top of page

ప్రేమ ఒక వరం



'Prema Oka Varam' - New Telugu Story Written By  Dr. C. S. G. Krishnamacharyulu

Published in manatelugukathalu.com on 20/09/2024 

'ప్రేమ ఒక వరంతెలుగు కథ

రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ఉదయం ఆరు గంటల సమయమైంది. ఇంక కొద్ది సేపటిలో బస్సు బెంగళూరులోని సిల్క్ బోర్డ్ స్టాపు చేరుకుంటుంది. బస్సు కిటికీనుంచి నగరాన్ని చూస్తూ రత్న యిలా అనుకుంది. 


"ఒకప్పుడు వుద్యానవన నగరంగా పేరుపొందిన ఈ నగరమిప్పుడు, భవంతులు, రహదారి వంతెనల నిర్మాణాలతో, రేగుతున్న దుమ్మూ ధూళీతో, అనారోగ్యకరంగా తయారైంది. కేవలం, బావ కిక్కడ వుద్యోగమని, తాను ఇక్కడకు వచ్చింది కాని, లేకుంటే పుదుచెర్రీనుంచి యిక్కడకు రావల్సిన అవసరమేముంది? ఇక్కడ ప్రైవేటు యూనివర్సిటీలో దొరికిన లెక్చరరు వుద్యోగం లాంటిది, పుదుచెర్రీలోనే దొరికేది. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత, బావకు దగ్గరగా వుండబోతోంది. ఈ దగ్గరితనం శాశ్వతం అయ్యేలా బావను ఒప్పించి త్వరలో పెళ్ళి చేసేసుకోవాలి?" ఆమె ఆలోచనలను భగ్నం చేస్తూ డ్రైవరు సిల్క్ బోర్డ్ అని ప్రకటించి, బస్సును రోడ్డు ప్రక్కకు తీసి ఆపాడు. 


 రత్న బస్సు దిగడం చూసి ఆమె బావ ప్రసన్న, బస్సు దగ్గరికి వచ్చి ఆమె సూటుకేసు అందుకుని, ఒక చేత్తో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. రత్న, అతని దేహ స్పర్శకు పులకించిపోతూ, "ఇన్నాళ్ళకి నీ దగ్గరకు వచ్చేసాను"అని సంతోషంగా చెప్పింది. 


 "నువ్వు వచ్చావని నాక్కూడా సంతోషంగా వుంది. పోతే నీకొక విషయం చెప్పాలి. రా! త్రోవలో చెప్తాను" అని ప్రసన్న కారు వైపు దారి తీసాడు. కారులో సామాను వుంచి, రత్న కూర్చుని బెల్ట్ పెట్టుకున్నాక, కారు స్టార్ట్ చేసాడు. 


అతడు యేం చెప్తాడో, అందులో తనకేమైనా దుర్వార్త వుంటుందా అని సంశయాత్మకంగా అతడిని చేస్తూ మౌనంగా వుండిపోయింది. రత్నయెదలో అలముకున్న ఆహ్లాదం స్థానంలో కూర్చుని బెల్ట్ పెట్టుకున్నాక దిగులు క్రమ్ముకోసాగింది. 


"చూసావా! ఇది గేర్లు లేని కారు. ఇక్కడ ట్రాఫిక్ లో అస్తమానం గేరు మార్చడమొక తలనొప్పి. అందుకే ఇది కొన్నాను". 


లేని వుత్సాహాన్ని ప్రదర్శిస్తూ, " భలే బాగుంది. కారు సీట్లు, రంగు అన్నీ ఆకర్షణీయంగా వున్నాయి. మంచి సెలెక్షన్" అంది రత్న. 


"ఆ క్రెడిట్ కొంత అస్మిత కివ్వాలి. తనే ఈ సలహా యిచ్చింది" 


రత్నకి అర్ధమైంది. కలుగులో వున్న యెలుక అస్మిత అన్నమాట. బాల్యంలో నెరపిన స్నేహం, కౌమారంలో పెంచుకున్న ఆశలు, యవ్వనంలో చేసుకున్న బాసలు అన్నీ తీసుకునిపోయి అస్మిత పాదాల దగ్గర తర్పణం వదిలాడన్నమాట. ఇంకెందుకు, నేను తనతో ఆ యింటికి వెళ్ళడం అని మధనపడుతుండగా ప్రసన్న యిలా అన్నాడు. 


"ఏ బ్రాండు కారు కొనాలి ఏ కలరు బాగుంటుంది అన్న నిర్ణయాలలో నాకు సతీష్ సహాయం చేసాడు. అతనే అస్మిత బాయ్ ఫ్రెండ్". 


ఆ మాటలు వినగానే రత్న మనసు తేలికైంది. ఆమె ముఖంలోకి నవ్వు తిరిగి వచ్చింది. 


"ఎంత తొందరపాటు నాది. బావ పెళ్ళి ఆలశ్యం చేస్తుండడం వల్ల కదా నాకీ సంశయం. అనుకున్నట్లు అన్నీ జరిగితే ప్రేమ ఒక వరం. లేకుంటే అదే శాపమవుతుంది. జీవితం నరకమవుతుంది. " అని అనుకుంది. 


"నేనుంటున్న అపార్టుమెంటులో నాలుగు పడక గదులున్నాయి. ఒకటి నాది. ఇంకొక దాంట్లో అస్మిత ఒక్కతే వుంటోంది. అస్మిత నాలాగే మైక్రో సాఫ్ట్. ఇంకొక గదిలో మీనా, క్లెమెంట్ మరొక దాంట్లో అరియాన, ఆదిత్య, సహజీవనం చేస్తున్నారు. మీనా త్వరలో పెళ్ళి చేసుకోబోతోంది. అందుకని క్లెమెంట్ ఆమెని వదిలి ఇవాళో రేపో వేరే చోటికి మారిపోతున్నాడు. నువ్వు నా గదిలోనో, అస్మిత గదిలోనో వుండవచ్చు. ఇదీ నేను చెప్పాలనుకున్న విషయం". 


"సతీష్, అస్మిత తో వుండడం లేదా? " 


"లేదు. అతను కుటుంబంతో కలిసి వుంటున్నాడు. అస్మిత వచ్చే నెల అమెరికా వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళది కొన సాగే ప్రేమ కాదు. "


 "నాతో ఒక అమ్మాయి వుంటోందని నీవెక్కడ అంటావో అని భయ పడ్డాను. " అంది రత్న మెల్లగా, అతనికి వినీ వినపడనట్లుగా. 


ప్రసన్న"వచ్చేసాం" అంటూ కారుని అపార్టుమెంటు క్రింద పార్కింగు ప్రదేశానికి పోనిచ్చి, తనకు కేటాయించిన స్థలంలో జాగ్రత్త గా నిలిపాడు. 

 @@@


ప్రసన్నతో కలిసి అపార్టుమెంటులో అడుగిడుతూ, రత్న ఒక తెలియని వుద్వేగానికి లోనయ్యింది. 

హాలులో భోజనాల బల్ల వుంది. అక్కడ టిఫిన్ చేయబోతున్న అస్మిత, రత్నను చూసి, "నా సవతిని తీసుకుని వచ్చావా? రావోయి రా!" అని స్వాగతం పలికింది. అదే సమయంలో ప్రసన్నను చూస్తూ, "నా గదిలో వుంటుంది. నా ఎదురుగా నో హగ్గింగ్, నో కిస్సింగ్. జాగ్రత్త" అంది. 


 ఆమె మాటలకు రత్న తెల్లబోయింది. “సతీష్ కదా ఆమె బాయ్ ఫ్రెండ్. ఇలా మాట్లాడుతోంది యేమిటి?” అని మనసులో తర్కిస్తూ, పైకి చిరునవ్వుతో, "మిమ్మల్ని కలవడం సంతోషంగా వుంది" అని మర్యాద పూర్వకంగా అంది. 


 "రత్న నూటికి నూరు శాతం సనాతన భారతీయ మహిళ. నువ్వూరకే ఆమెను బెదరగొట్టకు" అంటూ ప్రసన్న రత్నను తన గదిలోకి తీసుకుని వెళ్ళాడు. 


అస్మిత వారి వెనుకనుంచి, "చూస్తూంటా. మర్చిపోకు" అంది నవ్వుకుంటూ. 


 "అస్మిత నవ్వులాటకు అలా మాట్లాడుతోంది. పట్టించుకోకు. నేను హాలులో కూర్చుని పని చేసుకుంటాను. నువ్వు స్నానం చేసి వచ్చాక టిఫిన్ చేద్దాము" అని ప్రసన్న మృదువుగా చెప్పాడు. 


కొది సేపైన తర్వాత తయారై వచ్చిన రత్నకి, ప్రసన్న, ఒక అపరిచిత యువతి, భోజనాల బల్ల్ల వద్ద కూచుని కబుర్లు చెప్పుకుంటూ కనబడ్డారు. రత్నను చూసి ఆ యువతి, ఆమె దగ్గరకు వచ్చి, కరచాలనం చేసి, "నేను మీనాని. నువ్వు ప్రసన్న చెప్పినదానికన్నా నాజూకుగా, సంప్రదాయంగా కనబడుతున్నావు. ప్రస్తుతం సెలవులో వున్నాను. నీవు యెక్కడికి వెళ్ళాలన్నా తోడు వస్తాను" అంది. 

రత్న కి మీనా స్నేహపూర్వక పలకరింపు యెంతగానో నచ్చింది. "అలాగే" అని చిరునవ్వుతో సమాధానమిచ్చింది. 


అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ బ్రేక్ ఫాస్ట్ ముగించారు. ఆ తర్వాత ప్రసన్న, రత్నతో   "అస్మిత ఆఫీసుకు వెళ్ళి పోయింది. నేను లంచ్ టైముకు వస్తాను. రెస్టు తీసుకో. తోచకపోతే మీనా దగ్గరికి వెళ్ళు" అని చెప్పి వెళ్ళిపోయాడు. 


ప్రయాణ బడలిక వల్ల, రత్న పడుకున్న వెంటనే నిద్ర పోయింది. ఒక గంట తర్వాత గది బయట మాటల శబ్దానికి నిద్రలేచి, బయటికి తొంగి చూసింది. మీనా చేతులు పట్టుకుని, ఒక వ్యక్తి ఆమెను బ్రతిమిలాడుతున్నాడు. 


"ఆఖరి సారి, మళ్ళీ మనం జీవితంలో కలుస్తామో కలవమో, ఒక తీపి జ్ణాపకంగా మిగిలేలా, ఒక్క సారి"ఆ మాటలంటూ, అతడు ఆమె కి చేరువయ్యే ప్రయత్నం చేసాడు. 


"క్లెమెంట్! బ్రేకప్ అని అనుకున్నాక ఇలాంటి సెంటిమెంట్లు పండించే ప్రయత్నం చేయకు. ప్రశాంతంగా విడిపోవాలని అనుకున్నాక మళ్ళీ యిలాంటి ప్రతిపాదనలు తేవద్దు" అని మీనా కరాఖండిగా చెప్పింది. 


"నువ్వు జగ మొండివి. సరే! బై, నీకు నా శుభాకాంక్షలు" అని క్లెమంట్ వెళ్ళిపోయాడు. 


 మీనా రత్న దగ్గరికి వచ్చి, "నిద్రలేచావా! రా! మంచి కాఫీ యిస్తాను" అని పిలిచింది. 


రత్న, మీనా వెంట కిచెన్ వైపు నడిచింది. 

"క్లెమెంట్, నేనూ ఒక యేడాది పాటు సహజీవనం చేసాం. నా పెళ్ళి, మావాళ్ళు చూసిన అబ్బాయితో మరో రెండు నెలల్లో జరుగుతుంది. అందుకని మేము విడిపోయాము". అంది మీనా గిన్నెలో నీళ్ళు పోసి పొయ్యి మీద పెడుతూ. 


"నీ సహజీవనం విషయం పెళ్ళికొడుక్కి తెలుసా?" 


"తెలుసు. అతను కూడా సహజీవనం కేసే. నా లాగే, బ్రేకప్ చెప్పాడు." 


"క్లెమెంట్ గొడవ చెయ్యడా?" 


"చదువు, మంచి వుద్యోగం వున్న వర్గాలలో అలా గొడవలు, హత్యలు వుండవు. అదంతా, మధ్య తరగతి ప్రేమికుల వికారమే. ఇక్కడ ఒక రాత్రి నుంచి కొన్ని సంవత్సరాలు కలిసి వుండే వీలుంది. విడిపోయాక ఎవరికి వారే. కాఫీ రెడీ. తీసుకో. అలా బాల్కనీలో కూర్చుని త్రాగుదాం" అంటూ మీనా కాఫీ కప్పుతో బాల్కనీ వైపు నడిచింది. 


రత్నకు ఈ తాత్కాలిక కలయికల గురించి తెలుసు. కానీ అటువంటి అనుభవమున్న వ్యక్తితో మాట్లాడే అవకాశం, అమెకు ఇప్పుడే లభించింది. 


"మీనా! నేనొక సున్నితమైన ప్రశ్న అడుగుతాను. తప్పనుకుంటే క్షమించు" 


మీనా నవ్వింది. "అడుగు. నీ ప్రాణ స్నేహితురాలినడిగినంత స్వేచ్చగా అడుగు." 

"తొలి రాత్రి అనే వుద్వేగం లేక పోవడం, పూర్వ అనుభవాలతో ఈ క్రొత్త అనుభవం పోల్చుకోవడం, వంటివి, క్రొత్త సంసారంలో వుండే వుత్సాహన్ని తగ్గించవా?" 


"అనుభవం లేని వారి వుద్వేగం వేరు. మేము ఆ దశ దాటేశాం. ఇద్దరికీ అనుభవముంది. ఈ అనుభవాన్ని తెలివిగా, దాంపత్యాన్ని బలోపేతం చేయడానికి వాడుకుంటాం. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం క్రొత్త గదా! ఆ క్రొత్తదనం తాలూకు వుద్వేగం తప్పకుండా వుంటుంది " 


ఆమె మాటలకు రత్న ఆలోచనలో పడింది. మీనా మాటలు కరక్టయితే, విడాకుల సంఖ్య యెందుకు పెరుగుతోంది, అన్న ప్రశ్న ఆమె మనసుని వేధించింది. అదే ప్రశ్న మీనానడిగింది. 


"వివాహబంధం నిలబడడానికి ప్రేమ మూలాధారం. అది లేక విడిపోతున్నారు. ప్రేమ వున్న చోట సహనం, క్షమ, త్యాగం వుంటాయి. నాకు క్లెమెంట్ అంటే ప్రేమ లేదు. స్నేహం, అభిమానం మాత్రమే వున్నాయి. అది కోరికలు తీర్చుకోవడానికో, సహజీవనానికో సరిపోతాయి, కానీ పెళ్ళికి కాదు." 


మీనా మాటలకు అడ్డుతగులుతూ, రత్న అడిగింది. 

"నీవు పెళ్ళి చేసుకోబోయే వ్యక్తిని ప్రేమించావా?" 


“ప్రేమ ఒక వరం లాంటిది. అది అందరికి దొరకదు. నాకూ దొరకలేదు. నా తల్లిదండ్రులమీద వున్న ప్రేమ వల్ల ఈ సంబంధం అంగీకరించాను. వీలైనంతగా అతడిని ప్రేమించి, బంధాన్ని నిలుపుకుంటాను. అరియనా, అదిత్యలది నిజమైన ప్రేమ. కానీ వారి తల్లి దండ్రులకిష్టం లేదు. అందువల్ల సహనంతో వారి అంగీకారానికి యెదురు చూస్తున్నారు. ఎప్పటికీ వాళ్ళు ఒప్పుకోకుంటే.. వారి ప్రేమనో, తల్లి దండ్రులనో వదులు కోవాల్సివస్తుంది. "


రత్న మనసులో ఒక గందరగోళ పరిస్థితి. రేపు అరియానా వేరొక పెండ్లి చేసుకుంటే, భర్త ఆమె సహజీవనం విషయాన్ని పట్టించుకోడా? అంత వుదాత్తత పురుషులలో పెరుగుతోందా? ఉద్యోగినులు పెళ్ళి జరిగేవరకు కన్యగా ఎందుకు వుండలేక పోతున్నారు? పురుషుని తో సమానత్వమా? నియంత్రించలేని శారీరక వాంఛలా? మెల్లగా మీనాను అడిగింది. 


"ఉద్యోగం రాగానే పెళ్ళి చేసుకోకుండా, ఇలా తాత్కాలిక సంబంధాలు పెట్టుకోవడమెందుకు?" 


"ఈ మధ్య వచ్చిన ఒక సర్వే ప్రకారం, చాలామంది తోడు, రక్షణ కోసం మగ వారితో స్నేహం చేస్తున్నారు. కామంతో కళ్ళు మూసుకు పోయి యిలా చేస్తున్నారన్నది అసత్యం. ఉద్యోగాల పని ఒత్తిడి వల్ల, వుద్యోగస్తులు అతి తక్కువగా సెక్సులో పాల్గొంటున్నారని సర్వే తెలిపింది. మానసిక వొత్తిడి తగ్గించుకోవడానికి ముద్దులు, కౌగలింతలు కోరుకుంటున్నారని ఒక నివేదిక చెప్తోంది. ఇదంతా ఎందుకు పెళ్ళి చేసుకోవచ్చు కదా అంటే, అది పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే. " 


"అదేమిటి మీనా అంత మాట అనేసావు?" 


"అంత మాటే. ఒక సినిమా డైలాగ్. మగవాళ్ళు పెళ్ళికి ముందు దాసులు, పెళ్ళయ్యాక బాసులు. భర్త కాగానే ఆడదాని సమయం, శరీరం పై పూర్తి అధికారాలు తమవే అన్నట్టు ప్రవర్తిస్తారు. ఎక్కడో నీ బావలాంటి మంచి వాడు వుండవచ్చు. అలాంటి వాడు తారసపడితే ప్రేమలో పడిపోవచ్చు. అందుకే అస్మిత నీ బావ వెంట పడింది. నీ బావ కోసమే ఈ అపార్టుమెంటుకు వచ్చింది. " 


రత్న గుండె ఝల్లుమంది. ఒక్క సారిగా ఆమె తనూ లతిక చంచలించిపోయింది. ఏం మాట్లాడాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించింది. 

మీనా రత్న చేతిని తన చేతిలోకి తీసుకుని మృదుస్వరంతో యిలా అంది. 


"భయపడకు. నీ బావ నిన్ను మరిచిపోలేదు. నా కోసం ఒక అల్లరిపిల్ల పుట్టి, పెరిగిందని చెప్పాడు. నిన్ను చూస్తే అమాయకురాలిలా వున్నావు. సైన్సు ప్రకారం బావను చేసుకోవడం కరక్టు కాదు. " 


"మా తల్లిదండ్రులు స్నేహితులు మాత్రమే. రక్త సంబంధీకులు కారు. మావి ప్రక్క ప్రక్క యిళ్ళు. మా స్నేహం పదహారేళ్ళక్రితం మొదలైంది. అదే ప్రేమగా మారి, పెళ్ళి మాటల దాకా వచ్చింది. " 


"అస్మిత చేసే మాయ నుంచి ప్రసన్న బయటపడి, నిన్నే పెళ్ళి చేసుకుంటాడని మనస్పూర్తిగా. ఆశిస్తున్నా" అంది మీనా. 


 ఆ మాటలు రత్నకు ధైర్యాన్నివ్వకపోగా, భయాన్ని పెంచాయి. నా వాడే నా బావ అనుకునే పరిస్థితి పోయి, ఇంకొకరితో పోటీ పడే దురవస్థ దాపురించింది. నా బలవంతమ్మీద నన్ను పెళ్ళాడినా, అతని మనసులో అస్మిత వుంటే అది నాకు అవమానం కాదా. నేను ఈ పోటీకి దూరంగా వుంటాను. బావ అన్నీ వదులుకుని వస్తే అప్పుడు అతని భార్యనవుతాను అని వర్ణనా తీతమైన వేదనతో అనుకుంది. 

 

 @@@


మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ప్రసన్న, అస్మిత కలిసే వచ్చారు. అందరూ కలిసి భోజనం చేసారు. భోజనాలయ్యాక రత్న, తనని స్నేహితురాలింట్లో, ఈ రోజు సాయంత్రం దింపమని ప్రసన్నని కోరింది. 


"అదేమిటి? ఒక రోజు కూడా వుండవా?" అని ఆశ్చర్యపోతూ అడిగింది అస్మిత. 


"లేదు. నా స్నేహితురాలి యిల్లు యూనివర్సిటీకి దగ్గర. తనతో ఈ రాత్రి గడిపి, రేపు వుదయం క్వార్టర్సుకు వెళ్ళిపోతాను" అంది రత్న.

 

రత్న గొంతులో ధ్వనించిన ధృడత్వాన్ని పసిగట్టాడు ప్రసన్న. 

" అలాగే. సరిగ్గా అయిదు గంటలకు బయలుదేరుదాము" అని చెప్పి కంపెనీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. రత్న మదిలో చెలరేగుతున్నఅనుమానాలు, వాటికి ప్రతిస్పందనగా ఆమెలో జ్వలిస్తున్న ఆత్మాభిమానం ప్రసన్నకి అర్ధమయ్యాయి. ప్రస్తుతానికి తను చేయగలింగిందేమీలేదని అనుకున్నాడు. 


 ప్రసన్న వెళ్ళిన తర్వాత అస్మిత, రత్నతో అంది. "నా మీద కోపం, అసహ్యం కలుగుతున్నాయా?”

 

"లేదే. అలా ఎందుకనుకుంటున్నారు?" అమాయకంగా అడిగింది రత్న.


"నేను బీటెక్ లో వున్నప్పుడు డేటింగ్ మొదలుపెట్టాను. మంచి అబ్బాయి దొరికితే ప్రేమించి, పెళ్ళి చేసుకుందామని. ఆరుగురు నాకు దగ్గరయ్యారు. కానీ వారిలో స్థిరత్వం లేదు. మానసికంగా నా కన్న బలహీనులు. ఇప్పుడు నా బాయ్ ఫ్రెండు సతీష్, మంచి వాడు. కానీ ఎంత సేపు కబుర్లు చెప్తూ, అందరికీ తలలో నాలుకగా వుండాలని, టైం వేస్టు చేస్తాడు. ఎవరో ఒకరు వుండాలని వాడిని అంగీకరించాను. ప్రసన్న నాకు నచ్చిన వ్యక్తి. కానీ, నీతో ప్రేమలో వుండడం వల్ల నన్ను కాదంటున్నాడు." అని భారంగా నిట్టూరుస్తూ అస్మిత రెండు నిమిషాలు మాట్లాడటం ఆపింది. రత్న మనసులో అగ్నిపర్వతాలు బ్రద్దలవడం మొదలైంది. కానీ ఆమె ఆ అగ్ని జ్వాలల యెర్రదనం ముఖంలో కనబడకుండా, జాగ్రత్త వహించింది. 


"మొగమాటం లేకుండా చెప్తున్నా! కేవలం నీ మీద జాలివల్ల వాడు నాకు దూరంగా వుండాలనుకుంటున్నాడు. అది సాగ నివ్వను. నేను అమెరికా వెళ్ళడం మానుకుని, వాడిని రేప్ చేసైనా, నావాడిని చేసుకుంటా. " ఆ మాటలని అస్మిత తన గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. 

 @@@ 


 రత్న యూనివర్సిటీలో చేరి నెలరోజులైంది. ఆమె సభ్యతా, సంస్కారాలు తోటి అధ్యాపకులకు నచ్చడంతో ఆమెకు ఒక స్నేహ బృందం యేర్పడింది. విద్యార్ధులు ఆమె బోధనా శైలిని యిష్టపడ్డారు. ఆమెకు వుద్యోగపరంగా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. ఇది చంద్రుని ఒక వైపు వెలిగే వెన్నెల ముఖం. రెండో వైపు దాగిన అమవసి ఎవరికి తెలుసు? అస్మిత బరితెగించి బావను సొంతం చేసుకుంటుందని ఆమె బలంగా నమ్మింది. ప్రేమ తన పాలిట వరం కాదని అనుకుంది. బావను తలుచుకుని మురిసిపోయిన ఆ రోజులు కొన్ని సంవత్సరాలకే పరిమితమని తెలిసి, చేసేది లేక, మ్రోడులా బ్రతుకునీడుస్తోంది. రత్న విరక్తితో ప్రసన్నకి ఫోన్ చేయడం, మెసేజ్ పెట్టడం వంటి వి మానేసింది. ఎక్కడ అస్మితతో, ‘నా ప్రియుడి జోలికి రావద్దనే మాట’ అనిపించుకోవాల్సి వస్తుందోనని ఆమె భయపడింది. 


అప్పుడప్పుడు ఆమె యే దేవుడు నాకు సహాయం చెయ్యగలడని ఆలోచించేది. ఎందరో దేవుళ్ళు వున్నారు. విఘ్నాలకు గణపతి, చదువుకు సరస్వతి, ధనానికి లక్ష్మి, తేజస్సుకి ఆంజనేయుడు, పాపహరణకు వేంకటా చలపతి. కానీ ప్రేమ వరంగా యివ్వడానికి ఎవ్వరున్నారు? ప్రేమించి వచ్చిన రుక్మిణికి సవతులను తెచ్చిన కృష్ణుని కొలువనా? భార్యను అడవిపాల్చేసిన రాముని కీర్తించనా? గంగను తన నెత్తినే గాక అర్ధాంగి పార్వతి నెత్తిన పెట్టిన శివయ్యని ప్రార్ధించనా? ప్రేమంటే కామమని బాణాలేసే మన్మధుడికి నీరాజనమివ్వనా? సమాధానం లేని తన ప్రశ్నకు ఆమె విరక్తితో నవ్వుకునేది. 

 @@@ 


ఎంత దురవస్థలో వున్నా, ప్రతి ఒక్కరు ఒక్క క్షణం, నిలబడి భరత మాతాకి జై అని నినదించే రోజు, స్వాతంత్య్ర దినం వచ్చింది. రత్న యూనివర్సిటీ లో జరిగే వుత్సవానికి హాజరై, స్నేహితులతో కలిసి నడుచుకుంటూ మెల్లగా యింటికి వచ్చింది. ఇంటి ముందు ఆగివున్న కారును చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆమె వడి వడిగా అడుగులు వేసి గేటు తీసి లోనికి వెడుతూ అక్కడమెట్ల మీద కూర్చున్న ప్రసన్నని చూసింది. పొంగిపొరలుతున్న ఆనందాన్ని గుండెలో అదిమిపెట్టి, ఆమె వుదాసీనంగా, "అదేమిటి బావా! ఫోన్ చేయ్యకపోయావా?" అని అడిగింది. 


"నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని" అన్నాడు ప్రసన్నచిరునవ్వుతో. 


ఇంటిలోనికి వెడుతూ, "రా లోపలికి, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా?" అని నిష్టూరమాడింది. 


"ఏరా! ఇన్ని రోజుల్లో ఒక్క క్షణమైన నువ్వు నన్ను మర్చిపోయావా, నేను నిన్ను మర్చిపోవడానికి?" లాలనగా అన్నాడు ప్రసన్న. 


అతని ఆత్మీయమైన పిలుపు చెవిన బడగానే, ఇంతవరకు ఆమె అణచిపెట్టుకున్న దుఃఖం కట్టలు తెంచుకుంది. ఒక్క వుదుటన, ప్రసన్న ఆమె చెంత చేరి, ఆమెను కౌగలించుకుని, "నా పెదవుల మీద కాల్చిన అట్లకాడ తో వాత పెట్టవా? నిన్ను ముద్దాడాలి" అన్నాడు. 


రత్న ఆశ్చర్యపోతూ "ఎందుకలా? " అని అడిగింది. 


"అస్మిత ఈ రోజు విమానాశ్రయంలో హటాత్తుగా నా పెదవుల మీద ముద్దు పెట్టింది. రాముడు అగ్ని పునీత అయిన సీతని గ్రహించాడు. నువ్వు నన్ను అలా శుద్ధి చేసి స్వీకరించాలి. " 


"రాముడు శూర్పణఖను దూరం పెట్టినట్లు నువ్వెందుకు అస్మితను దూరం పెట్టలేదు. ముందు దీనికి జవాబు చెప్పు?" 


“శూర్పణఖ వల్లకదా మొదట ఖర దూషణాదులతో, తర్వాత రావణుడితో యుద్ధం వచ్చింది. అందుకే, అస్మిత విషయంలో జాగ్రత్త పడ్డాను. నా కన్నా అమెరికా ముఖ్యమని, అక్కడ ఒక దొరబాబు నీ కోసం ఎదురుచూస్తున్నాడని చెప్పి విమానమెక్కించాను. నన్నుత్వరగా శిక్షిస్తే, ఈ నెలరోజుల దూరం పోగొట్టుకుంటాను". 


"అట్లకాడ ఎందుకు? విరహాగ్నితో కాలుతున్న నా పెదవులతో నిన్ను శిక్షిస్తా" అంటూ రత్న ప్రసన్న పెదవులను గాఢంగా చుంబించింది. ఆనంద పరవశురాలైన రత్న, ప్రేమ దేవుని మరచిపోలేదు. ఆమె ఆ దేవునికి తన కృతజ్ణతనిలా వెల్లడించింది. 


“ప్రేమ దేవుడా, నువ్వెవరో కాని, చిన్నప్పుడే నువ్వు, నాకిచ్చిన ప్రేమ వరం బలమైనది. సత్యమైనది. నీకు నా ప్రణామాలు". 

@@@@@


C..S.G . కృష్ణమాచార్యులు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు

 

శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి  లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో.  నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు  ప్రచురించాయి.

 ఈ మధ్యనే నాకిష్టమైన  తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను.  ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది,  చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ-  వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).

63 views3 comments

3 Comments


Trishan

7 hours ago

Super

Like


Swetha Venkat

1 day ago

Modern topic preserving the beauty of Telugu literature 👌🏻👌🏻

Like


@chengalvalasarada

• 1 day ago

Nice Story that revealed the present trend of young employees in cities. Yes, lack of love makes the couples go for divorce. Love acts as the basis for any relationship to sustain .

Like
bottom of page