కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Prema Bhramaram - 5' New Telugu Web Series
Written By Vasundhara
రచన: వసుంధర
వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఐదవ భాగం
గత ఎపిసోడ్ లో...
ముక్తకీ, భవన్‌కీ జరగబోయే పెళ్లి ఆపమని నన్ను కోరుతుంది స్వర.
ముక్త ఫోటో చూపిస్తుందామె.
నిజంగానే ముక్త ఓ అపురూప దివ్య సుందరి.
ఇక ప్రేమ ‘భ్రమ’రం ఐదవ భాగం చదవండి ...
నేనుంటున్న చోటుకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఓ చిన్న చెరువు పక్కన ఉందో పెద్ద రావిచెట్టు.
దాన్ని బోధివృక్షం అంటాడు ఆఫీసులో నా కొలీగ్ శ్రీను.
నేనైతే ఇక్కడికి ఉద్యోగంకోసం వచ్చాను కానీ, అతడిది చిన్నప్పట్నించీ ఇదే ఊరు.
ప్రేమకథ కాదు కానీ, ఆడపిల్లతో జతపడ్డ ఓ తమాషా కథ అతడిది.
హైస్కూల్లో చదివేటప్పుడు తన క్లాసు అమ్మాయి శరమ అంటే గొప్ప ఆకర్షణ ఉండేదిట.
ఆ అమ్మాయి ఒకరోజున అతడు తన వంటిమీద చెయ్యేశాడని - టీచరుకి ఫిర్యాదు చేసింది.
నిజానికి శ్రీనుకి ఏ పాపం తెలియదు. ఆమె అలా ఎందుకు చెప్పిందో తెలియదని టీచరుకి మరీమరీ చెప్పాడు.
టీచరు నమ్మలేదు. ఫోన్ చేసి ఆ విషయం శ్రీను ఇంట్లో చెప్పేడు. తండ్రి శ్రీనుని చావగొట్టేసేడు.
శ్రీనుకి ఉక్రోషమొచ్చింది. ఆ రాత్రి ఇంట్లోంచి పారిపోయి - ఆ చెరువు దగ్గరకెళ్లి రావిచెట్టుకింద కూర్చున్నాడు.
శ్రీనుకి ఈత రాదు. ఆ చెరువులోపలికి వెళ్లి ములిగిపోదామని అనుకున్నాడు.
చెరువులో అడుగెడుతుండగా ఎవరో వెనక్కి లాగేరు.
చూస్తే ఓ ముసలాయన.
లాక్కెళ్లి చెట్టుకింద కూర్చోబెట్టి తనూ పక్కన కూర్చున్నాడు. ‘‘ఈ సమయంలో ఇక్కడికెందుకొచ్చావ్?’’ అని ఆయన శ్రీనుని అడిగేడు.
‘‘ఈ సమయంలో మీరిక్కడికెందుకొచ్చారు?’’ అని శ్రీను ఆయన్ని ఎదురుప్రశ్న వేసేడు.
‘‘వారానికొకసారి, పాతాళలోకంనుంచి నాగకన్యలు ఇక్కడికొచ్చి స్నానం చేసి వెడుతుంటారు. నేను వాళ్లని చూడ్డానికి వస్తుంటాను’’ అన్నాడు ముసలాయన.
శ్రీను నమ్మలేదు. ‘‘ఏరీ నాగకన్యలు?’’ అనడిగాడు.
‘‘నువ్వున్నావుగా - వాళ్లిప్పుడు పాముల్లా మారిపోయారు. ఎవరైనా చెరువులో అడుగెడితే - కరిచి చంపేస్తారు. అందుకే నిన్ను చూసి వెనక్కి లాక్కొచ్చాను’’ అన్నాడు ముసలాయన.
శ్రీనుకి వళ్లు జలదరించింది. ‘‘మీకు కన్యల్లా కనబడ్డవాళ్లు నాకెందుకు అలా కనబడరు?’’ అన్నాడు.
‘‘ఈ ప్రశ్నకి జవాబు దొరకాలంటే - నీకు నా వయసు రావాలి’’ అని నవ్వాడు ముసలాయన.
శ్రీనుకి కొంత అర్థమైంది. పైకి కాకుండా మనసులో నవ్వుకున్నాడు.
‘‘చావంటే నాకు భయం లేదు. ఓసారి చెరువులోకి వెళ్లాలనుంది’’ అన్నాడు.
‘‘చావంటే భయం లేకపోవడం ఓ వరం. అంత గొప్ప వరం దగ్గరెట్టుకుని - చావడానికి వెడతానంటావేమిటి? నువ్వు కలకాలం బ్రతకాలి’’ అన్నాడాయన.
‘‘కలకాలం బ్రతికి ఏంచెయ్యాలి?’’ అన్నాడు శ్రీను విసుగ్గా.
‘‘చిన్న కుర్రాడివి, నీకిలాంటి సందేహం రాకూడదు. వచ్చిందంటే ఏదో కారణముండి ఉండాలి. అదేమిటో నాకు చెప్పు’’ అన్నాడాయన.
‘‘చెబితే ఏంచేస్తారు?’’
‘‘నువ్వు నాకు చెప్పు. నాగకన్యలకి కూడా వినిపిస్తుంది. చెరువులోకి వెళ్లి వాళ్లని డిస్టర్బ్ చెయ్యలేదుగా - వాళ్లు నువ్వంటే ప్రసన్నంగా ఉన్నారు. నువ్వనుకున్నది జరిగేలా వరమిస్తారు’’
‘‘నిజంగా?’’ అన్నాడు శ్రీను పసితనపు ఆశతో.
‘‘ఊఁ’’ అన్నాడు ముసలాయన.
‘‘నామీద నింద పడింది. అదెలా పోగొట్టుకోవాలో తెలియక, బ్రతుకుమీద విరక్తి పుట్టింది’’ అన్నాడు.
‘‘నింద ఎలా పడింది’’ అన్నాడు ముసలాయన.
శ్రీను జరిగింది చెప్పాడు.
ముసలాయన అతడు చెప్పింది విన్నాడు. తర్వాత తీక్షణంగా చెరువువైపు చూశాడు.
కొన్ని క్షణాలాగి, ‘‘నాగకన్యలు విన్నారు. నువ్వు చెప్పింది నమ్మారు. వరమిచ్చారు. నీమీద నింద తొలగిపోతుంది. ఎటొచ్చీ కనీసం నెల్లాళ్ల దాకా నువ్వు ఇటువైపు రాకూడదు. వస్తే నింద మళ్లీ రావడమే కాదు, పెద్దది కూడా ఔతుంది. గుర్తుంచుకో’’ అని హెచ్చరించాడు.
‘‘అది సరే, కానీ ఇప్పటికిప్పుడు ఇంటికి వెళ్లను. ఈ రాత్రికి నేనిక్కడే నిద్ర పోతాను’’ ఆన్నాడు శ్రీను.
‘‘బోధివృక్షం నీడలో నిద్ర పడితే - నీ మెదడు వయసుకి మించి పరిపక్వమౌతుంది. నిద్ర పడితే కనుక అది నీ అదృష్టం. నీకు నిద్ర పట్టేదాకా నేనిక్కడే ఉంటాను. అందాకా కళ్లు మూసుకో’’ అన్నాడు ముసలాయన.
శ్రీను కళ్లు మూసుకున్నాడు.
ఊరిచివర, కొలను ఒడ్డున, ఓ చెట్టు నీడలో, ఓ అపరిచితుడి సంరక్షణలో ఉన్నందుకు శ్రీనుకి తేడాగా అనిపించలేదు.
మనసు ప్రశాంతంగా ఉండి, కళ్లు మూసుకున్న కాసేపటికే శ్రీనుకి నిద్ర పట్టేసింది. ఒక రాత్రి వేళ ఎవరో వచ్చి కుదపకపోతే - తెల్లారేదాకా అలా నిద్ర పోతూనే ఉండేవాడేమో!
అప్పుడు మెలకువొచ్చి చూస్తే ఎదురుగా తండ్రి కనిపించాడు. పక్కన చూస్తే ముసలాయన లేడు.
తండ్రిని చూడగానే తనమీద పడ్డ నింద, ఆయన కొట్టిన దెబ్బలు గుర్తుకొచ్చి నిలువెల్లా వణుకు పుట్టింది.
ఎలుగెత్తి అరుద్దామంటే గొంతు పెగలలేదు. పరుగెత్తి పారిపోదామంటే - కాళ్లు కదలలేదు.
ఐతే ఊహించినట్లు విపత్కరమేం జరుగలేదు సరికదా, తండ్రి శ్రీనుని దగ్గరగా తీసుకున్నాడు.
‘‘నీమీదే ప్రాణాలెట్టుకుని బ్రతుకుతున్నాం. ఏదో ఆవేశంలో నాలుగు దెబ్బలు వేశానే అనుకో. మమ్మల్నొదిలి వెళ్లిపోతావా?’’ అన్నాడు.
ఆయన గొంతులో వేదనతోపాటు, లాలన కూడా ఉంది.
శ్రీను కరిగిపోయాడు. ముందు ఏడ్చేశాడు. తర్వాత తమాయించుకుని, ‘‘నువ్వు కొట్టావని కాదు, నింద భరించలేక ఇలా చేశాను’’ అన్నాడు శ్రీను.
‘‘నిజమే, నువ్వెలాంటివాడివో తెలిసి కూడా, నేనా పిల్ల అభియోగం నిజమని నమ్మాను. సారీ రా, చెయ్యని తప్పుకి నిన్ను కొట్టాను’’ అన్నాడాయన.
ఆయనలాగనడం ఆశ్చర్యంగా అనిపించినా, తండ్రి ప్రాణానికి తర్వాత అలా అనిపించి ఉండొచ్చనుకున్నాడు శ్రీను. కానీ అంతా అలా అనుకోరుగా....
‘‘నువ్వు నన్ను నమ్మినా, రేపు స్కూల్లో ఎవరు నమ్ముతారు? నా మొహం అక్కడ ఎలా చూపించేది?’’ అని వాపోయాడు శ్రీను.
‘‘అన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఇంటికి రా. నువ్వేమైపోయావోనని అక్కడ మీ అమ్మ ఏడుస్తోంది’’ అన్నాడు తండ్రి.
తల్లి గుర్తు రాగానే శ్రీను అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాడు.
ఇంటికెళ్లేక శ్రీనుకి కొత్త విషయాలు తెలిసాయి.
రాత్రి శ్రీను ఇంట్లో కనబడ్డం లేదని తెలియగానే ఇంట్లో హాహాకారాలు మొదలయ్యాయి. శరమ ఇంటికీ, టీచరింటికీ కూడా వాకబు వెళ్లింది.
శ్రీను తన కారణంగా ఇంట్లోంచి పారిపోయాడని తెలియగానే శరమ కంగారు పడి - అసలు కథ బయటపెట్టిందిట.
కొన్నాళ్లుగా ఓ కాలేజి కుర్రాడు బయట ఆమెని వెంటబడి వేధిస్తున్నాడు. ఎవరికైనా చెబితే - ఒక ఆడపిల్లని ఎలా అవమానించాలో అలా అవమానిస్తానని బెదిరించేడు. తనకి పెద్దవాళ్లతో కనెక్షన్సు ఉన్నాయనీ - శరమ పోలీసులకి చెప్పినా తనకేం కాదనీ గొప్పగా చెప్పేడు.
వాడి గురించి శరమ తన క్లాస్‌మేటు ఓ అమ్మాయికి చెప్పింది. ఆ అమ్మాయి వెంటనే పెద్దరికం తీసుకుని ఓ ఉపాయం చెప్పింది.
‘‘ఆ కాలేజి కుర్రాడి మాటల్లో ఎంత నిజముందో తెలియదు. కానీ ఆడపిల్లల్ని భయపెట్టడానికి కొందరు అలా ప్రగల్బాలు కూడా పలుకుతారు. వాడి విషయంలో రిస్కు తీసుకోకు. కానీ తలచుకుంటే ఎంత చెయ్యగలవో వాడికి తెలిసేలా చెయ్యాలి. నీకూ ధైర్యముందని నిరూపించాలి. అందుకో బకరా గాణ్ణి పట్టాలి. వాడిమీద టీచరుకి ఫిర్యాదు చెయ్యాలి. ఎలాగూ బకరా గాడు నిన్నేం చెయ్యలేడు. కానీ నెక్స్‌ట్ నేనేనని ఆ కాలేజి వెధవ భయపడతాడు’’ అన్నది ఆ ఉపాయం.
ఉపాయం బాగుందనిపించింది శరమకి. బకరా అనగానే ఆమెకి శ్రీను గుర్తుకొచ్చాడు.
ఆ కాలేజి కుర్రాడి కారణంగా శరమకి ఏ అబ్బాయన్నా మహా కోపంగా ఉంది.
నింద వల్ల అమ్మాయిలకే తప్ప అబ్బాయిలకే ఇబ్బంది ఉండదని నమ్మే వ్యవస్థలో ఉందామె. అందుకని శ్రీనుపై నింద వెయ్యడం అన్యాయం అనిపించలేదు.
శ్రీను బకరా అయ్యాడు.
కానీ తను వేసిన నింద శ్రీనుని ఆత్మహత్యకి ప్రేరేపించిందని తెలియగానే - ఆమెలోని పురుష ద్వేషాన్ని స్త్రీ సహజమైన జాలి జయించింది. పశ్చాత్తాపంతో పాటు, మాయకత్వంతో కూడిన పాపభీతి కూడా కలిగింది. నిజం ఒప్పుకుంది.
స్కూల్లో కూడా టీచరుకి జరిగింది చెప్పడానికి వెనుకాడలేదు.
టీచరు తను శ్రీనుని అపార్థం చేసుకున్నందుకు నొచ్చుకుని, సారీ చెప్పాడు. శరమ చేత కూడా శ్రీనుకి సారీ చెప్పించాడు.
అంతటితో ఉరుకోలేదు. ‘‘ఈ అమ్మాయికిలా తప్పుడు ఫిర్యాదులు చేస్తే ఇకమీదట ఆడపిల్లల్ని ఎవ్వరూ నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది’’ అని అక్కడున్న ఆడపిల్లల్నందర్నీ మందలించాడు.
ఆప్పుడు శ్రీను కలగజేసుకున్నాడు.
‘‘నామీద నింద పడింది. ఆ నింద శరమే వేసుండొచ్చు. కానీ నింద వెనక్కి తీసుకోకపోతే - ఈ మచ్చ కలకాలం నామీద ఉండిపోయేది. తనకి చెడ్డ పేరొస్తుందని తెలిసి కూడా - శరమ నిజం ఒప్పుకుంది. అంటే, ఆమె మనసు చాలా మంచిది. అంత మంచి మనసున్న అమ్మాయి, నామీద ఎందుకు నింద వేసిందీ అని మనం ఆలోచించాలి. ఆమెను మందలించడానికి బదులు - తనకి మనమంతా రక్షణగా ఉంటామన్న నమ్మకం ఆమెలో కలిగించాలి. ఈ రోజునుంచీ మన స్కూల్లోని మగపిల్లలందరూ - ఆడపిల్లలకి రక్షణగా ఉండాలి. అదే ఈ సమస్యకి అసలు పరిష్కారం’’ అన్నాడు శ్రీను.
తను అంత లోతుగా ఆలోచించగలనని శ్రీనుకే అంతవరకూ తెలియదు.
శరమ కథ కదిలించిందా? నింద కలవరపెట్టిందా? నింద తొలగించిన కృతజ్ఞత పని చేసిందా?
‘‘ఇవేం కాదు. బోధివృక్షం నీడలో నిద్ర పోయావు. నీ బుద్ధి వయసుకి మించి పరిపక్వమైంది’’ అనిపించింది మనసుకి.
స్కూల్లో అంతా అతడి మాటలకి చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత శరమని వేధించే కాలేజి కుర్రాడికి దేహశుద్ధి జరిగింది. అతగాణ్ణి మీడియాలో ప్రదర్శించడం కూడా జరిగింది.
‘‘మా స్కూల్లో చదివే ఆడపిల్లలవైపు కన్నెత్తి చూస్తే - ఖబడ్దార్!’’ అంటూ శరమ స్కూలు కుర్రాడొకడు మీడియాలోనే గట్టిగా హెచ్చరించాడు రోడ్డు సైడు రోమియోల్ని.
ఆ స్కూలు మరిన్ని స్కూల్సుకి ఆదర్శమైంది. విద్యార్థుల్లో - ఆడపిల్లల రక్షణ బాధ్యత తీసుకునేందుకు - ‘యువదళం’ వెలసింది. అందులో అబ్బాయిలే కాదు, ధైర్యమున్న అమ్మాయిలు కూడా చేరుతున్నారు.
‘‘బోధివృక్షం కింద సిద్ధార్థుడికి జ్ఞానోదయమైతే - ప్రపంచానికి అపూర్వమైన బౌద్ధమతం లబించింది. ఈ బోధివృక్షం వల్ల ఊళ్లో ఎందరో ఆడపిల్లలకి రక్షణగా యువదళం వెలసింది’’ అన్నాడు శ్రీను నాతో.
అప్పుడే కాదు - ఆతర్వాత కూడా ఆ బోధివృక్షం ప్రభావాన్ని చవి చూశాడు శ్రీను. వాటిలో ముఖ్యమైనది - ఇంటర్ పైనలియర్ పరీక్షలు వ్రాస్తున్నప్పుడు.
మొదటి పరీక్ష అయ్యేక పెరట్లో జారిపడ్డాడు. తలకి గట్టి దెబ్బ తగిలింది.
దెబ్బ ప్రమాదకరమైనది కాదు. కానీ బుర్ర పని చెయ్యడం మానేసింది.
చదివిందేం గుర్తు రావడం లేదు. చదువుతుంటే బుర్రకి ఎక్కడం లేదు.
మర్నాడు లెక్కల పరీక్ష. బుర్ర బాగున్నప్పుడే ప్రోబ్లమ్సు టఫ్‌గా అనిపిస్తాయి. ప్రస్తుతం బుర్ర బ్లాంక్.
శ్రీనుకి దిగులు పట్టుకుంది. కానీ ఇంట్లో చెప్పలేదు. రాత్రి భోజనాలయ్యేక - ఫ్రెండింటికని ఇంట్లో చెప్పి బయల్దేరాడు.
బోధికొలను చేరుకుని బోధివృక్షం నీడలో కూర్చున్నాడు.
మనసు ప్రశాంతంగా అనిపించింది. నిద్ర పోదామని కళ్లు మూసుకున్నాడు.
‘‘ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇక్కడున్నావేమిటి?’’ అన్న మాట వినిపించి కళ్లు తెరిచాడు.
ఎదురుగా ఓ యువకుడు. సుమారు ముప్పై ఏళ్లుంటాయి. తెల్ల షరాయి, లాల్చీలో ఉన్నాడు. ప్రశాంతమైన ముఖంలో - ఆహ్లాదకరమైన చిరునవ్వు.
‘‘నువ్వెవరు?’’ అనడిగాడు శ్రీను.
‘‘మామూలు మధ్యతరగతి మనిషిని. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఇక్కడికొచ్చి కాసేపు కూర్చుని వెడుతుంటాను. మరి నీ సంగతేమిటి.’’ అన్నాడతడు.
శ్రీను తన పరిస్థితి చెప్పాడు.
ఆ యువకుడు నవ్వి, ‘‘నీది చాలా చిన్న సమస్య. పరిష్కారం నేను చెప్పగలను’’ అన్నాడు.
‘‘ఔనా? ఏమిటది?’’ అన్నాడు శ్రీను ఆశ్చర్యానందాలతో.
‘‘నీ సబ్జక్టులో నీకు బాగా తెలిసిన, అతి సులభమైన ప్రోబ్లం తీసుకో. ఒకటికి రెండు సార్లు చదివి ఆకళింపు చేసుకో. ఆ తర్వాత పుస్తకం చూడకుండా ఆ ప్రోబ్లం సాల్వ్ చెయ్యి. అలా ఒకటి రెండు ప్రోబ్లమ్సు చేశావంటే - నువ్వు మర్చిపోయాననుకుంటున్న ప్రోబ్లమ్సుకు సంబంధించి పరిష్కారాలన్నీ చకచకా స్ఫురించడం మొదలెడతాయి’’ అన్నాడతడు.
‘‘అదెలా?’’ అన్నాడు శ్రీను నమ్మలేనట్లు.
‘‘నువ్వెప్పడైనా పల్లెటూళ్లలో హాండ్‌పంప్స్ చూసేవా?’’ అన్నాడతడు.
శ్రీనుకి తెలుసవి.
నేలలోకి నీరు తగిలేదాకా గొట్టాలు దింపేక పైన హాండ్‌పంప్ బిగిస్తారు. చేత్తో కొడుతుంటే నీళ్లొస్తాయి.
ఒకోసారి ఎంత కొట్టినా నీరు రాదు. అలాంటప్పుడు పంపులో ఒకటి రెండు చెంబుల నీళ్లు పోసి - చేత్తో కొట్టాలి. అంతే - గుండిగలకు గుండిగల నీళ్లొస్తాయి.
పోసింది రెండు చెంబుల నీళ్లే అయినా - వాటి తాకిడితో అంతవరకూ అందకుండా అడుక్కు ఉండిపోయిన జల పైకి చేరి పంపింగుకి అందుతుంది.
‘‘మనం పోసిన నీళ్లు కొత్తగా నీటిని సృష్టించడం లేదు. ఉన్న జలని అందుబాటులోకి తెస్తున్నాయి. మెదడులో జ్ఞాపకాలూ ఆ జలలాంటివే. కొన్ని జ్ఞాపకాలనందించి పాతవాటిని వెలికి తీసుకురావచ్చు’’ అన్నాడతడు.
లాజిక్ బాగుంది. శ్రీనులో కొత్త ఆశలు చిగురించాయి.
ఆ లాజిక్ సరైనదో, లేక శ్రీనుకి కలిగిన నమ్మకమో, లేక అదృష్టమో - మర్నాడతడు తన పరీక్షని అనుకున్నకంటే బాగా వ్రాశాడు.
ఇదీ ఆ బోధివృక్షం కథ.....
- - - - -
నిజం చెప్పాలంటే నాకా బోధివృక్షం కథ గుర్తు లేదు.
ముక్త గురించి ఆలోచిస్తుంటే - నా సమస్యకి పరిష్కారంగా దాని పేరు వినిపించింది. అదీ ఓ కలలో....
ఇది కాకతాళీయమా లేక ఏదో మానవాతీతశక్తి నన్నటు నడిపిస్తోందా?
గతంలో నేను ఒకటి రెండు సార్లు బోధికొలనుకి వెళ్లాను.
అబద్దమెందుకూ - నాగకన్యలు జలకాలాడుతూ కనిపిస్తారేమోనని మనసులో చిన్ని చిలిపి ఆశ!
వాళ్లు కనిపించలేదు కానీ - అప్పుడు నాకక్కడ ప్రశాంతంగా అనిపించిన మాట నిజం.
నాగక్యలపై కుతూహలం కొద్దీ అక్కడికి వెళ్లాను కానీ, ఈ ఊరొచ్చేక - బోధికొలనుకి వెళ్లాలనిపించేటంత సమస్యలేవీ ఇంకా ఎదురు కాలేదు. ఈ రోజు కూడా - నాకు నేనుగా సృష్టించుకున్నదే తప్ప - నాకంటూ సమస్యేంలేదు.
సమస్యుంటే - అది పద్మది, కిషోర్‌ది, స్వరది. నాకింకా అపరిచిత ఐన ముక్తది కూడా అయుండొచ్చు.
నాది మాత్రం కాదు.
ఐనా ఇతరులకి చెందిన ఆ సమస్య నన్నెంతగా ప్రభావితం చేసిందంటే -
నిద్రపొతుంటే కలలోకి కూడా వచ్చింది. నా దృష్టిని బోధివృక్షంవైపు మళ్లించింది.
‘ఎందుకలా జరిగిందో - ఓసారి బోధికొలనుకి వెళ్లి రారాదూ’ అంది మనసు.
టైం చూసుకున్నాను. రాత్రి రెండు గంటలు.
ఎక్కువ ఆలోచించలేదు. మంచం దిగాను. బట్టలు మార్చుకున్నాను. బయటికొచ్చి ఇంటికి తాళం వేశాను.
బైకుమీద బయల్దేరాను.
అర్థరాత్రి. జనసంచారం ఇంచుమించు లేదనే చెప్పాలి.
పది నిముషాల్లో బోధికొలను దగ్గర ఉన్నాను.
చల్లని గాలి. పుచ్చపువ్వులాంటి వెన్నెల. చంద్రకాంతిలో - కొలనులో నీళ్లు అలలు అలలుగా మెరుస్తున్నాయి.
బైకుకి స్టాండ్ వేస్తుండగా చూశాను.
రావిచెట్టు కింద ఓ వ్యక్తి. పట్టపగలు సూర్యకాంతిలో చూస్తున్నంత స్పష్టంగా కనిపిస్తున్నాడు.
అతడు నన్ను చూడ్డం లేదు. కొలనువైపు తదేకంగా చూస్తున్నాడు.
నేనతణ్ణి సమీపించాను. ఆప్పుడూ అతడు నన్ను చూడలేదు.
యువకుడు. నా వయసే ఉంటుంది. నాకంటే పొడగరి, అందగాడు.
‘‘పాపం, ఇతగాడికేం సమస్యో?’’ అనుకున్నాను కానీ - అతడి ముఖం ప్రశాంతంగా ఉంది.
కొలనులో నాగకన్యలు కనబడుతున్నారా అని - అతడు చూసినవైపే చూస్తే -
గాలికి కొలను ఒడ్డున అలలు సన్నగా ఏర్పడుతున్నాయి కానీ - కొలను మధ్య నిశ్చలత!
అపరిచితుడు - ఏమని పిలిచేది?
చిన్నగా దగ్గేను.
అతగాడు తపస్సులో కనుక ఉంటే - తపోభంగమై నన్ను శపించడం తథ్యం.
అపరాధభావంతోనే అతణ్ణి చూస్తుంటే - అతడు చటుక్కున నన్ను చూశాడు.
కోపంగా కాదు, ఆప్యాయంగా నవ్వుతూ....
‘‘వచ్చేరా, మీకోసమే చూస్తున్నాను’’ అన్నాడతడు.
తెల్లబోయాను. నేనొస్తానని అతడికి ముందే తెలుసా?
అతడు మనిషి కాదా? దేవతల పనుపున వచ్చాడా?
ఆ నవ్వు, ఆ పలకరింపు - దివ్యత్వాన్ని స్ఫురింపజేస్తున్నాయి.
అతడికి నాతో ఏంపని?
ఇంకా ఉంది...
వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
వసుంధర పరిచయం మేము- డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.
Comments