వారం వారం బహుమతుల పథకంలో ఈ వారం ఉత్తమ కథగా (26/01/2025) ఎంపికైన కథ

Prayanam - New Telugu Story Written By - Bulusu Ravi Sarma
Published In manatelugukathalu.com On 20/01/2025
ప్రయాణం - తెలుగు కథ
రచన: బులుసు రవి శర్మ
రైలు ప్రయాణం అంటే నాకెంతో ఇష్టం. చలికాలం రైలు ప్రయాణం మరీ బాగుంటుంది. ఆఫీసు పని మీద హైదరాబాదు నుండి వైజాగ్ ప్రయాణం. సాయంత్రం రైలు ఎక్కితే తెల్లారే సరికి వైజాగ్ లో ఉంటాను. ఈ ప్రయాణాలు సడన్ గా కుదురుతాయి నాకు. రిజర్వేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఉదయం ఫోన్ చేసి “ వైజాగ్ చేరారా ?” అని అడుగుతాడు మా బాస్.
ఎలా చేరాను అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి ఉండదు అతనికి. పని అయిపోవాలి అంతే !
ఇంజను కి దగ్గరగా వున్న జనరల్ కంపార్టుమెంటు వైపు అడుగులు వేశాను. నా అదృష్టం! కూర్చోడానికి సీటు దొరికింది. కంపార్టుమెంటు శుభ్రం గానే వుంది.
పచ్చని పొలాలను రెండుగా చీలుస్తూ రైలు ముందుకు పరుగెడుతోంది. కిటికీ లోంచి వెచ్చని సాయంకాలపు ఎండ తొంగి తొంగి చూస్తోంది. చలికాలం కావడం వలన చీకటి తొందరగా రాజ్యం ఏలడానికి సన్నద్ధం అవుతోంది.
రాత్రంతా ఇలా కూర్చొని ప్రయాణం చెయ్యాలి. అనుకుంటూ వెనక్కు చారబడి కళ్ళు మూసాను.
“చాయ్.. చాయ్ “ అన్న అరుపుకి కళ్ళు తెరిచి చూసాను. చీకటి పడింది. ఏదో స్టేషన్ వచ్చింది కాబోలు. రైలాగింది. రంగు రంగుల కాంతులతో స్టేషన్ పెళ్లి పందిరిలా వుంది. నేను ఎక్కింది ఎక్స్ ప్రెస్ రైలయినా ప్రజల ఇంకా ప్రజా ప్రతినిధుల డిమాండ్ల కి రైల్వే శాఖ వారు సానుకూలంగా స్పందించి, చిన్న చిన్న స్టేషన్ లో కూడా రైలు ఆపుతున్నారు. రైలు ఆగింది. అంతవరకు ఖాళీగా వున్న కంపార్ట్ మెంట్ ఒక్క సారిగా జనంతో నిండి పోయింది. వృద్ధులు, మహిళలు, పిల్లలు, యువకులు.. ఒకరేమిటి, జనం.. జనం, భారతదేశపు జనాభా అంతా ఈ కంపార్ట్‌మెంట్ లోకి ఎక్కేశారా అన్నట్టుగా జనం నిండి పోయారు.
నాకు ఎక్కడలేని చిరాకు ముంచుకొచ్చింది. హాయిగా ప్రయాణం చేద్దామంటే ఈ జనం ఏమిటి. వచ్చిన వాళ్ళు విశాలంగా వున్న నా సీటుని ఆక్రమించడమే కాకుండా, నన్ను కిటికీ ప్రక్కకు నెట్టేసి, పైన సామానులు పెట్టుకునే చోటులో కూడా తిష్ట వేసి నానా హంగామా చేస్తున్నారు. దీనిని తోడు గవర్నమెంటు సారా దుకాణం రైల్లోకి చొరబడినట్లు అందరి ఊపిరినుండి ఒకటే వాసన, అదే కంపు, ముక్కుపూటాలని బ్రద్దలు చేస్తోంది. పైసనుండి శనక్కాయ తొక్కలు పూలవర్షంలా నా ముందు పడుతున్నాయి. ఎప్పుడు రైలు ఆగుతుందా, దిగి పారిపోదామా అని అనిపించింది.
అందరి వైపు పరీక్షగా చూసాను. ఫలానా పార్టీ గుర్తున్న ఒక బాడ్జ్ పెట్టుకొని వున్నారు. నా ఎదురుగా కాస్తా శుభ్రమైన లాల్చీ, పైజమా వేసుకున్న ఓ నలభై ఏళ్ల వ్యక్తి కూర్చొని వున్నాడు. చీకటిగా వున్నా నల్లటి కళ్ళజోడు పెట్టుకొని వున్నాడు. భుజానికి సంచీ, చేతిలో ఓ దిన పత్రిక. బహుశా ఇతనే వీళ్ళనందరిని కూడగట్టుకొని తీసుకువెళుతున్నాడా అని అనిపించింది.
“ఎక్కడి దాకా ప్రయాణం?” అడిగాను.
“వొయిజాగ్” అన్నాడు. అవకాశం ఇస్తే వైజాగ్ ని కొనేయగలనన్న ధీమా అతని జవాబులో వినిపించింది.
“మా పార్టీ లీడర్ రేపు వొయిజాగ్ వస్తున్నాడు సార్! రేలీ వుంది వొయిజాగ్ లో” అన్నాడు.
“మీ వూరినుండి ఎంతమంది వెళుతున్నారేమిటి?” అడిగాను.
“వందకు పైనే సార్. ఎంతమందిని తీసుకెళ్తే, నా కంత పేరు వస్తుంది ” అన్నాడు.
“మరి టిక్కట్లు? ఖర్చులు??” - అడిగాను.
“మనిషికి రెండొందలు ఇస్తారు సార్ ! ఖర్చులకి సరిపోతుంది.” నవ్వాడు.
“మరి టిక్కట్లో ”? అడిగాను.
నన్ను ఒక ఫూల్ ని చూసినట్లు చూసి, “టికెట్ ఎవరు తీస్తారు సార్.. పార్టీ రేలీ కదా? బొక్కలో ఏస్తారా, ఏయనీయండి.. ఇంతమందిని బొక్కలో ఏయగలరా?”.. నవ్వాడు.
“అవన్నీ మా పార్టీ చూసుకుంటుంది. వోయిజాగ్ వరకు టీ టీ ఈపెట్టెలోకి రాడు.. నాది పూచీ. ” భవిష్యత్తు దర్శనం చేసిన యోగిలా అన్నాడు.
అతని ధీమా చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వైజాగ్ వరకు నాకు ఈ బాధ తప్పదు అన్నమాట. పైనుండి శెనగ తొక్కల వర్షం ఎక్కువయింది. నాటు సారా కంపుకి కడుపులో వికారంగా వుంది. బాత్రూమ్ కి వెళదామంటే నా సీటుని ఎవరైనా ఆక్రమిస్తారన్న భయం. అయినా వీళ్ళందరినీ దాటుకుని వెళ్లడం అసాధ్యం. ఎక్కడ లేని చిరాకు పుట్టుకొచ్చింది. సడన్ గా వెళ్ళమని చెప్పిన మా బాస్ ని, వీళ్ళందరినీ, లైన్ గా నించో పెట్టి ఘాట్ చేద్దామని అనిపించింది.
“కొంచెం జరుగు బాబు. తల తిరగతా వుంది. నడుం చారేస్తాను. ”
నా ప్రక్కనే కూర్చొని వున్న ముసలి దాని మాట నాకు మరింత చీకాకు పెట్టింది. అప్పుడు చూసాను, ఆమె వయసు డభైకి పైనే ఉంటుంది. మాసిపోయిన చీర. రవిక లేదు. ముగ్గు బుట్ట వాటి తల.. ముడుతలు పడిన దేహం.. శ్రీ శ్రీ గారి “భిక్షు వర్షియసీ” జ్ఞాపకం వచ్చింది.
“జరుగుతాను లే, అయినా నువ్వు కూడా ర్యాలీకే?” నువ్వు అన్న పదం వత్తి పలుకుతూ అన్నాను.
అప్పుడు చూసాను. మాసిన ఆమె చీరకి కూడ ఒక బ్యాడ్జి పిన్నీసు పెట్టి వుంది.
“రేలీ వో గీలీ వో తెలవదు బాబు, పుట్టి ఎనబయి ఏల్లు అయిపోనాయి. రైలు బండి ఎప్పుడూ ఎక్కనేదు. ఇదిగిదిగో ఈ బాబు దయవల్ల ఎక్కడమయింది.”
నల్ల కళ్ళజోడు వ్యక్తి వైపు చూపించి గాలిలో రెండు చేతులెత్తి నమస్కారం పెట్టింది.
“నా కొక్కటే కోరిక బాబు. ఆ సీమ్మాసేలం అప్పన్నని ఓ పాలి దరసనం సేసుకుందామని. ఓపిక నేయకపోయినా ఈల్ల తో వొచ్చిసినాను. బండి ఎక్కడం తొలిసారి కదా. కళ్ళు తిరగతన్నాయి. నడుం సారేస్తాను. కొంచెం జరుగు బాబు.” పీలగా వుండే గొంతుకతో అంది.
నా మనసులో మెదిలే ప్రశ్నలు అన్నింటికీ జవాబు దొరికింది. ఈ ర్యాలీల వలన ఏం ప్రయోజనం వస్తుందో నాకు తెలియదు కానీ, ఈ ముసలమ్మ చిరకాల వాంఛ తీరబోతోంది అన్న ఆలోచన నాకు స్వాంతన ఇచ్చింది. రైలు ఏదో చిన్న స్టేషన్ లో ఆగినట్టు వుంది. జనాల్ని చీల్చుకుంటూ వడివడిగా దిగిపోయి స్లీపర్ క్లాస్ వైపు పరుగెత్తాను.
నా అదృష్టం కొద్ది, టీ టీ ఈ ఓ రెండొందలు ఎక్కువ తీసుకొని బెర్తు ఇచ్చాడు. నా శ్రీమతి కట్టి ఇచ్చిన ఉప్మా తినేసి, ఆ ముసలమ్మ గురించి ఆలోచిస్తూ ఉండగా ఎప్పుడు నిద్ర పట్టిందో నాకే తెలియదు.
తెలివి వచ్చేసరికి నాకు చిరపరిచితమైన విశాఖ పట్నం స్టేషన్ పరిసరాలు పలకరిస్తున్నాయి. నా బాగ్ తీసుకొని వడివడిగా నడిచాను. ర్యాలీ కోసం వచ్చిన వాళ్లతో స్టేషన్ కిక్కిరిసి వుంది. ఓవర్ బ్రిడ్జ్ మెట్లు ఎక్కుతుండగా క్రింద ఏదో కల కలం వినిపించింది.
అటుకేసి చూసి నిశ్చేష్టుడనయ్యాను.
రాత్రి నేను చూసిన వృద్ధురాలి చలనం లేని దేహాన్ని రైల్వే సిబ్బంది మోసుకెళుతున్నారు.
దూరంగా ఎక్కడో మైక్ లో “సింహాచలము.. మహా పుణ్య క్షేత్రము” అని ఘంటసాల గారి గొంతు వినిపిస్తోంది.
*****
బులుసు రవి శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు బులుసు రవి శర్మ
పుట్టింది, పెరిగింది బరంపురం (ఒడిశా)లో.
చదువు ఎం టెక్ సివిల్.
ఒడిశా ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా ఉద్యోగం.
ఒడియా మాధ్యమం లో చదువుకున్నప్పటికీ తెలుగు ఇంట్లో నేర్చుకుని కథలు, కవితలు, నాటికలు రాయడం, కొన్ని ప్రచురితం అవ్వడం జరిగాయి.
బరంపురం వికాసం కార్యదర్శి గా వున్నాను. రాయగడ స్పందన కార్యదర్శిగా సాహితీ కార్యక్రమాలు
పర్యవేక్షించాను.
ఫోటోగ్రఫీ, కార్టూన్, నాటకాలు , చిత్రలేఖనం హాబీలు.
మంచి తెలుగు కథలను షార్ట్ ఫిలిమ్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
రావి శాస్త్రి గారి కథలు, శ్రీ శ్రీ కవిత్వం
అంటే ప్రాణం.
@hanumantharao8631
• 42 minutes ago
కధ ఎంతచక్కగా ఉందోచదివినవారి స్వరం అంతే మధురంగావుంది..