'Pragathi Premikulu episode 13' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma
'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక చివరి భాగం
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు యస్. ఐ. వివేకానంద పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం పూర్తి చేసాడు అతడు. రాజకీయ నాయకుడు ధనుంజయరావు, ఎస్సై వివేకానందను తన అదుపాజ్ఞలలో పెట్టుకోవా లనుకుంటాడు.
వివేకానంద తండ్రి మృతి సహజం కాదనీ, అందులో వివేకానంద పినతండ్రి ధనుంజయ రావు ప్రమేయం ఉందని చెబుతాడు మేనమామ ఆదిశేషయ్య.
తన బర్త్ డే కి విజయ్ ని ఇన్వైట్ చేస్తుంది అమృత.
ధనుంజయరావు. కొడుకు ఉపేంద్రను హత్యానేరంపై అరెస్ట్ చేస్తాడు వివేకానంద. ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షను విదిస్తుంది కోర్ట్.
హాస్పిటల్ కోసం కడుతున్న బిల్డింగ్ కూలిపోవడంతో 'ఏఈ' గా పనిచేస్తున్న తన తమ్ముడు విజయానందను, కాంట్రాక్టర్ ధర్మలింగాన్ని అరెస్ట్ చేస్తాడు వివేకానంద.
అసలు నేరస్థులు పట్టుబడటంతో వారు నిర్దోషులుగా విడుదలవుతారు.
కొత్తగా చేరిన ఝాన్సీ అనే లేడీ ఇన్స్పెక్టర్ వివేకానందకు సన్నిహితురాలని విజయ్ తో చెబుతుంది అమృత.
ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 13 చదవండి..
ఆ సాయంత్రం ఏడుగంటలకు వివేకానంద ఆహ్వానం మీద అతని క్వార్టరుకు అమృత పెద్దతండ్రులు ఇరువురూ, వారి సతీమణులు, వెంకటేశ్వర్లు వారి సతీమణి, త్రివిక్రం ఏడున్నరకు వచ్చారు.
ఝాన్సీ ఆమె తల్లి అలివేలు వారికంటే ముందుగా ఆరుగంటల కల్లా వివేక క్వార్టర్ కు వచ్చారు. వారు వచ్చిన అరగంటలో అమృత విజయ్ లు కలసి వచ్చారు.
అందరినీ వివేక్, ఝాన్సీలు స్వాగతం పలికారు. వివేక్ అందరికీ ఝాన్సీని, ఆమె తల్లిగారినీ పరిచయం చేశాడు. ఝాన్సీ తనకు కాబోయే అర్ధాంగి అని అందరికీ చెప్పాడు.
అందరికీ ఆశ్చర్యం కలిగే రీతిలో అమృత.. విజయ్ తనూ ప్రేమించుకొన్నామని మాకు పెద్దలు వివాహం జరిపించాలని నిర్భయంగా తెలియజేసింది.
వెంకటేశ్వర్లుగారు నవ్వుతూ వారి కుటుంబానికి వివేకానంద కుటుంబానికి ఉన్న బాంధవ్యాన్ని వివరించాడు. తను త్వరలో వెళ్ళి, వరసకు అక్క అయిన భువనేశ్వరిని కలవబోతున్నానని, విజయ్ కు అమృతను చేసుకోవలసిందిగా కోరబోతున్నానని తెలియజేశాడు.
తనకు, వివేకానంద కుటుంబానికీ ఉన్న బాంధవ్యాన్ని తెలిసుకొని త్రివిక్రం ఎంతగానో సంతోషించాడు. అందరూ పరస్పర ఛలోక్తులతో విందు భోజనాన్ని ఆరగించారు. అనంతరం సగౌరవంగా అందరికీ వీడ్కోలు పలికారు వివేక్, విజయ్ లు.
***
అమృత తండ్రి వెంకటేశ్వర్లు వాకిట్లో నిలబడి, ఇన్స్పెక్టర్ ఝాన్సీ రాకకు ఎదురు చూస్తున్నారు. ఝాన్సీ జీప్ వచ్చింది. ఆమె దిగింది.
“ఝాన్సీ అక్కా.. !" పిలిచింది అమృత.
ముందుకు పోబోయిన ఝాన్సీ, అమృత పిలుపును విని వెనక్కు తిరిగి చూచింది.
అమృత ఝాన్సీని నవ్వుతూ సమీపించింది.
"నాన్నగారు మీతో మాట్లాడాలట. ” అంది.
“అలాగా పదండి.”
ఇరువురూ వెంకటేశ్వర్లును సమీపించారు.
“నాన్నగారు వెంకటేశ్వర్లు. కాలేజీ ప్రిన్సిపాల్. ” ఝాన్సీకి తండ్రిని పరిచయం చేసింది అమృత.
“నమస్కారం అండీ. ” చేతులు జోడించింది ఝాన్సీ.
"మీతో ఓ విషయం చెప్పాలి. ”
“చెప్పండి.”
"అక్కా.. ! రండి హాల్లో కూర్చొని మాట్లాడుకొందాం.” నవ్వుతూ చెప్పింది.
“సరే పదండి. ” అంది ఝాన్సీ,
ముగ్గురూ హాల్లోకి ప్రవేశించారు.
"అక్కా.. ! మీకు మంచి కాఫీ తెస్తాను. నాన్నతో మాట్లాడుతూ వుండండి. ”
ఝాన్సీ నవ్వి తల ఆడించింది. అమృతలోనికి వెళ్ళిపోయింది.
"కూర్చోండి. " అన్నాడు వెంకటేశ్వర్లు.
ఝాన్సీ కూర్చుంది. "విషయం ఏమిటో చెప్పండి. " అడిగింది.
"మా కాలేజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కొందరు గంజాయికి అలవాటు పడ్డారని తెలిసింది. కాలేజీ ముందు. నిమ్మకాయ షోడా అమ్మే పండుగాడు వారికి సప్లయ్ చేస్తున్నట్లు మా అటెండర్ చెప్పాడు. దాన్ని ఉపయోగించే వారంతా కలవారి పిల్లలే. వారిపై ఎలాంటి చర్య తీసుకోలేక పోతున్నాను. ” విచారంగా చెప్పాడు వెంకటేశ్వర్లు.
"యస్. ఐ. వివేకానంద వారి సొంత ఊరికి వెళ్ళి ఉన్నారు. వారితో నేను ఫోన్లో మాట్లాడుతాను. రేపు ఉదయం వచ్చి ఆ పండుగాణ్ణి పట్టుకొని స్టేషన్ కు లాక్కెళ్ళి వాడిచేత నిజాన్ని కక్కిస్తాను. అసలు మూలవిరాట్ ఎవరో వాణ్ణిపట్టుకొంటాను. మీరు విచారించకండి. ” అంది ఝాన్సీ సాలోచనగా.
అమృత కాఫీ గ్లాసుతో వచ్చింది. ఝాన్సీకి అందించింది. ఝాన్సీ కాఫీ త్రాగింది.
"మీ పిల్లలకు అది ఇకపై అందకుండా చేసే పూచీ నాది. మీరు విచారపడకండి. ” నవ్వుతూ చెప్పింది ఝాన్సీ.
"అక్కా.. ! వివేకానందగారు ఎప్పుడు వస్తారు.. ?”
"డే ఆఫ్టర్ టుమారో. ” నవ్వుతూ చెప్పింది ఝాన్సీ. “ఇక నేను వెళ్ళొస్తాను. ” సోఫానుంచి లేచింది.
“మంచిదమ్మా. ” అన్నాడు వెంకటేశ్వర్లు.
ముగ్గురూ వరండాలోకి వచ్చారు. ఆ ఇరువురికి మరోసారి చెప్పి ఝాన్సీ ఎదురుగా ఉన్న తన ఇంటి వైపుకు నడిచింది.
“చాలా మంచి అమ్మాయి అమృతా.. !" అన్నాడు వెంకటేశ్వర్లు.
“మరి నేను.. !" కొంటెగా నవ్వుతూ అడిగింది అమృత.
“మా అమ్మవు. నా ప్రాణానివి. ” ఆనందంగా ఆమె భుజంపై చెయ్యి వేశాడు వెంకటేశ్వర్లు.
ఇరువురూ ఇంట్లోకి వెళ్ళిపోయారు.
మరుదినం ఉదయం పదిన్నరకు ఝాన్సీ జీప్ కాలేజీ ముందు ఆగింది.
ఇరువురు పోలీసులు, ఝాన్సీ జీపునుంచి దిగారు. వేపచెట్టు క్రింద, సోడాల బండి దగ్గరవున్న పండుగాడు వారిని చూచాడు. వాడి చూపుల్లో భయం.. ! వారిని చూడనట్లు కాలేజీ గేటువైపుకు తలను త్రిప్పాడు.
'తనకు తెలిసి కాలేజీలో ఏ గొడవా జరగలేదు. ఈ పోలీసులు ఇక్కడికి ఎందుకొచ్చినట్లు.. ?' అనుకొన్నాడు పండుగాడు.
పోలీసులు, ఝాన్సీ అతని సోడా బండిని సమీపించారు.
“నీ పేరు.. ?"
"పండుగాడండే సార్.. !, సోడా తాగుతారా.. ?” వినయంగా అడిగాడు.
“ఇక్కడ ఎంత కాలంగా సోడాలు అమ్ముతున్నావ్.. ?"
"తొమ్మిది నెలలుగా సార్. ”
“రోజుకు ఏమాత్రం వరుమానం.. ?”
"మూడొందలకి పది అటు యిటూ సార్. ”
“ఈ యాపారమేనా.. ! ఇంకా వేరే ఏదైనా యాపారం చేస్తుండావా.. !”
“నేను ఇంకేం యాపారం చేస్తాన్ సార్. నాకు తెలిసింది ఇదే. ” వినయంగా చెప్పాడు పండుగాడు.
మార్చిమార్చి ఇరువురు పోలీసులు అడిగే ప్రశ్నలకు భయంతో పండుగాడి ఒంటికి చెమట పట్టింది.
ఒక పోలీస్ బండి వున్న అరలో చెయ్యి పెట్టి కొన్ని పొట్లాలు ఉన్న ఒక ప్లాస్టిక్ కవరును బయటికి లాగాడు.
“యిదేంది.. ?"
పండుగాడు వణికిపోయాడు. వాడి కళ్ళల్లో నీళ్ళు.
“పద స్టేషన్ కు. ” గద్దించాడు పోలీస్.
“వాణ్ణి లాక్కొని రండి. ” సింహంలా గర్జించింది ఝాన్సీ.,
పోలీసులు పండుగాణ్ణి జీప్ లోకి తోశారు. ఝాన్సీ కూర్చుంది. జీప్ కదిలింది.
లాకప్ లో త్రోసి నాలుగు పీకులు పీకేటప్పటికి పండుగాడు దాన్ని తను పూరీలాల్ దగ్గరనుంచి తెచ్చి, కాలేజ్ పిల్లలకు అమ్ముతున్నట్లు నిజాన్ని కక్కాడు.
ఝాన్సీ పోలీస్ బలగంతో పూరీలాల్ వడ్డీ వ్యాపారి ఇంటికి వెళ్ళింది. ఇల్లంతా సోదా జరిగింది. ఆ ఇంట్లోని ఓ గదిలో మంచంక్రింద గోనె సంచిలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసికొన్నారు.
షాపులో ఉన్న పూరీలాల్ ను అరస్టు చేసి స్టేషన్ కు తీసికొని వచ్చి సెల్లో త్రోసింది ఝాన్సీ.
యస్. ఐ. వివేకానందకు, డి. ఐ. జి త్రిపాటిగారికి, వెంకటేశ్వర్లుగారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది.
వారు ఝాన్సీని అభినందించారు.
మూడు రోజుల తర్వాత పూరీలాల్ బెయిల్ మీద స్టేషన్ నుంచి బయటపడ్డాడు. వివేకానంద, త్రిపాటి దానికి అలవాటు పడ్డ పిల్లల తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించి, వారి పిల్లలను గురించి చర్చించారు. కోర్టు పూరీలాల్ కు సంవత్సరం కారాగార శిక్ష, లక్ష రూపాయలు జరిమానా విధించింది.
“ఛండీ.. ! నీవు ఏం చేస్తావో నాకు తెలియదు. ఎల్లుండి ఉదయానికల్లా, నేను ఆ వివేకానంద చావు వార్తను వినాలి. ” కసి, కోపం, ఆవేశంతో కూడిన ధనుంజయరావుగారి ఆజ్ఞ అది.
"అయ్యా మీరు ప్రశాంతంగా ఉండిపోండి. ఆ వార్తను తమరికి చేరేసే పూజీ నాది. ఇక నేవెళతాను. ” అని చెప్పి ఛండీ, ధనుంజయగారి సమక్షం నుండి వెళ్ళిపోయాడు.
అప్పటికి ఊటీకి వచ్చి ధనుంజయరావు ఎనిమిది మాసాలయింది. తన కొడుకును జైలు పాలుచేసిన వివేకానందను చంపి తీరాలన్నది అతని లక్ష్యం. అందుకే బీహార్ వాడైన రౌడీ ఛండీగాడిని పిలిపించి, వివేకానంద ఫోటోను చూపించి, అతన్ని లేపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఛండీ అడ్వాన్స్ తీసికొని, ధనుంజయరావు వద్ద శలవు తీసుకొని కార్లో బయలుదేరాడు తన ఇద్దరు అనుచరులతో.
విపరీతంగా త్రాగి డ్రైవ్ చేస్తున్న కారణంగా, ఆ రాత్రి పన్నెండు గంటల సమయంలో మలుపులో కంట్రోలు తప్పి రోడ్డు ప్రక్కన పల్లంలో కారు పడిపోయింది. ఆ ముగ్గురూ యమపురికి చేరారు.
త్వరలో తన ఆశయం తీరబోతున్నందుకు, ధనుంజయరావు పూర్తిగా మధువును సేవించి అద్దం ముందు నిలబడి తూలే శరీరంతో, కైపెక్కిన కళ్ళతో, వివేకానంద తన ముందున్నట్లు భ్రమతో భావించి అతన్ని తిట్టసాగాడు. సమయం రాత్రి ఒంటిగంట ప్రాంతం..
ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఆవరణంలో ప్రవేశించి, ధనుంజయ అనుచరుడి నోట్లో గుడ్డను కుక్కి, కాళ్ళు, చేతులు కట్టేసి వరండాలో ఓ మూల త్రోసేశారు.
ధనుంజయరావుగారి గదిలో ప్రవేశించి అతని నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళు చేతులు కట్టి, మోసుకొని వచ్చి, వారు వచ్చిన కారు డిక్కీలో పడేసి మూసి, కార్లో కూర్చొని బయలుదేరారు.
తనమీద వ్యతిరేక ప్రచారాన్ని చేసి, తన ప్రత్యర్థి గెలిచేటట్లు చేసిన కాలేజ్ బి. ఎ. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ బాలసుబ్రమణ్యాన్ని కొట్టించి, చంపి చెర్లో నీళ్ళల్లో శవానికి రాయిని కట్టి పడేయడం చేసిన వారికి, కొందరు ఇతరులకు తెలిసిన నిజం.
కానీ.. ! కేసు వాదోపవాదాలలో సాక్షుల మూలంగా అసలు నేరస్థులు బయట ఉండిపోయి. ఏ నేరం చేయని చలమయ్య, బాలసుబ్రమణ్యం మేనమామ, మరికొందరు జైలు పాలైనారు.
ప్రతి ఉదయాన్నే బిక్షాటన చేసే యాచకులు ఆ చెరువులో స్నానం చేసి, విభూతి, కుంకుమ నొసటన పూసుకొని బిక్షాటనకు బయలుదేరుతారు.
ఆ ఉదయం కోటిగాడు, వెంకటేసు చెరువుకు వచ్చి స్నానం చేసి వేషం వేసుకొన్నారు. దినకరుని తేజం చెరువు నీటిపై ప్రసరించింది. నీటిపై దూరంగా తేలుతున్న మానవాకారం వారికి గోచరించింది.
భయంతో పరుగున పోలీస్ స్టేషన్ కు వెళ్ళివారు చూచిన వింత దృశ్యాన్నిపోలీసులకు చెప్పారు. వారు వెళ్ళి నీట తేలుతున్న శవాన్ని ఒడ్డుకు చేర్చారు. అది ధనుంజయరావు గారి శవంగా గుర్తించి.. ఆశ్చర్యపోయారు. వివేకానందకు ఫోన్ చేశారు.
వివేకానంద ఆశ్చర్యపోయాడు. త్రిపాటికి త్రివిక్రం.. వెంకటేశ్వర్లుకు తనకు
తెలిసిన విషయాన్ని చెప్పాడు. అరగంటలో అందరూ చెరువు కట్ట దగ్గరకు చేరారు. పత్రికలవాళ్ళకు
విషయం తెలిసి వచ్చి ఫోటోలు తీసారు.
త్రిపాటి ఆదేశానుసారం శవాన్ని పోస్టుమార్టన్కు పంపబడింది. తండ్రి
మరణానికి త్రివిక్రం బాధతో కన్నీరు కార్చాడు. వెంకటేశ్వర్లు.. వివేకానంద అతన్ని
ఓదార్చారు.
విషయాన్ని విన్న రాజేశ్వరి.. ఎంతగానో వాపోయింది. తండ్రిని కడసారిగా
చూడాలని కోరిన వుపేంద్ర.. పోలీస్ బందోబస్తుతో శవాన్ని చూడవచ్చాడు. భోరున
ఏడుస్తూ తండ్రి శవంపై వాలిపోయాడు.
పురజనులు కొద్దిమంది వచ్చి ధనుంజయరావు శవాన్ని చూచి వెళ్ళిపోయారు.
ఆ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో.. వెంకటేశ్వర్లుగారి ముగ్గురు
అన్నదమ్ములు.. వివేకానంద, విజయ్ త్రివిక్రంకు సాయంగా, అండగా నిలచి
స్మశానం వరకూ నడిచారు.
వూరిజనం చాలామంది రావణ అంతం జరిగిందని గుసగుసలాడుకొన్నారు.
స్మశానం నుంచి వుపేంద్రను పోలీసులు శవదహనం జరిగిన తర్వాత జైలుకు తీసుకొని
వెళ్ళిపోయారు. యనభైసంవత్సరాల ధనుంజయరావు యాభై సంవత్సరాల చేదు
రాజకీయ చరిత్రతో బూడిదైపోయాడు.
జనం అందరూ మంచి చెడ్డలను గురించి ఆలోచిస్తారు. అది మానవనైజం.
మంచి చేసిన వారిని ఆశీర్వదిస్తారు. చెడ్డను చేయించేవారికి.. చేసేవారికి శాపనార్ధాలు
పెడుతారు. 'పదుగురాడు మాట పాటియై ధరచెల్లు' అన్న పెద్దల మాట సత్యం.
ప్రభావం కలది. జనదీవెన కానీ.. ఘోష లేక శాపం కానీ.. వ్యర్థాలు కావు.
వారు ఎవరిని గురించి అలా చేస్తారో.. ఆ వ్యక్తి ఆ ఫలితాన్ని అనుభవించక తప్పదు.
భర్త వియోగానికి ఏడ్చి ఏడ్చి.. గత చరిత్రను సింహాంవలోకననం చేసికొని..
తప్పు ఒప్పులను బేరీజు వేసుకొన్న రాజేశ్వరి.. తన భర్తకు ఆ భగవంతుడు తగిన
దండన విధించాడనే నిర్ణయానికి వచ్చింది.
త్రివిక్రం మూలంగా తమకు.. వివేకానంద కుటుంబానికి వున్న బంధుత్వాన్ని తెలిసికొని.. వివేక్ను కలవాలని నిర్ణయించుకొంది. అతనితో కలసి వివేకానంద క్వార్టర్కు వచ్చింది.
ఆమెను చూచి ఆశ్చర్యపోయిన వివేకానంద.. తేరుకొని, సాదరంగా ఆహ్వానించాడు. ఆప్యాయంగా.. "అమ్మా!.. కూర్చొండి. " అన్నాడు.
రాజేశ్వరి కూర్చుంది. తన భర్త.. వారి కుటుంబానికి చేసిన అన్యాయాలను గురించి వివరించింది. చివరగా "మమ్మల్ని.. క్షమించు నాయనా!.. " అశృపూరిత నయనాలతో చేతులు జోడించింది.
వివేకానంద చలించి పోయాడు. మనస్సులో మూగబాధ.
"అమ్మా!.. నేను మీ బిడ్డలాంటి వాణ్ణి. నాకు మీ ఆశీర్వచనాలు కావాలి. మీరు నాకు నమస్కరించ కూడదమ్మా.. " ఆమె చేతులను వేరుచేసి, తన చేతులతో ఆమె పాదాలను తాకి కళ్ళకు అద్దుకొన్నాడు.
వివేకానందలోని వినయవిధేయతలకు రాజేశ్వరి ఆశ్చర్యపోయింది. కన్నీరు
కార్చింది.
"మేము నీ తల్లిని చిన్న చూపు చూచినా.. ఆ సర్వేశ్వరుడు ఆమెను చల్లగా
చూచాడు. మీలాంటి గుణ సంపన్నులను ఆమెకు బిడ్డలుగా యిచ్చాడు. నిన్ను చూస్తూ
వుంటే నాకు చాలా సంతోషంగా వుంది నాయనా!" బొంగురు పోయిన కంఠంతో
పలికింది రాజేశ్వరి,
"మా తప్పులను మన్నించి.. త్రివిక్రంని నీవు నీ తమ్ముడిగా భావించు నాయనా.. మీరంతా కలిసి మెలిసి వుండాలి. మీకు చెందవలసిన ఆస్థిని మీ పేరు వ్రాయించి పత్రాలను నీకు అందజేస్తాను. " పవిటతో కన్నీళ్ళను ఒత్తుకొంటూ చెప్పింది రాజేశ్వరి.
"అమ్మా!.. మాకు ఏమీ వద్దమ్మా!.. మీరు ఆస్తికి సంబంధించి ఏదైనా చేయదలచుకొంటే ఏమీలేని నిరుపేదలకు పంచండి. అలాచేస్తే మీకు పుణ్యం.. పురుషార్థం రొండు కలసి వస్తాయి. యీ విషయంలో మీరు పెదమామయ్య అనంతయ్యగారి సలహాను తీసుకొండి. ” వినయంగా చెప్పాడు వివేకానంద.
"నేను.. నాయనా!.. మీ అమ్మను ఒకసారి చూడాలి. ”
"మీ కోర్కె త్వరలో నెరవేరుతుందమ్మా!.. నా మాట నమ్మండి. ” చిరునవ్వుతో
చెప్పాడు వివేకానంద.
రాజేశ్వరి సోఫానుండి లేచింది.
“అన్నయ్యా!.. వెళ్ళొస్తాం. ” అన్నాడు త్రివిక్రం.
“మంచిది. ”
ఆ తల్లికొడుకులు బయటికి నడిచారు. కారు వరకూ వారితోటే నడిచి..
వెళ్ళగానే యింట్లోకి.. నడిచాడు వివేకానంద.
సోఫాలో కూర్చున్నాడు. తను బాలసుబ్రమణ్యం కేసును పూర్తిగా
పరిశీలించాడు. ఆ రోజుల్లో వున్న యస్. ఐ. విష్ణుతో కూడా మాట్లాడాడు. కొన్ని
ఆధారాలను సేకరించాడు. కేసును పునఃపరిశీలనకు తీసుకురావాలని
నిర్ణయించుకొన్నాడు. అసలు.. నేరస్థులకు శిక్షపడేలా చేయాలనుకొన్నాడు. యింతలో
చలమయ్య జైలు నుంచి విడుదలైనాడు. అతను విడుదలైన వారం రోజులకు
ధనుంజయరావుగారి చిత్రమైన మరణం సంభవించింది.
వారి మరణానికి, చలమయ్యకు ఏమైనా సంబంధం వుండి వుంటుందా!.. అతను కాకపోతే వేరెవరు
యీ దారుణ హత్యను చేసి వుంటారు?.. తనకు మరో సవాలైన కేసు యిది. యీ
ఆలోచనలతో వున్న వివేకానందకు అంతరాయాన్ని కలిగిస్తూ సెల్ మ్రోగింది.
“సార్!.. మీరు వెంటనే స్టేషన్కు రావాలి. చలమయ్య వచ్చాడు. మీతో
మాట్లాడాలట. ” హెడ్కానిస్టేబుల్ కోటయ్య ఫోన్.
వివేక వేగంగా లేచాడు. డ్రస్ చేసికొని జీప్లో కూర్చొని యిరవై నిముషాల్లో
స్టేషన్ చేరాడు. గడ్డం మీసాలతో చూచేదానికే భయంకరంగా వున్న ఒక వ్యక్తిని
చూచాడు.
కుర్చీలో కూర్చొని వున్న ఆ వ్యక్తి లేచి.. వివేకానందకు నమస్కరించాడు.
ప్రతి నమస్కారం చేసి వివేకానంద తన రూమ్లోనికి వెళ్ళాడు. కోటయ్య చలమయ్యలు
అతన్ని అనుసరించారు. వివేక కోటయ్య ముఖంలోకి చూచాడు.
“సార్!.. వీరే చలమయ్యగారు. ” చెప్పాడు కోటయ్య.
"మీరు నాతో ఏం చెప్పాలని వచ్చారో చెప్పండి. ” చలమయ్య ముఖంలోకి
చూస్తూ అన్నాడు వివేక్.
“సార్!.. ధనుంజయరావును చంపి చెరువులో పడేసింది నేనే. " మెల్లగా చెప్పాడు చలమయ్య.
వివేక్, కోటయ్యలు ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.
"అలా చేయడం నేరమని మీకు తెలియదా చలమయ్యగారూ!.. ” అడిగాడు.
విరక్తిగా నవ్వి చలమయ్య.. “చేయని నేరానికి ఐదు సంవత్సరాలు జైల్లో
వున్నాను. నా పగ.. కసిని తీర్చుకోవాలని నిర్ణయించుకొన్నాను. ఆ రాక్షసుణ్ణి చంపాను.
యిప్పుడు ఆనందంగా మీరు.. కోర్టు ఏ శిక్ష వేసినా అనుభవించేదానికి సిద్ధంగా
వున్నాను. నేను వున్నా పోయినా నా గురించి బాధపడేవారు ఎప్పుడో యీ పాపిష్టి
లోకాన్నించి వెళ్ళిపోయారు. ” అతని కళ్ళల్లో విచారం, కన్నీరు.
“మీరు ఏ కారణంగా ధనుంజయరావును చంపారో కాస్త విపులంగా
చెప్పగలరా!.. ”
వివేకానంద.
“బాలసుబ్రహ్మణ్యం నా మేనల్లుడు. అక్క కొడుకు.. ఎలక్షన్ సమయంలో
తనకు వ్యతిరేకియైన ప్రత్యర్థికి సపోర్టు చేసి.. తనని గురించి నీచంగా మాట్లాడినాడని
తన ఓటమికి బాలూ కారకుడైనాడని వాణ్ణి చంపి.. నా కూతురుతో వాడికి అక్రమ
సంబంధం వున్నదని పుకారులేపి.. ఆ కారణంగా అది నాకు నచ్చక నేను వాణ్ణి
చంపినట్లు తప్పుడు సాక్ష్యాలను సృష్టించి నన్ను జైలుపాలు చేశాడు ధనుంజయరావు.
జైలు పాలైనందుకు మా అక్క నా బిడ్డ, భార్య.. అవమానాన్ని భరించలేక..
విషాన్ని త్రాగి మరణించారు. నలుగురు అమాయకుల చావుకు కారకుడైన ఆ
ధనుంజయగాణ్ణి కత్తితో పొడిచి పొడిచి చంపాను. నా కసి తీర్చుకున్నాను. సార్..
యిది సత్యం. మీరు నన్ను అరస్టు చేయండి. చచ్చి బ్రతుకుతున్న వాణ్ణి.. నాకు
వేయబోయే శిక్షను గురించి నాకు భయంలేదు. ” బొంగురు పోయిన
కంఠంతో.. కన్నీళ్ళతో తను చెప్పదలచుకొన్నది చెప్పాడు చలమయ్య.
“నేను ఈ కేసు పూర్వాపరాలను గురించి విచారిస్తున్నాను. అసలైన నేరస్థులకు శిక్ష పడేలా చేయాలనుకొన్నాను. మీరు ఆవేశంతో తొందరపడ్డారు. నేరస్థులైనారు." విచారంగా నిట్టూర్చాడు వివేక్.
అతని ఆదేశానుసారం.. చలమయ్య చేతులకు సంకెళ్ళు వేసి అతన్ని త్రోశారు పోలీసులు. త్రిపాటీగారికి ఫోన్చేసి చలమయ్య సరండర్ అయినట్లుగా చెప్పాడు వివేకానంద.
మరుదినం పేపర్లలో యీ వార్త.. చలమయ్య ఫోటో ప్రచురించబడింది. యీ వార్త జిల్లా కలెక్టర్ గారికి.. జెడ్. పి. ఛైర్మన్ గారికి.. పౌరులను యితర అధికారులకు తెలిసిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు.
కలెక్టర్.. జెడ్. పి. ఛైర్మన్ కలసి మాట్లాడుకొని వారం రోజుల తర్వాత సమావేశాన్ని నిర్ణయించి నగరంలోని ప్రముఖులకు.. అన్ని డిపార్టుమెంట్ల అధికారులకు స్కూలు కాలేజీల ప్రధాన వుపాధ్యాయులకు ఆ సమావేశంలో పాల్గొనవలసిందిగా సందేశాలను జారీ చేశారు.
కలెక్టర్ ఆఫీస్ ఆవరణంలో వేదికను ఏర్పాటు చేశారు. ఆహ్వానితులందరూ ఆ సభకు హాజరైనారు. జిల్లా కలెక్టర్గారు, జడ్. పి. ఛైర్మన్ గారు వేదికను అలంకరించారు.
తొలి ప్రసంగాన్ని జెడ్. పి. ఛైర్మన్ గారు, ఎలక్షన్ తర్వాత ఎన్నికైన నాయకులు..
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆశయాలను గుర్తించి.. వాటి సాధనకు నాయకులు
అధికారులు, ప్రజలు కలసి పరస్పర సహకారాలతో ఎలా వర్తించి.. ప్రతి గ్రామం,
మండలం, తాలూకా, జిల్లా, రాష్ట్రం, దేశం.. ప్రగతికి పాటు పడాలనే విషయాలను
వివరించారు.
వారి తనదనంతరం.. కలెక్టర్గారు.. “సభికులందరికీ నా నమస్కారములు. అనాదిగా యీ మన పవిత్ర భారతమాతకు విశిష్టమైన చరిత్ర వుంది. ఆ తల్లి ప్రతిరూపాలే శాంతం.. సహనం.. ప్రేమ.. సౌభ్రాతృత్వాలు. ప్రతి తల్లితండ్రి.. తన బిడ్డల అభ్యున్నతిని ఆశిస్తూ.. సమాజంలో వారు ఎంతో
గౌరవప్రతిష్టలను పొందాలని ఆశిస్తారు. అలాగే ప్రతి వ్యక్తీ.. సత్యం, ధర్మం, న్యాయం నిజాయితీ పరస్పర ప్రేమ సౌభ్రాతృత్వాలను కలిగి.. స్వార్థం, ద్రోహం, మోసం, అహంకారం, స్వాతిశయాదులకు అతీతంగా పరమార్థ చింతనతో.. నాయకుల, అధికారులతో చేతులు కలిపి, మన మానవ సముదాయాభ్యున్నతికి.. మన రాష్ట్ర దేశ ప్రగతికి.. స్వచ్ఛభారత్ నిర్మాణానికి.. పాటు పడాలి. అసలైన ప్రేమతత్వాన్ని ఎరిగిన వివేకానంద, ఝాన్సీ.. విజయ్, అమృతలవలె 'ప్రగతి ప్రేమికులు'గా అందరూవర్ధిల్లాలి. వారు అందరికీ ఆదర్శప్రాయులు. వందేమాతరం. జై జై భరతమాత. జై జై ఆంధ్రమాత. జైహింద్. ” ప్రసంగాన్ని ముగించి చేతులు జోడించారు కలెక్టర్గారు.
కరతాళ ధ్వనులతో ఆ ఆవరణం మారుమ్రోగింది.
========================================================================
సమాప్తం.
ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు రచయిత శ్రీ సిహెచ్. సీఎస్. శర్మ గారి తరఫున, మనతెలుగుకథలు.కామ్ తరఫున మా అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments