top of page

ప్రారబ్ధ వికర్మ ఫలం



 'Prarabdha Vikarma Falam - New Telugu Story Written By  Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 21/07/2024 

'ప్రారబ్ధ వికర్మ ఫలంతెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



రాఘవేంద్ర మూసిన కన్నులనుండి కన్నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. అతనికి మరణం ఆసన్నమైందని డాక్టరు ప్రకటించడంతో, అతని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హాస్పిటలుకు చేరుకున్నారు. 


రాఘవేంద్ర వయసు అరవై దాటింది. అతనికొక్కడే కొడుకు. రెండేళ్లక్రితం కొడుక్కి ఘనంగా పెళ్ళి చేశాడు. గత యేడాది, అతని భార్య కన్నుమూసిన నాటినుండి, అతనికి జీవితం మీద ఆసక్తి నశించి పోయింది. అతడు మృత్యువుని ఆహ్వానిస్తూ, భగవద్ధ్యానంలో కాలం గడప సాగాడు. 


"పెద్దాయన, భార్య పోయాక బెంగతో చిక్కి శల్యమయ్యాడు. ఎంతో ఆనందంగా వుండే వాళ్ళం. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. అటు మా అమ్మా, నాన్న కూడా లేరా.. పెద్ద దిక్కు లేకుండా పోతోంది" అని అక్కడ వున్న బంధువులకు చెప్తూ కన్నీళ్ళు పెట్టుకుంటోంది ఆయన కోడలు. 

ఆయన కొడుకు, అకస్మాత్తుగా తన తండ్రి, యిలా ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడన్న చింతలో మునిగి పోయాడు. ఇదంతా గమనిస్తున్నరాఘవేంద్ర స్నేహితుడు, "ఆయనకేదైన కోరిక వుందేమో, ఆ కోరికి తీరుస్తానని చెవిలో చెప్పి చూడు" అని సలహా యిచ్చాడు. 


నాలుగు రోజుల క్రితమే రాఘవేంద్ర మాట పడిపోయింది. సైగలతో చెప్పే ఓపిక కూడా, లేనంతగా బలహీనమయ్యాడు. మరణం ముందు, జీవితమంతా, కనులముందు కదులాడుతుందన్న మాట, రాఘవేంద్ర విషయంలో నిజమైంది. పదేళ్ల వయసులో, ఒక చిన్నకుక్కపిల్ల చావుకు కారణమయ్యానే, అన్న బాధ ఆయన బలహీనమైన గుండెను మెలిపెడుతోంది. 

అమాయకమైన ఆ కుక్క పిల్ల ముద్దు ముఖం, కనుల ముందు నిలిచి సంజాయిషీ అడుగుతున్నట్లుగా, ఆయన కగుపిస్తోంది. బదులు చెప్పలేని నిస్సహాయ స్థితిలో, ఆయన కన్నీరు పెడుతున్నాడు. దిక్కుతోచని ఆయన కొడుకు, తన తండ్రి నిత్యం పఠించే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం లోని రెండు చరణాలు ఆయన చెవిలో చెప్పాడు. 


"ప్రాణ ప్రయాణ సమయే భవభీతి నివారణేన - లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం". 

ఒక నిమిషం తర్వాత ఆయన ప్రాణం అనంత వాయువులో కలిసిపోయింది. 

 @@@@ 


విశ్వాంతరాళంలో సంచరిస్తున్న రాఘవేంద్ర ఆత్మ దేవుని తలబోసి యిలా అడిగింది, 

 "ఓ దేవుడా! నీలో ఐక్యం చేసుకోరాదా? ఎంత కాలం ఈ శూన్యంలో నిరాకారిగా, నిరర్ధకంగా తిరగాలి?" 


భగవంతుడు పలికాడు. ఇలా సమాధానమిచ్చాడు. 

"నా చేతిలో యేమీ లేదు. పుట్టిన వానికి మరణం, మరణించిన వానికి జననం తప్పవు. ‘జాతస్య  హి  ధ్రువః  మృత్యుః  

ధ్రువం  జన్మ  మృతస్య  చ’ 

అందు వల్ల నీవు ఎప్పుడో, ఎక్కడో పుడతావు. ”


“దేవా! సమాధానం స్పష్టంగా చెప్పకుండా దాట వేస్తున్నావేమిటి?”


“అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభా శుభం.  ప్రారబ్దాన్ని ఎవరైనా ఏడు క్షణాల లోనో, ఏడు నిమిషాల లోనో, ఏడు గంటల్లోనో, ఏడు రోజుల్లోనో, ఏడు సంవత్సరాల లోనో, ఏడు జన్మల లోనో అనుభవించి తీరుతారు. జీవుల జీవన గమనాలు కర్మబద్ధం. నీవు చేసిన కర్మయే నిన్ను నడిపించే శక్తి. గహనా కర్మణో గతిః  కర్మ గతిని అంచనా వేయడం కష్టం..”


“నీవే కదా సృష్టి, స్థితి, లయ కారకుడవు. నీ ఆజ్ణ ననుసరించే కదా ఈ చరాచర ప్రపంచం మనుగడ సాగించేది. మాకు స్వేచ్చ యెక్కడిది?" 


 "అలా అనుకునే మీరు మీ పాపాలకు, కష్టాలకు నన్ను బాధ్యుడిని చేస్తారు. కానీ నిజమేమిటంటే, . మీరు, మీ ప్రారబ్ధ కర్మలే మీ జీవితాన్ని నడిపించే శక్తులు”. 


"నన్ను యేదో శక్తి లాగేస్తోంది. ఎక్కడికి పోతున్నాను? ఆదుర్దాగా అడిగింది ఆత్మ. 


"నీకు ఇంకో జన్మకి సమయం వచ్చింది. అందుకే నీ ప్రయాణం మొదలైంది". 


 "నేనెవరికి పుడతాను? తిర్యక్ యోనిలోనో, మానవ యోనిలోనో కాదు గదా? ఆడా, మగా? నా జీవితం బాగుంటుందా?" భయం భయంగా అడిగింది ఆత్మ. 


"నీవు మూటకట్టుకున్న చెడు కర్మలు నీకు నరకతుల్యమైన అనుభవాలని, మంచి కర్మలు స్వర్గ సమానమైన ఆనందాలని యిస్తాయి. అవి అనుభవించక తప్పదు. 


 సత్కర్మభీశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలంఅత్యుత్కట పుణ్య పాపానాం, సత్యం బలానుభవమిహం”

 

“పోనీ ఒక మాట చెప్పు. నాకు నువ్వు తోడుగా.. ” ప్రశ్న పూర్తిగాకముందే అది ఒక అదృశ్య శక్తి ప్రభావం వల్ల ఆత్మ గర్భస్థమైంది. 

 @@@@ 

 

ఏ నాటి బంధమో, ఆ ఆత్మ రాహుల్, అనితలకు మగ బిడ్డగా జన్మించింది. ఏడుపుతో ప్రారంభమైన ఆ శిశువు జీవితంలోనికి మెల్లగా ప్రశాంతత వచ్చింది. తల్లిదండ్రుల లాలనలో, శాస్త్రీయ పెంపకములో ఆ బిడ్డ వాతావరణానికి అనువుగా జీవించే శక్తిని క్రమ క్రమంగా పొందాడు. 

బాలారిష్టాలను దాటి ఆరోగ్యంగా యెదగ సాగాడు. చూస్తూండగానే యేడాది గడిచిపోయింది. తల్లిదండ్రుల ప్రేమకు పొంగిపోతూ, హాయిగా నవ్వులు చిందిస్తున్న ఆ బిడ్డ ఒక రోజు, అనుకోని కష్టాల పాలయ్యాడు. 


 ఆ రోజు సాయంత్రం వేళ, ఇంటి ముందు పచ్చిక పైన తివాచీ పరిచి, బిడ్డను కూర్చో బెట్టి, బొమ్మలతో ఆడిస్తూ వుంది అనిత. రాహుల్ పార్కింగులో వున్న కారు నానుకుని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో కొరియర్ కుర్రవాడు గేటు తీసుకుని లోపలికి వచ్చాడు. అనిత లేచి పాకెట్ తీసుకుని ముంది గదిలో పెట్టడానికి వెళ్ళింది. కొరియర్ కుర్రవాడు గేటు తలుపు వేయకుండా వెళ్ళాడు. 


అదే అదనుగా బయట వున్న కుక్క ఒకటి లోపలికి వచ్చి పసి బిడ్డను కొరికి లాక్కు పోయింది. అది చూసి మరి కొన్ని కుక్కలు దాన్ని వెంబడించి బిడ్డకు గాయాలు చేసాయి. కుక్కల అరుపులకు హడిలిపోయి, అనిత పరుగున రాబోతూ చీర కుచ్చెళ్ళు అడ్డుపడి క్రిందకు పడిపోయింది. రాహుల్ మెరుపు వేగంతో కుక్కల వెంటబడ్డాడు. 


అటుగా వెడుతున్న ఒక యువకుడు ధైర్యం చేసి, కుక్కలను అదిలించి బిడ్దను వాటి బారినుంచి కాపాడాడు. ఏడుస్తూ ఆనిత, రాహుల్ దంపతులు, గాయాలతో రక్తమోడుతున్న బిడ్డను హాస్పిటలు లో జాయిన్ చేసారు. డాక్టర్లు వెంటనే వైద్యం ప్రారంభించారు. కుక్కలు బిడ్ద మెడ, ముఖం కొరికివేసాయి, మెదడుకు గాయ మైంది. బిడ్డ బ్రతకడం అనుమానమని చెప్పారు. 


గుండెలవిసేలా రోదిస్తున్న భార్యను రాహుల్ లేని ధైర్యాన్ని తెచ్చుకుని ఓదారుస్తున్నాడు. ఆ శిశువుకి కూడా అర్ధమైంది. తనకు మరణం ఆసన్నమవుతోందని. ఎలాగైనా బ్రతకాలి. ఏ దేవుడో, డాక్టరో వచ్చి తనకు ప్రాణ దానం చేస్తే బాగుణ్ణు. ఆ దేవుడిని ప్రార్ధించి, జీవించే వరమడగాలన్న కోర్కెతో బిడ్డ ఆక్రందనలు చేసాడు.. 


 ‘గజేంద్రుని కాపాడిన నారాయణా! మరణాన్ని నిలువరించి నన్ను కాపాడండి. 

మార్కండేయుని కాచిన మహా శివా, మృత్యంజయునిగా చేసి నన్ను రక్షించండి. 

 కరుణించు మాతా, దయామయీ అమ్మా! అమ్మా!’ 


కొద్ది సేపటికి యేడ్చే శక్తి పోయింది. వెక్కిళ్ళు పెడుతూ నిశ్శబ్దంగా, నిస్సహాయంగా. ఆ పసివాడు మూలిగాడు. క్రమంగా శరీరం నీలం రంగులోకి మారింది. మరణం అంచున వున్న ఆ బిడ్డ దీనంగా దేవుని అడిగాడు. 


"చనిపోయే ముందు అడిగిన కోరిక తీరుస్తారు కదా! నేనెందుకు చనిపోతున్నానో చెప్పు”


"అది దేవ రహస్యం. కేవలం పరమ జ్ణానులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. "


“కృష్ణావతారంలో దుష్టాత్ముడైన ధృతరాష్ట్రుడికి దివ్యదృష్టి నిచ్చి నీ విశ్వరూపం దర్శించే అదృష్టాన్నిచ్చావే. నాపై ఆ మాత్రం దయ చూపకూడదా?"


 దేవుడు భక్త సులభుడు. శరణు జొచ్చిన దీనులను కాపాడే దయా సముద్రుడు. కరుణించి యిలా చెప్పాడు. 


"వత్సా! గత జన్మలో, పదేళ్ళ వయసులో నీవు చేసిన పాప ఫలితమిది. నీ స్నేహితుడి బుజ్జి కుక్కపిల్లను అసూయతో, దొంగిలించి నీ గదిలో రహస్యంగా ఒక అలమారలో దాచావు. ఆ మరునాడే నీ తాత గారు మరణ దశలో వున్నారని తెలిసి నీ తల్లిదండ్రులు, నిన్ను తాత గారి వూరుకు తీసుకుని, వెళ్ళారు. 


పదిరోజుల తర్వాత తిరిగి వచ్చిన నీకు చచ్చిపడివున్న కుక్క పిల్ల కనబడింది. భయంతో ఒక రాత్రి దానిని ఒక నిర్జన స్థలంలో పాతి పెట్టావు. అలా నీ స్నేహితుడికి దుఃఖాన్ని, ఆ కుక్క పిల్లకు దుర్మరణాన్ని కలిగించడం ద్వారా నీవు మూట గట్టుకున్న ప్రారబ్ధ వికర్మ ఫలితమే ఈ దిక్కుమాలిన చావు”. 


 ప్రశ్నకు సమాధానం దొరికింది. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవ!


ఆ శిశువు ఆత్మ, శరీరాన్ని విడిచి బాహ్యప్రపంచంలోనికి వచ్చి, అక్కడే తచ్చాడ సాగింది. అది చూసి దేవుడు ఆత్మను అడిగాడు. 


"ఎందుకు యిక్కడ చక్రభ్రమణం చేస్తున్నావు?"


"నా తల్లి దండ్రుల కేమవుతుందో అన్న బాధ తో ఆగి పోయాను."


"అదే మీతో వచ్చిన చిక్కు. భౌతిక బంధాలు నశించినా, మానసిక బంధాలను త్రెంచుకోరు.”


“దేవా ! నన్ను మన్నిస్తే కొన్ని ప్రశ్నలడుగుతాను."


"సరే! అడుగు. విన్న తర్వాత సమాధానం చెప్తాను" 


"గత జన్మలో నా పాపానికి ఈ జన్మలో శిక్ష పడింది. అంటే నేను పూర్తిగా పాప విముక్తుడినయ్యాని అనుకోవచ్చా? నాకిక వేరే జన్మ వుండదని అనుకోవచ్చా?"

 

"సంచిత కర్మలో ఎంత భాగం ప్రారబ్ధంగా మారుతుందో, ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టం. అది కాలం నిర్ణయిస్తుంది. ” 


దేవుని అసంపూర్ణ, అస్పష్ట సమాధానంతో ఆశాభంగం చెందిన ఆత్మ జరుగుతున్నది గమనించ సాగింది. 

 @@@@


దినపత్రికలు, సాంఘిక మీడియా, శిశువు మరణం గురించి ఘోషించాయి. ఈ సంఘటన యెందరి మనసులనో కలచి వేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏటా 30, 000 కుక్క బాధితుల కేసులు నమోదవుతున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారని టీవీలో ఒక విమర్శకుడు విరుచుకు పడ్డాడు. 


"ఇదే అమెరికా వంటి దేశాలలో కుక్కలు రోడ్డు మీద వుండవు. ఇలాంటి కుక్క చావులుండవు. ఈ దేశంలో ఎక్కడ చూసినా కుక్కలు, పిల్లులు, తొండలు.. ఎప్పటికి బాగుపడేది?” అని ఒక విదేశీ ప్రేమికుడు ఛీత్కరించాడు. 


"చాల్లేవోయ్! నీ బడాయి మాటలు. టెన్నెసీ లో, నిద్రపోతున్న ఆరు వారాల పసిపాపను, పెంపుడు కుక్క కొరికి చంపేసింది. ఇలాంటి కేసులెన్నో వున్నాయి" అని ఒక స్వదేశీ ప్రేమికుడు అతని వాదాన్ని త్రిప్పి కొట్టాడు. 


కర్మ సిద్ధాంతాన్ని నమ్మే వారు, “కలికాలం! బాధ్యతా రాహిత్యం పెరిగిపోయింది. ఏదైతేనేం? శిశువు తన కర్మ ఫలాన్ని అనుభవించి వెళ్ళిపోయాడు. కర్మాను సారం, పునరపి మరణం, పునరపి జననం!" అని నిర్వేదం వ్యక్తం చేసారు. ఆ నిర్వేదం ఆవహించింది అనుకుంటా, ఆత్మ మరో ప్రశ్నలేకుండా, వినీలాకాశంలోనికి, విశ్వాంతరాళాలలోనికి దూసుకుని వెళ్ళింది. 


 @@@@

C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).


 


78 views0 comments

Comments


bottom of page