top of page

పోగొట్టుకున్నది..!

Writer's picture: A . Annapurna A . Annapurna

#AAnnapurna, #Aఅన్నపూర్ణ, #Pogottukunnadi, #పోగొట్టుకున్నది, #తెలుగు కథ

వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (26/01/2025) ఎంపికైన కథ


Pogottukunnadi - New Telugu Story Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 26/01/2025

పోగొట్టుకున్నది - తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



''రేణూ! జరిగింది మర్చిపో. పెద్దాయన ఇక జీవించడు. రేపో మాపో. పోయేలోగా నిన్ను, అభిమన్యు ని చూడాలని అడుగుతున్నాడు. ఒకసారి వచ్చి చూడు '' అన్నాడు రంగనాథం- మదన్ మేనమామ. 


''అవునుతల్లి. వెళ్ళు. ఆఇంటితో మనుషులతో సంబంధం తెగిపోయింది. కానీ. , పెద్దాయన మాట గౌరవించు. ''

అన్నాడు రేణు తండ్రి గోపాలరావు. 


''సరే, మీరు చెబుతున్నారని వెడుతున్నాను నాన్నా'' అంటూ బయలుదేరింది. 


''సంతోషంతల్లి. అభీని తీసుకువచ్చినందుకు. ''అంటూ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేపర్ అభి చేతికి ఇచ్చారు. మనవడిని దగ్గిరకు హత్తుకుని ఆశీస్సులు కురిపించాడు. 

రేణుకి కొన్ని నగలు ఇవ్వబోతే ‘వద్దు అని వారించింది. ''కాదనకు, రేపు వచ్చే నీ కోడలికి నా తరపు కానుక'' అంటూ బలవంత పెట్టేడు. 


పట్టుచీర, పసుపు కుంకాలు వంటమనిషిచేత ఇప్పించాడు. 

రేణు వాటిని తీసుకుని వస్తూవుంటే ఎదురయ్యాడు మదన్. 

 రేణు మాటాడకుండా వెళ్లి కారులో కూర్చుంది. 

అభీకి ఒక్కక్షణమ్ ఏమిచేయాలో తోచక అక్కడే ఆగిపోయాడు. 


''బాగున్నావా.. అభీ?'' అని పలకరించాడు మదన్. 


పదేళ్ళతర్వాత చూస్తుంటే.. అతడిలో ఎదో అలజడి. 

తనకంటే ఎక్కువ ఎత్తుపెరిగిన కొడుకుని ఒకసారి దగ్గిరకు తీసుకోవాలని బలంగా అనిపించినా అందుకు

'నేను అర్హుడిని కాను.. ' అన్నట్టు సంశయంతో ఆగిపోయాడు.

 

అభీ మాటాడకుండా వెళ్లి అమ్మ పక్కనే కూర్చుని ''డ్రైవర్.. పోనీ'' అన్నాడు. అతడికి ఎలాంటి భావం తోచలేదు. 


ఇంటికి తిరిగి వచ్చాక, ''ఆ తాతగారు ఇచ్చారు..” అంటూ గోపాలరావు చేతికిచ్చాడు పేపర్లు. 


''ఎలావున్నారు? నిన్ను గుర్తుపట్టి మాటాడేరా?” అడిగాడు కవరు లోని పేపర్స్ తీసి చూస్తూ గోపాలరావు. 


''ఆ గుర్తుపట్టేరు. నాకు ఇది తీసుకోవాలో అక్కరలేదో తెలియదు. పెద్దాయన మాట వినాలని తీసుకున్నా”


''నిజమే. మంచిపని చేసావ్. ఆ స్థితిలో ఎదురు చెప్పకూడదు. రేపు వెళ్లి బ్యాంకు లాకర్లో పెడతాను.''

అంటూ భద్రం చేసాడు. 

రేణు తనకు సంబంధం లేనట్టు తన గదిలోకి వెళ్ళిపొయిన్ది! పెద్దవాడు అయిన కొడుకుని పలకరించని ‘ఆమనిషి’ పట్ల ఏహ్యభావం కలిగింది రేణుకి. 


ఈ వేళ కొత్త ఏముంది? మొదట మాత్రం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చేరదీసాడా? లేదు. దూరంగానే ఉంచాడు. అతగాడి తల్లి ఐతే అసలు పట్టించుకోలేదు. మనవడు అనే ప్రేమలేదు. ఉన్నంతలో తండ్రి నయం. ఇప్పుడు అవసాన దశలో ఐనా చూడాలని కబురు పెట్టేడు. ‘ఇది మీ నాన్నమ్మ కోరింది’ అంటూ ఆస్తిలో వాటా పంచాడు. అది నిజంకాదు. చనిపోయిన భార్యను చులకన చేయలేక అలా చెప్పేరు. అంతే!


అభీని వారించే హక్కు నాకు లేదు. వాళ్ళ వంశాంకురం వాడు. పుట్టుకతో వచ్చే హక్కులకు తలవంచక తప్పదు. అదీకాకుండా అభీ పెద్దవాడు అయ్యాడు. అన్నీ తెలుసు. మంచిగానే ఆలోచిస్తాడు. నాకు ఇష్టమైన దారిలో నేను ప్రయాణం కొనసాగిస్తాను. నాన్నగారి అండ ఉంది. 


''అనుకుంటూ తాను చేయవలసిన పనులమీద దృష్టి పెట్టింది. రోజులు హాపీగా గడిచిపోతున్నాయి. 


''అమ్మా! నీకు చెప్పకుండా ఒక పనిచేసాను..” రాత్రి రేణుతో డిన్నర్ చేస్తున్నప్పుడు చెప్పేడు అభీ. 


''ఏమిటది? ఫ్రెండ్స్తో పార్టీలో డ్రింక్ చేసేవా.. లేక ఎవరైనా గర్ల్ఫ్రెండ్ ని మీట్ అయ్యావా!” నవ్వుతూ అంది రేణు. 

 ''నో.. అమ్మా. ఇట్స్ సీరియస్. '' అన్నాడు.

 

 ''సో వాట్ ? '' అడిగింది రేణు. 


 ''నిన్న క్లాస్ లో ఉండగా హాస్పిటల్ నుంచి ఫోను కాల్ వచ్చింది. ఆయనకు యాంజియో చేశారట. చాలా 

 బాడ్ గా ఉందిట రిజల్ట్. నా ఫోటో, ఫోను నెంబర్ ఆయన దగ్గిర ఉంటే నర్సు కాల్ చేసింది. వెంటనే బై పాస్ 

 చేయాలని నన్ను పిలిచారు. 


లెక్చరర్ పర్మిషన్ తీసుకుని వెళ్లాను. రెండురోజుల్లో సర్జరీ చేస్తారుట. ఒంటరిగా వచ్చారు. ఫ్రెండ్ ఎవరూ లేరు. 

అందుకని ఫోను చేసినట్టు చెప్పేరు.

 

 వాళ్ళ మామయ్య రంగనాథం గారికి పెద్దవయసు. సిస్టర్ యూకే లో వుంది.. నువ్వు వారం రోజులు నాతో ఉండగలవా అని ఆయన అడిగితే కాదనలేక పోయాను. ''అంటూ చెప్పేడు. 


''మరి నీకు కాలేజీ.. ఎలా? తాతగారిని అడుగు. ''


''మా కాలెజ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ టూర్కి ప్లాన్ చేశారు. నేను వెళ్ళను. అది కలిసివస్తుంది. నీకు ఇష్టం ఐతేనే వెడతాను. వద్దు అంటే మానేసి ఎవరైనా మనిషిని కుదురుస్తాను'' అన్నాడు అభీ. 


ఎలా కాదనగలను? రేణు కి ఒక్క సారి భయం వేసింది. అభీని నా నుంచి దూరం చేస్తాడా? ఆయన ఏదైనా కుట్ర చేస్తున్నాడా? అని. 


గోపాలరావు గారితో చెప్పింది. 


''ఎవరూ లేరు. స్నేహితులు కూడా లేరేమో. అతగాడిని పరాయి మనిషిగా నువ్వు నేను అనుకోగలం. కానీ అబీని వెళ్ళవద్దు అనలేము. కష్టంలో ఎవరికో సహాయ పడుతున్నాడు.. అనుకో. వెళ్లనీ '' అన్నాడు గోపాలరావు. 


''మన అందరి మంచితనమే అలుసుగా అనుకోవచ్చుగా!”


''ఏదైనా అనుకోవచ్చు. మీ ఇద్దరు మధ్య భార్యా భర్తల సంబంధం తెగిపోయినా పెద్దాయన పిలిచి ఆస్తిలో వాటా ఇచ్చాడు. ఇంతకుముందు మనం ఒక్క రూపాయి తీసుకోలేదు. నాకు లోటు లేదు కనుక. నువ్వు వుద్యోగం చేశావ్ కనుక. అందుకే ఇచ్చారేమో.. లేనిపోనివి ఆలోచించకు. అభీ ఇష్టానికి వదిలేయ్ అంతే. '' అని చెప్పేడు గోపాలరావు. 


''ఆస్తి తీసుకోడం నాకు ఇష్టం లేదు. కానీ.. ఏమో రేపటిరోజు ఏమి అవసరం అవుతుందో.. అని ఊరుకున్నా. 

అభీ అమెరికా వెడతాను అన్నాడు ఒకసారి. అందుకే కాదనలేదు. ''


''అభీకి హక్కువుంది.. తీసుకోడానికి. మనం ఎవరం వద్దు అనడానికి. ఈ రోజుల్లో డబ్బు విలువ లేదు. రేపు అసలు ఉండదు. ఆస్తితో బాటు బాధ్యత కూడా పంచుకోవాలి. తప్పదు. '' అన్నాడు గోపాలరావు. 


ఆయనకూ ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. ఇంతవరకూ బాగానే గడిచింది. రేపు ఏమో ఎవరు చెప్పగలరు?


ఇక రేణు బాధ్యత -అభి దే. అనుకున్నాడు గోపాలరావు. 


మదన్ కి ఆపరేషన్ జరిగి ఇంటికి వెళ్ళేడు. ఇంటిదగ్గిర ఇద్దరు పనివాళ్లను కుదిర్చేడు అభీ. అవసరం అయితే

ఫోను చేయమని చెబుతూ ''ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్   వున్నాయి.. నేను అమెరికా వెళ్లే ప్రయత్నంలో వున్నాను.. ''. అని చెప్పేడు అభిమన్యు. 


''మంచిది అలాగే వెళ్ళు. నీ హెల్ప్ కి మెనీ మెనీ థాంక్స్.. అభి. '' అన్నాడు మదన్. 


అభీ వెళ్లిన తర్వాత ‘ఇక నిన్ను ఇబ్బంది పెట్టను. గాడ్ బ్లెస్స్ యు మై సన్'' అనుకున్నాడు మనస్ఫూర్తిగా. 


మూడు నెలలపాటు పరీక్షలు. అమెరికా ప్రయాణం ఏర్పాట్లు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉండగా గోపాలరావు గారు నిద్రలోనే కన్ను మూసారు. 


నేను అమెరికా వెడితే అమ్మ ఒంటరి అవుతుంది.. ఏమి చేయాలి? తాతగారు ఉన్నారనే ధైర్యం ఉండేది.. 


''ఈ స్థితిలో వెళ్ళలేను..” అంటుంటే అభీని “పర్వాలేదు. ఎప్పటికైనా ఒక్కదాన్ని ఉండాలి.. అలవాటుపడనీ. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. నా గురించి బాధవద్దు. రోజూ మాటాడుకోవచ్చు. '' అంటూ ప్రోత్సహించింది. 


అభి వెళ్ళిపోయాడు. ‘భవిష్యత్తు వాడిది. నేను అడ్డుపడకూడదు..’ అనుకున్నా చాలారోజులు బెంగపడింది. 


ఆ విషయం అభీకి తెలియకుండా ఫోనులో వీడియో కాల్ చేసినపుడు మానేజ్ చేసేది. ఇంట్లోనే నమ్మకమైన పనిమనిషి వున్నారు. ఆమె భర్త కారు డ్రైవర్. కనుక భయంలేదు. 


మదన్ చెల్లెలు అమెరికాలోవున్న రోహిణి అప్పుడప్పుడు మాటాడుతూ ఉంటుంది. అభీని అమెరికా పంపమని ప్రోత్సహించింది. పచ్చని కాపురాన్ని చేజేతులా పాడుచేసుకున్నావని అన్నను చీవాట్లు పెట్టేది. 


 చాలాకాలానికి ఇండియా వచ్చినపుడు, రేణునికూడా చూడాలని వచ్చింది. 


తండ్రి వున్నప్పుడు కబుర్లు తెలిసేవి. ఆయన పోయాక ఎలావున్నాడో అన్న అని చూడటానికి వచ్చింది. 

వరుసకు అన్న భార్య. కానీ, రేణు వయసే. అందువలన పేరుతోనే పిలుస్తుంది. 


''రేణూ! ఎలా వున్నావ్?” అంటూ హగ్ చేసుకుని పలకరించింది. 


''బాగానే వున్నాను. ఇన్నేళ్లకు వచ్చావు. అంత బిజీయా?” అంటూ ఆదరంగా మాటాడింది. 


''ఆ.. పిల్లలు, నా జాబ్.. వచ్చేపోయే బంధువులు.. ఏదో అలా గడిచిపోయాయి రోజులు. అభీని పెంచి పెద్దచేసి నీ బాధ్యత పూర్తిచేసావు. మీ ఫాదర్ కూడా పోయారు. ''అంటూ ఇద్దరూ కష్టం సుఖం మాటాడుకున్నారు. 


''తప్పదు కదా రోహిణి, ఆ టైముకి ధైర్యం అదే వస్తుంది. ''


''అన్న కి హార్ట్ ప్రాబ్లెమ్, అభి దగ్గిరుండి చూసుకోడం.. అన్నీ తెలిసాయి. అన్న చేసిన తప్పును క్షమించి

మానవత్వంతో అభిని సహాయానికి పంపడం నీ సంస్కారం. 


అప్పట్లో నేను చదువుకి అమెరికా వెళ్ళిపోయాను. అక్కడే అలెక్సీని కలవడం పెళ్లిచేసుకోడం, ఆ పెళ్లి నచ్చక అమ్మా-నాన్నా నాతో మాటాడటం మానేశారు. అమ్మ పోయినపుడు వద్దామని ఎంతో అనుకున్నాను. అలెక్సును చూడనని ఇంటికి రావద్దని చెప్పేరు- అన్న, నాన్న. అందుకే నేను రాలేదు. నాన్నగారు పోయారు. ఏమి సాధించారు? నన్ను దూరం పెట్టేరు. అప్పట్లో మదన్ ఏమి చేసినా కొడుకు అని ప్రేమతో భరించారు. 


రేణూ! అన్నయ్య ఇప్పుడు మారిపోయాడు. నాన్నగారి ఆసరా చూసుకుని, కళ్ళు మూసుకుపోయి మసులుకున్నాడు. ‘శిక్ష అనుభవిస్తున్నాను ఒంటరిగా మిగిలి’ అన్నాడు ''


''ఎందుకులే రోహిణీ ఇప్పుడు అవన్నీ.. నాకు తలచుకోడం అస్సలు ఇష్టంలేదు. '' అంది రేణు. 


''అవును. అంత పెద్ద తప్పు చేసినవాడిని ఎవరు క్షమించగలరు? ఇప్పుడు అనుకుని లాభం లేదు. కానీ.. రేణు, ఇప్పుడు నీకు - అన్నకు ఆసరా కావాలి. అభి ఇక వాడి లైఫ్ వాడు చూసుకోవడం సహజం. 


కనుక స్నేహితురాలిలా చెబుతున్నా.. అన్నను క్షమించి ఆసరా ఇవ్వు. '' అంది రేణు చేతులు పట్టుకుని రోహిణి.

 

''వద్దు రోహిణి. నాకు అంతటి గొప్ప హృదయం లేదు. అతడు చేసిన ద్రోహం నీకు తెలియదు. ''అంది రేణు. 


''నిజమే. ఒప్పుకుంటాను. నాకు తెలియదు. కానీ వూహించగలను. వాడు ఉమనైజర్. దానికి తోడు, కాలేజీ లెక్చరర్. ట్యూషన్ కి వచ్చే అమ్మాయిలు కూడా ఆ అవకాశం ఇచ్చారు. వాళ్లదీ తప్పేకదా. బుర్ర పెట్టి చదవడం

మానేసి.. లొంగిపోయి మార్కులు వేయిన్చుకోడం నీచం కాదా? నీకు ఆడపిల్ల ఉంటే అలాగే పంపగలవా? 

అలాంటి ఆలోచన వస్తే వూరుకుంటావా.. ! చెప్పు రేణూ. మగవాడికి ఒంటిమీద చేయి వేసే అవకాశం ఇవ్వ వచ్చా? ఈ కాలం పిల్లలు చాలా తెలివి గలవారు. అన్నీ తెలిసే తప్పు చేస్తే నింద మగవాడిమీదే వేయడం సరికాదు. 


రేణూ. మదన్ నాకు అన్నే అని అనడంలేదు. నువ్వు- నేను-ఇంకా ఎందరో చదువుకున్నాం.. ఉద్యోగాలు చేస్తున్నాం. అక్కడ ఫీల్డ్ లో మనకు ఎన్నో ప్రలోభాలు ఎదురు కాలేదా.. మనం విలువలు పోగొట్టుకున్నామా?

లేదు. 


ఇప్పుడే కాదు.. నువ్వు డైవోర్స్ తీసుకున్న నాడే మదన్ మారిపోయాడు. తప్పు తెలుసుకున్నాడు. కొంచెం అభిమాన పడుతున్నాడు. నిన్ను క్షమాపణ కోరుకోడానికి. 


ఆలోచించు రేణు. భర్తవుండి కొడుక్కి తండ్రిని లేకుండా చేయకు. అభీకోసం.. కలిసి ఉండండి. అభీ మీ ఇద్దరికీ కావాలి. అలాగే వాడికి అమ్మా-నాన్నా కావాలి. ఇన్నేళ్లవరకు ఇద్దరూ శిక్ష అనుభవించారు. 


అప్పుడు పెద్దవాళ్ళ ఆసరా వుంది. తెలియలేదు లోటు ఏమిటో. ఇప్పుడుకూడా విడిగా ఉండగలరు. పనివాళ్లను పెట్టుకోగలరు. కానీ ఒక బంధం ఆత్మీయత బాధ్యత వాళ్లకి ఉండదు. నీకు అన్న చేత సారీ చెప్పేస్తాను. నువ్వు ఏది చెబితే అదే జరుగుతుంది. నామాట మన్నించు. ''

అంటూ రోహిణి ప్రాధేయ పడుపడుతూ. 

“నేను ఇక వారం రోజుల్లో వెళ్ళిపోతాను. మీఇద్దరిని ఒకచోట చేర్చి.. వెళ్లాలని ఆశ. '' అంటూ ఇంటికి వెళ్లి పోయింది. 


ఇన్నేళ్లకు కఠినమైన శిలలాంటి రేణూ మనసు మెల్లగా కరుగుతోంది. రోహిణి చెప్పింది నిజమే! చిన్నప్పుడు ఆవేశం, కోపం, నిస్సహాయత.. ఒకలాంటి పొగరు.. జీవితాన్ని పాడుచేస్తాయి. ఎవరు చెప్పినా వినరు. 


మెల్లగా వయసు పరిపక్వత ఆలోచింపచేస్తుంది. ప్రతి మనిషి తప్పులు చేస్తారు. అది తప్పు అని తెలుసుకుని సరిదిద్దుకుని ఒకటి కావచ్చు. 


కానీ నాకు జరిగింది అవమానం కాదా.. ! దాన్ని ఎలా మర్చిపోవాలి? ఇప్పుడు ఆసరా అంటే డబ్బుతో వస్తుంది. ఆత్మీయత అలా తెచ్చుకోలేను అని ఆయన తెలుసుకున్నాడా.. ! 


మనసు అంటూ ఉంటే నా ఫోను కి ‘ఎలా వున్నారు ఇద్దరూ’ అని మెస్సేజ్లు పెట్టవచ్చు. ‘అబీని చూడాలని వుంది. ఫోటోపంపు..’ అనిఅడగొచ్చు. ఏది చేయలేదు. అతడిని ఎలా క్షమించాలి?


అయితే రోహిణితో అనేవాడుట. ‘రేణుకి అభిమానం ఎక్కువ. నన్ను మన్నించదు. మెస్సేజ్ పెడితే చూడదు. ఫోటోలు ఎందుకు పంపుతుంది. ?అబీని నేను చేరతీయలేదు. నేను చేసిన పెద్దతప్పు. చిన్నప్పుడు కూడా తమ్ముడిని, చెల్లిని వాళ్ళు వద్దు. ఎవరికైనా ఇచ్చేయ్.. అని ఏడిచేవాడినిట. నాకు ఎవరిని ప్రేమించడం తెలియదు. నా లాంటివాళ్లు ఎవరూ వుండరు..’ అని బాధపడేవాడట. 


అమ్మ బుద్ధులే వచ్చాయి.. అని నాన్న అనేవాడుట. ‘నా పుట్టుకే వింత. అని బాధపడుతున్నా..’ అనేవాడని రోహిణి రోజూ ఫోనులో మదన్ గురించి చెబుతోంది. 


అభీ రోజూ అమ్మతో పేస్ టైం లో మాటాడుతాడు. వెళ్ళినచోట ఎలావుందో వీడియో చూపిస్తాడు. 


“రోహిణత్త తో కూడా టచ్ లో వున్నా. అన్ని కబుర్లు చెబుతోంది..” అన్నాడు. 


''అభీ! ఇప్పుడు నువ్వు పెద్దవాడివి అయ్యావు కనుక ఒక స్నేహితుడిలా చెబుతున్నాను. రోహిణి అత్త

నా ముందు ఒక ప్రపోజల్ పెట్టింది..” అంటూ విషయం చెప్పి, “నువేమంటావ్?” అని అడిగింది. 


“నీ ఇష్టమే నా ఇష్టం ''. అన్నాడు అభిమన్యు. 


రోహిణి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయింది. మదన్ కి ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడింది. చెల్లితో సంతోషంగా గడిపాడు. ఇక వెళ్ళిపోతుంది.. అని దిగులు వేసింది. 


''రోహిణి.. నువ్వు వున్నంతకాలం టైము తెలియలేదు. హ్యాపీగా వున్నాను. రేపటినుంచి మళ్ళీ ఒంటరిని

అవుతాను. '' అన్నప్పుడు రోహిణి చెప్పింది. 

''నన్ను చూస్తే చాలు చెల్లి వద్దు, ఎవరికైనా ఇచ్చేయి అని ఏడిచేవాడివిట. అందుకే నీకు దూరంగా అమెరికా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇలా చూసి వెళ్ళిపోడం వరకే ! అవును. పోగొట్టుకున్నాకగాని విలువ తెలియదు'' అంది సరదాగా రోహిణి. 


 తర్వాత మెల్లగా చెప్పింది. ''ఒరే అన్నా.. నేనోమాట చెబుతాను. పోగొట్టుకున్నదాన్ని తిరిగి పొందవచ్చు.. 

ఆ అవకాశం నీకు కల్పిస్తాను. నేను చెప్పినట్టు వింటావా? ''


''అంటే?” అయోమయంగా చూసాడు. 


రేణుని కలుసుకోడం, మాటాడటం, మీ ఇద్దరూ కలుసుకోవాలని కోరడం అన్ని.. 


అంతదాకా చెల్లి పక్కనే సోఫాలో కూర్చుని వున్నా మదన్ లేచి బయటకు కిటికీలోంచి కనబడుతున్న దృశ్యాన్ని గమనించడం మొదలుపెట్టేడు. 


అక్కడ చెట్టు మీద ఒక పక్షి కూర్చుని వుంది. అంతలో మరో పక్షి వచ్చివాలగానే మొదటి  పక్షి కొద్దిగా దూరం జరిగింది. 

అతడికి రోహిణివైపు చూడటానికి ఇబ్బందిగా తోచి లేచివచ్చాడు. అక్కడి దృశ్యం అచ్చు తన పరిస్థితిలా అనిపించింది. 


''వింటున్నావా.. నువ్వు అభీ కోసం రేణు ని కలుసుకో. సారీ చెప్పి ఈ ఇంటికి తీసుకురా. ఇప్పటికి చాలా పోగొట్టు కున్నావ్. అభీ ముద్దుమురిపాలు చూడలేదు. రేణుకి అన్యాయం చేసావ్. ఆమెకి మగవాళ్ళంటే కలిగినది. ద్వేషంతో వాళ్ళ ఫాదర్ ఎంతగా నచ్చ చెప్పినా మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇదొక అవకాశం నీకు. ఇప్పుడే వెళ్ళు''. 


''రోహిణీ.. రేణు నన్ను రానిస్తుందా.. నాతో మాటాడుతుందా.. ఇంకేదైనా జరిగితే?'' అన్నాడు మదన్ తలవంచుకుని. 


''నేను వుంటానుగా. ఏమీ జరగదు. రేణూ అంత కఠినాత్మురాలు కాదు.. ఇప్పుడు వివేకంతో అభీ కోసం

ఏదైనా చేస్తుంది. నీకు తెలియదు. నాకు తెలుసు.. పద '' అంటూ తొందర చేసింది. 


వెడుతూనే రేణుకి మెస్సేజ్ పెట్టింది. నేను- అన్నయ్యా వస్తున్నాం. ఇంటిదగ్గిర ఉన్నావా.. అని. 


రేణు ''సరే !అని రిప్లై ఇచ్చింది. 


''అవును రేణు.. నువ్వు వొప్పుకుంటావు నాకుతెలుసు. '' మనసులో సంతోషంగా అనుకుంది. 


రాత్రి ఇంటికి రాగానే ''అభీ, మన పథకం ఫలించింది.. డోన్ట్ వర్రీ అబౌట్ మామ్'' అని చెప్పింది. 


మదన్ వుండే ఇంటిని డెకరేట్ చేసింది. పూలదండలు, రంగు దీపాల, పచ్చని మామిడాకుల తోరణాలు 

స్పెషల్ వంటకాలు, బెడ్ రూములో కొత్త ఫర్నిచర్ రెడీ చేసింది. 


''నాకు రాత్రికే ఫ్లైట్. ఇంకా చాలా టైము వుంది. నేను ఉండగానే ఈ ఇంటి ఇల్లాలు గృహప్రవేశం చేయాలని.. ఈ ఆడపడుచు విన్నపం.. అంటూ వెళ్లి తీసుకువచ్చింది.. రోహిణి. 


కొత్త అనుభూతులతో మదన్ ఇంట అడుగుపెట్టింది రేణు. 


********

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాగురించి పరిచయం. 

నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. 


చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే

వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


61 views5 comments

5 Comments


mk kumar
mk kumar
Jan 26

"పోగొట్టుకున్నది" కథ మానవ సంబంధాలు, అవగాహన, పశ్చాత్తాపం వంటి భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. కథలో రేణు, మదన్, అభిమన్యుల పాత్రల మధ్య చర్చలు, వారి మనసుల లోతులను పాఠకుడికి దగ్గరగా తీసుకొస్తాయి. రేణు గౌరవం, బాధ్యతలతో నిండిన తల్లి కాగా, మదన్ పశ్చాత్తాపంతో తన తప్పులను అంగీకరించే తండ్రిగా కనిపిస్తాడు. తల్లిదండ్రుల మధ్య ఉన్న విభేదాల మధ్య అభిమన్యు ఒడిదుడుకుల జీవితాన్ని అనుభవిస్తూ, వారికి మధ్య సమతౌల్యాన్ని తీసుకురావాలని ప్రయత్నించడం కథకు కీలక అంశంగా నిలుస్తుంది. కథలోని సంభాషణలు ప్రతి పాత్ర భావోద్వేగాలను స్పష్టంగా ప్రతిఫలించాయి. చివరికి, తప్పులను ఒప్పుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనే సందేశంతో కథ ముగుస్తుంది.


Like

చక్కగా రాశారు మేడమ్

Like
Replying to

Thanks Arunakumar!

Like

పోగొట్టుకున్నది: ఎ. అన్నపూర్ణ

Excellent


పోగొట్టుకున్న వారికే తెలుస్తుంది, లేని దాని విలువ. ఒక కథ ప్రాచుర్యం లో ఉన్నది. ఒక బాబు తన అమ్మను, ఊరికే ప్రతి నెలా, కొత్త బూట్లు కొనిమ్మని మారాము చేస్తుంటాడు. పాతవి నేను వేసుకోను అని. వారిది బీద - మధ్య తరగతి కుటుంబం.

అప్పుడు వాడి తల్లి, ఒక కాళ్ళు లేని బాలుడిని చూపించి, వాడికంటే నీవే నయం కదా అంటుంది. అప్పుడు ఆ బాబు పశ్చాత్తాపం తో మంచిగా మారి పోతాడు. పొదుపు నేర్చుకుంటాడు.


ఇంకో విషయం: కుటుంబం లో ఏదైనా లొసుగులు ఉంటే ... విభేదాలు ఉంటే ... వెంటనే ఫ్యామిలీ కౌన్సిలర్స్ ను కలవాలి తరచు. అయినా మార్పు, మానసిక శాంతి లేకుంటే దూరం దూరం గా సాయం చేసుకుంటూ ఉండటం మేలు. అలా కూడా పడకుంటే సైంటిఫిక్ scientific గా ఏర్పాటు చేసిన విడాకులు ఉన్నది కదా.

విడాకులు తీసుకోకుంటే ??? మానసిక శాంతి కరువయ్యి, కుటుంబ సభ్యుల ప్రగతి - ఆరోగ్యం - అభ్యుదయం దెబ్బ తింటుంది.

పి.వి. పద్మావతి మధు నివ్రితి

Like
Replying to

Thanks Padmavathi GARU, Me notitho naakadha vinodam baagundi. Dhanyavaadaalu.

Like
bottom of page