ప్రశ్నించు!ప్రశ్నించు!
- T. V. L. Gayathri
- 5 days ago
- 1 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #మరోప్రపంచం, #Prasninchu, #ప్రశ్నించు

గాయత్రి గారి కవితలు పార్ట్ 12
Prasninchu Prasninchu - Gayathri Gari Kavithalu Part 12 - New Telugu Poems Written By
T. V. L. Gayathri Published In manatelugukathalu.com On 10/04/2025
ప్రశ్నించు! ప్రశ్నించు! - గాయత్రి గారి కవితలు పార్ట్ 12 - తెలుగు కవితలు
రచన: T. V. L. గాయత్రి
ప్రశ్నించు! ప్రశ్నించు!
(వచనకవిత )
మనిషి మనిషికో కథ ఉంది
మదిమదికో వ్యధ ఉంది
పుడమిలో పుట్టు జీవులకు
పడుతున్న తీవ్ర బాధలకు
సాయమడుగుట లేదులే
వ్రాయబూనగ లిపి లేదలే!
బండరాళ్ళనడిగావా!
బయటపడని గాథలని
కొండలే మనకు చూపిస్తాయి!
గోడుమని విలపించి కంకరని!
భూమాతను నీవడుగుమా!
భుగభుగల మండే కథేమిటని?
గాలి దేవుడినడుగుతావా!
కాలుష్యానికున్న బరువెంతని?
పశువులకొక ప్రశ్న వేస్తావా!
పచ్చగడ్డి కనిపించిందా? అని
పక్షి జాతులను నిలదీయవా!
వాటి సహ జాతుల వివరాలని
మానులతో వెళ్లి మాటాడవా!
మహిలో తరిగిపోతున్నాయని
కడలిలో కెరటాలు చెబుతాయా!
కడుపులోని బడబానల కథలని
ప్రకృతిలోని జీవజాలములకు
సుకృతపు కాలమెప్పుడని?
ప్రశ్నించు!ప్రశ్నించు!ప్రశ్నించు!
ప్రశ్నలతో జవాబులు వెదుకు!//
************************************
వినుము మానవా!
(కవిత)

మత్తుమందులు త్రావి మరిచి పోయి జగము
చిత్తుచిత్తుగ మున్గి చిందులేయుచు సతము
పరుగుపెట్టుచు నుండ భవితవ్యమేలయా!
పరువుమర్యాదలే భస్మమౌ! వినుమయా!
పిల్లపాపలెప్పుడు భీతితో నేడ్వగా
ఇల్లాలు బెంగతో నీడ్చుచూ బ్రతుకగా
భావితరమును చూడ భయము వేయునుకదా!
జీవనంబెట్లనుచు చింత కల్గును కదా!
మారిపొమ్ము!మనిషీ! మత్తులోబడినీవు
దారితప్పిన వాడ! దగ్ధమై పోతావు!
కారు చీకటిలోన కలియునీ జీవితము
చేరువగును మృత్యువు ఛిద్రమౌ జీవనము
తెలిసికో మానవా!చెడుపనులు వీడుమా!
విలువైన ధర్మమును విడువక చరించుమా!
పిల్ల పాపల పెంచి ప్రేమగా మసలుకో!
చల్లగా జీవించి సంపదలు నిలుపుకో!//
*******************************

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments