top of page

పిండి మిల్లు

వారం వారం బహుమతులలో ఎంపికైన కథ (Weekly prize winning story)


'Pindi Millu' - New Telugu Story Written By Pudipeddi Venkata Sudha Ramana Published In manatelugukathalu.com On 26/01/2024

'పిండి మిల్లు' తెలుగు కథ

రచన, కథా పఠనం: పూడిపెద్ది వెంకట సుధారమణ



పండగ అనగానే మనకి ముందుగా గుర్తు వచ్ఛేది పిండి వంటలు, కొత్త బట్టలు. ఏం చేసుకుంటాం అనుకోవడాలు, చేసుకోవడాలతో సందడి మొదలవుతుంది కదా. 


పూర్వం పండగ వస్తోంది అంటే ఇంట్లో ఉన్న ఆడ, మగా, చిన్నా, పెద్ద ఇలా ఇంటిల్లిపాది ఆ సందట్లో పాలు పంచుకునేవారు. అంటే పండగ ఏర్పాట్లలో మునిగి తేలేవారు అన్నమాట. 

ఓ యాభై ఏళ్ళ క్రితం పండగ హడావిడి ఎలా ఉండేదో చూసేద్దాం పదండి. ఎలాచూస్తాం అనుకుంటున్నారా, అదిగో టైమ్ మిషన్ రెడీగా వుంది. పదండి అది ఎక్కి యాభై సంవత్సరాల వెనక్కి వెళ్లి వద్దాం. 

***

హమ్మయ్య వచ్చేసాం అండీ గతంలోకి. దిగండి, అలా ఆ వీధిలోకి వెళ్లి నడుద్దాం. 

ఆగండి ఆగండి, ఇదేదో నాలుగిళ్ళ లోగిలిలా వుంది. అదిగో ఆ ఇంట్లో నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అక్కడ పండగ సందడి మొదలైనట్టుంది. పదండి వెళ్లి వినేద్దాం. ఏం పండగో, ఏం సందడో, ఆ కథా కమామిషం ఏంటో తెలుసుకుందాం పదండి పదండి. 


“ఉమా.. ఉమా.. ఎక్కడున్నావు ఇలా రా ఓసారి”. 

“ఏన్టమ్మా.. ఏఁ పిలిచావూ”. 

“బోల్డు టైము అయిపోతోన్ది అమ్మా! వినాయక చవితి దగ్గరికి వచ్చెస్తోన్దా”. 

“అవును వచ్చెస్తోన్ది అయితే’?

“ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. టైము చూస్తే పరిగెడుతోన్ది”. 


“అవునమ్మా! ఏమిటి చెయ్యాలి చెప్పు మరి”. 

“ఏమిటి చెయ్యాలి ఏమిటమ్మా.. పిండి ఆడించాలి, మొరుం ఆడించాలి. మిల్లుకు వెళ్ళాలి. రమ ఏదీ? వెళ్ళి రమని పిలువు”. 

“రమా.. రమా.. అమ్మ పిలుస్తోన్ది ఇలా రా”. 

“ఆఁ వస్తున్నాను”. 


“ఆఁ రమా.. నువ్వూ, ఉమ మిల్లుకి వెళ్ళండి. వినాయక చవితి వస్తోన్ది కదా! ఆడించుకు రావాలి ఇవి. రెండు కేజీలు పిండి, రెండు కేజీలు మొరుం. వేరు వేరుగా అదిగో ఆ డబ్బాల్లో కొలిచి పెట్టాను. ఒకటి పిండి ఆడించండి. ఒకటి మొరుం ఆడించండి”. 


“అలాగేనమ్మా.. రెండు కేజీలు. రెండు కేజీలు మోసుకొని వెళ్ళాలా? బోల్డు దూరం వెళ్ళాలమ్మా మిల్లుకి అంటే, అంత దూరం నడుచుకుంటూ.. వెళ్ళాలి అమ్మా.. ”. 


“మరి వెళ్ళాలమ్మా తప్పదు. ప్రతీ సంవత్సరం ఉన్నదే కదా! వినాయక చవితికి చెయ్యడానికి కొన్న పిళ్ళు అవి బావుండవు. పిండి ఆడించుకుని రావాలి కదా! ఇంట్లో అందరికీ పెట్టాలి, వచ్చిన వాళ్ళకి పెట్టాలి. మరి కొంచెం ఆడిస్తే ఎలా”. 


“సరే వెళతాములే, పద ఉమా”. 

“ఇదిగో జాగ్రత్తగా చూడాలి. మీ మటుకు మీరు కబుర్లు ఆడుకుంటు ఉండిపోక, జాగ్రత్తగా చూడండి. మీరు కబుర్లలో పడిపోతే, వాడు సగం పిండి ఉంచేసుకుంటాడు. 

 వినాయక చవితికి ఇవి, సన్న మొరుం ఆడాలి అని చెప్పండి. ఎవరైనా బియ్యం పోసి పిండి ఆడించుకున్నాక, మీరు బియ్యం పొయ్యండి. లేకపోతే ఏ చోళ్ళు పిండో, సెనగ పిండో కలిసిపోతుంది ఇందులో”. 


“అలాగే అమ్మా.. చూస్తానులే”. 

“ ప్రతీసారి చెప్పి పంపిస్తాను నేను. అయినా సగం పిండే పట్టుకొస్తారు మీరు. పిండి మెత్తగా ఆడమను. ఆఁ అన్నట్టు మొరుం ఆడేకా, పిండి ఆడించు. ముందు పిండి ఆడిస్తే, రెండోది కూడా పిండి ఆడేస్తాడు. అందుకే జాగ్రత్తగా చెప్పింది చెప్పినట్టు చేసుకు రండి”. 


“అబ్బా! ఎప్పుడూ చెప్పిందే చెప్తావు ఏన్టమ్మా.. ప్రతీ సారీ ఆడిస్తున్నాం కదా”. 

“ఉమా.. పద ఇంక. ఉన్నకొద్దీ, అమ్మ అలా ఏవో ఒకటి చెప్తూనే ఉంటుంది. 


“చూడండీ.. ఇది మొత్తం నాలుగు కేజీలు. కానీ మూడు కేజీలు అని చెప్పండి. మూడు కేజీలకే డబ్బులు ఇవ్వండి చాలు. ఎంత అయినా వాడు కొంచెం పిండి ఉంచేసుకుంటాడు, అంతా ఎలాగూ ఇవ్వడు. అందుకే మూడు కేజీలకే డబ్బులు ఇవ్వండి సరిపోతుంది”. 


“అదేన్టి అమ్మా అలా అంటావు? వాడు చూడగానే చెప్పెస్తాడు రెండు కేజీలు అని. మొత్తం నాలుగు కేజీలకి డబ్బులు తీసుకుంటాడు. నువ్వు నాలుగు కేజీలకి డబ్బులు ఇవ్వు. నీకు తెలియదు వాడు ఎంత పేచీ పెడతాడో. తక్కువిస్తే, వాడు పేచీ పెడితే బావుండదు, అసహ్యంగా ఉంటుంది. మళ్ళీ వచ్చి వెళ్ళాలంటే చాలా దూరం కదా కష్టం”. 


“నాకు అన్నీ తెలుసు. తెలియకపోవడమేమిటి. మేము చిన్నప్పుడు మిల్లుకి వెళ్ళి ఆడించకుండానే పెద్ద వాళ్ళం అయిపోయామా ఏమిటి. నాకన్నీ తెలుసును కాబట్టే ఒకటికి పది సార్లు చెప్తున్నాను. మేము బోల్డంత బరువు మోసుకుంటూ ఎంతెంత దూరాలు నడిచి వెళ్ళే వాళ్ళం, మా చిన్నప్పుడు రోట్లో పిండి దంచి, మొరుం తిరగట్లో విసిరేవాళ్ళం. మీకేఁ తెలుసు అవన్నీ, ఇప్పుడు మిల్లుకి వెళ్ళి ఇలా బియ్యం పోసి అలా పిండి తెచ్చేసుకోవడమె కదా! అదే కష్టం అనుకుంటే ఎలా”. 


“సర్లే. నాలుగు కేజీలకు సరిపడా డబ్బులు ఇవ్వు. మిగిలితే తెచ్చి ఇచ్చెస్తాం”. 


“సరే గానీ, తమ్ముడ్ని కూడా తీసుకు వెళ్ళండి. వాడు మీతో వస్తానని ఏడుస్తున్నాడు”. 


“నాలుగు కేజీలు మోసుకుంటూ, ఇంకా తమ్ముడ్ని కూడా తీసుకు వెళ్ళాలా? నా వల్ల కాదు అమ్మ. అక్కని వెళ్ళమను మిల్లుకి. ఎప్పుడూ మేమిద్దరమే వెళ్ళాలేమిటి”?


“ఏఁ రమా! అలా అంటావు? మీ ఇద్దరు వెళ్ళి రండి. నేను ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నాను? గిన్నెలు తోమడాలు, గదులు తుడవడాలు, అమ్మకి వంటలో సాయం చెయ్యడాలు, ఇవన్నీ పనులు కావేమిటి. వెళ్ళండి, వెళ్ళండి మీ ఇద్దరూనూ”. 


“అమ్మా.. నేను రెడీ, అక్కలతో మిల్లుకి వెళ్ళడానికి”. 


“అదిగో చూడండి తమ్ముడు తయారై పోయాడు. తీసుకు వెళ్ళండి మీతో. చూడండి.. తమ్ముడ్ని ఎడమ పక్క నడిపించండి. మీరు కబుర్లలో పడి, వాడ్ని మరచిపోకండి. జాగ్రత్తగా చూడండి”. 


“రమా.. నువ్వు కూడా చూడు జాగ్రత్తగా. ఉమా.. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా, జాగ్రత్తగా చూస్తూ ఆడించండి. ఇక వెళ్ళి రండి”. 

***

“బాబూ.. ఇవి వినాయక చవితికి. సన్న మొరుం ఆడమని చెప్పమన్నారు అమ్మ. అయ్యో! నెమ్మదిగా పొయ్యండి. చెప్తుంటే అలా పోసేస్తున్నారేమిటి. అబ్బా డబ్బా వేడిగా ఉంది, నేను పట్టుకోలేకపోతున్నాను”. 


“ పాపా.. నువ్వు లేమ్మా అక్కడ. నేను చూసుకుంటాను”. 


“అమ్మ జాగ్రత్తగా చూడమని చెప్పేరండి. నేను చూడాలి. ఇక్కడే ఉంటాను”. 


“ఏఁ పర్లేదు. మీరు పక్కన నిలుచోన్డి”. 


“ఆఁ రమా.. నువ్వు అవి పొయ్యి, నీ చేతిలో ఉన్న డబ్బాలోవి. మెత్తని పిండి ఆడమని చెప్పమన్నారు అమ్మ. బాబూ.. జాగ్రత్తగా ఆడండి, అయ్యో! పిండి అంతా పక్కని పడిపోతోన్ది. కాస్త జాగ్రత్తగా చూడండి. పిండి తక్కువ అయితే అమ్మ తిడతారు”. 


“తియ్యండమ్మా మీవి. అయిపోయాయి. పక్కకి రండి. మీ వెనక వాళ్ళు పొయ్యాలి. త్వరగా జరగండి”. 

***

“అమ్మా.. ఇదిగో ఆడించుకు వచ్చేము, చూసుకో”. 


“హమ్మయ్య! వచ్చేరా. ఇంతసేపు చేసారేమిటి అమ్మా.. అప్పుడనగా వెళ్ళేరు”. 


“బావుందమ్మా.. అలా అంటావేమిటి. పెద్ద లైను ఉంది అక్కడ. ఒక పక్క తమ్ముడు అటూ ఇటూ వెళ్ళిపోవడం. వాడిని తీసుకు వచ్చేసరికి లైను తప్పిపోయి, మళ్ళీ వెనక్కి వెళ్ళి నిలబడ్డం. మొత్తానికి ఎలగోలా ఆడించుకు వచ్చేము. నాలుగు కేజీలకు డబ్బులు తీసుకున్నాడు. కేజీకి పావలా. అయిదు పైసలు పెరిగిందిట. రూపాయి తీసుకున్నాడు”. 


“సరే సరే, మూతలు తియ్యండి గబ గబా. ఆఁ ఆఁ అదిగో ఆ బేసన్లలో పొయ్యండి. చల్లారాలి”. 


“అబ్బా! అది కూడా మేమే చెయ్యాలా? అక్కని చెయ్యమను. లేకపోతే నువ్వు చేసేసుకో. అంత దూరం నుండి ఆ వేడి డబ్బాలను మోసుకొచ్చేసరికి చేతులు మండుతున్నాయి”. 


“ఏఁ రమా.. ఏమిటది. నాన్నగారికి చెప్పమంటావా? అదిగో నాన్నగారు వస్తున్నారు”. 


“హుఁ.. ఇందులోనేనా పొయ్యాలి. ఇదిగో పోసేసాను చూడు”. 


“అయ్యో! ఇదేమిటమ్మా.. ఇంత తక్కువ మొరుం వచ్చింది. అయ్యయ్యో! జల్లిస్తే అంతా పిండే పడిపోతోన్ది. ఇంక మొరుం ఏదీ ఇందులో. కేజీ పోస్తే చాలదని రెండు కేజీలు పోసాను. అయినా చాలదు ఇది, సగం పైగా ఉంచేసుకున్నాడు. ఇప్పుడు ఎవరి ముక్కులో పెడతాను ఈ కొంచెం. ఎంత మందికీ చాలదు. మనం ఏఁ తింటాం, వచ్చిన వాళ్ళకి ఏఁ పెడతాను. హుఁ సర్లే, దీనికి తగ్గట్టే పప్పు నానబెడతాను. ఇంకేఁ చేస్తాను”. 


“ఏమిటమ్మా.. ఎప్పుడు చూసినా, పిండి ఉంచీసుకున్నాడు, సరిగ్గా ఆడలేదు అంటావు. మా ఎదురుగానే ఆడేడు కదా మరి. కావాలంటే రమని కూడా అడుగు”. 


“అవునవును, పిల్లికి ఎలక సాక్ష్యం. బావుందర్రా. ఇక వెళ్ళి ఆడుకోన్డి. నా తంటాలేవో నేను పడతాను”. 


“అమ్మా.. నేనూ, రమా ఆడుకుందికి వెళుతున్నాం. ఇంకేమైనా పని ఉంటే అక్కకి చెప్పు సరేనా. టా టా”. 


టా టా.. వాళ్ళు టా టా చెప్పేసేరు కదా, ఇంక మనమెందుకు ఇక్కడ పదండి మన కాలానికి వెళ్ళిపోదాం. 


అదండీ ఆనాటి పండగ సందడి. పదండి పదండి ఇక రేపటి మన పండగ సంగతి చూసుకోవాలి కదా! మళ్ళీ మరోసారి కలుద్దాం. 


సమాప్తం. 

పూడిపెద్ది వెంకట సుధారమణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు వెంకట సుధా రమణ పూడిపెద్ది. నేను రాంభట్ల వారింట పుట్టి, పూడిపెద్ది వారింట మెట్టాను. నేను ఎప్పటినుంచో కథలు, కథానికలు రాస్తున్నా, ఈ మధ్యనే వాటిని పత్రికలకి పంపడం ప్రారంభించాను. నేను ఇంకా ఓనమాలు దిద్దుతున్నాను రచనావిభాగంలో.


నా అక్షర ప్రయాణానికి అడుగులు పడిన మా ఇంటి నేపధ్యం.. Dr . రాంభట్ల నృసింహ శర్మ (ప్రముఖ కవి ) నాకు స్వయంగా అన్నయ్య మరియు Dr . రాంభట్ల వెంకట రాయ శర్మ ( పద్యకవి. రచయిత ) నాకు స్వయానా మేనల్లుడు, అలాగే, మెట్టినింటి నేపధ్యం ఏంటంటే, శ్రీశ్రీ గారు,పూడిపెద్ది లక్ష్మణ మూర్తి గారు (పూలమూర్తి గారు ) (శ్రీశ్రీగారికి స్వయానా తమ్ముడు), ఆరుద్రగారు, మొదలగు ప్రముఖులు నాకు తాతగార్లు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఉగాది వసంత పూడిపెద్ది నాకు స్వయానా పిన్ని.


ఓనామాలతో ప్రారంభమైన నా ఈ అక్షర ప్రయాణం, సుదూరయానంగా మారాలని ఆశిస్తున్నాను.


జన్నస్థలం: కుప్పిలి, శ్రీకాకుళం జిల్లా

జననీ జనకులు: వెంకట రత్నం, బాలకృష్ణ శర్మ.

విద్యార్హతలు : ఎం. ఏ తెలుగు, ఎం. ఏ పాలిటిక్స్, బి. ఈ డీ

వృత్తి : ఉపాధ్యాయిని గా 15 సంవత్సరాలు.

ప్రస్తుతం: గృహ నిర్వహణ

భర్త : వెంకటరామ్, రిటైర్డ్ ఆఫీసర్, హెచ్. పి.సి ఎల్

సంతానం : అబ్బాయి డాక్టర్, ( స్వంత హాస్పిటల్ )

అమ్మాయి సాఫ్టవేర్ ఇంజనీర్, U. S. A

అభిరుచులు : సాహిత్యం పై మక్కువ, పుస్తక పఠనం, కథలు వ్రాయటం.

అభిలాష : నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలని,

వీలైనప్పుడు దైవ దర్శనం, బంధు దర్శనం చేసుకోవడం.

చిరునామా : విశాఖపట్నం

*****

















247 views10 comments

10 Comments



kanaka durga

4 hours ago

Nice story kadha kadhanam super nice 👍

Like


@vssnarayanapoodipeddi3173

• 18 minutes ago

చాలా చాలా బావుంది, అక్క చిన్న నాటి జ్ఞాపకాలు బాగా గుర్తు కొచ్చాయి... ఇలాగే ఇంకా మంచి మంచి కథలు వ్రాస్తూ ఉండాలి

REPLY0 replies


Like


@vssnarayanapoodipeddi3173

• 17 minutes ago

చాలా చాలా బావుంది.. అక్క చిన్న నాటి జ్ఞాపకాలు బాగా గుర్తు కొచ్చాయి

Like


@user-ww9fc5dk7v

• 1 hour ago

Super

Like


@sudharamanapudipeddi7857

• 2 hours ago

ధన్యవాదములు అండీ

Like
bottom of page