ప్రేమ ఎంత బధిరం పార్ట్ 1
- Lalitha Sripathi
- Jul 29, 2023
- 5 min read
Updated: Aug 21, 2023

'Prema Entha Badhiram Part 1/3' - New Telugu Story Written By Sripathi Lalitha
'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 1/3' పెద్ద కథ ప్రారంభం
రచన: శ్రీపతి లలిత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"ప్రేమ ఎంత బధిరం"
( ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు, చెవిటిది కూడా )
"అమ్మా!"
ఫోన్ ఎత్తగానే ప్రవీణ్ గొంతు సుధకి ఏదో తేడాగా అనిపించి
"ఏమైంది ప్రవీణ్ ?" ఆదుర్దాగా అడిగింది."ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు"
"అమ్మా! నాన్న.. నాన్నకి సీరియస్ గా ఉందిట. అత్త ఫోన్ చేసింది. మేము విజయవాడ బయలుదేరి వెళ్తున్నాము. నువ్వు కూడా వస్తావా ?" అడిగిన ప్రవీణ్ కి
ఒక క్షణం నిశ్శబ్దం తరవాత,
"నాకు ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది. నేను అవగానే బయలుదేరతాను. ఈలోగా మీరు వెళ్ళండి." సమాధానం చెప్పింది.
సుధ ఒక ప్రముఖ బ్యాంకులో జనరల్ మేనేజర్. ఇవాళో రేపో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కాబోతోంది.
బ్యాంకింగ్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది.
తను వచ్చేసరికి అన్ని ఏర్పాట్లు చెయమని సరోజకి చెప్పి బ్యాంకుకి వెళ్ళింది సుధ. డ్రైవింగుకి సరోజ భర్త రాజు ఉన్నాడు.
కారులో కూర్చుని "మురళికి బాగా సీరియస్ గా ఉంది వెంటనేరా" అని కృష్ణ, ఉష పెట్టిన మెసేజ్ చూసి "ఏమైంది ఉన్నట్టుండి ?" అనుకుంటూ కళ్ళు మూసుకుని వెనక్కి వాలిన సుధకి మురళితో తన ప్రేమ, పెళ్లి సంగతులు గుర్తుకొచ్చాయి.
సుధ భర్త మురళి, ఉషకి అన్నయ్య. సుధా, ఉష ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులు. ఒకటే కాలేజ్, ఒకే క్లాస్.
అందరూ ఇంజినీర్లు, డాక్టర్లు కావాలనుకుంటున్న సమయంలో తాను ఆర్ట్స్ తీసుకుంది. ఎందుకంటే తన ఆశయం ఐఏఎస్.
ఉష అన్న మురళి ఐఐటీలో మంచి రాంక్ సాధించి ముంబైలో కంప్యూటర్స్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఉష కి తెలుసు తనకి రాంక్ రాదు అని, అందుకే ఆర్ట్స్ గ్రూప్ లో చేరింది. ఉష పెళ్లి ఎలాగో అత్త కొడుకు కృష్ణతో సెటిల్ అయింది.
కృష్ణ చదువై ఉద్యోగం రాగానే పెళ్లి అనుకున్నారు. సుధ అందం, తెలివికలపోసిన అమ్మాయి. మురళి కూడా ఆకర్షణీయంగా ఉండేవాడు. సుధ నాన్నగారు బ్యాంకు ఆఫీసర్, అమ్మ గృహిణి, అక్కయ్య డాక్టర్.
సెలవలకి వచ్చినప్పుడు మురళి కళ్ళు సుధకోసం వెతికేవి. ఉషతో సినిమా ప్రోగ్రాం పెట్టి కృష్ణని, సుధని కూడా పిలిచేవాడు. సుధ కూడా ఫ్రీగా అన్ని విషయాల గురించి చాల చక్కటి అవగాహనతో మాట్లాడేది.
నిజానికి మురళికి చదువు తప్ప ఇవన్నీ ఏమి తెలీవు. అందుకే సుధ మాట్లాడుతుంటే శ్రద్ధగా వినేవాడు. సుధా, ఉష బీఏ లో చేరారు. కృష్ణ జాబ్ లో, మురళి ఐఐఎంలో చేరారు.
వీళ్ళ డిగ్రీ పరీక్షలు అయ్యాయి. మురళి ఎంబీఏ అయిపోవస్తోంది. ఉష బీఈడీలో, సుధ ఎంఏలో చేరదామనుకున్నారు. ఉష, కృష్ణ పెళ్లి తాంబూలాలు మార్చుకునేప్పుడు మురళి వచ్చాడు. ముందే చక్కటిదేమో సుధ మంచి పట్టు చీర, నగలతో ఇంకా అందంగా తయారయింది.
"ఏయ్ నిశ్చితార్థం నీదా, నాదా!"నా కంటే అందంగా కనపడకూడదని చెప్పానా లేదా ?" బుంగ మూతి పెట్టింది ఉష.
"నేను ఎంత తయారైన నా ఉష వెలుగు ఏది ?" నవ్వింది సుధ.
"అవును నా కళ్లతో చూడు, నా ఉష అంత అందమైన అమ్మాయి ఈ ప్రపంచంలోనే లేదు." అన్నాడు కృష్ణ. సిగ్గుతో ఉష మొహం ఎర్రగా అయింది.
"మీ అన్నాచెల్లెళ్లు ఎప్పుడూ ఒకటే" అంటూ వెళ్ళింది.
మురళి ఒకటి రెండు సార్లు సుధతో ఏదో చెప్పబోయి "ఏమిటి" అంటే ఏమి లేదు అని తప్పించుకున్నాడు.
ఫంక్షన్ కి సుధ కుటుంబం కూడా వచ్చి వెళ్లారు. మిగిలిన అందరితో కలిసి భోజనంకి కూర్చున్నప్పుడు మురళి నెమ్మదిగా సుధ పక్కన చేరాడు. మాటల్లో తనకి ఒక పెద్ద కంపనీలో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు.
"కంగ్రాట్స్!" అంది సుధ సంతోషంగా.
నీ ప్లాన్ ఏమిటి" అడిగాడు మురళి.
“ఎం.ఎ. చెస్తూ సివిల్స్ కి తయారవుతాను. మొదటి సారే రాంక్ తెచ్చుకోవాలని నా కోరిక" అంది సుధ.
"సివిల్స్ కాకుండా నువ్వు కూడా ఏదైనా బ్యాంకు ఆఫీసర్ అయితే అంత టెన్షన్ ఉండదు కదా ?" అన్న మురళికి
"అవును, కానీ నాకు కలెక్టర్ అవడం జీవితాశయం" అంది సుధ ఉత్సాహంగా.
"అక్క పెళ్లి కుదిరింది, బావ డాక్టర్. పెళ్లి తరవాత సీరియస్గా మొదలుపెడతాను." చెప్పింది.
నోట్లో ముద్ద పెట్టుకునేవాడు ఒక్కసారి ఆగి "సుధా! నిన్ను ప్రేమిస్తున్నాను, నా కోసం వేచిఉండు, ఎవరో ఒకరితో పెళ్లి కుదుర్చుకోకు. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. మా అమ్మ కి నా ప్రేమ గురించి చెప్పాను, వాళ్ళు మీ వాళ్లతో మాట్లాడతారు." ఏదో మామూలుగా మాట్లాడుతున్నట్టుగా చెప్పాడు.
అనుకోని విషయానికి ఒక్కసారి పొలమారినట్టు అయింది సుధకి, దగ్గు కి ఎర్రపడిందా లేక సిగ్గుకి ఎర్రపడిందా తెలీకుండా మొహం కందిపోయింది.
గబా గబా లేచి వెళ్తున్న సుధ వెనకే వెళ్ళాడు మురళి, సమాధానం తెలుసుకోడానికి.
సుధకి మురళి చెప్పింది ఒక నిమిషం అర్థం కాలేదు. అర్థం అయ్యాక ఏమనాలో తెలీలేదు. ఎక్కడో మనసులో అనిపిస్తున్నా ఇంత త్వరగా అడుగుతాడు అనుకోలేదు.
మూడొంతులమంది ఆడపిల్లల కల IIT లో చదివిన అబ్బాయిని పెళ్లిచేసుకోవడం. ఇంక ఐఐటీ, ఐఐఎం రెండూ అంటే జాక్ పాటే.
"నాకు టైం కావాలి" అంది వెనకే వచ్చిన మురళితో.
'నా అంతటి వాడు అడిగితే వెంటనే ఒప్పుకోవా!' అన్నట్టు చూసాడు.
మొహం కొంచెం అసహనంగా పెట్టి "సరే!" అన్నాడు.
మర్నాడు ఆదివారం కావటంతో ఇంట్లోవాళ్లతో విషయం చెప్పింది. అది అందరికీ అనుకోని, సంతోషించతగ్గ విషయమే.
సుధా వాళ్ళ నాన్నగారు మాత్రం "ఆలోచించుకో అమ్మా! సివిల్స్ అనేది నీ కల" అన్నారు.
మర్నాడు ఉష తో చెపితే "అవును, ఇంట్లో చెప్పాడు. కానీ సుధా! మా అన్నయ్య కి చాలా అహం ఎక్కువ. తను అనుకున్నదే జరగాలి, అందరూ తనకంటే తక్కువ అనుకుంటాడు. ప్రతివాళ్ళని తనతో పోల్చి తక్కువగా మాట్లాడతాడు, అసలు నేను లెక్కల గ్రూప్ తీసుకోపోడానికి వాడే కారణం. నీ తత్వానికి, తనకు సరిపోదు" అంది.
ప్రేమ గుడ్డిది అని ఎవరు అన్నారో కానీ ప్రేమ చెవిటిది కూడా. ఇవేమి సుధ చెవులకి ఎక్కలేదు.
ఇన్నేళ్ళలో తనకు తెలీకుండా మురళి ప్రేమలో పడిపోయింది. అతను తనమీద చూపించే శ్రద్ధని అపురూపమైన ప్రేమే అనుకుంది. తన ఆశయం కన్నా ప్రేమ ముఖ్యమైపోయింది.
ఒక్కసారి అయినా సివిల్స్కి రాయమని సుధని తండ్రి బలవంత పెట్టారు.
"మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు కానీ ఎంఏ అయ్యేదాకా పెళ్లి వద్దు" అని గట్టిగా చెప్పారు.
అదేమాట మురళితో చెప్పింది సుధ.
"నేను నా స్థాయి దిగి నీ వెనకాల పడ్డందుకా నీకు అలుసు.
ఇంకా అంతకాలం ఆగాలా నీకోసం" కోపంగా అన్నాడు మురళి.
"నువ్వు ఎప్పటినించో, నన్ను నీ మనసులో పెట్టుకొని, మీ ఇంట్లో వాళ్లతో కూడా చెప్పి, అప్పుడు నాకు చెప్పావు. నేను మాత్రం, నువ్వు చెప్పగానే చదువు ఆపి, నిన్ను పెళ్లి చేసుకోవాలా. ఉషకి నిశ్చితార్థం కూడా అయింది కనక ఉష పెళ్లి తరవాతే మన పెళ్లి. నచ్చితే ఆగు లేకపోతె నీ ఇష్టం." కొంచెం 'కాఠిన్యం' గొంతులోకి తెచ్చుకొని అంది సుధ.
చప్పున మాట మార్చేశాడు మురళి.
"అంత 'కాఠిన్యంగా' మాట్లాడకు సుధా! నిన్ను వదిలి ఉండాలి అనేసరికి బాధతో అలా మాట్లాడాను. సరే నీ 'ఎంఏ ' అయ్యాకే చేసుకుందాము" అన్నాడు ప్రేమగా.
ప్రతీ వారం, పదిరోజులకు మురళి వచ్చేవాడు. అతనితో సమయం గడపకపొతే అలిగేవాడు. బయటికి తీసుకెళ్లి ఏవో బహుమతులు కొనేవాడు. "నువ్వే నా జీవితం" అని కబుర్లు చెప్పేవాడు.
సుధ పూర్తి ప్రేమ మత్తులో మునిగిపోయింది.
సివిల్స్ రాస్తే ప్రిలిమ్స్ కూడా పాస్ అవలేదు. తండ్రి బాధపడ్డా, సుధ పెద్ద పట్టించుకోలేదు. నాకు ఇప్పుడు 22 ఏళ్ళే, ఇంకా టైం ఉంది సివిల్స్ కి అనుకుంది. స్వతహాగా తెలివి కలది కనక 'ఎంఏ ' మాత్రం మంచిమార్కులతో పాస్అయింది.
పెళ్లి అయ్యాక ముంబై వెళ్ళింది. కొత్తల్లో సుధని అపురూపంగా చూసాడు మురళి.
ప్రతి పార్టీకి తీసుకెళ్లేవాడు. అక్కడ అందరూ "నీభార్య చాల అందంగాఉంది, తెలివికలది. నువ్వు లక్కీ" అంటే పొంగి పోయేవాడు. కానీ కొంతకాలానికి తేడా వచ్చింది.
నెమ్మదిగా సుధని బయటికి తీసుకెళ్లడం మానేసాడు.
వరమో, శాపమో అదే సమయానికి సుధ గర్భవతి అయింది. దానితో తను ఇంట్లోనే ఉండేది.
మురళి ప్రవర్తనలో మార్పు వచ్చింది. కొంచెం కూడా సాయం చేసేవాడు కాదు. వాంతులయితే విసుక్కునేవాడు. ఓపిక లేదు అంటే "ప్రపంచములో నువ్వు ఒక్కదానివేనా కడుపుతో ఉంది." అనేవాడు.
సుధని చూడడానికి వచ్చిన మురళి తల్లి రాజ్యలక్ష్మి పరిస్థితి గమనించి సుధని తీసుకుని వచ్చేసారు. ఎప్పుడో తప్ప ఫోన్లో మాట్లాడని మురళిని ఏమి అనుకోవాలో తెలిసేది కాదు సుధకి.
"ఆఫీసులో బిజీ" అని సర్దిచెప్పుకునేది. డెలివరీ టైంకి పుట్టింటికి వెళ్ళింది. బాబు పుట్టాక ఒకసారి వచ్చి చూసాడు. మాములుగా తండ్రి అయిన వాడి సంతోషం, ఉత్సాహం కనిపించలేదు.
బాబుకి ప్రవీణ్ అని పేరు పెట్టారు.
"నాకు భోజనం ఇబ్బందిగా ఉంది త్వరగా వచ్చేయి"అని చెప్పి వెళ్ళాడు.
మూడో నెల్లో అత్తగారు, తల్లి ఇద్దరూ వచ్చి దింపి జాగ్రత్తలు చెప్పి వెళ్లారు.
సుధ ప్రవీణ్ని తీసుకొని వచ్చాక ఇంకా చిరాకు ఎక్కువ అయింది మురళికి.
తన సొంత కొడుకుని కూడా తనకంటే ఎక్కువగా చూడడం సహించలేకపోయేవాడు.
"ఎప్పుడూ 'బాబు' అంటావు.. వీడొకడు నాకు పోటీ" అనేవాడు.
అప్పుడే పుట్టిన పసికందుకి తనకి పోటీ ఏమిటి? పైగా వాడు తమ కన్నకొడుకు. తండ్రిగా తను పిల్లవాడి ఆలనాపాలనా చూడకపోగా సుధ ఎక్కువ టైం బాబుతో గడుపుతుంటే చికాకు పడేవాడు.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
Comentarii