top of page
Writer's picturePandranki Subramani

పిట్ట కథ

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.




Youtube Video link

'Pitta Katha' New Telugu Story

Written By Pandranki Subramani

రచన : పాండ్రంకి సుబ్రమణి


నేను కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుండి ఉద్యోగ విరమణ చేసినప్పుడు నా సహ పెన్షన్ ధారులకు నేనొకటి చెప్తుంటాను, దివ్య ధీమాగా-- “ఇక నుంచి మనం కాలమనే సుందర సామ్రాజ్యానికి రారాజులం. ఇకపైన మనం యెప్పుడైనా లేస్తాం. ఎప్పు డైనా ముస్తాబవుతాం. ఎక్కడికైనా వెళతాం. ఎంతసేపైనా పచార్లుస్తాం. కార్యాలయ హాజరు పుస్తకంలో మనల్ని సంతకం చేయమని అడిగే దమ్మూ యెవడికీ లేదు. అదే రీతిన మనం యెప్పుడైనా మన యిఛ్ఛానుసారం లేచి వాహ్యాళికి వెళతాం.

ఏం- మధ్యాహ్నం వెళతాం లేదా సాయంత్రమైనా వెళతాం. అదీ లేదా- టీవీ ప్రోగ్రాములు గట్రా చూసిన తరవాత అర్థరాత్రి తీరుబడిగా గాలివాటంగా నడక సాగిస్తాం. మనల్ని అడ్డుకునేవాడెవటంట? ఇకపైన స్వేఛ్ఛ మనకు స్వంతం. మనకు మాత్రమే స్వంతం. ఇంటి ముంగిట వాలే పెంపుడు పావురంలా నెలనెలా చేరే పెన్షన్ మన గతకాల సేవలకు గుర్తింపుగా వచ్చే కిరీటం...

“కాని- ఇక్కడే నేను కాస్తంత అధికంగా వాగానేమోనని తరవాత తట్టింది. తత్తరపాటు కలిగంది. ఎప్పు డైనా లేస్తాను- ఎప్పుడైనా వాకింగ్ చేస్తాను- ఎప్పుడైనా తింటాను- అన్న వాక్యాన్ని నా శరీర యాంత్రిక వ్యవస్థ లోపలనుంచి రహస్యంగా వినినట్లుంది. అది తిన్నగా మా ఫ్యామిలీ డాక్టరు వద్దకు మోసుకు వెళ్ళినట్లుంది.


“నీకు ఉద్యోగ బరువు బాధ్యతలనుండి స్వేఛ్ఛ లభించిందే గాని—ఆదినుండి అంతం వరకూ మునుపులాగే జీవన క్రమం పాటించాలయ్యా! ఉదయం ఒకసారి సాయంత్రం మరొకసారి నడక సాగించడం తప్పని సరి. ఎక్కడ బడితే అక్కడ కాదు. స్వఛ్ఛమైన గాలి ప్రవాహం ఉన్నచోట. అంతేకాదు— రుచిగా ఉంటే యెకబిగిన లాగించేయకుండా మితంగా భోజనం చేయడం- సమయానికి మరచిపోకుండా మందుబిళ్ళలు వేసుకోవడం తప్పని సరి.

అంతే కాదండోయ్. మూడు నెలలకొకసారి షుగర్ బిపీ చెక్ చేసుకోవడం అంతకంటే తప్పని సరి--”

దానితో ఉత్తుంగ తరంగ మంతటి నా ఉత్సాహానికి, స్వేఛ్ఛా ప్రియత్వానికి ఆనకట్ట పడింది. బ్రతుకు బాట బ్రైట్ గా సాగాలంటే వీటిని పాటించడం అనివార్మమేనేమో!

--------------------------------------------------------------------

నేను సాధారణంగా వ్యాయామం ఇంట్లోనే చేస్తాను. నడక కూడా ఇంటిముంగిట నిల్చునే చేస్తాను. డాక్టరుగారి సందేశంతో నేను నా వ్యాయామ క్రీడను మా గేటడ్ కమ్యూనిటీ పార్కులోకి మార్చాను.


నేనారోజు యధావిథిగా ఉదయాన ఇంట్లోగాని,యింటి చుట్టుప్రక్కల గాని కనపించక పోయేసరికి నా ఆత్మబంధులిద్దరూ కంగారుపడ్డారు. నాకోసం వెతక నారంభించారు. ఇంతకీ యెవరా ఇద్దరు ఆత్మ బంధువులు? ఇంకెవరు- నామనవడు- మనవరాలూనూ— నేనూహించినట్టే మరునాడు ఉదయం నా వెంటబడ్డారు యెంత వద్దని వారిస్తున్నా-- అప్పుడు వాళ్ళమ్మ వచ్చి ఇద్దర్నీ లాక్కుపోయింది హోమ్ వర్క్ పూర్తి చేయాలంటూ—


“అబ్బ! తప్పించుకున్నానురా దేవుడా! “అని మనసున నన్ను నేను సమాధాన పర్చుకుంటూ పార్కులో వ్యాయామం చేసి వచ్చాను. ఎందుకు దాచడం గాని, పార్కులో గాలి వీచికల మధ్య చెట్ల కదలికల మధ్య వ్యాయామం చేయడం వల్ల నాకు నిజంగానే మార్పు కనిపించింది. హాయి అనిపించింది. తాజాతనం సోకినట్లనిపించింది.

ఒక వారం రోజుల తరవాత నా ఆత్మబంధులిద్దరూ మరొకమారు నా వెంటబడ్డారు.

“మీరిద్దరూ హోమ్ వర్కు చేయాలర్రా! వెళ్ళండి వెళ్ళండి. మీ అమ్మ బెత్తం పట్టుకొస్తుంది”


దానికి మనవడూ మనవరాలూ ముక్త కంఠంతో బదులిచ్చారు- “అమ్మ రాదంటే రాదు తాతయ్యా! మేం రాత్రి అన్నాలు తిని హోమ్ వర్కు పూర్తి చేసేసాం కదా!”


ఇక వేరే దారిలేక వాళ్ల వెంట నడిచాను పార్కువేపు; ఆ పూటకు నా వ్యాయామ క్రీడకు “గోవిందా! ” అనుకుంటూ--- ఇక అన్నయ్యా చెల్లెలూ పార్కులో గిరగిర తిరుగుతూ యెగురుతూ ఆడుకుంటుంటే ఇక నా పని వాళ్ళ వెంటపడటం. వెతుకుతూ వాళ్ళను పట్టుకుని నా వద్దకు తీసుకు రావడం- నాకళ్ళ చూపునుండి తప్పిపోకుండా చూడటం. అదే కదా నేనిక చేయాల్సిన కార్యక్రమం--


కాని ఆశ్చర్యం—వాళ్ళలా పరుగు పందేలకు లంకించుకోలేదు. కంగారు పెట్టించలేదు. చేతులు చాచి వ్యాయామం చేయడానికి పూనుకుంటున్న ప్పుడు అన్నాచెల్లెళ్ళిద్దరూ నన్ను వ్యాయమం చేయకుండా ఆపి నన్ను ఓమూలకు లాక్కు వెళ్ళారు- “ ఉష్! సౌండివ్వకుండా విను తాతయ్యా! పిట్టలు కుహూ కుహూ అని అరుస్తు న్నాయి. వినిపిస్తుందా?”


”నేను చెవులు రిక్కించి విన్నాను. ఔను. పిట్టలు సన్నగా గొంతెత్తి అరుస్తున్నాయి. ఇందులో వింతేముంది? చెట్లుంటే. ఆ చెట్లపైన పిట్లలుంటే ఇటువంటి కుహూ కుహూలు వినిపిస్తూనే ఉంటాయి కదా! . పిట్టలకు అరవడం తప్ప వేరే పనేముంటుంది? అరవకపోతే— తిన్నది అరగొద్దూ! అదే మాట ఇద్దరికీ చెప్పాను.


దానికి మనవడు సర్రున లేచాడు. “మేటర్ అది కాదు తాతయ్యా! నువ్వు సరిగ్గా వినడం లేదు. ఈ చెట్టునుండి పిట్ట అరుస్తుంటే యెక్కడో మరొక చెట్టునుండి మరొక పిట్ట పాటందుకుంటుంది. ఆ తరవాత మరొక చెట్టునుండి మరొక పిట్ట పాటందుకుంటుంది. అదే విధంగా మరొక చెట్టునుండి పిట్ట అరిస్తే ఇక్కడున్న పిట్టలన్నీ సౌండిస్తున్నాయి. గమనించావా తాతయ్యా? ”


నేనీసారి సావధానంగా చెవులొగ్గి విన్నాను. అవన్నీ యేదో అంతర్గత అవగాహనతో ఆర్ద్రతతో స్పందిస్తున్నట్టు తోచింది నాకు. చలించడానికి స్పందించడానికి పిట్టకు మాత్రం మనసుండదా యేమిటి?


ఇక మరీ ఆలోచించడం యెందుకని సమాధానమిచ్చాను- “ఇందులో పెద్దగా ఊహించడాని కేముంది? వాటి భాషలో అవి పలకరించు కుంటున్నాయి”.


అప్పుడు మనవరాలు క్వరీ లేవదీసింది. “అదెలా తాతయ్యా! నీకు పిట్టభాష తెలీదుగా! ఒక వేళ అవి ఒకటినొకటి తిట్టుకుంటున్నాయేమో! ”


నేను కనుబొమలెగరేసి చూసాను. “పిట్టలెప్పుడూ తిట్టుకోవు. మనుషుల్లా అటాక్ చేసుకోవు. కుక్కల్లా కాట్లేసుకోవు. ప్రేమగా పరామర్శించుకుంటాయి. పిట్టల గురించి తప్పుతప్పుగా ఊహించుకోకూడదు. వాటికి ఫ్రెండ్లీ ఫీలింగ్ యెక్కువ-- ”


“అలాగయితే ఇప్పుడవి యెలా పలకరించుకుంటున్నాయి? ”

“ఇంకెలా-- మనలాగే! ఎలాగున్నావు? క్షేమమేనా అని మనషులు పలకరించుకోరూ- అలాగే అవి కూడానూ—


తిన్నావా మిత్రమా? పిల్లలు బాగున్నారు కదూ! అని పరామర్శించుకుంటాయి. అవి కోపంతో గాని ఉక్రోషంతో గాని తిట్టుకుంటే వాటి గొంతునుండి వచ్చే కూత అంత కమ్మగా మృదువుగా ఉంటాందా?”


ఈ వివరణతో అన్నాచెల్లెలూ ఊరుకున్నారు. నాకు తెలుసు, వాళ్ళంతటితో ఊరుకోరని-- నన్నిక వ్యాయామం చేసుకోనివ్వరని—

అప్పుడు మనవడు మరొక క్వరీ లేవదీసాడు. “పిట్టలకు ఆకలేస్తే యేమి చేస్తాయి తాతయ్యా! వాటి అమ్మ వద్దకు వెళతాయా? ”


“నో నో! మనలా ప్రతి దానికీ వాళ్ళమ్మ వద్దకు వెళ్ళవు. రెక్కలొచ్చిన వెంటనే ఆకాశ వీధుల్లోకి యెగిరి పోతాయి. ఎగురుతూ యెగురుతూ పైనుంచి విహంగ వీక్షణం చేస్తాయి. ఎక్కడెక్కడ పూదోటలు పండ్ల తోటలు కనిపిస్తాయో వాటిలోకి వాలి పోయి లేత చిగురాకుల్ని, మగ్గిపోయిన జామ కాయల్ని మాఁవిడి కాయల్ని మూతితో పొడిచి తింటాయి. వీలుంటే కొన్ని ముక్కల్ని రివ్వు రివ్వు యెగురుతూ గూటికి తీసుకెళతాయి”.

ఈ మాట విన్నంతనే నా మనవరాలు- అవ్వ- అని బుగ్గలు నొక్కుకుంది. ఏమిటన్నట్టు దాని ముఖంలోకి చూసాను.


“అదంతా గార్డనర్ చూస్తూ ఊరుకుంటాడా! కర్రతో కొట్టి తరిమేయడూ? వాటి రెక్కలు విరిగిపోవూ! మా స్కూలు తోటలోకి మేమెప్పుడైనా వెళితే కళ్ళు పెద్దవి చేసుకుని గుర్రుగా చూస్తాడు మాదయ్య. పువ్వుల్ని తాకకండి- మొక్కల్ని ముట్టుకోకండీ అని గట్టిగా గర్జిస్తాడు. నాకు చాలా కోపం వస్తుంది తాతాయ్యా! ”


“పక్షుల విషయంలో అలా జరగదే చిట్టీ! అసలు అవి తోటమాలి చేతికి చిక్కితేగా! రివ్వున యెగిరిపోయి మరొక తోటలోకి వెళ్లి పోతాయి— మీరు తరచూ చూసే విమానంలోని పైలట్ లా వాటికి లైసన్సా కావాలి? సర్వ స్వతంత్రంగా యెగురుతూ ఉంటాయి”


“చిలకలు ఇక్కణ్ణించి చిక్కడపల్లి వరకూ యెగర గలవా? ”

“చిక్కడి పల్లికేం కర్మ— తలచుకుంటే పొరుగు రాష్ట్రాలకు సహితం వెళ్ళగలవు”

”సింగపూర్ వెళ్ళగలవా! ”

“పక్షులకు మూడ్ కలగాలే గాని ఎక్కడికైనా వెళ్ళ గలవు. యూరప్ వరకు కూడా యెగిరిపోగలవు. సైబేరియా నుండి పక్షులు ఇండియా వరకూ రావడం లేదూ-- ”

“నిజంగా చాలా గ్రేట్ తాతయ్యా! పక్షులు ఆస్పత్రికి వెళ్ళాలంటే యెలా వెళతాయి? ”

“ఆస్పత్రికెందుకూ? “


“వాటికి కూడా జబ్బులొస్తాయి కదా తాతయ్యా! ”

“సాధారణంగా పిట్టలకు జబ్బులు రావే చిట్టీ! స్వఛ్ఛమైన గాలి పీలుస్తూ - పచ్చటి చిగురాకులు కొరుకుతూ తాజా పండ్లు తింటూ యెప్పుడూ రెక్కలు విదిలిస్తూ యాక్టివ్ గా ఉంటాయి. మరీ నిస్సత్తువుగా ఫీలయితే అవి కట్టుకున్నగూటిలో విశ్రాంతి తీసుకుంటాయి. శక్తిని పుంజుకుంటాయి. ఆ తరవాత కూడా యెగర లేకపోతే ఆకాశంలోకి చూస్తూ దైవ ప్రార్థన చేస్తాయి. దేవుడికి మొరపెట్టుకుంటాయి.


వాటికి ఆస్పత్రులు ఉండవు. వైద్యులుండరు. చిట్ట చివరిగా దేవుడి పాదాల వద్దకు చేరుకుంటాయి. ఇక మనం యింటికి వెళదాం. మీకు స్కూలు టైము అయిపోవస్తూంది”


“మరైతే తాతయ్యా—పెద్ద పక్షులు యెగురూ వచ్చి ఈ చిన్నపిట్టల్ని అటాక్ చేయవూ!”


నేను వెంటనే నోరు మెదప లేదు. ఎలా చెప్పి వివరిస్తే ఈ పిల్లల లేత మనసులు గాయపడకుండా ఉంటాయో ఆలోచించసాగాను. దాదాపు వ్యవహారం ఇక్కడి మనుష్యుల్లాగే— నోరున్న వాడు నోరులేని వాడి గొంతుని నొక్కేయడం లేదూ! కండ బలం ఉన్న వాడు శక్తి హీనుడి సామాను సరంగామాను దోచుకోవడం లేదూ! నోరున్నవాడు- కండబలం ఉన్నవాడు బలహీనుడి భూమీ పుట్రా యేదో ఒక నెపంతో లాక్కో వడం లేదూ!

పక్షి జాతిలో కూడా ఇదే తంతు మరి. రాబందులు, గ్రద్దలు- ఇతర రాక్షస పక్షులు నేల వరకూ వచ్చి గింజలు యేరుకుని తింటూన్న కోడి పెట్టల్ని అమాంతం పంజాల మధ్య బిగించి యెత్తుకు పోవడం లేదూ?


బలవంతుడు బలహీనుడి మధ్య ఈ పోరాటం అనాదిగా యెప్పుడూ ఉండేదేగా మరి. ఇక సముద్ర పక్షులైన సీ- గల్స్ గురించి చెప్తే వీళ్ళిద్దరూ జడుసు కున్నా జడుసుకుంటారు. ఈ సముద్ర పక్షులకి ఉక్రోషం యెక్కువ. ఎంతటి ఉక్రోషమంటే సీ- గల్స్ అప్పుడప్పుడు మూడ్ పాడయి నప్పుడు నావికుల్ని సారంగుల్ని సహితం అటాక్ చేస్తాయి. ఇవన్నీ చెప్పి ఈ ఇద్దరి చిట్టి బుర్రల్ని తికమక పెట్టకూడదని తలపోస్తూ-


”చిన్నపిట్టలు యెప్పుడూ ఉషారుగా బహు అలార్టుగా ఉంటాయర్రా! పెద్ద పక్షుల చూపులో పడనే పడవు. ఆద మరపున పెద్ద పక్షుల చూపులో పడ్డాయే అనుకో పచ్చటి పొదల్లోకి తుర్రుమంటాయి. ప్రాణ రక్షణ చేసుకుంటాయి, మనం కూడా ఇక్కడ అలానే ఉషారుగా ఉండాలి.


మీ పెన్నులు- జామిట్రీ బాక్సులూ- నోటు పుస్తకాలు బ్యాడ్ బాయ్స్ వచ్చి యెత్తుకు పోకుండా వేయికళ్ళతో మీరు కాపాడుకోవడం లేదూ! అలాగన్నమాట-- ”అని ఇద్దరి చేతుల్నీ అందుకుని పార్కు బైటకు నడిచాను.


చెట్ల సందుల్లోనుండి నాకింకా పక్షుల కుహూకుహూలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ నాతో బాటు నిశ్శబ్దంగా నడుస్తూన్న నా యిద్దరి ఆత్మబంధవుల మనసులో యెటువంటి ఆరాటం చెలరేగుతుందో ఊహించగలను.


“మాకు కూడా రెక్కలుంటే యెంత బాగుణ్ణు! మేం కూడా ఆకాశం లోకి యెగిరిపోయి ఆకాశ గోపురాలను తాకుతూ యెంచక్కా ఊరంతా చూసొస్తాం!”

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.



103 views0 comments

Commenti


bottom of page