భర్త హిందువు, ఆమె ముస్లిం... ఇంకో మాట... కిరస్థానిగా మతం మార్చుకుంది... సినిమా కథ లాగా ఉంది కదూ... ఇద్దరు పిల్లలు ఇంటర్, టెన్త్, ఇంకో ఇద్దరు చిన్న పిల్లలు...నవ్వాబుల వంశమని చెప్పటం మరువలేదామె ఆ ఉన్న కాసేపట్లో...
గౌతమ్ కు అక్కడ ఆఫీసులో టెన్షన్ పెరిగిపోతోంది స్వాతి ఇంకా ఇంటి దగ్గర బయలుదేరలేదని... డ్రైవర్ స్వాతి కోసం కింద ఉన్నాడు...
అస్సలే ఆవకాయ పెట్టడానికి వెళ్తున్న ట్రిప్ ఇది... ఒక అర డజను పఛ్చళ్లతో వస్తుంది వెనక్కి... ట్రైన్ మిస్సయితే ఇంకేమైనా ఉందా??
సరిగ్గా పది రోజుల తర్వాత స్వాతి ఊరినుండి తిరిగొచ్చింది..."హాయ్ ఆంటీ, మమ్మీ వాంట్స్ సమ్ పేపర్స్" అన్నాడు గజాల చిన్న కొడుకు జై... "ఎలా తెలిసిందో తను ఊరినుండి వచేసినట్లు...న్యూస్ పేపరు కూడా తెప్పించుకోని నవాబులా వీళ్ళు... ఏంటో... ఒక్క సారి కూడా మొగుడుపెళ్లాం కలిసి పిల్లల్ని తీసుకొని బయటికెళ్లటం ఎవ్వరు చూడలేదు... ఒకసారి గుళ్లో గౌతమ్ తో చెప్పాడు గజాల మొగుడు చేతన్- ఒక బలహీన క్షణం లో చేసిన తప్పు కి పెళ్ళైతే చేసుకున్నాడు కానీ సంతోషంగా ఎవ్వరు లేరని" జై వెళ్ళాక వంట చేస్తూ స్వాతి ఆలోచిస్తోంది... మనసులు కలవకుండా ఆరుగురు ఉంటున్నారు 1000 చదరపు అడుగుల టిక్కీలాంటింట్లో... పెద్ద పిల్లలిద్దరు వాళ్ళ తిరుగుళ్లు వాళ్ళు తిరుగుతున్నారు, ఇంట్లో దొరకని ప్రేమ కోసం బయట ప్రపంచం లో వెతుక్కుంటూ, వయసు పెట్టే తొందర వల్ల... అడపా తడపా వాళ్ళ పెద్దబ్బాయి గౌతమ్ దగ్గర వందో రెండొందలో అడిగి తీసుకుంటూ ఉన్నాడు...తిరిగి ఎప్పుడూ ఇవ్వలేదు... "ఏమని చెప్తాం, ఏమని అడుగుతాం" అని వదిలేశారు స్వాతిగౌతంలు... ఎదిగిన పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు సగం మంది తల్లితండ్రులకు... ఇది నేటి పరిస్థితి...
శ్రీరామ నవమి పండుగ ముందు రోజు ప్లంబర్ ని తీసుకొని ఇంటి ఓనర్ Mrs. ద్రౌపది వచ్చింది... మహాభారతము లో తప్ప ఈ పేరు ఎక్కడా వినలేదు గౌతమ్ స్వాతీలు... ఇంటి రెంటల్ అగ్రిమెంట్ లో ఆవిడ సంతకం చెయ్యటం తో వీళ్ళకు ఆవిడ పేరు తెలిసింది... అందరూ ఈవిడను ప్రియ అని పిలుస్తారు... అలా అని ఆవిడే స్వయంగా చెప్పింది స్వాతికి... ఎవ్వరికీ తెలీ దనుకుంటా ఈవిడ అస్సలు పేరు... "ధ్రో" అని ముద్దుగా పిలుస్తాడామే ఒక్కగానొక్క భర్త మీనన్...
బాగా ఉన్నవాళ్లు, ఒక్కతే కూతురు... ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతుర్ని తన దగ్గరే పన్నెండు సంవత్సరాలుంచుకుంది తల్లి ద్రౌపది! కేరళ కు తమిళనాడు మరీ దూరం కాదు కాని ఆ తల్లి అరవ అల్లుడ్ని ఒప్పుకోలేక పోయింది... వీళ్ళ కంటే రెండింతలు ఆస్తిపరుడు, అందగాడు, బుద్ధిమంతుడు... కానీ మలయాళం కుర్రాడు కాదని కూతురు అనిత ను తన నుండి వేరు చెయ్యలేక పోయిందా తల్లి! ఎంత మంచివాడైతే శ్రీని అనిత తో దొంగతనం గా కాపురం చేసాడు కానీ అత్త, మామలను ఒక్క మాటనలేదు... మనవడు నీల్ పుట్టాక అనిత ను కాపురానికి పంపటం తప్పలేదు Mrs. ద్రౌపది కి... ఎక్కడో కాదు, ఎదురిల్లే అనిత అత్తగారిల్లు!
ద్రౌపదీ మీనన్ గోల్ఫ్ ఆటగాళ్లు...నెల లో పదిహేను రోజులు పైగా టోర్నమెంట్ల కు విదేశాలు పోయి వస్తుంటారు... అయినా ఈ వీధి లో ఉన్న అన్నీ ఇళ్ల "బ్రేకింగ్ న్యూస్" Mrs. ద్రౌపది కి తెలియాల్సిందే!
ఈ డబ్బున్న వాళ్ళు సగటు మనుషుల కంటే ఏమి భిన్నముగా లేరు. కట్టు బొట్టులో మటుకు పాశ్చాత్య పద్ధతిని అవలంబిన్చారు... ఆ అపార్టుమెంట్స్ లో స్వాతి తో పాటు చీరెలు కట్టేది అక్కడికొచ్చే పనివాళ్ళు మాత్రమే!
శ్రీమంతులు బాల్కనీల లో నిలబడరు... ఇటువంటి పరిజ్ఞ్యానం ఇక్కడే కలిగింది స్వాతికి... తాను గజాలా తో మాట్లాడిన విషయం ఇట్టే తెలుసుకుంది Mrs. ద్రౌపది... "అది అస్సలే మతం మార్పిడి ప్రచారం చేస్తూ అందర్నీ మాయ చేస్తుంది, గజాలా కు దూరంగా ఉండు స్వాతి" అని ఉచిత సలహా పడేసింది ... కాదు హెచ్చరించింది!
మూడు వారాలు ఇండియా లో ఉండేందుకు స్వాతి గౌతమ్ల అమ్మాయి లేఖ అమెరికా నుండి సెలవ పెట్టుకొని ఇంటికొచ్చింది... ఎప్పుడూ హలో అని కూడా చప్పని ఎదిరింటి ఆయన కాలింగ్ బెల్ కొడితే స్వాతి ఆశ్చర్య పోయింది... చాలా సార్లు పార్కు లో వాకింగ్ కెళ్లినప్పుడు కనిపించినా అస్సలు ఎరగనట్లే వెళ్లిపోతాడాయన... స్వాతి తలుపు తీసి "హలో సర్, ప్లీజ్ కమిన్" అన్నాక విశ్వనాథన్ లోపల సోఫా లో కూర్చున్నాడు... లేఖను పరిచయం చేసింది స్వాతి. "మీ అమ్మాయి అమెరికా నుండి వచ్చిందని తెలిసే పలకరిద్దామనోచ్చా" అన్నాడు విశ్వనాథన్.
తలుపులు మూసుకొనే ఉన్నా దాదాపు అందరూ ఏ ఇంట్లో ఏం జరుగుతోందో తూచా తప్పకుండా తెలుసుకుంటారు... పనిమనుషులు అడక్కుండా అందరికి చేసే మహోపకారమిదేగా...
స్వాతి, లేఖలు విశ్వనాథన్ తో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు... చూస్తూ చూస్తూ ఒక గంట గడిచింది... విశ్వనాథన్ ఆయన గొప్పలు కామా ఫుల్స్టాప్ లేకుండా చెప్తూ ఉన్నాడు. ఎన్ని సార్లు టైం చూసిందో స్వాతి... గౌతమ్ వస్తే బావుంటుందని... కానీ అంత అదృష్టం కలగలేదు. లేఖ కూడా తల్లిని కోపంగా చూసింది... తప్పించుకునే దారి లేక... ఉన్నట్టుండి విశ్వనాథన్ వేసిన ప్రశ్నకు లేఖ, స్వాతి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు... ఇంత మంచి ఇంగ్లీష్ మీ అమ్మకెలా వచ్చు అని అడిగాడు లేఖను... "మా అమ్మ ఇంగ్లీష్ టీచర్గా నేను చదివిన స్కూల్లోనే పదేళ్లు చేసింది. షీ ఈజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్" అని లేఖ బదులిచ్చింది... "షీ వర్క్స్ ఫ్రొం హోమ్ నౌ" అని విశ్వనాథన్ మళ్ళీ నోరెత్తకుండా జవాబిచ్చింది... "ఐ సీ." అన్నాడు విశ్వనాథన్...అప్పుడు ఎదిరింటి తలుపు తెరుచుకొని ఆయన భార్య శాంత పిలిచింది ... గౌతమ్ కూడా అప్పుడే వచ్చాడు...
ఇంగ్లీషువల్లో లేదా అమెరికావల్లో తెలీదు కానీ విశ్వనాథన్, శాంత స్వాతి గౌతమ్ల తో అప్పట్నుంచి స్నేహంగా ఉంటున్నారు... వాళ్ళకి ఒక్కడే కొడుకు, తెలుగమ్మాయిని చేసుకున్నాడు... ఆఫీసు కెళ్లని ఆడవాళ్లకు ఇంగ్లీష్ అంతంత మాత్రంగానే వస్తుందని చీరెలు కట్టుకునే ఆడవాళ్లు "ఇలా ఉంటారు" అనే ఒక దూరభిప్రాయం పెట్టుకుని బతికే వాళ్లలో వీళ్ళు ఒకళ్ళు. కోడలు తెలుగు పిల్ల కావడం తో తెలుగు వాళ్ళ మీద కోపం పెంచుకున్న మూర్ఖులు. స్వాతి, లేఖను కలవటం వీళ్లకు మంచి కనువిప్పు కలిగింది ... కోడలు సవితో అప్పటినుండి కాస్త ప్రేమగా ఉండటం మొదలుపెట్టారు... సంవత్సరం లో మూడు వారాల కోసం కొడుకు కోడలు ఇండియా వచ్చినప్పుడు...
బ్యాన్క్ లో ఎంత డబ్బు దాచిపెడ్తే ఏం లాభం...ఈ సంతోషం లేని జీవితాలు... ఎంతో మంది విడాకులైపోయి సింగిల్ గా ఉoటున్న వాళ్లు...వీకెండ్ లో విచ్చలవీడిగా కాలక్షేపం చేస్తూ జీవితాలను పాడిచేసుకుంటున్నారు
ఒక్క ఇంటి ముందు కూడా ముగ్గు ఉండదు కానీ BMW కార్లు, మర్శిడీస్ కార్లు ఒక్కక్కళ్ళకి కనీసం రెండేసి...
ఇంకో ఆరు నెలలకు ఇంకో రెండు ఇళ్ల వాళ్ళు ఫలానా అని తెలిసింది స్వాతికి... వాళ్ళ పైన ఫ్లాట్లో ఒక లివిన్ జంట- పెళ్లి కాకుండా కలిసుంటున్న ఇద్దరు... వీళ్ళకున్న ఒకే ఒక బంధువు వాళ్ళ కుక్క. ఆమె అతనిమీద రెండు అంగుళాలు పొడుగు, అంతే లావు. Mrs. ద్రౌపది వీళ్ల కథను టూకీగా ఒక రెండు మూడు వారాలు మాత్రమే చెప్పింది స్వాతికి ఫోను చేసి మరీ...
వీళ్లకు ఎవ్వరూ అక్కర్లేదు, వాళ్లంటే ఎవ్వరికీ పడదు... ఏంటో కొన్ని జీవితాలు....
గౌతమ్ ఒక రోజు మూడ్ ఆఫ్లో వచ్చాడు...ఇలా కొన్ని రోజులు గడిచాక స్వాతికి అస్సలు విషయం తెలిసింది... గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మహాతల్లి గౌతమ్ కార్ పార్క్ చేస్తుంటే గుద్దింది... సెల్లార్లో పార్కింగ్ చేస్తుంటే అలా జరుగుతుందని ఎవరనుకుంటారు? కొత్త కారు కొని ఇంకా నెల కాలేదు... ఒంటరి ఆడదని జాలి పడితే మంచి ఎత్తు వేసి గౌతమ్కే ఎసరు పెట్టింది. ఆ టక్కుల మారి పని చేసే ఆఫీసు నుండి ఒకడు ఫోను చేసి గౌతమ్ ఆమె కారు ఢీ కొన్నందుకు డబ్బులు అడిగాడు... ఇంక లాభం లేదని ఓనర్ మీనన్ కి ఫిర్యాదు చేశాడు గౌతమ్ స్వాతి పోరు పడలేక... సొసైటీ మీటింగ్ వరకు వెళ్లి వ్యవహారం, సీసీ టీవీ సాక్షాధారాల తో గౌతమ్కు రావాల్సిన నష్ట పరిహారం ఆరు నెలల తర్వాత వచ్చింది... ఆ మాయల మారి మొగ వాళ్ళను ఆ రకంగా బెదిరించి లొంగదీసుకుంటూ చలామణి అయిపోతూ ఉంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే...చూడ్డానికి బుట్ట బొమ్మే!
స్వాతికి అటువంటి అత్యున్నత నాగరీకత, కోట్ల డబ్బున్నవాళ్ళ మధ్య ఉండే కొద్దీ కంపరం పుడుతోంది...
గౌతమ్ కూడా సర్దుకుపోతున్నాడు తప్ప ఆ వాతావరణం వంట బట్టి కాదు...ఇంకో రెండేళ్లు... తప్పదు... కదిలితే మళ్ళీ ఇల్లు వెతుక్కోటం మాటలు కాదు... స్వాతి పడుతున్న ఇబ్బంది అతను ఎప్పుడో గ్రహించాడు... ఏమి చేయలేక వదిలేసాడు... స్వాతి కట్టు బొట్టును చూసి ఇంగ్లీష్ పక్కన పెడ్తే, ఏ పల్లెటూరి సంత అనుకుంటున్నారందరు అక్కడ అందరూ అన్నది గౌతమ్ కు అర్ధమయింది...వచ్చిన కొత్తలో ఒక సారి Mrs. ద్రౌపది వాళ్ల అమ్మాయి అనితకు స్వాతిని పరిచయం చేసి కూతురు తో ఇలా అంది-- "ఈ ఆంటీ రోజూ వంట చేస్తుంది. నీకెప్పుడైనా అవసరమైతే స్వాతి ఆంటీ దగ్గరకొచ్చి తినచ్చు"... స్వాతికి అది రివర్స్ షాక్!!! వంటన్నది వీళ్ళ దినచర్య లో భాగం కాదా అని...
స్వాతి ఒక మోస్తరు అందగత్తె అనే చెప్పాలి... పెద్ద కళ్ళు, తీర్చిదిద్దిన గులాబీ పెదవులు ఆమెకు అందం తెచ్చిపెడతాయి... మంచి పొడుగు ఒత్తు జుట్టు... చక్కగా నూనె పట్టించి జడ వేసుకుంటుంది స్వాతి... ఆడవాళ్ళందరూ కురులకు రంగులు పూసి, రకరకాలుగా కత్తిరించి ఇస్త్రీ చేస్తున్న ఈ కాలంలో మరి స్వాతి బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి లతాంగి లాగా ఉంటే ఇంకెమనుకుంటారు... పాపం తప్పు వాళ్ళది కాదు...అప్పటికీ గౌతమ్ చాలా సార్లు స్వాతి ని జుట్టు కట్ చేసుకోమని కోరాడు కానీ స్వాతి మటుకు ఎవరో ఎదో అంటారు, అనుకుంటారని తనని తాను మార్చుకోలేదు... అని తేల్చి చెప్పేసింది...
స్వాతి తో మాట్లాడిన మరు క్షణం అవ్వాక్ అయిపోవాల్సిందే ఎవరైనా... వాళ్ళు ఎంత మోడరన్ గా ఉన్నా, ఇంగ్లీష్ లో స్వాతి తో పోటీ పడలేరు... ఇంత వయసొచ్చాక ఒకళ్ళ కోసం కాదు, తన కోసం తను జీవించాలన్నది స్వాతి అభిప్రాయం... ఈ పిచ్చుక గూళ్లలో ఉన్నవాళ్ళతో పరిచయం ఉన్నాలేకపోయినా ఒకటే... ఇది స్వాతి అభిప్రాయం... వాళ్ళవి కృత్రిమ జీవితాలు...
ఆ సంవత్సరం లేఖ ఉద్యోగం మారటం వల్ల ఇండియా రాలేకపోయింది. అందుకని
కూతురు లేఖ దగ్గర అమెరికా లో ఒక ఆరు నెలలు ఉండొచ్చింది స్వాతి... తిరిగొచ్చాక పని వాళ్ల తో సహా అందరి వైఖరి మారిపోయింది 'రీజెన్సీ' అనబడే వాళ్ళుంటున్న అపార్ట్మెంట్స్ లో... స్వాతిని చూసి "హాయ్" అనే పలకరింపులు చాలా ఎక్కువయ్యాయి... "ఏం మారింది??? తాను మునిపటి మనిషే కదా" అనుకుంది స్వాతి...
కానీ అక్కడ ఉన్న పిచ్చుక గూళ్ల పక్షులు స్వాతి విదేశీయానము వలన, దాదాపు స్వాతి గౌతమ్లు అక్కడ మూడేళ్ల నుండి ఉంటే, తమలోని ఒక పక్షి గా గుర్తింపునిచ్చారు స్వాతికి... ఇన్నాళ్ల కి....
అనుకోకుండా గౌతమ్ కు ఒక మంచి ఉద్యోగం హైదరాబాద్ లో రావడం తో ఈ నానా జాతి పక్షులకు, ఈ ఊరికి గుడ్బై చెప్పేసి చక్కగా సొంతూరు వెళ్లి ఒక విశాలమైన గాలి వెలుతురు వచ్చే ఇల్లు తీసుకున్నారు స్వాతిగౌతమ్లు. వాళ్లకు అలవాటైన వాళ్ల ప్రపంచంలో....
***శుభం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం
పూర్తి పేరు: శ్రీమతి దాసు రాధిక
వయసు: 52 సం.
నివాసం: బెంగుళూరు ( ప్రస్తుతము)
స్వస్థలం: తెనాలి
చదువు: BA English Litt., B.Ed
వృత్తి: గృహిణి. 1993-1997 హై స్కూల్ టీచర్ గా పని చేసిన అనుభవం.
ప్రవృత్తి: సంగీతం వినటం, పాటలు పాడటం
పాడుతా తీయగా ETV లో రెండో బ్యాచ్ 1997 లో క్వార్టర్ ఫైనలిస్ట్.
స్కూల్, కాలేజి లో పాటలు, నాటకాల( ఇంగ్లీషు, తెలుగు) అనుభవం.
కథలు వ్రాయటం, ఇంగ్లిష్ - తెలుగు భాషా అనువాదాలు.
ఇటీవలే ఛాంపియన్స్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ నుండి , ఆసియన్ వరల్డ్ రికార్డ్స్ వారినుండి సర్టిఫికేట్ లు పొందాను.
Comments