top of page
Writer's pictureLakshmi Madan M

పౌరోహిత్యం


'Pourohithyam' - New Telugu Story Written By Lakshmi Madan

'పౌరోహిత్యం' తెలుగు కథ

రచన: లక్ష్మి మదన్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"రామలక్ష్మి.. రామలక్ష్మి!" అంటూ పిలిచాడు రాఘవ శర్మ.


"వస్తున్నానండి ఒక్క నిమిషం ఆగండి. పెరుగు పాలు ఉట్టిమీద పెట్టేసి వస్తాను. అసలే దొంగ పిల్లి ఇక్కడే కాచుకుని కూర్చుంది" అని సమాధానం ఇచ్చింది రామలక్ష్మి.


పది నిమిషాలకు మనసాలలోకి వచ్చిన రామలక్ష్మి..


"ఎందుకు పిలిచారు" అని అడిగింది.


"నిన్న చెప్పడం మరిచాను దొరవారింట్లో ఇవ్వాళ సత్యనారాయణ వ్రతం నేను తొందరగా వెళ్ళాలి నా ఎర్ర అంచు ధోవతి.. ఉత్తరీయం తెచ్చి పెట్టు" అని చెప్పి సంధ్యావందనం చేసుకో సాగాడు రాఘవ శర్మ.


"సరేనండి తెచ్చి పెడతాను మరి మహా నైవేద్యం నేనే చేయాలా ఈరోజు" అని అడిగింది.


"అవును, నువ్వే చెయ్యి. ఇప్పుడు పండు నైవేద్యం పెట్టాను” అని చెప్పి సంధ్యావందనం ముగించుకొని అభిషేకం మహా పూజ ముగించి పండ్లు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి గంట మోగించి బయటకు వచ్చాడు రాఘవ శర్మ.


నుదుట విభూతి రేఖలు... ఎర్రటి బొట్టు తలకుశిఖ... ఎర్రని పట్టు పంచె కట్టుకొని భక్తి భావం ఉట్టిపడేలా కనిపించారు రాఘవ శర్మ.


ధోతి కట్టుకొని పైన ఉత్తరీయం కప్పుకొని చేతి సంచిలో సత్యనారాయణ వ్రత కల్పము జపమాల పెట్టుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడు రాఘవ శర్మ..


"నేను బయలుదేరుతున్నాను రామలక్ష్మి" అని గట్టిగా చెప్పాడు...


"అయ్యో అదేంటండీ గుప్పెడంత సత్తిపిండి తిని బయలుదేరండి" అన్నది రామలక్ష్మి.


"వద్దు ఆలస్యం అయిపోతుంది బయలుదేరాలి నడుచుకుంటూ వెళ్లే వరకు చాలా ఆలస్యం అవుతుంది. సైకిల్ మీద వెళ్దామంటే అది ఇప్పుడే పంచర్ అయింది" అని అన్నాడు రాఘవ శర్మ.


"అది కాదండి దొరవారి ఇంట్లో ఎప్పుడైనా చాలా ఆలస్యం అవుతుంది నా మాట విని ఈ చల్ల తాగి వెళ్ళండి" అని పెద్ద గ్లాసులో పలచటి మజ్జిగ ఉప్పు వేసి ఇచ్చింది రామలక్ష్మి.


ఆ గ్లాసు తీసుకొని గట గట మజ్జిగ తాగేసి గ్లాసు రామలక్ష్మి చేతికిచ్చి బయలుదేరాడు రామశర్మ.


ఆయన వెళ్ళగానే వంటింట్లోకి వచ్చింది రామలక్ష్మి... వీళ్ళు ఉండేది మరీ పల్లెటూరు కావడంతో అక్కడ చదువు సౌకర్యం ఎక్కువగా లేకపోవడం వల్ల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు... కాలినడకనే అంతదూరం వెళ్ళాలి... ఊర్లో పౌరోహిత్యం అంతంత మాత్రమే.. రాఘవ శర్మ కూడా చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్లి పౌరోహిత్యం పనులు ముగించుకొని ఎంత రాత్రి అయినా ఇంటికి చేరుకుంటారు..


అప్పటి రోజుల్లో వచ్చే రాబడి తక్కువే. ఐదు నుండి 10 రూపాయలు ఇస్తే ఎక్కువే... ఉన్న ఊరు విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లాలంటే మనసు ఒప్పక అక్కడే ఉంటున్నారు వీరి కుటుంబం. అందులో రాఘవ శర్మ గారి తల్లితండ్రులు కూడా వీరితోనే ఉంటారు. వారిని వదిలి ఎక్కడికి వెళ్తారు... అందులో లంకంత కొంప. ఏఊరికి వెళ్తే మాత్రం ఇంత పెద్ద ఇల్లు దొరుకుతుంది.. ఏదో చిన్నపాటి వ్యవసాయం తిండి గింజలకు సరిపోతుంది... పౌరోహిత్యం వల్ల వచ్చే రాబడి.. అలా సరిపుచ్చుకుంటున్నారు..


వంటింట్లోకి వచ్చిన రామలక్ష్మి అత్తగారి పూజ కోసం అవసర మైనవి సిద్ధంచేసి అప్పుడే పూజ చేసుకుని వచ్చిన మామగారికి ఒక గ్లాసుడు మజ్జిగ కలిపి ఇచ్చేసి మడి కట్టుకోవడానికి లోపలికి వెళ్ళింది.


గబా గబా నడుస్తున్నా రాఘవ శర్మ.. పక్క ఊరిలో పాఠశాలలో చేసే ఉపాధ్యాయులు రాములు కనిపించారు...


"అయ్యగారు దండాలు.. ఏడికో ఆగమాగంగా వోతున్నారు" అన్నాడు రాములు.


"దొరవారి ఇంట్లో వ్రతం ఉందయ్యా అందుకే తొందరగా వెళుతున్నాను" అన్నాడు రాఘవ శర్మ.


"ఇయ్యాల మీ భోజనం అయినట్టే" అనుకుంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు రాములు.


"తప్పదు మరి ఏంచేస్తాం" అని నడకవేగం పెంచారు రాఘవ శర్మ.


జమీందారు గారి బంగ్లా రానే వచ్చింది.. పెద్ద పాటకి పెద్ద పెద్ద ప్రహరీ గోడలతోపాటు పెద్ద బురుజుతో ఎంతో అందంగా ఉంది ఆఇల్లు. గేటు తీసుకొని లోపలికి అడుగుపెడుతున్న రాఘవ శర్మ ను ఇంట్లో పని చేసే వీరయ్య "దండాలయ్యగారు రాండ్రి" అని లోపలికి తీసుకొని వెళ్లాడు..


లోపలికి వెళ్ళిన రాఘవయ్యకు ఇంకా సత్యనారాయణ వ్రతంకు ఏర్పాట్లు ఏమీ పూర్తికానట్లు అనిపించింది... కొంతమంది ముత్తైదువలు పీటను అలంకరిస్తున్నారు.. వచ్చిన బంధువులు టిఫిన్ చేస్తూ కాఫీలు తాగుతూ అటుఇటు తిరుగుతున్నారు...


ఇటుగా వచ్చిన దొరవారు మహేంద్ర రాఘవ శర్మన్ చూసి


"దండాలు అయ్యగారు అయిపోయింది కొంచెంసేపట్లో స్నానం చేసి వస్తా! ఏమన్నా తింటే పనికి వస్తదా పూజకి" అని అడిగాడు.


"పాలు పండ్లు మాత్రం తీసుకోవచ్చు.. వేరే ఆహారము పూజ అయ్యేవరకు నిషిద్ధము" అని చెప్పి సంచిలో నుండి ఒక పుస్తకం తీసుకొని కింద కూర్చొని పారాయణం చేసుకో సాగాడు.


దొరవారి భార్య వచ్చి..


"అయ్యగారు పాలు పోసియ్యమంటారా.. తాగుతారా" అని అడిగారు.


"వద్దమ్మా! ఇంట్లో మజ్జిగ పుచ్చుకునే వచ్చాను" అన్నాడు రాఘవ శర్మ.


ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. పోనీ ఆలస్యంగా వద్దామనుకుంటే పోయినసారి అనుభవం గుర్తు వచ్చింది.. దారిలో ముల్లుగుచ్చుకోవడం వల్ల నడవలేక చాలా మెల్లగా వచ్చాడు. ఆరోజు దానికి దొరవారు కొంచెం వెటకారంగా మాట్లాడారు. ఆ విషయం గుర్తొచ్చి మౌనంగా అక్కడే కూర్చున్నాడు రాఘవ శర్మ......


అలా మౌనంగా కూర్చున్న రాఘవ శర్మకు దొరవారి నుండి పిలుపు వచ్చింది...


"అయ్యగారు.. అన్ని సిద్ధంగా ఉన్నాయి ఒక్కసారి చూడండి. ఏమన్నా తక్కువ ఉంటే మా ఇంటామె చూస్తది" అన్నాడు.


సత్యనారాయణపీట దగ్గరికి వచ్చిన రామ శర్మ అక్కడ ఉన్న పూజ ద్రవ్యాలను అన్నింటినీ పరికించి చూసి సంతృప్తిగా తల ఊపి..


"అన్నీ వచ్చాయి దొరవారు. ఒక్క పంచామృతము ఇంకా రానట్లు ఉన్నది" అన్నాడు.


"అట్లనా ఇప్పుడే తెప్పిస్తా" అని భార్యను పిలిచి పంచామృతం సంగతి చెప్పి "నేను రెండు నిమిషాల్లో వస్తా " అని చెప్పి లోపలికి వెళ్ళాడు..


రెండు నిమిషాలు అన్నచోట 20 నిమిషాలు అయిపోయింది… దాదాపు 12 గంటలు కావస్తుంది... అప్పుడు దొర వారి భార్య పట్టుచీర సింగారించి వచ్చి పీటల మీద కూర్చుని దొరవారిని పిలిచింది.. దొరగారు కూడా పట్టు పంచ కట్టుకొని వచ్చి పీటల మీద కూర్చున్నాడు. వచ్చిన బంధుజనం పూజ దగ్గర కూర్చున్నారన్నమాట కానీ ఎవరి పక్కనుంటే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నారు.


సత్య నారాయణ వ్రతం విశిష్టత గురించి ఎంతో చక్కగా వివరించారు రాఘవ శర్మ... దొరవారు ఆవులింతలు తీస్తున్నడు..ఎప్పుడు అయిపోతుందా అని.. దొర సానమ్మ వచ్చిపోయే చుట్టాలు తనకన్నా మంచి చీర కట్టారా..నగలు ఏం వేసుకున్నారు ఇదే గమనిస్తుంది…

‘లోకం తీరు ఇట్లా ఉంది..భక్తిలేని పూజలు..ఆడం బరాల మీద మోజు’ అనుకున్నాడు రాఘవ శర్మ.


మొత్తం మీద సత్యనారాయణ వ్రతం జరిగింది.. అందరికీ తీర్థప్రసాదాలు పంచి రాఘవ శర్మ గారు కూడా తీసుకొని అక్కడే కూర్చుని "అయ్యా మాకు సెలవిప్పిస్తారా" అని అడిగాడు.


"కొంచెం సేపు ఆగుండి అయ్యగారు! అందరు భోజనాలు చేస్తున్నారు ఒకసారి అరుసుకొని వస్తా" అన్నాడు.


అప్పటికి మూడున్నర కావస్తుంది ఆకలి కూడా వేయ సాగింది అందులో రాత్రిపూట ఏమీ తినకుండా పడుకున్నాడు భార్య చెప్పిన మాట వినాల్సింది" అనుకున్నాడు "ఆ సత్తుపిండి నోట్లో వేసుకుని వచ్చినా బాగుండేది" అనుకున్నాడు..


'అయినా ఇన్ని రకాల పలహారాలు స్వీట్లు చేయించారు కనీసం రెండు స్వీట్లు పెట్టి ఓరెండు అరటిపండు ఇస్తే వాళ్ళ సొమ్మేం పోయింది.. వెనకట మాతండ్రిగారు ఎక్కడ ఏమి తినలేదని ఇప్పుడు మాగతి ఇలాగే చేస్తున్నారు..ఈరోజుల్లో కుదురుతుందా.. పండో ఫలమో తినకుంటే’ అనుకున్నాడు.


‘ఇన్ని రకాల వంటకాలు చేసుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపోదు కనీసం పిల్లలకైనా కట్టిస్తే బాగుండేది’ ఇలా అనుకున్నాడు..


‘అవి కట్టించడం మాట దేవుడెరుగు సంభావన సరిగా ఇస్తే చాలు’ ఇలా మనసులో అనుకుంటూనే ఉన్నాడు హాల్లో అందరికీ భోజనాలు వడ్డించారు. కమ్మటి భోజనాల వాసన వచ్చేవరకు ఇంకా ఆకలి పెరిగింది.


‘ఈరోజు ఇంటికి వెళ్లి భోజనం చేసేసరికి ఏ రాత్రి అవుతుందో ఏమిటో చాలా నీరసంగా కూడా ఉంది ఎప్పుడూ లేనిది ఇంత ఆకలి వేస్తుంది ఏమిటి?‘ అనుకున్నాడు.


అమెరికా నుండి వచ్చిన దొరవారి కొడుకు అక్కడికి వచ్చి ఆప్యాయతగా పలకరించాడు. కాళ్లకు నమస్కారం కూడా చేశాడు.


"అయ్యగారు బాగున్నారా! నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, మీ పద్ధతులు.. మీరు.. ఏమీ మారలేదు.. మీరంటే నాకు చాలా గౌరవం" అని అన్నాడు.


"అవునా నాయనా చాలా సంతోషం! అమెరికాలో పెద్ద ఉద్యోగం చేసుకుంటూ కూడా మా బోటివారిని గుర్తు పెట్టుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీర్ఘాయుష్మాన్ భవ" అని దీవించాడు రాఘవ శర్మ.


ఇంతలో దొరవారు సంభావన ఇయ్యడానికి భార్యతో సహా కలిసి వచ్చాడు..


పళ్ళెంలో అరటి పళ్ళు సంభావనకు సంబంధించిన డబ్బులు ఒక పంచల చాపు పెట్టుకొని వచ్చింది దొరవారి భార్య..


దొరవారి కొడుకు తల్లిని పిలుచుకొని లోపలికి వెళ్ళాడు.


తర్వాత రాఘవ శర్మకు దక్షిణ ఇచ్చి కాళ్లకు నమస్కారం చేసుకున్నారు. ఎప్పటిలాగే అదే ఐదు రూపాయల దక్షిణ కనబడింది..


ఉసూరుమని మూలుగుతూ రాఘవ శర్మ ఇంటికి బయలుదేరాడు.. బయటకు వస్తుండగా పాటకి వద్ద దొరవారి కొడుకు నిలబడి ఒక పెద్ద సంచి అందజేశాడు.


"ఏమిటి ఇది బాబు" అని అడిగాడు..


"మీరు ఇంటికి వెళ్ళాక తెరిచి చూడండి" అని చెప్పాడు...


"ఈ ఎండలో మీరు నడిచి వెళ్లలేరు నేను డ్రైవర్ని పంపిస్తాను కారులో వెళ్ళండి " అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు.


అప్పటికే ఆయన ముందరికి కారు వచ్చి ఆగింది. కారులో ఇంటికి వచ్చాడు రాఘవ శర్మ.


పిల్లలు ఎదురుగా రానే వచ్చారు..


"నాన్నా! ఇంతసేపయింది మా కోసం ఏం తీసుకొచ్చావు" అని అడిగారు.


"ఏముంది నాయనా !మనకు ఇక్కడ ఏం దొరుకుతుందని ఎప్పటిలాగే దక్షిణ తాంబూలం ఇచ్చారు" అన్నాడు నీరసంగా.


ఇంతలో రామలక్ష్మి.. "ఆగండర్రా నాన్నగారు భోజనం చేయలేదు మీరు కాస్త ఊపిరి పీల్చుకొని వ్వండి" అన్నది.


ఇంతలో డ్రైవర్ కార్లో నుండి సంచులన్నీ లోపల పెట్టాడు.


"ఇదేంటివి" అని పిల్లలు సంచులు తీసుకున్నారు.


రాఘవ శర్మ కూడా ఆ సంచుల్లోఏము న్నాయో చూడాలని కుతూహలపడ్డాడు.


"రామలక్ష్మి! ఒకసారి ఆ సంచులు తెరిచి చూడు పిల్లలు ముచ్చట పడుతున్నారు" అన్నాడు.


రామలక్ష్మి ఆ సంచులు అన్నీ తెరిచింది.. ఒక్కసారి ఆశ్చర్య పోవడం అందరివంత అయింది..


రకరకాల ఫలహారాలు స్వీట్లు పండ్లు చాక్లెట్స్ ఇంకా ఎన్నో తినుబండారాలు ఆ సంచుల్లో ఉన్నాయి..


కొన్ని సంచుల్లో ఒక ఐదు పట్టు చీరలు ఐదు పంచలు కొన్ని కప్పుకునే చెద్దర్లు ఇవన్నీ ఉన్నాయి.


మరొక సంచిలో పిల్లలకు సంబంధించిన పుస్తకాలు పెన్సిళ్లు పెన్నులు ఉన్నాయి..


మరొక చిన్న కవర్ కనిపించింది. ఆ కవర్లో పదివేల రూపాయలు ఉన్నాయి... అంత మొత్తము రాఘవయ్య ఎప్పుడూ చూడలేదు..


దానితో పాటుగా చిన్న ఉత్తరం కూడా కనిపించింది... అందులో


"పంతులుగారు.. ఆర్థికంగా మీకు ఎంతో ఇబ్బంది ఉందని నేను గ్రహించాను. మీ గురించి అందరూ ఎంతో మంచిగా చెప్పారు. మీరు డబ్బుకుప్రలోభ పడే మనిషి కాదని నేను తెలుసుకున్నాను.. ఎంతో సంపాదిస్తున్నాను. మాకు డబ్బుకు ఏమాత్రం తక్కువ లేదు. అయినా అదే పాత ఆచారం ప్రకారం మా తండ్రిగారు మీకు దక్షిణ ఇవ్వడంలో పిసినారితనం చూపిస్తున్నారు. అది నాకు నచ్చక ఇవన్నీ నేను మీకు కానుకగా పంపిస్తున్నాను. దయచేసి స్వీకరించండి..


ఇక మీ పిల్లల చదువులకు సరిపడే డబ్బులు నేను ప్రతినెలా పంపిస్తాను. వారిని మంచి చదువులు చదివించండి. మీ వల్లనే ఈ ఊరు సుభిక్షంగా ఉంది" అని రాసి ఉంది.


ఎంతో సంతోషపడ్డ రాఘవ శర్మ మరియు రామలక్ష్మి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు "మా కష్టాలు గట్టెక్కాయి" అని దేవుడికి దండం పెట్టుకున్నారు. పిల్లల ఆనందానికి హద్దే లేదు. చాక్లెట్స్ తింటూ పుస్తకాలన్నీ చూసుకుంటూ ఎంతో సంతోషపడుతున్నారు. వారి సంతోషాన్ని చూసి మరింత మురిసిపోయారు రాఘవయ్య రామలక్ష్మి దంపతులు.

***


లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు


41 views0 comments

Comments


bottom of page