top of page

ప్రగతి ప్రేమికులు 9


'Pragathi Premikulu episode 9' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma

'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:

బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్రారంభిస్తాడు అతడు.


శ్రీ వివేకానంద స్వామీజీ అసలు పేరు నరేంద్రుడు. శ్రీ రామకృష్ణ పరమహంసకు శిష్యుడుగా మారారు. 1893 వ సంవత్సరం చికాగో నగరంలో సర్వమత మహాసభలో పాల్గొన్నారు. అమెరికన్లను బాగా ప్రభావితం చేశారు. 1902వ సం: జూలై 4వ తేదీ రాత్రి 9 గంటలకు శ్రీ వివేకానందస్వామీజీ మహా సమాధి పొందారు.

స్వామిజీ కథను చదవడం పూర్తి చేసాడు యస్. ఐ. వివేకానంద. తమ్ముడు విజయానంద ని కలుస్తాడు. రాజకీయ నాయకుడు ధనుంజయరావు, ఎస్సై వివేకకానందను తన అదుపాజ్ఞలలో పెట్టుకోవాలనుకుంటాడు. తాను ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం తల్లికి ఇష్టం లేదని గ్రహిస్తాడు వివేకానంద.తన మేనమామ ఆదిశేషయ్యను కారణాలు చెప్పమంటాడు.

వివేకానంద తండ్రి మృతి సహజం కాదనీ, అందులో వివేకానంద పినతండ్రి ధనుంజయ రావు ప్రమేయం ఉందని చెబుతాడు ఆదిశేషయ్య. కలెక్టర్ గారు మీటింగ్ లో వివేకానందాను, అమృతను అభినందిస్తారు.

ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 9 చదవండి.


“ఓ అన్నా నమస్తే... నమస్తే...”


ధనుంజయరావు వరండాలోకి వచ్చాడు. సారా సాంబయ్య ఎదురైనాడు.


"ఏందిరా..!... సాంబా..! ఇంత పొద్దుకాడ వచ్చినావ్..?”


“పొద్దెక్కితే మీరెటుపోతరో, దొరకరు గదన్నా..!"


"ఏంటి విషయం..?”


“ఆ కొత్తగా వచ్చిన యస్.ఐ. నా సారాయం గళ్ళి లేపేసి నాడన్నా!...”


“విన్నాను.”


“ఏదైనా చెయ్యండన్నా..! ఊరి చివరికి తోసేసినాడు.”

విచారంగా అన్నాడు సాంబయ్య.


ధనుంజయరావు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొన్నాడు.


"ఏం అన్నా మాట్టాడవు..?”


"కొంతకాలం ఆగరా చూద్దాం. ఏదో ఒకటి చేద్దాం.” సాలోచనగా చెప్పాడు ధనుంజయరావు.


“సరే అన్నా..! మీరు చూద్దాం అన్నారుగా నాకదే చాలు. వెళ్ళొస్తా అన్నా..!” చేతులు జోడించాడు సాంబయ్య.


“పోయిరా!...”


సాంబయ్య వెళ్ళిపోయాడు. టీపాయ్ పైనున్న పేపర్లమీద ధనుంజయరావుగారి దృష్టి పడింది. స్థానిక పేపర్ ను చేతికి తీసుకొన్నాడు. అందులో అమృత ఫోటో, వివేకానంద, జిల్లా కలెక్టర్, జడ్.పి. ఛైర్మన్ గార్ల ఫోటోలు వున్నాయి. జరిగిన సమావేశాన్ని గురించి, వారి వారి ప్రసంగాలను గురించి వ్రాసి వుంది. అంతా చదివి పేపర్ ను చేతపట్టుకొని ఇంట్లోకి నడిచాడు.


“ఏయ్ రాజా..!” భార్యను పిలిచాడు.


రాజేశ్వరి హాల్లోకి వచ్చింది. ధనుంజయరావు సోఫాలో కూర్చున్నాడు. ఆయనకు దగ్గరగా వచ్చిన రాజేశ్వరి నిలబడింది.


“నీ కోడలి ఫోటో పేపర్లో పడింది చూడు.”


రాజేశ్వరి పేపరును అందుకొని అన్ని ఫోటోలను చూచి కోడలి గురించి వ్రాసిన దాన్ని చదివి..

“ఎప్పుడూ లేంది, ఈ రోజు ఈ పేపర్ను నాకు ఎందుకు

చూపించారు..?”


“మన కోడలు పిల్లని గురించి గొప్పగా రాసినారు కదే..!”


“వ్రాస్తే.. నేనేం చేయాలి..?” విసుగ్గా అడిగింది రాజేశ్వరి.


“ఏం చేయాలో నీకు తెలవదా..!”


“తెలవదు.” వెటకారంగా అంది రాజేశ్వరి.


“నీది మట్టిబుర్రే..! అన్నీ నేనే చెప్పాల" వికటాట్టహాసం చేశాడు ధనుంజయరావు.


“ఆ... ఆ మాట నిజమే. ఏం చేయాలో చెప్పండి.”


"ఒడ్ల గింజలో బియ్యపు గింజ. ఈ మాత్రం కూడా ఆలోచించవా నీవు..? మరేం లేదే..! నీవు వెళ్ళి అమృతను మన పెద్దోడికి యిమ్మని అడుగు. మీ అన్న సరే అంటే తొందర్లో పెద్దోడి పెళ్ళి చేసేద్దాం.” అనునయంగా చెప్పాడు ధనుంజయరావు.


రాజేశ్వరి ఆలోచనలో మునిగింది. కొద్ది సెకండ్ల తర్వాత..

“అలాగే..! ఈ రోజు మంచిరోజు. భోం చేసి వెళ్ళి, అడిగివస్తా” అంది రాజేశ్వరి.


పార్టీ వ్యక్తులు రావడంతో ధనుంజయరావు వరండాలోకి వెళ్ళాడు. పెద్దవాడికి, చిన్నవాడికి వ్యక్తిత్వంలో భూమికి, ఆకాశానికి వున్నంత తేడా..! పెద్దవాడు తనలాగే సహనం, శాంతం, ధర్మాధర్మ విచక్షణ, పెద్దలంటే గౌరవం కలవాడు. తండ్రిగారి రాజకీయ చాణుక్యత, కోపం, ఆవేశం, గిట్టక చదువు నెపంతో ఆయనకు దూరంగా అమెరికా వెళ్ళిపోయాడు. వాడు తలుచుకొంటే అక్కడే వుండిపోవచ్చు. కానీ తనంటే వాడికి ప్రాణం. ఎంతో ప్రేమాభిమానం. ఆ కారణంగా తిరిగి వచ్చాడు.


చిన్నవాడికి అంతా తండ్రి బుద్ధులు. తల్లిగా బిడ్డల క్షేమం కోసం తను ఎన్ని మంచిమాటలు చెప్పినా మూగవాడిలా విని, తర్వాత ఆ తండ్రి పలుకులనే చిలక పలికినట్లు పలుకుతాడు. పెద్ద రాజకీయ నాయకుణ్ణి కావాలని వాడి ఆశ. అందుకే తండ్రి మాటంటే వాడికి వేదవాక్యం. వాడి తల వ్రాత ఎలా వుందో సర్వేశ్వరుడికే తెలియాలి.


కానీ... పెద్దవాడికి తన మాట అంటే గౌరవం. తనకు నచ్చిన రీతిగా వర్తించి, తన ముఖంలో ఎప్పుడూ ఆనందాన్ని చూడాలని ఆశిస్తాడు. అలాంటివాడికి అమృత తగిన పిల్ల. వారిరువురికీ వివాహం జరిగితే, వారి భావి జీవితాలు ఎంతో బాగుంటాయి.


చిన్నవాడి విషయంలో అంతావాళ్ళ నాన్నగారి ఇష్టప్రకారమే

జరుగుతుంది. తన అన్నయ్య వెంకటేశ్వర్లుతో మాట్లాడి, అతన్ని ఒప్పించి, త్రివిక్రంకు అమృతకు వివాహం జరిపించాలని నిర్ణయించుకొంది రాజేశ్వరి.


ఒకేవూరు అయింనందున భర్తతో చెప్పినట్లుగా రాజేశ్వరి తన అన్నగారైన వెంకటేశ్వర్లుగారి యింటికి సాయంత్రం ఆరుగంటలకు వెళ్ళింది. రాజేశ్వరి వదిన శాంతి, మరదలిని సగౌరవంగా ఆహ్వానించింది. పెద్దవాడు త్రివిక్రం స్టేటు నుండి తిరిగివచ్చిన విషయాన్ని, తను ప్రస్తుతంలో మాట్లాడాలని వచ్చిన విషయాన్ని శాంతికి తెలియజేసింది రాజేశ్వరి. “నీ వుద్దేశ్యమేమిటి వదినా..!” అడిగింది.


"రాజా..! ఇది మన కాలం కాదు. ఇప్పటి మొగ ఆడపిల్లలకు స్వతంత్ర భావాలు చాలా ఎక్కువ. ఆ తండ్రి కూతుళ్లు సరే అంటే నేను సరే అంటా. మన త్రివిక్రం గురించి నాకు తెలియదా..!” నవ్వుతూ తన పాత్రను గురించి వివరించింది శాంతి.


వెంకటేశ్వర్లు కాలేజ్ నుంచి వచ్చారు. సోదరిని ఆప్యాయంగా పలకరించారు. వారు డ్రస్ మార్చుకొని హాల్లోకి వచ్చి కూర్చున్న తర్వాత, రాజేశ్వరి తను వచ్చిన పనిని గురించి వివరించింది. మౌనంగా అంతా విన్నాడు వెంకటేశ్వర్లు.

అమృత వచ్చింది. అత్తగారిని ఆదరంగా పలకరించి తన గదికి వెళ్ళిపోయింది.


అరగంట తర్వాత శాంతి రాజేశ్వరి కోరికపై అమృతను క్రిందికి పిలిచింది. వెంకటేశ్వర్లు రాజేశ్వరి వచ్చిన కారణాన్ని అమృతకు వివరించాడు. సాంతం విన్న అమృత…


“నాన్నా.. అత్తయ్యా.. అమ్మా.. నేను ఐ.ఎ.యస్ కు ప్రిపేరవుతున్నాను. అది పూర్తి అయ్యి నేను కలెక్టర్ అయిన తర్వాతనే నా వివాహం. కాబట్టి.. ప్రస్తుతంలో

మీరెవరూ నా వివాహాన్ని గురించి ఆలోచించకండి. నేను చేసికోదలచినప్పుడు నేనే మీతో చెబుతాను.” తన నిర్ణయాన్ని విపులంగా చెప్పి మేడపైనున్న తన గదికి

వెళ్ళిపోయింది అమృత.


రాజేశ్వరమ్మగారి ఆశ నిరాశ అయింది. మనస్సు వికలమైంది.


“అన్నయ్యా..! ఆ పిల్ల అలా మాట్లాడుతుంటే నీవు ఒక్కమాట కూడా మాట్లాడలేదేం..?" ప్రశ్నించింది రాజేశ్వరి.


'ఆ ఇంట్లో నీవు ఎంతగా సుఖపడుతున్నావో మా ముగ్గురు అన్నదమ్ములకూ తెలుసు. నీ భర్తకు వున్న ఘనకీర్తి వూరిలో వున్న వారందరికీ తెలుసు. ముప్పై సంవత్సరాల క్రిందట నీ భర్తకు, నీకు వ్రాసి పెట్టి వున్నందున మీ వివాహం జరిగింది.


ముప్ఫైసంవత్సరాల్లో బావగారి వ్యక్తిత్వంలో ఎంతో మార్పు. ప్రస్తుతపు వారి తత్వం మా అన్నదమ్ములకు నచ్చదు. ఈ పరిస్థితుల్లో నీ కొడుకు డాక్టర్ అయినప్పటికీ... ఆ ఇంట నా బిడ్డను ఇవ్వాలనే సంకల్పం నాకు లేదు. తండ్రి బుద్ధులు కొడుకులకు రాకమానతాయా..! కొద్దికాలంలో నీ కొడుకు మనస్తత్వం ఏ రీతిగా మారుతుందో ఎవరికి తెలుసు..!'


మనస్సున అనుకొని పైకి... “అమ్మా!.. రాజేశ్వరీ... అమృత చదివి కలెక్టర్ అయ్యాకనే పెండ్లి అని అంత ఖచ్చితంగా తన

నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాత, వయస్సు వచ్చి మంచీ, చెడ్డా, విచక్షణా జ్ఞానం వున్న ఆ పిల్లతో నేను మాత్రం ఏం మాట్లాడగలను. నీవే చెప్పు.” అనునయంగా తన నిర్ణయాన్ని సోదరికి తెలియజేశాడు వెంకటేశ్వర్లు.


రాజేశ్వరికి అవమానం జరిగింది. రోషంతో “సరే నే వెళుతున్నా” అని చెప్పి వేగంగా ఇంట్లో నుంచి బయటికి నడిచింది.


వెంకటేశ్వర్లు ముగ్గురు అన్నదమ్ములు. అందరి కంటే చిన్నవారు వీరే. పెద్దన్న అనంతయ్య లాయర్, రెండవ అన్న ముకుందయ్య డాక్టర్, సొంత క్లినిక్ హాస్పటిల్ నడుపుతున్నాడు. మంచి హస్తవాచి వున్న డాక్టర్ అనే పేరున్న వాడు. అనంతయ్యగారికి వారి వృత్తిలో మంచి పేరు ఉంది. న్యాయబద్ధమైన కేసులను తప్ప అన్యాయ బద్ధమైన వాటిని టేకప్ చేయరు. వారు కేసును ఆమోదించారంటే ఆ వ్యక్తులు కేసును గెలిచినట్లే.


ఇంటికి చేరిన రాజేశ్వరి, అమృత చెప్పిన మాటలను భర్తగారికి తెలియజేసింది. అంతా విన్న ధనుంజయరావు “ఓస్ రాజా..! ఈ యింటికి కోడలు కావాలంటే అదృష్టం వుండాలే…! ఆ సంబంధాన్ని తలదన్నే సంబంధాన్ని నేను చూస్తా బాధపడకు.” అని తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఈ సంభాషణ అంతా త్రివిక్రం విన్నాడు.


రెండవ మామయ్య ముకుందయ్యను కలసికొని “మీతో కలసి పనిచేస్తాను మామయ్యా.” తన నిర్ణయాన్ని తెలియజేశాడు.


చిన్నతనం నుంచీ త్రివిక్రంను గురించి ఎరిగిన ముకుందయ్య “సరే” అన్నాడు. మామగారి హాస్పటిల్ కు వెళ్ళడం ప్రారంభించాడు త్రివిక్రం.


“ఓ వారంరోజుల లోపల షట్టరింగ్, రీఇంఫోర్సుమెంట్ టయ్యింగ్, వర్కులు పూర్తికావాలి. మిస్టర్ దీనదయాళ్ గారు.. ఎనిమిదవ తేదీ లోపల కాంక్రీట్ వేసి తీరాలి. మిగతా అన్ని పనులూ రెండు నెలల్లో ముగించి మార్చిలో బిల్డింగ్

స్కూలు యాజమాన్యానికి హ్యాండ్ ఓవర్ చేయాలి. జాగ్రత్తగా ప్లాన్ చేసి పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయండి." చెప్పాడు.. ఏ.ఇ.విజయ్.


“అలాగే సార్...” ఆవరణంలో ప్రవేశించిన బి.డి.ఓ గారి జీప్ ను చూచి… "సార్ బి.డి.ఓ అమ్మగారు వస్తున్నారు.” అన్నాడు దీనదయాళ్.


అమృత జీప్ దిగింది. విజయ్, దీనదయాళ్ ఆమెకు ఎదురేగి విష్ చేశారు.


“గుడ్ మార్నింగ్ సార్..!" అంది అమృత. బిల్డింగ్ నాలుగువైపులా చూచి…


సార్... రూప్ స్లాబ్ ఎప్పుడు వేయిస్తారు?...” అడిగింది.


"ఎనిమిదవ తేదీన మేడమ్!...”


“అంటే... పదిరోజుల తర్వాత అన్నమాట!...”


"అవును మేడమ్!...


"మీకు వర్క్ లోడ్ అధికమా!...”


"లేదు.”


“అయితే దగ్గరవుండి 5వ తేదీ స్లాబ్ వేసేలా చూడండి.”

నవ్వుతూ అంది అమృత.


“ప్రయత్నిస్తాను.”


“దీనదయాళ్ గారూ..! వీరు పని చేయవలసిన విధానాన్ని చెప్పి, పని సవ్యంగా సాగేలా చేయగలరు. మీరు పని చేసేదానికి అవసరమైన లేబర్ ను, కావలసిన సామాగ్రిని, సకాలంలో సమకూర్చి పనిని త్వరగా క్వాలిటీతో ముగించవలసి వుంటుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. 5వ తేదీ పది గంటలకు నేను మరలా వస్తాను. నేను వచ్చేటప్పటికి మీరు స్లాబ్ కాంక్రీటు పనిని ప్రారంభించి వుండాలి. సరేనా..!"


“అలాగే మేడమ్.” అన్నాడు దీనదయాళ్.


"మీ బిల్సు ఏమైనా పెండింగ్ వున్నాయా..?"


“లేవు మేడమ్...”


"ఎ.ఇ సార్.... వీరు స్లాబ్ కంప్లీట్ చేస్తే వీరి బిల్లు ఎంత..?"


“మూడు లక్షలు మేడం.”


“మిస్టర్ దీనదయాళ్ మీరు 5వ తేదీన స్లాబ్ కంప్లీట్ చేస్తే, 8వ తేదీన మీకు పేమెంటు జరిగేలా నేను చేయగలను. కాబట్టి...”


“5వ తేదీన స్లాబ్ వేస్తాను మేడం." నవ్వుతూ చెప్పాడు దీనదయాళ్.


"గుడ్ దటీజ్ ద స్పిరిట్." ఆనందంగా నవ్వింది అమృత.


బిల్డింగ్ చుట్టూ తిరిగి చూచింది. సామానులనన్నింటినీ క్రమంగా అమర్చి వున్నారు. ఆమె వెనకాల విజయ్, దీనదయాళ్ నడిచారు.


షట్టరింగ్ వర్క్ జరుగుతూ వుంది. ఆ మేస్త్రి… దీనదయాళ్ ను పిలిచాడు.


ఐదు నిమిషాల్లో వస్తానని చెప్పి, దీనదయాళ్ బిల్డింగ్ లోనికి వెళ్ళాడు.


"ఏ.ఇ. గారూ..!" విజయ్ ను చూస్తూ అంది అమృత.


"యస్ మేడమ్…!”


"ఇతని క్వాలిటీ ఆప్ వర్క్ ఎలా వుంది..?


"బాగుంది. అతనికి ఇది నా రెండవ వర్క్ మేడమ్.”


"అంటే హి యీజ్ గుడ్ కాంట్రాక్టర్..!" ప్రశ్నార్థకంగా విజయ్ ముఖంలోకి చూచింది అమృత.


“యస్ మేడం.” తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేశాడు విజయ్.


“మీదే వూరండి.”


“రాజమండ్రి.”


"అక్కడి నుంచి వివేకానంద అనే యస్.ఐ.గారు యీ పూరికి వచ్చారు. వారు మీకు తెలుసా..!”


విజయ్ వెంటనే జవాబు చెప్పలేక పోయాడు. నిర్ణయాన్ని తీసుకొనే దానికి వెనక్కు తిరిగి చూచాడు.

“ఎవరూ పిలువలేదే..!” అంది అమృత.


“తెలుసు మేడం.”


“బంధువా..!"


'చిర్రెక్కించే ప్రశ్నలడుగుతూ వుంది. అన్న ఏమో మనం అన్నదమ్ములమని ఎవరికీ తెలియకూడదని చెప్పాడు. ' స్వగతంలో అనుకొన్నాడు విజయ్.


“ఒకటి రెండుసార్లు రాజమండ్రిలో వారిని కలిశాను. వారు టెన్నిస్ ఆడతారు. నేనూ ఆడతాను. ఆ కోర్టులో కలిశాను.”


"వారు ఇక్కడికి వచ్చిన తర్వాత కలిశారా..? నిన్నటి లోకల్ పేపర్ ను చూచారా..?”


"ఒకసారి కలిశాను. నిన్నటి లోకల్ పేపర్ ను చూడలేదు మేడం. అబద్దం చెప్పడం నాకు లేదు. సారీ..! మేడం." అనునయంగా చెప్పాడు విజయ్.


“డోన్ట్ వర్రీ.. నో ప్రాబ్లం.” రెండు క్షణాలు ఆగి...

“మీరు చాలా భయస్తులనుకొంటాను.” అని నవ్వింది అమృత.


ఆశ్చర్యంతో అమృత ముఖంలోకి చూచాడు విజయ్.


"మీ పేరు విజయ్ కదూ..!”


“యస్ మేడం.”


“నా వయస్సు ఎంత అనుకొంటున్నారు..?”


అమృత ఈ ప్రశ్న విజయ్ ను మరోసారి ఆశ్చర్యంలో ముంచేసింది.


'ఈ రోజు ఈమె ధోరణి మాటలు అదోలా వున్నాయి. మనిషి మంచి కుషీలో వున్నట్టుంది. నన్ను చిత్రమైన ప్రశ్నలడిగి వేధిస్తూ వుంది. ఈమె వయస్సుతో నాకేం పని..?


“మీ వయస్సు ఎంత..?” ఇది ఆమెనుండి వచ్చిన మరో ప్రశ్న.


'ఆఁ మరో ప్రశ్న... తొలి ప్రశ్నకే జవాపు ఏమిచెప్పాలో తోచక నేను అల్లాడుతుంటే.. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం' అన్నట్లు మరో ప్రశ్న.' అనుకొన్నాడు విజయ్.


“ట్వన్టీ సిక్సు.” టకామని జవాబు చెప్పాడు విజయ్.


“మీదా నాదా..?"


“నాది మేడం.”


“మరి నాది..?”


“గెస్ చేయమంటారా..!”


“చేయండి.”


“దాదాపు నా వయస్సేనేమో మేడం.”


“ఇప్పటికి నేను వచ్చినప్పటినుంచీ నన్ను మీరు ఎన్నిసార్లు మేడం అన్నారో చెప్పగలరా..!” చిరునగవుతో విజయ్ ముఖంలోకి చూచింది అమృత.


విజయ్ తెల్లబోయాడు. దృష్టిని ప్రక్కకు త్రిప్పి "మీ ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్పలేను మేడం.”


“ఇప్పుడన్న మేడంతో కలిపి మొత్తం పన్నెండు సార్లు అన్నారు విజయ్ గారూ..!” అందంగా నవ్వుతూ అంది అమృత.


నవ్వు రాకపోయినా తనూ నవ్వును ప్రదర్శించాడు విజయ్.

త్రివిక్రం కారు ఆ ఆవరణంలోకి ప్రవేశించింది. కారు దిగి అమృతను సమీపించాడు త్రివిక్రం.


“గుడ్ మార్నింగ్ అమృత..!"


“ఓ... బావా..! గుడ్మార్నింగ్. బైదబై వీరు విజయ్ గారు. ఆర్ అండ్ బి ఏ.ఇ గారు. మా ప్రాజక్టు వర్క్ కు వీరి డిపార్టుమెంటు పి.యం.సి” అంది అమృత.


"గుడ్మార్నింగ్ సార్.” విష్ చేశాడు విజయ్.


"యస్ సార్... గుడ్ మార్నింగ్." కరచాలనం చేశాడు త్రివిక్రం నవ్వుతూ.


"విజయ్ గారు..! మా బావ డాక్టర్. మా పెద్దనాన్న ముకుందయ్యగారు. వీరు వారితో కలసి వారి హాస్పటల్లో పని చేస్తుంటారు. స్టేట్స్ నుంచి యం.యస్ ముగించి నెలరోజుల క్రిందట తిరిగి వచ్చారు.” త్రివిక్రం వైపు చూచి... “తమరు ఇక్కడికి...” నవ్వింది అమృత.


“రాకూడదా..! నీవు ఇప్పుడు చాలా బిజీ పర్సన్ కదా.. నిన్ను చూడాలనే వచ్చాను. వచ్చి నెలరోజులైనా నీకు నన్ను చూడాలనిపించలేదు. నిన్నటి పేపర్లో చూచాను. నీవు ఏ స్థాయికి ఎదిగావన్నది. నాకు చాలా సంతోషం అమృత.” చిరునవ్వుతో చెప్పాడు త్రివిక్రం.


"థ్యాంక్యూ బావా..!”


“ఓ ఏజ్ పేషేంట్ ను చూచేదానికి వెళుతున్నాను. తర్వాత కలుద్దాం బై.” చెప్పి త్రివిక్రం తన కారు వైపుకుపోయి కూర్చొని వెళ్ళిపోయాడు.


“మీ బావగారు చాలా మంచివారులా వున్నారు మేడం.”


త్రివిక్రం పట్ల తనకు కలిగిన అభిప్రాయన్ని మెల్లగా చెప్పాడు విజయ్.


“మరి నేను..?” ఆశ్చర్యంగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది అమృత.


“మీరు చాలా... చాలా... మంచివారు మేడం.”


“నా గురించి మీకేం తెలుసు..?"


"మూడు నెలల నుంచీ మిమ్మల్ని చూస్తున్నాను కదా..! అందుకని" విజయ్ పూర్తి చేయకముందే…

"అందుకని..!” బెదిరించినట్లు అడిగింది అమృత.


“తప్పుగా మాట్లాడానా..! ఈమెకు కోపం వచ్చినట్లుంది. ఈమె దగ్గర నుండి వెళ్ళిపోవాలి. ఆలస్యంచేసి అనవసర ప్రసంగం చేయకూడదు” అనుకొన్నాడు విజయ్.


“విజయ్ గారూ..!”


“యస్ మేడం..!" ప్రశ్నార్థకంగా చూచాడు అమృత ముఖంలోకి విజయ్.


“సిక్స్త్ నా బర్త్ డే. మీరు మా ఇంటికి రావాలి.”


"ఓకే మేడం.”


“ఇన్ ఫ్యూచర్ కాల్మి బై నేమ్... అమృత” అందంగా నవ్వింది. విజయ్ ఆశ్చర్యపోయాడు.


బై.. చెప్పి అమృత జీప్ లో కూర్చుంది. ఆమె జీప్ కదిలింది.

"హమ్మయ్య..! తుఫాను తీరం దాటింది.” నిట్టూర్చి అనుకొన్నాడు విజయ్.

***

"అప్పటికి నా వయస్సు మూడు సంవత్సరాలు సార్...” తన మామయ్య ఆదిశేషయ్యగారు చెప్పిన అన్ని విషయాలను, ఆ వూరికి ట్రాన్స్పర్ అన్న మాటను విన్న తర్వాత తన తల్లి ఆవేదనను గురించి వివేకానంద వివరంగా త్రిపాటికి తెలియజేశాడు.


అంతా విన్న త్రిపాటి... ఎంతగానో విచారపడ్డారు. వివేకానందను ఊరడించారు.


“వివేక్.. నీ ధర్మాన్ని నీవు చెయ్యి. నీ వెనుక నీకు అండగా నేను వున్నాను.” కసిగా చెప్పాడు త్రిపాటి.


“యస్ సార్..! థ్యాంక్యూ.." సెల్యూట్ చేసి వివేకానంద తన స్టేషన్ కు బయలుదేరాడు.


మార్గంలో పి.పి. గారిని కలిసి ఉపేంద్ర అరస్ట్ వారంట్ తీసికొని స్టేషన్ కు చేరాడు.


ఆ కేసుకు సంబంధించిన అన్ని కాగితాలను నిశితంగా పరిశీలించి ఫైల్లో క్రమంగా అమర్చాడు. ఇన్స్పెక్టర్ ఏకాంబరం, అతని క్రింది పోలీసులు, ఆ అరుగురిని పట్టుకొని, వారి చేత నిజాన్ని కక్కించి, వారి వాగ్ మూలాలను వ్రాసి, వారిచేత సంతకాలను వేలిముద్రలను వేయించి వివేకానందకు అందచేశారు.

=================================================================================

ఇంకా ఉంది..

=================================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


27 views0 comments

Comments


bottom of page