పొలిమేర - పార్ట్ 1
- Kasivarapu Venkatasubbaiah
- Jul 2, 2023
- 7 min read
Updated: Jul 29, 2023

పొలిమేర పెద్దకథ మొదటి భాగం
'Polimera Part 1/2' - New Telugu Story Written By Kasivarapu Venkatasubbaiah
'పొలిమేర పార్ట్ 1/2' తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
రాయలసీమలోని రెండు గ్రామాలు అనిమెల, దద్దనాల.
చాలా కాలం క్రితం అనిమెల గ్రామంలో జాతర జరిపి, వేట ఇచ్చిన జంతువు తాలూకు రక్తాన్ని అన్నంలో కలిపి గ్రామ శివారులో, పొలాల్లో జల్లుతారు.
దీన్నే పొలి అంటారు.
దద్దానాల గ్రామం వాళ్ళు ఆ పొలిని ఒంటికి అంటించుకుని తమ గ్రామ సరిహద్దుల్లోకి వెళతారు. దీన్నే పొలిని ఎత్తుకొని వెళ్ళడమంటారు.
అప్పటినుండి అనిమెల గ్రామంలో కరువుకాటకాలు మొదలయ్యాయని ఆ గ్రామస్థులు భావిస్తారు. అది మూఢ నమ్మకమని చెప్పినా వినరు. దద్దానాల గ్రామం నుండి పొలిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించి ఆ పనికి సుంకన్నను పంపుతారు.
ఈ ప్రయత్నంలో ఏం జరిగిందో రచయిత కాశీవరపు వెంకటసుబ్బయ్య గారు రాయలసీమ మాండలికంలో ఉద్విగ్నభరితంగా రచించారు. ఇక కథలోకి వెళదాం.
ఒరేయ్య! సుంకన్నా! ప్యాటకు పొయి గొడ్లకు తౌడు చెనిక్కాయచెక్క త్యాపోరాబ్బి! పచ్చిమ్యాత యాడా చేలల్లో ల్యాకపోయె. ఆటి మోగాన అయన్నా బేచ్చే ఇన్ని పాలిచ్చాయి. ఈకరువు కాలంలో అయ్యే మనకు ఆదరువు. బెర్రీన (తొందరగా) పోయిరాపో నాయిన! ఇంగో మాట. ఆ జమడక్కు పిల్లోడు మార్కట్టులో కనపడ్తే ఇత్తనాల లెక్కడుగు. పోయినేడు వానలు పడ్తే చేలల్లో ఇత్తు కుందామని ఇత్తనం గింజలు తెచ్చుకొంటిమి. వానలు పడకపోయె. ఇత్తనాలు మిగిలిపోయె.
జమ్మడక్కు పిల్లోడు ఆమనికి లెక్కిచ్చానని ఇత్తనాల గింజలు తీస్కపోయి వోల్ల చేలల్లో ఇత్తుకొని యేడాది కావచ్చాన్యా లెక్కైతే ఇంగా ఇయ్యకపోయె. ఇబ్బుడన్నా ఇచ్చాడేమో అడిగి తీస్కరాపో! ఈ యేడన్నా వానలు కురుచ్చే ఇత్తనం ఇత్తుకుందాం. గ్నాపకంగా అడుగి రప్పిన (త్వరగా) i ఎనక్కి తిర్కొని రాపో పాపోడా!" సుంకన్న అమ్మ తిరిపాలమ్మ నిరాస నిండిన గొంతుతో చెప్పుతాంది కొడుకుతో.
"పోయేచ్చగాని యనుములకు జొన్నచొప్పా, వరిచెత్తా, చెనిక్కాయకట్టె, పెసరపొట్టు రొంతరొంత వుంది. గాట్లో యేయ్యి. ఎద్దులకు జొన్నబియ్యం కడుగునీళ్ళు తాపి గాటికాడ కట్టేయ్. అయి గుడకా తింటయ్!" అన్సెప్పి ఎగాసగా పడి ఊరి నడుమ వున్న రాగిమానుకాడికి వచ్చినాడు సుంకన్న.
ఆడ పిచ్చయ్య తిప్పిరెడ్డి మరికొందరు ప్యాట (ప్రొద్దుటూరు)కు పోను ఆటో కోసరం ఎదురు సూచ్చా రాగిచెట్టు అరుగుమీద కుచ్చోండరు.
"ఏమోయ్ సుంకన్నా! నువ్వు గుడకా ప్యాటకు వచ్చాండవా?" పిచ్చయ్య పలకరించినాడు.
"ఔను మామా! బొత్తిగా పసులకు తిండిలేదు తౌడూ గానుగ చెక్కా తెచ్చామని ప్యాటకు పోతాండ మామా! పొలాల్లో యాడ సూసిన పచ్చగడ్డి మొలక మొల్చక పోయె. పచ్చిమ్యాత ల్యాకపోతే పసులెట్టా పాలిచ్చాయి. పాలీయకపొతే మనకెట్లా గడుచ్చాది. ఈగడ్డు పరిచితి నుంచి యెట్టా బయటపడాలో తెలిడం ల్యా. ఏం తిప్పిరెడ్డి మామా! ఊరక కుచ్చోనుండావ్! నువ్వన్నా రోంత దోవ చెప్పు రాదు!" సుంకన్న బాదంతా ఒలకబోసినాడు.
"సూచ్చాండవ్ కదోయ్! వాతావర్నం! మనం మోరలు పైకెత్తి ఎంత మోత్తుకున్నా! దేవుడు కనికరించడోయ్! మూడేండ్లాయ వానలు పడక. ఏరు పారక. చెరువుకు నీళ్ళు రాక. చేలల్లో ఊపచెత్త కుడక మొల్చక. చేలన్నీ వరుపొచ్చి బిసాంబరంగా (శూన్యంగా) కన్పడ్తాండయ్! జనం బతికి బట్టగట్టడం కట్టమేనోయ్!" తిప్పిరెడ్డి యాట్టపడుతా అన్యాడు.
పక్కనే కుచ్చున్న ఎర్రయ్య మాట కల్పుతా "ఊరంతా అలివిగాని వరుపెత్తుకుండాది. (వరుపు-కరువు)తిన్ను తిండిలేదు. పసువులకు మ్యాత లేదు. నీళ్ళు గుడకా ఏట్లో మనిస్సిలోతు చెలిమె తీస్కొని తెచ్చుకుంటా వుండారు. అయీ రేపోమాపో వొట్టిపోవొచ్చు. మడుస్సులంతా ఘోరెండలకు ఊసబెండ్లలా దోరి (బలహీన)పోతాండరు. ఏం బతుకు తీ మందీ " బాదంతా ఎల్లగక్కినాడు యర్రయ్య.
"ముసలయ్య తాతా! ఇరుగుపొరుగు వూర్లన్నీ అంతోయింతో బాగనే వుండయ్! మన వూరేందో ఇంత అద్దుమానంగా వుండాది. వూరికేందన్నా గాచారం పట్టు కుందంటావా తాతా!?" ఒగిసిలో పెద్దోడైనా ముసలయ్యను సుంకన్న అడుగుతుండంగానే అబ్బుడే అక్కడికొచ్చిన అంకాల్రాయుడు మాటందుకున్యాడు.
"ఊరికి నిజ్జంగానే చెడు గాలం దాపరించినాది. మూడేల్లాపొద్దు వూరిట్టా వుండేది కాదు. అందరాల మనమూ పాడిపంటల్తో కళకళాడ్తాండేవోళ్ళం. మూడేల్లా ఆ ఇరుబోగోళ్ళో (దరిదాపుల్లో) మన అనిమెల్లో పోలేరమ్మ ద్యావర జరిగినాది. ద్యావర్లో మన పొలిని దద్దనాలోళ్ళు మనల్ని ఆదమరింపించి ఎత్తక పోయినారు. ఆడికీ మన కుర్రోళ్ళు కత్తులు కటార్లు పట్టుకుని యంటబన్యారు. వాళ్ళు దొరకుండా పొలిమేర దాట్నారు. ఆ పొద్దునుంచి ఈ పరిచితి ఒనగూడినాది. మన పొలి మనం తెచ్చుకున్యా దాక మన బతుకులింతే. " అంకల్రాయుడి మాటల్లో యేదన ఉట్టిపన్యాది.
ఇంత లోపల ఆటో ప్యాట్నుంచి వొచ్చినాది. సుంకన్నతో పాటు అందరూ ఆదరబాదరమని ఆటో ఎక్కి కుచ్చున్యారు. ఆటో నిండు మనిసిలా కదిలి ప్యాటకు పోయినాది.
ప్యాట మార్కెట్లో గాయగూరలు, తిరువాతనూన్య (వంటనూనె), పసులకు బియ్యంతౌడు, చనిక్కాయచెక్క తీస్కొని మార్కెట్టు బయిటికి వచ్చేసరికి జమ్మడక్క (జమ్మలమడగు) పిల్లోడు బండెన్న రోడ్డు మీద పోతా కన్పించ్చినాడు. "రేయ్ బండెన్నా!" యని సుంకన్న పిల్చేటప్పటికి బండెన్న నిలబన్యాడు. I
"ఏంబ్బీ యేడాది ఐతాన్యా ఇత్తనం గింజల లెక్కీయ్యక పోతివి. ఇయనీకి బుద్ది పుట్టలేదా! అమ్మ 'ప్యాట్లో నువ్వు కనపడ్తే లెక్క ఇప్పిచ్చుకరా' అన్యాది. ఇబ్బుడన్నా ఇయబ్బీ. శాన కసాల (అవసరం) గా వుండాది. " అని అడిగినాడు సుంకన్న.
"యాడిదన్నా లెక్కా. ఇల్లు జరగడమే ఈదల మాదలగా వుండాది. మీరిచ్చిన ఇత్తనం గింజలు చేలో ఇత్తినాక వాన పడక న్యాల్లోనే కుళ్ళిపోనాయ్. పెల్లాం బిడ్డలకు కూడు కుడక పెట్టల్యాక పోతాండాను. పొలాలు వదిలేసి ప్యాటకు కూలి పన్లు చేయడానికి వొచ్చాండన్నా! బతకడానికి శాన ఇబ్బందులు పడ్తాండన్నా!" శాన ధీనంగా చెప్పకున్యాడు బండెన్న.
ఆ మాటలు ఇనేసరికి గుండెలు బరువెక్కి సుంకన్న మనస్సు బాదతో కలుక్కుమని మెలికె దిరిగినాది.
"లెక్క ఇయకుంటేమి లేబ్బి. పెళ్ళాం బిడ్డల్ని పచ్చులు పెట్టాకు. ఏదోక కట్టంచేసి పిల్లల కడుపు నింపు సాలు. నాకు లెక్క యిచ్చినట్టే " అన్సెప్పి ఇంటి దోవ పట్నాడు సుంకన్న.
ఇంటికి రాంగానే "సుంకన్నా! ఊరి పెద్దలంతా మూడమాన్ల కాడ గుమికూడి నారంట. నిన్ను రమ్మన్యారు. ఊరి సంగతేందో మాట్టాడుతారంట. పోయిరాపో నాయిన !" పుట్టన్న కొడుక్కు చెప్పినాడు.
"పొయచ్చాగానీ, ఎనుముల్ను మేపకరాను పోయిన తమ్ముడు, పొయ్యిలోకి పుల్లలు ఏరకరాను పోయిన చెల్లెలు యింటికి వచ్చినారా నాయినా" తండ్రి పుట్టన్నను అడిగినాడు.
"ఇంటికి వొచ్చినాం న్నా!" అంటూ చెల్లెలు నూకాలమ్మ, తమ్ముడు బంగారయ్య అన్నకు ఎదుర్గా వొచ్చి నిలబన్యారు.
"ఓ.. వొచ్చినారా? సరేలే ఐతే. " సుంకన్న సమాదాన పన్యాడు.
"నువ్వు బెర్రీన కాళ్ళుమోఖం కడుకొని రాపో! సర్రి(గంజి) గాచిన ఉడుకు మీదనే తాగుదువు. మల్లా మూడు మాన్లకాడికి పోను ఆల్చమైతాది" తిపాలమ్మ సుంకన్నతో సెప్పినాది.
"అట్టేమ్మ" అని జాలాట్లోకి బోయి కాళ్లు మొఖం కడుకొని దండ్యెం మీది తుండుగుడ్డతో తుడ్చుకొని సర్రి తాగి దస్తుగుడ్డ బుజాన ఏసుకొని ఊరి పెద్దలంతా గుంపైన మూడుమాన్ల కాడికి ఎలబార్తాంటే మారెన్న అదాటు (ఎదురు) పన్యాడు.
"యాడికన్నా! నువ్వొచ్చాండవ్!" పలకరించినాడు సుంకన్న.
" నీ కోసమేబ్బీ! మూడుమాన్ల కాడ పెద్దలంతా మీటింగు పెట్నారు. ఇంటికొకరు రమ్మంటే అందరూ వచ్చినారు. యయ్యాలకు నువ్వు రాకపోతే పిల్చుక రాపోని నన్ను పంపినారు."
"అట్టనా! పదపదా! పోదాం!" అని బిరబిరా ఇద్దరూ పోయినారు.
మూడుమాన్ల కాడు అరుగుల మీద కొండాడ్డి తిప్పిరెడ్డి చెంగలనాయుడు అచ్చంనాయుడు అంకల్రాయుడు పిచ్చయ్య ఎర్రయ్య పుల్లారావు తిక్కరావు పోలయ్య పేరయ్య అంకన్న మాచంరాయుడు కూకొనివుండారు జనమంతా చుట్టూత నిల్బడివుండారు.
"సుంకన్న వచ్చినాడు సంగతేందో మొదుబెట్టండ్రీ" పేరయ్య కదిలిచ్చినాడు.
కొండాడ్డి మెల్లగా లేచి గోశ సర్దుకొని చెప్పడం మొదబెట్నాడు
"యావన్మందికీ తెలియజేయడం యేమనగా - నిజానికి మనకు తెలియని ఇసయమేమి కాదు. మూడేండ్లాగా వానచుక్క పడడమేల్యా. చేలు పండడమేల్యా. వూర్ని వరుపు చుట్టుకున్యాది. ఎండ మండుతాంది. ఎర్రగాలి కాగు (ఎర్ర దుమ్ము) దూమరం లేచ్చాంది. జనం తిండికి నీళ్ళుకు తొద (బాధ) పర్తాండరు. బక్క జీవాలు సచ్చిపోతాండయ్.
బోరపొంతలు (రాబందులు) పీతిరి గద్దలు తిరుగుతాండయ్. సీతవలు గుడ్లగూబలు పైడికంటీలు (బంగారు కన్నుల పక్షి, రాత్రుళ్ళు తిరిగే పక్షి) రేత్రుల్లు ఇకారంగా అరుచ్చాండయ్. చేండ్లు బీడ్లైనాయ్. ఏరు ఎండి పోయినాది. చెరువు వొట్టి పోయినాది. రైతులు పక్కూర్లకు కూలి పన్లకు పోతాండరు. కొందరు ప్యాటకు బేల్దారి పన్లు సేసుకోను పొతాండరు. కొందరైతే బతుకతెరువు కోసరం దూరాబారం యిండ్లు ఇడిచి వలస పొతాండరు. వోల్ల యిండ్లల్లో గబ్బిలాలు సేరి పిల్లలేపుకుంటుండాయి.
ఇట్టాటి పరిచితి మనకు ఎందుకొచ్చినాది. దద్దనాలోళ్ళు మన పొలిని ఎత్తక పొయినప్పటి నుంచే మన బతుకులు ఇట్టా కాలి పొతాండయ్. కుటుంబాలకు కుటుంబాలు ఇగలంపగలమై(చిందరవందరై)అలాంపలాం(అల్లకల్లోలం) లైనాయ్. కడంత కాలం ఇట్టా గొడాటకం బరాయించలేం. మన పొలి మల్లా మనూరికి తెచ్చుకునెంత వరకు మన బతుకులు ఇట్టే ఒగిరిచ్చా (అయాసం) వుంటాయ్. " అని సితిగతి ఇవరించినాడు కొండాడ్డి.
చెంగల్నాయుడు లేసి "వచ్చే మంగలారం దద్దనాల్లో పెద్దమ్మ ద్యావర. ఆ ద్యావరకు పొయ్యి మన పొలి మనం తెచ్చుకోవాల. ఈ పనికి ఎవరు పూనుకుంటారు? చెప్పండ్రి. ఊరు కోసరం వూరి బాగ్గోసరం ఎవరు ముందు కొచ్చారు? వోళ్ళకు వూరికి దిగదాల ఏటిగట్టున పదెకరాల బూమి ఇచ్చాం. వూర్లో యింటికి, పసుల్దొడ్డికి, వామి ఏసుకోడానికి, కల్లానికి యాబై సెంట్లు సలం ఇచ్చాం. వారి కుటుంబానికి లచ్చ రూపాయలు పోగుజేసి ఇచ్చాం.
ఆ పెయత్నంలో పానాలు పోతే ఆకుంటుంబానికి పంచాయతీ నెల బత్తెం యిచ్చూ బతుకంతా సూసుకుంటాది. వారి పిల్లలను సదివించి పయోజికుల్ని చేచ్చాది. కాబట్టి ఎవరైనా సాసం చేయేచ్చు. " ఆయప్ప మాట్టాన్యకాడికి మాట్టాడి కూకున్యాడు.
ఐనా గూడ ఒక్కరూ ముందుకు రాల్యా. అదేంత పానం మీది పనో అందరికి తెల్సు. అట్టందుకే అందరూ గమ్మున నుండి పోయినారు. యెంతసేపు సూసినా మందిలోంచి ఒక్కడూ చెయెత్తలేదు. సూచ్చూసి పుల్లారావు నిల్బడి,
"ఆలోసించండి! కరువు బోడానికి యేమేమి చెయాలో అన్నీ చేసినాం. ఆవుల పబ్బం ఆడించ్చినాం. ఇరాటపరవం సెప్పిచ్చినాం. అద్దరాతిరి పెళ్ళిగాని ఆడపిల్లల్ను అంగమొల(నగ్నంగా) వూరిసుట్టూ తిప్పినాం. పగిలిపోయిన రోళ్ళు, ఇరగిపోయిన రోకుళ్ళు, ఒక్కిలిపోయిన రాతి పనిముట్లు, పాత పొరకలు, పాత చాటలు, వూరి బయటికి బండ్లతో తోలినాం.
కప్పల పెండ్లిళ్ళు సేసినాం. ఐనా కరువు పోల్యా. కడగండ్లు పోల్యా. సితి ఆరోగోరంగానే(చాల ఘోరంగా) ఉండాది. మన దరిద్దరం పొవాలంటే దద్దనాలోళ్ళు తీస్కపోయిన పొలి తిర్గి తీస్క రావడమే. ఇంగ యేరొక దోవ కన్పల్యా. మనూరి బాగ్గోసరం యువకులు త్యాగం చెయాల. ఈపనికి యేవరు సమర్తులో తేల్చి సెబ్బండ్రి" అని పుల్లారావు " ఇస్సుబ్బా" అనుకుంటా నీరసంగా అరుగు మీద కూలబన్యాడు.
జనంలో ఉలుకూ పలుకూ లేదు. చెయేత్తడానికి ఈడిగల(ధైర్యం లేక) పన్యారు. ఒకరి మోగాలు ఒకరు సూసుకున్యారు. గుసగుసా గునపోసుకున్యారు.
అబ్బుడు అంకాల్రాయుడు లేసి తువాల ఇదిలిచ్చి బుజాన యేస్కొని సెప్పడం మొదులు బెట్నాడు-
"వూర్లో అందరికీ ఆవజివాలు (జవసత్వాలు) కుంగిపొయినాయి. బతుకులు సూచ్చే పంగదెంగులు (చెడిపోవడం) పదారబాట్లైనాయి. యెవరికీ బొట్టుపానం లేదు. కన్లల్లో పానంబెట్టుకొని ఊసబెండ్లలా ఈలకర్సుక(నేల కరుచుక)పోయి వుండారు. గెట్టిగా పడమటి గాలీచ్చే ఒగుడాకులా (పండాకు) బారడు దూరం పడేట్టు వుండారు. ఈల్లెవరూ ఈపనికి సమర్తులుకారు. ఒక్క సుంకన్నైతేనే తగినోడు. ఈ కార్యం సాదించగల సత్తా వున్నోడు. ఓర్పు నేర్పు చురుకుదనం పట్టుదల గలోడు. అంతోయింతో గెట్టిగా బలంగా వున్నోడు. వూరికి యేదన్న మేల్సేయాలన్న ఆసియం వున్నోడు. అతను దప్ప యేవడి వొల్లా గాదు. " అంకాలడ్రాయుడి మాటలకు అందరూ ఆసగా సూసినారు సుంకన్న దిట్టు.
"ఔనూ.. ఔనూ.. సుంకన్నే సమర్తుడు. " అని జనమంతా పలికనారు.
సుంకన్న ఉలికిపాటుగా అదిరి పన్యాడు. అదే జనంలో కుడ్చున్న చదువుకున్న జంబులన్న లేచి పంచాయతీ తీర్మానం తప్పు దోవ పడుతునందకు చింతించి "అయ్యా పెద్దలారా! వానరాక పోవడానికి ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వచ్చిన మార్పులు కారణం గ్గాని పొలి ఎత్తకపోవడం కాదు. అది వఠ్ఠి మూడనమ్మకం. పొలి తీస్క రావడంలో ప్రాణాలు పోతే అది మీ మూర్ఖత్వం, మీ మూడనమ్మకం కారణమవుతుంది. ఇలాంటి ప్రమాదకరమైన నిర్ణయం తీసుకోకండి. వానలు ఆలస్యమైనా పడతాయి" అన్యాడు ఆందోళనపడతూ..
"చదవుకున్నోళ్ళు అట్టే అంటారు. ఆయన్ను వదిలైండ్రీ" అని ఆయన మాటల్ని పూచిక పుల్ల మాద్రిగా తీసిపారేసినారు జనం. సుంకన్న దిట్టు తిరిగి చెప్పమన్నట్టు ఆసగా సూసినారు.
"అయ్యలారా! నాగ్గూడా వూరికేదన్న మేలు సేయాలని వుండాది. గానీ నా అమ్మనాయినలు ముసలలోళ్ళు. తమ్ముడు చెల్లెలు న్యాదర(లేత) పిల్లోల్లు. నాకేమన్నైతే వాళ్ళు అన్నాయమైపోతారు. నేదప్ప వాళ్ళకు దిక్కులేదు. " ఇచారంగా చెప్పుకున్యాడు సుంకన్న.
జనం సుంకన్నను బతిమాలినారు. "వూరి యువకులంతా బెట్టబోయివుండారు. నువ్వే రోంత గెట్టిగా వుండావు. నువ్వు మాతరమే పొలి త్యాగలవు. నువ్వు పొలి తీసుకొని పరిగెత్తి వొచ్చే పొలిమేరలో మేమంతా అయుదాలతో సిద్ధంగా వుంటాం. నీ యంటబడొచ్చే దద్దనాలోళ్ళకు ఎద్రు నిల్బడి పోరాడ్తం. నీకేం బయం లేదు. " పోద్బలంగా (ధైర్యం) చెప్పినారు.
"ఊర్నీ ఈ ఇపత్తు నుంచి తప్పిచ్చాల. గానీ పొలి త్యావడమంటే జనాన్ని ఆదమరింపించి సైగ్గా (శబ్దం చేయకుండ) దెచ్చేది కాదు. అందరికీ ఇనబడేట్టుగా కేకేసి చెప్పి వాళ్ళకు చిక్కకుండా ఉరికెత్తి రావాల. అట్టాడప్పుడు మన అదుట్టం బాగల్యాక నా పానానికి ముప్పొచ్చే. నా వోళ్ళు యేంగావాల? ఇదీ ఉరకల పరుగుల యవ్వారం" అనమానం పన్యాడు సుంకన్న.
అబ్బుడికబ్బుడు పంచాయతీ పెద్దలు కాగితాలు తెప్పించి ఊరికి దిగదాల (క్రింది) యేటి గట్టునున్న పదేకరాల బూమి ఊర్లో పడమటీది నున్న యాబై సెంట్లు సలం, అందులో నున్నా రేకులిల్లు, పసుల్దొడ్డి, కల్లంతో సహ రాచ్చినారు. లచ్చ రుపాయలు పోగుజేసి సుంకన్న చేతిలో బెట్న్యారు. సుంకన్న కేమన్నైతే గ్రామ పంచాయతీ సుంకన్న కుటుంబానికి నెలనెలా బత్తెమిత్తూ పిల్లల్ని చదివిచ్చి పయోజుకుల్ని సేసేటట్టూ నిర్నయం సేసి పంచాయతీ బుక్లో రాసినారు.
ఇంగ తప్పదన్నట్టు ఒప్పుకొని యకాయకిన యింటికి బోయి అమ్మనాయినకు ఇసయం సెప్పినాడు సుంకన్న. తల్లిదండ్రులు బోరున ఏర్చినారు.
"ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతుకుదాం నాయిన. మనకొద్దు ఈపనీ. మనకొద్దు కొడకా!" అన్సెప్పీ తల్లిదండ్రులు తల్లడిల్లి పోయినారు.
"నాకేం గాదులేమ్మా! సున్యాసంగా పొలి తీస్కొచ్చాను. పొలిమేర కాడ మనోళ్ళు ఆయుదాల్తో వుంటారు. బయపడాల్సిన పన్లేద"ని సెప్పి పంచాయిదిచ్చిన లెక్కా, బూమి పట్టాలు ఇచ్చినాడు. ఇంగా పంచాయతీ ఏమేమి నిర్నయాలు దీస్కొందో సెప్పినాడు.
"ఈ యేమీ నీ కన్నా యెక్కువ కాదు నాయినా! నువ్వే మాకు ఎదిగొచ్చిన పిల్లోడివి. నీ మీదే మా పానాలుండాయి. బతికుంటే కూలోనాలో చేసుకొని బతకొచ్చు. మా మాటిను బిడ్డా!" బతిమలాడినారు తల్లిదండ్రులు.
"అమ్మా! నాయినా! నాకేం గాదు. మీరు బాదపడి నన్ను బాద పెట్టకండ్రీ. ఊరికి మేల్సేసే అవకాషం మనకొచ్చింది. అది గొప్పనుకుంటాను నేను. ఇంగేం మాట్టాడకండ్రీ. పొలి తెచ్చానని ఊరికి మాటిచ్చిన." కరాకండిగా సెప్పినాడు సుంకన్న.
* * *
1970కి మునుపటి సంగతి. అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలతో పాటు అప్పుడప్పుడు కలర్ సినిమాలు వొచ్చాండేవి. అనిమెలకు దగ్గిరుండే కమలాపురం లాంటి సిన్న టవున్లల్లో టెంట్లుండేవి. దసరాబుల్లోడు కలర్ సినిమా వొచ్చిందని ఎద్దులబండి కట్టి ఆడమొగ పిల్లాజల్లా యింటిల్లపాది బోకుశాలగా సూడను పోయినారు. అప్పట్లో అదో ఇసిత్రం కలర్ సినిమాంటే. ఆదినాల్లో వూరూర ద్యావర్లు జరిగేవి. మూడనమ్మకాల మీద జనానికి నమ్మకం యేక్కువ వుండేది. అప్పటి కతయిది.
అనిమెల దద్దానాల మద్దిన దూరం పది కిలో మీటర్లు. అనిమెల గండేటి ఒడ్డున, దద్దనాల పాగేటి ఒడ్డున వుండాయి. మొదట్లో అనిమెల్లో సకాలంలో వానలు గురిసి, ఏరు పారి, చెరువు నిండి, పంటలు దండిగా పండి, పాడి మెండుగా పెరగి ఊరు కళకళాడ్తుండినాది.
దద్దనాల్లో వానలు కురువక, ఏరు పారక, చెరవు నిండక, పంటలు పండక, పసువులకు మేతల్యాక నానాక ఇబ్బందులు పడేటోళ్ళు. చెప్పను అలివిగాని ఇడుములు ఇక్కట్లు అనబయించేవోళ్ళు.
అట్టాటబ్బుడు అనిమెల అన్నెందాల బాగున్నందున ఆ వూరిపై దద్దనాలోళ్ళ కన్నుపన్యాది. అనిమెల్లో పోలేరమ్మ ద్యావర జరేగేబ్బుడు అనిమెల పజలు అజాగరతగా ఉండేది సూసి దద్దనాలోళ్ళు వోళ్ళ పొలిని ఎత్తుక పోయినారు. అనిమెలోళ్ళు ఎగాసగా పడి ఆయుదాలందుకొని యంటపడే సరికి ఊరుదాటి పొలిమేర గూడా దాటిపోయినారు.
అప్పట్నుంచి అనిమెలను కరువు తొందుకొని నలిపి సంపుతాంది. తమ పొలి తాము తెచ్చుకుంటేగాని తమ ముందటి వైబోగం తమకు దిరిగి రాదని అనిమెలోళ్ళు నిర్నయించుకున్యారు. ఈ పమాదకర కార్యాన్నీ నెరవేర్చేకి సుంకన్న పూనుకున్యాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: కాశీవరపు వెంకటసుబ్బయ్య
చదువు: B.com
పుట్టిన తేది: 1960
తల్లిదండ్రులు: వెంకటసుబ్బయ్య
రచనలు: ఎద మీటిన రాగాలు కవితా సంపుటి.
అముద్రితాలు: తుమ్మెద పదాలు మని కవితలు సంపుటి, పినాకిని కథలు కథల సంపుటి.
సాహిత్య సేవ: చైతన్య సాహిత్య కళా వేదిక సంస్థను స్థాపించి అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించడం.
సన్మానాలు సత్కారాలు: అనేక సాహితీ సంస్థల నుంచి సన్మానాలు సత్కారాలు పొందడం.
Comments