top of page

ప్రగతి ప్రేమికులు 7


'Pragathi Premikulu episode 7' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


జరిగిన కథ:


బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.


శ్రీ వివేకానంద స్వామీజీ అసలు పేరు నరేంద్రుడు.

శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుడుగా మారారు.


1893 వ సంవత్సరం చికాగో నగరంలో సర్వమత మహాసభలో పాల్గొన్నారు. అమెరికన్లను బాగా ప్రభావితం చేశారు. 1902వ సం: జూలై 4వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీ వివేకానందస్వామీజీ మహా సమాధి పొందారు.


స్వామిజీ కథను చదవడం పూర్తి చేసాడు యస్. ఐ. వివేకానంద.

తమ్ముడు విజయానంద ని కలుస్తాడు.

రాజకీయ నాయకుడు ధనుంజయరావు, ఎస్సై వివేకకానందను తన అదుపాజ్ఞలలో పెట్టుకోవాలనుకుంటాడు.



ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 7 చదవండి..


“సార్!” అన్న కోటయ్య పిలుపుతో వివేకానంద ఆలోచనలు ఆగిపోయాయి. ద్వారం వైపు చూచాడు.


"ఏకాంబరం సార్ వచ్చివున్నారు సార్. " చెప్పాడు కోటయ్య.


"రమ్మనండి. ”


ఏకాంబరం సెల్యూట్ చేసి లోనికి వచ్చాడు. వివేకానంద కూర్చోమన్నాడు.


అతను కూర్చొని,

"సార్.. పి. పి. గారు మీతో ఒకసారి మాట్లాడాలన్నారు సార్.. ” అన్నాడు.


“నేను మాట్లాడుతాను. ” పి. పి నెంబర్ను తీసికొని వివేకానంద యింటికి వెళ్ళిపోయాడు.


రాత్రి భోజనానంతరం తల్లి భువనేశ్వరి, మామ ఆదిశేషయ్యలు ఫోన్ చేసి అన్నదమ్ముల యోగక్షేమాలు తెలిసికొన్నారు. చివరగా ఆదిశేషయ్య, ధనుంజయరావు వ్యవహారాల్లో జాగ్రత్తగా వర్తించవలసిందిగా హెచ్చరించాడు.

తను ఆ వూరికి రాబోయే ముందు తల్లి, మామయ్య చెప్పిన మాటలు వివేకానంద మనోఫలకం మీద ప్రతిబింబించాయి.


“అమ్మా.. !” హాల్లో సోఫాలో కూర్చొని వున్న తల్లిని పిలిచాడు యస్. ఐ వివేకానంద యింట్లోకి రాగానే.


“ఏం నాన్నా. ” నవ్వుతూ అంది భువనేశ్వరి.


“నాకు ప్రమోషన్ మీద ట్రాన్స్పర్ అయిందమ్మా. ”


"ఏ వూరికి.. ?"


“మన వూరికి. ”


భువనేశ్వరి విచారంగా తలదించుకొంది. తల్లి వాలకం వివేకానందకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నవ్వుతూ ఆమె ప్రక్కన కూర్చున్నాడు.


"ఏమ్మా.. ! నీకు సంతోషంగా లేదా.. !"


“ఆ వూరి కాకుండా, వేరే ఏ వూరికైనా మార్పించుకోగలవా.. !”


ఆర్ద్రతతో అతని ముఖంలోకి చూస్తూ అడిగింది భువనేశ్వరి.

"సాధ్యం కాదమ్మా.. ! అవునూ.. అది మన సొంతవూరే కదమ్మా.. !"


ప్రశ్నార్థకంగా తల్లి ముఖంలోకి చూచాడు వివేకానంద.

“సొంత.. !” హా.. హా.. విరక్తిగా నవ్వింది భువనేశ్వరి.


ఆ వూరు అనగానే తల్లికి గత జ్ఞాపకాలు వచ్చివుంటాయి. ఆమె ఆ ఊరి కోడలు, తండ్రి పురుషోత్తమరావు తన మూడేళ్ళ వయస్సున వారు మరణించారు. తల్లి తన్ను తీసుకొని తన పుట్టింటికి చేరింది. అప్పుడు ఆమె గర్భవతి. ఆమె తల్లి కత్యాయని, అన్నయ్య ఆదిశేషయ్యలతో కలసి పుట్టింటనే వుండిపోయింది. తనకు తమ్ముడు పుట్టాడు. వాడికి విజయానంద అని పేరు పెట్టారు.


తనకు తెలిసిన తండ్రి, తన మేనమామ ఆదిశేషయ్య. కన్నబిడ్డలా చూచుకొన్నాడు. తనను, తమ్ముణ్ణి తన బిడ్డల కంటే ఎక్కువ వాత్సల్యానురాగాలతో పెంచి పెద్ద చేశాడు. తన ఇష్టానుసారంగా తనను చదివించి సబ్ ఇన్స్పెక్టర్ ని చేశాడు.


తమ్ముడు విజయాను వాడి ష్టానుసారంగా సివిల్ ఇంజనీరింగ్ చదివించాడు ఎ. ఇ గా ఆర్ అండ్ డిపార్ట్మెంటులో చేర్పించాడు. విజయానంద తన సొంతవూరులోనే ప్రస్తుతం పనిచేస్తున్నాడు. తమ్ముడూ తనూ కలసి వుంటూ ఒకే వూర్లో, తమ సొంతవూర్లో పనిచేయబోతున్నందుకు వివేకానందకు ఎంతో ఆనందం.


కానీ..! తల్లికి ఆ.. పూరంటే.. ఇష్టం లేదన్న విషయం ఆమె ప్రశ్న మూలంగా వివేకానందకు అర్థం అయింది. తల్లికి ఆనందాన్ని కలిగించాలనే వుద్దేశ్యంతో..


“అమ్మా.. నీకు అక్కడికి నాతో రావడానికి యిష్టం లేకపోతే.. ఇక్కడే వుండమ్మా.. మామయ్య, అత్తయ్య వసుంధర, వనజ నీకు తోడుగా వుంటారుగా.. !


నేను తమ్ముడు యిప్పుడు వచ్చి వెళుతున్నట్లుగానే నెలకొకసారి నిన్ను చూచేదానికి ఇక్కడికి వస్తానమ్మా.. ! ఈ నా నిర్ణయం నీకు సమ్మతమేగా.. !" చిరునవ్వుతో తల్లి ముఖం లోకి చూచాడు వివేకానంద.


“వివేకా.. !” మెల్లగా అంది భువనేశ్వరి.


"ఏమ్మా.. !"


“నీవు తెనాలికి వెళ్ళి ఒకటిన్నర సంవత్సరమేగా అయింది.. ?”


“అవునమ్మా.. !”


“ఇంతలోనే ట్రాన్స్పర్.. ” తల్లి పూర్తి చేయకముందే, ఆమె వుద్దేశాన్ని ఎరిగిన వివేకానంద నవ్వుతూ..

"ఇది ప్రమోషన్ మీద వచ్చిన ట్రాన్స్పర్ అమ్మా.. ! నీ కొడుకు పైపైకి ఎదగడం నీకు ఇష్టం లేదా.. !”


ప్రతి తల్లి, బిడ్డల ఉన్నతిని కోరుకుంటుంది నాన్నా.. ! కానీ ముక్కుకు సూటిగా పోయే నీ తత్వం వల్ల.. ” ఆలోచిస్తూ.. భువనేశ్వరి ఆగిపోయింది.


"ఇప్పటికి నాలుగు ట్రాన్స్పర్స్ అయినాయి. ఒక్కచోటా కనీసం మూడు సంవత్సరాలు వుండింది లేదు. పోయేచోట ఎంతకాలం వుంటావో ఏమో.. ! అని కదమ్మా నీ సందేహం. అమ్మా.. ! ఉద్యోగం చేయాలనుకునేవాడికి ట్రాన్స్పర్స్ తప్పవమ్మా. నా తత్వాన్ని గిట్టనివాళ్ళు, వాళ్ళకు ఉన్న పలుకుబడితో నన్ను ట్రాన్స్పర్ చేయించారనే విషయం నాకు తెలుసమ్మా. అమ్మా.. ! ఎదుటివారి స్వార్థానికి తలవంచి, నేను నా తత్వాన్ని ఎలా మార్చుకోగలనమ్మా.. !


నీవే చెబుతుంటావు కదా.. ! ప్రతి మనిషికి బ్రతికే దానికి రెండుదార్లు ఉన్నాయి. ఒకటి ఏ రీతిగానైనా బ్రతకడం, రెండవది తను నమ్మిన ధర్మమార్గాన బ్రతకడం, నేను నీవు నేర్పిన రెండవ మార్గాన నడుస్తున్నానమ్మా.. ! నా చర్యలు ధర్మబద్ధంగా పదిమంది మెచ్చేలా వుంటాయేగాని స్వార్థం, ద్వేషం, మోసంతో వ్యవహరించే వ్యక్తులకు ఏనాటికీ అనుకూలంగా వుండవమ్మా. నీవే అంటుంటావు కదా.. ! మన ప్రాంతంలో మా నాన్నగారికి ఎంతో మంచి పేరని, నాకూ అలాంటి పేరు రావాలన్నదే నా లక్ష్యం అమ్మా.. !" తనయుని మాటల్లో అనునయం, కళ్ళల్లో దీక్ష గోచరించాయి భువనేశ్వరికి.


'వీడి తత్వం ముమ్మూర్తులా తండ్రిగారిదే.. ! ఆ తత్వానికి సంతోషించాలా.. ? లేక విచారించాలా.. ? న్యాయానికి అన్యాయం శత్రువు, ధర్మానికి అధర్మం శత్రువు, నీతికి అవినీతి శత్రువు, అక్కడ వీడు ఎక్కవ కాలం పనిచేయలేడు. ' అనుకొంది భువనేశ్వరి.


ఆఫీస్ నుంచి మేనమామ ఆదిశేషయ్య వచ్చాడు. మామగారిని చూచి, వివేకానంద ఆనందంగా తన ప్రమోషన్ వార్తను తెలియజేశాడు. ఆదిశేషయ్య సంతోషంతో వివేకానంద చేతిని తన చేతిలోకి తీసుకొని 'కంగ్రాచ్యులేషన్స్ వివేకా.. ! ఇది నీ నిజాయితీకి లభించిన పురస్కారం మై డియర్ బాయ్.. !" ఆనందంగా కౌగలించుకొని ఆశీర్వదించాడు.


సోఫాలో విచారంగా కూర్చొని వున్న చెల్లెలి ముఖంలోకి చూచాడు. ప్రక్కన కూర్చొని..

“అమ్మా!.. భువన.. నీవెందుకమ్మా విచారంగా వున్నావ్.. ?”


"వీడు వెళ్ళబోయేది ఆ వూరికి అన్నయ్యా.. !

“అంటే.. !"

"మా నాన్నగారి వూరికి మావయ్యా.. !”


"ఓహో.. ! అలాగా.. !” భువనేశ్వరి ముఖంలోకి చూస్తూ..

"అమ్మా.. ! కాలం మారింది. మనుషులు తత్వాలూ మారాయి. మన వివేకానంద యస్. ఐ హోదాలో ఆ వూరికి వెళుతున్నాడు. అక్కడ మన విజయ్ కూడా వున్నాడు. ఇద్దరూ కలసి హాయిగా వుంటారు. నీవు ఏ విషయానికీ భయపడనవసరంలేదు. ” అనునయంగా చెప్పాడు ఆదిశేషయ్య.


భువనేశ్వరి ప్రశ్నార్థకంగా అన్నగారి ముఖంలోకి చూచింది. ఆమె హృదయం ఆవేదనను ఎరిగిన ఆదిశేషయ్య..

"అమ్మా.. ! భువనా.. ! మనస్సులో ఎలాంటి సంకోచం పెట్టుకోకు. మన వివేకానంద సమర్థుడు. వివేకవంతుడు. మనమందరం కలసి ఆనందంగా వాడికి

వీడ్కోలు చెప్పాలి. ” వివేకానందవైపుకు తిరిగి..

“వివేకా.. ! నీ ప్రయాణం ఎప్పుడు.. ?” అడిగాడు ఆదిశేషయ్య.


“రేపు మామయ్య. ”


“మంచిది. అన్నింటినీ సర్దుకో. మన కారును తీసుకొని వెళ్ళు. "


“అలాగే మామయ్య. ”


ఆదిశేషయ్య తన గదిలోనికి వెళ్ళిపోయాడు. వృత్తిరీత్యావారు న్యాయవాది. ఆ ప్రాంతంలో మంచిపేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. సత్యానికి ధర్మానికి కట్టుబడ్డ మంచి మనిషి, వారి తండ్రిగారు కీర్తిశేషులు వేణుగోపాల్ కూడా అదే వృత్తిలో వుండేవారు. ఐదుసంవత్సరాల క్రిందట తన యనభై ఐదవ ఏట గతించారు.


ఆదిశేషయ్య అర్ధాంగి వసుంధర హాల్లోకి వస్తూ..

"వదినా.. ! ఊరగాయను కలిపాను. సరిగా కుదిరిందో లేదో ఒకసారి చూడు. ” అంది.


భువనేశ్వరి సోఫానుంచి లేచి “పద. ” ఆ ఇరువురూ వంట ఇంటి వైపుకు, వివేకానంద తన గదికి వెళ్ళిపోయాడు. అతని మనస్సులో ఎన్నో సందేహాలు.


'ఏకారణంగా తన తల్లి ఆ వూరంటే అంతగా భయపడుతూ వుంది. అక్కడ.. తమ కుటుంబానికి విరోధులు వున్నారా.. ? నాన్నగారు మరణించడానికి కారణం ఏమిటి.. ? నాన్నగారి బంధువులు ఎవరూ ఆ వూర్లో లేరా.. ? వుండి వుంటే వారు ఏదో ఒక్క సందర్భంలో యిక్కడికి వచ్చి వుండాలి కదా.. ! పాతిక సంవత్సరాలుగా ఎవరూ రాలేదే.. ! నాన్నగారి మరణం అనారోగ్య కారణంగానా లేక వేరే ఏదైనా కారణమా.. ?'

ఈ ఆలోచనలతోనే సోఫాలో కూర్చున్నాడు.


'ఈ నా ప్రశ్నలకన్నింటికీ జవాబులు తెలిసిన వ్యక్తి మామయ్య. వారిని అడిగి యదార్థాన్ని తెలిసికోవాలి. '

అనే నిర్ణయానికి వచ్చి డ్రస్ మార్చుకొని రెస్ట్ రూమ్ కు వెళ్ళాడు. స్నానం ముగించి నైట్ డ్రస్ వేసికొన్నాడు.

పనిమనిషి పంకజం వచ్చి "అయ్యా.. ! అమ్మగారు భోజనానికి పిలుస్తున్నారు. ” అంది.


“ఆఁ వస్తున్నాని చెప్పు. ” పంకజం వెళ్ళిపోయింది.


తలదువ్వుకొని, డైనింగ్ హాల్ వైపుకు నడిచాడు వివేకానంద.

ఆదిశేషయ్య భోజనానంతరం తన ఆఫీస్ గదిలో కూర్చొని లా బుక్ లోని పేజీలను పరిశీలిస్తున్నారు. వివేకానంద ఆ గదిలో ప్రవేశించాడు. ఎదురుగా నిలబడి వున్న అతన్ని చూచి ఆదిశేషయ్య.. "వివేకా రా కూర్చో” అన్నాడు.


వివేకానంద మౌనంగా కుర్చీలో కూర్చున్నాడు.

"వివేకా.. ! ఉదయాన్నే బయలుదేరాలి కదా.. ! పడుకోలేదేం.. ?” అడిగాడు ఆదిశేషయ్య.


“మామయ్య.. ! నేను మీ నుండి ఒక విషయాన్ని తెలిసికోవాలనుకొంటున్నాను. ” సౌమ్యంగా చెప్పాడు వివేకానంద.


“ఏమిటా విషయం.. ?"


“మా నాన్నగారిని గురించి, వారి మరణాన్ని గురించి. ”


ఆదిశేషయ్య కొద్దిక్షణాలు వివేకానంద ముఖంలోకి పరీక్షగా చూచాడు.


“ఆ విషయాలను గురించి నాకు వివరంగా చెప్పండి మామయ్యా.. ”


అభ్యర్ధన నిండి వుంది ఆ మాటల్లో.


ఆదిశేషయ్య నిట్టూర్చాడు. "వివేకా.. ! మీ నాన్నగారి పేరు పురుషోత్తమరావు. వారికి ఒక సోదరుడు ధనుంజయరావు. వీరి తండ్రి దశరధరామయ్య, వారికి రెండు వివాహాలు. మీ నాన్నగారి చిన్న వయస్సులో, వారి తల్లి గతించింది. మీ తాతగారు మరో స్త్రీని వివాహం చేసికొన్నారు. ఆమె కుమారుడు మీ పినతండ్రి ధనుంజయరావు.

మీ తాతగారు దశరధరామయ్య ఫ్రీడమ్ ఫయిటర్. గాంధీవాది. తొంభై ఏళ్ళ వయస్సులో వారు మరణించారు.


వారు బ్రతికి వుండగానే చివరిరోజుల్లో ఆస్థిని మూడు భాగాలుగా మీ నాన్నగారికి, వారి తమ్ముడికి, తన రెండవ భార్య పద్మావతికి పంచి వీలునామా వ్రాశారు.


మీ నాన్నగారు వ్యవసాయదారునిగా జీవనయాత్ర సాగిస్తే, మీ చిన్నాన్న ధనుంజయరావు రాజకీయాన్ని ఎన్నుకొన్నాడు. ఆస్థిపంపకాలను మీ తాతగారు పక్షపాతంగా పంచారని ఆ తల్లీ కొడుకులకు మీ నాన్నగారి పట్ల ద్వేషం. మీ తాతగారు చనిపోక ముందు రెండు సంవత్సరాల క్రిందట మీ నాన్నగారి వివాహం నా చెల్లెలు భువనేశ్వరితో జరిగింది. సంవత్సరం లోపల నువ్వు పుట్టావు. నీ జన్మదినోత్సవాన్ని మీ తాతగారు ఎంతో ఘనంగా జరిపించారు. వివేకానంద అనే పేరును నీకు పెట్టింది వారే.. ! వారి మరణానంతరం మీ చిన్నాన్న వారి తల్లి మీ అమ్మా, నాన్నలకు శత్రువులుగా మారిపోయారు.


ఎలక్షన్ గొడవల్లో మీ చిన్నాన్నగారికి వ్యతిరేక వర్గీయులు, వారితో గొడవ పెట్టుకొన్న సమయంలో మీ నాన్నగారు తన తమ్ముని పక్షాన చేరి ఎదుటి వర్గాన్ని విమర్శించారు. ఫలితంగా వారు పగతో పొలంలో వున్న మీ నాన్నగారి

మీద నాటుబాంబులు విసిరి వారిని చంపేశారు. ఆపై జరగవలసిన కార్యక్రమాలను మీ పినతండ్రి, నీవు చిన్న బిడ్డగా ఉన్న కారణంగా నిర్వహించారు. ఫోర్జరీ డాక్యుమెంటును తయారుచేసి మీ నాన్నగారి భాగపు ఆస్తిని తమదిగా వెల్లడి చేశారు.


విషయాన్ని తెలిసికొన్న మా నాన్నగారు నా చెల్లిని, నిన్ను ఈ మన ఇంటికి తీసికొని వచ్చారు.


అప్పటికి నా చెల్లెలు కడుపుతో వున్నందున ఆమెను గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకుండా వుండేలా, ఏట్లో ఖర్మ జరుగుతున్న సమయంలో అందరికీ విషయం తెలిసేలా దండోరా వేయించారు మా నాన్నగారు. నా చెల్లి నా ఇంటికి వచ్చిన ఏడునెలలకు విజయ్ జన్మించాడు. అప్పటికి నీ వయస్సు నాలుగు సంవత్సరాలు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకు నాకు వివాహం జరిగింది.


నా తండ్రి తన ఆస్థిలో భాగాన్ని పంచి నా చెల్లెలికి ఇచ్చాడు. ఆయన కన్నుమూసే సమయంలో నన్ను దగ్గరకు పిలిచి, చేయి చాచి 'భువనేశ్వరినీ ఆమె పిల్లలను నీ పిల్లలుగా చూచుకొంటానని నాకు మాట యివ్వు. ' అని నన్ను కోరారు. నేను నా చేతిని వారి చేతిలో వుంచాను. వారు ఆనందంగా కళ్ళు మూశారు. నా తండ్రి నేను ఎరిగిన దేవుడు. మా బావ బంగారం. తర్వాత మాకు తెలిసింది


‘ధనుంజయరావే మీ నాన్నను ఆ రీతిగా ఆస్థికోసం చంపించాడని. ’ చివరి మాటలను చెప్పేటప్పుడు ఆదిశేషయ్యగారి కంఠం బొంగురు పోయింది. కళ్ళల్లో నీరు.. చెప్పడం ఆపి కళ్ళు మూసుకొన్నాడు ఆదిశేషయ్య.

వివేకానంద శిలా ప్రతిమలా కూర్చుండిపోయాడు. తన తండ్రి చరిత్ర, అతని మరణం, వివేకానంద హృదయాన్ని స్థంబింప చేసింది. మనస్సులో ఆవేదన, వదనంలో విచారం, కళ్ళల్లో కన్నీరు.


హృదయంలో కలిగిన సంచలనాన్ని అణచుకొని ఆదిశేషయ్య మెల్లగా కళ్ళు తెరిచాడు. వివేకానంద ముఖంలోకి చూచాడు.


“ఈ చేదు నిజాన్ని ఎన్నటికీ మీకు చెప్పవద్దని నా చెల్లెలి దగ్గర మాట తీసుకొన్నాను. నేనూ చెప్పకూడదని నిర్ణయించుకొన్నాను. కారణం మీ లేత మనస్సులో ద్వేషం, పగ చేరకూడదనే వుద్దేశ్యంతో, కానీ నీవు అడిగిన కారణంగా నా నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ చేదు విషయాన్ని నీకు చెప్పవలసి వచ్చింది. వివేకా.. ! పగ, ద్వేషం మనిషిలోని మానవత్వాన్ని చంపేస్తాయి. నా పెంపకంలో పెరిగిన మీ అన్నదమ్ములు, ఈ సమాజంలో వున్నతమైన వ్యక్తిత్వంతో మీ జీవితాన్ని గడపాలనేది నా కోరిక.


మీ తల్లి కోరికా అదే.. ! మన పురాణాల్లో మనం దేవ దానవులను గురించి విని వున్నాము. ప్రస్తుత సమాజంలో కూడా దేవతలు దానవులు వున్నారు. మనషుల్లో ఈ తేడాకు కారణం.. ఆశ.. స్వార్థం.. స్వాతిశయం.


ధర్మబద్ధమైన కర్తవ్య పాలన.. ధార్మికుల లక్షణం. ఎక్కడికి వెళ్ళినా నీవు విద్యుక్త ధర్మాన్ని ధర్మబద్ధంగానే నెరవేర్చుతావని నీ మీద నాకు నమ్మకం. నేను చెప్పిన గత చరిత్రను మరచి, వెళ్ళి పడుకొని ప్రశాంత చిత్తంతో నిదురపో. పొద్దుపోయింది. ఇక వెళ్ళి పడుకో వివేకా.. !" ఎంతో అనునయంతో ప్రేమతో నిండిన ఆదిశేషయ్యగారి మాటలవి. అతను కుర్చీ నుండి లేచాడు.


సాలోచనగా వివేకానంద కూడా కుర్చీనుండి లేచాడు. గదిలోని బార్లైట్ స్విచ్ నొక్కాడు ఆదిశేషయ్య. ఇరువురూ గదినుండి బయటికి నడిచారు. తమతమ గదుల వైపుకు వెళ్ళిపోయారు. వివేకానంద మంచంపై పడుకొన్నాడు. మేనమామ ఆదిశేషయ్య చెప్పిన తన తండ్రి కథ, తల్లి వ్యధ, బాధతో వారు చెప్పిన చివరి మాటలు గుర్తుకు రాగానే వివేకానంద నయనాల్లో కన్నీరు..


ఆ మహనీయుడు మామయ్య, వారి తండ్రీ లేకుంటే తను, తల్లి, తమ్ముడు ఏమైపోయి వుండేవాళ్ళమో.. ! తన తండ్రి రూపం తనకు గుర్తులేదు. ఊహ తెలిసిన నాటినుంచీ తనకు, తమ్ముడికి అన్నీ మామయ్యే చూచారు.


'నాన్నా.. నాన్నా' అని పిలుస్తూ ఎంతో ఆదరాభిమానాలను తమ పట్ల చూపించారు. ఇక అత్తయ్య వసుంధర ఆ ఇంట్లో కాలు పెట్టిన రోజునుంచీ ఈనాటి వరకు తనను తమ్ముణ్ణి కన్న బిడ్డల్లా చూచుకొంటూ వుంది.


మామయ్య మంచి క్రమశిక్షణతో పెంచి, తమ ఇష్టానుసారంగా చదివించి, తనకున్న పలుకుబడితో ఇరువురికీ ఉద్యోగాలు ఇప్పించాడు. ఆ దంపతుల

ఋణం తను, తమ్ముడూ ఈ జన్మలో తీర్చుకోలేము. ఇక అమ్మ.. ఆమెకు తమ పట్ల వున్న అనురాగాన్ని మాటలతో చెప్పలేము. 'మీరిద్దరూ నా రొండునేత్రాలు నాయనా.. !' అంటుంది ఆ పిచ్చితల్లి.


'మెట్టినింటివాళ్ళు ఆమెకు అన్యాయం చేశారు. మా తండ్రిని చంపి ఆమె పసుపుకుంకుమలను తుడిచేశారు. ఇప్పుడు నేను ఉద్యోగ రీత్యా వచ్చింది అక్కడికే, వారు నా జోలికి రాకుంటే వారిని నేను కన్నెత్తి చూడను. నన్ను గెలికితే వాళ్ళ నోటికి గాలం వేయకమానను. ’ ఈ నిర్ణయానికి వచ్చిన వివేకానంద కళ్ళను గట్టిగా మూసుకొన్నాడు.

=================================================================================

ఇంకా ఉంది..

=================================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


23 views0 comments

Kommentare


bottom of page