top of page

ప్రగతి ప్రేమికులు 2


'Pragathi Premikulu episode 2' New Telugu Web Series Written By Ch. C. S. Sarma

'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ..

బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు.

స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.



ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 2 చదవండి..


విశ్వవిఖ్యాత భారతీయుడు శ్రీ వివేకానంద స్వామీజీ మన జాతి ఔన్నత్యాన్ని జగతి నలుదిశలా తెలియజేయుటకు జన్మించారు. ఆ మహాపురుషుని జననం 1863వ సంవత్సరం జనవరి 12వ తేది. తల్లిదండ్రులు భువనేశ్వరీ దేవి, విశ్వనాథుడు.


చాలాకాలం పుత్ర సంతానం లేని ఆ తల్లి, కాశీ విశ్వేశ్వరుని దీక్షగా పూజింపగా, ఆ మహనీయుడు జన్మించారు. ఆ పుణ్య దంపతులు వారికి నరేంద్రుడు అని పేరు పెట్టారు.


వారి జననం మన భారతావనిలో జరగకున్నా, వారు శ్రీ రామకృష్ణ పరమహంసతో 1881వ సం॥ నవంబర్ నెలలో దక్షిణేశ్వరంలో కలియక వున్నా, వారు బ్రహ్మచర్య పరిపాలన చేయకవున్నా, 1893 సం॥ సెప్టెంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకూ చికాగో నగరంలో జరిగిన విశ్వమత మహాసభలో పాల్గొనకన వున్నా, యీ మన పవిత్ర భారతావనిలో మనదైన హైందవతా స్థానం, యితర దేశాలలో యీనాడు వున్న గుర్తింపు, గౌరవం, ప్రతిష్ట వేరే రీతిగా వుండేది.


యీ దేశ ప్రజలు ఆ మహాపురుషుణ్ణి, ఆ చరిత్ర నాయకుడిని ముఖ్యంగా మన యువత మరువకూడదు. దేశంలోని అన్ని పాఠశాలలో, కాలేజీలలో, కార్యాలయంలో వారి వర్ణ చిత్రపటాన్ని ఆవిష్కరించి తీరాలి. వారిని హైందవ, అధ్వయిత పితామహగా, గౌరవించాలి. వారి చిత్తరవు ముందు చేతులు జోడించాలి. పాశ్చాత్యులు ఆశ్చపోయే రీతిగా, శిష్యులుగా మారే రీతిగా, మన హైందవతను గురించి, అధ్వయితాన్ని గురించి, ఆ కారణ జన్ముడు, యుగ పురుషుడు, విశ్వమత మహాసభలో చేసిన సుప్రసంగం అనితర సాధ్యం. యావత్ ప్రపంచానికీ హైందవ ఔన్నత్యాన్ని వారు విశదీకరించిన రీతి, మన జాతికి తరతరాలకు గర్వకారణం.


నరేంద్ర నామధేయంతో, బాల్యంలో ఏకసంతాగ్రాహిగా పేరు గాంచి, ఆటపాటలతో ధార్మిక చింతనలతో అందరినీ అలరించిన స్వామి, యువకుడై కలకత్తా ప్రసిడెన్సీ కళాశాలలో, మొదటి పర్యాయం శ్రీరామకృష్ణులవారి పేరును నరేంద్రుడు, తన కళాశాల అధ్యక్షుడైన విలియం హేస్టీ నుండి విన్నారు. తర్వాత కొద్ది రోజులలోనే సురేంద్రనాథ మిత్ర అనే ఒక భక్తుని యింట జరిగిన మతోత్సవంలో తొలిసారి నరేంద్రుడు శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులను దర్శించారు.


ఆ ఉత్సవంలో నరేంద్రుడు పాడిన పాటలను విని శ్రీరామకృష్ణులు అతన్ని సమీపించి, దక్షిణేశ్వరానికి రమ్మని ఆహ్వానించారు.


1881వ సం॥ నవంబర్లో సురేంద్రనాథమిత్రతో కలసి నరేంద్రుడు మొదటిసారిగా దక్షిణేశ్వరానికి వెళ్ళి గురుదేవులను దర్శించారు.


ఆ ద్వితీయ సంగమంలోనే శ్రీరామకృష్ణులు నరేంద్రుని చేయి పట్టుకొని, వసారా గదిలోనికి తీసుకొని వెళ్ళి, చిరపరిచితుని వలే "ఇంత ఆలస్యంగా రావడం నీకు న్యాయమా.. ? నీ నిమిత్తం నేనెంతగా నిరీక్షిస్తూ వున్నానో ఒక్కమారైనా నీవు ఆలోచించావా.. ? తుచ్ఛమైన ప్రాపంచిక విషయాలను విని విని నా చెవులు, చిల్లులు పడ్డాయే.. ! నా అంతరంగ భావాలను ఎవరితో చెప్పుకొని పాలు పంచుకోవాలో తెలియక నా హృదయం పగిలిపోయే స్థితికి వచ్చింది."


అశ్రు నయనాలతో చేతులు జోడించి, "ప్రభూ.. ! నువ్వు నారాయణాంశుడవైన సనాతన నరఋషివని నాకు తెలుసు. ఈ లోకంలోని దుఃఖత దీన మానవుల కష్టపరంపరలను తొలగించటానికి నువ్వు అవతరించావు. ” ఆవేశ ఆనందాలతో శ్రీరామకృష్ణులు పలికారు.


తన స్వహస్తాలతో నరేంద్రులకు వెన్న, పటికబెల్లం, ఫలాదులను తినిపించారు. త్వరలో ఒంటరిగా తన్ను చూడటానికి వచ్చేటందుకు నరేంద్రుల వద్ద వాగ్దానం తీసికొన్నారు. చేసిన వాగ్దానాన్ని నెలరోజులు తర్వాత నరేంద్రుడు నిలబెట్టుకొన్నారు. శ్రీరామకృష్ణ పరమహంస కుడిపాద స్పర్శతో దివ్యానుభూతిని పొందారు.


ఆ తర్వాత మూడవ సమావేశం ఒక పక్షం రోజుల తర్వాత జరిగింది. ఆ గురు శిష్యుల మధ్యన. యీ సమావేశంలో గురుదేవుని స్పర్శతో, నరేంద్రులు బాహ్య స్పృహను కోల్పోయారు. గురువు అడిగిన ప్రశ్నలకు ఆ స్థితిలోనే జవాబులు చెప్పారు.


అనంతరం నరేంద్రులు వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులతో గురుదేవులు ఆ సంఘటనను గురించి యిలా చెప్పారు.


నరేంద్రుడు బాహ్య స్పృహను కోల్పోయిన తర్వాత ఆ స్థితిలో అతన్ని నేను ఎన్నో ప్రశ్నలడిగాను. అతడెవరని, ఎక్కణ్ణుంచి వచ్చాడని, ఎందుకు జన్మించాడని, యీ లోకంలో ఎంతకాలం వుంటాడనే ప్రశ్నలనడిగాను. నరేంద్రుడు అంతర్ముఖుడై.. నా ప్రశ్నలన్నింటికీ సరైన జవాబులు చెప్పాడు. నా దర్శనాలతో, అతణ్ణి గురించి నేను భావించిన, చూసి, తెలిసిన అభిప్రాయాలు, ఆ సమాధానాలతో మరింత బలపడ్డాయి.


అవన్నీ పరమ రహస్యాలు. వాటన్నిటి నుండి ఏనాడైతే అతడు తన నిజస్వరూపాన్ని ఎరుగుతాడో, యీ లోకంలో ఆపై అతడుండడని నేను తెలుసుకొన్నాను. మరుక్షణమే అతడు యోగమార్గాన శరీర త్యాగం చేస్తాడు. అతడు ధ్యాన సిద్ధుడు.


కారణ జన్ముడైన నరేంద్రులను గురించి శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవుల నిశ్చితాభిప్రాయం యిది. భవిష్యత్తులో నవీన ప్రపంచానికి అద్వైత ప్రచారం చెయ్యబోయే మహాచార్యులు, ధార్మిక ఋషి, యీ దేశానికే సొంతం, ఈ పవిత్ర భారతావని కీర్తి చంద్రిక అయిన సనాతన ధర్మ ప్రచారపు విశ్వయోగి, నరేంద్రులని, శ్రీరామకృష్ణులు గ్రహించారు. వేదాంతపు అత్యున్నత శిఖరమైన నిర్వికల్ప సమాధిని గురుదేవులు శ్రీ నరేంద్రులకు ప్రదానం చేశారు. శ్రీరామకృష్ణ పరమహంస, నరేంద్రుల మధ్యన వున్న అనుబంధం నిస్వార్థ ప్రేమ జనితపూరితం.


శ్రీగురుదేవుల తోటి యీ మహదానందదాయక జీవితాన్ని తన కుటుంబంలో ఎన్ని కష్టాలు వున్నా, గురుదేవుల మాట ప్రకారం వాటిని లెక్క చేయకుండా తండ్రి విశ్వనాథ దత్త 1884వ సం: లో గతించినా, ఏకాగ్రతతో ఆ గురుబ్రహ్మ సన్నిధిలో, ఐదు సంవత్సరాలు లక్ష్య సిద్ధిని సాగించారు. మొదటి నాలుగు సంవత్సరాలు దక్షిణేశ్వరంలో, చివరి సంవత్సరం కాశీపూర్ లో గురుదేవుల సేవా, శుశ్రూషలతో గడిపారు నరేంద్రుడు.


1885వ. సం|| మధ్య కాలంలో శ్రీరామకృష్ణ గురుదేవులకు గొంతులో క్యాన్సర్ వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఒకరోజు గురుదేవులు నరేంద్రులను తన చెంతకు పిలిచి, తదేక దృష్టితో అతన్ని చూస్తూ సమాధిలోనికి వెళ్ళిపోయారు. ఆయనలో నుండి సూక్ష్మ శక్తి ఒకటి తనలో ప్రవేశిస్తూండటాన్ని చూస్తూ నరేంద్రులు కూడా అచేతనులయ్యారు. యిలా కొద్ది నిముషాలు గడిచాయి.


గురుదేవులు బాహ్యస్మృతిని పొందాక..


“ఓ నరేన్.. ! యీ రోజు నా సర్వస్వం నీకు యిచ్చేసి నేను ఫకీరునయ్యాను. నేను యిచ్చిన యీ శక్తితో నువ్వు భవిష్యత్తులో, ఘనకార్యాలు చేయకలుగుతావు. ఆ తరువాతే నువ్వు స్వస్థానానికి తిరిగిపోతావు" అవ్యాజానురాగాలతో పలికారు గురుదేవులు.


తర్వాత.. తన నిర్యాణ అనంతరం, శిష్యులంతా ఎలా కలసివుండాలనే విషయాన్ని గురించి, వారు ఆచరించ వలసిన విధులను గురించి, నరేంద్రులకు శ్రీ రామకృష్ణ పరమహంస గురుదేవులు తెలియజేశారు. 1886వ సం॥ ఆగష్టు 16వ తేదీన గురుదేవులు మహాసమాధి పొందారు.


శిష్యులంతా కొత్త పేర్లను సంతరించుకొన్నారు. నరేంద్రుడు 'వివిధిషానంద' అనే పేరును స్వీకరించారు. కొన్ని పర్యాయాలు శ్రీ నరేంద్రుడు తన పేరుని సచ్చిదానందుడుగా పేర్కొనేవారు.


బారానగర మఠంలో, శ్రీరామకృష్ణ పరమహంస సన్యాస శిష్యులు వుండేవారు. కొద్ది కాలంలో రామకృష్ణానందస్వామి (వారి పూర్వపు పేరు శశి) తప్ప, మిగిలినవారు పుణ్యక్షేత్ర దర్శనానికి, తపస్సు చేయాలనే ఆకాంక్షలతో మఠాన్ని విడిచి వెళ్ళిపోయారు.


1880వ సం||లో శ్రీ నరేంద్రుడు మఠాన్ని వదలి, దేశంలో పర్యటించ సాగారు. 1893లో వుత్తర హిమాలయాల నుంచి దక్షిణ రామేశ్వరం వరకూ దేశ పర్యటన పూర్తి చేశారు. తన పర్యటనలో ఆయా ప్రాంతాల్లో వుండిన మహనీయులను నరేంద్రులు కలసి ప్రసంగించారు. 1891సం||లో నరేంద్రులు కథియవార్ పర్యటించారు. 1892 ఖాండ్వా ప్రాంతాన్ని వీక్షించారు. యీ సుదీర్ఘ పయనంలో శ్రీ నరేంద్రుల వారికి ఎందరో హితులు, ఆప్తలు, శిష్యులు ఏర్పడ్డారు.


కథియవార్లో వుండగా, 1893 సం॥లో చికాగో నగరంలో 'విశ్వమత మహాసభ' జరుగనున్నట్లు, నరేంద్రులకు తెలిసింది. ప్రయాణపు ఖర్చులు ఎవరైనా భరించ కలిగితే ఆ మహాసభకు వెళ్ళాలనే తలంపు కలిగింది.


మద్రాసు నగరంలో శిష్యులు, నరేంద్రుల చికాగో నగర ప్రయాణానికి కావలసిన, సన్నాహాలను పూర్తి చేశారు. నాలుగు వేల రూపాయలు ప్రయాణపు ఖర్చులకు సేకరించారు. నరేంద్రులు మద్రాస్ కు చేరారు.


యింతలో, శ్రీ నరేంద్రుల ప్రియశిష్యుడైన ఖేత్రీ మహారాజుగారి ఆంతరంగిక సేవకుడు వచ్చి, రాజుగారికి పుత్రజననం కలిగిందని, వెంటనే విచ్చేసి ఆ బిడ్డను దీవించవలసినదిగా రాజుగారు కోరినారని తెలియజేశాడు.


నరేంద్రులు ఖేత్రి కుమారుని సర్వలక్షణుడుగా వర్ధిల్లాలని ఆశీర్వదించి, మూడు వారాలు రాజభవనంలో వుండి, ఖేత్రీ చేసిన ఏర్పాట్ల రీత్యా జపాన్ గుండా 1893వ సం॥ జూలై నెల ఆఖరున, వారు అమెరికా చేరుకున్నారు.


బహిరంగంగా ఆ మహారాజు సూచన మేరకు, నరేంద్ర నామధేయానికి మారుగా, వివేకానంద అన్న నామాన్ని, వారు తన అమెరికా పయనానికి ముందు స్వీకరించారు.


30వ తేదీన చికాగో నగరానికి చేరారు. అక్కడ వారు 'మతమహా సభ' సెప్టెంబర్ వరకూ వాయిదా వేయబడిందని, ధార్మిక సంస్థలకు జారీ చేసిన పరిచయ పత్రాలు కలిగివున్నవారికే, ఆ సభలో ప్రతినిధులుగా ప్రవేశించేదానికి అర్హులౌతారని, విన్న శ్రీ వివేకానందుల వారు హతాశులయ్యారు.


హిందూ మత ప్రతినిధిగా వారి వద్ద ఎలాంటి పరిచయ పత్రములూ లేవు. అంతేకాక సభ రెండు నెలలకు వాయిదా పడిన కారణంగా అన్ని రోజులు ఆ దేశంలో వుండేదానికి సరిపోగల పైకం శ్రీ వివేకానందుల వారి వద్దలేదు. బోస్టస్ నగరములో చౌకతో జీవించవచ్చని విని, అక్కడికి బయలుదేరారు. దారిలో వారికి ఒక సంపన్నురాలైన స్త్రీతో పరిచయం కలిగింది. ఆమె స్వామీజీని, తన యింట బస చేయవలసినదిగా కోరింది. వెంటనే తీసుకొని వెళ్ళింది.


ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో గ్రీకు భాషాచార్యుడైన 'ప్రొఫెసర్ రైట్'ను స్వామీజీకి పరిచయం చేసింది. సుదీర్ఘ సంభాషణానంతరం రైట్ శ్రీ వివేకానంద స్వామివారి ప్రతిభకు ముగ్ధుడైనాడు. పరిచయ పత్రాలు లేని కారణంగా, తాను 'విశ్వమత మహాసభ' లో పాల్గొనలేక పోతున్నానని తన విచారాన్ని రైట్ కు తెలియజేశారు స్వామీజీ.


సమాధానంగా రైట్.. మీ నుంచి పరిచయ పత్రాలను అడగడం 'సూర్యుణ్ణి ప్రకాశించే హక్కును ప్రశ్నించడం లాంటిది' అని జవాబు చెప్పారు. వెంటనే 'విశ్వమత మహాసభ' ప్రతినిధుల కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బొరోస్ కు, స్వామీజీని గురించి వారు వ్రాసి యిచ్చి, రైలు టిక్కెట్ బోస్టన్ నుంచి చికాగోకు కొని యిచ్చి, స్వామీజీని సగౌరవంగా చికాగోకు పంపారు.


దురదృష్టవశాత్తూ స్వామీజీ రైట్ వ్రాసి యిచ్చిన పరిచయ పత్రాన్ని, మత మహాసభ జరిగే విలాసాన్ని పోగొట్టుకొన్నారు.


స్వామీజీ నల్లవర్ణంవాడు కాబట్టి.. ! ఆ తెల్ల మనుషులు ఎవరూ స్వామీజీకి ఎలాంటి సహాయం చేయలేదు. నడిచి నడిచి, చివరకు ఒక రైల్వే స్టేషన్ చేరి, ఖాళీగా వున్న పెద్ద రైలు పెట్టెను ఆశ్రయించి రాత్రంతా గతాన్ని తలపోసుకొంటూ 'ఏకాకి' గా గడిపారు. ఆ కారు చీకటిలో భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలూ, అమావాస్య రాత్రిలా స్వామీజీకి గోచరించింది. అదే వారి జీవితంలో చివరి కాళరాత్రి.


ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని రోడ్డున నడుస్తూ, ప్రక్కన వున్న అనేక యిండ్లల్లో ఆకలిని తీర్చమని ఆ స్వామి అర్థించాడు. ఏ ఒక్కరూ వారి మాటలను అర్థం చేసికొని ఆదరించలేదు. తిరిగి తిరిగి అలసి సొలసి చివరకు భారాన్నంతా భగవంతుని, తన గురుదేవుల మీద వేసి, నిశ్చేష్టుడుగా రోడ్డు ప్రక్కన కూలబడినారు. కళ్ళు మూసుకొన్నారు.


కొద్ది నిముషాలలో ఎదురుగా వున్న, సంపన్నుల భవంతి నుండి రాజఠీవితో వున్న ఒక స్త్రీ మూర్తి, స్వామి వారి వద్దకు వచ్చి "మీరు విశ్వమత మహాసభకు తూర్పు నుంచి వచ్చిన ప్రతినిధులా.. !" అని అడిగింది.


ఆమె పేరు జార్జ్ హేల్ సతి,


'అవును. ' అన్నారు స్వామీజీ.


ఆ కుటుంబంతో శ్రీ వివేకానందస్వామీజీకి ఏర్పడిన చిరకాల మైత్రికి జార్జ్ హేల్ సతి పలకరింపే నాంది.


ఉపాహారానంతరం, హేల్ సతి స్వామీజీని మహాసభ కార్యాలయానికి తీసుకొని వెళ్ళింది. అక్కడ తన పరిచయ పత్రాన్ని స్వామీజీ సమర్పించారు. భారత ప్రతినిధిగా స్వామీజీ అంగీకరించబడ్డారు. యితర పాశ్చాత్య దేశాల ప్రతినిధులతో పాటు స్వామీజీకి కూడా, తగిన వసతి సౌకర్యాలు కల్పించారు.


'విశ్వమత మహాసభ' చికాగాలోని 'కోలంబస్' భవనంలో 1893, సెప్టెంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగింది. మానవ జీవితాన్ని అర్థవంతం చేసే విద్య, కళ, విజ్ఞానం మొదలైన ప్రగతి రంగాల్లో మతం ప్రాముఖ్యమైనది. పాశ్చాత్య దేశాల్లో అధికపాలు జనం క్రైస్తవ మతస్థులు. వారి మతాచార్యులు కాథలిక్ ప్రొటస్టెంట్ల సరసన, హిందూ, జైన్, బౌద్ధ, మహమ్మదీయ, కన్ఫూషియా, షింటో, యజదా తదితర మత ప్రతినిధులు, కూర్చొనడానికి అవకాశం కల్పించిన యీ మహాసమావేశం ప్రపంచ చరిత్రలో ఎంతో ఆశ్చర్యకరమైన సంఘటన. నిర్వాహక వర్గం సదా అభినందనీయులు.


“అమెరికా సోదర సోదరీమణులారా!.. "


ప్రపంచ మత సభారంగంలో శ్రీ వివేకానంద స్వామివారి యీ తొలి మూడు మాటలు విప్లవాన్ని సృష్టించాయి. ఆరువేల మంది సభ్యులతో కిటకటలాడుతున్న ఆ మహా సభలో ఈ మూడు వాక్యాలు గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. వారంతా మరో నూతన అవతార పురుషుడి ఆవిర్భావాన్ని ఆహ్వానిస్తున్నారో, అనే రీతిన కొన్ని క్షణాల పాటు ఎంతో ఆనందంగా కరతాళధ్వనులను మిన్ను ముట్టించారు.


మన సనాతన అధ్వయిత ధర్మాన్ని గురించి, దేశంలో వున్న తెగలు, జాతులు, వారంతా పాటించే సనాతన వైదిక యతి సాంప్రదాయాలను గురించి భిన్నత్వంలో మనలో వున్న ఏకత్వాన్ని గురించి మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భారత భాగవత, రామాయణాలను గురించి, హైందవ మనస్తత్వాన్ని గురించి, విశ్వమత మహాసభలో వివరించారు. శ్రీ వివేకానంద స్వాములువారు.


ఆ మత మహాసభ మొదటి సమావేశానంతరం, తరువాత సమావేశాల్లో, శ్రోతలకు అత్యంత అభిమాన 'వక్త' శ్రీ వివేకానంద స్వామీజీగారే.. !. ఇతర వక్తల ఉపన్యాస సమయంలో, శ్రోతలకు రుచించక మధ్యన లేచి పోతున్న వారిని చూచిన సభాధ్యక్షులవారు, సభికులకు అసంతృప్తిని దూరం చేసేటందుకు, వారు కూర్చునేటందుకు, ముందుగానే చివరి ప్రసంగం శ్రీ వివేకానందుల వారిదని ప్రకటించేవారట.


ఆ ప్రకటన విన్న శ్రోతలు ఆనందంగా స్వామివారి వుపన్యాసాన్ని వినాలని కూర్చుండి పోయేవారట.

వుపన్యాసానంతరం.. స్వామివారిని పలకరించి కరచాలనం చేయకోరి స్త్రీ, పురుషులు పోటీపడేవారట. ఎందరో స్వామివారిని తమ యిండ్లకు రావలసినదిగా కోరేవారట.


మూడు మాటలతో గుర్తింపును, చరిత్రను సృష్టించి, అనామక పరివ్రాజకుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. ఆనాటి ఆ దేశ వార్తా పత్రికలు, స్వామీజీని గురించి, దైవప్రేరిత వక్తగా ప్రచారం చేశాయి. ఎందరో హితులు, ఆప్తులు, శిష్యులుగా స్వామీజీ సన్నిధిని కోరారు.


ఆ తర్వాత, స్వామీజీ వివిధ ప్రాంతాల్లో తన జన్మభూమి భారతావనిని గురించి, మన వేదాంతసారాన్ని గురించి, మన అద్వైత సనాతన ధర్మాన్ని గురించి, ఉపన్యసించారు. దాదాపు అన్ని అమెరికా ముఖ్య నగరాల్లో వీరి మహత్తర ప్రసంగాలు జరిగాయి. ప్రముఖ వార్తాపత్రికలు వారి ప్రసంగాలను, నివేదికలను ప్రచురించాయి.


అచిరకాలంలోనే శ్రీ వివేకానందస్వామీజీ అమెరికాలో ప్రసిద్ధిగాంచారు. స్వామివారి ఈ పరిశ్రమ ఫలితంగా, అమెరికన్ ల మనస్సుల్లో భారతదేశం పట్ల వున్న తప్పుడు అభిప్రాయాలు తొలగిపోయాయి. అమెరికా దేశ భావ స్రవంతిని స్వామి వారి వేదాంతోపన్యాసాలు ఎంతగానో ప్రభావితం చేయసాగాయి.


హార్వర్డ్ విశ్వవిద్యాలయం తత్వశాఖ ప్రధాన అధ్యాపక పదవి, కొలంబియా విశ్వవిద్యాలయం, సంస్కృతశాఖ ప్రధాన అధ్యాపక పదవిని, చేపట్టమని కోరాయి. స్వామీజీ ఆ అభ్యర్ధనలను నిరాకరించారు.


1893సం|| సెప్టెంబర్ నుంచి 1895 సం॥ ఆగష్టు వరకూ స్వామీజీ, అమెరికాలో నిర్విరామ పర్యటనను సాగించారు. వీరి ఉపన్యాసాలు భక్తియోగం, కర్మయోగం, రాజయోగం పేర పుస్తక రూపం దాల్చి బహు ప్రచారంలోనికి వచ్చాయి.


స్వామీజీ ప్రసంగాల వల్ల ప్రభావితులైన అమెరికా స్త్రీ, పురుషులు కొందరు ఆధ్యాత్మిక సాధన చేయటానికి పూనుకొన్నారు. వారు స్వామీజీని తమ గురువుగా భావించారు. అత్యంత ప్రియమైన అనుయాయులుగా మారిపోయారు.

=================================================================================

ఇంకా ఉంది...

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

35 views2 comments

2 則留言


Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2023年6月10日

tarigopula rajasekhar • 3 days ago

Good story

按讚

Mana Telugu Kathalu
Mana Telugu Kathalu
2023年6月10日

tarigopula rajasekhar • 3 days ago

I'm proud to hear

按讚
bottom of page