'Pragathi Premikulu episode 11' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు యస్. ఐ. వివేకానంద పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం పూర్తి చేసాడు అతడు. తమ్ముడు విజయానంద ని కలుస్తాడు. రాజకీయ నాయకుడు ధనుంజయరావు, ఎస్సై వివేకానందను తన అదుపాజ్ఞలలో పెట్టుకోవాలనుకుంటాడు. తాను ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం తల్లికి ఇష్టం లేదని గ్రహిస్తాడు వివేకానంద. తన మేనమామ ఆదిశేషయ్యను కారణాలు చెప్పమంటాడు.
వివేకానంద తండ్రి మృతి సహజం కాదనీ, అందులో వివేకానంద పినతండ్రి ధనుంజయ రావు ప్రమేయం ఉందని చెబుతాడు ఆదిశేషయ్య.
తన బర్త్ డే కి విజయ్ ని ఇన్వైట్ చేస్తుంది అమృత.
ధనుంజయరావు. కొడుకు ఉపేంద్రను హత్యానేరంపై అరెస్ట్ చేస్తాడు వివేకానంద.
ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 11 చదవండి.
కఠిన శిక్షకు గురిఅయిన సాంబయ్య ప్రాణభయంతో ఉపేంద్ర చెప్పగా తనే సీసాల్లో ఎండ్రిన్ కలిపి వారికి ఇచ్చినట్లు ఒప్పుకొన్నాడు. ఉపేంద్రకు బెయిల్ దొరకకుండా చేశారు త్రిపాటి, వివేకానందలు. లాయర్ పీతాంబరం ప్రయత్నం ఫలించలేదు. కేసు కోర్టుకు వెళ్ళింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్
అనంతయ్యగారు, డిఫెన్స్ లాయర్ పీతాంబరంగారు, సాక్షులను కోర్టులో జడ్జిగారి ముందు విచారించారు. జడ్జిగారు కేసును రొండుసార్లు వాయిదా వేసి మూడవమారు, పోలీసులు బలపరిచిన సాక్ష్యాల ఆధారంగా ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షను, మిగతా ఏడుగురికి ఐదేళ్ళ జైలు శిక్షను, విధించినట్లు జడ్జిమెంటు చెప్పారు.
ఈ వార్త విన్న ధనుంజయరావు కుప్పలా కూలిపోయాడు. తను నమ్మిన వారంతా మోసం చేశారని పిచ్చివానిలా గావు కేకలు వేశాడు. ఎంతోకాలంగా వారికి వంత పాడిన మిత్రులు, హితులు ఈ సంఘటనతో 'బ్రతుకు జీవుడా' అని అతనికి దూరమైపోయారు. బ్రతికుంటే బలుసాకు తినైనా బ్రతకవచ్చనే నిర్ణయానికి వచ్చి వారి తత్వాలను మార్చుకున్నారు.
రాజేశ్వరమ్మ కొడుకును తలచుకొంటూ కుమిలి కుమిలి ఏడ్చింది. తన బిడ్డ ఈ స్థితికి కారణం తన భర్తే అని అతన్ని అసహ్యించుకొంది. అతని ముఖం చూడడం మానేసింది. త్రివిక్రం తల్లికి అండగా నిలచి వూరడించి ఓదార్చాడు. ఎక్కువ సమయం ఆమె ప్రక్కనే ఉండి గడిపేవాడు.
నగరవాసులు క్రొత్త గవర్నమెంటును గురించి, పోలీస్ వ్యవస్థ పని తీరును గురించి ఎంతగానో సంతోషించారు. నిష్పక్షపాతంగా నేరస్థులను పట్టుకొని, వారికి తగిన శిక్ష పడేలా చేస్తే, నేరాలు చేసేవారి సంఖ్య అంతరించి పోతుందని, సామాన్య మానవుని జీవిత విధానంలో శాంతి ప్రశాంతతలు వస్తాయని, నేరాలు తలెత్తవని ఆనందించారు. జడ్జిగారి తీర్పు నగరంలో సంచలనాన్ని సృష్టించింది.
డి. ఐ. జి త్రిపాటిగారికి, యన్. ఐ వివేకానందకు పలువురి ప్రశంసలు లభించాయి. కొందరు ప్రముఖులు నేరుగా వారిని కలసికొని ప్రశంసించారు.
"మా కర్తవ్యాన్ని నిర్భయంగా మేము నెరవేర్చామని, దీనికి కారణం కొత్త నాయకులు, కొత్త ప్రభుత్వమేనని, మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేని కారణంగానే మేము ఈ కార్యాన్ని చేయకలిగామని, ఇకపై కూడా మా కర్తవ్యనిర్వహణ ఇలాగే వుంటుందన, మా లక్ష్యసాధనకు మాకు మీ అందరి సహాయ సంపత్తి అవసరమని, నేరం చేసినవాడు తగిన శిక్షను అనుభవిస్తే వాడిలో పరివర్తన వచ్చే అవకాశముందని" అందరికీ సవినయంగా చేతులు జోడించి చెప్పారు త్రిపాటి, వివేకానందలు.
మనశ్శాంతి కోల్పోయిన ధనుంజయరావు, తన మకాం ఊటీలో ఉన్న గెస్టు హౌస్ కు మార్చాడు. రాజేశ్వరి తన పెద్ద అన్నయ్య అనంతయ్యగారి ఇంటికి త్రివిక్రంతో కలసి వెళ్ళిపోయింది.
గంట ఎనిమిదిన్నర. అమృత టిఫిన్ చేస్తూ వుంది. సెల్ మ్రోగింది.
“అమ్మా.. నమస్కారం.. !" కాంట్రాక్టర్ ధర్మలింగం ఫోన్ చేశాడు.
"ఏమిటండీ విషయం.. ?”
“అమ్మా.. ! బిల్డింగ్ రూప్ స్లాబ్ కూలిపోయిందమ్మా.. !” గద్గద స్వరంతో చెప్పాడు ధర్మలింగం.
“ఆఁ” ఆశ్చర్యపోయింది అమృత.
“ఎప్పుడు?.. ”.
“ఉదయాన్నే వెళ్ళి చూస్తే కూలివుందమ్మా.. !”
"స్లాబ్ ఎప్పుడు వేశారు.. ?"
“నిన్ననేనమ్మా.. !”
“స్లాబ్ వేసేముందు ఏ. ఇ విజయ్ అంతా చెక్ చేశారా.. !”
“చెక్ చేసారమ్మా.. !”
“వారికి ఫోన్ చేశారా.. !”
“చేశానమ్మా.. !”
“మీరెక్కడ వున్నారు.. ?"
"బిల్డింగ్ దగ్గరే వున్నానమ్మా.. !”
“నేను వెంటనే బయలుదేరుతున్నాను. విజయ్ కి ఫోన్ చేసి నేను వస్తున్నట్లుగా అతన్ని అక్కడికి రావలసిందిగా చెప్పండి. ” ఫోన్ కట్ చేసి వేగంగా బేసిన్ వద్దకు వెళ్లి చేయి కడుక్కొంది.
"ఏమిటే తింటువున్న టిఫిన్ వదిలేసి చేయి కడుకొన్నావు.. !" ఆశ్చర్యంతో అడిగింది తల్లి.
“అర్జంటుగా వెళ్ళాలమ్మా.. !”
వేగంగా తన రూమ్ కు వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ ను, చేతికి తీసుకొని పరుగులాంటి నడకతో జీప్ ను సమీపించింది.
"ఈశ్వర్.. ! హాస్పటల్ బిల్డింగ్ సైటుకు పోనీ. "
“అలాగే అమ్మగారూ.. !”
జీప్ బయలుదేరింది. వాకిట్లోకి వచ్చిన తల్లి, "ఏమిటో ఈ పిల్ల ఉద్యోగం, ఈ పరుగులు. " వెళుతున్న జీప్ ను చూచి నిట్టూర్చి లోనికి వెళ్ళిపోయింది అమృత తల్లి వసుధ.
అమృత విజయ్ కు సెల్లో ట్రయి చేసింది. అతను లిఫ్టు చేయలేదు. గంటలో జీప్ ఆ హాస్పటిల్ ఆవరణంలో ప్రవేశించింది. జీప్ నుంచి దిగి అమృత బిల్డింగ్ వైపుకు వేగంగా నడిచి, విజయను, ధర్మలింగాన్ని సమీపించింది. విజయా వదనం కళావిహీనంగా వుంది. ధర్మలింగం కళ్ళల్లో నీళ్ళు.
“గుడ్మార్నింగ్ మేడమ్. ” అన్నాడు ధర్మలింగం.
"ఎవరికీ యాక్సిడెంట్ జరగలేదు కదా.. !” ఆత్రంగా అడిగింది అమృత.
"లేదు మేడం. ”
"మిస్టర్ విజయ్.. ! మీరు వచ్చి ఎంతసేపయింది.. ?”
“ట్వంటీ ఫైవ్ మినిట్స్. ”
“స్లాబ్ కూలిన దానికి కారణం ఏమిటి.. ?”
"రాత్రి ఎవరో షట్టరింగ్ ను షేక్ చేశారు. ఫలితంగా స్లాబ్ కూలింది. ”
"అదే కారణం అని మీరు ఎలా చెప్పగలరు.. ?”
“షట్టరింగ్ ను, పైన స్టీల్ కట్టకముందే నేను చెక్ చేశాను కాబట్టి. ”
“నిజంగా మీరు చెక్ చేశారా.. ?”
"ఈ ప్రశ్నను మీరు ధర్మలింగంగారిని అడగాలి.. !”
అమృత విజయ్ కళ్ళల్లోకి చూచింది. రోషం, కోపం, ఆమెకు ఆ కళ్ళల్లో గోచరించాయి. ఇరువురినీ చూస్తున్న ధర్మలింగం..
“మేడం.. ! సార్ అంతా చెక్ చేశారు మేడం. ” అనునయంగా చెప్పాడు.
"షట్టరింగ్ ను ఎవరు పీకేసుంటారు ధర్మలింగంగారు.. ?”
ఇక్కడి ఈ హాస్పటిల్ నిర్మాణాన్ని ఇష్టపడని వాళ్ళు అయ్యుండొచ్చు మేడం. ”
అంటే.. ఆ జోగయ్య వర్గమా.. ! వారేకదా ఈ స్థలం విషయంలో గొడవ చేసింది.. ?”
“అవును మేడం. ”
"ఆ జోగయ్య ధనుంజయరావుగారి ముఖ్యుడా.. !"
“అనే విన్నాను మేడం. ”
“మిస్టర్ విజయ్ ఇప్పుడు ఏం చేయాలి.. ?”
“క్రింద పడిపోయి, వ్రేళ్ళాడే కాంక్రీటును, స్టీలు తొలగించి మరలా కాస్త షట్టరింగ్ చేసి, స్టీల్ ను కట్టి కాంక్రీటును వేయాలి. ”
“ఈ పనులన్నీ పూర్తి అయ్యేదానికి ఎంత సమయం కావాలి.. ? అని అడిగింది.
“మినిమమ్ టెన్ డేస్ సరిపోతుంది కదా ధర్మలింగంగారు.. అని విజయ్ అడిగాడు.
“చేయిస్తాను సార్. వీలైనంత త్వరగా చేయిస్తాను. ” అని చెప్పాడు ధర్మలింగం.
"మిస్టర్ ధర్మలింగం గారూ.. ! మీరు ఏం చేస్తారో, ఎలా చేయిస్తారో నాకు తెలియదు. కానీ పనులన్నీ ఏడురోజుల్లో పూర్తి కావాలి. ఎనిమిదవ రోజు తప్పనిసరిగా కాంక్రీటు వేయాలి. ” తన ఉద్దేశ్యాన్ని వారికి తెలియజేసింది, అమృత.
“అలాగే మేడం. ” అంగీకరించాడు ధర్మలింగం.
“గిట్టనివాళ్ళు మన మీద కేసు కూడా పెట్టవచ్చు. దాన్ని ఎదుర్కొనే దానికి కూడా మీరు, నేనూ సిద్ధంగా వుండాలి. ” ఇరువురి ముఖాల్లోకి చూస్తూ సాలోచననగా చెప్పింది అమృత.
ఇరువురూ తలలు ఆడించారు. స్థానిక పత్రికకు సంబంధించిన ఫోటోగ్రాఫర్లు వచ్చారు. ఫోటోలు తీశారు. ఎలా జరిగిందని అడిగారు. తనకు తోచిన దాన్ని వారికి వివరించారు. ధర్మలింగం విజయలు, వారు వెళ్ళిపోయారు. ఊరి జనం గుమికూడారు.
"మిస్టర్ విజయ్.. ! మీరు ఇక్కడికి ఎలా వచ్చారు.. ?"
“నా బులెట్ పై వచ్చాను. ”
"ధర్మలింగం గారూ.. ! విజయ్ గారిని నేను తీసుకొని వెళతాను. మీరు మా వెనకాలే విజయ్ బండిమీద రండి. ” అని చెప్పింది అమృత.
“అలాగే మేడం. ”
అమృత జీప్ డ్రైవర్ సీట్లో కూర్చుంది. ఈశ్వర్ వెనక సీట్లో
కూర్చున్నాడు.
“రండి. ” విజయ్ ను చూస్తూ అంది అమృత.
విజయ్ ఆమె ప్రక్క సీట్లో కూర్చున్నాడు.
జీప్ ఆ ఆవరణాన్ని దాటి, మెయిన్ రోడ్డు మీదికి వచ్చింది.
ఈ స్లాబ్ పడిపోయినందువలన, సూపర్ విజన్ లోపం వల్ల ఇలా జరిగిందని వ్యతిరేక వర్గం కేసు పెట్టవచ్చు. అప్పుడు విజయ్ సమస్యలో ఇరుక్కుంటాడేమో.. ! ఇతని పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏమో.. ! ఇతను చిక్కుల్లో పడిపోతాడేమో.. ! విషయాన్ని వివేకానందగారికి, తన పెద్దతండ్రి అనంతయ్య గారికి, తెలియజేయాలి.
తనకు విజయ్ ఎనిమిదిమాసాలుగా తెలుసు. డ్యూటీ విషయంలో ఎంతో ఖచ్చితంగా వ్యవహరిస్తాడు. కాంట్రాక్టర్ల దగ్గరనుంచి ఏదీ ఆశించడు. నిప్పులాంటి మనిషి.
'ఈ సంఘటనకు జైల్లో ఉన్న ఉపేంద్రకు ఏమైనా సంబంధం ఉండవచ్చా.. ? వాడికి జోగయ్య వర్గానికి ఏదైనా కనక్షన్ వుందా.. ? ఇందులో జోక్యం చేసుకొన్నవ్యక్తులకు కఠిన శిక్ష పడవలసిందే. పరిపరి విధాల ఆలోచిస్తూ జీప్ ను నడుపుతూ ఉంది అమృత.
ఆమె మౌనాన్ని భరించలేకపోయాడు విజయ్. ఈమెకు నా నిర్లక్ష్యం గుణంగా స్లాబ్ కూలిందనే అనుమానం వున్నట్లుగా వుంది. లేకపోతే ఇంత గంభీరంగా మౌనంగా ఆమె ఉండటాన్ని తను ఎన్నడూ చూడలేదు. మనస్సులో అవమానం, బాధ.
"మేడమ్.. ! నా అశ్రద్ధవల్ల స్లాబ్ కూలిందని, నా మీద మీకు అనుమానమా.. !” ఆమె ఉద్దేశ్యాన్ని తెలుసుకోవాలని తెగించి అడిగాడు విజయ్.
అమృత, విజయ్ ముఖంలోకి రొండు క్షణాలు చూచి, చూపును రోడ్డువైపుకు మరలించింది. "మీ మీద నాకు పూర్తి నమ్మకం వుంది మిస్టర్ విజయ్.. !" అనునయంగా చెప్పింది అమృత. కొద్దిక్షణాల తర్వాత.. “ఆ స్థలాన్ని మేము స్వాధీనం చేసుకొనే ముందు అది తనదని, స్థానికుడు జోగయ్య కేసు పెట్టాడు. తన మాటను నిరూపించే దానికి తగిన సాక్ష్యాలు అతని వద్ద లేనందున అది గ్రామస్థులది కాదని రెవిన్యూ రికార్డులను పరిశీలించి కోర్టు ఈ ప్రాజెక్టు నిర్వహణకు మాకు అనుమతి ఇచ్చింది.
దాని ప్రకారం స్థలాన్ని ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంటే గ్రామస్థులందరికీ ఉపయోగపడే హాస్పటల్ నిర్మాణానికి స్వాధీనం చేసుకున్నాము. పని ప్రారంభించాము. నా అనుమానం ఈ నీచపు పనిని ఆ జోగయ్య వర్గమే చేసి ఉంటుందని, మీరు భయపడకండి. నిజానిజాలు త్వరలో తప్పక తెలుస్తాయి. మనం ఇప్పుడు యస్. ఐ. వివేకానంద గారిని కలసి కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. వారు తప్పకుండా ఈ సమాజ విద్రోహచర్యను చేసిన వారిని పట్టుకొంటారు. ”
"వివేకానందగారి వద్దకు వెళుతున్నామా.. ?”
“అవును. ”
విజయ్ మౌనంగా వుండిపోయాడు. 'ఈమెకు వివేక తన అన్న అనే సంగతి తెలియదు. అన్నకిచ్చిన మాట ప్రకారం, తను చెప్పలేడు. వివేక ముందు తను జాగ్రత్తగా ఉండాలి. ఎమోషన్ లో అన్నా అంటే కొంపలంటుకుంటాయ్. ' అనుకొన్నాడు విజయ్.
జీప్ యస్. ఐ ఆఫీసు ముందు ఆగింది. ఆరుగురు వ్యక్తులు స్టేషన్ లో తమ పనిని ముగించుకొని వీధిలోనికి వచ్చారు.
అమృత జీప్ దిగకముందే వారిని పరీక్షగా చూచి "మిస్టర్ విజయ్.. ! మీరు ఎవ్వరితోనూ ఏమీ మాట్లాడకుండా నావెంట స్టేషన్ లోకి రండి. ” అని చెప్పి జీప్ దిగి వేగంగా స్టేషన్ లోనికి వెళ్లిపోయింది.
విజయ్ ఆమెను అనుసరించాడు. అదే సమయానికి వివేకానంద తన రూమ్ నుండి బయటికి వచ్చాడు. వీధిలోనికి వెళ్ళిన వారిలో ఇరువురు తిరిగి వచ్చి, “సార్.. వీరే ఆ ఏ. ఇ అరస్ట్ చేయండి. ” అన్నారు.
వివేకానంద వారిని చూచి.. "మీ పని అయిపోయింది. వెళ్ళిపోండి. నేనేం చేయాలో నాకు తెలుసు. ప్లీజ్ గో.. !" వివేకానంద కంఠస్వరం తీవ్రతకు వారు భయపడి వెళ్ళిపోయారు.
అమృతను, విజయానందను చూచి “రండి.. !” అని తన రూమ్ లోనికి వెళ్ళాడు వివేకానంద. వారిరువురూ అతన్ని అనుసరించారు.
తను కుర్చీలో కూర్చొని.. "కూర్చొండి.. !" అని చెప్పాడు వివేకానంద.
అమృత, విజయ్ లు కూర్చున్నారు. వారిరువురి ముఖాలను కొన్ని క్షణాలు పరీక్షగా చూచి.. "ఏం జరిగిందో విపులంగా చెప్పండి.. ” అని అడిగాడు వివేకానంద.
ముందు విజయ్ షట్టరింగ్, స్టీల్ టైయ్యింగ్ పనులు తన పర్యవేక్షణలో ఎలా జరిగాయో చెప్పి, నిన్న కాంక్రీట్ వేసిన విషయాన్ని, ఈ ఉదయం ఆరుగంటలకు తనకు కాంట్రాక్టర్ ధర్మలింగం ఫోన్ చేసి చెప్పిన విషయాల్ని, తను ఏడున్నరకు అక్కడకు వెళ్ళి చూచిన దృశ్యాన్ని గురించి చెప్పి, తాను సెల్ లో తీసిన ఫోటోలను వివేకానందకు చూపించాడు.
అమృత తనకు వచ్చిన కాంట్రాక్టర్ ఫోన్ ను గురించి, తను సైట్ లో చూచిన దృశ్యాలను గురించి, ఆ స్థలం విషయంలో జోగయ్య చేసిన గొడవ, కేసు, కోర్టు తీర్పులను గురించి విపులంగా వివేకానందకు తెలియజేసింది.
కాంట్రాక్టర్ ధర్మలింగం, అతని సూపర్వైజర్ శివస్టేషన్ కు చేరారు. వారు వచ్చినట్లు హెడ్ కానిస్టేబుల్ కోటయ్య వివేకానందకు తెలియజేశాడు. "వారిని లోనికి పంపండి. " అన్నాడు. వారు లోనికి వచ్చి వివేకానందకు విష్ చేశారు. కుర్చీలను చూపగా వారు కూర్చున్నారు.
“రాత్రి సైట్లో ఎవరున్నారండి.. ?" అడిగాడు వివేకానంద.
“వాచ్ మెన్ ఏడుకొండలు సార్.. ” ధర్మలింగంగారి జవాబు.
“ఇతనెవరు.. ?”
“మా సూపర్వైజర్ శివ. బి. యి. సివిల్ గ్రాడ్యుయేట్ సార్.. ”
“వాచ్ మెన్ కు తోడుగా ఎవరూ లేరా.. !”
"అతని భార్య మంగ. మూడేళ్ళ మగబిడ్డా వున్నారు సార్.. !”
“మీ ఏడుకొండలు.. రాత్రయితే మందు కొడతాడా.. !”
“ఆ అలవాటు వాడికి వుందండి. ”
“నిన్న రాత్రి తాగాడా.. ?"
"త్రాగాడని వాడి పెళ్ళాం చెప్పింది సార్.. !”
త్రాగుబోతుల్ని సైట్ వాచ్ మెన్ గా పెడితే, సైటుకు ఏం సేఫ్టీ వుంటుందండి.. ?" నవ్వాడు వివేకానంద.
ఇంత గంభీరమైన విషయాన్ని విచారిస్తూ కూడా నవ్వుతున్న వివేకానందను చూచి అమృత ఆశ్చర్యపోయింది.
“మీరు ముగ్గురూ ఉదయాన్నే మీరు సైట్లో చూచిన దాన్ని వివరంగా వ్రాసి ఇవ్వండి. అమృతగారు.. ! మీరు ఆ స్థలం తాలూకులో జరిగిన గొడవ, మీరు ఏ విధంగా స్వాధీనం చేసుకొన్న వివరాలనూ వ్రాయండి. రేయ్ విజయా.. సారీ.. ! మిస్టర్ విజయ్.. ! మీరు ఆ ఫోటోలను ప్రింట్ చేయించి తీసెట్స్ నాకు ఇవ్వండి. అమృతగారూ.. ! నా తమ్ముడి పేరు కూడా విజయ్. ఆ జ్ఞాపకంలో ''రేయ్" అని విజయ గారిని అన్నాను. సారీ.. ! నవ్వుతూ చెప్పాడు విజయ్.
హెడ్ కానిస్టేబుల్ ను పిలిచి అందరికి కాగితాలను అందించాడు. వారు వివేక చెప్పినట్లుగానే వ్రాసి ఇచ్చారు. తన అన్న తనను రేయ్ అని పిలిచి, సమయస్ఫూర్తిగా వెంటనే మిస్టర్ విజయ్ అని సంబోధన చేయడం, అమృతకు అనుమానం రాకుండా ఇచ్చిన ఎక్స్పలేషన్, విజయానందకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించాయి. ప్రీతిగా వివేక కళ్ళల్లోకి చూచాడు.
"ఎదుటివారు ఇచ్చిన రిపోర్టును బట్టి, కాంట్రాక్టర్, ఇన్ ఛార్జ్ ఇంజనీర్ కలసి క్వాలిటీ లేని పనిని చేసినందువల్ల స్లాబ్ కూలిపోయిందని మాకు తెలిసింది. కాబట్టి నేను మిస్టర్ ధర్మలింగం, మిస్టర్ విజయ్, మీ ఇరువురినీ అరస్ట్ చేస్తున్నాను. ” మెల్లగా తన నిర్ణయాన్ని వారికి తెలియజేశాడు వివేకానంద.
ధర్మలింగం.. విజయ్ లు ఆశ్చర్యపోయారు. వాళ్ళ కళ్ళల్లో కన్నీరు.
"సార్.. ! ఏమిటి మీరంటున్నది.. ?" ఆశ్చర్యంతో అడిగింది అమృత.
"మీకంటే ముందు వచ్చిన ఆ గ్రామస్థులు ఇచ్చిన రిపోర్టు ప్రకారం, వీరిరువురిని నేను అరస్ట్ చేసి తీరాలి. కోటయ్యగారూ.. !" హెచ్చు స్థాయిలో పిలిచాడు వివేకానంద.
“సార్.. !” కోటయ్య వచ్చి అన్నాడు.
“వీరిరువురిని రిమాండ్లో ఉంచండి. మీరు అతని వెంట వెళ్ళండి. ”
ధర్మలింగం, విజయ్ లేచి కోటయ్య వెనకాలే వెళ్ళారు.
“చూడండి అమృతగారూ.. ! నేను ఏది చేసినా ప్లస్, మైనస్ ను బాగా ఆలోచించి చేస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు బయట ఉంటే కేసు మరో మలుపు తిరగవచ్చు. ”
“అంటే!.. ”
“ఆ వచ్చినవారు వీరిని కిడ్నాప్ చేయవచ్చు. వీరి క్షేమం కోసమే నేను ఈ పని చేశాను. మీరు వ్రాసి ఇ చ్చిన రిపోర్టు ప్రకారం రేపు సాయంత్రానికల్లా జోగయ్య ముఠాను అరెస్టు చేస్తాను. నా రిపోర్టును కోర్టుకు సమర్పిస్తాను. ఎల్లుండి మీరు వీరిని బెయిల్ మీద విడిపించవచ్చు. మీరు నిశ్చింతగా వెళ్లి, అన్ని విషయాలను మీ పెద్దనాన్న గారికి తెలియజేయండి. నేను ఫోన్ చేసి వారితో మాట్లాడుతాను. ఇక మీరు వెళ్ళండి.
నేను నా వాళ్ళతో కలసి స్పాట్ కు వెళ్ళాలి. మరో ముఖ్య విషయం. మీరు సి. ఇ, యస్. సి గార్లను కలిసి కాంక్రీట్ క్వాలిటీని, కట్టిన రెయిన్ ఫోర్సుమెంటును చెక్ చేయమని చెప్పండి. వాళ్ళ డిపార్టుమెంటుకు కళంకం రాకుండా ఉండేదానికి వారు ఆ పనిని వెంటనే చేయిస్తారు. వారి రిపోర్టు ఈ కేసుకు ప్లస్ పాయింట్. ధర్మాన్ని రక్షించడం నా ధర్మం, నన్ను నమ్మండి. ” నవ్వుతూ చెప్పాడు వివేకానంద.
“అలాగే సార్.. !” విచారంగా అంది అమృత.
"దేనికీ మీరు భయపడకండి, బాధ పడకండి వెళ్ళండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ” అనునయంగా చెప్పాడు వివేక.
అమృత మౌనంగా లేచి సాలోచనగా వెళ్ళి జీప్ లో కూర్చుంది. ఈశ్వర్ జీపు స్టార్ట్ చేశాడు. అమృత తన పెద్ద తండ్రి అనంతయ్య గారిని కలసి విషయాన్ని చెప్పి, విజయ్, ధర్మలింగాలను బెయిల్ మీద విడిపించే దానికి ఏర్పాటు చేయవలసిందిగా కోరింది. జరిగిన సంఘటనను గురించి విపులంగా విశదీకరించింది.
వారిరువురిని విడిపించే దానికి ఏర్పాటు చేస్తానని అనంతయ్య అమృతకు హామీ ఇచ్చాడు. అమృత పోలీస్ స్టేషన్ కు వెళ్ళి విజయ్, ధర్మలింగాన్ని కలిసి భయపడవద్దని, బెయిల్ ఏర్పాటు చేశానని చెప్పి తన ఆఫీస్ కు వెళ్ళిపోయింది.
వివేకానంద తన అనుచరులతో హాస్పిటల్ కు వెళ్లి, కూలిన స్లాబ్ ను పరిశీలించాడు. వాచ్ మెన్ ను కలిసి స్లాబ్ రాత్రి ఏ సమయంలో కూలిందని అడిగాడు. తను తడబడి, భయంతో ఐదు.. ఆరు.. గంటల మధ్యన కూలినట్లు చెప్పాడు. ఊర్లోకి వెళ్లి సర్పంచ్ ను కలుసుకొని, జోగయ్యను గురించి వివరించాడు. వాడి తత్వం మంచిది కాదని, ఉపేంద్రకు వాడు ముఖ్యుడు అని తెలియజేశాడు.
వాడి ఇంటికి పోయి విచారించగా, హైదరాబాద్ కి పని మీద పోయినట్టు తెలిసింది. అతని భార్య మూలంగా జోగయ్య సెల్ నంబర్ కనుక్కొని, హైదరాబాద్ పోలీస్ లకు ఆ నంబర్ ఇచ్చి, జోగయ్యను ట్రేస్ చేయవలసిందిగా చెప్పాడు వివేకానంద.
మూడు రోజుల్లో జోగయ్య అతని నలుగురు మిత్రులను పట్టుకొని అరస్టు చేశారు పోలీసులు. ముందు తమకు ప్లాన్ కూలిన దానికి సంబంధం లేదని దబాయించిన వారు, పోలీస్ ట్రీట్మెంటుతో, బాధలను భరించలేక జోగయ్య చెప్పగా మీమే పట్టరింగ్ను లూజ్ చేసి స్లాబ్ కూలేలా చేశామని నేరాన్ని ఒప్పుకున్నారు.
తన స్థలాన్ని బలవంతంగా లాక్కొని కట్టడ నిర్మాణం చేసిన కారణంగా, తను ఆ పనిని చేయించానని జోగయ్య నేరాన్ని ఒప్పుకొన్నాడు.
డిపార్టుమెంటు కన్సల్టెంట్సు కాంక్రీటు, రెయిన్ ఫోర్సుమెంటును టెస్టుచేసి సవ్యంగా ఉన్నాయని రిపోర్టు ఇచ్చారు. అనంతయ్య విజయ్, ధర్మలింగాన్ని బెయిల్ మీద విడిపించారు.
=================================================================================
ఇంకా ఉంది..
=================================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments