top of page
Writer's picture Lavanya Kumari Pendekanti

ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 8


'Prema Chejarithe 8' New Telugu Web Series

Written By Pendekanti Lavanya Kumari

ప్రేమ చేజారితే - ధారావాహిక ఎనిమిదవ భాగం

రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి

(ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)

గత భాగంలో జరిగినది: "కుశాల్ ఇలాగే మాటిమాటికీ మూర్చపోవటం మంచిది కాదు, కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదముంది. మేము ఈ విషయం గురించి న్యూరాలజిస్ట్ తో డిస్కస్ చేసి తర్వాత ఏమి చేయాలో నిర్ణయించుకుని మీకు చెప్తాము, కాసేపు వెయిట్ చేయండి, " అని కుమార్తో చెప్పి డాక్టర్లు వెళ్ళిపోయారు. డాక్టర్ల కోసం కుమార్ ఎదురు చూస్తుంటాడు.

ప్రేమ చేజారితే - 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇక ఈ భాగం చదవండి: ఇంతలో డాక్టర్ వచ్చి కుమార్తో మీ అబ్బాయికి న్యూరలాజికల్గా(అంటే మెదడు కణాలలో) ఏ ఇబ్బందీ లేదు. కేవలం చూసిన విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. అసలేం జరిగిందో వివరంగా చెప్పండని అడగగా, కుమార్ జరిగిన విషయం చెప్పి, నిజానికి పడిపోయిన వాళ్ళమ్మకు పెద్దగా దెబ్బలేవీ తగలలేదనీ, కాకపోతే షాలిని అలా పడటంతో, ఆమె మెడకున్న ఎర్రని స్కార్ఫ్ తల చుట్టూ పడింది, పైనుండి దాన్ని చూసిన కుశాల్ రక్తమనుకుని భయంతో మూర్చపోయాడనుకుంటాను అని చెప్పాడు కుమార్. అదంతా విన్న డాక్టర్లు, అయితే సైకియాట్రిస్టైతేనే దీనికి తగిన ట్రీట్మెంట్ చేయగలడన్న నిర్ణయానికి వచ్చి కుమార్తో కుశాల్కు సైకియాట్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామని చెప్తారు. డాక్టర్లు చెప్పింది విన్నాక, కుమార్ తమ కాలనీ హాస్పిటల్కే షిఫ్టయ్యి, అక్కడి సైకియాట్రిస్టుకే చూపించటానికి ఆ డాక్టర్ల దగ్గర అనుమతి తీస్కోని, కాలనీ హాస్పిటల్కు కుశాల్ను షిఫ్ట్ చేస్తాడు. అక్కడ సైకియాట్రిస్టైన నితిన్ను కలిసి జరిగిన విషయమంతా చెప్తాడు కుమార్. నితిన్ ఆ కాలనీవారి కోసం అక్కడే వుంటున్న సైకియాట్రిస్టు, ఆయనకు ఆ కాలనీ గురించి, ఆ కాలనీ వాసుల గురించి పూర్తిగా తెలుసు. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ వల్ల పిల్లలకు ఎలాంటి మనస్తాపం కలుగకుండా వుండేందుకు గాను ముందునుంచే పిల్లల మానసిక స్థితిని పర్యవేక్షుస్తున్నాడు నితిన్. "కుశాల్ తన తల్లికి తనవల్లే ఏమో అయ్యిందనీ, ఇంక తనకు తల్లి దక్కదేమోనన్న షాక్కు లోనయ్యి, మూర్చనుండి లేవగానే మళ్ళీ అది గుర్తుకు వచ్చి మూర్చపోతున్నాడు, " అని చెప్తాడు నితిన్. మళ్ళీ తనే కుమార్తో, " షాలిని క్రింద పడినప్పుడు, కుశాల్ కానీ షాలినిని గురించి ఏమైనా గమనించి వుంటాడంటావా ?" అని అడిగాడు. దానికి కుమార్, "అదే నాకూ అర్థం కావటం లేదు, " అని అంటాడు నితిన్తో. ఆ విషయం గురించి నితిన్ బాగా ఆలోచించి, " 'కుశాల్కు షాలిని గురించి తెలిసినా, తెలియకపోయినా ఏ ఇబ్బంది కలగని విధంగా మనమొకటి చేయవచ్చు. అదేమంటే, కుశాల్ మెదడులో నుండి ఆ సంఘటనను మర్చిపోయేలా చేయటమే. దాని వల్ల అదంతా మర్చిపోయి మామూలుగా అవుతాడు, కాకపోతే మెదడులోని ఙ్ఞాపకం తీసేసేప్పుడు, అదొక్కటే తీసేయలేము, దానికి ముందు కొన్ని రోజుల ఙ్ఞాపకాలు కూడా మరిచిపోతాడు. అయినా ఆ ఙ్ఞాపకాలు పూర్తిగా చెరిగి పోవు సబ్ కాన్షియస్ లో అలానే వుంటాయి, మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు గుర్తుకు వచ్చే ప్రమాదమైతే వుంది, ' అని చెప్పి. 'అలాగే ఇప్పటి నుండి, కుశాల్ ఎప్పుడు తన తల్లి ప్రేమను కోల్పోతానేమోనన్న అభద్రతా భావానికి లోనయ్యి ఏదైనా ఆలోచించే ప్రయత్నం చేస్తాడో అప్పుడు తలనొప్పి వచ్చే ప్రమాదముంది. అప్పుడు కుశాల్కు అన్నీ చెప్పి కౌన్సెలింగ్ ఇవ్వక తప్పదు, ' " అని సైకియాట్రిస్ట్ నితిన్ అంటాడు కుమార్తో. దానికి కుమార్, "సరే"నని ఒప్పుకుంటాడు. నితిన్ తన హిప్నొటైజేషన్ టెక్కిక్తో కుశాల్ మెదడులోని 'షాలిని గుంతలో పడి బండ రాయిని గుద్దుకుని రక్తం చిందిన ఙ్ఞాపకాన్ని' మరిచి పోయేలా చేస్తాడు. దానితో పాటు ఇంకొన్ని రోజుల మామూలు ఙ్ఞాపకాలు కూడా మరిచిపోతాడు కుశాల్. ఆ ట్రీట్మెంట్ తర్వాత కుశాల్ మూర్చ నుండి బయటికొచ్చి, తను కొన్ని సంఘటనలు మర్చిపోయినట్టు తెలియక మామూలుగా మాట్లాడసాగాడు. అప్పటికి కానీ కుమార్ ఆందోళన తగ్గలేదు. తర్వాత ఆనందంగా, మనస్పూర్తిగా నితిన్కు కృతజ్ఞతలు తెలుపుతాడు కుమార్. *** ఇక ఊర్లో వుండే రమేష్, లలిత లాంటి వారి జీవితాలలో పెద్దగా తేడా లేదు. ఉద్యోగాలు, లోన్లు, వేటిని ఎంత సంపాదించాలి? ఎలా తీర్చాలి? ఏ ప్రమోషన్ సంపాదిస్తే ఇంకేమి కొనగలిగి, తమ పిల్లల జీవితాలను అద్భుతంగా మార్చగలమనే ఆలోచనలతో పిల్లలకు అందివ్వాల్సిన భద్రతను, శిక్షణ-సంస్కారాలను విస్మరిస్తున్నామన్న ఆలోచన కూడా లేకుండా ఆ జంజాటంలోనే బ్రతికేస్తున్నారు. ఎప్పటిలాగే మౌనిక పొద్దున్నే పాలతో కార్న్ ఫ్లేక్సో లేకపోతే బ్రెడ్డూ-జామో తినేసి మధ్యాహ్నానికి, వాళ్ళమ్మ పొద్దున్నే గబగబా చేసిన ఏదో ఓ రైస్బాత్ని క్యారియర్ కట్టుకు తీస్కెళ్తుంది. సాయంకాలానికి స్నాక్సుగా బిస్కెట్లో, కేకో, కుకీసో పెట్టిస్తే అవి తిని, స్కూల్లో చెప్పే ట్యూషన్లో ఆరు గంటల వరకు గడిపాక, అప్పుడు వాళ్ళమ్మ ఆఫీసు నుండి ఇంటికి వచ్చేప్పుడు స్కూల్ దగ్గర దిగి మౌనికను ఇంటికి తీసుకు వస్తుంది. ఆ తల్లిదండ్రులకు ఎదుగుతున్న పిల్లలకు తాము ఇచ్చే ఆహారంలో తగిన పోషకవిలువలు వున్నాయా, లేవా? అసలు ఇలా ప్రాసెస్డు ఫుడ్ ప్రతిరోజూ తినొచ్చా? తిన్నా ఎంత మోతాదులో తినొచ్చు, లాంటివి తెలుసుకుని, వేరే ఎలా చెయ్యొచ్చు అని ఆలోచించే సమయమస్సలుండదు. అందరూ చేస్తున్నారు కదా, వాళ్ళలాగే మనమూ, నలుగురిలో నారాయణ అనుకునేవారే ఎక్కువ. అయినా ఆఫీసు పని చేసొచ్చి, ఇంటిపని చేసాక వారికంత సమయమెక్కడుంటుంది చెప్పండి. ప్రతి ఒక్కరికీ వుండేది 24గంటలే, తక్కువ విశ్రాంతి తీస్కుని ఎక్కువ శ్రమ పడ్తూ ఆరోగ్యం పాడు చేస్కోవటం అవసరమా అనిపిస్తుంది. ప్రభుత్వము ఇలాగ ప్రిజర్వేటివ్సున్న ప్రాసెస్డు ఫుడ్ను మార్కెటింగ్ చేయటానికి అంగీకరించినపుడు, వాటిని తినటం వల్ల కలిగే సౌలభ్యాలతో పాటూ ఎంత మోతాదులో తినాలో, అలాగే చాలా రోజులు అవే తినటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి కూడా జనానికి అవగాహన కలిగించాలి, అప్పుడే మరో తరం ఆరోగ్యంగా ఎదుగుతారు. ఏం తింటున్నామో పట్టించుకోకుండా జబ్బులొస్తున్నాయని బాధపడుతే ఎలా? కేవలం జనాభాను పెంచుకుంటూపోతుంటే, వాసిలేని రాసి మిగిలి, తర్వాత ఆ రాసి కూడా తరుక్కుపోతుంది. అనారోగ్యమైన జనాభా ఎంతో వుండేకంటే ఆరోగ్యమైన జనాభా కొందరున్నా ఎంతో బాగుంటుంది కదా. (ఈ కాలంలో కూడా ఇద్దరూ ఉద్యోగస్తులైతే అలానే వుంటోంది, ఇప్పుడే ఈ పరిస్థితిని గురించి అందరూ ఆలోచించి చక్కదిద్దుకుని మార్పులు, చేర్పులు చేసుకుంటే, తర్వాతి కాలంలో ఇలాంటి ఒక పరిస్థితే ఉత్పన్నం కాకపోవచ్చన్న అభిలాషతో వ్రాసాను.) ఇంక కొందరిళ్ళలో ఆరవ తరగతి కంటే పెద్ద తరగతులు చదివే పిల్లలైతే స్కూలు అయిపోగానే వాళ్ళే ఒక్కరుగా ఇంటికి వచ్చి ఇంటి తాళం తామే తీస్కోని వాళ్ళ పెద్దవాళ్ళు వచ్చే వరకు ఒంటరిగా ఇంట్లోనే వుంటుంటారు. ఇంక వాళ్ళిష్టము ఎలాంటి ప్రోగ్రాములు చూస్తారో, ఎవరితో మాట్లాడ్తారో అన్నది. ప్రతి ఇంట్లో సర్వేలెన్స్ కెమెరాలు వుంటాయి, వాటి ద్వారా ప్రతి ఒక్కరి తల్లిదండ్రులూ ఇంటికి వచ్చిన పిల్లలు ఏమి చేస్తున్నారనేది ఎప్పుడు కావాలన్నా ఆన్ చేస్కోని గమనించవచ్చు. కానీ వారికి అంత టైముండాలిగా?!. మొదట అంత బాధ్యతగా వుండాలనే ఆలోచన వుండాలిగా, ఏదో జరిగిపోతోందిలే, మనం మాత్రం అంతకంటే ఏం చూస్కోగలం అనుకుంటే మాత్రం తర్వాత బాధ పడక తప్పదు. ఈ విధంగా ఇలాంటి కుటుంబాలలోని పిల్లలకు, తల్లి నిదానంగా వండి అందించాల్సిన సంపూర్ణ పోషకాహారము మరియు భద్రత ఎప్పుడైతే అవసరమో, అప్పుడే అవి సరిగ్గా అందకుండా పోతున్నాయి. అలాగే ఇంటికి వచ్చాక తల్లిదండ్రుల అజమాయిషీ లేక చెడు మార్గాల వైపుకు మళ్ళే పిల్లలెందరో. మన భారతదేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువ, రానున్న తరంలోని మధ్య తరగతి వారు ఆరోగ్యవంతులుగా వుంటేనే దేశ భవిత ఉజ్వలంగా వుంటుంది, వారు ఆరోగ్యంగా వుండాలంటే వారి తల్లిదండ్రులే కాక ప్రభుత్వము కూడా బాధ్యతగా వుంటేనే సాధ్యం. ఆలోచించండి. *** ఇక్కడ కాలనీలో కుశాల్కు టీనేజీ లోకి వచ్చే కొద్దీ రకరకాల అనుమానాలు తలెత్త సాగాయి. వాడికి కొద్దిగా తల్లిదండ్రులపైన ప్రేమ పాళ్ళు ఎక్కువ, అందుకే వాడి ఆలోచనలన్నీ వాళ్ళ అమ్మా, నాన్న చుట్టూ తిరుగుతూ వుండేవి. అలాగే వాళ్ళ మీద ఎంతో ప్రేమను కూడా పెంచుకున్నాడు. అదే ప్రేమ తనకు ఎప్పుడూ వుండాలనే కోరిక కూడా వాడికి బలంగా వుంది. వయసుతో పాటూ, సహజ కుతూహలంతో అందరినీ పరిశీలనగా చూసే ఆసక్తి కూడా బాగా పెరిగిపోయింది కుశాల్కు. అందుకే వాడికి ఈ మధ్య వాళ్ళమ్మ నిజంగా తనకు అమ్మేనా అన్న అనుమానం మొదలయ్యింది, నేను అమ్మలా ఎందుకు చేయలేను, అమ్మ ఎంత పనైనా సులువుగా ఏ ఇబ్బందీ కనపడనీయకుండా ఎలా చేస్తోంది? కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నాకు కరెక్ట్ టైమ్కు అన్నీ ఎలా చేసి పెడ్తోంది. నేనెందుకు అలా ప్రతిరోజూ ఒకేలా అన్నీ చేస్కోటానికి ఇష్టపడలేకపోతున్నాను? నాన్నకైతే ఆఫీసు పనులు కాబట్టి, ఎప్పుడూ ఒకే రకమైన పనులే వుండవు, అందుకే బోర్ కొట్టక ఉత్సాహంగా చేస్తాడనుకోవచ్చు. మరి అమ్మ ఎప్పుడూ చేసే పనులను విసుగు చెందకుండా ఎలా చేయగలుగుతుంది. నిజంగా అమ్మ చాలా గొప్పగా, ఓపికగా చేస్తుందని అనిపించసాగింది వాడికి. ఇలాంటి ఆలోచనలు కుశాల్ని ఇబ్బంది పెట్ట సాగాయి. నాకెందుకు ఈ మధ్య అమ్మ వేరేగా అనిపిస్తోంది, నిజంగా నేననుకునేది నిజమేనా అన్న అనుమానాలు రేకెత్తసాగాయి కుశాల్కు. తన అనుమానాలు నివృత్తి చేస్కోటానికి, తన స్నేహితుల అమ్మానాన్నల గురించి తెలుసుకోవటానికి వారిని అడగాలనుకునేవాడు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడంతా కుశాల్కు విపరీతమైన తలనొప్పి రావటం మొదలయ్యేది. అందుకే కుమార్ మరియు సైకియాట్రిస్ట్ నితిన్ మాట్లాడుకుని కుశాల్కు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కుశాల్తో పాటే మిగిలిన పదిమంది క్లాసు పిల్లలకు కూడా ఈ కౌన్సెలింగ్ ఎప్పటికైనా అవసరమే అనుకుని, కుశాల్తో పాటూ మిగిలిన పదిమంది క్లాసు పిల్లలకు కూడా కౌన్సెలింగ్ మొదలెట్టారు. 'కౌన్సెలింగ్' అంటే ఏదో మెంటల్ డిజెబిలిటీ వున్న వారికి మాత్రమే ఇచ్చేదని చాలామంది అపోహ పడుతుంటారు. అలా అస్సలు కానే కాదు, 'కౌన్సెలింగ్' అంటే కొన్ని తెలియని విషయాలను, తెలిసీ తెలియని విషయాలను అర్థమయ్యే విధంగా తెలియచేసి, వారి అవగాహనా శక్తిని పెంచటమే. అంతే కానీ అదసలు ట్రీట్మెంట్ అనలేము కానీ అదీ ట్రీట్మెంట్లో ఒక భాగమే. మెడిసిన్లు ఇవ్వటానికి ముందుగా, అది కౌన్సెలింగ్లోనే తగ్గి పోతుందేమోనని ఒక ప్రయత్నం చేసి చూస్తారు. అలా వీలుకాకపోతేనే మెడిసిన్లను రెండో ప్రయత్నంగా వాడుతారు. కౌన్సెలింగ్ని అర్థం చేస్కోగల్గితే అది ట్రీట్మెంట్కు ఎంతగానో దోహదపడ్తుంది. కౌన్సిలింగ్లో భాగంగా, కుశాల్తో పాటూ మిగిలిన పదిమంది క్లాసు పిల్లలను కూడా ఊరిలోని పిల్లలతో కలిసి మాట్లాడే విధంగా, అలాగే వాళ్ళలో కొందరితో స్నేహం చేసేలా ప్రోత్సహించారు. అలా కుశాల్కు మౌనికతో సహా ఇంకో ఇద్దరి, ముగ్గురితో పరిచయమేర్పడింది. కుశాల్కి, మౌనిక పాజిటివ్గా మాట్లాడే విధానం బాగా నచ్చి ఎక్కువగా మాట్లాడేవాడు. అలా వాళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకున్నారు. అలా వారు ఎలా జీవిస్తారో, వారి ఇళ్లలో ఎలాంటి వసతులు వుంటాయో తెలుసుకుంటాడు కుశాల్. అలా వాడికి చాలా కుటుంబాలలో సంపాదించటం కోసం తల్లిదండ్రులిరువురూ కష్టపడ్తారని తెలుస్తుంది. కుశాల్ని వాళ్ళమ్మ చూస్కున్నట్లుగా చూసేంత సమయం వాళ్ళమ్మలకు లేకపోయినా వాళ్ళు కూడా దానికి తగినట్లుగా పిల్లలకు చేసిపెడ్తూ ఆనందంగా వుంటారనేది తెలుసుకుంటాడు. అలాగే సైకియాట్రిస్టు నితిన్, కుశాల్ను, వాడి పదిమంది క్లాసు పిల్లలను ఒక అనాథాశ్రమానికి తీస్కెళ్ళి అక్కడి దినచర్యను కూడా చూపించాడు. ఆ అనాథాశ్రమంలోని పిల్లలకు మంచి, చెడు నేర్పించటానికీ, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతూ చదువు నేర్పించటానికని ఒక స్కూలు కూడా అనాథాశ్రమానికి అనుసంధానంగా వుంది. అలాగే పిల్లల మానసిక స్థితిని గమనించటానికి ఒక సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ కూడా వుంది. అక్కడ సైకియాట్రిస్ట్ ఎవరో కాదు 'డాక్టర్ నితిన్' భార్య అయిన 'డాక్టర్ నిధి', తను చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీలో ఎమ్.డి చేసింది. ఈమె తన అసిస్టెంట్లతో కలిసి ఆ అనాథల మానసిక వ్యక్తిత్వ వికాసానికి దోహదపడ్తుంటారు. ఈమె అక్కడ ఎలాంటి ఫీజు తీస్కోకుండా స్వచ్చందంగా పని చేస్తోంది. దానికి నితిన్ కూడా పూర్తి సహకారం అందిస్తున్నాడు. ఇప్పటికే మనుషులలో మానసిక రుగ్మతలు పెరిగిపోయాయి, ఇంక భవిష్యత్తు కాలంలోని తరాలలో అవి మరీ ఎక్కువ మందిలో కనపడుతుండటంతో చిన్నప్పటి నుండే పిల్లల్లో మానసిక వత్తిడి తగ్గించి, మనో నిబ్బరం పెరగటానికి ప్రతి స్కూలులోనూ ఒక సైకియాట్రీ డిపార్ట్మెంట్ వుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొదట నితిన్ కాలనీ పిల్లలందరినీ అనాథాశ్రమానికి తీస్కెళ్ళాక, అక్కడి ఆయాలు ఎలా పనిచేస్తున్నారో గమనించి నాకు చెప్పాలని చెప్పి, అక్కడున్న కొన్ని గదులను చూపించాడు. అక్కడ కొంతమంది ఆయాలు పిల్లలను చూస్కుంటూ వున్నారు, "మీరంతా ఆ గదులకున్న కిటికీల దగ్గర నిశ్శబ్దంగా నిల్చుని అక్కడ ఏమి జరుగుతుందో శ్రద్ధగా గమనించి నా దగ్గరకు రండి, " అని చెప్పి పంపాడు నితిన్. వాళ్ళు అక్కడికెళ్ళి ఒక్కొక్క కిటికీ దగ్గర కాసేపు నిల్చుని గమనించసాగారు. అక్కడ నెలల పిల్లలనైతే ఆరు మంది నుండి పది మంది పిల్లలను ఇద్దరేసి ఆయాలు చూస్కుంటున్నారు. అలాంటివి మూడు గదులున్నాయి. అలాగే సంవత్సరం నుండి మూడేళ్ళ పిల్లలను సైతం ఆరు నుండి పది మంది పిల్లలను ఇద్దరేసి ఆయాలు చూస్కుంటున్నారు. ఇంక మూడు నుండి ఐదేళ్ళ పిల్లల వరకు వున్న గదులలో పది మంది దాకా ఈ పిల్లలుంటే మరో పదిమంది పదహైదేళ్ళ వయసు పిల్లలు వుండి ఆ చిన్న పిల్లలకు ఒక్కో పెద్దపిల్ల సహాయం చేస్తోంది, ఒక్క ఆయమ్మ మాత్రమే అక్కడ వుండి అందరినీ గమనిస్తూ పెద్ద పిల్లలకు ఎలా చూస్కోవాలో చెప్తోంది. ఇంక మిగిలిన గదులలో ఒక్కొక్క గదిలో పది నుండి పదహైదు మంది పిల్లలను ఒక్క ఆయమ్మనే వుండి వారు కొట్లాడుకోకుండా తమ పనులు తాము చేస్కునేలా చూస్కుంటూ వుంది. ఇదంతా ఈ పిల్లలు చూసి వచ్చి నితిన్తో, " 'అక్కడున్న పెద్దవారు పిల్లలకు తల్లిదండ్రులు కాకపోయినా వారిని బాగా చూస్కుంటున్నారని మాకనిపించింది, ' అని చెప్పి, 'కాకపోతే కొందరు గొణుక్కుంటూ చేస్తున్నారు, కొందరు మామూలుగా చేస్తున్నారు, కొందరు పిల్లలకు ఏవో చెప్తూ, నవ్విస్తూ, ఏమైనా ఏడుస్తుంటే సముదాయిస్తూ చేస్తున్నారు, ' " అని చెప్పారు. కుశాల్ కూడా అదే చెప్పి తర్వాత, " నాకైతే ఆ ఆయాలలో నవ్విస్తూ ఏమాత్రం విసుగు చెందకుండా పిల్లలను చూస్కుంటున్న ఆయాలను చూస్తుంటే మా అమ్మనే గుర్తొచ్చింది, " అన్నాడు. అప్పుడు నితిన్, " 'కరెక్ట్ తల్లిదండ్రులు లేని పిల్లలకు సైతం మన అమ్మల్లాంటి అమ్మలుంటే ఎంతో బాగుంటుంది కదా, దాని కోసమే మా ఈ ప్రయత్నమంతా, ' అని చెప్పి, 'గుడ్ కుశాల్! బాగా గమనించావు, ' " అని కితాబునిచ్చాడు. అక్కడున్న పిల్లలకు తల్లిదండ్రులు లేకపోవటం వల్ల ప్రభుత్వమే వాళ్ళ బాగోగులు చూస్కుంటుందనీ, వారిలో చిన్నవారిని ఆయాలు చూస్కుంటారనీ, పెద్దగయ్యే కొద్దీ వాళ్ళ పనులు వాళ్ళే చేస్కునేలా తయారు చేస్తారనీ తెలుసు కుంటారు కుశాల్ మరియు కుశాల్ క్లాస్మేట్సు. తల్లిదండ్రులిద్దరూ లేకపోయినా వారెంత ధైర్యంగా జీవితంలో మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఎలా పట్టుదలగా ఎదుగుతున్నారో తెలుసుకుని ఏదో ఆలోచిస్తాడు కుశాల్. అలాగే అక్కడి పిల్లలతో వీరిని మాట్లాడిస్తాడు నితిన్. మీకు నచ్చి మాట్లాడాలన్పించిన వారితో స్నేహం చేసి అప్పుడప్పుడూ మాట్లాడమని ప్రోత్సహిస్తాడు కూడా. దానితో కుశాల్కు అక్కడ కూడా ఒకరిద్దరు మంచి స్నేహితులయ్యారు, వాళ్ళలో అఖిల్ చాలా క్లోజ్ అయ్యాడు. అందుకే వాడితో కూడా అప్పుడప్పుడూ మాట్లాడ్తుంటాడు కుశాల్. దానికి నితిన్, నిధిలు పూర్తి సహకారం అందించేవారు . ఇలా వాళ్ళందరికీ కౌన్సెలింగ్ కొనసాగిస్తుంటాడు డాక్టర్ నితిన్. (తర్వాతి కథ మరో భాగంలో) ============================================================

ఇంకా వుంది



============================================================

పెండేకంటి లావణ్య కుమారి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

Podcast Link

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం:

నేను చదివింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ గృహిణిగా స్థిరపడ్డాను. కవితలు, కథలు వ్రాయటం నా ప్రవృత్తి. పదవతరగతి ఆటోగ్రాఫ్లో వ్రాయటంతో మొదలయ్యింది. ఏదైనా శుభాకాంక్షల్లాంటివి చెప్పటానికి, ఎవరైనా అడిగితేనో వ్రాయటం చేసేదాన్ని. నేను అప్పుడప్పుడూ వ్రాసుకున్న కథలను చదివిన మా అమ్మాయి నన్ను కథలు బాగా వ్రాయగలవని ప్రతిలిపిలో వ్రాసేలా ప్రోత్సహించింది. కొన్ని నెలల నుండి కథలు, కవితలు ప్రతిలిపిలో వ్రాస్తున్నాను. నేను నా కథలు సమాజానికి ఉపయోగ పడేలా వుండాలి అనే ధోరణిలోనే చాలా మటుకు వ్రాసాను. ఇప్పటికి హాస్యం, హారర్, డిటెక్టివ్ లాంటి అన్ని రకాలలో కథలు వ్రాసాను. రకానికొక్క కథైనా వుండాలని అన్ని రకాల కథలను ప్రతిలిపిలో వ్రాసాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.







27 views0 comments

コメント


bottom of page