top of page

ప్రమధ్వర



'Pramadhvara' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 02/08/2024

'ప్రమధ్వర' తెలుగు కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



పూర్వం విశ్వావసువు అనే గంధర్వ రాజు ఉండేవాడు. వాగ్దేవి వర ప్రసాదంతో విశ్వావసువు మంచి సుకవికి ఉండే సులక్షణాలన్నిటిని పుణికిపుచ్చుకున్నాడు. అతడు దేవేంద్రుని స్తుతించి, అనేక బహుమతులను, వరాలను పొందాడు. అతనికి నూతన విద్యలను అభ్యసించడం అంటే మహా యిష్టం గా ఉండేది. ఎవరి దగ్గర ఏ నూతన విద్య ఉందని తెలిసినా, దానిని నేర్చు కునేవరకు అతనికి నిద్రపట్టేదికాదు. ఆకలిదప్పికలు ఉండేవి కావు. అలా విశ్వావసువు భ్రమలు, సోమ, చక్షుషీ విద్యలందు మంచి నైపుణ్యం సంపాదించాడు. తను నేర్చుకున్న చక్షుషీ విద్యను చిత్ర రథుడు వంటి గంధర్వులకు కూడా నేర్పించాడు. 


విశ్వావసువు చక్షుషీ విద్య ద్వారా గంధర్వులందరిని ఒకేచోట నుండే చూడటం గమనించిన గంధర్వులు గంధర్వ రాజులలో అతనిని మిన్నగా భావించారు. గంధర్వ రాజులుగ చెలామణి అవ్వాలనుకునే చిత్రసేన, తుంబురు వంటివారు కూడా విశ్వావసువు విద్యల ముందు తలవంచి తాము విశ్వావసువు ముందు సామంత రాజులుగా ఉంటే చాలు అని అనుకునే వారు. 


 విశ్వావసువు జ్ఞాన నైపుణ్యానికి, అందానికి ముగ్దులైన అనేకమంది అప్సరసలు అతని పిలుపు కోసం ఎదురుచూసేవారు. ఇంద్రుని కొలువులో ఉండే మేనక విశ్వావసువు దృష్టిలో పడింది. అది గ్రహించిన మేనక మహదానంద పడింది. 


 "కాలం, ఖర్మ ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో ఎవరూ చెప్పలేం. కాలం కలిపిన క్షణాల ను మధుర క్షణాలుగా భావించాలి. వాటిని సద్విని యోగం చేసుకోవాలి. " అని మేనక అనుకుంది. 


 మేనక, విశ్వావసువు ఇరువురు కలిసి అనేక పుణ్య ప్రదేశాలు తిరిగారు. శృంగార ప్రదేశాలను సందర్శించారు. అక్కడ ఆనందంగా ఆడిపాడారు. కడకు పవిత్రమైన మహత్తుగల స్థూలకేశ మహర్షి ఆశ్రమ సమీపాన కొంత కాలం సంచరించారు. ఆ ఆశ్రమ సమీపాన ఉన్న సమయంలో విశ్వావసువు మేనకతో, " మేను.. ఈ సృష్టిలో అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమ జన్మ. అలాంటి మానవ జన్మను ఎత్తినవారు మహా అదృష్టవంతులు. అయితే వారెందుకు పుట్టారో వారు ముందుగా ఆలోచించి గమనించాలి.. వారి శక్తి, యుక్తి ఏపాటిదో ముందుగా వారు గ్రహించాలి. ఆపై అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. అలా నడుచుకున్నవారే పదుగురికి ఉపయోగ పడతారు. పరమాత్మ ఆత్మలో పదిలంగా ఉంటారు. మానవ లోకంలో మహదానందంగా జీవిస్తారు. ధర్మార్థ కామమోక్షాలను సమస్దాయిలో స్వీకరింగలుగుతారు. 


 అలాంటి వారే అమలిన శృంగార సీమలో ఆధ్యాత్మిక చట్రంలో విహరించగలుగుతారు. అలాగే మన గత జన్మ మనకు ప్రసాదించిన అదృష్టాన్ని వినయంగా మనం అందిపుచ్చుకోవాలి గాని మనమే అదృష్టవంతులమని అహంకరించకూడదు" అని అన్నాడు. 


మేనకకు విశ్వావసువు మాటలు బాగా నచ్చా యి.నాటినుండి మేనక విశ్వావసువు మాటలకు అనుకూలంగా నడుచుకో సాగింది. వారు అక్కడ ఒక పాపకు జన్మనిచ్చారు. 

 విశ్వావసువు తన చక్షుషీ విద్య ద్వారా పసి పాపలో ఉన్న మానవ తత్వాన్ని, మానవత్వాన్ని, మహ ర్షి తత్వాన్ని గ్రహించాడు. పసిపాప వదనంలో తారాడే సుర నర కళను గ్రహించాడు. "కారణ జన్మురాలు. కాదు కాదు మానవ జన్మకు మహోన్నత విజ్ఞాన కళను అద్దే మహనీయురాలు" అని అనుకున్నాడు. ఆ శిశివును అక్కడే ఉంచి తనలోకం వెళ్ళి పోయాడు. విశ్వావసువు మాటలను అనుసరించి మేనక కూడా తనలోకం వెళ్ళి పోయింది. 


 కొండల మీద నుండి ప్రవహిస్తున్న సరోవరంలో 

స్తూలకేశ మహర్షి సంద్యావందన కార్యక్రమాన్ని ముగించు కున్నాడు. సరోవరం లోని నీటిని దోసిలి తో తీసుకుని, "సరస్వతీ నదీ జలం కన్నా, గంగా నదీ జలం కన్నా, యమునా నదీ జలం కన్నా, నర్మదానదీ జలం కన్నా ఈ జలం మహా పవిత్రం" అని దోసిలిలోని నీటిని స్థూలకేశ మహర్షి కళ్ళకు అద్దుకున్నాడు. సరోవరం చుట్టూ ఉన్న చూత ఫలములతో నిండిన చూత వృక్షములను, జంభూ ఫలములతో నిండిన జంభూ వృక్షములను, బిల్వ ఫలములతో నిండిన శ్రీ వృక్షములను, నింబ వృక్షము లను చూసాడు. 

 స్థూలకేశ మహర్షి సరోవరం నుండి బయటకు వచ్చాడు. తన ఆశ్రమం వైపు నడవసాగాడు. దారికి రెండు వైపులా ఉన్న బదరీ, అమల, అమృత, జంభీర వృక్షములను చూసాడు. వాటి ప్రక్కనే ఉన్న రంభా వృక్ష తోటలో కిలకిల నవ్వుతున్న పసిపాపను చూసాడు.. రంభా వృక్షాలకున్న రంభాఫల గెలలను చూసాడు. 


స్థూలకేశుడు అటూ ఇటూ చూసి శిశువు దగ్గర ఎవరూ లేరని గ్రహించాడు. కిలకిల నవ్వుల శిశువును రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. స్థూలకేశ మహర్షి పసి పాప కళ్ళలో కళ్ళు పెట్టి చూసాడు. రెండు ప్రాణ తేజాలతో ప్రకాశిస్తున్న పాప అతని జ్ఞాన నేత్రాలకు కనపడింది. 


"అహో బ్రహ్మ దేవ! నాకెంతటి అదృష్టాన్ని ప్రసాదించావయ్య. " అనుకుంటూ స్థూలకేశ మహర్షి పసి పాపను తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు. స్థూలకేశ మహర్షి మిగతా మునులకు, మహర్షులకు, తదితరులందరికీ జరిగిన విషయమంతా చెప్పాడు. 


స్థూలకేశ మహర్షి ఆడ శిశువుకు "ప్రమద్వర" అని నామకరణం చేసాడు. స్థూలకేశ మహర్షి ప్రమద్వర ను అల్లారు ముద్దుగా పెంచసాగాడు. 


 రురుడు అనే యువ మహర్షి తన తండ్రి ప్రమతి కి తెలిసిన సమస్త విద్యలను చక్కగా అభ్యసించాడు. అలాగే తన తల్లి ఘృతాచిని కలిసి అనేక విద్యలను అభ్యసించాడు. ‌ 

ఘృతాచి మాటలను అనుసరించి తన పూర్వీకులు చ్యవన మహర్షి, సుకన్య వంటి వారు ఎంత గొప్పవారో తెలుసుకున్నాడు.. 


తన పూర్వీకులు "చ్యవన మహర్షి పుట్టుకతోనే పులోముడనే రాక్ష సుని సంహరించి తల్లి పులోమను కాపాడాడు. నేను కూడా అలాంటి గొప్ప విద్యలను నేర్చుకోవాలి" అని రురుడు అనుకున్నాడు. అతని మనసు జీవాల ప్రాణ విభజన మీదకు వెళ్ళింది. ప్రాణ విభజన విద్యకై రురుడు అనేక మంది మహర్షులను ఆశ్రయించాడు. వారి దగ్గర అనేకానేక విషయాలు నేర్చుకున్నాడు. చివరికి ప్రాణ విభజన విద్యను ఔపాసన పట్టాడు. 


రురుడు ప్రాణ మిత్రులతో కలిసి ప్రతి రోజు తను కొత్తగా నేర్చుకున్న దాని గురించి చర్చించేవాడు. ఒక నాడు రురుని మిత్రులలో ఒకడైన యుయుడు, "మిత్రమా రురు.. పనీపాట లేనివాడు పక్కవాని పళ్ళ గురించి ఆలోచిస్తాడని నాకు మా బామ్మ బామ్మ చెప్పింది. పనంటేనే మహా బద్దకం పెరిగే నాకు నీ విద్యల సారం ఎందుకు చెప్పు?" అని అన్నాడు.

 

యుయుని మాటలను విన్న రురుడు, " మిత్రమా! మనిషిని మాయలో పడేసి అసురుని చేసేది అతని బద్దకమే. అదృష్టం అందలాన్ని చూపితే దురదృష్టం దురదగుంటాకును చూపుతుంది. సరస్వతీ మాత మనందరిని అదృష్టవంతులను చేసింది. కలిసి చదువు కునే భాగ్యాన్ని ప్రసాదించింది. కాబట్టి నీ అదృష్టాన్ని కాలదన్నుకోమాకు. "అని చెప్పాడు. 

రురుని మాటలను విన్న యుయుడు ఆలోచనలో పడ్డాడు. అటు పిమ్మట తన బద్దకానికి తిలోదకాలు ఇచ్చాడు. రురుని జ్ఞాన చర్చలో గొంతు కలిపాడు. 


స్థూలకేశ మహర్షి ఆధ్వర్యంలో ప్రమధ్వర స్త్రీల కు ఉపయోగకరమైన విద్యలన్నిటిని నేర్చుకుంది. తను నేర్చుకున్న విద్యలను ఆశ్రమంలోని మునికన్య లనేక మందికి నేర్పింది. పాక శాస్త్రం లో మంచి ప్రావీణ్యం సంపాదించింది. "గూఢాన్నం, గుడమిశ్రిత ముద్గ సూపం, గుడ మిశ్రిత తండుల పిష్టం, మాష చక్రం, అపూపం, సపాద భక్ష్యం వంటి వంటకాలు తయారు చేయడంలో ప్రమ ధ్వరకు సాటి ప్రమధ్వరే అని అక్కడి ఆశ్రమాల వారంత అనుకునేవారు. 


శుక్లపక్ష చంద్రునిలా పెరిగే ప్రమధ్వర ఇంద్ర ధనుస్సు లాంటి కనుబొమ్మలతో కళకళలాడ సా గింది. ప్రమధ్వర విశాల నేత్రాలు, గులాబీ చెక్కిళ్ళు, బింబాధరాలు, రాయంచ నడకలను చూసేవారు ప్రమధ్వర మానవ రూపంలో ఉన్న సురకన్య అని అనుకునేవారు. 


"రురుడు ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, మహోన్నత విజ్ఞాన విద్యల సుస్వరూపుడు" అని రురుని చూచినవారు అనుకునేవారు. 


రురుడు అనేక మంది మహర్షులను సేవిస్తూ స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చాడు. అక్కడ నిత్యాగ్ని హోత్రానికి ఉపయోగపడే సమిధలను చూసాడు. ఆ సమిధల ప్రత్యేకతను గమనించాడు. ఆ సమిధలలో మానవ ప్రాణ తేజాన్ని పెంచేశక్తి ఎక్కువగా ఉందని గ్రహించాడు. ప్రాణవాయువు ను పెంచే సమిధలను ఇన్నాళ్ళకు చూడగలిగానని సంతోషించాడు. కొన్ని సమిధలను చేతిలోకి తీసుకున్నాడు. 


అక్కడ రురుడు పూల సజ్జతో ఆశ్రమానికి వెళుతున్న ప్రమధ్వరను చూసాడు. రురుడు తొలిచూపులోనే ప్రేమ లో పడ్డాడు. ప్రమధ్వర కూడా రురుని చూచింది. తొలి చూపులోనే రురుని ప్రేమించింది. ఇరువురు ఒకరికొకరు మనసులు ఇచ్చి పుచ్చుకున్నారు. ప్రకృతి లోని అంద మంతా ప్రమధ్వర రురునిలో చూసింది. సృష్టిలోని సౌం దర్యమంతా రురుడు ప్రమధ్వరలో చూసాడు. 


 రురుడు తన ప్రేమ గురించి తన తండ్రి ప్రమతికి చెప్పమని తన ప్రాణ స్నేహితులను అభ్యర్థించాడు. ‌వారు అలాగే అని ప్రమతిని కలిసి విషయం చెప్పారు. ప్రమతి

రురుని ప్రేమను సమ్మతించాడు. 


ప్రమధ్వర తనను పెంచిన తండ్రి స్థూలకేశ మహర్షి ని కలిసింది. కుమార్తె ఏదో చెప్పడానికి వచ్చిందని స్థూల కేశ మహర్షి గమనించాడు. కుమార్తె ముఖం చూస్తూ, " విషయం ఏమిటని?" అడిగాడు. ప్రమధ్వర విషయం చెప్పింది. ప్రమధ్వర మాటలను మహర్షి మన్నించాడు. 


 ప్రమతి స్థూలకేశ మహర్షి ని కలిసి తన కుమారుడు రురునికి ప్రమధ్వరని ఇచ్చి పెళ్ళి చేయమన్నాడు. అందుకు స్థూలకేశ మహర్షి అంగీకరించాడు. పూర్వ పాల్గుణీ నక్షత్రం ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు రుద్రునికి ప్రమధ్వర కు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. 


 స్థూలకేశ మహర్షి ప్రమద్వరను దగ్గరకు తీసుకొని "అమ్మా ప్రమధ్వర... 


 కార్యేషు దాసి కరణేషు మంత్రీ 

 రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ 

 భోజ్యేషు మాతా శయనేషు రంభా 

 షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ... 


అని పెద్దలు ఉత్తమ భార్యా లక్షణాలను చెప్పారు. ఆ లక్షణాల మూలాలను తెలుసుకుని ఇక మీదట నువ్వు నీ భర్త దగ్గర మసలుకోవాలి. " అని ఉత్తమ భార్య లక్షణాలను చెప్పాడు. 


 ప్రమతి మహర్షి తన కుమారుడు రురుని దగ్గరకు తీసుకొని, 

"నాయన రురు.. 


 కార్యేషు యోగీ కరణేషు దక్షః 

 రూపేచ కృష్ణః క్షమయా తు రామః 

 భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం 

 షట్కర్మ యుక్తః ఖలు ధర్మ నాథః... 


అని పెద్దలు ఉత్తమ భర్త లక్షణాలను చెప్పారు. ఆ లక్షణాల మూలాలను తెలుసుకుని ఇక మీదట నువ్వు నీ భార్య దగ్గర మసలుకోవాలి" అని ఉత్తమ భర్త లక్షణాలను చెప్పాడు. 


ఇలా రురునికి ప్రమతి, ప్రమధ్వర కు స్థూలకేశ మహర్షి ఉత్తమ దంపతుల లక్షణాలను అనేకం చెప్పారు.. 


 మనిషి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది. దైవం తలచిందే మనిషి తలిస్తే, ఆ మనిషి దైవం అయిపోతాడు. అలాంటి సంఘటనలు భూమి మీద అరుదే అని చెప్పాలి. 

ఒకనాడు ప్రమధ్వర స్నేహితురాళ్ళతో కలిసి పూలు కోయడానికి వనంలోకి వెళ్ళింది. అక్కడే స్నేహితురాళ్ళ తో కాసేపు ఆడింది. పాడింది. కాబోయే తన భర్త రురుని పాండిత్యం గురించి స్నేహితురాళ్ళతో కాసేపు మాట్లాడింది.


అప్పుడు ప్రమధ్వర చూడకుండా గుండ్రంగా చుట్టుకుని ఉన్న పాముపై కాలువేసింది. పాము బుస్సున లేచి తన కోరలతో ప్రమధ్వరని కరిచి అక్కడి నుండి వెళ్ళి పోయింది. 

పాము కరవగానే ప్రమధ్వర నేలపై కూలిపోయింది. పాము విషం వేగంగా ప్రమధ్వర శరీరాన్ని కప్పివేయాలని ప్రయత్నిస్తుంది. 


అయితే తపోశక్తి తో కూడిన ప్రమధ్వర శరీరం పాము విషం వేగాన్ని నిరోధిస్తుంది. నేల మీద పడి ఉన్న ప్రమధ్వర ను చూసిన ఆమె స్నేహితురాళ్ళు కంగారు గా స్థూలకేశ మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. 

స్థూలకేశ మహర్షి కుశికుడు, గౌతముడు, భరద్వాజుడు, ఉద్దాలకుడు, శ్వేతుడు వంటి మరి కొందరు మహర్షుల తో ప్రమధ్వర పడి ఉన్న చోటకు వచ్చా డు.. మునులు, మహర్షులు అందరూ ప్రమధ్వరను చూసారు. అప్పటికే ప్రమధ్వర శరీరంలో ఉన్న ప్రాణం ఆమెను వదిలిపోయింది. 

 ప్రమధ్వర మృత దేహము చూచిన కొందరు మునులు, "ప్రమధ్వర మరణించినా ఆమె శరీరం లో తేజస్సు ఇంకా తగ్గలేదు. " అని అనుకున్నారు. 


జ్యోతిష శాస్త్రం మీద కొంచెం పట్టు ఉన్న మునులు, "ప్రమ ధ్వర పుట్టిన సమయాన్ని, గ్రహాలనీ, నక్షత్రాదులను ఒకటికి పది సార్లు పరీక్షించి, "ప్రమధ్వర ఇప్పుడే చనిపోవడానికి అవకాశం లేదే?!" అని అనుకోసాగారు.


వారు మరికొందరు మహర్షులతో కలిసి ప్రమధ్వరను బతికించే ఉపాయం కోసం ఆలోచించసాగారు. చివరకు "ఇక లాభం లేదు. ఏదో చిత్రం జరిగితేగానీ ప్రమధ్వర బతకదు" అని అనుకున్నారు. 


ఈ విషయం తెలిసిన రురుడు ప్రమధ్వర మృత దేహం వద్దకు వడివడిగా వచ్చాడు. నిశ్చితార్థం జరిగింది కాబట్టి ప్రమధ్వర తన భార్యే అని రురుడు అనుకున్నాడు. 


రురుడు మృతిచెంది ఉన్న ప్రమధ్వరను చూచి గుండె బద్దలయ్యేలా ఏడ్చాడు. అతని కన్నులు ఎర్రబడ్డాయి. ప్రమధ్వర ప్రాణాన్ని హరించినవారి అంతు చూడాలి అని ప్రాణ స్నేహితులతో అన్నాడు. అప్పుడు రురునితో వచ్చిన దేవదూత అనే రురుని ప్రాణమిత్రుడు " మిత్రమా! పవిత్ర సశాస్త్రీయంగా వేదాధ్యయనం చేసావు.. దేవ యజ్ఞములు, వ్రతములు, పుణ్యకార్యాలు చేసావు. ఘోరమైన తపస్సు చేసావు. దేవతలు వరం కోరుకోమన్నా కోరు కోకుండా నా తపస్సంతా సాత్వికత ను, మంచిని, అమలిన ప్రేమను పెంపొందించడానికే అన్నావు. 


యమదేవేంద్రాది లోకాలకు వెళ్ళే శక్తిని పొందావు. విష తత్వ శాస్త్రమును చదివావు. ప్రాణ విభజన వైద్యం తెలిసిన వాడివి. నువ్వు దుఃఖించనేలా?. ప్రమధ్వర ను బతికేంచే ఉపాయం ఆలోచించు". అని అన్నాడు. 


ప్రాణ మిత్రుడు దేవదూత చెప్పిన మాటలను విన్న రురుడు ప్రమధ్వర దేహాన్ని పరిశీలించాడు. ఆమె దేహంలో ఉన్న విషాన్ని తీసివేసాడు. అయినా ప్రమధ్వర బతకలేదు. అప్పటికే ప్రమధ్వర ప్రాణం పోయిందని రురుడు గ్రహించాడు. అంత తన తపోశక్తి ప్రభావం తో యమలోకంలో ఉన్న యముని దగ్గరకు వెళ్ళాడు. 


యమునితో, " సూర్య పుత్ర! యమలోకాధిపతి! దక్షిణ దిశాధినేత! సమవర్తి! యమధర్మ రాజ! మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రమధ్వర నేనూ ప్రేమించు కున్నాము. పెళ్ళి చేసుకోవాలనుకున్నాము. మా యిద్దరి కి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. 


 కానీ నేడు ప్రమధ్వర పాము కాటుకు బలైంది. ప్రమధ్వర లేనిదే నేనూ జీవించలేను. నా ప్రాణం నా ప్రేమ ప్రాణం రెండింటినీ ఇక్కడే ఇప్పుడే తీసేసుకోండి. " అన్నాడు. 


 రురుని మాటలను విన్న యమధర్మరాజు, " రురు.. పరమేష్టి శాసనం అనుసరించి ప్రమధ్వర ఆయువు తీరి పోయింది. అందుకే ఆమె మరణించింది. 


వేద పురాణేతిహాసాలను క్షుణ్ణంగా చదివిన నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. యిలలో యమ ధర్మాన్ని మించిన ధర్మం మరో ధర్మం లేదు. విధాత రాత ను అనుసరించి నా ధర్మం నేను నిర్వర్తిస్తాను. మహిలో మనుషుల నడుమ కలిగే సంబంధ బాంధవ్యాలు అక్క డి వరకే పరిమితం. ఇక్కడ అందరూ ఒక్కటే. " అని యమధర్మరాజు ప్రమధ్వర దేహాన్ని చూసాడు. 


ఆపై "రురు.. చూడ చూడ ప్రమధ్వర తనువుకు మరికొంత ప్రాణశక్తి ని భరించగల శక్తి ఉందనిపిస్తుంది.. అది ఆమె తపో ఫలం వలన ఆమెకు లభించిన శక్తి. ప్రియురాలిని బతికించుకోవాలని నువ్వు నా దగ్గరకు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. నీ ప్రేయసి ప్రమధ్వర బ్రతకాలంటే నీ ఆయుష్షు లో సగం ఆమె కు ధారపోయాలి. ప్రాణ విభజన విద్యను తెలిసిన వాడివి కదా? నువ్వు ఆ పని చేయగలవా?" అని రురుని యమధర్మరాజు అడిగాడు. 



 రురుడు యమధర్మరాజు కు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ప్రమధ్వర దగ్గరకు వచ్చాడు. ప్రమధ్వర మృత దేహానికి కొంచెం ముందుగా పద్మాసనం వేసుకుని తన వైద్య విధానం అనుసరించి తనకు మిగిలి ఉన్న ఆయువులో సగభాగం ప్రాణాన్ని ప్రమధ్వరకు సమర్పించాడు. అప్పటివరకు అ చేతనంగా పడి ఉన్న ప్రమధ్వర నిద్రలో నుండి లేచినట్లు లేచింది.. అంత రురుడు దక్షిణ దిక్కుకు నిలబడి రెండు చేతులు జోడించి యమ ధర్మరాజు కు నమస్కరించాడు. 


యమ ధర్మరాజు రురుని ఆశీర్వదిస్తూ, " ఇదంత బ్రహ్మ సంకల్పమే. మీ తలరాత రూపమే. " అని అన్నాడు. 


రురుని ప్రేమయే ప్రమధ్వర ని బతికించిందని అందరూ అనుకున్నారు. ఏదేమైనా ప్రమధ్వర మరల ప్రాణం పోసుకున్నందుకు అందరూ మిక్కిలి సంతోషించారు. 


 రురుడు తన ప్రాణ విభజన వైద్యం విజయవంత మైనందుకు మిక్కిలి సంతోషించాడు. ఆ సంతోషంతో ప్రమధ్వర దగ్గరకు వచ్చాడు. ప్రమధ్వరను చూస్తూ మనసులో "నువ్వే నా ప్రాణం నేనే నీ ధ్యానం" అని అనుకున్నాడు ఆ తర్వాత అనుకున్న శుభముహూర్తా న ప్రమధ్వర రురుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 


 ఒక మనిషికి మిగిలి ఉన్న ఆయువును రెండు సమ భాగాలుగా చేసి, అందులో ఒక భాగాన్ని అప్పుడే చనిపోయిన మరో మనిషికి యిచ్చి, ఆ చనిపోయిన మనిషిని బతికించే అవకాశం యింకా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలోకి ప్రవేశించలేదు. అయితే ఆ విజ్ఞాన సంపద మన వేద కాలం నందే ఉంది. అందుకు ఒక ఉదాహరణ.. ప్రమధ్వర. ఇది మాయ కాదు. మంత్రం కాదు. మానవ శరీర శాస్త్ర విజ్ఞానము. అయితే ఇది నేడు ప్రయోగ శాలలో ఋజువు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. 


ప్రమధ్వర కథ మగవారి ప్రాణాన్ని ఆడవారికి, ఆడవారి ప్రాణాన్ని మగవారికి పోయవచ్చును అని చెబుతుంది.  ప్రయోగ శాలలో ఇక్కడ అనేక దివ్య ఔషద వాడకాల ప్రస్తావన చేయవలసి వస్తుంది. 


 సర్వే జనాః సుఖినోభవంతు 


వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు

 


53 views0 comments

Comments


bottom of page