ప్రాణం తీసిన విహారయాత్ర
- Neeraja Prabhala
- 2 hours ago
- 4 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #ప్రాణంతీసినవిహారయాత్ర, #PranamTheesinaViharayathra, ##TeluguHeartTouchingStories

Pranam Theesina Viharayathra - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 24/04/2025
ప్రాణం తీసిన విహారయాత్ర - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఏమండీ! మనం హానీమూన్ కి కాష్మీర్ వెళదామా! “ అంది రమ్య తన భర్త ప్రకాష్ తో.
“అలాగే డియర్. మనం ఆ ఏర్పాట్లలో ఉందాం. ముందుగా విమానం టిక్కెట్లు, అక్కడ ఏర్పాట్లు చూస్తాను” అన్నాడు ప్రకాష్.
ముందుగా ఇద్దరూ తమ తమ తల్లి తండ్రులకు తమ టూర్ ప్లాన్ చెప్పగా వాళ్లందరూ చాలా సంతోషించారు.
రెండు రోజుల క్రితమే వాళ్ల వివాహం చాలా వైభవంగా జరిగింది.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ప్రకాష్ తల్లి తండ్రులు చూసిన రమ్యని వివాహం చేసుకున్నాడు. రమ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరూ తమ పెళ్లికని సెలవులు తీసుకున్నారు. ఇంక ఇప్పుడు హానీమూన్ కి వెళ్లి హాయిగా గడుపుదామని వాళ్ల ఉద్దేశ్యం.
ప్రకాష్ తల్లి తండ్రులు ఇద్దరూ ఇటీవలే హార్ట్ సర్జరీలు చేసుకున్నందున తమ ఏకైక కొడుకు ప్రకాష్ పెళ్లిని చూశామన్న ఆనందంలో ఉన్నారు. తల్లిదండ్రులకు మరింత జాగ్రత్తలు చెప్పి ప్రకాష్ కాష్మీర్ కి విమాన ప్రయాణ ఏర్పాట్లు, టిక్కెట్లు వగైరాలని టూరిస్ట్ వాళ్లని సంప్రదించి అన్నీ ఆన్ లైన్ లో టిక్కెట్లు తీసుకున్నాడు.
ఇంక ఇద్దరూ కలసి కాష్మీర్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడి పచ్చని ప్రకృతి అందాలను చూస్తూ చాలా హాయిగా, అన్యోన్యంగా గడుపుతూ తమకు నచ్చిన ప్రదేశాలలో ఆ గువ్వల జంట ఫొటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
వీళ్లకు తోడుగా విమానంలో మరికొందరు పరిచయం అయ్యారు. వాళ్లందరూ వివిధ రాష్ట్రాల వాళ్లు అయినా చక్కగా అందరూ కలిసి ఒక గ్రూపుగా తిరుగుతూ కాష్మీర్ అందాలను తిలకిస్తూ సంతోషాన్ని, హాయిని అనుభవిస్తున్నారు.
కాష్మీర్ లో కొండల లోయలు, యాపిల్ తోటలు, తుల్ఫీ పూల సౌందర్యాలను తిలకిస్తూ అందరూ జంటలు గా, విడివిడిగా, గ్రూపులుగా కలిసి ఫొటోలు దిగుతూ మధ్యమధ్యలో తమ తమ కుటుంబ విషయాలను, విధినిర్వహణ బాధ్యతలను చెప్పుకుంటూ హాయిగా ఒక కుటుంబం లాగా కలిసిపోయారు.
ఇలా వారం రోజులు సరదాగా గడిచాయి. ప్రతిరోజూ ప్రకాష్, రమ్యలు తమ తలిదండ్రులతో ఫోనులో మాట్లాడుతూ వాళ్ల ఆరోగ్య స్ధితులను తెలుసుకుంటూ, తగు జాగ్రత్తలు చెబుతూ తమ పర్యటన విశేషాలను చెబుతున్నారు. అవి వింటున్న వాళ్లు తమ పిల్లల సంతోషాన్ని తమ మనోనేత్రాలతో తిలకిస్తూ ఆనందంగా ఉంటున్నారు.
ఇంకో రెండు రోజులలో తమ తిరుగు ప్రయాణం. అందరూ తమ పర్యాటనలో భాగంగా ‘పెహల్గామ్’ చేరుకున్నారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకిస్తూ, ఎత్తైన లోయలు, పక్కనే అడవులను తిలకిస్తూ ఉన్నారు.
“భూతల స్వర్గమంటే ఇదే కదా! ఎన్నేళ్లనుంచో నాకు కాష్మీర్ ని చూడాలని కోరిక. కానీ చదువు, ఉద్యోగం, ఆర్థిక ఇబ్బందుల వలన నాకు చూడడం వీలుకాలేదు. మన పెళ్లైన వెంటనే మీరు నాకోరిక నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉందండి” అంది రమ్య తన భర్తని కౌగలించుకొంటూ.
“నా భార్య అడిగితే నేను కాదంటానా? డియర్!” అన్నాడు ప్రేమగా భార్య బుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ.
“ప్రేమయాత్రలకు బృందావనము, నందనవనము ఏలనో? కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో?” అని ప్రకాష్ పాడుతూ భార్యని మరింత పొదివిపట్టుకుని దగ్గరకు తీసుకోగా ప్రేమగా భర్తతో జతకలిపి పాడింది రమ్య.
ఇలా హాయిగా ఆ జంట తమ హానీ మూన్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగే మిగిలిన జంటలు కూడా. వీరిలో కొందరు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉన్నారు. తమ పిల్లలు విదేశాల్లో స్ధిరపడ్డాక, బాధ్యతలన్నీ నిర్వహించాక ఏడుపదుల వయస్సు లో కాష్మీర్ అందాలను తిలకించేందుకు వచ్చారు కొందరు.
సాయంత్రం అయింది. ఉన్నట్టుండి మిలటరీ దుస్తులలో వచ్చిన ఏడుగురు ముష్కరులు తాము సైనికులమని చెప్పి కాల్పులు జరిపారు. అందరూ “తమని చంపద్దు, చంపద్దు” అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతున్నారు. కసాయి వాళ్లకు కనికరం ఉండదు కదా!
మగవాళ్ల నే లక్ష్యం చేసుకున్న ఆ ఉగ్రవాదులని తమని చంపద్దని ఏడుస్తూ ప్రాధేయపడినా వాళ్ల కసాయిమనసు కరగలేదు. ఊహించని ఈ హఠాత్పరిణామానికి అందరూ హతాసులై తమ ప్రాణరక్షణకై పోరాడుతూ భయంతో ఒణికి పోతూ, బాధతో హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు చెల్లాచెదురైనారు.
వాళ్లని వెంబడించి వెంబడించి అందులో కొందరిని కాల్చి చంపారు. ఇరవైఆరు మందిని పొట్టన పెట్టుకుని ఆ రాక్షసుల మనసు చల్లారాక వాళ్లు పారిపోయారు.
విగతజీవులుగా మారిన ఇరవై ఆరుమందిలో ప్రకాష్ కూడా ఉన్నాడు. పచ్చని ఆ ప్రకృతి ప్రాంతమంతా రక్తసిక్తమైంది. మాంసం ముద్దలైనారు.
అప్పటిదాకా ప్రేమ పాటలు పాడుకుని సంతోషంగా హానీమూన్ ని గడుపుతున్నారు రమ్య, ప్రకాష్ ల జంట. ఊహించని ఈ ఘటనలో ప్రకాష్ ని కాల్చడం కనులారా చూసిన రమ్య క్రిందకు ఒరిగిపోయి స్పృహ కోల్పోయింది. దగ్గర ఎవరో ఆమెపైన నీళ్లు చల్లి మంచినీటిని త్రాగించిన కాసేపటికి స్పృహలోకి వచ్చింది రమ్య. జరిగిన దారుణానికి విలవిల లాడింది. తమ కళ్లముందే తమ వాళ్లని పోగొట్టుకున్న మిగిలిన వాళ్లందరి దీన పరిస్థితి కూడా అంతే.
విషయం తెలిసి కాసేపటికి ఇండియన్ ఆర్మీ సైన్యం వాళ్ల వద్దకు రాగా వాళ్లు కూడా ఉగ్రవాదులనే భయంతో అందరూ తమని ప్రాణాలు తీయద్దని చేతులు జోడిస్తూ రోదించసాగారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసిన సైనికుల మనసు బాధతో ఆర్ద్రమైంది.
అనేక విధాలా వాళ్లకి ధైర్యాన్ని నూరిపోస్తూ, వాళ్లని దగ్గరకు తీసుకుని రక్షణనిస్తామనే భరోసాను కల్పిస్తూ నమ్మకు కలిగించడానికి ఆ సైనికులకు చాలా సమయం పట్టింది.
వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రభుత్వం వివిధ విమానాలలో వాళ్ళందరినీ తమ తమ స్వస్థలాలకు చేర్చే ప్రయత్నం చేసింది.
మృతదేహాలకు పోస్ట్ మార్టం జరిపివిషయాన్ని వాళ్ల వాళ్ల బంధుమిత్రులకు తెలియపరిచి వాళ్ల స్వస్థలాలకు చేర్చారు.
ప్రకాష్ మరణం తెలిసిన అతని బంధుమిత్రులు హతాసులై బాధాతప్తహృదయంతో ఉన్నారు. వృధ్ధులు, గుండె జబ్బు మనుషులైన అతని తల్లిదండ్రులకు ప్రకాష్ మరణ వార్తని తెలియచేస్తే ఆ వృధ్ధ ప్రాణాలేమవుతాయో? అనే భయం వెంటాడి ఆ విషయాన్ని కాస్త గోప్యంగా ఉంచారు. ఈ విషయాన్ని రేపటిదాకా వాళ్లకి చెప్పద్దని మీడియా వాళ్లని కూడా వేడుకున్నారు.
ఆ రాత్రి గడిచింది. ఉదయమే తమ కొడుకు, కోడలు కాష్మీర్ నుండి తిరిగివస్తారని కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు ప్రకాష్ తల్లి తండ్రులు.
మధ్యాహ్నం గడిచింది. ఇంతలో బంధువులు, ప్రకాష్, రమ్యల మిత్రులు, రమ్య తలిదండ్రులు, అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు. అందరికీ ఈ విషాదవార్తను వాళ్లకెలా తెలియచేయాలో అర్థం కాని సంకటపరిస్ధితి.
వీళ్లందరి రాక ఒకింత ఆశ్చర్యం కలిగిస్తున్నా తమ కొడుకు, కోడలు వస్తున్నందున అందరూ సంతోషంతో వచ్చారు అనుకున్నారు ప్రకాష్ తల్లి తండ్రులు.
కాసేపటికి అంబులెన్స్ వాళ్ల ఇంటిముందు ఆగింది. అందులోంచి కొందరు ప్రకాష్ మృతదేహాన్ని లోపలికి తీసుకొస్తున్నారు. వెనకాలే రమ్య దీనవదనయై రోదిస్తూ వస్తున్నది. ఆ దుస్సంఘటనని చూస్తూ ఆ వృధ్ధ తల్లితండ్రులు, రమ్య తల్లి తండ్రులు హతాసులై నోటిమాట రాక ఖిన్నులైనారు. వాళ్ల రోదన, బాధ వర్ణనాతీతం.
బంధుమిత్రులందరూ గుమిగూడారు. అందరూ వాళ్లకి ధైర్యం చెపుతూ అనేక విధాలా ఓదారుస్తున్నారు.
“దేవుడా! పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు. నిన్నటిదాకా పచ్చని పందిరిలో పసుపుపారాణి, బుగ్గన చుక్క, కళ్యాణ తిలకంతో కళకళ లాడిన ఈ జంట ఇంకా కాళ్లపారాణి కూడా ఆరకుండా ఇంత దారుణమా! ఏం పాపం చేశారని బంగారు భవిష్యత్తు ఉన్న ఆ పచ్చని జంటని విడదీశావు? నిండునూరేళ్లు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాల్సిన వాళ్ల జీవితాలు అప్పుడే కడదేర్చావు?” అని హృదయవిదారకంగా గుండెలవిసేలా రోదించసాగారు ప్రకాష్, రమ్య ల తల్లిదండ్రులు. వాళ్లనోదార్చడం ఎవరితరమూ కావట్లేదు. అతికష్టం మీద వాళ్లనోదార్చి జరగవలసిన కార్యక్రమాలను శ్రధ్ధగా జరిపించారు బంధుమిత్రులు.
గడిచిన పెళ్లి సందడికి సాక్షిగా నిన్నటిదాకా కళకళలాడుతూ ఉన్న ఆ పచ్చని పందిరి ఇప్పుడు అచేతనంగా మూగబోయి రోదిస్తున్నట్టుంది.
ఆ భగవంతుడే వాళ్లని ఓదార్చి ధైర్యం చెప్పాలి. కాలమే వాళ్ల బాధని తగ్గించి వాళ్లని మాములు మనిషిని చేయాలి అనుకున్నారు బంధుమిత్రులు.
హాయిగా గడుపుదామని వెళ్లిన విహారయాత్ర ఇందరి ప్రాణాలను బలితీసుకుంటుందని ఎవరైనా అనుకుంటారా? అనుకుంటే వెళ్ళుండేవారు కాదుకదా! మృత్యువుని తప్పించుకొనుట ఎవరితరమూ కాదు కదా! అంతా దైవనిర్ణయం అనుకోవాలి అంతే.
.. సమాప్తం ..

-నీరజ హరి ప్రభల
Profile Link
YouTube Playlist Link
コメント