top of page

పితృఋణం

#PithruRunam, #పితృఋణం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ,#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Pithru Runam - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 28/11/2024

పితృఋణం - తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"సామీ దండాలు!" రాఘవశాస్త్రి గారిని చూచి చేతులు జోడించాడు సుబ్బిగాడు. 


రాఘవశర్మ పండితులు. ఆ గ్రామ పురోహితులు. ఆ వృత్తివారికి వంశపారంపర్యం.

రాఘవశాస్త్రి సుబ్బిగాడి ముఖంలోకి పరీక్షగా చూచాడు.

"ఏరా సుబ్బూ!..." అడిగాడు రాఘవశాస్త్రి.


"అయ్యా!... తమరితో కొంచెం మాట్లాడాలయ్యా!" చేతులు కట్టుకొని నిలబడ్డాడు సుబ్బిగాడు.


వరండాలోని కుర్చీలో కూర్చొని శాస్త్రిగారు.....

"కూర్చోరా!...." అన్నాడు.


సుబ్బిగాడు వరండా అంచున కూర్చున్నాడు.

"చెప్పరా!..... ఏమిటి విషయం?" అడిగాడు రాఘవశాస్త్రిగారు.


వంచిన తలను పైకెత్తి భయంతో సుబ్బిగాడు శాస్త్రి గారి ముఖంలోకి చూచాడు.

"సామీ!...." దీనంగా రాఘవశాస్త్రి గారి ముఖంలోకి చూచాడు సుబ్బిగాడు.


"నిర్భయంగా చెప్పాలనుకొన్నదేంటో చెప్పరా!"


"అయ్యా!.... మా అయ్యగారు పోయి మూడురోజులైనాది కదా!..." అతని ముఖంలో విచారం.


"అవునురా!...."


"మరి వారికి ఖరమ చేయాలిగా!"


"ఆఁ...."


"వారికి పిల్లలు లేరు కదా సామీ!"


"అవును ఆ మాటా నిజమేగా!"


"అయితే ఖరమ ఎవరు చేస్తారయ్యా!"


"ఆ విషయాన్ని గురించి అమ్మగారితో మాట్లాడాలిరా!"


"ఎప్పుడు మాట్లాడతారయ్యా!" 


"రేపు ఉదయం"


"సరే సామీ!... నేను తమర్ని రేపు సాయంత్రం వచ్చి చూస్తానయ్యా!"


"ఎందుకురా!"


"అమ్మగోరు చెప్పింది ఇనే దానికి సామీ!..." సుబ్బిగాడు అరుగు దిగాడు.


"ఎల్లొస్తా సామీ!" చేతులు జోడించాడు. 


రెండు అడుగులు వీధివైపుకు వేశాడు సుబ్బిగాడు.

రాఘవశాస్త్రి.....

"రేయ్ ఆగరా!...."


సుబ్బిగాడు వెనుతిరిగి రాఘవశాస్త్రి ముఖంలోకి చూచాడు.

"నీ కొడుకు ఎక్కడ వున్నాడురా!...."


"పట్నంలో బి.ఎ చదువుతుండాడు కదయ్యా!"


"ఎన్నో సంవత్సరం?"


"చివరి సమచ్చరం సామీ!"


"వాణ్ణి చదివించింది మీ అయ్యగారు గోపాలరావుగారేగా!..."


"అవును సామీ!"


"ఇప్పుడు సంవత్సరం ముగిసి కాలేజీకి శలవలిచ్చారు కదరా!..."


"అట్టాగా నా సామీ!.... నాకు ఆ ఇసయం తెలవదయ్యా!..."


సుబ్బిగాడి కొడుకు రాముడు పట్నం నించి వచ్చాడు. అతని గుడిసె చెరువు కట్ట పక్కన గోపాలరావు గారి స్థలంలో వుంది. దార్లో రాఘవశాస్త్రి గారి ఇల్లు. వారి ఇంటి వరండా ముందు నిలబడి వున్న తన తండ్రి సుబ్బిగాడిని రాముడు చూచాడు. మెల్లగా లోనికి నడిచాడు. శాస్త్రిగారు రాముడిని చూచారు.


"అడుగో!... మాటల్లోన్నే వచ్చాడు నీ కొడుకు" చిరునవ్వుతో చెప్పారు రాఘవశాస్త్రిగారు.


చేతులు జోడించి రాముడు.... "నమస్కారం సార్!" అన్నాడు.


సుబ్బిగాడు కొడుకును చూచాడు. వాడి కళ్ళల్లో నీళ్ళు కమ్ముకొన్నాయి.

"రాముడూ!..." ఆప్యాయంగా పలకరించాడు సుబ్బిగాడు.


"పరీక్షలు ముగిసాయి నాన్నా. శలవలు.... వూరికి వచ్చేశాను" చిరునవ్వుతో చెప్పాడు రాముడు.


"ఏరా!.... రాముడూ!... పరీక్షలు బాగా వ్రాశావా!" అడిగారు శాస్త్రిగారు.


"చాలా బాగా వ్రాశాను సార్!..." నవ్వుతూ జవాబిచ్చాడు రాముడు.


"వెరీగుడ్!.... నీవు గట్టివాడివని నాకు తెలుసురా!..." చిరునవ్వుతూ చెప్పారు శాస్త్రిగారు.


"మంచి ఉద్యోగాన్ని సంపాదించుకొని, నీవు మీ నాన్నను బాగా చూచుకోవాలిరా!" అన్నారు శాస్త్రిగారు.


"అట్టాగే సార్!.... తప్పకుండా చూచుకొంటా!" చిరునవ్వుతో చెప్పాడు రాముడు.


"సరే ఇంటికి వెళ్ళండి" అన్నారు శాస్త్రిగారు.


ఇరువురూ తమ గుడిసె వైపుకు నడిచారు.

*

"అమ్మా!.... దండాలు పిలిచినారంట!..." అడిగాడు సుబ్బిగాడు.


వరండాలో వాలుకుర్చీలో కూర్చొని వుంది గోపాలరావుగారి సతీమణి శ్యామలాదేవి.

"అవునురా!.... కూర్చో!...."


"పర్లేదమ్మగోరు.... ఇసయం ఏంటో సెప్పండి."


"నీ కొడుకు పట్నం నుంచి వచ్చాడా!"


"వచ్చినాడమ్మగోరు!" 


"నీవు వెళ్ళి రాఘవశాస్త్రిగారిని పిలుచుకొనిరా!..." చెప్పింది శ్యామలాదేవి.


"అట్టాగే అమ్మగోరూ!...." సుబ్బిగాడు వీధి వాకిటికి చేరాడు. అతనికి రాఘవశాస్త్రిగారు ఎదురైనారు.

"మీ కోసమే వస్తుండా సామీ!... అమ్మగోరు...."


"నన్ను పిలుకరమ్మాన్నారు కదూ!...." సుబ్బిగాడు పూర్తిచేయకముందే, రాఘవశాస్త్రి అన్నారు.


"అవును సామే...." చిరునవ్వుతో చెప్పాడు సుబ్బిగాడు.


"పద...." ఇరువురూ భవంతివైపుకు నడిచారు.


వరండాలో కూర్చొనియున్న శ్యామలాదేవి లేచి....

"నమస్తే సామీ!.... రండి కూర్చోండి" అంది.


రాఘవశాస్త్రిగారు ఆసనంలో కూర్చున్నారు.

శ్యామలాదేవి కూర్చుంటూ "రేయ్ సుబ్బూ!.... కూర్చోరా!..." అంది.


సుబ్బిగాడు అరుగు చివరన కూర్చున్నాడు.

"స్వామీ!... నేను మీకు ఇప్పుడు జరిగిన ఒక యధార్థ కథను వినిపిస్తాను. విని మీరు ధర్మాన్ని నాకు తెలియజేయాలి" చిరునవ్వుతో చెప్పింది శ్యామలాదేవి.


"అలాగే అమ్మగారూ!..." అన్నారు శాస్త్రిగారు. 


ఆత్రంగా ఆమె ముఖంలోకి చూడసాగారు.

"స్వామీ!... ఈ ప్రపంచం చిత్రవిచిత్రమైంది. అది ఒక చిన్న గ్రామం. అందులో పేరున్న వంశం వారు ఆ వూరి పెద్దలు.


తాతతండ్రులు గతించారు. మూడవ వంశీయుడు అతని భార్యా, ఆ ఇంటి పని మనుషులు. ఇరువురు దంపతులు వుండేవారు.


ఆ దంపతులకు చాలాకాలం సంతానం లేదు. ఎందరో డాక్టర్లు ఆ ఇల్లాలిని పరీక్షించారు. మందులు, మాకులు ఇచ్చారు. దైవ కృపవలన ఆమె గర్భవతి అయింది. ఎనిమిది మాసాలు సజావుగా గడిచాయి.


ఒకనాడు మేడపై నుండి మెట్లపైన క్రిందికి ఆమె దిగుతున్న సమయంలో చీరచెంగు కాళ్ళకు తగిలి ఆమె మెట్లపై నుండి క్రిందకు దొర్లి పడిపోయింది. హాస్పిటల్లో చేర్చారు. ఉదర భాగంలో గట్టి దెబ్బ తగలడంతో గర్భంలో శిశువు మృతి చెందింది. తల్లిని కాపాడేటందుకు శిశువును ఆమె గర్భసంచిని తొలగించి, ఆ తల్లిని రక్షించారు డాక్టర్లు. ఆమె భర్తగారితో ఇకపై ఆమె గర్భవతి కాలేదనే విషయాన్ని తెలియజేశారు. ఆ దంపతులు ఎంతగానో బాధపడ్డారు.


నమ్మినబంటు గడ్డి లారీపై కూర్చుని వస్తుండగా జారి నేలపడ్డాడు. బలమైన గాయాలు తగిలాయి. అతనికి ఆపరేషన్ మర్మావయాల ప్రాంతంలో జరిగింది. రక్తం కావలసి వచ్చింది. యజమాని రక్తం అతని రక్తం ఒకే గ్రూప్. తాను రక్తాన్ని ఇచ్చి తన నమ్మిన బంటును బ్రతికించాడు ఆ యజమాని.


భార్యకు ఇకపై సంతానయోగం లేదని తెలిసిన నాటినుంచి వారు రాత్రి సమయాన తాగుడుకు అలవాటుపడ్డారు. ఆమె భర్తను వారించింది. కానీ వారిలో మార్పు రాలేదు.


పనిమనిషి చాలా అందమైనది. వారు చూపుల్లో ఆ మనిషి నిలిచిపోయింది. త్రాగిన మైకంలో ఆవేశంలో ఒకనాడు వారు ఆమెను తన సొంతం చేసుకొన్నారు. శారీరక వాంఛను తీర్చుకొన్నారు. ఆ సన్నివేశాన్ని ఆ ఇంటి ఇల్లాలు చూచింది. బయటికి వచ్చిన పనిమనిషి ఆమె కాళ్ళమీద పడి బోరున ఏడ్చింది. ఆ ఇల్లాలు నేరం తన భర్తది అయినందున పనిమనిషిని ఏమీ అనలేదు. లేవదీసి ఓదార్చి.... ’ఈ విషయం మన ముగ్గురి మధ్యనే నిలిచిపోవాలి. ఎవరికీ నీవు చెప్పకూడదు’ అని చెప్పి పనిమనిషి చేత ప్రమాణం చేయించింది. 


కాలవాహినిలో మూడుమాసాలు గడిచాయి. నమ్మినబంటు జరిగిన ప్రమాదం వలన సంసార జీవితానికి పనికిరానివాడైనాడు. ఆ కారణం వాడు సదా తన భార్యకు దూరంగానే వుండిపోయాడు. యజమాని అవసరాలను పనిమనిషి యజమానురాలి ఆజ్ఞప్రకారం అప్పుడప్పుడు తీర్చేది.

పనిమనిషి గర్భవతి అయింది. యజమానురాలు ఆమెను ఎంతగానో అభిమానించేది. అలాగే అమాయకుడైన నమ్మిన బంటు పట్లా ఎంతో ప్రేమాభిమానాలను చూపేది. ఆమె కాదు యజమాని కూడా బంటును ఎంతగానో అభిమానించేవారు.


భార్య గర్భానికి కారణం తన యజమాని అని వాడు గ్రహించాడు. తన దుస్థితిని గురించి ఎంతగానో బాధపడ్డాడో వాడికి ఆ సర్వేశ్వరులకే తెలియాలి. వాడు ఏనాడూ తన భార్యను తాకలేదు. ఆమె గర్భవతి అని తెలిసిన తరువాత, పూర్వం కన్నా ఆమెను ఎంతగానో అభిమానించేవాడు. తన ఇంటి పనులన్నీ వాడే చేసేవాడు. ఆ విషయాలన్నీ పనిమనిషి తన యజమానురాలికి చెప్పేది.... బాధపడేది. యజమానురాలు ఆమెను ఓదార్చేది. అంతా దైవ నిర్ణయం అని ఓదార్చేది. 


బంటు, తన యజమాని, వారి అర్థాంగి పట్ల ఎంతో విశ్వాసంగా నడుచుకొనేవాడు. పనిమనిషి నవమాసాలు నిండాయి. శుభ సమయంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది....

బంటు, యజమానురాలు ఎంతగానో ఆనందించారు. 

కానీ... తప్పు చేశానని పనిమనిషి, యజమాని బాధపడేవారు.


బిడ్డకు ఐదు సంవత్సరాల ప్రాయం, అక్షరాభ్యాసం చేయించి స్కూలుకు పంపారు ఆ పేద తల్లి, తండ్రి, యజమానురాలు. 


ఆ బిడ్డడు ఏకసంతగ్రాహి. ప్రతి క్లాసులో ప్రతి సంవత్సరం వాడే ఫస్టు. ప్రాధమిక విద్య ముగిసింది. సెకండరీ విద్యాలయంలో ప్రవేశించాడు.


యజమాని యజమానురాలు, పిల్లోడిని ఎంతగానో అభిమానించి, మంచి బట్టలు పుస్తకాలు స్కూలు ఫీజు ఏర్పాటు చేసేవారు. హాస్టల్లో చేర్పించి వాడి అన్ని ఖర్చులూ వారే భరించేవారు. శలవల్లో ఇంటికి వచ్చేవాడు. 


ఆ పిల్లవాడు ఇంటర్లో వుండగా ఎంతో కాలంగా మనోవ్యధతో పైకి నవ్వుతూ నటించిన ఆ పనిమనిషి కరోనా కాటుకు బలైపోయింది. భర్త బిడ్డ చాలారోజులు బాధపడ్డారు. అలాగే యజమాని, యజమానురాలు కూడా!...." శ్యామలాదేవి చెప్పడం ఆపింది. వారి కళ్లల్లో కన్నీరు. 

రాఘవశాస్త్రిగారు, సుబ్బిగాడు విచారవదనాలతో వారి... ముఖంలోకి చూస్తున్నారు.


చాలావరకు ఆ కథలోని పాత్రధారులు ఎవరన్నది శాస్త్రిగారికి సుబ్బిగాడికి అర్థం అయింది.

పవిటతో కన్నీటిని తుడుచుకొంది శ్యామలాదేవి. తిరిగి చెప్పడం ప్రారంభించింది.


“నాలుగురోజుల నాడు త్రాగి త్రాగి అనారోగ్యంతో బాధపడుతున్న యజమాని కన్నుమూశారు.

వారు తన చివరిక్షణాల్లో బంటును పిలిచి....’నన్ను క్షమించరా!...’ అని వాడి చేతులు పట్టుకొన్నారు" విచారంగా శూన్యంలోకి చూస్తూ ఆపింది శ్యామలాదేవి.


ఆ మాటను విన్న సుబ్బిగాడు ’నా సామీ!... నా సామీ!...’ అంటూ ఏడుస్తూ లేచి అక్కడనుండి వీధివైపుకు వెళ్ళిపోయాడు.


శాస్త్రిగారు, శ్యామలాదేవి గారు అతన్ని ఆశ్చర్యంగా చూచారు.

“వారు తరువాత తన అర్థాంగితో..... ’నా ఖర్మను మనం చదివించే పిల్లవాడి చేత చేయించు. నీవూ నన్ను క్షమించు. ఇది నా చివరి కోరిక...’ చెప్పి తలను వేలాగేశారు.” అంది శ్యామలాదేవి.


శ్యామలాదేవి చివరి మాటలను చెప్పేటప్పుడు ఆమె కంఠం బొంగురుపోయింది. కళ్ళల్లో కన్నీరు తలనుదించుకొంది.

రాఘవశాస్త్రి గారికి విషయం పూర్తిగా అర్థం అయింది. వదనంలో విచారం.


"అమ్మా! నాకు మీరు చెప్పిన కథ పూర్తిగా అర్థం అయిందమ్మా!..." విచారవదనంతో మెల్లగా పలికారు శాస్త్రిగారు. 


కొన్నిక్షణాల తరువాత.....

"అమ్మా!.... విచారపడకండి. అంతా ఆ దైవనిర్ణయం. అలా జరగాలని వారి నిర్ణయం. జరిగింది. ఇందులో దోషులు ఎవరూ కారు. వారి వారి స్థానాల్లో వారు విధి విలాసం ప్రకారం వర్తించారు." అనునయంగా చెప్పారు శాస్త్రిగారు.


"స్వామీ!..."


"చెప్పండి అమ్మగారూ!...."


"నేను రాముడిని దత్తు తీసుకోవాలనుకొంటున్నాను. వారి చివరి కోర్కెను తీర్చాలనుకొంటున్నాను. మీరు సుబ్బును ఒప్పించి నావారి చివరి కోర్కెను నెరవేర్చాలి స్వామీ!..." దీనంగా కన్నీటితో చేతులు జోడించింది శ్యామలాదేవి.


"అమ్మా!.... సుబ్బిగాడికి మీపట్ల, అయ్యగారి పట్ల ఎంతో గౌరవం, అభిమానం. మీరు కోరినట్లుగానే నేను వాడితో మాట్లాడుతాను. వాణ్ణి ఒప్పిస్తాను. కానీ నాది ఒక చిన్న సలహా!"


"ఏమిటి స్వామీ అది?...."


"అయ్యగారు చాలా గొప్పగా పేరు ప్రఖ్యాతులతో బ్రతికినవారు. వారి అస్తికలను గంగలో కలిపితే చాలా మంచిది. అక్కడే వారి ఖర్మ క్రతువులను నిర్వహిస్తే, వారి ఆత్మకు శాంతి సమకూరుతుంది తల్లీ!..." ఎంతో అనునయంగా చెప్పాడు రాఘవశాస్త్రిగారు.


"అలా అంటారా!"


"అవునమ్మా!...."


"ముందు సుబ్బును ఒప్పించాలి కదా స్వామీ!..." సందేహాంతో అడిగింది శ్యామలాదేవి.


అదే సమయానికి సుబ్బిగాడు తన కొడుకు రాముడిని వెంటపెట్టుకొని భవంతి ఆవరణంలో ప్రవేశించి వరండావైపుకు నడవసాగాడు.

"అమ్మా!.... అటు చూడండి!" అన్నాడు శాస్త్రిగారు చిరునవ్వుతో.


శ్యామలాదేవి గారు వీధివైపుకు చూచారు. వరండావైపు వస్తున్న సుబ్బిగాడిని వాడి ప్రక్కన నడుస్తున్న ఇరవై సంవత్సరాల రాముడిని చూచారు. కళ్ళల్లో కొత్తకాంతి. పెదవులపై చిరునవ్వు.

సుబ్బిగాడు కొడుకు వరండాను సమీపించాడు.


“పెద్దమ్మగారూ!.... నమస్కారం" చేతులు జోడించాడు రాముడు చిరునవ్వుతో.


"రామూ!... నాయనా!.... బాగున్నావా!... పరీక్షలు బాగా వ్రాశావా అయ్యా!..." ప్రీతిగా అడిగింది శ్యామలాదేవి.


"చాలా బాగా వ్రాశానమ్మ గారూ!..." నవ్వుతూ చెప్పాడు రాముడు.


"పెద్దమ్మగోరూ!... నాదో చిన్న మనవి. అయ్యగారి ఖర్మ కూలోడిచేత చేయించొద్దమ్మగోరు. ఈ రాముణ్ణి చిన్నప్పటి నుంచీ పెట్టి పోసించి చదివించింది మీరే కదా తల్లీ. అయ్యగారికి ఎవరిచేతనో వూరు పేరు లేనోడి చేత ఖర్మ చేయించడం ఏంటమ్మగోరూ. ఈడు, మీ రాముడు అయ్యగోరి ఖర్మను సేత్తాడమ్మగోరు. వాడే చెయ్యాల. అది వాడి దరమం" కన్నీటితో ఆవేశంగా చెప్పాడు సుబ్బిగాడు.


"అవును పెద్దమ్మగారూ నేను చేస్తాను" కళ్ళు పెద్దవి చేసి అన్నాడు రాముడు.


శ్యామలాదేవి గారు, రాఘవశాస్త్రిగారు ఆశ్చర్యపోయారు.


"అమ్మగారూ!... తమరి సందేహం తీరిందా. రాముడు కొడుకు స్థానంలో వుండి అయ్యగారి పితృఋణం తీర్చుకోబోతున్నాడు రాముడు. సుబ్బిగా.... అయ్యగారి క్రతువులు కాశీ క్షేత్రంలో జరపాలని అమ్మగారి నిర్ణయం. మీరేమంటారు?" చిరునవ్వుతో అడిగాడు శాస్త్రిగారు.


పెద్దమ్మగారి నిరనయమే మా నిరనయం" అన్నాడు సుబ్బిగాడు నవ్వుతూ.


శ్యామలాదేవి వదనంలో ఆనందం. కళ్ళు మూసుకొని చేతులు జోడించింది.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


45 views1 comment

1 Comment


mk kumar
mk kumar
Nov 30, 2024

"పితృఋణం" కథ నిజంగా సున్నితమైన భావోద్వేగాలు కలిగించే కుటుంబకథ. ఇందులో పితృఋణం అనే కర్తవ్య భావనను అద్భుతంగా ప్రతిపాదించారు. రచయిత సిహెచ్. సీఎస్. శర్మ గారు తన కథనం ద్వారా పాఠకులకు అనేక భావోద్వేగాలను వ్యక్తం చేయించారు.


ఈ కథలో రాముడు తన దత్తత తల్లిదండ్రుల పట్ల ప్రేమతో, తన బాధ్యతను తీసుకోవడం గొప్ప విషయాన్ని సూచిస్తుంది.


Like
bottom of page