top of page
Writer's pictureVasundhara

ప్రేమ ‘భ్రమ’రం - 8

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Prema Bhramaram - 8' New Telugu Web Series


Written By Vasundhara


రచన: వసుంధర


వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ ‘భ్రమ’రం ఎనిమిదవ భాగం

గత ఎపిసోడ్ లో...

ఉదయాన్నే అమోఘ్ ఇంటికి వెళ్లి తలుపు తట్టాను.

ఒక అందమైన యువతి తలుపు తెరిచింది.

ఆమే రిక్త అనుకున్నాను.

కానీ ఈమె పేరు రూప అని తెలుస్తుంది.

ముక్త అంగీకారంతో ఆమెను కలుస్తాను.

ఇక ప్రేమ ‘భ్రమ’రం ఎనిమిదవ భాగం చదవండి ...


‘‘మరి మీ ఆఫీసు....’’ అన్నాను ఏమనాలో తెలియక.

‘‘ఆఫీసుకి సెలవెట్టాను’’


‘‘సెలవా - ఎందుకు?’’ అది ఆశ్చర్యమో మరేమిటో చెప్పలేను.

‘‘మీరొచ్చిన పని అలాంటిది మరి’’ మాటలో ఉన్న నిష్ఠూరం గొంతులో లేదు.


‘‘సారీ! నా కారణంగా మీరు మీ ఆఫీసుకి సెలవెట్టాల్సి ఉంటుందనుకోలేదు’’ నొచ్చుకున్నాను.


‘‘సారీ చెప్పకండి. ఆఫీసుకి సెలవెట్టడానికి నా కారణం నాకుంది’’ అందామె.

‘‘అంటే?’’


‘‘మీరు కవన్‌, భవన్‌ల గురించి మాట్లాడ్డానికి నా దగ్గరికొచ్చారు. ఆ మాటలు ముందుకెళ్లేముందు నేను మీకు నా కథ చెప్పాలి’’ అంది ముక్త.

‘‘మీ కథ నాకు చెబుతారా? నిజంగా అవసరమా?’’ అన్నాను.


చెత్త ప్రశ్న....

అవసరం లేకపోతే తీరికూర్చుని నాకెందుకు వినిపిస్తుంది?

తను రచయిత కాదు. నేను సినిమావాణ్ణి కాదు.

భవన్‌కీ, కవన్‌కీ, ఆమె కథకీ ఏదో లంకె ఉండుంటుంది.


‘‘అవసరమే - అందుకే ఆఫీసుకి సెలవెట్టాను. మీరు నాకు ఫోన్‌ చేసినప్పుడే - ఇలా కథ చెప్పాల్సుంటుందని తెలుసు. అందుకే మీకు ఫలహారం, భోజనం వగైరాలకి ఏర్పాట్లు చేశాను. ఇంకా.....’’


ఏం చెబుతుందోనని కుతూహలంగా చూస్తున్నాను.

‘‘మిమ్మల్ని సారీ చెప్పొద్దన్నాను. ఎందుకంటే కథ చెప్పడంలో నా ప్రయోజనం కూడా ఉంది’’


మళ్లీ గాజు తలుపులు తెరుచుకున్నాయి. ఇందాకటి వ్యక్తి లోపలికొచ్చాడు. బల్లమీద గ్లాసులు, ప్లేట్లు ట్రాలీకి మార్చేసాడు. ఇద్దరిముందూ చెరో మినరల్‌ వాటర్‌ బాటిలూ పెట్టాడు.


‘‘టిఫిన్‌ తినేటప్పుడు ఫిల్టర్‌ వాటర్‌. ఉత్తప్పుడు దాహమేస్తే మినరల్‌ వాటర్‌. జస్ట్‌ ఫర్‌ కన్వీనియన్స్‌. అంతే’’ నవ్విందామె.


ట్రాలీ తోసుకుంటూ ఆ మనిషి వెళ్లిపోయాడు.

‘‘ఈ పద్ధతి బాగుంది. నేనూ ఫాలో ఔతాను’’ అన్నాను మర్యాదకి.


ఆమె చిన్నగా నవ్వి, ‘‘విషయానికి వస్తాను. నా కథలో - నావాళ్లకి కూడా తెలియని రహస్యాలున్నాయి. అవి కూడా మీకు చెబుతాను...’’ అందామె.


‘ఏమిటో నాలోని ఆ ప్రత్యేకత?’ అనుకున్నాను. పైకి మాత్రం ‘‘అయామ్‌ ఆనర్డ్‌’’ రొటీన్‌ మర్యాద పాటించాను.


ఆమె కొనసాగించింది.

‘‘ముందుగా మీకో విషయం చెప్పాలి. ఇప్పుడుంటున్న ఈ ఇల్లు మాది కాదు’’ అంది ముక్త.

నాకా విషయం తెలుసు. కానీ ఆమె కథలో ఈ సమాచారానికున్న ప్రాధాన్యం తెలియదు.

మామూలు మధ్యతరగతి కుటుంబానికి అందుబాటులో ఉండే ఇల్లు కాదది. ఇలాంటింట్లో అద్దెకుండాలన్నా - ఆర్థిక పరిస్థితి కొంచెం పైమెట్టులోనే ఉండాలి.".


‘‘ఔనా?’’ అని ఆశ్చర్యం ప్రకటించి, ‘‘ఇలాంటిల్లు అద్దెకి దొరకడం కూడా విశేషమే!’’ అన్నాను.


విశేషమని నేననుకోలేదు. ఏదో అనాలని అన్నానంతే!

‘‘దొరకడం విశేషమేం కాదు. డబ్బుండాలి. అద్దెకి కూడా ఇంత మంచిల్లు మేము ఎఫర్డ్‌ చెయ్యలేం. ఊరికే వచ్చిందని ఉంటున్నామంతే!’’ అందామె.


‘‘ఓహో, కంపెనీ ఇచ్చిందన్నమాట - మీకు’’ అన్నాను అప్పుడే గ్రహించినట్లు.

‘‘కంపెనీ శివశంకర్‌ది కాబట్టి అలా అనుకోవచ్చు’’ అందామె.


‘రెంటికీ తేడా ఏమిటో’ అనుకుంటూండగా - శివశంకర్‌ - పేరేదో తెలిసినట్లుందే ఆనిపించింది.


నేనేమనకుండానే, ‘‘ఈ ఇల్లు శివశంకర్‌ది’’ అందామె.

గుర్తొచ్చింది. ఇంటి గేటు దగ్గర చూశానా పేరు.


‘‘ఇంటి గేటుకి కంపెనీ పేరు కాకుండా ఆయన పేరుందంటే - ఒకప్పుడాయన ఈ ఇంట్లోనే ఉండేవాడన్నమాట’’ అన్నాను.


‘‘కరెక్ట్‌గానే ఊహించారు. మూడేళ్లక్రితం దాకా ఆయనీ ఇంట్లోనే ఉండేవారు. ఈ ఇంట్లోంచే ఆయన మూడు నాలుగు ఆన్‌లైన్‌ వ్యాపారాలు మొదలెట్టారు. ఆన్నీ హిట్టయ్యాయి. మూడేళ్లక్రితం నేనాయన దగ్గర ఉద్యోగంలో చేరాను. మా ఇల్లు ఉద్యోగానికి సూటబుల్‌ కాదని - ఆయన నాకూ, మావాళ్లకీ ఈ ఇల్లిచ్చి తను వేరే చోటకి వెళ్లిపోయారు. అటు నివాసగృహంగానూ, ఇటు ఆఫీసుకీ పనికొచ్చేలా ఇంటిని రీమోడల్‌ చేయించారు’’ అంది ముక్త.


ఆలోచనలు పరిపరివిధాల పోయాయి.

ముక్త అందం అపూర్వం. ఆయన ముక్తకి ఈ ఇల్లు ఇవ్వడానికి కారణం - ఆ అందమేనా?

ముక్త కేరక్టర్‌ ఎలాంటిది?


ఎలాంటిదైనా - ఇప్పుడామెకోసం భవన్‌, కవన్‌ పోటీ పడుతున్నారు. బహుశా నేనూ ఆ పోటీలోకి వస్తానేమో తెలియదు.

కేరక్టర్‌ అనుమానాస్పదమైన ఆడపిల్లని పెళ్లి చేసుకోవడానికి ఇంతమంది అబ్బాయిలు పోటీ పడతారా?


నాకు బాబాయి చెప్పే చిన్నప్పటి విశేషమొకటి గుర్తొచ్చింది.

ఆయన ఒకసారి కాకినాడలో బంధువులింటికెళ్లాట్ట.


విశాలమైన ఆవరణలో రెండిళ్లు, కొన్ని ఫలవృక్షాలు ఉన్న పాతకాలపు ఇల్లది. వీధివైపు ఇంట్లో మా బంధువులుంటున్నారు.పెరటిల్లు అద్దెకిచ్చారు.


ఆ ఇంట్లో ఓ ముసలామె ఉంది. ఆమెకి మడి, ఆచారం చాదస్తం చాలా ఎక్కువ. నిముషానికోసారి చేతులూ, కాళ్లూ కడుక్కునేది. రోజుకి నాలుగైదుసార్లు స్నానం చేసేది. మడి, మడి అంటూ ఎవర్నీ దగ్గరకు రానిచ్చేది కాదు.


ఏవైనా పిండివంటలు చేసినప్పుడు - ఇంటి వసారాలో మెట్టతామర ఆకులేసి, వాటిలో వడ్డించి పిల్లల్ని పిలిచేది.


అది నాపరాతి గచ్చు వసారా. నాపరాతికీ నాపరాతికీ మధ్య సరిహద్దు గీతలుండేవి.అలాంటి ఓ గీతని ఎంచుకుని - గీతకి అవతల తనుండేది. ఇవతల పిల్లలకి వేసిన ఆకులుండేవి.


పిల్లలెవరైనా పొరపాటున గీత దాటబోతే, ‘‘ఆసింటా, అసింటా’’ అని హెచ్చరించేది.

ఒకసారి మా బాబాయీ వాళ్లూ ఆ బంధువులింటికి వెళ్లినప్పుడు కాకినాడకి మహానటుడు ఎన్టీ రామారావు వచ్చేట్ట.


ఆ వీధిలోకి ఆయనొస్తున్నట్లు తెలిసి ఇంట్లో జనమంతా వీధిలోకి పరుగెడుతుంటే - ఆ ముసలామె కూడా పెరట్లోంచి వీధిలోకి పరుగెత్తిందిట.


ఆమె బాబాయిని దాటించుకుని వెళ్లబోతుంటే, ‘‘బామ్మగారూ, మడి మడి’’ అని ఆపబోయేట్ట.


‘‘ఎన్టీ రామారావుని చూడ్డానికెడుతుంటే - ఇప్పుడు మడేంటి నాయనా’’ అంటూ ఆమె బాబాయిని పక్కకి తోసి ముందుకి వెళ్లిపోయిందిట.


కొందరు మహానుభావులు జనం మనసులో అలాంటి స్థానాలు సంపాదించుకుంటారు. వారిని తలచుకుంటే - సామాన్యజనం తమకితాము పెట్టుకున్న అడ్డుగోడలు మాయమైపోతాయి.


ముక్తని చూస్తే - ఆమె గతమేమిటీ - ఆమె శీలమెలాంటిదీ అని స్ఫురణకి రాదు. శివశంకర్‌ ఆమెకి తనుండే ఇల్లు ఇచ్చేశాడంటే - ఇచ్చేశాడు అంతే!


‘‘ఈ ఉద్యోగం కారణంగా ఇంత మంచిల్లు దొరికిందని మీ అమ్మా నాన్నా చాలా సంతోషించి ఉంటారు’’ అన్నాను.


‘‘అమ్మా నాన్నా పద్ధతి మనుషులు. మామూలుగా ఐతే ఆయన ఇల్లిస్తానన్నా ఒప్పుకునేవారు కాదు. కానీ ఆయన మారేజి ప్రపోజల్‌ తీసుకొచ్చారు’’ అంది ముక్త.


ఉలిక్కిపడ్డాను. అంటే - శివశంకర్‌ ఆమెని పెళ్లి చేసుకుంటానన్నాడన్న మాట!

ముక్త రూపం అలాంటిది. చూడగానే ఆమెపై కాంక్ష కలుగదు. మనసు సాహచర్యాన్ని కోరుతుంది. ఆలోచనలు పద్ధతిని అనుసరిస్తాయి.


ఇప్పుడు అసలు విషయం నాకు తెలిసిపోయింది.

ముక్తకి పెళ్లి నిశ్చయమైపోయింది. అందుకే తను భవన్‌, కవన్‌లని పెళ్లి చేసుకునే అవకాశం లేకపోవచ్చునంది.


మరి వాళ్లెందుకు ఇంకా ఈమె వెంటబడుతున్నారు?

నా వరకూ వస్తే - ఇక ఈమె గురించి ఆలోచించడమే వృథా...


‘‘ముహూర్తాలు పెట్టేశారా?’’ అన్నాను గొంతులో నిరుత్సాహాన్ని వీలైనంతగా దాస్తూ.

అభిమానులు తారల్ని కాంక్షించరు. కానీ వాళ్లకి పెళ్లిళ్లయిపోతే బాధ పడతారు.

అందాన్ని స్వంతం చేసుకోవాలన్న భావనకంటే - అందం వేరెవరికో స్వంతమౌతుంటే - ఎందుకో అదో బాధ!


నేను ముక్తని మొదటిసారిగా చూస్తున్నాను.

ఆమె అందం నన్నాకర్షించింది. కానీ దాన్ని ప్రేమనలేను. కానీ ఆమెని శివశంకర్‌ అనే వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నాడనగానే - ఏదో బాధ!


ముహూర్తాల గురించి అడగడం - కుతూహలం కాదు. ఇంకా లేదన్న జవాబు వినాలని!

‘‘లేదు’’ అంది ముక్త తల అడ్డంగా ఊపి.

నా మనసుకి ఏదో తృప్తి!


‘‘ఎందుకని?’’ అన్నాను.

‘‘ఇంటిగేటుమీద శివశంకర్‌ పేరు చూశారు కదా, దానికింద ఖాళీని గమనించారా?’’ అంది ముక్త.


ఖాళీ కొట్టొచ్చినట్లు తెలుస్తోంది. గమనించకుండా ఎలా ఉంటాను?

‘‘మీ పేరు వ్రాయడానికని - ఉంచినట్లున్నారు’’ అన్నాను నవ్వడానికి ప్రయత్నిస్తూ.

ముక్త మళ్లీ తల అడ్డంగా ఊపి, ‘‘కాదు. ఉన్న పేరుని చెరిపెయ్యడం వల్ల ఆక్కడ ఆ ఖాళీ వచ్చింది’’ అంది.


‘‘ఉన్న పేరుని చెరిపెయ్యడమా? ఎవరిది? ఎందుకు?’’ ఉత్సుకతతో అడిగాను.

‘‘వరలక్ష్మిది’’ అంది ముక్త తాపీగా.


‘‘వరలక్ష్మి ఎవరు?’’ అన్నాను తెల్లబోయి.

‘‘ఆయన భార్య’’


షాక్‌.

ఆమె చెప్పిన పద్ధతిని బట్టి శివశంకర్‌ అంటే యువకుడనుకున్నాను.

అతడు నడివయస్కుడని తెలిసినా ఆశ్చర్యపోయేవాణ్ణి కానేమో - వివాహితుడని తెలియగానే పెద్ద షాక్‌!


‘‘అంటే శివశంకర్‌కి పెళ్లయిందా?’’ అన్నాను తేరుకున్నాక.

‘‘ఆయనకి టెన్తు చదువుతున్న కూతురు కూడా ఉంది’’ నిర్లిప్తంగా అంది ముక్త.

మరో షాక్‌!


‘‘అంటే ఆయన వయసెంత?’’ అప్రయత్నంగా ఆడిగాను.

‘‘వయసు నేనడగలేదు. ఆయన చెప్పలేదు. ఇది చూసి అంచనా వేసుకోండి’’ అంటూ తన మొబైల్ని నా ముందుకి తోసింది ముక్త.


చూస్తే మరో షాక్‌!

ఎత్తు ఐదడుగుల నాలుగంగుళాలకంటే ఉండదు.


బట్ట తల. ఒత్తయిన కనుబొమలు. ట్రిమ్‌ చేసిన హిట్లర్‌ మీసాలు. ఎత్తుపళ్లు అనలేం కానీ, అందమైనది అనిపించని పలువరస.


కమేడియన్‌కి తక్కువ, విలన్‌కి ఎక్కువ. పొరపాటున కూడా హీరోని స్ఫురణకు తెప్పించని పోలికలు.

అదీ శివశంకర్‌ రూపం.


మామూలుగా చూస్తే ఏమీ అనిపించేది కాదేమో - కానీ అతణ్ణి ముక్తకి కాబోయే భర్తగా ఊహించుకుంటే....


‘దేవుడా, నిన్ను కొలవడానికి శిలా విగ్రహంగా మార్చేశాం. అందుకని నీలో ఇంత కఠినత్వమా?’ అని మనసు ఘోషించింది.


నాకే అలాగుంటే - మరి ముక్తకి ఎలా ఉండాలి?

చప్పున ముక్తని చూశాను. ఆమె ముఖభావాలు తెలియలేదు కానీ -


శివశంకర్‌కి కాబోయే భార్య అని తెలియగానే - ఆమె అందం రెట్టింపై వెలిగిపోతోంది.

‘‘వయసు తెలిసిందా?’’ అంది ముక్త.


వయసా, పాడా? అతడామెకి కాబోయే భర్త అన్న ఆలోచన - ఇతర ఆలోచనలన్నింటినీ ముంచేసింది.

తల అడ్డంగా ఊపాను.


‘‘వయసెవరికి కావాలి? మనిషి చాలా మంచివాడు. ఆయన మంచితనం మావాళ్లకి బాగా నచ్చింది’’ అంది ముక్త.


తనవాళ్లు - అంటే ఆమె తలిదండ్రులు. వాళ్లకి నచ్చారంటోంది. అంటే తనకి నచ్చలేదా?


‘‘పాపం, మంచివాళ్లకే అన్ని కష్టాలూనూ. మనిషిని చూస్తే భార్య పోయేటంత వయసుంటుందనిపించదు’’ అన్నాను ఎలాగో కూడబలుక్కుని.


‘‘ఆయన భార్య చనిపోలేదు. వదిలేసి వెళ్లిపోయింది’’ అంది ముక్త.

గొంతులో ఏ భావం లేదు.


మరో షాక్‌. తమాయించుకుందుకు కాసేపు పట్టింది. ‘‘ఆయన కథ పూర్తిగా చెబుతారా?’’ అన్నాను.

ఆమె గొంతు సవరించింది.


శివశంకర్‌ మధ్యతరగతి మనిషి. కష్టపడి చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు. పెళ్లి చేసుకుందామనుకునే సమయానికి ఆయనకి వరలక్ష్మి అనే యువతి తటస్థపడింది. మామూలు పరిస్థితుల్లో కాదు - ఆత్మహత్య చేసుకోబోతూ....


ఆమె ప్రాణాలు కాపాడాడు.

వరలక్ష్మి సంతోషించలేదు, ‘‘బ్రతికి ఏంచెయ్యాలి? చావడానికి మరో ప్రయత్నం చేస్తాను. ఈసారి ఆ సమయంలో మీరు దరిదాపుల్లో లేకుండా జాగ్రత్త పడతాను’’ అంది.


‘‘మనిషి చావడానికి కాదు, బ్రతకడానికే ప్రయత్నించాలి’’ అని ఆయన ఆమెకి హితబోధ చేశాడు.

కానీ ఆమె మామూలు ఆడది.


స్వంత మేనమామ కొడుకు కదా అనుకుని మోహన్‌ అనేవాణ్ణి నమ్మి తన సర్వస్వమూ అర్పించింది. మోజు తీరేక బావ ఆమెని పెళ్లి చేసుకోనన్నాడు.


‘‘మరి ఇన్నాళ్లూ ఎందుకు నా సాన్నిహిత్యంకోసం పరితపించావు?’’ అని నిలదీసిందామె.


‘‘వళ్లు కొవ్వెక్కి నా చుట్టూ తిరిగి, ఇప్పుడిలాగంటావా? నీమీద నాకెప్పుడూ మోజు లేదు. వెంటబడితే, నీకిష్టమే కదా అని కాదనలేదు’’ అన్నాడు. అని ఊరుకోలేదు. ఈ విషయమై ఆమె బంధువర్గంలో గొడవ చేస్తుందన్న అనుమానంతో - తనే ముందు మొగసాలకెక్కాడు.

ఆమెపై స్వైరిణి అన్న ముద్ర పడింది. అది భరించలేక కన్నవారు కూడా ఆమెను ఈసడించారు.


అపవాదు భరించలేక, ఆత్మహత్యకు తలపడిందామె.

‘‘కన్నవారు కూడా ఏవగించుకుంటున్న - నేనిప్పుడు బ్రతికి ఏంచెయ్యాలి?’’ అని ఏడ్చిందామె.


ఏంచెయ్యాలో శివశంకర్‌ ఆమెకి మాటల్లో కాదు, చేతల్లో చెప్పాడు.

‘‘మోసపోవడం తప్పు కాదు. గతం మర్చిపో’’ అని ప్రబోధించాడు.


‘‘నీ ప్రాణాలు కాపాడేను. ఇకమీదట అవి నీవి కాదు, నావి’’ అంటూ ఆమె మెడలో తాళి కట్టాడు.


అప్పటికాయన మధ్యతరగతికి కొంచెం మాత్రమే ఎగువలో ఉన్నాడు.


భార్యకి సమాజంలో గౌరవస్థానం కలగడానికి అప్పటి హోదా చాలదు. భార్య గతం మరుగున పడాలంటే - సమాజంలో తన హోదా పెరగాలనీ, ఆ హోదాకి డబ్బు బాగా జత పడాలనీ గ్రహించి - కొత్తగా చిన్న చిన్న వ్యాపారాలు మొదలెట్టాడు.


ఆశయం మంచిది. దానికి సామర్ధ్యం తోడయింది. అన్నీ కలిసొచ్చి అనతికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. భార్యని జీవితంలోనే కాదు, వ్యాపారంలోనూ సమాన భాగస్వామిని చేశాడు.


సమాజంలో ఆమెకు గౌరవస్థానం లభించడమే కాదు, ఆమెలో ఆత్మవిశ్వాసం పెంపొందాలని ఆయన ఉద్దేశ్యం.

ఇద్దరికీ దాంపత్యఫలంగా ఓ కూతురు.


ఆమె ముద్దూముచ్చట్లతో - సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయనుకుంటున్న తరుణంలో - ఆయనకి ఓ షాక్‌!


వరలక్ష్మిలో పెంపొందిన ఆత్మవిశ్వాసం, భర్తపట్ల విశ్వాసాన్ని హరించడానికి తగినంతగా ఎదిగింది.


ఎవరామెను స్వైరిణి ఆన్నారో - ఆ మోహన్‌తో ఆమె స్వైరవిహారాన్ని కొనసాగిస్తోందన్న ఓ భయంకర నిజం బయటపడింది. బయట పెట్టింది ఎవరో కాదు - స్వయానా ఆమె కూతురు మంజుల.


‘‘ఎందుకిలా చేస్తున్నావు?’’ అడిగాడు శివశంకర్‌.

కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు. ఉన్నా కటువుగా ఉంటాయి.


పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా - అన్నాడు వేమన. వేమన స్వానుభవంనుంచి తెలుసుకున్న నిజమది.


వరలక్ష్మి పన్నీరుని నిరసించలేదు. కానీ బురదమీద ఆమెకి మోజు పోలేదు.

మోజుకి తర్కాలుండవు.


మోహన్‌ ఆమె గురించి నిజమే చెప్పాడేమో -

మొదట్లో వయసు పోరుకి తట్టుకోలేక మోహన్‌కి దాసోహమంది. మోహన్‌ అది అవకాశంగా తీసుకున్న బురద.


డబ్బు లేదు. ఆదరించేవారు లేరు. సమాజంలో గౌరవం లేదు. అపవాదుకి తట్టుకోలేక చనిపోవాలనుకుంది.


ఆమెకి అంటిన బురదని కడిగి, ఆమెపై పన్నీరు చల్లి, చేరదీసి ఆదరించాడు శివశంకర్‌.

ఆమెకిప్పుడు డబ్బుంది. సమాజంలో గౌరవస్థానముంది. ఆ రెంటితో ఏమైనా చెయ్చొచ్చన్న ఆత్మవిశ్వాసముంది.


ఆమెకింకా బురదపై మోజు తీరలేదు. మళ్లీ బురదలోకి వెళ్లింది.

డబ్బు, హోదా - ఆ బురదని పన్నీరుగా మార్చగలవని ఆమె నమ్మకం.


ఎందుకిలా చేశావని భర్త అడిగినప్పుడు - వరలక్ష్మి చలించలేదు. పశ్చాత్తాప పడలేదు.

భర్తకు విడాకులిస్తానంది. కూతుర్ని అతడికే విడిచి పెట్టేసింది. కొన్ని కోట్ల ఆస్తితో వేరే ఊళ్లో విచ్చలవిడిగా బ్రతుకుతోంది.


శివశంకర్‌ భార్య గురించి తప్పుగా మాట్లాడడు. ఆమెని పల్లెత్తు మాటనడు.

‘‘నాకు ఆమె రాంగ్‌ ఛాయిస్‌. ఆమెకి నేను రాంగ్‌ ఛాయిస్‌. ఎవరి మానాన వాళ్లు బ్రతుకుతున్నాం. నాకింకా చాలా జీవితం మిగిలుంది. ఆ జీవితంలో నేనే కాదు, నా కూతురు కూడా సుఖపడాలి’’ అన్నది తన జీవితాశయం అంటాడాయన.


‘‘ఆయన మాకు దూరపు బంధువు. నాకాయనతో పరిచయం లేదు కానీ, ఆయన కథ మా ఇంట్లోవాళ్లకి తెలుసు....’’ అని ఆగింది ముక్త.


ఆ కథని ఆకళింపు చేసుకుందుకు కొన్ని క్షణాలు పట్టింది నాకు.

ఫొటోలో శివశంకర్ని చూసాను. చూడగానే ఆతడి రూపం పట్ల నిరసన కలిగింది.


ముక్తకి కాబోయే భర్త అని తెలియగానే - ఒకరకమైన ద్వేషం కూడా కలిగింది. ఒక అమ్మాయి పేదరికాన్ని అవకాశంగా తీసుకుని, ఆమె భవిష్యత్తుని అంధకారం చెయ్యనున్న పరమ దుష్టుడిలా అనిపించాడాయన.


ముక్త నోట ఆయన కథ విన్నాక, ఆయన రూపాన్ని గుర్తు చేసుకుంటే....

‘ఆజానుబాహుం ఆరవింద దళాయతాక్షం’ అని చేతులు జోడించాలనిపించింది.

ఫొటో అదే - ఏ మార్పూ లేదు. నాకు తెలిసిన ఆయన నేపథ్యం - నా ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది.


‘‘మహానుభావుడు’’ అన్నాను అప్రయత్నంగా.

‘‘నాకూ ఆయన మహానుభావుడే’’ అంది ముక్త వెంటనే.


నిజమే - ఒకరికి మహానుభావుడైనవాడు అందరికీ మహానుభావుడు కానవసరం లేదు.

శివశంకర్‌ వరలక్ష్మి విషయంలో ఎంతో ఉదారంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ - ముక్తని ఎందుకు పెళ్లి చేసుకుంటాననాలి?


ముక్త చెబుతున్న కథలో ఆ ప్రశ్నకి కొంతవరకూ సమాధానముంది.

ఆమె తల్లి ప్రభాదేవికి కేన్సర్‌. ఉన్నపళంగా లక్షలు కావాల్సొచ్చాయి.


శివశంకర్‌ ఆ కుటుంబాన్ని ఆదుకుందుకు ముందుకొచ్చాడు.

ఇచ్చింది లక్షలు - కానీ పెట్టిన షరతు ఒక్కటే!

ముక్తని తనకిచ్చి పెళ్లి చెయ్యాలి.


మామూలు షరతా అది - ఓ కన్నెపిల్ల భావి కలల్ని నేలరాచే షరతు. ఐనా అతడు మహానుభావుడే - ఎందుకంటే తన షరతు విషయంలో ఆయనకో క్లారిటీ ఉంది.

తమ పెళ్లికి ఆమెను కన్నవారు ఒప్పుకుంటే చాలదు. ముక్త ఒప్పుకోవాలి - అదీ మనస్ఫూర్తిగా...


మామూలుగా ఏ కూతురికైనా అమ్మకంటే ఏదీ ఎక్కువ కాదు.

అందులోనూ ముక్త మంచి కూతురు.


ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు ఎవర్ని చూపిస్తే వారిముందు తల వంచడానికి సిద్ధపడ్డ మామూలు ఆడపిల్లల కథలు - మన సమాజంలో కొకొల్లలు.

సాధారణంగా ఆడపిల్లలకి సద్దుబాటు గుణం ఎక్కువ.


దేవదాసుని ప్రేమించిన పార్వతి - తన ముసలిభర్త ఇంట్లో ఎంత సహజంగా ఇమిడిపోయిందో - మహా రచయిత శరత్‌బాబు 1900లోనే గొప్పగా రచించాడు.


ఆయన ఆ నవలని 1917 దాకా ప్రచురించే సాహసం చెయ్యలేదంటే - అప్పటి ఆ సమాజ పరిస్థితుల్ని అర్థం చేసుకుందుకు ఇప్పటి సమాజ పరిస్థితులు చాలు.


శివశంకర్‌తో పెళ్లికి మనస్పూర్తిగా ఒప్పుకుంటున్నట్లు ముక్త స్పష్టం చేసింది.

శివశంకర్‌ సామాన్యుడు కాదనడానికి - ఆమె అంగీకారానికి స్పందించిన తీరు చాలు.

ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకుందంటే శివశంకర్‌కి నమ్మబుద్ధి కాలేదు.


మొదటి భార్య వరలక్ష్మి విషయంలోలాగే ముక్త విషయంలోనూ ఉదారంగా ప్రవర్తించాడు.

తనుంటున్న ఇల్లు కాళీ చేసి ముక్తకు ఇచ్చాడు. ఆమెకు ఉద్యోగమిచ్చాడు. తన కంపెనీలో గౌరవస్థానమిచ్చాడు. ఆమె తల్లికి వైద్యం చేయించాడు.


సకాలంలో జరగడంవల్ల ఆమెకిక నూరేళ్లాయుష్షని వైద్యులు అన్నారు.

ముక్త ఆయనకి కృతజ్ఞతలు చెప్పింది.

‘‘నాకు కృతజ్ఞతలు కాదు. ప్రేమ కావాలి. ప్రేమతో నన్ను పెళ్లి చేసుకోవాలి’’ అన్నాడు శివశంకర్‌.


‘‘నాకు ప్రేమంటే తెలియదు. అమ్మంటే ఇష్టం. నాన్నంటే ఇష్టం. తమ్ముడంటే ఇష్టం. ఆ ఇష్టం వాళ్లతో కలిసి మెలిసి ఉండడంవల్ల పుట్టింది. ఆ ఇష్టాన్నే ప్రేమనుకుంటున్నాను. అలాంటి ఇష్టం మీమీద కలగాలంటే మనం కలిసిమెలిసుండాలి. అది పెళ్లయితేనే సాధ్యం. మీతో పెళ్లి నాకిష్టమే’’ అంది ముక్త.

శివశంకర్‌ ఇంకా తృప్తి పడలేదు.


‘‘నాతో పెళ్లి నీకిష్టమవడానికి కారణం డబ్బు. మీ అమ్మ వైద్యానికి నేను లక్షలు ఖర్చు పెట్టాను. ఆ డబ్బు మీ దగ్గర లేకపోతే నేనిచ్చాను. అందుకని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఆ డబ్బు మీ దగ్గరుంటే, నువ్వు కానీ, మీవాళ్లు కానీ నా గురించి ఆలోచించేవారు కాదు’’ అన్నాడాయన.


‘‘నా ఇష్టానికి కారణం డబ్బు కాదని మిమ్మల్ని నమ్మించడానికి ఏంచెయ్యాలి?’’ అంది ముక్త.


ఆమె గొంతులో వ్యధని శివశంకర్‌ గుర్తించాడు. ‘‘నా మాటలకి నొచ్చుకోవద్దు. ఒకొక్కరిది ఒకో తత్వం. నా తత్వానికి సరిపడని పనులు నేను చెయ్యలేను. కాబట్టి చెబుతున్నాను’’ అన్నాడు.


ఆయన చెప్పిన ప్రకారం - ప్రభాదేవి వైద్యానికి తను చేసిన ఖర్చుని అప్పుగా భావించాలి.

అది వడ్డీ లేని అప్పు. తీర్చడానికి మూడేళ్లు గడువు. మూడేళ్లలో అప్పు తీర్చలేకపోతే - ఆయనతో పెళ్లి ఆమెకి తప్పనిసరి. తీర్చేస్తే మాత్రం - పెళ్లి విషయంలో ఆమెకు ఛాయిస్‌ ఉంది.


ఇష్టం లేదంటే - ఆయనేమీ అనుకోడు. మనస్ఫూర్తిగా ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తాడు.

‘‘అప్పు తీరేక కూడా నువ్వు ఇష్టమని చెప్పావనుకో - సంతోషంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను’’ అన్నాడు శివశంకర్‌.


ముక్త కథ చెప్పడం ఆపింది. చెబుతున్నంతసేపూ ఆమె తనువులో ఉత్సాహం.

ఆమె కళ్లలో ఆరాధనాభావం. అది శివశంకర్‌పైనే అని నాకు స్పష్టమయింది.


ఒక మనిషిని ప్రేమించడానికి - రూపమొక్కటే కాదు, ఎన్నో కారణాలుంటాయి.

నేనిక్కడికి ముక్త రూపం చూసే వచ్చానని స్పురించగానే చిన్నతనంగా అనిపించింది.

ఆ మాటలు నా తలకెక్కలేదు.


శివశంకర్‌ వ్యక్తిత్వం నా మనసుని గజిబిజి చేసేసింది.

ప్రపంచంలో స్వార్థం పెచ్చుమీరిపోయిందనీ, మంచితనం మచ్చుకైనా కానరాదనీ చెప్పుకుంటున్నాం.


ఈ భూమ్మీద ఇంకా శివశంకర్‌ లాంటివాళ్లు ఉన్నారా?

నేనింకా ఆలోచిస్తున్నాను.


‘‘ఇప్పుడు మనం లంచికి వెడదాం. మిగతా కథ తర్వాత’’ అంది ముక్త.


టైం చూసుకుంటే - ఒంటిగంట కావస్తోంది. అప్పుడే ఒంటిగంటయిందా - అనుకున్నాను.

నాకు భోజనంకంటే - కథ మీదే ఆసక్తిగా ఉంది. ‘‘ఆకలి లేదు’’ అందామనుకున్నాను.

కానీ ఆమె చెప్పడంలో - నాకు ఆప్షన్‌ ధ్వనించలేదు. రూపానికి తగ్గ హుందాతో - మహారాణిలా తన నిర్ణయం చెప్పిందామె.


ఆమెతో పాటే లేచాను.

ఇద్దరం డైనింగ్‌ రూంలోకి వెళ్లాం.


గదిలోకి అడుగు పెడుతుండగానే ప్రభాదేవి ఎదురై, ‘‘రా బాబూ!’’ అంది ఆప్యాయంగా.

ముక్త తండ్రి ఆఫీసుకి వెళ్లాడు. తమ్ముడు కాలేజి. ఇద్దరూ ఇంటికొచ్చేసరికి రాత్రి ఔతుంది.


ప్రస్తుతం ఇంట్లో మేం ముగ్గురమే ఉన్నాం.

డైనింగ్‌ టేబుల్‌కి ఆరు కుర్చీలున్నాయి. ఓ పక్కన ముక్త, తల్లి కూర్చున్నారు. వాళ్లకి ఎదురుగా నేను కూర్చున్నాను.


అప్పటికే గిన్నెలు, ప్లేట్లు సద్ది ఉన్నాయి. ఇందాకటి నడివయస్కుడు వచ్చి - ముగ్గురికీ వడ్డించాడు.

వంటలు చాలా బాగున్నాయి.


‘‘పాళ్లు అమ్మవి. వంట జోగారావు మామయ్యది’’ అంది ముక్త.

నడివయస్కుడి పేరు జోగారావు అని తెలిసింది.


‘‘ఏం వంట లేమ్మా! అన్నీ అక్కయ్యగారు పక్కనుండి చెప్పాలి’’ అని నాకేసి తిరిగి, ‘‘అదృష్టమంటే నాది బాబూ! వంటవాడిగా జీతం తీసుకుంటున్నాను. నిజానికి ఇక్కడ పొందుతున్న శిక్షణకి నేనే వారికి ఫీజు కట్టాలి. ఏమిచ్చి అక్కయ్య ఋణం తీర్చుకోగలను’’ అన్నాడు జోగారావు.


అతడి గొంతులో కృతజ్ఞతతో కూడిన తడి ఉంది.


‘‘తనలాగే అంటాడు. ఎప్పుడైనా వంట నేను చెయ్యాల్సొస్తే అమ్మ నా పక్కనే ఉంటుంది. కానీ మా జోగారావు మామయ్య చేసినట్లు ఒక్కసారి కూడా రాలేదు’’ అంది ముక్త.


‘‘అమ్మాయి మాట నిజం. నాకు నేనుగా వంట చేసినా మా తమ్ముడు చేసినట్లు రాదు. చెప్పడంలో లేదు, అంతా హస్తవాసి’’ అంది ప్రభాదేవి.


ఓ వంటమనిషి. ఇద్దరు యజమానులు.

వరుసలు కలిపి పిల్చుకుంటున్నారు. ఒకరినొకరు పొగుడుతున్నారు.


బేషజాలు లేవు. అరమరికలు లేవు. ఆ ముగ్గురూ కూడా ఓ కుటుంబంలా ఉన్నారు.

అంతా మంచివాళ్లయితే - ‘జగమంత కుటుంబము నాది’ అని కలిసిపోతారా?

అలా కలిసిపోవడానికి - ఏ ఇజాలూ అక్కర్లేదు.


కొంచెం మంచి, కొంచెం అవగాహన.

భోంచేస్తుంటే నాకెంతో ఆహ్లాదంగా అనిపించింది. ఈ ఇల్లు కలకలం ఇలాగే ఉంటే - తరచుగా ఈ ఇంటికొచ్చి భోంచేసి వెడుతుండాలనిపించింది.


మరి ముక్త శివశంకర్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతే - ఈ ఇల్లిలాగే ఉంటుందా?

మనసు నాకు బదులిచ్చింది, ‘‘ముక్త ఎక్కడికెడుతుంది? శివశంకర్ని పెళ్లి చేసుకుంటే - ఆయనా ఇక్కడికే వచ్చి ఉంటాడు’’ అని.


నిజమే - మంచితనంలో శివశంకర్‌ వీళ్లందర్నీ మించినవాడు.

జోగారావుని ఆయన బాబాయ్‌ అని పిలువగలడు.

కానీ ఇద్దర్లో ఎవరు పెద్ద?


జోగారావుకి శివశంకర్‌ అన్నయ్యలా ఉండడూ -

మరి ఆ వయసులో ఇంత చిన్నపిల్ల ముక్తని పెళ్లి చేసుకోవాలనుకోవడం - మంచితనం అనిపించుకుంటుందా?


మనసులో చిన్న అపస్వరం.

శివశంకర్‌ అంటే గౌరవమేర్పడింది. కానీ - ఆయన ముక్తని పెళ్ల్లి చేసుకుంటాననడాన్ని హర్షించలేకపోతున్నాను.


పెళ్లి కావాలంటే తన ఈడుకి తగ్గ వనితని చేసుకుంటే బాగుండేది...

అయినా శివశంకర్‌ ఆమెకో ఆప్షనిచ్చాడుగా – కావాలనుకుంటే అప్పు తీర్చేసి ఆయన్ని వదిలించుకోవచ్చు. కానీ ముక్త అప్పు తీర్చగలదా?


జవాబు నాకేం తెలుసు?

ముక్త చెప్పబోయే ముందు కథలో తెలుస్తుందేమో......


భోజనాలవగానే అడిగింది ముక్త, ‘‘కాసేపు పడుకుంటారా?’’ అని.

‘‘ఆఫీసుకెడితే పడుకోనుగా’’ అన్నాను చప్పున.


నాకామె కథ వినాలని మహా కుతూహలంగా ఉంది.


ఇద్దరం మళ్లీ క్యూబికిల్‌ లోకి వెళ్లాం. ఎవరి స్థానాల్లో వాళ్లు కూర్చున్నాం.


ఇంకా ఉంది...


ప్రేమ ‘భ్రమ’రం - 9 త్వరలో..

వసుంధర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


వసుంధర పరిచయం: మేము- డాక్టర్‌ జొన్నలగడ్డ రాజగోపాలరావు (సైంటిస్టు), రామలక్ష్మి గృహిణి. రచనావ్యాసంగంలో సంయుక్తంగా ‘వసుంధర’ కలంపేరుతో తెలుగునాట సుపరిచితులం. వివిధ సాంఘిక పత్రికల్లో, చందమామ వంటి పిల్లల పత్రికల్లో, ‘అపరాధ పరిశోధన’ వంటి కైమ్ పత్రికల్లో, ఆకాశవాణి, టివి, సావనీర్లు వగైరాలలో - వేలాది కథలు, వందలాది నవలికలూ, నవలలు, అనేక వ్యాసాలు, కవితలు, నాటికలు, వినూత్నశీర్షికలు మావి వచ్చాయి. అన్ని ప్రక్రియల్లోనూ ప్రతిష్ఠాత్మకమైన బహుమతులు మాకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చాయి. కొత్త రచయితలకు ఊపిరిపోస్తూ, సాహిత్యాభిమానులకు ప్రయోజనకరంగా ఉండేలా సాహితీవైద్యం అనే కొత్త తరహా శీర్షికను రచన మాసపత్రికలో నిర్వహించాం. ఆ శీర్షికకు అనుబంధంగా –వందలాది రచయితల కథలు, కథాసంపుటాల్ని పరిచయం చేశాం. మా రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. తెలుగు కథకులందర్నీ అభిమానించే మా రచనని ఆదరించి, మమ్మల్ని పాఠకులకు పరిచయం చేసి ప్రోత్సహిస్తున్న మనతెలుగుకథలు.కామ్ కి ధన్యవాదాలు. పాఠకులకు మా శుభాకాంక్షలు.



36 views0 comments

Comments


bottom of page