top of page
Writer's pictureVasundhara

ప్రేమ ‘భ్రమ’రం - 11


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.








Youtube Video link

'Prema Bhramaram - 11' New Telugu Web


Series Written By Vasundhara


రచన: వసుంధర


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


వసుంధర గారి ప్రేమ ‘భ్రమ’రం ధారావాహిక పదకొండవ భాగం


గత ఎపిసోడ్ లో...

ముక్త నన్ను అర్జునుడికి గీతాబోధ చేసిన శ్రీకృష్ణుడితో పోలుస్తుంది.

ముక్త ప్రేమించింది అమోఘ్ అని తెలుసుకొని ఆశ్చర్య పోయాను. అమోఘ్‌, రిక్తలు కలిసిఉన్న ఫోటో తీసి, తనకు చూపమంటుంది ముక్త.

అమోఘ్ ఇంటికి వెళ్లి రిక్తను చూపమంటాను.

ఇక ప్రేమ ‘భ్రమ’రం పదకొండవ భాగం వినండి ...



రిక్త.

నా ఎదురుగా ఉంది.

భ్రమ కాదు. నిజంగా మనిషే!

ఈ విషయం తెలిస్తే - ముక్త ఏమౌతుంది?


‘‘నమస్తే’’ అన్నాను.

ఆమె బజ్జీ చేతిలోకి తీసుకుంది.

నేను, అమోఘ్‌ ఆమె ననుసరించాం.

ఆమెకి చాలా ఇష్టంలా ఉంది. వరుసగా నాలుగు బజ్జీలు తినేసింది.

ఇస్సు ఉస్సనలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు.

నాకు మిర్చిబజ్జీ ఇష్టమే కానీ - కాస్త కారంగా ఉంటే చాలు - నోరు మండుతుంది. తట్టుకోలేను.


ఆమెను చూసి ప్రభావితుణ్ణై - ఒక బజ్జీ కొరికాను.

చుర్రుమంది - మరో బైట్‌ తీసుకోవాలంటే భయం పుట్టేలా -

అమోఘ్‌ చెప్పినట్లు బజ్జీలో కొరివికారం కానీ కూరేరా?

కానీ రిక్త ఏమిటి - అంత సుకుమారంగా కనబడుతున్న ఆడపిల్ల - బజ్జీల్ని కసకస నమిలేస్తోంది.


నేను అసహాయంగా అమోఘ్‌ వంక చూశాను.

‘‘మేం కారం బాగా తింటాం. మీకు నప్పకపోతే - మొహమాటపడి తినద్దు’’ అన్నాడు అమోఘ్‌.


ఆ మాట రిక్తను సమర్థించడానికి అన్నట్లుంది.

ఎందుకంటే - తను కూడా మొదటి బజ్జీ సగమే తిన్నాడు.

నా అవస్థ కనిపెట్టిన అమోఘ్‌ రూప వంక చూస్తే - ఆమె లోపలికెళ్లి - మరో గిన్నెడు బజ్జీలు తెచ్చింది.


‘‘భయపడద్దు. ఇవి అరటికాయ బజ్జీలు’’ అన్నాడు అమోఘ్‌.

మేమిద్దరం వాటిమీద పడ్డాం.


ఈలోగా రిక్త మిర్చిబజ్జీల గిన్నె కాళీ చేసేసింది.

అంతవరకూ ఆమె మమ్మల్ని పట్టించుకోలేదు.


‘‘మిర్చిబజ్జీని చూస్తే తనకి పూనకం వస్తుంది’’ అన్నాడు అమోఘ్‌.

తినడమయ్యేక ఆమె సోఫాలో వెనక్కి వాలింది.

పరవశంతో కాబోలు కళ్లు మూసుకుంది.


ఆమె ప్రవర్తన నాకు చిత్రంగా అనిపించింది.

ఆమె మామూలు మనిషేనా? లేక చిత్తచాంచల్యముందా?

‘‘రికూ’’ అన్నాడు అమోఘ్‌.


ఆమె కనులు తెరిచింది.

మమ్మల్నిద్దర్నీ చూసి, ఏదో గుర్తు చేసుకుందుకు ప్రయత్నిస్తున్నట్లు చూసింది.

‘‘విచల్‌ అన్నయ్య’’ అన్నాడు అమోఘ్‌.

గుర్తొచ్చింది నాకు - అంతవరకూ తనామెకి నన్ను పరిచయం చెయ్యలేదని.


‘‘నమస్తే’’ అన్నాను మళ్లీ.

అప్పటికే ఆమె కళ్లు మూసుకోబోతోంది. నేను నమస్తే అనేసరికి కళ్లు మూతలు పడ్డాయి.

నన్ను గమనించిందో లేదో కానీ - నమస్తే చెబుతుండగా అనిపించింది - ఎక్కడో తనని చూసేనని.


‘ఎక్కడ చూసేనబ్బా’ అనుకుంటున్నాను కానీ స్ఫురించడం లేదు.

‘అందమైన ఆడపిల్లలు అంతా ఒకేలాగుంటారు. అందాల పోటీల్లో చూడలేదూ?’ అంది మనసు.


నిజమే - కానీ అందాల పోటీల్లో - వాళ్ల ముఖాలు చూసేలా ఉంటారా?

అందరి వళ్లూ ఇంచుమించు ఒక్కలాగే ఉంటుంది.

అక్కడ ప్రదర్శన కూడా ‘ఒంటి’దే!

మరి రిక్తని ఎక్కడ చూశాను?


‘‘రికూ - విచల్‌ అన్నయ్య’’ మరోసారి అన్నాడు అమోఘ్‌.

రిక్త కళ్లు తెరిచి ప్రసన్నంగా నవ్వింది. ‘‘అన్నయ్యని చూడాలనుంది’’ అంది.

ఎదురుగా నన్ను పెట్టుకుని అన్నయ్యని చూడాలనుందని అంటుందేమిటి?

నాలో ఆమెకి అన్నయ్య కనబడలేదా?


అమోఘ్‌ - వరస కలపకుండా - ఉత్త పేరుతోనే పరిచయం చేస్తే సరిపోయేదేమో.....

‘‘ఈ ఆదివారం కాక పై ఆదివారం - మనం మీవాళ్లని చూడ్డానికి వెడుతున్నాం. అన్నయ్యని కూడా చూడొచ్చు’’ అన్నాడు అమోఘ్‌.


ఓహో - అన్నయ్యంటే - ఆమె అన్నయ్యని అన్న మాట!

పాపం - ప్రేమ పేరు చెప్పి అంతగా ఇష్టపడే తోడబుట్టినవాడికి దూరమైంది.


‘‘నిజంగా?’’ అందామె నమ్మలేనట్లు. ముఖం నిండా బోలెడు సంతోషం.

‘‘చెప్పరా చెప్పు. నువ్వేకదా తీసుకెడుతున్నావు మమ్మల్ని’’ అన్నాడు ఆమోఘ్‌.


ఏకవచన ప్రయోగం - అదీ - ఎన్నాళ్లనుంచో ఎరిగున్నట్లు - ‘రా’ అని.

ఆర్థం చేసుకోవాలనో ఏమో అమోఘ్‌ నన్ను చూసి కన్ను కూడా గీటాడు.

ఆమెను ఏమార్చడానికి నా సాయం తీసుకుంటున్నాడని అర్థమై, ‘‘ఊఁ’’ అన్నాను అన్యమనస్కంగా.


‘‘చూశావా, నన్ను నమ్మకపోతే - ఈ అన్నయ్య మాటలైనా నమ్మాలి’’ అన్నాడు అమోఘ్‌.

‘‘నీకోసం మావాళ్లనందర్నీ కాదని వచ్చిన నేను నిన్ను నమ్మకపోవడమా?’’ చప్పున అంది రిక్త.


‘‘థాంక్యూ. మరి ఈ అన్నయ్యతో మనమో సెల్ఫీ తీసుకుందామా?’’ అన్నాడు అమోఘ్‌.

‘‘నాతో సెల్ఫీనా - అంటే మనమిక సేఫ్‌ జోన్‌లోకి వచ్చేశామన్న మాట! అంటే ఈ అన్నయ్య మనల్ని మా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్లడంలో నాకిక అణుమాత్రం సందేహం లేదు’’ అని ఆమె చప్పున లేచి నిలబడింది.


ఆ లేవడంలో సొగసు.

ఆ సొగసు ఎక్కడో చూశాను.


లేచి నిలబడిన ఆ మనిషి ఎంత బాగుందో!

ఆ మనిషిని ఎక్కడో చూశాను.


చూశానో చూశానని భ్రమ పడుతున్నానో - కానీ నా ఎదుటనున్న ఈమెని భ్రమ అని ఎలాగనుకోవడం?

నాకలాంటి అనుమానముందని అమోఘ్‌కి తెలిసిందా?


అడక్కుండానే తన భార్యతో సెల్ఫీ అంటున్నాడు - నా అనుమానం తీర్చడానికా?

అమోఘ్‌ తనూ లేచాడు.

ఆమె అతడి పక్కన నిలబడింది.


చూడ ముచ్చటగా ఉంది జంట. నా దిష్టే తగిలేలా ఉంది.

‘రేపు నాకు పెళ్లయితే - మా జంట కూడా ఇంత బాగుండాలి’ అనుకుంటూ - నేను అమోఘ్‌కి ఇవతలపక్క నిలబడ్డాను.


ఆమోఘ్‌ అడిగి నా మొబైల్‌ తీసుకున్నాడు. మా ముగ్గురికీ సెల్ఫీ తీసుకున్నాడు.

‘‘వచ్చే ఆదివారం కాక, ఆ పై ఆదివారం - మా అన్నయ్యతో కూడా ఇలాగే సెల్ఫీ దిగాలి’’ అందామె.


పరిణతి చెందిన యువతి మాటలా లేదు. చిన్నపిల్ల ముచ్చటలా ఉంది.

‘‘ష్యూర్‌’’ అన్నాడు అమోఘ్‌.


‘‘మరి నేను వెళ్లి కాసేపు పడుకోనా?’’ అంది రిక్త.

‘‘ఊఁ’’ అన్నాడు అమోఘ్‌.

ఆమె నాకు బై చెప్పింది.


తను వెడుతుంటే అమోఘ్‌ రూప వైపు తిరిగి, ‘‘రూపా! కొంచెం తనని చూసుకో’’ అన్నాడు.

రూప కూడా అక్కణ్ణించి వెళ్లిపోయింది.

‘‘నాతో వచ్చేసేక రిక్త తనవాళ్లకోసం బెంగెట్టుకుంది’’ అన్నాడు అమోఘ్‌.

నాకు జాలేసింది.


అంతా స్వయంకృతం.

కొన్ని రోజులు మాత్రమే పరిచయమైన అమోఘ్‌ కోసం - చిన్నప్పటి అనుబంధాలన్నీ తెంచుకుని వచ్చేసింది.


ఇప్పుడు మానసికంగా క్షోభ ఆనుభవిస్తూ మరీ చిన్నపిల్లలా ప్రవర్తిస్తోంది.

‘‘కానీ మరీ చిన్నపిల్లలా......’’ అని ఇంకా అనబోతుంటే....


‘‘నిజానికామెది బెంగ కాదు. వివిత్రమైన మానసిక స్థితి’’ అన్నాడు అమోఘ్‌.

అతడు చెబుతుంటే - ఆశ్చర్యంగా విన్నాను.


ఆమె తనవాళ్లని అమితంగా ప్రేమించింది. వాళ్లు తనేమడిగినా కాదనరనుకుంది. ఆ నమ్మకంతోనే అమోఘ్‌ని ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పింది.

ఆ తర్వాత వాళ్ల ప్రవర్తన ఆమె నమ్మకంమీద పెద్ద దెబ్బ తీసింది.

అమోఘ్‌ని పెళ్లి చేసుకుంటే - ఆమెను తన చేతులతో గొంతు పిసికి చంపేస్తానన్నాడు ఆమె అన్నయ్య.


ఆమెకి కోపం, ఉక్రోషం, పట్టుదల వచ్చాయి. అమోఘ్‌తో వచ్చేసింది.

ఆ తర్వాత ఆమెకి అన్నయ్యనుంచి డెత్‌ త్రెట్‌ ఫోన్లు.


ఆ బాధనుంచి తప్పించుకుందుకు - ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు ఆమె అన్నని నమ్మించాడు ఆమోఘ్‌.


దానికి బదులుగా ఆమె అన్న పంపిన సందేశం - ఆమెను నిలువెల్లా కదిలించింది.

‘‘ఆత్మహత్య చేసుకుని - నన్ను హంతకుడు కాకుండా కాపాడింది. దానికి నా ధన్యవాదాలు చెప్పు. ఒకవేళ అది చచ్చిన మాట నిజం కాకపోతే - మీరిద్దరూ ఎక్కడైనా జంటగా కనిపించారో - ఇద్దర్నీ కలిపి చంపేసి సంతోషంగా జైలుకి వెడతాను’’


ఈ సందేశం చూసి రిక్త బాగా అప్సెట్టయింది.

ఎక్కడో విన్నట్లుంది ఈ కథ!

గుర్తొచ్చింది.


కిషోర్‌ తండ్రిని కలుసుకుందుకు వెడుతున్నప్పుడు రైలు ప్రయాణంలో -

టెర్రరిస్టుగా అనుమానించబడ్డ ఓ ముసుగు వనిత - క్షణం పాటు ముసుగు తొలగిస్తే -

ఆమె రిక్త.


పేరు రిక్తని తెలియదు కానీ - ఆమెదీ ఇదే కథ!


ఆ కథలో ఆమె ప్రియుణ్ణి కాదని - బావని పెళ్లి చేసుకుని అజ్ఞాతంగా కాపురం చేస్తోంది.

ఈ కథలో ఆమె పెద్దల్ని కాదని - అమోఘ్‌ని పెళ్లి చేసుకుని అజ్ఞాతంగా కాపురం చేస్తోంది.

ఇద్దరూ ఒక్కరే ఐతే - ఆమె బావని పెళ్లి చేసుకుందా, అమోఘ్‌ని పెళ్లి చేసుకుందా?

నేను ట్రయిన్లో రిక్తని చూశాను. అది భ్రమ కాకపోతే, ఇప్పుడు రిక్తని చూడ్డం భ్రమ!

ఇప్పుడు రిక్తని చూడ్డం భ్రమ కాకపోతే, అప్పుడు ట్రయిన్లో రిక్తను చూడ్డం భ్రమ!

అసలు నేను భ్రమ పడ్డానా, లేక - రిక్త తన బావ దగ్గర్నుంచి పారిపోయి, అమోఘ్‌ దగ్గరకొచ్చేసిందా?


రకరకాల ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది.

నేనాలోచిస్తూనే ఉన్నాను - అమోఘ్‌ రిక్త కథ చెప్పుకుపోతున్నాడు.

రిక్తకి చిన్నప్పట్నించీ తన అన్నయ్యంటే చాలా ఇష్టం.

వాళ్లిద్దరి మధ్యా గుర్తుండిపోయే తీపి జ్ఞాపకాలు ఒకటా, రెండా....


అలాంటి అన్నయ్య ఇప్పుడు తననింతగా ద్వేషిస్తున్నాడన్న భావన ఆమెని వేధిస్తోంది.

ఆమె భయం - అతడు తననేదో చేస్తాడని కాదు - తనకీ అతడిమీద ద్వేషం పుడుతుందేమోనని....


అందుకే ఆమె మనసు తరచుగా బాల్యంలోకి వెడుతోంది.

అప్పటి జ్ఞాపకాల్ని స్ఫురణకు తెచ్చుకుని, వర్తమానంలా ఆస్వాదిస్తోంది.

ఐతే అప్పుడప్పుడు వాస్తవం స్ఫురించక మానదు కదా....

అప్పుడా జ్ఞాపకాలు మాయమై - తన జీవితం అజ్ఞాతమని గుర్తొస్తుంది.

గుర్తుకి రాగానే మనసామెను బాల్యంలోకి తీసుకెళ్లిపోతుంది.


ప్రస్తుతం ఆమె మనసులో గతానికీ, వర్తమానానికీ మధ్య సంఘర్షణ జరుగుతోంది.

ఆమె పాత జ్ఞాపకాల్లో ఉన్నప్పుడు, ఆమోఘ్‌ ఆమెను వాస్తవంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యడు.

ఆమెను పసిపాపలాగే లాలిస్తాడు.


అమోఘ్‌ ఈ వివరాలన్నీ చెబుతుంటే - నేను కాసేపు ఇక్కడ నేను చూసిన రిక్త - నిజమా, భ్రమా అన్న ఆలోచనని వెనక్కి నెట్టి అమోఘ్‌ గురించి ఆలోచించడం మొదలెట్టాను.

ఎంత గొప్ప ప్రేమికుడు అమోఘ్‌!


కానీ - ప్రేమతో అతడు సాధించినదేమిటి?

నిజానికి మనిషికి జీవితం అపూర్వమైన వరం.

ఆ వరబలంతో - ఎన్నో గొప్ప పనులు చెయ్యొచ్చు.

ప్రజా నాయకుడై దీనజనుల్ని ఉద్ధరించొచ్చు.


కళాకారుడై - రసహృదయుల్ని అలరించొచ్చు.

శాస్త్రజ్ఞుడై - ప్రంచానికి ఉపయోగపడే ప్రయోగాలు చెయ్యొచ్చు.

వైద్యుడై - అనారోగ్యంపై సమరశంఖం పూరించొచ్చు.

ఒకటా - రెండా - సాధించడానికి జీవితంలో ఎన్నో లక్ష్యాలు, అవకాశాలు ఉన్నాయి.


అన్నింటినీ కాలరాస్తున్న - ఈ ప్రేమవల్ల ప్రయోజనమేమిటి?

అది మనిషిలోని ప్రతిభని మట్టికొట్టుకు పోయేలా చేసి, నిర్వీర్యం చేసి - ఈ ప్రపంచానికి ఎందుకూ పనికరాకుండా చేస్తోంది.


రిక్త అనే ఒక అమ్మాయి - ఎదిగిన వయసులో మానసికంగా తిరోగమనం చెంది - పసిపాపలా మారిపోతే దానివల్ల ఏం ప్రయోజనం?


రిక్త ఆ స్థితికి రావడానికి కారణమై - ఆమె ఆ స్థితికి వచ్చేక ఆమెకు ఆసరాగా ఉండడానికి మాత్రమే తన జీవితాన్ని అంకితం చేసిన అమోఘ్‌ వల్ల ఈ ప్రపంచానికి ఏం ప్రయోజనం?

రిక్త అనే పాత్ర భ్రమ అయితే - నా ఈ ఆలోచనలన్నీ వృథా.


ఐతే - ఇప్పుడు నావద్ద రిక్తతో తీసుకున్న సెల్ఫీ ఉంది.

అది ముక్తకి చూపిస్తాను. ఆమెను ప్రేమమైకంనుంచి బయట పడేస్తాను.


అలా ఆమెను ప్రేమ రాకాసినుంచి కాపాడితే, సమాజానికి కొంతైనా ప్రయోజనముండొచ్చు.

‘‘మరి నేను సెలవు తీసుకోవచ్చా?’’ అన్నాను అమోఘ్‌తో.


‘‘అదేమిటీ - భోజనానికని పిలిచాను కదా, భోంచేసే వెళ్లాలి’’ అన్నాడు అమోఘ్‌.

అంతలా గుర్తుంచుకున్నప్పుడు కాదంటే ఏం బాగుంటుంది?

సరేనన్నాను.


భోజనం ఏర్పాట్లు రూప చేసింది.

రిక్త మరి మాతో కలవలేదు.


పరిస్థితి అర్థమైంది కాబట్టి నేను కూడా బలవంతపెట్టలేదు.

వీలు చూసుకుని మధ్యలో - రిక్తతో నా సెల్ఫీ - ముక్తకి పంపేశాను.

భోజనాలయ్యాయి కానీ నా దృష్టి తిండిమీద లేదు. అన్యమనస్కంగా ఉన్నాను.


వెళ్లేటప్పుడు అన్నాడు అమోఘ్‌ - ‘‘రూప ఇంతసేపు ఉండిపోవాల్సి వస్తుందనుకోలేదు. మీరామెని వాళ్లింటి దగ్గర డ్రాప్‌ చెయ్యగలరా?’’

ఆమె అంతసేపుండిపోవాలని ముందే తెలియదా?


రూప భోజనం సిద్ధం చేస్తే, రిక్త వడ్డిస్తుందని అతడనుకున్నాడా?

బజ్జీలే వడ్డించని మనిషి భోజనం వడ్డిస్తుందని ఎలా అనుకున్నాడు?

చాలా అనుమానాలొచ్చాయి.


కానీ అతడు ఇది కూడా కావాలని చేసుండొచ్చన్న అనుమానం మాత్రం నాకు కలగలేదు.

‘‘రూపకి ప్రోబ్లం లేకపోతే, నాకేం ప్రోబ్లం లేదు’’ అన్నాను.

- - - - -

జీవితంలో అసాధారణమనుకున్న సంఘటనలు కొన్ని పేలవంగా గడిచిపోతాయి.

సాధారణమనుకున్నవి షాకిస్తాయి.

రూపని వాళ్లింటి దగ్గర డ్రాప్‌ చెయ్యడం - సాధారణమైన విశేషమని నేననుకున్నాను.

బైక్‌మీద నేను. నా వెనుక రూప.


అరిచితులైన ఆడపిల్లలకి కూడా బైక్‌మీద లిఫ్టివ్వడం ఆధునిక సంస్కృతిలో మామూలైపోయిన ఓ భాగం.

నాకేం కొత్తగా అనిపించలేదు.


అమోఘ్‌ ఇంట్లో నిశ్శబ్దంగా ఉంది కానీ రూప వాగుడుకాయ.

బైక్‌మీద కూర్చున్నప్పుడు బైక్‌ చప్పుణ్ణి మించిన గొంతుతో అనర్ఘళంగా మాట్లాడగల అమ్మాయి.


అమోఘ్‌ ఇంట్లో అపరిచితురాలిగా అనిపించిన ఆమె - బైక్‌మీద నాకు సుపరిచితురాలైపోయింది.

ముందామె తనకి లిఫ్టిస్తున్నందుకు థాంక్స్‌ చెప్పింది.


‘‘మీరు కూడా నాకు థాంక్స్‌ చెప్పాలి. నేను లిఫ్ట్‌కి ఒప్పుకున్నందుకు’’ అని చిలిపిగా అంది.

తన గురించి కాక ఎక్కువగా అమోఘ్‌ గురించి మాట్లాడింది.


ఆ మాటల్లో, ‘‘అమోఘ్‌ చాలా మంచి మనిషి. అతడికిలాంటి పరిస్థితి రాకూడదు’’ అని నిట్టూర్చింది.

‘‘నిజమే - బ్రతికున్న భార్యని చనిపోయినట్లు చెప్పుకోవడం....’’ అని నేనేదో అనబోతే -

‘‘మీరు నిజంగా అమోఘ్‌కి చాలా మంచి మిత్రులు’’ అని కిలకిల నవ్వింది రూప.


నేనన్న మాటలు నన్నతడికి ఎలా మంచిమిత్రుణ్ణి చేశాయో - ఆ మాటలో కిలకిల నవ్వాల్సినంత విషయమేముందో అర్థం కాలేదు.

అదే ఆమెకి చెప్పాను.


‘‘మీకేం తెలుసో నాకు తెలుసు. నాకేం తెలుసో మీకు తెలుసు. ఇంకా మనమధ్య ఈ నాటకాలు దేనికి?’’ అందామె.

‘‘నాటకాలా?’’ అన్నాను ఆశ్చర్యంగా.


అప్పుడామె చెప్పిన విశేషం ఓ పెద్ద షాక్‌.

అమోఘ్‌కి పెళ్లయిందో లేదో ఆమెకి తెలియదు. కానీ - ఆ ఇంట్లో అతడొక్కడే ఉంటున్నాడు.


రిక్త ఉందని చెబుతాడు. రిక్తతో మాట్లాడతాడు.

కానీ అదంతా అతడి భ్రమ!


‘‘అమోఘ్‌ ఆ ఇంట్లో రిక్త అనే ఓ యువతి ఉన్నట్లే మసలుతాడు. ఆమెతో మాట్లాడతాడు. నాచేత ఆమెకు సపర్యలు కూడా చేయిస్తాడు’’ అందామె.


‘‘ఆ విషయం నాకూ తెలుసు. కాని రిక్త అతడి భ్రమ అని ఎందుకనుకున్నారు?’’ అన్నాను.

‘‘ఎందుకంటే - ఆమె నాకు ఒక్కసారి కూడా కంటికి కనిపించలేదు’’ అందామె.

ఉలిక్కిపడ్డాను.


నిజం చెబుతోందా? జోక్‌ చేస్తోందా?

‘‘ఔనా, ఐతే కంటికి కనిపించని మనిషిని చూస్తున్నట్లు నటించడం చాలా కష్టం కదా’’ అన్నాను.


‘‘కష్టం నాకు. మీక్కాదు’’ అందామె.

‘‘ఆదేమిటి? అలాంటిది ఎవరికైనా కష్టమేగా’’ అన్నాను.


‘‘ఏమో, ఇందాకా మీరు అమోఘ్‌ ఇంట్లో రిక్తను చూసినట్లు నటించారే - అప్పుడది నటనలా అనిపించలేదు. ఆరితేరిన నటుడి హావభావాల్ని ప్రదర్శించిన మీ ప్రతిభకు నాక్కలిగిన ఆశ్చర్యమింతా అంతా కాదు. మిమ్మల్ని అభినందించాలనిపించినా, అమోఘ్‌ ఎదుట కుదరదని ఊరుకున్నాను. ఇదిగో, ఇప్పుడిలా లిఫ్టు దొరకడంవల్ల ఆ అవకాశం కూడా వచ్చింది. అంతా నా సంకల్పబలం’’ అందామె.

బైక్‌కి సడెన్‌ బ్రేక్‌ వేసాను.


‘‘ఏమిటి - బండి ఇలా మధ్యలో ఆపేశారు?’’ అందామె.

‘‘ఆపలేదు, మీరిచ్చిన షాక్‌కి సడెన్‌ బ్రెక్‌ దానంతటదే పడి బండి ఆగిపోయింది’’ అన్నాను.

‘‘నేను షాకేమిచ్చాను?’’ అందామె.


‘‘నాకు కనబడ్డ రిక్త మీకు కనబడలేదంటే - నాకు షాక్‌ కొట్టదా?’’ అన్నాను.

‘‘ముందు బండి స్టార్ట్‌ చెయ్యండి’’ అంది రూప.


ఆట్టే పరిచయం లేని ఓ ఆడపిల్లని తీసుకెడుతూ - నడి రోడ్డుమీద బండి ఆపడం - అదీ రాత్రిపూట - బాగుండదని గ్రహించినవాడనై - వెంటనే బైక్‌ స్టార్ట్‌ చేశాను.

కానీ మేం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకని స్పీడు బాగా తగ్గించాను.

‘‘అమోఘ్‌ దగ్గర సరే, నా దగ్గర కూడా మీరు నటించాలా?’’ అంది రూప.


‘‘అంటే - నిజంగానే రిక్త మీకు కనబడలేదా?’’ అన్నాను.

‘‘బాబోయ్‌, అలా అనకండి. మీరామెని నిజంగానే చూశానంటే, ఆ ఇంట్లో దయ్యం తిరుగుతోందని నమ్మాలి. మరోసారి ఆ ఇంటికెళ్లాలంటే భయమేస్తుంది. మావాళ్లకి మంచి బేరం పోతుంది’’ అంది రూప.


అంతా చిత్రంగా ఉంది నాకు.

ఆమె నాతో పరిహాసమాడుతోందా?

ఆమె వాగుడుకాయ కావచ్చు. కానీ ఆట్టే పరిచయం లేని నాతో పరిహాసమాడే చనువు చేస్తుందా?


‘‘మీరు నిజంగా రిక్తని చూసి ఉండకపోతే - నాదో చిన్న అనుమానం. అమోఘ్‌ ప్రవర్తనవల్ల మీకెప్పుడూ - ఆ ఇంట్లో దయ్యముందన్న భయం కలుగలేదా?’’ అన్నాను.

‘‘భయమెందుకూ - అమోఘ్‌కి సైకలాజికల్‌ ప్రోబ్లం ఉందని నాకు తెలుసుగా’’ అంది రూప.

ఇది మరో కొత్త కబురు.


‘‘అమోఘ్‌కి సైకలాజికల్‌ ప్రోబ్లమా?’’ అన్నాను.

‘‘అయ్యో - మీకు నిజంగా తెలియదా? మీరూ నాకులాగే ఆ ఇంటికొస్తున్నారనుకున్నానే’’ అంది రూప.


అమోఘ్‌కి సైకలాజికల్‌ ప్రోబ్లం.

రూప ఆ ఇంటికి రావడానికి అదీ ఒక కారణం.

నేనూ తనకిలాగే ఆ ఇంటికొస్తున్నానని రూప అనుకుంటోంది.

ఇప్పుడు రూప ఆ వివరాలు చెబుతోంది.

- - - - -

అమోఘ్‌, రిక్త ప్రేమించుకున్నారు.

కానీ రిక్త పెద్దల అభీష్టానికి తలొంచి - వేరే పెళ్లి చేసుకుంది.

ఆ విషయం తెలిసినా అమోఘ్‌ జీర్ణించుకోలేకపోయాడు.


అతగాడికి అదో పెద్ద షాక్‌. ఆ షాక్‌లోనే కోమాలోకి వెళ్లిపోయాడు.

వారం తర్వాత అతడికి స్పృహ వచ్చింది. కళ్లు తెరుస్తూనే అతడు తన పక్కనున్న రిక్తని చూసి ఎంతో ఆనందపడ్డాడు.


తనకి స్పృహ తప్పితే దగ్గరుండి వారం రోజులు నిద్రాహారాలు లేకుండా సేవలు చేసిందని ఆమెకు కృతజ్ఞతలు చెప్పాడు.

ఎవరికీ కనిపించని రిక్త అతడికి కనిపించడమేమిటని తలిదండ్రులు వ్యథ చెందారు. కొడుకు పిచ్చివాడయ్యేడా అని కంగారు పడ్డారు.


డాక్టర్లు అతణ్ణి సైకియాట్రిస్టు చక్రధర్‌కి రిఫర్‌ చేశారు.

ఆయన అతడితో ఒంటరిగా రెండు రాత్రులూ, రెండు పగళ్లూ గడిపేక - ‘‘మీవాడు పూర్తి నార్మల్‌. కానీ అతడు రిక్త తనతో ఉందని భ్రమ పడుతున్నాడు. కొంత కాలమైనా ఆ భ్రమని కాపాడ్డం మన బాధ్యత. లేకుంటే అతడు నిజంగా పిచ్చివాడైపోయే ప్రమాదముంది’’ అని తలిదండ్రులకి చెప్పాడు.


ఆ భ్రమని కాపాడ్డమెలాగో అతణ్ణి కన్నవారికి తెలియలేదు.

చక్రధర్‌ అమోఘ్‌తో మరో రెండ్రోజులు గడిపేక ఆయనకి అతడి మనఃస్థితిపై పూర్తి అవగాహన వచ్చింది.


అమోఘ్‌-రిక్తల పెళ్లికి పెద్దలు తీవ్రవ్యతిరిక్తత చూపడమే - ప్రస్తుత స్థితికి కారణం.

రిక్త ఆడపిల్ల కాబట్టి కొంతలో కొంత సద్దుకుపోగలిగింది.

అమోఘ్‌ మాత్రం రిక్త లేకుండా బ్రతకలేననే మనఃస్థితినుంచి బయటపడలేకపోతున్నాడు.


రిక్తకి పెళ్లయిన విషయం అంతరాంతరాల్లో అతడికి తెలుసు.

బ్రతకాలన్న కాంక్ష కూడా అంతరాంతరాల్లో ఉంది. ఆ కాంక్ష అతణ్ణి - ఆమెకింకా పెళ్లి కాలేదన్న భ్రమలో ఉంచుతోంది.


ఆమె భర్తతో ఉంటోందన్న నిజాన్ని జీర్ణించుకోలేక, ఆమె తనతోనే ఉంటోందన్న భ్రమకి ఊపిరి పోశాడు.

ఈ భ్రమలనుంచి అతణ్ణి బయట పడెయ్యాలంటే - అందుకు మానసిక చికిత్స అవసరం.

చక్రధర్‌ - ఆ చికిత్సకు ఓ పథకం తయారు చేసి పెద్దలముందుంచాడు.


ఆ ప్రకారం - అటు రిక్త ఇంట్లో, ఇటు అమోఘ్‌ ఇంట్లో - పెద్దల ఆలోచనల్లో ఏ మార్పూ లేదు.

వాళ్లు ఇప్పటికీ అమోఘ్‌-రిక్తల పెళ్లిని వ్యతిరేకిస్తున్నారు.


ఇంట్లోంచి వెలి వెయ్యడంనుంచి, అవసరమైతే వాళ్లని చంపేదాకా వెనుకాడని పరిస్థితి.

తనతో రిక్త ఉందని అమోఘ్‌ నమ్ముతున్నాడు.

ఆమెను రక్షించాల్సిన బాధ్యత తీసుకున్నాడు.


రిక్త అతడితో వచ్చేస్తే చక్రధర్‌ సాయంతో వాళ్లిద్దరికీ రహస్యంగా పెళ్లి జరిగింది.

చక్రధర్‌ సాయంతో అతడు వేరే ఊరెళ్లి రిక్తతో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు.


అయినవాళ్లు వేధించకుండా రిక్త చనిపోయిందని వాళ్లకి కబురు తెలిసేలా చేశాడు.

ఆమెను అజ్ఞాతంగా తనింట్లో ఉంచినట్లు నమ్మడాన్ని ఇష్టపడుతున్నాడు.

అంతరాంతరాల్లో అతడికి తెలుసు - తనది భ్రమ అని!


తనది భ్రమ కాదని నిరూపించుకుందుకు పలువిధాల ప్రయత్నిస్తుంటాడు.

ఎందుకంటే - తన భ్రమను తనతోపాటు మరికొందరైనా నిజమని నమ్మితే తప్ప అతడి మనసుకి తృప్తి ఉండదు.


అతడి ఈ ప్రయత్నాలకి చక్రధర్‌ సహకరిస్తున్నాడు.

అప్పుడప్పుడు రూప అమోఘ్‌ ఇంటికి రావడం కూడా - అమోఘ్‌ భ్రమలకి మద్దతునివ్వడం కోసమే!

- - - - -

రూప కథ చెప్పడం ఐపోయింది.


ఇంకా ఉంది...


వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

వసుంధర పరిచయం: మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.



28 views0 comments

Comments


bottom of page