'Prema Parijatham' - New Telugu Story Written By Ganga Koumudi
'ప్రేమ పారిజాతం' తెలుగు కథ
రచన: గంగా కౌముది
అది బృందావనం. ఎప్పుడూ కోయిల కల కూజితాలతో, కాళిందీ నది సోయగాలతో, సుందర పుష్పాల శోభలతో అలరారే వనం ఆరోజు మూగబోయింది. కృష్ణయ్య తమను విడిచి మధురకి తరలిపోతున్నాడని గోపగోపీ జనమంతా శోకసంద్రమైపోయింది. తన ముద్దుల పట్టి కన్నయ్య దూరమవటం యశోదమ్మ తట్టకోలేక పోతోంది.రాధ దుఃఖానికి అంతే లేదు. తన మనోహరుడు ఇక మరలా ఎప్పుడు చేరదీస్తాడో, వెన్నెల రాత్రులలో కాళిందీ ఇసుక తిన్నెలపై తన మోహన వేణుగానం ఎప్పుడు మరలా వినిపిస్తాడో అని కన్నీటిలో తడిసిపోతోంది. గోప కాంతలంతా తమ అదృష్టాన్ని తీసుకుపోతున్న అకౄరుని నిందించటం మొదలుపెట్టారు.
కన్నయ్య ఒక్కక్కరినీ ఓదారుస్తున్నాడు. మరలా తప్పకుండా వస్తానని యశోదమ్మకు మాట ఇచ్చాడు. రాధని ఊరడించాడు. గోపీ జనాన్ని సమాధాన పరిచాడు. కానీ కన్నయ్య కనులు ఒకరిని వెతుకుతున్నాయి.
"తనెక్కడ?"
అవును. "తను" కనిపించటం లేదు. ఆలమందలు కాయటానికి వెళితేనే తట్టుకోలేక "కన్నయ్యా! ఎప్పుడొస్తావు? నిన్ను చూడక నేనుండలేను. త్వరగా వచ్చేయి." అనే "తను" ఈ వార్త తెలిసి ఎలా తట్టుకుంటోంది అని కన్నయ్య మనసు పదేపదే కలవరిస్తోంది. ఒక్కక్కరిని ఊరడిస్తూ కాళిందీ తటానికి చేరుకున్నాడు. వెండి ఇసుక తిన్నెల్లో, చల్లని యమునా నదీ జలాలతో మౌనంగా ఒక మయూరంతో కూర్చుని "తను" కనపడింది.
మురళీ మోహనుని అడుగుల సవ్వడి తో ఆ ప్రదేశమంతా పులకరించింది. కన్నయ్య రాక గమనించి ఆనంద పరవశురాలైంది. " ఇక్కడున్నావేం? నను కలవటానికి రాలేదేం" అని ఆతృతతో అడిగాడు కన్నయ్య.
అమాయకంగా నవ్వింది గోపిక. ఆ నవ్వు నిండు పున్నమిలా, పండు వెన్నెలలా, కన్నయ్య వదనంలా మెరుస్తోంది. ఆ నవ్వే కన్నయ్య కి ఆశ్చర్యం కలిగించింది.రాధ వంటి తన ప్రియురాలే కన్నీరు మున్నీరవుతోంది. తనే లోకమని భావించి తనతో ఆడిపాడిన ఈ గోపికకి తన ప్రయాణం సంతోష దాయకమా అని కన్నయ్య ఆలోచిస్తున్నాడు.
కన్నయ్య తలపు గ్రహించినట్లు ఆ గోపిక చిరునవ్వుతో "కృష్ణా! నేను ఎన్నటికీ నీకు దూరమై ఉండలేను. నా మది నిండా నిండిన నీవు నాకెలా దూరమౌతావు? కనుల నిండా నింపుకున్న నీ మోహన రూపం నీరై జారిపోతుందేమోనని కన్నీరు కూడా రాలేదు నాకు. అణువణువున నిన్ను నింపుకున్న ఈ బృందావనిలో నీవెప్పుడూ నాతోనే ఉంటావు." అంది.
కన్నయ్య తన ప్రేమకి ఆశ్చర్యపోతూ తననే చూస్తూ మధురకి ప్రయాణమయ్యాడు.
కాలం గడిచిపోయింది. బృందావనం కన్నయ్య ద్వారకావాసి యైన శ్రీ కృష్ణమూర్తిగా మారాడు. అష్ట భార్యలతో అలరే స్వామి దుష్ట శిక్షణ చేసాడు. కురుక్షేత్రం చేయించాడు. భగవద్గీత వినిపించాడు. ప్రద్యుమ్నాది కుమారులను బడసి ద్వారకను శోభాయమానం చేసాడు. ఆరోజు కార్తీక బహుళ దశమి. ఉద్యాన వనంలో సేదతీరుతున్న కృష్ణస్వామికి అప్రయత్నంగా "తను" గుర్తుకు వచ్చింది. ఉన్నపళంగా స్వామి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. స్వామి కలవర పాటు చూసి రుక్మిణీ దేవి ఏమైందని అడిగింది.
కృష్ణయ్య "దేవీ! ఈరోజు కార్తీక బహుళ దశమి. నా నేస్తం జన్మదినం. నా కోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తోంది. నేను బృందావనానికి వెళ్ళివస్తాను." అని బయలుదేరాడు.
కృష్ణస్వామి బృందావనం చేరేసరికి వనమంతా వసంతమయింది. తరులతలన్నీ విరులను వర్షించాయి. కాళిందీ హృదయ ముప్పొంగి ప్రవహించింది. అలా శోభాయమానమైన వనాన్ని చూస్తూ కృష్ణస్వామి మునుపెన్నడూ ఎరగని పరిమళాన్ని చవిచూస్తూ, ఆ చెట్టు నీడలో కలువ పూలతో మాల కడుతున్న "తనని "చూసాడు.
అదే నిర్మలత్వం, నిష్కల్మషత్వంతో మెరిసిపోతున్న తను కృష్ణయ్య అడుగుల సవ్వడి విని వెనుదిరిగి, పరవశించి పోయింది. కోరి కొలిచిన వారి కొంగు బంగారం, ఆర్తజన బాంధవ రుక్మిణీ మనోహరం, స్నిగ్ధ రాధా మోహనుడైన స్వామి తన కోసం వచ్చాడని తెలిసి మనసు ఆనంద సాగరమైంది. కెంపుల హారంలా ఉన్న కలువల మాల నీల మేఘశ్యాముని గళసీమని చేరింది.
"ఈరోజు నీ జన్మదినమని నీ కోసం వచ్చాను. ఏం కావాలో కోరుకో" అన్నాడు కృష్ణస్వామి. ఆ మాటకి పరవశించిన ఆనందంతో "నిన్ను చూడాలని, నీవెప్పటికైనా వస్తావని ఈ పారిజాత వృక్షం నీకోసం పెంచాను. ఈ పారిజాతం నీపై పూలు వర్షిస్తే ఆ ఆనందపు జల్లులో నీ మోహన రూపం కనులారా వీక్షించి, సుధా మోహన జలధిలో ఓలలాడించు నీ స్వరంతో ఒక్కసారి నా పేరు పలకవూ " అని అడుగుతున్న తన నిర్మలత్వానికి ముగ్ధుడై "కౌముదీ " అంటూ తన్మయంగా పిలిచాడు.
ఆ పిలుపు కోటి వీణారావాలతో కౌముది అంతరంగంలో పారిజాత వర్షం కురిపించింది. కార్తీక బహుళ దశమి కార్తీక పౌర్ణమిలా వెన్నెలలు విరియించింది. ఆ అమృతపు జల్లులలో, ఆనంద జలధిలో కౌముదీ ప్రేమ పారిజాతం కృష్ణస్వామి లో అంకితమయింది.
***
గంగా కౌముది గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం:
కలం పేరు - గంగా కౌముది
నేను ఒక సాహిత్యాభిమానిని. సాహిత్య సాగరాన ఒక చిన్న రచనాభిలాషిని.
వెన్నెలలో వెలిగే నిండు జాబిల్లి నా కవనం
వన్నె చిన్నెల శ్రీ కృష్ణ జాబిల్లి నా జీవనం
Comments