'Pragathi Premikulu episode 5' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.
శ్రీ వివేకానంద స్వామీజీ అసలు పేరు నరేంద్రుడు.
శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుడుగా మారారు.
1893 వ సంవత్సరం చికాగో నగరంలో సర్వమత మహాసభలో పాల్గొన్నారు. అమెరికన్లను బాగా ప్రభావితం చేశారు. స్వామీజీకి తన నౌకాగృహంలో మహా విచిత్రమైన భావన, అనుభూతి కలిగాయి.
1902 నాటికి స్వామీజీ రోగ్యం బాగా దెబ్బ తింది.
ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 5 చదవండి..
21 రోజులు నీటిని త్రాగలేదు. నీటితో నోరు పుక్కిలించి నప్పుడు కూడా, ఒక్కచుక్క నీరు గొంతులో క్రిందికి దిగకుండా నోటి కండరాలు మూసుకుపోయేవి. శిష్యులు యీ స్థితిని చూచి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినప్పుడు "మనస్సులో దృఢంగా నిశ్చయించుకొన్నప్పుడు, శరీరం దాన్ని
అనుసరించి తీరాలి" నవ్వుతూ స్వామీజీ జవాబు చెప్పేవారు.
ఆ రోజుల్లో వెలువడిన ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా, కొత్త కూర్పును స్వామీజీ చదువసాగారు. ఆ పెద్ద గ్రంథాన్ని చూచిన ఒక శిష్యుడు దీన్ని పూర్తిగా చదవడానికి 'ఒక జీవిత కాలమైనా చాలదు' అన్నాడు. ఆ గ్రంధాన్ని శిష్యుని చేతికి యిచ్చి ప్రశ్నలను అడగమన్నారు.
శిష్యుని ప్రశ్నలకు సరియైన సమాధానాలు యివ్వడమేకాక, ఆ సంపుటిలోని భాషనే తు. చ. తప్పకుండా విశదీకరించారు. అస్ఖలిత బ్రహ్మచర్యం పాటించే వారికందరికీ ఇది సాధ్యమే అని స్వామీజీ తెలియజేశారు. శిష్యుడు స్వామీజీ వారి ప్రతిభకు ముగ్ధుడైనాడు.
చివరి రోజుల్లో ఒకనాడు సాయంత్రం స్వామీజీ వారు మఠ ఆవరణలో వున్న మామిడి చెట్టు క్రింద కూర్చొని వుండగా, వారి నుండి అద్భుతమైన ఆధ్యాత్మిక మహాశక్తి వ్యక్తమైంది. నేత్రాలు ఉజ్వల కాంతితో శరీరం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ వుండగా, తన చుట్టూ చేరియున్న సన్యాసులను, బ్రహ్మచారులను, వుద్దేశించి స్వామీజీ ఇలా చెప్పారు.
"బ్రహ్మాన్ని ఎక్కడ వెదుకుతావు.. ? అతడు ప్రతి జీవిలోనూ అంతర్నిహితుడై వున్నాడు. హృదయభాగాన్ని వత్తమాంగాన్ని చూపుతూ, ఇదిగో యిక్కడే ప్రత్యక్ష బ్రహ్మం వుంది. ఈ ప్రత్యక్ష బ్రహ్మాన్ని విడిచి, మరచి, ఇతరుల కోసం పాకులాడేవారు, హీనులు, కరతలామలకాల మాదిరి ఇదిగో యిక్కడే వుంది. ప్రత్యక్ష బ్రహ్మం. ”
ప్రత్యక్షానుభూతితో కూడుకొన్న స్వామీజీ ఆ పలుకులు అక్కడ గుమికూడి వున్న వారి మనస్సులను తక్షణం వున్నత శిఖరాలకు లేవనెత్తాయి. ధ్యానానుభూత శాంత ఆనందాలతో వారి మనస్సులు తేలిపోతూ వుంటే, నిశ్చేష్టులై కొన్ని క్షణాల వరకూ అందరూ అచేతనంగా నిలబడి పోయారు.
శారీరక రుగ్మతలు స్వామీజీ వారి మానసిక, ఆధ్యాత్మిక, శక్తులను వీసమంతైనా తగ్గించలేకపోయాయి. తాను ఇక ఎక్కువ కాలం జీవించబోనని ఎరిగిన స్వామీజీ క్రమక్రమంగా పనుల భారాన్ని సోదరశిష్యులకు, యితర శిష్యులకు అప్పగించారు.
వారు శిష్యులతో ఒకనాడు ఇలా అన్నారు. “జనులు బాగా శిక్షణ పొందిన తర్వాత వారి నాయకుడు వారిని విడిచి వెళ్ళడం ఎంతో అవసరం. నేతతోటే వుంటే, శిష్యులు ఉన్నతిని పొందలేరు. ”
ఆ పలుకు అందరికీ ఆశ్చర్యాన్ని, ఆవేదననూ కలిగించాయి. స్వామీజీ చివరి రెండు నెలలు క్రమేణా అంతర్ముఖులై ఎక్కువ సమయం ధ్యానంలో గడిపారు. ఒకరోజు పూర్వపు విషయాలను గురించి తమలో తాము మాట్లాడుకొంటున్న సమయంలో, వారిలో ఒకరు అనాలోచితంగా 'శ్రీ రామ కృష్ణులు చెప్పినట్లు తామెవరో తెలుసుకొన్నారా.. ?' అని స్వామీజీని అడిగాడు.
'అవును.. ఇప్పుడు నాకది తెలిసింది' యీ స్వామీజీ వారి జవాబుకు అందరూ ఆశ్చర్యపోయారు.
సోదరి నివేదితతో స్వామీ వారు.. 'ఒక గొప్ప తపస్సు, ధ్యానం, నన్ను ఆవేశించాయి. మృత్యువు కోసం సిద్ధమౌతున్నాను. ' అన్నారు.
వారికి తమ గురుదేవుల మాటలు స్ఫురణకు వచ్చాయి. అవి.. తాము ఎవరో తెలుసుకోగానే నరేన్ భౌతిక దేహాన్ని విడిచి వేస్తాడు. స్వామివారి ప్రవర్తన, మాటలు ఈ చివరి దశను చూస్తున్న సోదర శిష్యులందరూ, ఎంతో విషాదానికి లోనైనారు. స్వామీజీ తన సన్యాస శిష్యులనందరినీ చూడగోరి వారినందరినీ వచ్చి వెళ్ళవలసిందిగా ఉత్తరాలు వ్రాశారు.
శరీరాన్ని విడిచి పెట్టేముందు పంచాగాన్ని తెప్పించి.. దేన్నో నిశ్చయించ దలచినట్లు గుణించారు. ఆ సుముహూర్తం జూలై 4వ తేదీగా నిర్ణయించుకొన్నారు.
నిర్యాణానికి రొండు రోజులు ముందు 2వ తేదీన తన శిష్యురాలైన నివేదితను ఆహ్వానించి స్వహస్తాలతో స్వామీజీగారు భోజనం వడ్డించారు. తరువాత చేతుల
మీద నీళ్ళు పోసి తువ్వాలుతో వారే తుడిచారు. ఈ పనులన్నింటినీ నేను మీకు చేయవలసిన దాననని ఆమె ప్రతిఘటిస్తే, 'ఏసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడిగారని' గంభీరంగా స్వామీజీ బదులు చెప్పారు.
సోదర శిష్యులు ప్రేమానందుడితో, గంగా తీరాన పచారు చేస్తూ ఒక స్థలాన్ని చూపించి, 'నేను శరీరాన్ని విడిచాక ఇక్కడ దహనం చెయ్యి. ' అన్నారు గంభీర వదనంతో.
చివరిదైన మహాసమాధి రోజు వారు చేసే పనులన్నీ, ఉద్దేశపూర్వకంగా, అర్థయుక్తంగా కనిపించాయి. ఆ రోజు మందిరానికి వెళ్ళి, కిటికీలు అన్నీ మూసి ఒక్కరే కూర్చొని మూడు గంటలసేపు ధ్యానం చేశారు. తరువాత మఠ ఆవరణలో గంభీరంగా అంతర్ముఖులై పచార్లు చేశారు.
అప్పుడు 'మరొక వివేకానందుడుంటే ఈ వివేకానందుడు ఏం చేశాడో అర్థం చేసుకోగలడు. అయినా మున్ముందు ఎంతోమంది వివేకానందులు జన్మిస్తారు గదా.. !' అని తనలో తాను మాట్లాడుకోవడం, ప్రేమానందస్వామి విన్నాడు.
సామాన్యంగా స్వామీజీ తన గదిలోనే భోజనం చేసేవారు. ఆరోజు అందరితో కలసి తినటానికి భోజనశాలకు వచ్చారు. భోజనానంతరం గ్రంథాలయం నుండి శుక్ల యజుర్వేదాన్ని తెప్పించి ఒకరు చదువుతుండగా ఒక పాఠం విన్నారు.
అందులో 'సుషుమ్న' అనే పదానికి మహాధరుడు చేసిన వ్యాఖ్యానం సరికాదని చెప్పారు. వేదాంతాలను శ్రద్ధతో అధ్యయనం చేసి, వాటి యొక్క నిజమైన అర్థాన్ని అవగాహన పరచుకొని, శాస్త్రాలను చక్కని వ్యాఖ్యానాలను చేయవలసిందింగా శిష్యులకు ఆదేశమిచ్చారు.
మధ్యాహ్నం ఒంటిగంటకు మఠంలోని బ్రహ్మచారులందరినీ సమావేశపరచి సుమారు మూడు గంటలసేపు సంస్కృత వ్యాకరణం పాఠంగా చెప్పారు. సాయంకాలం ప్రేమానందస్వామితో కలసి వాహ్వాళిగా సుమారు రొండు మైళ్ళు నడిచారు. మాటల సందర్భంలో మఠంలో ఒక వేద పాఠశాలను ప్రారంభిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వక్తపరిచారు. మఠానికి తిరిగి వచ్చాక వారు తమ మూడు కోర్కెలను వ్యక్తం చేశారు.
మొదటిది జపాన్ కోసం ఏదైనా చెయ్యటం.
రెండవది మఠంలో కాళీపూజ చెయ్యటం.
మూడవది ప్రఖ్యాత పండితులు, కార్యనిర్వాహకులు పి. ఆర్. సి దత్తను చూడటం.
అందరి సన్యాసులతో కొంతసేపు మాట్లాడారు. అంతలో ‘ఆరతి’ సమయాన్ని సూచిస్తూ, గంటలు మ్రోగాయి. వెంటనే స్వామీజీగారు తమ గదిలోనికి వెళ్ళిపోయారు. తన సేవక శిష్యుణ్ణి గది బైట వేచి వుండమని చెప్పి, గదిలోకి వెళ్ళి ఒక గంటసేపు ధ్యానం చేశారు. ధ్యానానంతరం..
శిష్యుణ్ణి పిలిచి.. మంచంమీద పడుకొని.. తన తల దగ్గర విసనకర్రతో వీచమని ఆదేశించారు. ఒక గంట ఈ రీతిగా గడచిన తర్వాత, స్వామీజీ చేతులు కాస్త వణకటం శిష్యుడు గమనించాడు. తర్వాత రెండు సుదీర్ఘ నిశ్వాసాలు తీసుకొన్నారు. అదే అంతం నిర్యాణం.
1902వ సం: జూలై 4వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీ వివేకానందస్వామీజీ మహా సమాధి పొందారు. అప్పటికి వారి వయస్సు 39 సంవత్సరాల ఐదు నెలలా 24 రోజులు.
అదే సమయంలో మద్రాసులో ధ్యానానికి కూర్చున్న..
రామకృష్ణానందస్వామికి 'శశీ!.. శశీ!.. ఉమ్మివేసినట్లుగా శరీరాన్ని యిప్పుడే విడిచి పెట్టేసాను.. ' అంటూ అశరీరవాణి వినిపించింది.
స్వామీజీ వారిని గురించి సుభాష్ చంద్రబోస్ గారు యిలా పేర్కొన్నారు. 'శ్రీవివేకానందుడు మహోన్నతుడు, గంభీరుడు, సత్యాన్ని సాక్షాత్కరించుకొన్న యోగి పుంగవుడు. ఆధ్యాత్మిక ఉన్నతికోసం తన జీవితాన్నే సమర్పించిన మహా త్యాగపురుషుడు. నేను అపార్థం చేసుకోలేదంటే నవ్య భారతదేశం ఆ మహనీయుని సృష్టి. వారు ఇపుడు జీవించి వుంటే, నేను వారి పాదాక్రాంతుణ్ణి అయ్యేవాణ్ణి. '
ఆ హైందవ జ్యోతి విశ్వానికంతా అద్వైత- హైందవ జ్యోతి దివ్య కిరణాలను వ్యాపింపజేసి, ఆ ఒక జ్యోతినుండి పలు జ్యోతులను వెలిగించి, ప్రకాశించునట్లు చేసి, జగతిని వెలుగుతో నింపి అమరత్వంతో విశ్వవ్యాప్తం అయింది. ఈ కలియుగం ఉన్నంతవరకూ ఆ దివ్య తేజం అమరం, ఆచంద్రార్కం.
ఉత్కంఠతను కలిగించే శ్రీస్వామీ వివేకానంద చరిత్రను పూర్తిగా చదివాడు వివేకానంద. పుస్తకం ముందు పేజీలో అమృత వ్రాసిన 'నా మాట' ను మరోసారి చదివాడు.
అమృత పట్ల వివేకానందకు ఎంతో గౌరవం. అభిమానం ఏర్పడ్డాయి. ఆమె మనోభావాలు, అదర్శాలు, ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత పూర్తిగా అర్థమైనాయి. ఇలాంటి అమ్మాయి నాకు చెల్లెలిగా వుండి వుంటే ఎంత బాగుండేదో.. ! ఆమె నిర్వహించే అభ్యున్నతి కార్యక్రమాల్లో తను ఆమెకు సహాయపడాలనుకొన్నాడు.
ముందుగా తన యీ యింట్లో, రేపటి తన ఆఫీస్ లో, శ్రీస్వామి వివేకానంద ఫోటోల ఆవిష్కరణం జరిగేలా చూడాలనుకొన్నాడు.
కాలింగ్ బెల్ మ్రోగింది. సమయం రాత్రి పదిన్నర. ఈ సమయంలో, 'ఎవరొచ్చారు?. ' వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగుండా తన తమ్ముడు విజయానంద.
"అన్నయ్యా.. ! నీవు ఇక్కడికి ఉద్యోగ రీత్యా రావడం నాకు చాలా ఆనందం. ” అన్నయ్యను కౌగలించుకొన్నాడు విజయ్.
అయినవారి ఆత్మీయుల పరిష్యంగణలో ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు వివేకానంద అదే స్థితికి లోనయ్యాడు. తను, తమ్ముణ్ణి ఒకటిన్నర నెలక్రిందట రాజమండ్రికి వెళ్ళినప్పుడు చూచాడు.
“రారా.. ! బాగున్నావా.. !” చేతిని పట్టుకొని లోనికి నడవబోయాడు.
“అన్నయ్యా.. ! తలుపు మూసి వెళదాం. " విజయ్ తలుపు మూశాడు.
యిరువురూ వివేకానంద బెడ్రూంలో ప్రవేశించారు.
"విజయా.. ! భోం చేశావా.. !"
“చేశానన్నయ్యా.. !”
“ఎక్కడ.. ?"
"క్యాంప్ కు బయటకి వెళ్ళాను. వచ్చేదార్లో తినేశాను. "
"నీవు భోం చేశావా అన్నయ్యా.. !" అడిగాడు విజయ్.
"చేశాను. ఈ పూట నాకు విందు భోజనం. " నవ్వాడు వివేకానంద అమృతను మదిలో తలచుకొంటూ.
“విందు భోజనమా.. !” ఆశ్చర్యంతో అడిగాడు విజయ్.
“అవును రా.. ! నేను ఇక్కడికి వస్తూవుండగా నలభై కిలోమీటర్ల దూరంలో మనకారు ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. అమృత బి. డి. ఓ. అట. ఆమె నాకు లిఫ్టు యిచ్చింది. తన వివరాలు నాకు చెప్పింది. నా వివరాలు ఆమెకు తెలియజేశాను. తను యింటికి వెళ్ళి కార్ మెకానిక్ ను పంపింది. అతను వెళ్ళి మన కారును రిపేర్ చేసి వెనక్కు నేను చెప్పినట్టుగా పంపేశాడు. ఆమె నాకు భోజనాన్ని పంపింది. తను చాలా గొప్ప వ్యక్తిత్వం వున్న అమ్మాయి విజయా.. !” సంతోషంగా చెప్పాడు వివేకానంద.
"అన్నయ్యా.. ! ఇల్లంతా చూచి వస్తాను. ” అని చెప్పి విజయానంద అన్ని గదులు చూచి అన్న దగ్గరికి వచ్చాడు.
"అన్నయ్యా.. ! వెల్ ఫర్నిషిడ్. యిల్లు చాలా బాగుంది.
నేను రేపు ఇక్కడికి షిఫ్టు అయిపోతాను. " ఆనందంగా చెప్పాడు విజయ్.
“విజయా.. ! వద్దురా.. !” అనునయంగా చెప్పాడు వివేకానంద.
“ఏం అన్నయ్యా.. !” ఆశ్చర్యంగా అడిగాడు విజయ్.
"ఈ వూరు మన నాన్నగారి వూరు. మనకు యిక్కడ కొంతమంది విరోధులు వున్నారు. మనం ఎవరమన్నది, మన యిద్దరం అన్నతములమన్నదీ, ఎవరికీ తెలియకూడదు. మన జాగ్రత్తలో మనం వుండడం మంచిది కదా విజయా.. !"
“ఓహో అలాగా.. !"
“అవును. ”
"సరే అన్నయ్యా. నేను అక్కడే వుంటాను. అప్పుడప్పుడూ కలుసుకొందాం.
ఫోన్లో మాట్లాడుకుందాం, సరేనా.. !"
“అవును. ”
"సెల్ మ్రోగింది. వివేకానంద నెంబరు చూచాడు. అది తన మామ ఆదిశేషయ్యగారి కాల్.
"మామయ్యా.. ! క్షేమంగా చేరాను. బండిని వెనక్కు పంపించాను. రేపు డ్యూటీలో జాయిన్ అవుతాను”
“విజయ్ కలిశాడా.. !" ఆదిశేషయ్యగారి ప్రశ్న.
"క్యాంపుకు పోయి లేటయిందట. ఇప్పుడే వచ్చాడు. ”
“వాడు బాగున్నాడా.. !”
వాడికేం మామయ్యా.. ! హీరోలా వున్నాడు. " నవ్వాడు వివేకానంద.
ఆదిశేషయ్యగారూ సంతోషంతో నవ్వారు.
“అమ్మ నా ప్రక్కనే వుంది. ఇద్దరూ మాట్లాడండి. ”
“అలాగే. ”
ఆదిశేషయ్య ఫోన్ ను, తన చెల్లెలు భువనేశ్వరికి అందించాడు.
“అమ్మా.. !” ఆప్యాయంగా పలకరించాడు వివేకానంద.
“నాన్నా.. ! వివేకా.. క్షేమంగా చేరావా.. ?”
“చేరానమ్మ. ”
“నాన్నా.. ! నీ తత్వం నాకు బాగా తెలుసు. యింతకాలం మన ప్రాంతంలో మామయ్య అండన వున్నావు. ఇక మీదట నీవు అక్కడ చాలా జాగ్రర్తగా వుండాలి.
ప్రతి ఒక్కరికీ సహనం అనేది కవచంలాంటిది. అసహనం అనర్థాలకు దారితీస్తుంది. నీ ఉద్యోగ ధర్మాన్ని సహనంతో జాగ్రర్తగా నిర్వర్తించు బాబూ.. !"
ఆమె మాటల్లో అభ్యర్థన గోచరించింది వివేకానందకు.
“అమ్మా.. !.. నీవు యింతగా చెప్పాలా.. ! నా గురించి భయపడకమ్మా.. !" అనునయంగా చెప్పాడు వివేకానంద.
“ఫోన్ విజయకిస్తావా.. !" అంది భువనేశ్వరి.
వివేకానంద ఫోన్ ను విజయకు అందించాడు.
“అమ్మా.. ! ఎలా వున్నావమ్మా.. !”
“నాకేం తక్కువరా.. ! నా అన్నావదినలు నా అండన వుండగా.. నీవు ఎలా వున్నావ్.. ?”
"హ్యాపీగా వున్నానమ్మా.. ! ఇప్పుడు అన్నయ్య కూడా ఇక్కడికి వచ్చాడుగా, ఇంకా హ్యాపీగా వుంటాను. ” అంటు నవ్వాడు విజయా..
"ఉద్యోగ ధర్మాన్ని జాగ్రత్తగా నిర్వహించు. ”
"అలాగేనమ్మా.. ! నీవు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూచుకో. మా గురించి దిగులు పడకు. నేను పదిరోజుల్లో నిన్ను చూచేదానికి వస్తాను. మామయ్యకు, అత్తయ్యకు,
అమ్మమ్మకు నా నమస్కారాలు తెలియజేయి. ”
"నాన్నా.. ! ఇద్దరూ జాగ్రత్తగా వుండండి. సరేనా.. !”
“అలాగే అమ్మా.. !”
“పెట్టేస్తున్నా. ” అంది భువనేశ్వరి.
“ఆఁ.. ” తల్లి చివరి మాటలకు విజయ్ కళ్ళు చెమ్మగిల్లాయి. తలను ప్రక్కకు త్రిప్పుకున్నాడు.
విజయ్ స్థితిని చూచిన వివేకానంద మనస్సుకూడా వికలమయింది. సోఫాలో తమ్ముని ప్రక్కన కూర్చొని అతని ముఖాన్ని తన వైపుకు త్రిప్పుకొన్నాడు.
“పాపం.. అమ్మ.. ! మన ఇద్దరిలో ఎవరో ఒకరం అమ్మ దగ్గర వుండాలనయ్యా.. ! లేకపోతే ఆమె మనలను గురించి దిగులు పడుతుంది. యింతకాలం నీవు అమ్మ దగ్గర వున్నావు. నాకు బాధగా అనిపించలేదు. కానీ ఇప్పుడు.. ” విజయ్ కంఠం బొంగురుపోయింది.
తమ్ముడి భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కొని కన్నీటిని తుడుస్తూ వివేకానంద.. “బాధ పడకురా.. ! నీకు ఆ ప్రాంతానికి ట్రాన్స్పర్ జరిగేలా నేను చూస్తాను. తప్పకుండా నీవు త్వరలో అమ్మకు దగ్గరగా వెళుతావు. ” ఆప్యాయంగా చెప్పాడు వివేకానంద.
“ఇక్కడికి వచ్చి రొండున్నర సంవత్సరం అయింది. ఆరేడు నెలల లోపల ట్రాన్స్పర్ రావచ్చు. ఆ వచ్చేది ఆ ప్రాంతానికైతే బాగుంటుంది అన్నయ్యా.. !"
“చెప్పాను కదరా.. ! గట్టిగా ప్రయత్నిస్తాను. పొద్దుపోయింది. ఇక పడుకొందాం. ”
అన్నతమ్ములిరువురూ భావి జీవితాన్ని తలుచుకొంటూ శయనించారు.
"ఊరకూరకే మనం కలవకూడదు విజయ్. తరచుగా ఫోన్లో మాట్లాడుకొందాం సరేనా.. !” వుదయాన్నే లేచి బయలుదేరుతున్న తమ్ముడితో చెప్పాడు వివేకానంద.
"మీరు చెప్పింది నాకు అర్థం అయింది అన్నయ్యా.. ! అలాగే నీవు జాగ్రర్త. ”అని చెప్పి, విజయ్ తన రూమ్ కు వెళ్ళిపోయాడు.
కాలకృత్యాలు తీర్చుకొని వివేకానంద డ్రెస్ చేసుకొని ఆఫీస్కు వెళ్ళేదానికి సిద్ధంగా హాల్లో కూర్చొన్నాడు. ఏడున్నరకల్లా జీప్ వచ్చి వాకిట్లో ఆగింది.
డ్రైవర్ వరండాలోకి వచ్చి, “సార్.. ! గుడ్మార్నింగ్. " అంటు సెల్యూట్ చేశాడు. వరండాలో నిలబడివున్న మస్తాన్ ను చూచాడు వివేకానంద. సాఫో నుంచి లేచి, ఇంటికి తాళం బిగించి జీప్ ను సమీపించి ముందు కూర్చున్నాడు.
మస్తాన్ తన స్థానంలో కూర్చొని, జీప్ ను స్టార్ట్ చేశాడు. ఇరవై నిముషాల్లో జీపు స్టేషన్ ముందు ఆగింది.
ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్స్, పోలీసులూ జీప్ నుండి దిగిన యస్. ఐ. వివేవానందకు సగౌరవంగా సెల్యూట్ చేశారు. దరహాసంతో అందరినీ చూస్తూ చేతిని పైకెత్తి, “గుడ్ మార్నింగ్ టు ఆల్. ” అన్నాడు. ముందు ఒక కానిస్టేబుల్ నడువగా అతన్ని అనుసరించి నడిచాడు. అతను ఒక గదిని సమీపించి, “సార్ యిదే మీ గది. ” వినయంగా చెప్పాడు ఆ కానిస్టేబుల్.
“మీ పేరు!.. ” అడిగాడు వివేకానంద.
“కోటయ్య సార్. ”
వివేకానంద తన స్థానంలో కూర్చున్నాడు. ముందుగా మనస్సు ఆనందంగా, అమృతతో మాట్లాడాలని సెల్ అమృత నెంబరును నొక్కాడు.
“హలో!.. ” మృధుమధురమైన అమృత కంఠం.
“గుడ్ మార్నింగ్ మేడమ్. ”
“గుడ్మార్నింగ్. మీరు.. !”
"వివేకానంద. మీరు రాత్రి పంపిన భోజనం మీ పేరులాగానే దివ్యంగా వుంది. మీరు చేసిన సహాయానికి నా ధన్యవాదాలు. ఇప్పుడే ఆఫీస్లో ప్రవేశించాను. సహృదయులైన మీకు ఆఫీస్ ఆవరణం నుండి ఇది నా మొదటి కాల్. ” నవ్వుతూ చెప్పాడు వివేకానంద.
“ఓ అలాగా.. ! థ్యాంక్యూ సార్.. !"
“మీరు వ్రాసిన స్వామీజీ వివేకానంద చరిత్రను రాత్రి చదివాను. సంక్షిప్తంగా అద్భుతంగా వ్రాశారు. మీరు మొదటి పేజీలో వ్రాసిన 'నామాట' మీ మంచి మనస్సును, మీకున్న వున్నతమైన ఆశయాలను తెలియజేస్తూ వుంది." నవ్వుతూ అభినందనలను తెలియజేసాడు వివేకానంద.
“చాలా సంతోషం సార్. ”
"మీ ఆశయం చాలా గొప్పది. అందులో నేనూ పాలు పంచుకోవాలనుకొంటున్నాను. ఓ పదివేల కాపీలు అచ్చు వేయించండి. ఆ ఖర్చును నేను భరిస్తాను. భావి భారతపౌరుల అభ్యున్నతికి మీరు చేసే ఈ సాధనలో నాకూ కొంత అవకాశాన్ని యివ్వండి. ”
“ఓకే.. ఓకే.. సార్ వెల్కమ్. మా నాన్నగారు నేను ఎవరితో మాట్లాడుతున్నానా అని విచిత్రంగా చూస్తున్నారు. వారితో ఫ్యూ సెకండ్స్ మాట్లాడగలరా.. ?” అభ్యర్థనగా అడిగింది అమృత.
“విత్ ప్లజర్. ఫోన్ ను వారికి యివ్వండి. ”
అమృత తననే చూస్తున్న తండ్రి.. కాలేజ్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుగారికి ఫోన్ అందిస్తూ.. "కొత్తగా వచ్చిన యస్. ఐ. వివేకానందగారు. మాట్లాడండి నాన్నా.. !” అంది.
వెంకటేశ్వర్లు సెల్ ను అందుకొన్నాడు.
“హలో.. ! గుడ్ మార్నింగ్ సార్.. !” అన్నాడు.
“గుడ్ మార్నింగ్ సార్.. ! మీ అమ్మాయి గారు రియల్లీ గ్రేట్ సార్.. మీరు చాలా అదృష్టవంతులు. ఈ వూరికి నేను కొత్తగా వచ్చాను. తొలి పరిచయం మీదే. మీరు నాకంటే పెద్దవారు. నాకు మీ ఆశీర్వచనాలు కావాలి. ” ఎంతో వినయంతో అడిగాడు వివేకానంద.
"మీ గురించి అమ్మాయి చెప్పింది. ఆ సర్వేశ్వరుడు మీకు ఎల్లవేళలా అండగా వుండాలని కోరుకుంటున్నాను. మీకు నా శుభాశీస్సులు. ” నవ్వుతూ చెప్పాడు వెంకటేశ్వర్లు.
“థాంక్యూ సార్. ”
"వీలు చూచుకొని ఒకసారి మా ఇంటికి రండి. ”
"తప్పకుండా వస్తాను. వుంటాను సార్. "
“మంచిది. ”
వివేకానంద ఫోన్ కట్ చేశాడు. ఎదురుగుండా వచ్చి నిలచిన హెడ్కానిస్టేబుల్ కోటయ్యను చూచాడు.
=================================================================================
ఇంకా ఉంది..
=================================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments