'Polamurlo Rayichettu' New Telugu Story
Written By Rathnakar Penumaka
'పొలమూర్లో రాయిచెట్టు' తెలుగు కథ
రచన: రత్నాకర్ పెనుమాక
‘‘నేడే చూడండి. మీ అభిమాన థియేటర్ అనపర్తి సూర్యశ్రీ మహల్‌లో ఆంధ్రుల అందాల నటుడు శోభన్‌బాబు, జయప్రద నటించిన స్వయంవరం. రోజుకు 4 ఆటలు’’ అంటా గూడు రిక్షాకి సినిమా పోస్టర్లు అంటించుకుని ఎల్తన్న రిక్షా లోంచి వినసొంపైన గొంతు.
అనౌన్స్‌మెంట్ అయిపోగానే ఆ సినిమాలోని పాటలు మైక్ సెట్ లోంచి మోగుతుంటే మా ఈడు పిల్లలందరికి సందడే సందడి.
ఆ రిక్షాతో పాటే గౌడ పేట, గొల్ల పుంత, జంగాల పేట, మహాలక్ష్మి నగర్, అనపర్తి సావరం, చాకలి పేట అన్ని పేటలు తిరిగి తిరిగి అలుపు సొలుపు తెలయకుండా ఇళ్ళకు చేరుకునీవోళ్ళం.
నాకు, నా స్నేహితుడు కడియాల చక్రవర్తి గాడికి ఆ ఎనౌన్స్‌మెంట్ రిక్షాతో తిరగటం చాలా పెద్ద సరదా. చక్రవర్తిని నేను చెక్రి అని పిలుస్తాను. సుశీల టీచర్ గారికి పిల్లలు పుట్టకపోతే ఆడిని యానాం ఆర్‌సిఎం చర్చి ఫాదర్ జార్జి కురియన్ గారి ద్వారా అమ్మ గార్ల ఆశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకుంటున్నారట. అందుకని అందరూ ఆడిని దత్తుడు అంటారు.
మాది యానాం దాటాక ముమ్మిడివరం ఎళ్తంటే తగిలే మురమళ్ళ నించి కుడివైపు వెళ్తే తగిలే పశువుల్లంక. ఇది మా అమ్మమ్మ గారి ఊరు. పేరు చినపొలమూరు.
ఈ ఊరిలో నాకున్న చాలామంది స్నేహితుల్లోకి అందరికంటే నాతో సన్నిహితంగా ఉండేది ఈడే. ఎందుకంటే మా అమ్మమ్మ వోళ్ళుండేది ఈళ్ళింటిపక్కనే.
అందులోను గోళీలాటలోను, గూటిబిళ్ళాటలోను, బచ్చాలాటలోను ఈడు పెద్ద నేషనల్ ప్లేయర్‌లాంటోడు. నాకు ఈ ఆటలేవి అస్సలు రావు. ఈ ఆటలు మాటెలావున్నా బొంగరాలాటలో ఈడిని మించినోడు లేడు. బొంగరం నేల మీదే కాదు, అరిచేతిలోను, భుజం మీద కూడా తిప్పుతాడు. ఆ విన్యాసాలకే ఈడు నాకొక వ్యసనమైపోయాడు.
మొదట్లో అమ్మమ్మ కోసమే ఈ ఊరొచ్చే నేను రాను రాను ఈడి కోసమే వచ్చేంతలా అయిపోయాను. అదీ మరి ఈడి ఆకర్షణ.
ఈడికి నేనంటే చాలా ఇష్టం. ఈడికంటే ఈళ్ళమ్మగారు సుశీల టీచర్ గారికి నేనంటే చాలా చాలా ఇష్టం. నేను ఈ ఊరొస్తే టీచర్ గారింట్లో భోజనం చెయ్యకుండా ఎప్పుడూ మా ఊరెళ్ళలేదు.
ఆవిడ వంటలు భలే రుచిగా చేస్తారు. ముఖ్యంగా ఆవిడ చేసే వేట మాంసం, కొబ్బరి కూర ఇంతకంటే మరే కూరా అంత రుచిగా ఉండదేమో అనిపించేది. నేను వెళితే నాకిష్టమని ఆ కూర ఖచ్చితంగా వొండి నాకు భోజనం పెట్టేవోరు. నేను బాగానే తింటాను. అందులోను చాలా చాలా ఇష్టమైన కూరేమో కడుపు నిండా, మరుసటి రోజుకు కూడా ఆకలేయనంతగా తినేవోణ్ణి.
చెక్రి గాడిది మాత్రం పిట్ట మేతే. ఆడేది అంత ఇష్టంగా తినడు. ఆడికి తిండి కంటే ఆటలంటేనే పిచ్చి. అలా అని చదువుల్లో ఏమీ వెనుకబడీవోడు కాదు, ఆ మాటకొస్తే నేనే మొద్దుని, ఆడెప్పుడు క్లాస్ ఫస్టే! అలాగని పుస్తకాలు ముందేసుకుని గణగణమంటూ చదివీవోడు కాదు. క్లాసులో ఇనడమే. ఇంటికొచ్చాక పుస్తకాలు అంటరానియ్యే ఆడికి! నాకలా కాదు క్లాసులో ఇన్నా ఇంటికొచ్చి బట్టీ పడితే, కుస్తీ పడితే ఏదో అత్తెసరు మార్కులొచ్చియ్యి.
ఏ సెలవులొచ్చినా నేను పొలమూరు వొచ్చీవోడిని ఆడికోసం. పాపం! ఆడు మాత్రం నాకోసం సెలవుల్లో కూడా ఏ ఊరు ఎళ్ళీవోడు కాదు. నాకెప్పుడు సెలవులిస్తారా, ఎప్పుడు పొలమూరు పరిగెడదామా, చెక్రిగాడితో బలాదూర్ తిరుగుదామా అని రోజులు లెక్కెట్టుకునీవోడిని.
ముఖ్యంగా వైశాఖ మాసంలో అమావాస్య ముందొచ్చే మాచరమ్మ తీర్ధానికి అస్సలు మిస్సయ్యీవోణ్ణి కాదు. పొలమూరు గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ మాచరమ్మ వారి తీర్ధం భలే బాగా జరుగుద్ది. ఆ రోజుల్లో పొలమూరులో ఏ ఇంట్లో చూసినా పండగ వాతావరణమే.
అలాంటిది చెక్రి ఆళ్ళింట్లో అయితే ఏ పండగైనా ముందు ఆళ్ళని పలకరించాకే మిగిలినోళ్ళ ఇంటికెళ్ళీది. ఆ మూడు రోజులు చెక్రిగాడి ఇంటి ముందున్న రాయిచెట్టు చుట్టూ ఉన్న చప్టా మీద రకరకాల ఆటలు పెట్టీవోరు. ఆట వస్తువులు అమ్మీవోరు. గుండాట లాంటి ఆటలు మేమాడీవోళ్ళం కాదు గానీ ఎవరెవరో ఆడుతుంటే చూసి కేరింతలు కొట్టీవోళ్ళం. ఆ మూడు రోజులు ఊళ్ళో రాత్రే ఉండీది కాదు.
ఆ రోజుల్లో టీచర్ గారు చేసీ లచ్చించారు రుచి మాటల్లో చెప్పలేమంటే నమ్మండి. అది తయారు చేసీ పద్దతి భలే గమ్మత్తుగా ఉంటది. ఈ చారు కాసుకునే ఆనవాయం కొన్ని కుటుంబాల్లో ఉండదు. ఆనవాయం ఉన్న కుటుంబాల్లో మాత్రం లచ్చించారు కాసుకునే మట్టి కుండని లక్ష్మిదేవి అనుకుంటారు. కొత్తింట్లోకి ఎళ్ళినపుడు ఖచ్చితంగా ఈ కుండకి పసుపు రాసి కుంకుం బొట్లు పెట్టి వంట గదిలో ఈశాన్యం మూల ఉట్టి కట్టి ఉంచుతారు. ఈ కుండ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మిదేవి ఉంటదని నమ్మకం.
ప్రతీరోజు అన్నం వొండీ ముందు బియ్యం రెండోసారి కడిగిన కడుగుని, ఈ కుండలో పోత్తారు. అన్నం ఆర్చాక వొచ్చీ గెంజిని కూడా పోత్తారు. అలా తీసిన కడుగు, గంజి నీటిని ఓ వారం రోజులు తీసాక, ఏరోజుకారోజు పైకి తేలిన పల్చటి నీళ్ళు పారబోసేసి, చివరికి మిగిలిన చిక్కటి నీళ్ళు ఓ గిన్నెలో పోసి పుల్లల పొయ్యి మీద సన్నటి మంట మీద మరగెట్టి దాంట్లో పసుపు, కారం ఏసి పొడుగ్గా చీరిన పచ్చిమిరగాయలు, ఉల్లిపాయలు పాయలుజానే ఏసి ఆ తర్వాత పెద్దగా కోసిన బెండకాయ ముక్కలు, టమాటాలు, వంకాయలు ఏసి బాగా మరిగాక, కొత్తిమీర ఏసి మరిగించి చివరిగా కళ్ళుప్పు ఏసి మరిగాక దించేసి వేడివేడిగా అన్నం, రొయ్య వేపుడుతో తింటే ఆ రుచి ముందు ఏ స్టార్ హోటల్ వంటకం సరిపోదు. మరి ఆ రుచి ఆ వంటదో లేక అది చేసిన ఆవిడదో చెప్పటం కష్టమే!
నీళ్ళు, నూని, మసాలాలు వాడని ఈ వంటకం అమోఘం, అద్భుతం. ఇది మా గోదారోళ్ళ సాంప్రదాయ వొంటకం కావటం మా అదృష్టం.
ఏ పండగొచ్చినా టీచర్ గారు ఆళ్ళింటికే పరిమితం చేసీవోరు కాదు. ఆ పండగ, ఆళ్ళింటి ఎనకాలుండే బుడగ జంగాల పేటలో ఉండీవోళ్ళందరికి ఆ లచ్చించారు తలాకాత ఏసిచ్చీవోరు. ఆవిడ మనసే కాదు చెయ్యీ పెద్దదే. ఏ పండగైనా ఆ సందడి పతీ పేదోడిరట్లో కనిపించాలని ఆవిడ ఆశపడీవోరు.
టీచర్ గారింటి ముందు ఒక పెద్ద రాయిచెట్టు ఉంది. దాని చుట్టూ చప్టా కట్టించారావిడ. ఆ ఊరు పెద్దలు ఏదైనా సభా సమావేశాలు చేసుకోవాలన్న అక్కడే చేసుకునీవోరు. అది ఊరుమ్మడి ఆస్థి కాకపోయినా టీచర్ గారి సొంతతలమైనా ఆవిడ పెద్ద మనస్సు వల్ల అది అందరి ఉమ్మడాస్థిలా మారిపోయింది.
రోజు తెల్లారకుండానే రాయిచెట్టు చుట్టూ ఊడ్చింతర్వాతే ఇంటి పనులు మొదలెట్టీవోరు. ఊళ్ళోకి ఎవరైనా దొమ్మర్లు, మాటిస్టులాంటోళ్ళెవరొచ్చినా ఆ రాయిచెట్టు కిందే మకాం. ఆళ్ళున్నన్ని రోజులు ఊళ్ళో ఆళ్ళకి ఎవరు తిండెట్టకపోయిన టీచర్ గారే వొండి పెట్టీవోరు. పాత బట్టలు కూడా ఇచ్చీవోరు. ఇలా పేదలనే మాటింటే, పూనకం వచ్చేత్తాదావిడికి! చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేసీది. ఆవిడ ఈ ఊరికి సుశీల పేరుతో ఉన్న కాశీ అన్నపూర్ణమ్మ.
ఉగాదికి పంపమని అమ్మమ్మ కబురంపితే నాన్న నన్ను చేతక్ బండెక్కించుకుని తీసుకొచ్చి అప్పగించెళ్ళాడు. నేనొచ్చానని తెలియగానే చెక్రి గాడు పరిగెత్తుకొచ్చాడు. ఇద్దరం మేమెప్పుడు ఆడుకునే రాయిచెట్టు దగ్గరికెళ్ళాం. అప్పుడికే టీచర్ గారు చాలా హడావిడిగా ఉన్నారు. ఎందుకంటే తెల్లారితే ఉగాది. అంటే టీచర్ గారి చేతి పచ్చడి రుచి చూసీరోజు! కాదు కాదు ఆ పచ్చడి గిన్నె నిండా ఏయించుకుని కడుపునిండా తిని ఆ రుచిని చాలా రోజులు నెమరేసుకునీ రోజు!
ఆవిడ మమ్మల్ని పిలిచి ‘‘ఒరేయ్ చెక్రి! పెరట్లో ఏపచెట్టెక్కి పూత కొయ్యాలి, మామిడి చెట్టెక్కి కాయలు కొయ్యాలి, బజారుకెళ్ళి సామాన్లు తేవాలి’’ అంటా పురమాయించారు. ఆవిడేపని చెప్పినా అందులో బోల్డు సందడుంటాది.
నేను కిందనించుంటే చెక్రి గాడు కోతిలా ఏపచెట్టెక్కి పూత కోసి ఇసురుతుంటే నేను ఏరాను. అదంతా ఒక చోట సర్దాక చెక్రి గాడు మావిడి చెట్టెక్కి ఒక డజను కాయలు కోసి కిందికి ఇసురుతుంటే ఆటిని ఏరి పళ్ళెంలో పెట్టి టీచర్ గారికిచ్చాను. ఆ తరువాత బజారు నుంచి ఏమేమి కొనుక్కురావాలో చీటి రాసిచ్చి మా ఇద్దరికి ఎయ్యి రూపాయిలిచ్చి పంపేరు టీచర్ గారు. సుబ్బారాయుడు గుడి పక్కనుండే కాపగంటి ఉమాపతి కొట్టుకెళ్ళి ఆ సామాన్లన్నీ తెచ్చాం.
నేనింతక ముందు చెప్పినట్టు అందరికి ఉగాది రేపొత్తే ఈళ్ళింట్లో మాత్రం ఈరోజే వొచ్చీసింది. రాత్రి ఇంటెనకాల ఉన్న బుడగ జంగాల పేట నుంచి అమ్మలక్కలు, ఆడపిల్లలు ఓ పది మంది దాకా వొచ్చి ఆ సాయంత్రం చెక్రి నేను కోసిన ఏప పువ్వును శుభ్రం చేత్తన్నారు. అక్కడంత మంది పని చేస్తంటే నోర్మూసుకుని చేత్తారా? రాయిచెట్టు మొదట్లో అందరూ కూర్చుని ఎటకారాలాడుకుంటా సందడి సందడిగా ఉగాది పచ్చడికి కావలసిన ఏప పువ్వు, మావిడి కాయలు, చెరుకు ముక్కలు, ఏపిన సెనగపప్పు, ఖజ్జూరాలు, అరటి పళ్ళు సిద్దం చేత్తా కబుర్లాడుకుంటంటే ఎంత సందడిగా ఉందో!
ఆ పొద్దుట తల స్నానాలు చేసేసి గిన్నెలట్టుకుని టీచర్ గారింటికి లైన్ కట్టేరు. ఆవిడ ఈళ్ళందరి కోసం పెద్ద బానలో పచ్చడి కలిపి అందరికి పంచిపెట్టి తృప్తి పడ్డారు. తీర్ధాల్లో బూరలు, బుడగలు అమ్మే ముత్యాలు మర్చిపోయి పచ్చడట్టుకెళ్ళకపోతే ఆవిడే గిన్నితో పట్టుకెళ్ళిచ్చారు.
ఆ రోజు ఆ ఇంట్లో నాకు తెలియని ఒక అమ్మాయి కనిపించింది. నేనున్న మూడు రోజులు అంటే ఉగాది ముందు రోజు, ఉగాది రోజు, ఆ తరువాత రోజు కూడా ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఆ పిల్లెవరని చెక్రినడిగితే చెప్పేడు. ఆ అమ్మాయి టీచర్ గారి స్కూలు ముందుండే సలాది రామ్మూర్తి గారి అమ్మాయట. ఆ పిల్లకిపుడు ‘‘ఆ మూడు రోజులంట’’ అందుకని ఆ అమ్మాయిని ఆళ్ళింట్లో వరండాలో పడుకోబెట్టారంట. ఆ పిల్లకి జొరమొచ్చి వొణికిపోతంటే ఆళ్ళు పట్టించుకోకుండా ‘‘మైలు’’ అంటా వరండాలోనే ఉంచేరంట. అది తెలిసిన టీచర్ గారు ఆళ్ళతో దెబ్బలాడి ‘‘ఈ మూడు రోజులు నా ఇంట్లో ఉంటదిలే’’ అని తీసుకొచ్చారట!
నిజానికి టీచర్ గారికి చాలా నిష్ఠ, శుచి, శుభ్రం అన్నీ ఎక్కువే అలా అని అయ్యేమి ఆవిడ మానవత్వం ముందు నిలబడవు. అందుకే ఉగాది లాంటి రోజు కూడా ఆ స్థితిలో ఉన్న అమ్మాయిని ఆళ్ళింట్లో ఉంచుకోవడం మామూలు ఇషయం కాదు కదా?! అలా అని ఆ పిల్లనేమి ఏరే గదిలో ఎట్టలేదు. ఆవిడ పక్కనే ఆవిడ మంచం మీదే ఆ అమ్మాయి పడక.
ఎప్పుడిలాగే ఆ రాత్రి కూడా టీచర్ గారు నన్ను, చెక్రి గాణ్ణి రాయి చెట్టు దగ్గర కూర్చోబెట్టి కథలు చెప్పేరు. ఆ రాత్రి మాతో పాటు ఆ అమ్మాయి కూడా చేరింది. ఆవిడ కథ చెబుతుంటే నా మెదడులో ఇప్పటిదాకా ఎప్పుడూ కలగని ఒక అనుమానం పురుడోసుకుంది. ఆ అనుమానం తీర్చుకోడానికి ఆ రాత్రంతా ఆగాల్సొచ్చింది నాకు! ఆ రాత్రి నేను, చెక్రి రాయిచెట్టు కిందే పట్టి మంచమేసుకుని పడుకున్నాం.
ఆ పొద్దుట అమ్మమ్మ దగ్గరికెళ్ళాక ఆగలేక అమ్మమ్మని అడిగేసేను. టీచర్ గారి వాళ్ళాయన ‘‘ఎక్కడున్నారు అని’’. దానికి అమ్మమ్మ చెప్పింది ‘‘చిన్నా! అసలు టీచర్ గారికి పెళ్ళే కాలేదు. ఆవిడని ఒకడు ప్రేమించానని మోసం చేస్తే ఇక పెళ్ళి మీద విరక్తొచ్చి అలా ఉండిపోయింది పాపం. చాలా మంచావిడ. ఆ ఎధవ ఆవిడ జీవితంతో అలా ఆడుకున్నాడు’’ అని చెప్పింది. అది తెలిసాక టీచర్ గారి మీద గౌరవం మరింత పెరిగింది నాకు.
నాకిప్పుడిప్పుడే నూనూగు మీసాలొత్తన్నాయి. నేను టీనేజ్‌లోకడుగెట్టి నాలుగేళ్ళయింది. ఉప్పుడు నాలో ఆటలతో పాటు ఏరే ఏరే ఇసయాలు ముఖ్యమోతన్నాయ్. అందులో ముఖ్యంగా ఆడపిల్లల మీద ఇష్టం. బహుశా! నా వొయస్సులో అందరికి ఇలాగే ఉంటదేమో.
పతీ సంవత్సరం అట్లతద్దికి నేను పొలమూరు ఎళ్ళేవోడిని. అమ్మమ్మతో పాటు అట్లు తినడానికి. కాని ఈసారి ఎళ్తున్నది మాత్రం అట్లు తినడానికి మాత్రమే కాదు, అట్లు పోసే అమ్మాయిల్ని చూడడానికి కూడా! ఈ ఇసయం నాకు తప్ప ఎవ్వరికి తెలియదు పాపం.
పతీ ఏడు అట్లతద్దికి రాయిచెట్టుకి అమ్మాయిలు ఊయలలేసి ఊగుతుంటే నేను కూడా పోటీ పడీవోణ్ణి. కానీ ఈసారి ఊగటానికి కాదు, ఊగేవోళ్ళను చూడ్డానికి. నాతో పాటు చెక్రి గాడు కూడా అదే పనిలో ఉన్నాడు.
ఆ రోజు అట్లతద్ది. అమ్మాయిలందరు మిగిలిన రోజుల్లో చుడీదార్‌లు, మిడ్డీలు ఏసుకునీ వోళ్ళంతా లంగా వోణీలు కట్టుకుని కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ముస్తాబై రాయిచెట్టు దగ్గర ఊయలలూగుతుంటే, ఆళ్ళ అందచందాల్నీ కళ్ళతో తినేత్తన్న, ఆళ్ళు ఓరగా చూత్తా, సిగ్గుపడతంటే, మనసులో ఎప్పుడూ లేని ఓ గుబులు!
ఇంతమంది అమ్మాయిలలో ఒకమ్మాయి నన్నే చూత్తా తన ఇష్టాన్ని చెప్పకనే చెబుతుంటే దాన్ని నేను గమనించకపోయే సరికి ఇలాంటి ఇసయాల్లో కూడా నాకంటే చురుగ్గా ఆలోచించీ చెక్రి గాడు చెప్పాడు, ‘‘ఒరేయ్ కళ్యాణ్! ఆ అమ్మాయి గుర్తుందా? అదేరా ఉగాదికి మనింట్లో ఉంది కదా! అదేరా నందన!
తనకి నువ్వంటే ఇష్టమనుకుంటా, నిన్నే చూత్తంది’’, అంటంటే నా గుండెల్లో ఎప్పుడూ కలగని గిలిగింత. అది కలిగించిన హాయిని అనుభవిస్తేనే తెలుత్తాది.
ఆ హాయిని సొంతం చేసుకోవాలని నేను ఆ అమ్మాయితో మాట్లాడబోతె బెదిరిపోయి పారిపోయింది. ఒక్కసారిగా నీరుగారిపోయేను.
కానీ మర్నాడు కూడా రాయిచెట్టు దగ్గరకొచ్చింది. ఈ రోజు నిన్నటి లాగా బెదిరిపోలేదు. తనే ధైర్యంగా మాట్లాడిరది నా దగ్గరకొచ్చి,
‘‘నీ పేరేంటి?’’ అనడిగింది.
ఇప్పుడు భయపడడం నావొంతైంది. ఏదో తెలీని భయం, బెరుకు ముచ్చెమటలు పట్టేత్తున్నాయ్. అలాగే చెప్పేను ‘‘కళ్యాణ్’’ అని.
‘‘నా పేరు.. ’’ అని తను చెప్పబోతుండగా అన్నాను ‘‘నాకు తెలుసు నందన కదా?’’.
"ఓ చెక్రి చెప్పాడా?’’
‘‘ఇంకెన్ని రోజులుంటావ్?’’
‘‘రేపు ఎళ్ళిపోతన్నాను. ’’
‘‘అయ్యో రేపే?’’
‘‘అవును’’.
‘‘ఐతే ఎళ్ళే ముందు కనిపిస్తావా?’’ అనడిగింది.
‘‘సరే రేపు మీ ఇంటి ముందు నించే ఎళ్తాను’’ అన్నాను.
‘‘సరే వెళ్తాను’’ అంటూ ఎళ్ళిపోయింది. పోతాపోతా నా చిన్ని మనస్సుని పట్టుకుపోయింది.
నాకు సినిమాల్లో చూసిన ప్రేమ మాత్రమే తెలుసు, దీన్నేమంటారో తెలీదు, కానీ ఆ అమ్మాయితో మాట్టాట్టం చాలా హాయిగా ఉంది. తనని చూస్తూ ఉండాలనిపిత్తంది.
ఇప్పుడు నా ప్రయారిటీస్‌కి సఫిక్స్‌లొత్తన్నాయి. ఇప్పుడివరకూ ఈ ఊరొచ్చేది అమ్మమ్మ కోసం, చెక్రి కోసం. కానీ ఇక నుంచి ఈ అమ్మాయి కోసం కూడ!
మరుసటి రోజు సాయంత్రం సరిగ్గా నందన తన పొడుగు లంగా దోపుకుని వాకిలూడ్చి, కళ్ళాపి చల్లే టైముకి చెక్రి నేను నడుచుకుంటూ ఆళ్ళింటి ముందు స్కూలు దగ్గర నించుని కబుర్లాడుకుంటా తనని గమనిత్తుంటే తనకర్ధమైంది. నేను ఊరెళ్తున్నానని, చేతిలో చెంబట్టుకుని ఎవరూ చూడకుండా ఎళ్ళి రమ్మంటా కళ్ళతోను, చేతుల తోను మౌనంగా నాకు టాటా చెప్పింది.
ఆ సైగ, ఆ క్షణం తన కళ్ళల్లో కనిపించిన ఆ భావన నేను మళ్ళీ ఇక్కడికొచ్చీ దాకా గుర్తుండిపోయింది నాకు!
ఈమధ్య నేనిక్కడికి తరుచుగా వత్తన్నాను ఏదో వంకతో. ఎందుకొత్తాననేది నాకు, నందనకి, చెక్రికి బాగా తెలుసు. నందనకి ఆ మూడు రోజుల సందర్భం వొత్తే నేనారోజుల్లో ఇక్కడే ఉంటన్నాను. తను ఇక్కడే ఉంటంది. టీచర్ గారికి నామీద కానీ, చెక్రి మీద కానీ, నందన మీద కానీ అనుమానమే లేదు. ఆవిడకి అనుమానం వచ్చీలా మేము నడుచుకునీవోళ్ళం కాదు.
వేసవి సెలవులొచ్చాయి. నాకిక పండగే పండగ. సెలవులివ్వగానే పరిగెత్తాను అమ్మమ్మ ఇంటికి. సెలవులు అన్ని రోజులు ఎండాకొండా లేకండా తిరుగుతున్నాము. సాయంత్రం చెక్రి, నేను కాటంశెట్టి తారకం గారి మామిడి తోటకెళ్ళి పంపు షెడ్డు కాడ తనివి తీరా స్నానం చేసి తోటలో పలకమారిన బంగినపల్లి మామిడి, ఊళ్ళో ఎవరి తోటలోను లేని కొబ్బరి మావిడి కాయలు కోసుకుని ఇంటికొచ్చి రావి చెట్టు కింద పట్టి మంచమేసుకుని కోసుకొచ్చిన దొంగ మావిళ్ళు ఉప్పు, కారమెట్టుకుని తింటంటే అబ్బా.. ! ఎంత బాగుందో!
అప్పుడప్పుడు స్కూల్ గ్రౌండ్‌లో వాలీబాల్‌కెళ్తా కోసుకొచ్చిన దొంగ మావిళ్ళు నందనకిచ్చి సంబరపడీవోణ్ణి. ఇంతకీ మావిళ్ళ కోసం చెట్టెక్కటం, కొయ్యటం ఆటిని జాగ్రత్తగా కిందికి పట్టుకురావటం అంతా చెక్రి గాడి పనే. నా పనేంటంటే చెట్టు కిందుండి ఎవరైనా వస్తున్న అలికిడయితే ఆడికి చెప్పటం మాత్రమే. అలా అని ఆడు ఆ మామిడికాయలైనా ఇష్టంగా తింటాడా అంటే అదీ లేదు. ఆడికి ఆటిని కొయ్యటం, నాకియ్యిటం, నాద్వారా నందనకిప్పించటం, నేను లొట్టలేసుకుంటా తింటంటే చూడటం మాత్రమే ఇష్టం.
సాయంత్రం వాలీబాల్ ఆడీవోళ్ళం. అన్ని ఆటలు మాదిరిగా ఇందులోను ఆడే లీడర్. నాకస్సలు ఆటలే రావు. పతీ ఆటలోను ఆడికి నేనుండాలి. అప్పుడే ఆ ఆటలో ఆడికి మజా.
వాలీబాల్ ఆడీటప్పుడు నేను సరిగా ఆడక పాయింట్స్ పోగొడుతంటే, మిగిలిన ఆటగాళ్ళు నన్ను తిడతంటే ఆడు నన్నేమి అననిచ్చీవోడు కాదు. అలా అని నాక్కోపం వచ్చి నేనాడనంటే ఊరుకునీవోడు కాదు.
వాలీబాల్ ఆడేసి ఇంటికొచ్చి తానాలు చేసి రాయిచెట్టు కిందికి చేరిపోయీవోళ్ళం.
ఈ రాయిచెట్టంటే చెక్రి గాడికి చాలా ఇష్టం. ఎంతిష్టం అంటే నా అంత ఇష్టం. దానిక్కూడా ఆడంటే ఇష్టమనుకుంటా. అప్పటివరకూ వాడిపోయిన ఆకులతో నీరసంగా కనిపించీ రాయిచెట్టు వాడొచ్చీసరికి పున్నమిలో గౌతమీ ఒడ్డున పడుచుపిల్ల నవ్వులా అందంగా కళకళలాడతా కొమ్మలూపుతా హుషారుగా కనిపించీది.
ఓ రోజు చిలక జోష్యం చెబుతానంటూ ఒకతను ఊరంతా తిరిగి తిరిగి, పెద్దగా రాబడి లేక నీరసంగా రాయి చెట్టు కింద కూచుంటే అతన్ని చూసి ‘‘ఏంబాబు ఊరు తిరక్కండా ఇక్కడ కూచుంటే గిరాకీ ఏముంటది, ఊళ్ళోకి ఎళ్ళవయ్యా’’ అన్నాన్నేను.
అందుకతను ‘‘లేదు బాబు ఊరంతా తిరిగితిరిగొచ్చాను. ఒక్క బేరము సరైంది దొరకలేదు. మా రాముడికి జాంపళ్ళుకి కూడా పైసలు రాలేదు. ఈయ్యేల లేచిన యేలేంటో గానీ’’ అన్నాడు.
చెక్రి ‘‘ఒరేయ్ పాపంరా! నువ్వు చెప్పించుకోరా’’ అంటా ‘‘బాబాయ్! ఈడికి చెప్పండి’’ అంటా నన్ను బలవంతంగా కూచ్చోబెట్టి అతనడిగిన పదకొండు రూపాయలు చీటీల మీద పెట్టేడు.
అతను ‘‘రాముడూ! అయ్య గారి పేరున మాంచి చీటి తియ్యి’’ అంటా చిలకని చీటీల మీదకి వొదిలాడు. అది అందులోంచి ఒక దేవుడి బొమ్మ తీసింది. ఆ బొమ్మెవరిదో తెలియదు కానీ, ‘‘అయ్య గారు మనసిచ్చిన మగువనే మనువాడతారు, సిరిమంతులౌతారు’’ అంటా కొంచెం అర్ధం అయ్యి, కాని భాషలో ఏవేవో చెప్పాడు. చివరిగా ‘‘అయ్యగారికి ఆయుష్షు కురచ’’ అంటా దానికర్ధం చెబతా ‘‘తవరికి ఆయుష్షు తక్కువ, గండాలున్నాయ్! అమ్మోరికి దణ్ణవెట్టుకోసామి, ఆ తల్లి ఆయుసిత్తాది, ఈ తావీజు తీసుకో, మొలకి కట్టుకో, రెండొందలిక్కడెట్టుకో’’ అంటా తావీదికి రెండొందలు అడిగాడు. ‘‘నేనివ్వను, నా దగ్గర లేవు’’ అంటే చెక్రి ఇనకుండా ఆడు కొత్త వాలీబాల్ కొంటానికి పోగేసుకున్న రెండొందలు తెచ్చి తాయెత్తు కట్టించేడు.
అతను చెప్పిన అన్ని ఇసయాల్లో పెళ్ళి గురించి, ఆయుష్షు గురించి చెప్పింది మాత్రం అర్ధమైంది, గుర్తుండిపోయింది.
తర్వాత చెక్రి చూపించుకున్నాడు. ఆడికి గవర్నమెంట్ ఉద్యోగం వత్తాదని, ఆయుష్షు గట్టిదని, ఆడికి పెళ్ళి కూతురు ఉత్తరం నుంచి వత్తాదని, అతనికే అర్ధమయ్యే, మాకర్ధం కాని భాషలో చెప్పేడు.
ఏదో అతని మీద జాలితో జోస్యం చూపించుకున్నాం కానీ నాకు కానీ, ఆడికి కానీ, దాని మీద నమ్మకం లేదు ఆక్షణం దాకా!
కానీ ఎప్పుడైతే అతను నాకు ఆయుష్షు తక్కవని చెప్పేడో చెక్రి మనసంతా పాడైపోయింది. మరుసటి రోజు వరకు ఆడు మామూలోడు కాలేదు. ఇద్దరం రాయిచెట్టు కింద కూచ్చున్నా ఆడు మాత్రం మనేద పట్టుకున్నోడిలా మౌనంగా, నీర్సంగా, నిర్లిప్తంగా రాయిచెట్టు కొమ్మలతో మౌనంగా మాట్లాడతా గడిపేడు ఆ రోజంతా!
నందన పొలమూరు సావరంలో కొత్తగా ఎట్టిన బాలాజీ టైప్ ఇన్సిస్టిట్యూట్‌లో పొద్దుట పది నుంచి పదకొండు వరకు టైప్ జాయినయ్యానని చెప్పింది. నన్ను కూడా జాయినవ్వమంది. ఇంట్లో అనుమానం వత్తందని ఆలోచిత్తన్నాను. అదే ఇసయం చెక్రితో చెబితే ఎంటనే ఆడు ‘‘నేను జాయినవుతానులేరా, నా వంకన నువ్వూ రావొచ్చు’’ అంటా మా ప్రేమకి దొడ్డిదారేసేడు. ఆ విధంగా ఇద్దరం రోజూ పొద్దుటే బయల్దేరి ఆడి బిఎస్‌ఎ ఫొటాన్ సైకిలేసుకుని టైప్ కెళ్తన్నాం. ఆడు టైప్ నేర్చుకోడానికి, నేను నందనతో మాట్టాడ్డానికి, ఆ గంట తననే చూత్తా గడపడానికి. వొచ్చీటప్పుడు నందూతో మాటాడుకుంటా రాటానికి.
ఎందరికో నీడనిచ్చిన రాయిచెట్టుకి పేద్ద కష్టమొచ్చి పడింది. అది రెవెన్యూ రికార్డులు ప్రకారం టీచర్ గారిదే అయినా దాని కొమ్మలు పక్కింటికి పాకి ఉంటాయి. ఆ ఇంట్లో వోల్లకి ఏ ఇబ్బంది లేదు కానీ ఆ పక్కన దక్షిణం వైపు ఖాళీ స్థలం కొనుక్కుని ఈమధ్యే శంకుస్థాపన చేసిన రహదార్లు భవనాల శాఖ ఏ. ఇ చింతా గోపాల్, ఆకులు ఎగిరి ఆళ్ళ జాగాలో పడతన్నాయని.. చెట్లు ఏర్లు ఆళ్ళు పునాదులు తవ్వుతుంటే అక్కడిదాకా పాకి అడ్డొత్తన్నాయని ఫొటోలు మార్ఫింగ్ చేసి రహదార్లు భవనాల శాఖ వోళ్ళకి, పంచాయితీ వోళ్ళకి, సర్పంచి శ్రీరాములు గారికి చూపించి చెట్టు కొట్టేయటానికి అనుమతి కాయితం తెచ్చాడు. దాంతో ఆయా డిపార్టుమెంటోళ్ళు ఆ ఆర్డరు కాయితం చూపిత్తా ‘‘టీచర్ గారు! ఇది పక్క ఇళ్ళోళ్ళకి ఇబ్బంది కలిగిత్తంది. ఓ నెల రోజుల్లో కొట్టించేస్తే సరి, లేదంటే మేమే కొట్టించేస్తాం’’ అని ఖరాఖండిగా చెప్పేడు.
నిజానికి ఆ గోపాల్ కూడా ఈ ఊరోడే. చిన్నప్పుడు ఆ రాయి చెట్టు నీడన ఆడుకున్నోడే, తదనంతరం ఉజ్జోగమొచ్చి వేరే ఊరికి మకాం మార్చాడు. కానీ ఈ ఊరితోటి, రాయిచెట్టు తోటి అనుబంధం లేకపోయినా సంబంధం ఉన్నోడే. అయినా అదేమి ఇప్పుడతనికి గుర్తు రాట్లేదు.
ఇది తెలిసిన చెక్రికి మనసు కకావికలమైపోయింది. ఆడికి అమ్మన్నా, రాయిచెట్టన్నా, నేనన్నా మూడు ప్రాణాలు. అందరకి పంచప్రాణాలుంటే ఈడికి ఈ మూడే.
ఆరోజు నుంచి ఆడి ఆలోచనంతా ఆ చెట్టుని ఎలా అయినా కొట్టనివ్వకూడదు. దానికేంచేయాలి? అని ఏవేవో ఆలోచనలు. టీచర్‌గారినడిగితే ‘‘అది గవర్నమెంట్ ఆర్డర్ కదరా చెక్రి. మనమేం చేయగలం?’’ అంటా అశక్తత.
నన్ను తీసుకుని మర్నాడు ప్రెసిడెంట్ వాసంశెట్టి శ్రీరాములు గారింటికి ఎళ్ళాడు. ఆయనతో మాటాడి ‘‘సర్పంచి గారు ఎలాగైనా మా రాయిచెట్టు కొట్టకుండా చూడండి. మీరు చెబితే ఆగుతారు’’ అంటా బతిమాలేడు. దానికాయన ‘‘సరేరా అబ్బాయిలు, ఎ. ఇ. కి ఫోన్ చేత్తానుండండి’’ అంటా ఫోన్ చేస్తే, ఎ. ఇ. గోపాల్ మొండిగా ‘‘కుదరదు సర్పంచ్ గారు! చెట్టు కొట్టాల్సిందే’’ అని మరీ మొండికేసేడు. ఇంకేం చేయాలో తెలియలేదు మా ఇద్దరికి. సర్పంచ్ గారికి మాకు సహాయం చెయ్యాలనిపించినా ఏమి చేయలేని నిస్సహాయత!
ఆ రాత్రి మేమిద్దరం రాయిచెట్టు కిందే పట్టి మంచమేసుకుని పడుకున్నాం. నేను గుర్రు పెట్టి నిద్రోయాను. పాపం! ఆడికి నిద్ర పట్టలేనట్లుంది. తెల్లారుజామున రెండు గంటల ప్రాంతంలో నన్ను లేపాడు. బద్దకంగా లేచాను. చూడబోతే ఆడు నిద్రపోయినట్టు లేదు. మొఖమంతా పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయున్నాయ్. ‘‘ఏమైందిరా? నిద్రపోలేదా’’ అని నేనడుగుతుంటే ఆటికి సమాధానం చెప్పకుండా ‘‘లెగరా మనమొకచోటకెళ్ళాలి’’ అంటా తొందర పెట్టేడు.
ఆడెంత తొందరపెడుతున్నాడో నేనంత బద్దకంగా, కళ్ళు నలుముకుంటా ‘‘ఇప్పుడెక్కడికిరా? పొద్దుటెల్దాంలేరా, పడుకోరాబాబు, నీకు మతోయినట్టుంది, ఇప్పుడు టైము ఏ ఒంటి గంటో అయ్యుంటది, ఇప్పుడెక్కడికెల్తాం?’’ అంటా మళ్ళీ ముసుగుతన్తుంటే.. ఆడు కంగారు పెడతా ‘‘లెగరా బాబు, దణ్ణమెడతాను, ఇది తెల్లారేక చేసే పని కాదు, ఇప్పుడే చేయాలి, వత్తావా, రావా? నువ్వు రాపోతే నేనొక్కడినే ఎళ్తాను’’ అనీసరికి తప్పక లేచేను బద్దకంగా, లోలోపల ఆణ్ణి తిట్టుకుంటా!
ఇద్దరం నడుచుకుంటా నల్లకాలవ వరకు ఎళ్ళాం. అది దాటాకా కాలవ గట్టు మీద ఓ ఫర్లాంగు దూరం ఎళ్ళాక ఉసిరి చెట్టు, ఏప చెట్టు మొదళ్ళో ఉన్న చాలా దేవతల ఇగ్రహాల్లోంచి బాగా అందంగా ఉన్న ఓ దేవత ఇగ్రహం తీసాడు. ఆ ఇగ్రహానికి దణ్ణమెట్టుకుని కాలువలో కడిగి, భుజానేసుకుని ఇంటికొచ్చాం ఇద్దరం.
తిరిగి రాయిచెట్టు దగ్గరకొచ్చీవరకూ భుజాలు మార్చుకున్నాడే కానీ నాకిమ్మంటే ఇచ్చాడు కాదు, ఆడే మోసుకుంటా తెచ్చి రాయిచెట్టు మొదళ్ళో దేవతనెట్టి ఇంట్లోకెళ్ళి బకెట్‌తో నీళ్ళు తెచ్చి రాయిచెట్టు చుట్టూరా ఉన్న చప్టా అంతా కడిగేసి ఇగ్రహాన్ని అభిషేకించి పసుపు, కుంకుమ రాసి దణ్ణమెట్టుకుని ‘‘అమ్మా! ఇది నీ ఇల్లు, ఈ చెట్టుని, నీ ఇంటిని నువ్వే కాపాడాల’’ అని ప్రార్ధించి, నాతో ‘‘ఒరేయ్ ఇప్పటి నుంచి ఇది మాలచ్చమ్మ గుడి, ఆ అమ్మోరే ఈ చెట్టుని కాపాడుతుంది చూడు’’ అంటుంటే ఆడి కళ్ళల్లో మాటల్లో చెప్పలేని ఆనందం, సంతృప్తి, సంతోషం.
ఓ నెల రోజులు తరువాత ఇంజనీర్లొచ్చి రాయిచెట్టు పడగొట్టారో లేదో ఎప్పుడు తీసేత్తారో కనుక్కుందా మనొచ్చారు. అప్పటికే ఆ రాయిచెట్టు మాలచ్చమ్మ చెట్టుగా పేరెళ్ళిపోయింది. ఊరోళ్ళు, దారంట ఎళ్ళీవోళ్ళందరూ పూజలు చేత్తన్నారు.
ఉప్పుడు రోజు పొద్దుటే చెక్రి, చెట్టు చుట్టుతా శుభ్రం చేసి, దీపమెట్టి, దణ్ణమెట్టుకుని కానీ ఏ పని మొదలెట్టట్లేదు. రాత్రికి రాత్రే అమ్మోరెలా వచ్చిందో ఇప్పటికి ఎవరికీ అంతుపట్టట్లేదు. ఆ విషయం నాకు, ఆడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. మేమెవరికీ చెప్పం. కాబట్టి ఇంకెవరికి తెలిసే అవకాశం లేదు.
చేలామంది అనుకునీది ఏంటంటే అమ్మోరే వొచ్చి అక్కడ ఎలసిందని, అమ్మోరు ఎప్పటినించో ఆ చెట్టు రూపంలో ఉన్నా తాము తెల్సుకోలాపోయామని! ఇలా అనేక విశ్వాసాలు, అపోహలు వాయువ్యాప్తమయ్యేయి.
ఏది ఏమైనప్పటికీ చింతా గోపాల్ ఆళ్ళ ఇంటోళ్ళు కూడా దాన్ని దేవత చెట్టుగా పూజించటంతో రాయిచెట్టును ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే చెక్రి గాడంటే రాయిచెట్టుకి పిచ్చి ప్రేమ, ఆడికి అదంటే అవ్యాజమైన మమకారం.
ఎప్పుటిలాగే ఈ దసరా సెలవులకి కూడా నేను పొలమూరొచ్చేను. ఆరోజు నేను, చెక్రి కాలువ స్నానానికెళ్ళాము. ఆడికి ఈత బాగావొచ్చు. ఆతలి నుంచి ఈతలికి అవలీలగా ఈదగలడు. నాకు ఈత రాదు. ములగడం తప్ప!
ఆరోజు నేనప్పటిలాగే ఒడ్డునే కూచ్చుని చూత్తంటే ఆడు ఈదుతున్నాడు. అది చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో. ముందుకి, వెనక్కి, పక్కకీ ఎలా అయినా ఈదేత్తన్నాడు. ఈడికి రాని విద్యే లేదా అంటా అసూయ పడ్డాను మనసులో!
అలా ఆడిని చూత్తానే నేను కూడా దిగేను. నీళ్ళు తక్కవే ఉన్నట్టనిపించింది. భుజాల దాకే వొచ్చాయి. ‘‘అక్కడే నించుని చెయ్యరా, ఇక ముందుకు రాకు’’ అంటా చెక్రి కేకేత్తన్నాడు.
‘‘అలాగేలేరా’’ అంటా అక్కడే నుంచుని తానం చేత్తన్నాను. నేను నుంచున్న చోట బంక మట్టి జారి లోపలికి జారిపోయి ములిగిపోతన్నాను. లేవటానికి ప్రయత్నిస్తున్నాను. కానీ నావల్ల కావటం లేదు. నా కాళ్ళు బంకమట్టిలో దిగబడిపోయేయి. క్షణాల్లో చావు చేతులు చాపుకుంటా నా దగ్గరకొత్తా రమ్మని పిలత్తాంది. నీళ్ళు మింగేత్తన్నాను.
ఏమి జరిగిందో తెలవదు. చెక్రి గాడు ఆడి తల నా కాళ్ళ మధ్య పెట్టి భుజాలపై ఎక్కించుకుని ఒడ్డుకు తీసుకొత్తా ఒక్క ఉదుటున ఒడ్డుకి ఇసిరేసాడు.
అక్కడేమైందో ఒక్క క్షణం అర్ధం కాలేదు నాకు. ఒడ్డున పడున్న నేను చెక్రిని చూత్తంటే, ఆడి కాళ్ళు కూడా బంకలో దిగబడిపోయనట్టున్నాయి. ఆడు పెనుగులాడుతున్నట్లున్నాడు. అప్పుడప్పుడు చేతులు పైకి కనిపిత్తన్నాయి. మనషి కనబడట్లేదు. కొద్ది క్షణాల్లో అవి ములుగుతా తేలతా.. కనిపించటం లేదు.
అక్కడేం జరిగిందో నా మట్టి బుర్రకు అర్ధమయ్యేసరికి ఆడ్ని కాపాడలేని నిస్సహాయ స్థితిలో దిక్కులు పిక్కటిల్లేలా అరిచేను. ‘‘చెక్రి! చెక్రి! ఎవరైనా రక్షించండి! రక్షించండి!’’ అంటా అరుత్తున్నాను.
నా కేకలు నేను తప్ప ఎవరూ లేని ఆ నిర్మానుష్యంలో కలిసిపోయేయి. మా చెక్రి గాడి ప్రాణాలతో పాటు.. !
కానీ ఏం లాభం ఎవరూ రాలేదు. ఆణ్ణి రక్షించనూ లేదు. ఒక రెండు క్షణాల ముందు ఆడి చేతులైనా కనిపించాయి. ఇప్పుడు అయ్యి లేవు. నన్ను ఏ ప్రమాదం నుంచి రక్షించేడో సరిగ్గా అదే బంక మట్టిలో కాళ్ళు దిగబడిపోయి నన్ను బతికించిన నా చెక్రవర్తి నల్ల కాలువ ప్రవాహంలో కూరుకుపోయేడు.
నాకు ఆడి పూర్ణాయుష్షును పోసి నా అర్ధాయుష్షును తీసుకుని నాకు ప్రాణభిక్ష పెట్టేడు.
ఓ ఐదు నిముషాలు తరువాత వచ్చిన చేపలు పట్టే రేకాడి దరంజికి అంతా చెబితే, ఎళ్ళి ఎతికితే చెక్రి శవం దొరికింది.
ఓ అరగంట ఎతికాక దొరికిన చెక్రి శవాన్ని భుజాన్నేసుకుని ఒడ్డుకు తీసుకొచ్చేడు దరంజి. శవంలా ఉన్న ఆడిని చూసి నా గుండె పగిలిపోయింది. ఆడు చచ్చిపోయాడు అంటే నమ్మటానికి నా మెదడు, మనస్సు మొరాయించేయి.
ఈ ఇషయం ఊరంతా పాకింది. అందరూ కాలువ దగ్గరికొచ్చేసేరు. చెక్రీని తీసుకుని ఇంటికొచ్చేం. ఎప్పుడు చెలాకీగా, నవ్వుతా, తుళ్ళుతా తిరిగే చెక్రిగాడు అలా చెలనం లేకుండా పడి ఉండడం చూసి నేను గుండె పగిలీలాగ ఏడుత్తుంటే, ఆవిడికి ఎవ్వరూ లేపోయినా ఆడిలోనే అందరిని చూసుకుంటన్న టీచరు గారూ గుండెలు బాదుకుంటా ఏడుత్తున్నారు. నాలా ఆడి వల్ల ఆయుష్షు పోసుకున్న రాయిచెట్టు దాని ప్రాణదాత కోసం మౌనంగా కుంగిపోయింది.
కొంతమంది అంతే, ఏదొక పనికోసం ఈ లోకంలోకి వొత్తారు. ఉన్నన్నాళ్ళు తమ పనులతో, మంచితనంతో చుట్టు ఉన్నోళ్ళ జీవితాల్ని చక్కదిద్దేసి జీవితాంతం ఋణపడిపోయే లాగా ఉదాత్తమైన పనులు చేసేసి చెప్పాచేయకుండా ఎళ్ళిపోతారు.
ఆళ్ళు పోయాక చుట్టూ ఉన్నోళ్ళకి ఒక్క క్షణం కూడా మరపురాకండా జీవిత కాలం గుర్తుండిపోయీలాగ బతికి, చనిపోయీ బతుకుతారు ఈడిలా!
ఇప్పుడు నేను బతుకుతున్న ఈ జీవితం ఆడి భిక్ష! నాదే కాదు ఈ రాయిచెట్టుది కూడా. అందుకే ఆణ్ణి ఒక్క క్షణం కూడా మర్చిపోను, పోలేను. ఆడి గురించి ఏడని రోజు లేదు నేను. నాకే ఇలా ఉంటే మూరడంతున్నపుడు తెచ్చుకుని పేణంగా పెంచుకుని చెట్టంత అయ్యేవరకూ ఆడే లోకంగా బతికిన టీచరుగారు పొగిలి పొగిలి ఏడుత్తుంటే చూసినోళ్ళందరికీ ఏడుపాగలేదు. ఆవిడ తిండి నిద్ర మానీసారు, బెంగతో సగమైపోయేరు.
ఇప్పుడు టీచర్ గారు పెద్దోరైపోయేరు. వయస్సు మళ్ళిపోయింది. ఆవిడ జీవితం మళ్ళీ ఒంటరైపోయింద నుకున్నాను. కానీ ఆవిడ చెక్రి చనిపోయాడంటే ఒప్పుకోరు.
ఆవిడ చెప్పినట్టు నా రూపంలో, రాయిచెట్టు రూపంలో చెక్రి ఆవిడతోనే ఉన్నాడు. ఆవిడకి జీవితకాలం తోడుగా, నీడగా..
నాకైతే ఆవిడ దేవుడిచ్చిన కాదు కాదు మా చెక్రిగాడిచ్చిన అమ్మ. ఆవిడ ఇంట్లో గడిపే కంటే రాయిచెట్టు కిందే రోజంతా గడుపుతున్నారు. ఇప్పుడది రాయిచెట్టు కాదు మాలచ్చమ్మ తల్లి గుడి. అది గుడైనప్పటికి రాయిచెట్టులో దేవతుందో లేదో తెలియదు కానీ.. చెక్రీ గాడి ఆత్మ మాత్రం ఉంది. ఎందుకంటే నేనెప్పుడూ వెళ్ళిన చెట్టు చుట్టూ చేతులేసి కౌగిలించుకుంటే అది మా చెక్రిని కావలించుకున్నప్పుడు కలిగిన అనుభూతి కలుగుతుంది. అదీ కూడా, కొమ్మలు, ఆకులు ఊపుతా హుషారుగా ‘‘ఏరా బావున్నావా’’ అంటా చెక్రి నన్ను అప్యాయంగా కావిలించుకుని పలకరించిన భావన కలుగుతంది. మనస్సు ప్రశాంతమవుతంది.
అమ్మమ్మ చచ్చిపోయాక ఈ ఊరితో నాకు ఏ సంబంధం లేకపోయినా నా అనుబంధం తల్లిలాంటి సుశీలమ్మ గారితో, రాయిచెట్టుతో.
ఆవిణ్ణి చూడటానికి రాయిచెట్టు రూపంలో ఇంకా బతికే ఉన్న నా ప్రాణదాత చెక్రిని కౌగిలించుకోడానికే వొత్తున్నాను. ఆడు చచ్చిపోయి ఇరవై ఏళ్ళయినా మానలేదు. కనీసం నెలకోసారైనా వొస్తాను.
చెక్రి ప్రోద్భలంతో ప్రేమించుకున్న నందన, నేను అందరినీ ఎదిరించి సుశీలమ్మ గారి ఆశీర్వాదంతో పెళ్ళి చేసుకున్నాం. మాకిద్దరు సంతానం.
మొదటివాడి పేరు చక్రవర్తి!
రెండవది అమ్మాయి.. పేరు సుశీలా చక్రవర్తి. !
రత్నాకర్ పెనుమాక గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: రత్నాకర్ పెనుమాక
నేను రత్నాకర్ పెనుమాక యానాంలో ఉంటాను .B.Sc , MBA చదివి వివిధ బహుళ జాతి కంపెనీల్లో HR డిపార్టుమెంటులో ఉన్నతోద్యోగాలు చేసి ఉద్యోగ విరమణ చేసాను .ప్రజా సేవ చేయాలనే బలమైన కాంక్షతో 2005 లో యానం లో ఒక స్వచ్ఛంద సేవాసంస్థ నెలకొల్పి పూర్తికాల సామాజిక సేవ చేస్తున్నాను. ఏవిధమైన ఫండ్స్ వసూలు చేయకుండా నా స్వంత నిధులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను .వ్యక్తిగతంగా 41 సార్లు రక్తదానం చేసాను .మూడు సంవత్సరాల నుంచి రచనలు చేస్తున్నాను. 2022 లో నా మొదటి కథా సంపుటి "గౌతమీ తీరం " ఆవిష్కరించాను .అది మంచి పాఠకాదరణ పొందింది .ఈ సంవత్సరం నా రెండవ కథా సంపుటి "గౌతమీ ఒడ్డున " ఆవిష్కరించ బోతున్నాను .ఇప్పటి వరకూ 30 కవితలు 50 కథలు 5 నవలలు రాసాను .ఇవన్నీ అముద్రితాలే .9 నెలల నుంచే పోటీలకు రచనలు పంపుతున్నాను .ఇప్పటికి 9 సాహిత్య పురస్కారాలందుకున్నాను . నన్ను ప్రోత్సహిస్తున్న పాఠకులకు పోటీ నిర్వాహకులకు న్యాయనిర్ణేతలకు సదా కృతజ్ఞుడను.
పెనుమాక రత్నాకర్ - పొలమూరులో రావిచెట్టు కథ ఆద్యంతం చదివించింది, కథలో బాల్యం నుండి యవ్వనం వరకూ ఒక వ్యక్తి జీవితాన్ని తనతో పాటు సంస్కృతి, సమాజంలోని వ్యక్తులను,ఆచారాలను, నమ్మకాలు , ప్రేమలు,మూడవిశ్వాసాలు, అచంచలమైన ప్రేమను పంచే సుశీల టీచర్, ,ఇన్ని పాత్రల్లో ఓ మానవ హృదయ ఆవిష్కరణ, సాంస్కృతిక రూపం గా మలచడం చాలా అందంగా ఉంది . చెక్రి త్యాగం హృదయ విదారకమైనది, సుశీల గారి దానం మాటలకు అందనిది, రావి చెట్టు కోసం చక్రిచేసిన అద్భుతం మరపురానిది, ఇన్ని పాత్రలు ఇన్ని వ్యక్తిత్వాలు ఇంతటి సంస్కృతిని ఒకే చోట ఒకే కథలో పూలను గుచ్చినట్లు చాలా అందంగా అమర్చిన పెనుమాక రత్నాకర్ గారికి,కథను ప్రచురించి పాఠకులకు అందించిన మన తెలుగు డాట్ కాం సంస్థకు హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏
సహజమైన కథ
విలక్షణమైన శైలి
మనసుని తడిమే ఆర్ద్రత
చిన్ననాటి జ్ఞాపకాల పలవరింత
చిరకాలం గుర్తుండిపోతుంది!!
Katha chalaaa bagundhi .pathralannitilo jeevam undhi . Shaili lo readability undhi .modalu pedithe aapatam kastam antha bagundhi shaili .basha adbutanga undhi
ఏమి రాసిండావు సామీ!
మనిసిని ఉక్కిరిబిక్కిరి సేసిండావు.
నగిపిచి, ఏడిపిచ్చి , ఏమేమో గుర్తుకి తెప్పిచ్చిండావు కదా నాయినా!
రత్నాకరుడు మాత్ర్మే రాయగలిగే మాటలు ఇవి అని సెప్పకనే సెప్పినావు గదప్పా!
ఆ విన్యాసాలకే ఈడు నాకొక వ్యసనమైపోయాడు. "
"ఇంటికొచ్చాక పుస్తకాలు అంటరానియ్యే ఆడికి! "
"ఆవిడ ఈ ఊరికి సుశీల పేరుతో ఉన్న కాశీ అన్నపూర్ణమ్మ. "
"ఆవిడేపని చెప్పినా అందులో బోల్డు సందడుంటాది. "
"ఇప్పుడు నా ప్రయారిటీస్‌కి సఫిక్స్‌లొత్తన్నాయి"
"కొంతమంది అంతే, ఏదొక పనికోసం ఈ లోకంలోకి వొత్తారు. ఉన్నన్నాళ్ళు తమ పనులతో, మంచితనంతో చుట్టు ఉన్నోళ్ళ జీవితాల్ని చక్కదిద్దేసి జీవితాంతం ఋణపడిపోయే లాగా ఉదాత్తమైన పనులు చేసేసి చెప్పాచేయకుండా ఎళ్ళిపోతారు. "
"అమ్మమ్మ చచ్చిపోయాక ఈ ఊరితో నాకు ఏ సంబంధం లేకపోయినా నా అనుబంధం తల్లిలాంటి సుశీలమ్మ గారితో, రాయిచెట్టుతో. "
"మాకిద్దరు సంతానం.
మొదటివాడి పేరు చక్రవర్తి!
రెండవది అమ్మాయి.. పేరు సుశీలా చక్రవర్తి. !"
కథ చాలా బాగుంది, చక్రి చనిపోయిన సందర్భం కన్నీళ్ళు తెప్పించింది, టీచరు గారి ఔన్నత్యాన్ని చక్కగా వివరించారు, చెట్టుని కాపాడాలన్న తపన, దాని చుట్టూ అల్లుకుని ఉన్న అనుబంధం చక్కగా తెలిపారు. ముఖ్యంగా ఆ లచ్చించారు మా కళ్ళ ఎదురుగా కాస్తున్న అనుభూతి కలిగించింది . మళ్ళీ ఒకసారి తినాలనిపించేలా నోరూరింది.