top of page
Writer's pictureLalitha Sripathi

ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2


'Prema Entha Badhiram Part 2/3' - New Telugu Story Written By Sripathi Lalitha

'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2/3' పెద్ద కథ

రచన: శ్రీపతి లలిత

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ:

సుధ ఒక ప్రముఖ బ్యాంకులో జనరల్ మేనేజర్.

భర్త మురళికి సీరియస్ గా ఉన్నట్లు కొడుకు ప్రవీణ్ వద్దనుండి ఫోన్ వస్తుంది.


గతం గుర్తుకు వస్తుంది సుధకి..

స్నేహితురాలు ఉష అన్నయ్య మురళితో ప్రేమలో పడుతుంది సుధ. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్న తన కోరికను పక్కన పెట్టి అతన్ని పెళ్లి చేసుకొంటుంది. కొద్ది రోజుల్లోనే బ్ర్హ ప్రవర్తనలో తేడాను గమనిస్తుంది సుధ.


ఇక ప్రేమ ఎంత బధిరం పార్ట్ 2 చదవండి.


సుధకి ఇంటి పని అలవాటు లేకపోయినా ఇన్ని రోజులు చేసింది. ఇప్పుడు బాబుతో చాల కష్టం అనిపించి పనిమనిషిని పెట్టుకుందాము అంటే

"సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ, చూసి ఖర్చు పెట్టు" అన్నాడు మురళి.


ఎవరో బాణంతో గురిపెట్టి కొట్టినట్టు అయింది సుధకి.

ఈమాట వినడానికేనా తాను సివిల్స్ వదిలేసి పెళ్లి చేసుకుంది ప్రేమే ముఖ్యం అంటూ.


ఉష, తండ్రి ఇద్దరూ చెప్పారు తొందర పడద్దని. తనే 'బధిరురాలైంది'.


సుధ మనసులో "సంఘర్షణ" మొదలైంది.

అప్పటినుంచి ఏమాత్రం టైం దొరికినా బుక్స్ తీసి చదివేది.


కాలం గడుస్తున్నకొద్దీ, ఉష, వాళ్ళ అన్న గురించి చెప్పింది ఎంత సత్యమో అర్థమయింది.


తన పై అధికారులు తెలివితక్కువ వాళ్ళు, కింద పని చేసేవాళ్లూ అందరూ మూర్ఖులు అనేవాడు. ఎవరికీ ఏమి తెలీదు, తనకే అన్నీ తెలుసు అనేవాడు. ఐఐటి, ఐఐఎం లో చదవకపోతే వృధా అనేవాడు.


"ఏవో కారణాలవల్ల అక్కడ చదవకపోయినా ఎవరి తెలివి వాళ్ళది. అందరిని అలా తీసిపారేయకు. ప్రతి వాళ్లలో ఏదో ఒక మంచి లక్షణము ఉంటుంది. దాన్ని గుర్తించు." అనేది సుధ.


"అబ్బో! నువ్వే ఐఐఎం లో చదివినట్టు చెప్తావు, చాలుచాల్లే" అని ఎగతాళిగా మాట్లాడేవాడు.


ఆఫీసులో తనతో పనిచేసే ప్రతివాళ్ళని ఏదోరకంగా మాటలతోనో, చేతలతోనో బాధ పెట్టేవాడు.


యాజమాన్యంకి ఈవిషయంలో ఫిర్యాదులు వెళ్ళాక, మురళిని ఉద్యోగంలోనుంచి తీసేసారు. ఇంక దానికి కారణం పిల్లవాడి జాతకం, సుధ దురదృష్టము అనే తప్పా, వేరే మాట లేదు.


ప్రతీ విషయానికి కోపం, వస్తువులు విసిరేయడం, అరుపులు తప్ప, స్థిమితం గా కూర్చుని ఏమి చెయ్యాలి అని ఆలోచన లేదు.


"జాబ్స్ ఇదివరకులాగా కాదు కదా, ఒకటి పొతే ఇంకొకటి వస్తుంది. నీకున్న అర్హతలకి ఇంకా మంచిది వస్తుంది" అని సుధ ధైర్యం చెప్పటానికి ప్రయత్నిస్తే, "నీకేదో ఉద్యోగాల గురించి తెలిసినట్టు చెప్తావు నోర్ముసుకో" అని అరిచేవాడు.


ఎప్పుడు ఎవరి చేత మాటపడని సుధకి మింగుడుపడేది కాదు. కానీ, ఉద్యోగం పోయిన బాధలో ఉన్నాడని ఏమి మాట్లేదికాదు సుధ. ఇంటర్వ్యూకి వెళ్లి, ఉద్యోగం రాకపోతే, ఆరోజు సుధకి నరకమే. ఉద్యోగం వచ్చినా, రెండు మూడు నెలలు కూడా నిలవకపోవటం..


ఇంత జరిగినా, తప్పు తనది అని ఒప్పుకోని మూర్ఖత్వం మురళిది. ఎవరితోను ఫోన్లో మాట్లేడేవాడుకాదు. ఫోన్ చేసినా ఎత్తేవాడుకాదు.


ప్రతీదానికి ఇద్దరి మధ్యా "మాటల సంఘర్షణ" జరిగేది.

రానురాను 'మౌనం ఉత్తమం' అని సుధ ఊరుకునేది, కానీ "మనసులోని 'ఈ సంఘర్షణ' కి అంతమెప్పుడు?" అనుకునేది


ఆ సమయంలో సుధకి అందరికన్నా ఉష, కృష్ణ చాలా అండగా ఉన్నారు. రోజూ ఏదో టైములో ఫోన్ చెయ్యడం, ధైర్యం చెప్పడం చేసేవారు. ప్రవీణ్ ఆటలతో కొంత మనసుకి శాంతి పొందేది సుధ.


ఒకరోజు ఉష ఫోన్ చేసింది.


"సుధా!.. బ్యాంకు ఆఫీసర్స్ కోసం ప్రకటన వచ్చింది. నువ్వూ అప్లై చెయ్యి. నువ్వు కూడా ఇక్కడికి వస్తే బాబుని అమ్మ చూస్తుంది. మనం ఇద్దరమూ పరీక్షకి తయారయి రాద్దాము" అంది.


ఏవంకతో అక్కడినుంచి బయటపడదామా అని చూస్తున్న సుధ వెంటనే హైదరాబాద్ వచ్చింది.


తల్లి, తండ్రి అక్క డెలివరీకి అమెరికాకి వెళ్లారు. పుట్టింటి వాళ్ళకి మురళి గురించి ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పేది కాదు, తొందరపడి పెళ్లి చేసుకున్నావు అంటారని ఒకటి, అనవసరంగా బాధపెట్టడం ఎందుకని ఇంకోటి.


రాజ్యలక్ష్మి కూడా బాబుని చూసుకుంటూ సుధని, ఉషని చదుకోమనేది.


ఒక నెలతర్వాత, మురళి ఫోన్ చేసి దుబాయ్ లో ఉద్యోగం వచ్చిందని, తాను వెళ్లి చేరి, కొంతకాలం అయ్యాక సుధని, బాబుని తీసుకెళ్తాను అన్నాడు.


"ఇదీ ఒకందుకు మంచిదే" అనుకుంది సుధ.


మళ్ళీ, కాలేజ్ సమయంలో సుధ లాగా మారి, రాత్రిపగలు కష్టపడి చదివింది. ఎలాగయినా ఈ ఉద్యోగం తెచ్చుకొని, తన కాళ్లమీద తాను నిలపడాలి అనే పట్టుదల వచ్చింది. బాబు ఖర్చులకి లెక్క చూసే మురళి మనస్తత్వానికి, తన సంపాదన తనకి ఉండడం చాల ముఖ్యం అని ఆలస్యంగా గ్రహించింది.


తానేమిటో ఎవరికో కాదు, తనకే, తన సత్తా నిరూపించుకోవాలి అనుకుంది గట్టిగా.


"సుధా! అంత కష్టపడాలా పరీక్షకి, మరీ యూనివర్సిటీ రాంక్ రావాలన్నట్టు చదువుతున్నావు" అని ఉష అంటే,


"ఉషా! ఎంత పెళ్లి అయి భర్త సంపాదిస్తున్నా, మనకంటూ ఆర్థిక స్వతంత్రం ఉండాలి. నేను ఆలస్యంగానైనా కళ్లుతెరిచాను. నువ్వూ ఉద్యోగం తెచ్చుకోవాలని దృష్టి పెట్టి చదువు" అనేది.


కృష్ణ ఎగతాళి చేసేవాడు ఉషని "తాచెడ్డ కోతి మీ ఫ్రెండ్, జాగ్రత్త! సుధా" అని. దానితో ఉక్రోషం వచ్చి ఉష కూడా శ్రద్ధగా చదివింది.


పరీక్ష రాసిన సుధ బాగా వ్రాసానని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. వ్రాత పరీక్ష పాస్ అయ్యారని సుధా, ఉష ఇద్దరికీ ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. సుధకి ఆఫీసర్ పోస్ట్ వచ్చింది.


ఉషకి ఆఫీసర్ కింద సెలెక్ట్ కాలేదని, కావాలంటే క్లర్క్ పోస్ట్ ఇస్తామని అన్నారు.


సుధ "వద్దు ఉషా! మళ్ళీ వ్రాయి, ఈసారి వస్తుంది" అంటే

"వద్దులే సుధా! నేను నీలాగా కష్టపడేరకం కాదు, నాకు క్లర్క్ పోస్టే నయం" అని చేరిపోయింది.


ఆఫీసరుగా సుధకి పెర్మనెంట్ పోస్టింగ్ వచ్చేలోగానే మురళి మళ్ళీ దుబాయ్ ఉద్యోగం మాని వచ్చాడు.


"నాన్నా, నాన్నా" అంటూ మురళి వెనకే తిరుగుతున్న ప్రవీణ్ ని చూసి సుధకి అర్థమైంది. చిన్నవాడు తండ్రి సమక్షం ఎంతగా కోరుకుంటున్నాడో అని. ప్రవీణ్ కోసం మురళితో ఓర్చుకుని ఉండేది సుధ.


ప్రవీణ్ "నాన్నా" అంటూ దగ్గరికి వచ్చినా పెద్ద ముద్దు చేసేవాడు కాదు.


"బాబుని నువ్వుకూడా చూసుకోవాలి, సుధ మీద కొంతైన 'సానుభూతి' చూపించు, నీ వల్ల ఆ అమ్మాయి ఒక్కతి, అటు ఉద్యోగం, ఇటు బాబుతో ఎంత కష్టపడుతోందో చూడు" అని రాజ్యలక్ష్మి కోప్పడేది.


కొన్ని రోజులు ఊరుకుని సుధని జాబ్ మానేయమని గొడవ పెట్టుకున్నాడు.


"నువ్వు ఉద్యోగం ఎక్కడా కుదురుగా చెయ్యవు, నేను చేస్తే నీ అహం దెబ్బ తింటోంది, ఇద్దరూ ఉద్యోగం మానేసి ఎలా?" అంది సుధ.


"ఏ కంపెనీలో చూసినా అంతా తెలివితక్కువ వాళ్లు, వాళ్ళ దగ్గర నేను ఉద్యోగం చెయ్యను." అన్నాడు మురళి.


"అసలు నీ సమస్య ఏమిటో తెలుసా మురళీ! నీ ఐఐటీ, ఐఐఎం డిగ్రీ. మన సమాజంలో ఆ కాలేజీల్లో చదివితే ఇంటా, బయటా మిమ్మల్ని ఇంద్రుడు, చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేస్తారు, దానితో మీకు బాగా అహంకారం పెరిగి అందరిని చులకనగా చూస్తారు.


నేను ఒప్పుకుంటాను, అక్కడ చదవడానికి మంచి తెలివి కావాలి, కానీ, వేరేవాళ్లు అందరూ తెలివి తక్కువ వాళ్ళుకాదు.


మనిషిగా బతకడానికి, తెలివితో పాటు సమాజంలో అందరితో కలిసి ఉండే స్వభావం, చుట్టుపక్కల వాళ్ళని 'సానుభూతితో 'చూసే మనసు కావాలి. అప్పుడే నువ్వు అంతటా రాణిస్తావు.

నేను కూడా నీ డిగ్రీ చూసే నిన్ను పెళ్లి చేసుకున్నా, నీ మనస్తత్వం కాదు, అదే నేను చేసిన పెద్ద తప్పు. ప్రవీణ్ దృష్ట్యా ఇప్పుడు వెనక్కి తీసుకోలేని తప్పు.


ఇంకెప్పుడూ నన్ను ఉద్యోగం మానమని అనకు, నేను మానను. అదే నా జీవితం, నా గుర్తింపు" గట్టిగ చెప్పింది సుధ.


సుధకి ప్రొబేషన్ అయ్యాక మొదటి పోస్టింగ్ ఢిల్లీ లో ఇచ్చారు.


"ఒక్కతి, బాబుని పెట్టుకొని ఉండటం కష్టం. నువ్వూ వెళ్ళు" అని మురళికి చెప్పారు పెద్దవాళ్ళు.


"సరే" అన్నవాడు ఒకవారం తరవాత, రెండు రోజుల్లో వస్తాను అని మాయమయ్యాడు.


సుధకి చేరవలిసిన తారీకు దగ్గర పడడంతో ఒక్కతి వెళ్లిపోదాము అనుకుంది. ఇల్లు, బాబుకి స్కూల్ చూసి,

మళ్ళీ వచ్చి బాబుని తీసుకునివెళదామనుకుంది.


అదే టైములో దేవుడు పంపినట్టు వచ్చింది సరోజ. రాజ్యలక్ష్మి గారి ఇంట్లో పని చేసే లక్ష్మమ్మ సరోజని తీసుకువచ్చింది.


"అమ్మా! ఇది నా చెల్లెలి కూతురు, అమ్మా, అయ్యా లేరు. వయసులోనున్న దీన్ని నా దగ్గర ఉంచుకోడానికి మా బస్తి నిండా తాగుబోతువాళ్ళు.


మీతో తీసుకు వెడితే సాయంగా అన్ని పనులు చేస్తూ బాబుని చూసుకుంటుంది.’ బ్రతిమిలాడింది లక్ష్మమ్మ.


18 ఏళ్ళ సరోజ పరిస్థితి చూసి సుధకి 'సానుభూతి' కలిగింది.

ఇద్దరూ ఒకరికొకరు సాయం అనుకుంటూ బాబుని, సరోజని తీసుకొని ఢిల్లీ వెళ్ళింది సుధ.


ఒక పదిరోజుల తరవాత అమెరికా నుంచి ఫోన్ చేసాడు మురళి. "H 1 వీసా మీద అమెరికా వెళ్లాను, ఇంకో రెండు మూడు నెలల్లో నిన్ను, ప్రవీణ్ ని పిలిపిస్తాను, ఉద్యోగం చేయక్కరలేదు. నేను అన్ని పేపర్స్ పంపేదాకా హాయిగా రెస్ట్ తీసుకో." అంటూ ఫోన్ చేసాడు.


మురళి ఫోన్లో చెప్పిన విషయం, ఉషతో చెపితే "నేను నీకు ముందే చెప్పాను మా అన్నయ్య గురించి. తనకి అహం ఎక్కువ. తనని కాక వేరేవాళ్లని పొగిడినా, వాళ్ళు తనకంటే ఎక్కువగా ఉన్నా సహించలేడు.


అది చెల్లి అవనీ, తల్లి అవనీ, పెళ్ళాం అవనీ. నువ్వు నీ ఉద్యోగంలో ఇంత త్వరగా ప్రగతి సాధిస్తుంటే అసూయ.


నీ చేత ఏదోరకంగా ఉద్యోగం మానిపించాలని తన ప్రయత్నం. అది ఇప్పటికీ నువ్వు గ్రహించకపోతే నీ ఖర్మ." అని కోపముగా అంది.


అవును ఉష చెప్పింది నిజమే! తనకీ "అంతరంగం" లో అలానే అనిపించినా మళ్ళీ ఏదో పిచ్చి ఆశ, మురళిలో మార్పు వచ్చిందేమో అని.


అతని స్నేహితులు, తెలిసినవాళ్ళు, మంచి స్థాయిలో ఉంటే తట్టుకోలేకపోయేవాడు మురళి. అందుకే మంచి స్నేహితులే లేరు మురళికి. అది ఎంత పెద్ద లోటో అతనికి తెలీదు.

ఒకోసారి సుధకి అనిపించేది మురళిని చూసి కోపం తెచ్చుకోవాలా? జాలిపడాలా ?


ఎందుకంటే ప్రతిమనిషికీ బాధలు, సంతోషాలు, పంచుకోడానికి "తోడొకరుంటే అదే భాగ్యము" అంటారు. కానీ మురళి ఏనాడూ అలా ఎవరితోనూ తన "అంతరంగాన్ని" పంచుకోలేదు. తల్లి తండ్రులు, భార్య, చెల్లి ఎవరితోనూ అంత సామీప్యం లేదు అతనికి.


అసలు మురళి తనతో పెళ్లి ప్రస్తావన తేవడం, నిజంగా తనమీద ప్రేమతోనా, లేక తాను ఐఏఎస్ అవకుండా ఆపడానికా! అనే అనుమానం వచ్చినా, ఇప్పుడు చేసేది ఏమి లేదు, కనీసం ఇప్పటికి అయినా తనకి ఒక ఆధారం ఉంది.


సివిల్స్ రాసి కలెక్టర్ కాలేకపోయాను అన్న బాధ పూర్తిగా పోయింది. ఈ బ్యాంకు ఉద్యోగంలోనే పూర్తిగా ఎదగాలి అని" అంతరంగంలో"గట్టిగా నిర్ణయించుకుంది సుధ.


సరోజ ఇంటిపని, బాబుని చూసుకుంటుంటే సుధ ఉద్యోగం మీద బాగా శ్రద్ధ పెట్టింది. సుధ పనితనం, బ్యాంకుకి లాభాలు తెచ్చే నైపుణ్యం చూసి, ప్రతిస్థాయిలో ప్రమోషన్కి వెళ్ళగానే సుధకి పై పదవి కీలకమైన స్థానాల్లో ఇచ్చేవారు.


సుధ ప్రగతి చూసి అటు పుట్టింటి వారు, అత్తగారు, మామగారు పొంగిపోయారు. ఇక ఉష, కృష్ణల విషయం చెప్పక్కరలేదు.


ఉష ట్రాన్స్ఫర్లు ఉండవు అని, ఆఫీసర్ ప్రమోషన్ కూడా తీసుకోలేదు.


ఎవరికైనా సుధ గురించి చెప్పాలంటే "మా వదిన" అనేది కాదు. "నా ఫ్రెండ్, నేనే పరీక్షరాయించాను" అనేది.


సుధ కూడా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుంటే ఉషనే అడిగేది.


"నీలాంటి ఆత్మీయురాలు దొరకడం నా అదృష్టం" అని సుధ అంటే


"నా వల్లే కదా మా అన్నయ్య పరిచయం, తనని కట్టుకుని ఇలా అయిపోయావు" అని బాధపడేది.


"నా రాత ఇలా ఉంటే నువ్వు తప్పించగలవా ? అయినా మీ అన్నయ్య అలా ఉండబట్టే కదా నేను పట్టుదలగా ఈ స్థాయి కి వచ్చాను. లేపోతే గృహిణిగా ఇంట్లోనే ఉండేదాన్ని" నవ్వేసేది సుధ.


మురళి ఫోన్ చేస్తే మాట్లాడేది సుధ. ఎక్కువగా ప్రవీణ్ని మాట్లాడమనేది.


"నాన్నా, మేము ఎప్పుడు వస్తాము అమెరికాకి ?" అని అడిగితే

"ఇదిగో పేపర్స్ పంపుతున్నా" అనేవాడు.


మొదట్లో పాపం ప్రవీణ్ నిజమని అందరికీ చెప్పేవాడు.

"మేము నాన్నతో అమెరికా లో ఉంటాము" అని.

తరవాత ప్రవీణ్ కూడా ఆశ వదిలేసాడు.


ప్రవీణ్ ని చూస్తేనే జాలి వేసేది సుధకి. తండ్రి లేడా అంటే పేరుకు ఉన్నాడు, కానీ, తండ్రిగా ఎప్పుడూ లేడు.


వేరే పిల్లలు, తండ్రులతో ఆడుతూ, బయటికి వెళుతూ, సరదాగా ఉంటే బాధపడేవాడు. తన విజయాలకి మెప్పు ఇస్తూ, అపజయాలకి కుంగిపోకుండా ధైర్యం చెపుతూ ఉండాల్సిన తండ్రి లేని లోటు ప్రవీణ్ కి తెలుస్తూనే ఉండేది.


ప్రవీణ్ ని అన్ని సెలవలకి అమ్మమ్మ ఇంటికో, నాయనమ్మ ఇంటికో పంపేది సుధ. ఇరువైపు కుటుంబాలతో ప్రవీణ్ కి బాగా అనుబంధం ఏర్పడాలని, ఒంటరితనం ఉండకూడదని.


ఎంత వాళ్ళు అందరూ ప్రేమగా చూసినా తండ్రి ప్రేమకి, తాత ప్రేమకి తేడా "అంతరంగంలో" తెలుసు ప్రవీణ్ కి.

========================================================================

ఇంకా వుంది..


========================================================================



శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.



35 views0 comments

Comments


bottom of page