'Prakruthini Kapadudam' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
కొండల్లో కోనల్లో వానజల్లు కురిసింది జల జలా..
పుడమి పులకరించి నవ్వింది కిల కిలా.
నల్లమబ్బుల్లో మెరుపులు మెరిసి ఆకాశం వెండిలా తళతళ లాడింది..
మబ్బులు తొలగిన ఆకాశం చంద్రుని విందుకు పిలిచింది.
తడిసిన పూలపచ్చికపై తూనీగలు ముచ్చటలాడాయి..
సొగసులన్నీ ఆరబోసిన మయూరాలు నాట్యాలు చేసాయి.
కొండల్లో జలపాతాలు ఉరికి ఉరికి వచ్చి..
చెరువుల్లా ఒద్దికగా ఒదిగిపోతున్నాయి.
తెరచాపలతో పడవలు దూరతీరాలకు తరలి పోతున్నాయి..
పడవనిండుగా జలసంపదను తేవాలనే ఆశతో.
అడవుల్లో వీచిన హోరుగాలి మేఘాలను తరిమికొట్టి..
విజయ గర్వంతో అలసి సొలసి నిదుర పోయింది.
కాలం గడవని లోకబాంధవుడు మబ్బులో దాగి..
దోబూచులాడుతూ కమలానికి కన్ను గీటుతున్నాడు.
చలికాలం కొండ శిఖరాలపై పేరుకున్న తెల్లని మంచును..
వేసవిలో కరిగించేందుకు కష్టపడుతున్నాడు సూర్యుడు.
ఎన్నెన్నో అందాలూ కొండల్లోనుంచి దూకే జలపాతాలు..
వాగులూ వంకలూ దాటుతూ పరుగులు పెట్టె ప్రవాహాలు.
కొండలను తాకాలని పోటీగా పెరిగిన చెట్లు..
వాటిని అందుకోలేక దిగాలుపడి భూమిని ఆక్రమించాయి.
సూర్యకిరణాలు చొరబడని చిక్కని అడవులను..
మనిషి సునాయాసంగా ఆక్రమించుకుని ప్రకృతికి ద్రోహం చేసాడు.
సునామీలు ముంచెత్తి సంద్రం చెల్లా చెదురై భూకంపాలు వస్తే..
భీభత్సంగా ప్రకృతి కోపగిస్తే మనిషి నిలువలేడు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నాపేరు అప్పాద్వేదుల అన్నపూర్ణ. నాది కాకినాడ. మా నాన్నగారు శ్రీ బులుసు వెంక టేశ్వర్లుగారు, పిఠాపురం రాజా వారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేసారు. ఆయన రచయిత, కవి, పండితులు. ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం సబ్జెక్ట్స్ లో పీజీ చేసారు. ఇంటినిండా గ్రంధాలూ, ఇంటి ఎదుట నేను చదువుకునే స్కూల్ గ్రంధాలయం వున్న కారణమో, నాన్నగారి ప్రభావమో అన్ని పుస్తకాలూ చదివాను. ఆరుద్రగారు డాక్టరేటు చేసే రోజుల్లో నాన్నగారి దగ్గిరున్నగ్రంధాలు తీసుకెళ్లారు. విశ్వనాధ, దివాకర్ల వంటి దిగ్గజాలు మాఇంటికి వచ్చి కాకినాడలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అలా వారిని చూసినట్టు లీలగా గుర్తు. నాన్నగారు రాసిన 150 పుస్తకాల్లో ఒకటి అప్పటి విద్యాశాఖ మంత్రి శ్రీ పీవీగారు, విశ్వనాధ, దివాకర్ల ఆవిష్కరించారు.
తరువాత మహాఋషుల చరిత్రను (పది భాగాలూ) టీ టీ డీ వారు హక్కులు తీసుకుని ప్రచురించే
అవకాశం కల్పించిన శ్రీ పీ వీ ఆర్ కె ప్రసాదుగారు.. ఇలా చాల గుర్తులు మెదులుతూనే వున్నాయి.
నాగురించి చెప్పాలంటే రచనలు చేయడం ఆలస్యంగా జరిగింది.చదువు పెళ్లి పిల్లలు బాధ్యతలు తీరి రచన పత్రికలో 'వసుంధర' గారి ప్రోత్సహంతో నామొదటి కథ ''సెలయేరులో అల'' ప్రచురించబడింది. ఆ తరువాత అన్నిపత్రికల్లో వచ్చాయి. ఎక్కువగా రచన, ఈనాడువారి చతుర, విపుల లో ప్రచురించారు. ఇటు ఈ కథలు, చతుర నవలలు రాస్తూనే లోక్ సత్తా సంస్థ స్థాపకులు డా.జయప్రకాశ్ నారాయణగారి సంస్థలో చేరాను. పార్టీలోనూ పనిచేసాను. సంస్థ పత్రికలో వ్యాసాలు రాసే అవకాశం జె పీ ఇచ్చారు. ఇరవై సం.లు వారితోపాటు పనిచేసే మహత్తరమైన అవకాశం లభించడం నాకు గర్వకారణం. ఇప్పుడూ లోక్ సత్తా లో వ్యాసాలు రాస్తూనే వున్నాను. కవితలు కూడా రాస్తూ వుంటాను. మావారు మేథ్స్ ప్రొఫసర్. మాకు ముగ్గురు పిల్లలు.అమెరికాలో వున్నారు. మేము కూడా ఎనిమిది సం.గ ఇక్కడే అమెరికాలో వుంటూ వున్నాము.
ధన్యవాదాలు.
అన్నపూర్ణ.
Comentários