కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Prema Bhramaram - 2' New Telugu Web
Series Written By Vasundhara
రచన: వసుంధర
వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం రెండవ భాగం
గత ఎపిసోడ్ లో...
నా పేరు విచల్.
నేను ఒక మందుల తయారీ కర్మాగారంలో మంచి పదవిలో ఉన్నాను.
నా కజిన్ పేరు పద్మ.
ఆమె తనకు బావ వరస అయిన కవన్ ని ప్రేమించింది.
కానీ తను ముక్త అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెబుతాడు కవన్.
ముక్త మనసును కవన్ మీదనుండి మళ్ళించమని నన్ను కోరుతుంది పద్మ.
ఆలా చేస్తే కవన్ తనను ప్రేమిస్తాడని ఆమె ఆశ.
ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాను నేను.
ఇక ప్రేమ‘భ్రమ’రం రెండవ భాగం చదవండి ...
పద్మ నాకు అప్పగించిన బాధ్యత నా ఆలోచనల మూలాల్నే కదిలించింది.
ఆడవాళ్లంటే నాకు బిడియమని గట్టిగా నమ్ముతాను. కానీ ఒక ఆడపిల్ల పద్మతో నాకు దగ్గర స్నేహమే ఉంది. ఎంత దగ్గరంటే - ఆమెకి నావద్ద తన ప్రేమకథను వినిపించేటంత చొరవుంది.
బిడియమైతే ఆమెతో అంతసేపు ఎలా మాట్లాడతాను- అదీ ప్రేమ గురించి...
అది చాలదన్నట్లు - నేను కూడా ఆమె దగ్గర చొరవ చేసి - నాకో ప్రియురాల్ని వెదికిపెట్టమన్నాను. నిజంగా నేను బిడియస్థుణ్ణేనా?
నా మనసు నవ్వి, ‘‘ఈ సందేహం ఇప్పుడొచ్చిందా - ఎప్పుడో రావాలి కదా!’’ అంది.
అన్నది నా మనసు కాబట్టి - ఆ మాట సరయు గురించేనని నాకు వెంటనే అర్థమైంది.
సరయు మా పెదనాన్నగారమ్మాయి.
అందంగా ఉంటుంది. నోరారా నన్ను అన్నయ్యా అని పిలుస్తుంది. తోడబుట్టినది కాకపోయినా - వయసొచ్చేక కూడా నాకు తను చెల్లి అనిపిస్తుందే తప్ప - ఏ ఫీలింగ్సూ కలుగవు. వరసల సంప్రదాయంలో అదో ఉదాత్త భావం.
సరయుకి నేనంటే ఇష్టమే కాదు, ఆరాధనాభావం కూడా ఉంది.
చిన్నప్పట్నించీ నేనేం చెప్పినా బుద్ధిగా వినేది. సరయు తమ మాట విననప్పుడు పెద్దలు దానికి నాచేత చెప్పించేవారు.
అది ఈ కాలపు ఆడపిల్ల.
వాళ్లింట్లో ఇంకా సంధికాలం నడుస్తోంది. అంటే పూర్వ సంప్రదాయాల్ని పూర్తిగా సమర్థించనూ లేరు, విస్మరించనూ లేరు.
ఆ సందిగ్ధంలో సరయుకీ, తలిదండ్రులకీ చిన్న చిన్న గొడవలొచ్చేవి.
కూతురి మాటల్లో న్యాయం లేకపోలేదని పెద్దలకు తెలుసు. తలిదండ్రుల మాటల్ని గడ్డిపోచలా తీసెయ్యడం సరయుకి ఇష్టముండదు.
అలాంటప్పుడు ఆ రెండు తరాలకీ వారధిగా నేనుపయోగపడేవాణ్ణి.
నేను ఈ తరం మనిషిని.
చాలావరకూ పాత తరాన్ని సమర్ధిస్తాను. అందుకని సరయుకి నచ్చజెప్పడానికి నన్ను ఆశ్రయించేవాడు పెదనాన్న.
అలాంటి సందర్భమొకటి సరయు బీటెక్ ప్యాసవగానే వచ్చింది.
కాంపస్ ఇంటర్వ్యూల్లో ఒకచోట కాదు, మూడుచోట్ల సెలక్టయింది. ఉద్యోగాలు సిద్ధంగానే ఉన్నాయి కానీ దానికింకా పై చదువులు చదవాలనుంది. ప్రొఫెషనల్సు సలహా తీసుకుని రెస్యూమే తయారు చేసి అమెరికాకి అప్లై చేసింది.
సీటొస్తే ఎమో కానీ - దానికి ఎయిడ్ కూడా వచ్చింది.
ఈరోజుల్లో చాలామంది పైచదువులకని స్వంత డబ్బులు పెట్టుకుని అమెరికా వెడుతున్నారు. బ్యాంకులు కూడా ఉదారంగా ఋణాలిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో - ఎయిడ్ తెచ్చుకున్న సరయు అమెరికా వెడతానని పట్టుబట్టడం సహజం.
పెళ్లయ్యేదాకా ఆడపిల్లని ఒంటరిగా అమెరికా పంపడం మా పెదనాన్నకిష్టం లేదు.
ముందు పెద్దమ్మచేత చెప్పించాడు. తర్వాత తనే చెప్పాడు.
పై చదువులయ్యేదాకా పెళ్లి మాటెత్తొద్దని సరయు గట్టిగా చెప్పింది.
పెదనాన్న, పెద్దమ్మ నన్ను పిలిచారు. ‘‘నీ మాటంటే దానికి గురి. అమెరికా వెళ్లడానికి ముందే పెళ్లి చేసుకునేలా దాన్ని ఒప్పించాలి’’ అన్నారు.
తోడబుట్టిన చెల్లే నా మాట వినదు. సరయు నాకు తోడబుట్టినదేం కాదు.
సరయుకి నా మాటంటే గురి ఉన్న మాట నిజం. అంతవరకూ నేనిచ్చిన సలహాలన్నీ - కర్ర విరక్కుండా, పాము చావకుండా - ఎంతోకొంత దానికి అనుకూలంగా ఉండేవి కాబట్టి - అది నా మాట వినేది.
తన జీవితానికి సంబంధించిన పెద్ద విషయాల్లో వేలెట్టానంటే - తను నా మాట వింటుందనుకునేటంత అమాయకుణ్ణి కాను నేను.
కానీ పెద్దవాడు పెదనాన్న - నామీద అంత నమ్మకం పెట్టుకోవడంతో - కాదనలేకపోయాను. ఎలాగో అలా నా తెలివినీ, లౌక్యాన్నీ ఉపయోగించి - ఆయన్ని సంతోషపెట్టాలనుకున్నాను.
సరేనని పెదనాన్నకి చెప్పి - ఓసారి యథాలాపంగా అన్నట్లు సరయుని పలకరించి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అడిగాను.
ఒక్కసారిగా సరయు కళ్లలో మెరుపు.
భవిష్యత్తు గురించి తనకున్న కలల్ని ఏకరువు పెడుతుంటే - ఆ గొంతులో చెప్పలేనంత ఉత్సాహం.
అప్పుడు నేను తనవంక అబ్బురంగా చూసాను.
ఆ కళ్లలో మెరుపునీ, ఆ గొంతులో ఉత్సాహాన్నీ చెడగొట్డం నావల్లనౌతుందా అనిపించింది.
సరయు ఆడది కాకుండా మగాడై ఉంటే - నేను నా అభిప్రాయాల్ని తనమీద రుద్దే ప్రయత్నం చేసేవాణ్ణేమో మరి!
ఆ క్షణంలో మాత్రం నాకు స్పష్టమయింది - సరయు నా మాటలకు నొచ్చుకున్నా, నావల్ల బాధపడ్డా, నా గురించి చెడ్డగా అనుకున్నా తట్టుకోలేనని.
అది ప్రేమ కాదు. మోహం కాదు. ఆకర్షణ కాదు. అది బాహ్యానికి మించిన ఓ ప్రత్యేక అనుభూతి.
సరయు చెప్పింది శ్రద్ధగా, ఆసక్తిగా విన్నాను.
తన భవిష్యత్తుపై అంత స్పష్టత ఉన్న ఆమెని చూస్తే ముచ్చటేసింది.
తర్వాత సరయుని సమర్థించడమే కాదు - సరయు పెళ్లిని వాయిదా వేసి, ముందు దాన్ని అమెరికా పంపడానికి పెదనాన్నని కూడా ఒప్పించాలనుకున్నాను.
అప్పుడది నాకు కృతజ్ఞతలు తెలిపితే - అదో అపూర్వానందం.
పెదనాన్నని ఒప్పించడం మరీ అంత సులభమేం కాదు. అక్కడే కొంత లౌక్యం, కొంత తెలివి ఉపయోగించాను. అందుకు కారణం - నాలో చిన్న అపరాధ భావం ఉండడం. అదేమిటంటే -
అమెరికా వెళ్లేక సరయు అక్కడ ప్రేమలో పడదన్న గ్యారంటీ లేదు. ఆదే జరిగితే - పెదనాన్న తట్టుకోలేడు. అంతే కాదు - ఆ విషయమై కూతురికంటే ఎక్కువగా నన్నే తప్పు పడతాడు.
అందులో న్యాయముంది కూడా!
ప్రస్తుతం సరయు దృష్టంతా పైచదువులమీదే ఉంది.
ఎలాగో అలా అమెరికా వెళ్లాలి. అందుకు తలిదండ్రులు ఒప్పుకోవాలి.
‘‘నాన్నని నేనొప్పిస్తాను. కానీ నాకు నువ్వో మాటివ్వాలి’’ అన్నాను సరయుతో.
ఏం మాటివ్వాలని అడగలేదు సరయు. తండ్రిని ఒప్పిస్తాననగానే దాని కళ్లు కృతజ్ఞతాభావంతో నిండిపోయాయి. ‘‘నాన్ననిందుకు ఒప్పించావంటే - నువ్వేం చెబితే అది చేస్తాను’’ అంది.
గొంతుని బట్టి మనస్ఫూర్తిగా అన్నట్లు తోచింది. ఆ వేడిమీదున్నప్పుడే చెప్పాల్సింది చెప్పాలి.
‘‘నా మాటమీద పెదనాన్న నిన్ను అమెరికా పంపిస్తున్నాడు. అక్కడికెళ్లేక ఏ పనిమీద వెళ్లావో ఆ పనిమీదే దృష్టి పెట్టు. స్వతంత్రంగా ఉన్నాను కదా అని మిగతా విషయాలన్నింటిలోనూ స్వతంత్రించకు. ముఖ్యంగా పెళ్లి విషయం నాన్నకి వదిలేయ్. ఆయన నీ బాగు కోరినవాడు. మంచి సంబంధం చూస్తాడు. నీకు నచ్చినవాణ్ణే చూస్తాడు’’ అన్నాను.
అన్నాను కానీ తనేమంటుందోనని మనసులో కొంచెం బెంగ.
సరయు నవ్వింది, ‘‘మాటివ్వమన్నప్పుడే అనుకున్నాను. ఏ విషయంలోనైనా నువ్వు చాలా లోతుగానూ, న్యాయంగానూ ఆలోచిస్తావని. మా విచల్ అన్నయ్యపై నా అంచనాలెప్పుడూ తప్పవని మరోసారి నిజమైంది’’ అంది.
అప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు.
అటు సరయు కోరికా తీరింది. ఇటు పెదనాన్న మనసుకీ కొంత తృప్తి లభిస్తుంది.
‘‘మరి నేను నాన్నతో మాట్లాడనా?’’ అన్నాను.
‘‘మాట్లాడేముందు నాదో చిన్న షరతు’’ అంది సరయు.
‘‘షరతా?’’ అన్నాను నీరసంగా.
సరయు చాలా తెలివైన పిల్ల. షరతు పెట్టిందంటే ఏదో తిరకాసుండకపోదు.
‘‘నువ్వు మాటిమ్మన్నావు. మారుమాట లేకుండా సరేనన్నాను. నువ్వేమిటీ, నేను మాటిమ్మనగానే ఆలా నీరసపడిపోయావ్’’ అంది సరయు నిష్ఠూరంగా.
‘‘నేనిచ్చే మాట పెదనాన్నకి కూడా ఓకే కావాలిగా - అందుకని కొంచెం తటపటాయిస్తున్నాను’’ అన్నాను.
‘‘నేను షరతు పెట్టడం నీకిష్టం లేకపోతే, నో కండిషన్స్, సరేనా!’’ అంది సరయు.
‘‘అదేమిటీ, షరతు విషయంలో అప్పుడే మనసు మార్చుకున్నావా?’’ అన్నాను.
‘‘నీమీద నాకున్న నమ్మకం, నామీద నీకు లేదు. అందుకే షరతు ఆనగానే ఏం షరతో అని గాబరా పడుతున్నావ్. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టముండదు. నా ఫ్యూచర్ విషయంలో నువ్వే నిర్ణయం తీసుకున్నా అది సరైనదే అయుంటుందని నాకు తెలుసు. అందుకని....’’ అంది సరయు.
చాలా తెలివిగా మాట్లాడింది.
నామీద తనకి నమ్మకముంది. షరతు కూడా విత్‌డ్రా చేసుకుంది. తనమీద నాకు నమ్మకం లేదు. షరతు కూడా చెప్పమనడం లేదు.
నాకే న్యాయంగా అనిపించక, ‘‘సరేలే, నీ షరతు ఏదైనా నాకూ ఓకే. చెప్పేసేయ్’’ అన్నాను.
అనేసి మేకపోతు గాంభీర్యం వహించాను కానీ - పెదనాన్న నాకిచ్చిన పెద్దరికం నిలుపుకోగలనా అని - మనసులో బెంగగానే ఉంది. కానీ సరయు షరతు వినగానే నా అనుమానం అర్థరహితమని తేలిపోయింది.
పెదనాన్న తనకే సంబంధం చూసినా సరే - నేను కూడా అప్రూవ్ చేస్తేనే ఒప్పుకుంటుందిట. ‘‘నీకు ఓకే ఐతే - ఏ సంబంధాన్నయినా కళ్లు మూసుకుని ఓకే చేసేస్తాను’’ అంది సరయు.
ఉప్పొంగిపోయాను.
‘‘నువ్వు సామాన్య మహిళవి కాదు. అలాంటి నువ్వు నాకింత గౌరవమిచ్చావు. ఇన్నాళ్లూ అనుకోలేదు కానీ - నేను నిజంగా గొప్పవాణ్ణేమోనని ఇప్పుడనిపిస్తోంది’’ అన్నాను సరయుతో.
సరయు వెంటనే, ‘‘గొప్పవాళ్లకి తమ గొప్పతనం గురించి తెలియకపోవడం హనుమంతుడి కాలంనుంచీ జరుగుతోంది. చిన్నప్పట్నించి తెలుసు నువ్వు నాకు. నీ గొప్పతనం గురించి ఎప్పుడూ అనుమానం లేదు. అందుకే నా పెళ్లి విషయం నీకొదిలేశాను’’ అంది.
దానికి పురాణకథలు బాగానే తెలుసు. వాటిని సమయానుకూలంగా వాడడమూ బాగా తెలుసు.
నన్నది హనుమంతుడంతటివాడితో పోల్చిందని మురిసిపోతుండగా - ‘‘కానీ....’’ అని ఓ క్షణం ఆగింది.
ఎవరైనా ఓ మాట చెప్పి ‘కానీ’ అంటే నాకు చాలా భయం. ఓ ‘కానీ’ ఒకోసారి జాతకాల్నే మార్చేస్తుంది.
‘‘ఊఁ ...’కానీ’ - ఆ తర్వాతేంటో చెప్పు’’ అన్నాను ఆత్రుతగా.
అప్పుడు సరయు చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడింది.
తనిప్పుడు చదువులో ఓ స్థాయికి చేరింది. సంపాదన పరంగా స్వతంత్రురాలు. సాంఘికంగా ఆంక్షలు బహు తక్కువుండే అమెరికాలో ఉండబోతోంది.
ఆలోచనలు మారొచ్చు. అభిప్రాయాలు మారొచ్చు. అంతవరకూ అనుసరించిన సంప్రదాయాలు సిల్లీగా తోచవచ్చు.
‘‘ఐనా నేను నీకిచ్చిన మాటకి కట్టుబడతాను. అదీ నాకు నీమీదున్న గౌరవం. కానీ....’’ ఆగింది సరయు.
‘‘ఊఁ - మళ్లీ ఈ ‘కానీ’ ఏమిటి?’’
‘‘ఒకవేళ అక్కడ నేను అనుకోకుండా ప్రేమలో పడ్డాననుకో. ఐనా ప్రేమకంటే ఎక్కువగా నీ మాటకే కట్టుబడతాను. కానీ.....’’
ఎందుకు మాటిమాటికీ ‘కానీ’లతో విషయాన్ని నాన్చుతోంది? ఏంచెప్పబోతోంది తను?
మనసుకి ఆదుర్దాగా ఉన్నా నేనేం మాట్లాడలేదు. చెప్పమన్నట్లు చూశాను.
‘‘నా పెళ్లి వివాదాస్పదమైతే కనుక - నిర్ణయం నీకే వదిలినా - ఆ నిర్ణయాన్ని అమలు చెయ్యడం మాత్రం నీకు పెళ్లయ్యేకనే’’ అంది సరయు.
ఈ మాత్రం చెప్పడానికి ఇంతలా ఎందుకు సంకోచించిందో అనుకుంటూనే - ‘‘బాగుంది. నీ పెళ్లికీ, నా పెళ్లికీ మధ్య ఈ లంకె ఏమిటి?’’ అన్నాను.
నిజంగానే అర్థం కాక అడిగాను. కానీ ఆమె ఇచ్చిన వివరణ నన్ను నివ్వెరపోయేలా చేసింది?
స్త్రీకి సమాన హక్కులున్నాయంటున్న ఈ ఆధునిక సమాజంలో -
మహిళలు - చదువులో, సంపాదనలో, బాధ్యతానిర్వహణలో - పురుషులతో పోటీ పడి - బహుథా వారిని మించిపోతున్న తరుణంలో -
ఒక ఆధునిక యువతి, విద్యాధికురాలు గురౌతున్న అసహాయతను పరోక్షంగా చెప్పిందామె. అదేమిటంటే -
నేను కూపస్థ మండూకాన్ని కాదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటానని తను గట్టిగా నమ్ముతుంది. అలాంటి నేను పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటే అదే సరైనదని తను అనుకుంటుంది.
‘‘ఒకవేళ నువ్వు ప్రేమ పెళ్లి చేసుకున్నావనుకో - ఈ కాలానికి అది సరైన నిర్ణయమని నమ్మి నిన్ననుసరిస్తాను. అలా కాక పెద్దలు చూసిన పిల్లనే చేసుకున్నావనుకో - నేను నా ప్రేమకి గుడ్‌బై చెప్పి - నీ మాటకి కట్టుబడతాను’’ అంది సరయు.
‘‘అమ్మ సరయూ!’’ ఆనుకున్నాను.
చాలా తెలివిగా తను నాకో సవాలు విసిరింది. ‘ఉపదేశాలకు కాదు, ఆచరణకే విలువ’ అని తెలివిగా సూచించింది. నేను నా గౌరవం నిలబెట్టుకోవాలని హెచ్చరించింది.
ఆప్పుడే నాలో చిన్న అనుమానం కూడా మొలకెత్తింది.
సరయు ఇప్పటికే ప్రేమలో పడలేదు కదా! ఆ ప్రేమ కోసమే ఇండియానుంచి అమెరికా వెళ్లిపోవడం లేదు కదా! నేను తప్పక ప్రేమలో పడతాననీ, నేను ప్రేమ పెళ్లి చేసుకుంటే తన ప్రేమకి క్లియరెన్సు వచ్చినట్లేననీ అనుకోవడం లేదు కదా!
ఆమె నాకు ముందరి కాళ్లకి బంధం వెయ్యాలని చూస్తోంది. లేకుంటే ఇలాంటి షరతొకటి పెట్టదు.
నేను కనుక పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకుంటే - ఆమె నాకు వెయ్యాలనుకున్న బంధం ఆమె ప్రేమకి ప్రతిబంధకమౌతుంది. అంటే తన వేలితో తన కన్నే పొడుచుకున్నట్లవుతుంది.
‘‘నువ్వు నాకిచ్చిన గౌరవానికి థాంక్స్ సరయూ! నేనది తప్పక నిలబెట్టుకుంటాను’’ అన్నాను.
కానీ అప్పుడు నా పరిస్థితేమిటంటే -
నేను కనుక నిజంగా ప్రేమలో పడితే - అమ్మా నాన్నలే కాదు - పెదనాన్న, దొడ్డమ్మలు కుడా దారుణంగా అప్సెట్టవుతారు.
పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకోవడం ఇప్పుడు నా బాధ్యత.
నా వ్యక్తిత్వాన్ని ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన అప్పుడే బలపడింది. అప్పట్నించీ ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకంగా ఆలోచించడమే కాదు - మాట్లాడ్డం కూడా మొదలెట్టాను. అలా మా బంధు, మిత్ర వర్గాల్లో - సంప్రదాయవాదినన్న ముద్ర ఒకటి నామీద పడింది. తొందరలొనే అదే స్థాయికి చేరుకుందంటే....
ఒక రోజు నాకు రమణయ్య అనే వ్యక్తినుంచి ఫోనొచ్చింది.
‘‘రమణయ్యంటే ఎవరు?’’ అన్నాను అర్థం కాక.
‘‘కాలేజిలో నీ క్లాస్‌మేట్ కిషోర్ లేడూ - వాడి నాన్నని’’ అన్నాడాయన.
కిషోర్ నాకు తెలియకేం - కాలేజిలో నాకు క్లాస్‌మేటే కాదు. ప్రస్తుతం - వేర్వేరు కంపెనీల్లోనే ఐనా ఒకే ఊళ్లో ఉద్యోగాలు చేస్తున్నాం.
‘‘ఉన్నపళంగా బయల్దేరి మా ఇంటికి రాగలవా?’’ అన్నాడాయన.
భూకంపం వచ్చిన చోటునుంచి మాట్లాడినట్లుంది గొంతు.
కిషోర్ గురించి మా ఇంట్లోనూ, నా గురించి వాళ్లింట్లోనూ బాగా తెలుసు. కానీ మా రెండు కుటుంబాలకీ పెద్దగా పరిచయాలు లేవు.
ఆయన నన్ను వాళ్లింటికి రమ్మనమనడం, అదీ అర్జంటుగా రమ్మనడం ఆశ్చర్యమే. ఆయన గొంతులోని కలవరమూ ఆశ్చర్యమే!
‘‘ఏమయిందంకుల్!’’ అన్నాను.
‘‘ఇప్పుడు టైం ఆరయింది. మా ఊరు రావడానికి తొమ్మిదింటికి ట్రయినుంది. ఏసీ చెయిర్ కార్లో ఐతే - అప్పటికప్పుడు సీట్లు దొరుకుతాయి. రాగలవా?’’ అన్నాడాయన.
ఆయన ఆత్రుత చుసి ఏమనాలో తెలియలేదు. సీట్లు దొరక్కపోతే - జనరల్ కంపార్టుమెంట్లోనైనా వెళ్లి తీరాలని మాత్రం అనిపించింది...
‘‘సరే, అంకుల్!’’ అన్నాను.
‘‘థాంక్యూ బాబూ! ఐతే, ఒక్క మాట - నేను నీకిలా ఫోన్ చేసినట్లు - కిషోర్‌కి చెప్పకు’’ అన్నాడాయన.
నాకు మరింత ఆశ్చర్యం.
బంధువుని కాను. పెద్దగా పరిచయస్థుణ్ణి కాను. కొడుక్కి కూడా తెలియకుండా నాతో మాట్లాడాల్సినదేముంటుంది?
సమాధానం ఆలోచనలకు అందదని తెలుసును కానీ - నాలో చిన్న అనుమానమొకటి కలక్కపోలేదు.
ఐతే - కిషోర్ తండ్రి కూడా నన్ను ముక్త వైపే నడిపిస్తాడని అప్పుడు నాకు తెలియదు.
ఆ రైలు ప్రయాణం - నాకు అనుకోని పరిచయాల్నీ, అనుభవాల్నీ కలిగిస్తాయనీ -
అవి నేనిరుక్కోబోయే ప్రేమజాలంలో - ఉహించని పాత్ర వహిస్తాయనీ కూడా అప్పుడు నాకు తెలియదు.
- - - - -
ట్రయినెక్కి నంబర్లు చూసుకుంటూ నా సీటు చేరుకున్నాను.
వరుసగా మూడు సీట్లు.
విండో పక్కన ఓ యువకుడు కూర్చున్నాడు. పాంటు, షర్టులో ఉన్నాడు కానీ నుదుటికి కుంకుమబొట్టుంది.
భక్తుడై ఉంటాడు - ప్రయాణానికి ముందు దేవుడి దర్శనం చేసుకొచ్చినట్లున్నాడు.
అతడికివతల ఓ యువతి కూర్చుంది. చేతులు లేతగా ఉన్నాయి కాబట్టి ఇరవైకి కాస్త అటూఇటూలో ఉండొచ్చు.
మొహం కనిపించకుండా ముసుగు గెడ్డం కిందదాకా లాక్కుంది.
ఆమె పక్క సీటు నాది.
నేను కూర్చోబోతుంటే - ‘‘మీకు విండో సీటు కావాలా?’’ అన్నాడా యువకుడు.
‘‘ఫరవాలేదు. మీరు ఉంచుకోండి’’ అన్నాను ఆఫర్ అనుకుని.
‘‘తనకి విండో సీటు ఇష్టముండదు. మీకు అభ్యంతరం లేకపోతే సీట్లు మార్చుకుందాం’’ అన్నాడతడు.
అర్థమైంది. నేనా యువతి పక్కన కూర్చోవడం అతడికిష్టం లేదు. అది మామూలే కూడా!
తప్పనిసరై కుర్చున్నాడు కానీ తనకీ విండో సీటు ఇష్టమున్నట్లు లేదు.
కాళీ సీట్లోకి ఆడవాళ్లు వస్తారనుకున్నట్లున్నారు. నేను రావడంతో ఎక్స్‌ఛేంజి ఆలోచన వచ్చింది.
లేచి అటూ ఇటూ తిరగాలంటే మనుషుల్ని తప్పించుకుంటూ వెళ్లాలని - సాధారణంగా విండో సీటు ఇష్టపడను నేను.
ఇప్పుడు కాదంటే మాత్రం - అమ్మాయి పక్కన కూర్చునే అవకాశం వదులుకోవడం ఇష్టం లేదని అపార్థం చేసుకునే అవకాశముంది. అది నాకిష్టం లేక, సరేనన్నాను.
అప్పుడు వాళ్లిద్దరూ లేచి బైటకొచ్చారు.
నేను విండో సీట్లో, అతడు నా పక్కన, ఆమె అతడి పక్కన.
ట్రయిన్ కదిలింది.
వాళ్లిద్దరూ ఒకరిమీదకు ఒకరు వంగి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు.
ఇలాంటి దృశ్యాలు - బస్సుల్లో, ట్రయిన్సులో, పార్కుల్లో, థియేటర్లలో చాలాసార్లే చూశాను.
కొత్త దంపతుల మధ్య చూడముచ్చటగానూ, పాత దంపతులమధ్య ఆహ్లాదంగానూ అనిపించే దృశ్యాలవి. నాకవి ఎంతో ఇష్టం.
పెళ్లి చేసుకుని అలాంటి దృశ్యానికి కర్తని అవాలని నాకు తరచుగా అనిపిస్తూంటుంది.
ఆ యువకుడు బాగున్నాడు.
ఆమె చేతులు చూశాను, ముఖం కనబడలేదు. కనబడకుండా ప్రత్యేకమైన జాగ్రత్త కూడా తీసుకుంటోంది.
అదంత విశేషమని ముందు అనుకోలేదు కానీ - ట్రయిన్ బయల్దేరిన అరగంటకి మా బోగీలోకి యూనిఫాంలో ఉన్న పోలీసులు దూసుకొచ్చారు. ఒకో సీటుకే వచ్చి - ప్రయాణీకుల ముఖాలు చూసి వెడుతున్నారు.
అలా మా సీటుకీ వస్తే - ఆ యువతి మేలిముసుగు తియ్యడానికి నిరాకరించింది.
‘‘బయటికొస్తే నా భార్య మేలిముసుగు తియ్యదు’’ అని ఆ యువకుడు కూడా ఆమెను సమర్థించాడు.
‘‘ముసుగు తీసి ముఖం చూడనివ్వకపోతే - మిమ్మల్ని అరెస్టు చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది’’ అని కాస్త కటువుగానే చెప్పాడు పోలీసు అధికారి.
‘‘ఇది మా సంప్రదాయం. మీరు మా సంప్రదాయాన్ని విభేదించడం తప్పు. ఆపైన పరాయి మహిళని మేలిముసుగు తీసి మొహం చూపించమనడం ఇంకా తప్పు. అందుకొప్పుకోలేదని మమ్మల్ని అరెస్టు చేస్తాననడం - మీ అధికార దుర్వినియోగం. నా నేపథ్యం మీకు తెలియదు. మిమ్మల్ని కోర్టుకీడ్చి రభస చెయ్యగలను’’ అన్నాడా యువకుడు దృఢంగా.
ఆ అధికారి చలించలేదు, ‘‘ఈ ట్రయిన్లో కొందరు టెర్రరిస్టులు ప్రయాణం చేస్తున్నట్లు మాకు సమాచారం అందింది. వాళ్ల ఫొటోలు కూడా మాకు అందాయి. వాళ్లని గుర్తించడానికి ప్రతి ప్రయాణీకుణ్ణీ చెక్ చెయ్యడం మా బాధ్యత. మీలాంటివాళ్ల తాటాకు చప్పుళ్లకి బెదరం’’ అన్నాడు.
అతడి మాటలో అధికారగర్వం లేదు. తక్కువ స్వరంలో వినయంగా చెప్పాడు.
‘‘ఆయ్యో - ఈ మాట ముందే చెప్పాల్సింది’’ అన్నాడా యువకుడు.
‘‘ప్రత్యేకించి రభస చేస్తే తప్ప ఇలాంటివి గుట్టుగా ఉంచుతాం. సామాన్య జనం పానిక్ అయ్యే ప్రమాదముంది’’ అన్నాడా అధికారి.
ఆమె మేలిముసుగు తొలగించింది.
కుతూహలం. ఎవరేమనుకుంటారన్న మొహమాటం కూడా లేకుండా నేనామె మొహం చూశాను. మళ్లీ చూడ్డానికి వీలు పడదేమోనన్న ఆత్రంతో చూశాను.
మనిషి రూపసి. చూడగానే గుర్తుండిపోయే బెదురు చూపులు. ఆమెను టెర్రరిస్టుగా అనుమానించేవాళ్లని తలచుకుంటేనే నవ్వొస్తుంది.
పోలీసు అధికారి ఆమెతో, ‘‘సారీ ఫర్ ది డిస్టర్బెన్స్’’ అని వెళ్లిపోయాడు.
ఆ యువకుడు అనవసరంగా పోలీసుల దగ్గర సీన్ క్రియేట్ చేశాడనిపించింది. కానీ నేనేమీ అనలేదు.
కొద్ది నిముషాలు గడిచేక - ఆ యువకుడు నావైపు తిరిగి, ‘‘తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందంటారు’’ అని నిట్టూర్చాడు.
‘‘ఏమయిందిప్పుడు?’’ అన్నాను నాకా విషయం ఆలోచనలోకే రానట్లు.
‘‘కొంత కాలంగా నా భార్య అజ్ఞాతంలో ఉంటోంది. అందుకే బయటికొచ్చినప్పుడు ఈ ముసుగు. పొలీసులు అడగ్గానే మొహం చూపిస్తే సరిపోయేది. అనవసరంగా జరగాల్సిన దానికంటే ఎక్కువ ప్రచారమైంది’’
ఇక కుతూహలం ఆపుకోలేక, ‘‘మీరిద్దరూ దంపతులే కదా, మీకక్కర్లేని అజ్ఞాతం మీ భార్యకెందుకు?’’ అన్నాను.
నా అనుమానమైతే - అతడు పురుషాహంకారి. తన భార్య మొహం ఇతరుల కంటబడ్డం ఇష్టంలేదు. అలాంటివాళ్లు మా బంధువుల్లో నా ఈడువాళ్లలోనే కొందరున్నారు కాబట్టి అదో విశేషమూ కాదు.
అతడు మాత్రం నేనూహించని జవాబిచ్చాడు.
ఆ ప్రకారం అతడా యువతికి బావ ఔతాడు. ఆమెని చిన్నప్పట్నించీ ఇష్టపడ్డాడు.
చిన్నప్పుడు ఆమె కూడా అతడంటే ఇష్టపడేది. పెద్దయ్యేక ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ యువకుడైతే ఆమెని పిచ్చిపిచ్చిగా ప్రేమించాడు.
వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వచ్చేసరికి - పెద్దలు కలగజేసుకున్నారు. ఆ పెళ్లి అటు పెద్దలకీ, ఇటు పెద్దలకీ కూడా సుతరామూ ఇష్టం లేదు.
‘‘ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం’’ అని ప్రియుడా యువతిని బలవంతపెట్టాడు.
వాళ్లిద్దరూ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
వెయ్యికళ్లతో కనిపెడుతున్న పెద్దలామెని చివరి క్షణంలో పట్టుకున్నారు.
ఎవరెన్ని చెప్పినా వినే మనస్థితిలో లేదామె.
అప్పుడామె తలిదండ్రులు - ‘‘నువ్వీ పెళ్లి చేసుకుంటే మేం చస్తాం’’ అని బెదిరించారు.
ఆమె అన్న, ‘‘నువ్వీ పెళ్లి చేసుకుంటే - వాణ్ణి చంపేస్తాను’’ అన్నాడు.
ఆమె హడిలిపోయింది. ప్రేమమైకంలోంచి బయటపడింది. తలిదండ్రుల మాట వింటానంది.
‘‘నాకు తనంటే ఇష్టం. తన ప్రేమ తాత్కాలికమని నాకు తెలుసు. నేను పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ...’’
ప్రేమించుట పిల్లల వంతు, కాదనడం పెద్దల వంతు...
కొంతవరకూ మామూలు ప్రేమకథే కానీ పక్కనున్న యువకుడి పాత్రతో, ఈ ప్రేమకథకు కొత్త దనాన్నిచ్చింది.
అందుకే నాలో కుతుహలంగా రేగింది.
‘‘మీ ప్రేమ చాలా ఉదాత్తమైనది. వేరెవర్నో ప్రేమించిందని తెలిసి కూడా.....’’
నేనింకా ఏదో అనబోతుండగా, ‘‘నాకు తనంటే ఇష్టం. చిన్నప్పట్నించీ తన గురించి తెలుసు. మధ్యలో వచ్చిన ఆ యువకుడిపై ప్రేమ తాత్కాలికమని ఊహించగలను. మా భావి జీవితం బాగుంటుందని నాకు పూర్తి నమ్మకమే. కానీ.....’’ ఆగేడతడు.
ఆ యువతి ప్రేమ తాత్కాలికమే కానీ, ప్రియుడామెని పిచ్చిపిచ్చిగా ప్రేమించాడు. ఆమె వేరే పెళ్లి చేసుకున్నా ఆమెని వదలడు. వెంటబడి వేధిస్తూనే ఉంటాడు.
అతడలా వెంటబడితే ఆమె అతణ్ణి ద్వేషించలేదు. అలాగని అతణ్ణి ప్రేమించనూ లేదు. అతడు తనకోసం పరితపిస్తూంటే ఆమెని అపరాధభావం వేధిస్తుంది.
ఆమె మనోభావాల్ని బావ అర్థం చేసుకున్నాడు. ఆమె అన్నతో మంతనాలు చేశాడు.
తర్వాత ఆ యువతి అన్న అతణ్ణి కలుసుకున్నాడు..
‘‘మీ ప్రేమ ఇంత బలమైనదని నాకు తెలియదు. నీతో పెళ్లి జరిగితే అమ్మా నాన్నా చచ్చిపోతామన్నారు. దాంతో ఆదే ఆత్మహత్య చేసుకుని తన ప్రాణాలు తీసుకుంది’’ అని చెప్పి భోరున ఏడ్చాడు.
అతడది నిజమనుకుని మౌనం వహించాడు.
‘‘మా ఇద్దరికీ పెళ్లి జరిగింది. నా భార్య కోరికపై మా పెళ్లి రహస్యంగా జరిగింది. తను బ్రతికుందనీ, పెళ్లి చేసుకుందనీ తెలిస్తే - ప్రియుడు తట్టుకోలేడని ఆమె భయం. అందుకని ప్రస్తుతానికి మేము అజ్ఞాతంగా ఉంటున్నాం. ఎప్పటికో అప్పటికి అతడూ పెళ్లి చేసుకోకపోడు. అందాకా మాకీ అజ్ఞాతం తప్పదు’’ అన్నాడతడు.
ఇలాంటి ప్రేమకథ నేనెక్కడా వినలేదు.
నా పక్కనున్న యువకుడు ఓ గొప్ప ప్రేమికుడు. అతడి భార్య ఓ వింత ప్రేమిక.
మరి ఆమెను ప్రేమించిన యువకుడి ప్రేమ ఎలాంటిదో తెలియదు. కానీ అతడి ప్రేమ ఈ ప్రేమికుల దాంపత్య జీవితానికి కొంత అజ్ఞాతాన్ని విధించింది.
ఇంతకీ ఈ కథ ఆ యువకుడు చెప్పాడు. ఈ విషయమై అతడి భార్య ఏమంటుందో.....
ఆమెది వేరే అభిప్రాయమనుకుందుకు లేదు.
అతడు నాకు చెప్పిన కథ తను పక్కనుండగానే చెప్పాడు. తనకి వినబడేలాగే చెప్పాడు. కిమ్మనకుండా ఊరుకుందంటే - అతడి కథనంపై తనకేం అభ్యంతరం లేదనేగా! లేక అదామె అసహాయతా?
ఏమో - అతడు పురుషాహంకారి కావచ్చు. అందుకే ఆమెను బయట తిప్పినా ముసుగులో ఉంచుతున్నాడు. పోలీసుల దగ్గర తన ప్రవర్తన సముచితంగా లేనందుకు సంజాయిషీ ఇవ్వాలనుకున్నాడు. అందుకేనేమో - ఆడక్కుండానే తన ప్రేమకథని చెప్పాడు. అందులో అందరికంటే ఎక్కువ ఔదాత్యాన్ని తన పాత్రకే అంటగట్టాడు.
ఇదంతా తనకు తెలిసే జరుగుతున్నా - నోరెత్తలేని అబల కావచ్చు ఆమె!
గమ్యం చేరుకునేదాకా - ఆ దంపతుల గురించి మరెక్కువ ఆలోచించలేదు నేను.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
వసుంధర పరిచయం మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
Comments