'Prema Preme' - New Telugu Story Written By BVD Prasada Rao
Published In manatelugukathalu.com On 31/05/2024
'ప్రేమ ప్రేమే' తెలుగు కథ
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పార్వతి వాదన ఆపడం లేదు.
శ్రీకంఠ అసహనం వీడడం లేదు.
సరిత అయోమయం పోవడం లేదు.
పార్వతి.. శ్రీకంఠ దంపతులు. వాళ్ల బిడ్డ సరిత.
శ్రీకంఠ ఓ ప్రయివేట్ కంపెనీ యజమాని.
సరిత ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్.
***
ఐదేళ్ల ఆరు మాసాల క్రితం..
"మీ అభిరుచులు." అడిగాడు శ్రీకంఠ.
"ఓన్లీ ఒన్.. స్వయం ఉపాధి." చెప్పింది పార్వతి.
"అంటే.. స్వంతంగా ఓ కంపెనీ లాంటిది నిర్వహించ.." అడుగుతున్న శ్రీకంఠకు..
అడ్డై.. "అబ్బే. ఆ వైపు కాదు. అట్టివి కావు." చెప్పింది పార్వతి.
శ్రీకంఠ విస్మయమయ్యాడు. పార్వతినే చూస్తున్నాడు.
అప్పుడే వచ్చి.. నిల్చుంది పార్వతి తల్లి.. ఆ గది డోర్ కర్టెన్ చాటున.. ఆ ఇంటి హాలు వైపున.
"తల్లీ.. ఓ మారు బయటికి రా." మృదువుగా పార్వతిని పిలిచింది.
"అమ్మ పిలుస్తోంది." ఆ గది నుండి బయటికి వచ్చింది పార్వతి.
పార్వతి.. శ్రీకంఠల పెళ్లి చూపులు కార్యక్రమం జరుగుతోంది.. ముప్పావు గంట నుండి.
తనే అడగడంతో.. పార్వతితో మాట్లాడుకునే సౌలభ్యం పెద్దల అంగీకారంతో శ్రీకంఠకి కుదిరింది.
ఆ ఇద్దరూ ఆ గదిన కూర్చొని మాట్లాడుకుంటున్నారు.. రమారమీ ఇరవై ఐదు నిముషాల లగాయతు.
రెండు కాఫీ కప్పులు ఉన్న ట్రేతో తిరిగి ఆ గదిలోకి వచ్చింది పార్వతి.
ఆ గది డోర్ కర్టెన్ సర్దేసి హాలు వైపు నడిచింది పార్వతి తల్లి.
ఆ చోటున సోఫాల్లో ఇరు కుటుంబాల పెద్దలు, మధ్యవర్తి కూర్చొని ఉన్నారు. కాఫీ తాగుతున్నారు. ముచ్చటించుకుంటున్నారు.
వాళ్ల ముచ్చట్లు పంచుకోవుటకు పార్వతి తల్లి.. భర్త పక్కన కూర్చొంది.
ఆ గదిన..
పార్వతి కాఫీ తాగుతోంది.
"మీరు చెప్పలేదు." అన్నాడు శ్రీకంఠ. అతడు పార్వతినే చూస్తున్నాడు.
"కాఫీ చల్లారుతోంది. ముందు తాగండి." చక్కగా నవ్వింది పార్వతి.
శ్రీకంఠ సర్దుకున్నాడు. అప్పటికే పార్వతి అందించిన.. తన చేతిలోని కాఫీ కప్పు వంక చూస్తూ..
"వేడిగా ఉంది." చెప్పాడు.
"ఇంటిన ఉండే.. నా అంతట నేను.. నిర్వహించ తగ్గది ఎంపిక చేసుకోవాలి అన్నది నా తలంపు." మెల్లి మెల్లిగా చెప్పింది పార్వతి. తను కాఫీ తాగుతోంది.
అప్పటికే కాఫీ కప్పు వైపు నుండి చూపు మార్చుకొని.. పార్వతినే చూస్తున్న శ్రీకంఠ..
"అర్ధం కావడం లేదు." చెప్పాడు. చిన్నగా కదిలాడు.
"లైక్.. కాటేజ్ ఇన్డస్ట్రీస్ లాంటివి." చెప్పింది పార్వతి. తన చేతి లోని అప్పుడే ఖాళీ ఐన కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టింది.
"యూ మీన్.. కుటీర పరిశ్రమలు." సంశయమవుతాడు శ్రీకంఠ.
"యయ. లైక్ థట్." పార్వతి అనేసింది.
ఆ వెంబడే..
"నేనే ఏమీ తేల్చుకోలేదు. ఇప్పటికిప్పుడు నేను ఏమీ చెప్పలేను. కానీ దానికి అందుబాటు పడేలానే కొత్తింటిని నాన్నతో కట్టించుకుంటున్నాను." చెప్పింది.
"ఏదీ.. కన్ష్ట్రక్సన్ లో ఉన్న ఆ ప్లేఓవర్ పక్కదా." అడిగాడు శ్రీకంఠ.
"అవునవును. అది నా కోసం నాన్న కట్టి ఇస్తున్నారు. మీకు చెప్పి ఉన్నారుగా." చెప్పింది పార్వతి.
"చెప్పారు చెప్పారు." అనేసాడు శ్రీకంఠ.
"కాఫీ చల్లారి ఉంటుంది. ఇలా ఇవ్వండి. మార్చి వేడిది తెస్తాను." సోఫా కుర్చీలోంచి లేచింది పార్వతి.
"నో నో. ప్లీజ్. కూర్చొండి. ఇది తాగేస్తాను." తడబడ్డాడు శ్రీకంఠ. ఆ వెంబడే.. గడగడా కాఫీ తాగేస్తున్నాడు.
పార్వతి కూర్చొంది.
ఖాళీ కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టేసాడు శ్రీకంఠ.
"చాలాసేపు గడిచింది. అమ్మ కూడా కాఫీ కప్పులు ఇస్తూ చెప్పింది.. వాళ్లు మన కోసమే చూస్తున్నారని. మరి.. మనం వెళ్దామా." మెల్లి మెల్లిగా అడిగింది పార్వతి.
"ఇంకా మాట్లాడుకోమా." నసిగాడు శ్రీకంఠ.
"మీరే లాగ్ లతో కాలయాపన చేసారు." మృదువుగానే పార్వతి చెప్పింది.
"మరోసారి మాట్లాడుకోవచ్చా." శ్రీకంఠ నంగిరయ్యాడు.
"అవసరమా." అడిగింది పార్వతి.
"ఏదో.. ఈ మీటింగ్ అసంపూర్తిగా తోస్తోంది నాకు." చెప్పాడు శ్రీకంఠ.
"అన్నీ కుదిరితే.. తిరిగి మాట్లాడుకోగలం." చెప్పింది పార్వతి. లేచింది.
తప్పక లేచాడు శ్రీకంఠ.
ఆ ఇద్దరూ.. ఆ గది నుండి హాలు లోకి వచ్చారు.
తమ తమ తల్లిదండ్రుల పక్కన చేరారు.
మధ్యవర్తి చొరవతో..
తొలుత పార్వతి తల్లిదండ్రులు లేచారు. కూతురుని తీసుకొని తమ గదిలోకి వెళ్లారు.
అప్పుడే..
"అబ్బాయితో మాట్లాడండి. అతడి అభిప్రాయం తెలుసుకోండి." మధ్యవర్తి చెప్పగా..
"ఏమంటావు." అడిగింది శ్రీకంఠ తల్లి.. కొడుకును చూస్తూ.
శ్రీకంఠ ఏమీ చెప్పక పోయే సరికి..
"చెప్రా. అమ్మాయితో మాట్లాడావుగా. నీ అభిప్రాయం చెప్పు." అన్నాడు శ్రీకంఠ తండ్రి.. కొడుకునే చూస్తూ.
"అమ్మాయి నచ్చింది." చెప్పాడు శ్రీకంఠ.
ఆ వెంబడే..
"కానీ.. ఇంకా మాట్లాడాలి." అన్నాడు.
"అంటే.." చికాకవుతోంది శ్రీకంఠ తల్లి.
"చాలా సమయం ఉన్నారుగా. ఏమీ మాట్లాడలేదా." చిరాకయ్యాడు శ్రీకంఠ తండ్రి.
"మాట్లాడేను." చెప్పాడు శ్రీకంఠ.
"మరి. ఇంకేం." మధ్యవర్తి కలగచేసుకున్నాడు.
శ్రీకంఠ ఏమీ చెప్ప లేదు.
"పెద్దలు మాటలు కుదిరాయి. మీ పిల్లల ఇష్టం కొరకు వీళ్లు ఆగారు." చెప్పాడు మధ్యవర్తి.
అంతలోనే పార్వతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు.
పార్వతి రాలేదు.
పార్వతి తల్లిదండ్రులు కూర్చున్నాక..
"అమ్మాయి ఏమంది." అడిగాడు మధ్యవర్తి.
"అబ్బాయి ఏం చెప్పాడు." అడిగాడు పార్వతి తండ్రి.
శ్రీకంఠ తల్లిదండ్రులతో పాటుగా మధ్యవర్తి సతమతమయ్యాడు.
శ్రీకంఠ ప్రేక్షకుడు మాదిరయ్యాడు.
ముందుగా మధ్యవర్తి అప్పుడే తేరుకున్నట్టు కదిలి..
"అమ్మాయితో అబ్బాయి ఇంకా మాట్లాడాలట." చెప్పాడు.
"అమ్మాయి చెప్పింది.. అబ్బాయి ఇంకా మాట్లాడాలన్నాడని." చెప్పాడు పార్వతి తండ్రి.
"మరి.. వాళ్లకి మరోమారు మాట్లాడుకునే అవకాశం ఇస్తే బాగుంటుందిగా." గుసగుసల్లా చెప్పాడు మధ్యవర్తి.
అప్పుడు శ్రీకంఠ కలగచేసుకున్నాడు.
"లేదు లేదు. ఇనఫ్. చెప్పాగా.. నాకు అమ్మాయి నచ్చింది." అనేసాడు.
"మా అమ్మాయి తన సమ్మతిని తెల్పింది." పార్వతి తల్లి కలగచేసుకుంది.
"అవునా. మరేం. అబ్బాయికి మళ్లీ మాట్లాడే అవసరం లేదంటున్నాడుగా. ఇద్దరూ నచ్చుకునేక.. మరేం ఉంది. శుభమ్." గలగలా అనేసాడు మధ్యవర్తి.
దాంతో.. ఆ పెద్దల మాటలు ముహూర్తల వైపుకు మళ్లాయి.
ఆ తోవనే పంతులుగారిని కలవడానికి వాళ్లు అనుకూలంగా అంగీకరించు కున్నారు.
పక్షం ఒక రోజు తర్వాత..
శోభనం రాత్రి..
ఆ గదిన..
మంచం అంచున..
పార్వతి.. శ్రీకంఠ కూర్చొని ఉన్నారు.
పార్వతి తల దించుకొని ఉంది.
"నువ్వు నాకు పాలు గ్లాస్ తేలేదు." చిన్నగా అన్నాడు శ్రీకంఠ.
పార్వతి తలెత్తింది. శ్రీకంఠని తికమకతో చూస్తోంది.
శ్రీకంఠ సన్నగా నవ్వుతున్నాడు.
చూపు మార్చుకుంటూ.. "అట్టివి మీడియాల్లోనే ఏమో." అమాయకంగా అంది పార్వతి.
ఆ వెంబడే..
"తామంతా వెళ్లేక.. గది తలుపేసుకో.. చెప్పింది మా అమ్మ. నేనలానే చేసి వచ్చాను." బిడియంగా చెప్పింది.
శ్రీకంఠ చిన్నగా నవ్వేసి.. జరిగి.. పార్వతిని దరిగా తీసుకోబోయాడు.
పార్వతి చిన్నగా వెనుక్కు వంగి.. "మీతో మాట్లాడాలి." చెప్పింది.
శ్రీకంఠ తగ్గాడు.
"చెప్పు." అన్నాడు.
"అదే. మీరు పెళ్లి చూపులు నాడు చెప్పారుగా.. ఇంకా నాతో మాట్లాడాలని. అదే.. ఏ మాటలు అవి." నెమ్మది నెమ్మదిగా అడుగుతోంది పార్వతి.
శ్రీకంఠ ఏమీ మాట్లాడ లేదు.
ఎప్పటికీ శ్రీకంఠ ఏమీ చెప్పక పోయే సరికి..
పార్వతి మెల్లిగా తలెత్తి.. శ్రీకంఠని చూస్తోంది.
"ఇంకా అదే ఆలోచన చేస్తున్నావా. అబ్బే. ఏ మాటలు లేవు." చెప్పాడు శ్రీకంఠ.
"మరి.. మరెందుకు అలా అప్పుడు అన్నారు." అడిగేయగలిగింది పార్వతి.
చిన్నగా నవ్వేస్తూ..
"మరేమో.. నిన్ను చూస్తూ మరి కొంత సేపు ఉండాలని. మాటలు ఆడాలనేసాను." హస్కీగా చెప్పేసాడు శ్రీకంఠ.
పార్వతి మురిసింది. కను రెప్పలను టపటపా లాడిస్తూ.. శ్రీకంఠనే చూస్తోంది.
శ్రీకంఠ మెత్తగా నవ్వుతూనే..
"అంతే. అదే కారణం. నీ నుండి వెళ్ల బుద్ధి కాలేదప్పుడు." మెల్లిగా చెప్పాడు.
పార్వతి మరింత సిగ్గయ్యిపోతోంది.
ఆ తోవలోనే..
శ్రీకంఠచే అతడి బాహువుల్లోకి సుతిమెత్తగా పార్వతి లాక్కోబడింది.
రోజులు గడుస్తున్నాయి.
ఇరువురుది ఒకే ఊరు కావడంతో.. పైగా ఇరువురు ఇళ్ల మధ్య దూరాలు నిమానం కావడంతో..
శ్రీకంఠ తన పనికి బయటికి వెళ్లేక.. పార్వతి.. తన అత్తవారింటి.. తన కన్నవారింటి మధ్య తరచు తిరుగుతూ చాన్నాళ్లు జాలీగా గడిపేసింది. ఆ తోవన తల్లి కూడా అయ్యిపోయింది.
తన తండ్రి కట్టి ఇచ్చిన కొత్తింటికి చేరేక.. పార్వతి తిరుగుళ్లు బాగా తగ్గిపోయాయి. కారణాలు.. తమ ఇళ్ల మధ్య దూరాలు.. అందుకు తగ్గట్టు ట్రాఫిక్ అవస్తలు.. సరిత సంరక్షణ బాధ్యతలు.
ఆ పై.. సరితని ఎల్కేజీలో చేర్చేక.. సరితని స్కూటీ మీద కాన్వెంట్ కు రోజూ తీసుకు వెళ్లడంలో.. తీసుకు రావడంలో.. ఇంటిన సరిత చేత హోం వర్క్స్ చేయించడంలో పడింది పార్వతి. అలా యుకేజీ వరకు జరిగేక.. సరిత ఫస్ట్ స్టాండర్డ్ కు వచ్చేక.. పార్వతికి ఆ తిరుగుళ్లు కూడా ఆగిపోయాయి.
శ్రీకంఠ తను నిర్వహిస్తున్న కంపెనీ వైపు రాక పోకలు కొత్తింటి నుండే అవుతున్నాయి. దూరం.. ట్రాఫిక్ అవస్తల మూలంగా.. అతడు ఉదయం వెళ్లడాలు.. సాయంకాలంకి రావడాలు జరుగుతున్నాయి.
సరిత స్కూలుకు.. వారంలో ఆరు రోజులు.. ఉదయం ఎనిమిదింటికి వెళ్లడాలు.. సాయంకాలం ఐదింటికి రావడాలు.. స్కూలు బస్సులో కొనసాగుతున్నాయి.
శ్రీకంఠ తన పని కై.. సరిత తన చదువు కై.. వెళ్తుండడంతో..
పార్వతి ఆ కొత్తింట రోజూ చాలా సమయం ఒంటరిగా ఉండడం అవుతోంది.
దాంతో పెళ్లికి ముందు తను అనుకున్న దాని వైపు తిరిగి మెల్లి మెల్లిగా మొగ్గడం మొదలెట్టింది.
తన ఇంటన తను ఎట్టిది చేపట్టి.. తన స్వయం ఉపాధి కాంక్షను నెఱువు కోవాలన్న తంటాలు పడుతోంది.
ఎన్నెన్నో తన మట్టుకు తానే తర్కించుకుంటుంది. ఏదీ ఆమెను స్తిమిత పర్చడం లేదు.
శ్రీకంఠ సాయం కోరుతోంది.
శ్రీకంఠ.. 'హాయిగా ఉండు. నీకెందుకు శ్రమ.' అనేసే వాడు.
పార్వతి మాత్రం తగ్గడం లేదు.
దాంతో.. ఆ భార్యాభర్తల మధ్య పోరు పెనుగులాట మెల్లిగా చోరబడుతోంది.
ఇంటికి వస్తే.. పార్వతి నస తప్పడం లేదని.. శ్రీకంఠ.. రాత్రులు రావడాలు ఆలస్యం చేస్తున్నాడు. ఉదయాలు వెళ్లపోవడాలు త్వరగా చేస్తున్నాడు.
తల్లిదండ్రులు కలిస్తే.. తను బెదిరిపోవడం తప్పదని.. వాళ్లు కలవక ముందే.. నిద్రకై పక్క ఎక్కేస్తోంది పాపం.. ఆ చిన్నారి సరిత.
***
వర్తమానం.
"మామ్.. ఐ హేవ్ టు గో టు స్కూల్. ఐ హేవ్ ఏన్ ఎగ్జామ్ టుడే." సరిత బేలగా అంది.. పార్వతిని చూస్తూ.
"అవునవును. లేచింది మొదలు నీ సొదే." నసిగాడు శ్రీకంఠ.
"మీరు ఈ మధ్య నాకు దొరికేది ఎక్కడ. తొందర తొందరగా వెళ్లి పోతున్నారాయే. ఏ రాత్రికో వస్తున్నారాయే." అరిచింది పార్వతి.
సరిత తనను జాలితో చూడడం గుర్తించిన శ్రీకంఠ..
"సరే. పాపను తయారు చేసి స్కూలుకు తొలుత పంపు. నేను ఈ రోజు ఆలస్యంగా బయటికి వెళ్తాను. కాదంటే ఉండిపోతాను కూడా. మనిద్దరం మాట్లాడుకుందాం." చెప్పాడు.
పార్వతి వినుకుంది.
సరితను తీసుకొని బాత్రూం వైపుకు నడిచింది.
గంటన్నర తర్వాత..
పార్వతి.. శ్రీకంఠ.. ఇద్దరే ఆ ఇంట ఉన్నారు.
శ్రీకంఠకు ఒక కాఫీ కప్పు ఇచ్చి.. తను ఒక కాఫీ కప్పుతో.. హాలులో కూర్చుంది పార్వతి.
కాఫీని సిప్ చేస్తూ..
"రతీ.." ఏదో చెప్పబోయాడు శ్రీకంఠ.
అడ్డై.. "ఆఁ. ఆఁ. చాలు చాలు. మీ ముద్దు పిలుపులు చాలించండి. నేను పార్వతిని. కాల్ మి పార్వతి." సర్రున అంది పార్వతి.
శ్రీకంఠ చిన్నపాటి కదలిక పిమ్మట..
"కూల్ పార్వతీ." అన్నాడు.
పార్వతి కాఫీ తాగుతోంది.
"ఇప్పటికీ నీకంటూ ఒక క్లారటీ లేదు. ఏం పెట్టబోతున్నావో చెప్పలేక పోతున్నావు.." చెప్పుతున్నాడు శ్రీకంఠ.
అడ్డై.. ఏదో చెప్పబోతోంది పార్వతి.
"ప్లీజ్. పార్వతీ.. నన్ను మాట్లాడనీవు. ప్లీజ్." అన్నాడు శ్రీకంఠ.
పార్వతి ఏమీ మాట్లాడక పోవడంతో..
"పార్వతీ.. నువ్వు ఒక గాడీలో పడు. దానికి ముందు నేను చెప్పేది విను. నువ్వు కష్ట పడడం నాకు ఇష్టం కాదు. అలానే నీ ఒంటరితనంని అర్థం చేసుకున్నాను. నిజమే.. నేను.. సరిత వెళ్లేక నువ్వు చాలా గంటలు ఇంటిలో ఒంటరిగా ఉండడం నీకు పరమ ఇబ్బందే. ఐ నో." ఆగాడు శ్రీకంఠ.
పార్వతి కాఫీ తాగేసి.. ఖాళీ కప్పును పక్కన పెట్టింది.
శ్రీకంఠ కాఫీ తాగక.. చేతిలోని కప్పుని పక్కన పెట్టక.. మాట్లాడుతున్నాడు.
అది గుర్తించినా.. పార్వతి ఏమీ అనక.. అతడినే చూస్తూ ఉంటుంది.
"నేను ఒక సలహా ఇస్తాను. నచ్చితే చేపట్టు. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలం బాగానే ఉంది. ఆ స్థలాన్ని నువ్వు వినియోగించుకో. ఎలా అంటే.. మిద్దె పంటలు వినే ఉంటావు. ఆ మాదిరిగా.. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెనింగ్ మొదలెట్టు." ఆగాడు శ్రీకంఠ.
భార్య వింటున్నట్టు గుర్తించాడు.
"నా వంతు సాయంగా.. నిన్ను కర్షక సేవా కేంద్రంకి తీసుకు వెళ్తాను. నీకు ఇట్టి వాటి యందు అవగాహన కల్పిస్తాను. తోడుగా ఒకరిద్దరు మనుష్యులను సమకూరుస్తాను. నీవు అనుకున్నట్టు ఇంటిన ఉంటూ.. ఇంటిన నీ స్వయం ఉపాధి కార్యక్రమాల్ని కానిచ్చుకోవచ్చు. కూల్ గా ఆలోచించు." చెప్పడం ఆపాడు శ్రీకంఠ.
భార్యనే చూస్తు్న్నాడు.
రమారమీ అర నిముషం తర్వాత..
"ఇలా నాతో ఈ మధ్య మాట్లాడ వచ్చుగా." నసిగింది పార్వతి.
"చెప్పాగా. నువ్వు కష్ట పడకూడదని నేను తొలుత నుండి అభిలషిస్తున్నాను. నువ్వు నాకు వికసించే పువ్వు మాదిరి. కానీ నా మాట వినవని గ్రహించాను. నీ పట్టు నీదేలా అనిపించింది. ఈ మధ్యన పేపరులో న్యూస్ చూసాక.. ఒక ఆలోచన చేసాను. మిద్దె పంటల వైపు నీకు బాగుంటుందని అనుకున్నాను. అందుకే అట్టి సంబంధీకులను కలిసాను. సాధకబాధకాలు తెలుసుకున్నాను. ఐనా ఆగాను. కానీ మరి తప్పదని.. మరి ఆగక.. నీ వాదనకు బ్రేక్ వేయాలనే ఇప్పుడు ఇది నీ ముందు పెట్టేసాను. బయలు దేరు. అక్కడికి నిన్ను తీసుకు వెళ్తాను. నీకూ ఐడియా వస్తోంది." చెప్పాడు శ్రీకంఠ.
పార్వతి తెములుకుంటుంది.
శ్రీకంఠ కాఫీ తాగబోతుండగా.. లేచి.. అతడి చేతిలోని కప్పును తీసుకుంది.
"చల్లారిపోయి ఉంటుంది. మరో వేడి కాఫీ ఇస్తాను." అంది. కప్పుతో అక్కడి నుండి కదిలింది కిచెన్ వైపుకు.
శ్రీకంఠ చిన్నగా నవ్వుకుంటాడు.
మూడు గంటల తర్వాత..
కర్షక సేవా కేంద్రం నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు పార్వతి.. శ్రీకంఠ.. కారులో.
దారిలో..
"నేను కిచెన్ గార్డెనింగ్ చేపట్టగలను." చెప్పింది పార్వతి ఉత్సాహంగా.
"నేను వాళ్ల నుండి విత్తనాలు, మొక్కలు, సేంద్రియ ఎరువులు, గోకృపామృతం లాంటివి నీకు సమకూర్చిపెట్టగలను." చెప్పాడు శ్రీకంఠ.
శ్రీకంఠ కుడి అర చేతిని.. తన అర చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కి..
"థాంక్సండీ." అంది పార్వతి తృప్తిగా.
ఆ ఇద్దరూ బేక్ సీటున ఉన్నారు.
చిన్నగా నవ్వేసాడు శ్రీకంఠ.
అర నిముషం తర్వాత..
"కృపాకర్.. చెప్పానుగా. ఇద్దరు పనిమంతులైన.. ఒబ్బిడి కలిగిన పనివాళ్లని అమ్మగారికి ఒప్ప చెప్పు. వచ్చే వారం నుండే అమ్మగారి పనులు మొదలవుతాయి." చెప్పాడు శ్రీకంఠ.. డ్రయివర్ ని చూస్తూ.
"సర్.. అలానే." ఒప్పుకున్నాడు కృపాకర్.
పార్వతి తేలకవుతోంది. తొలినాళ్లలా శ్రీకంఠని రిసీవ్ చేసుకుంటుంది.
సుమారు అర గంట తర్వాత.. ఆ దంపతులు ఇద్దరూ ఇంటిని చేరారు.
ఇంట్లోకి వెళ్లాక..
"పార్వతీ.. నేను కంపెనీ వైపు వెళ్లి వస్తాను." చెప్పాడు తన బేగ్ ను తీసుకుంటూ.
"అలా కాదు." పార్వతి బిడియమవుతోంది.
"వెళ్లొద్దా." అడిగాడు శ్రీకంఠ.
"అది కాదు. పార్వతీ అనొద్దు." తల దించుకుంది పార్వతి.
"మరి." శ్రీకంఠ ఆసక్తుడయ్యాడు.
"ఉఁ. మీరు.. మీరు.. పిలిచే వారే.. ఇది వరకటిలానే నన్ను పిలవరూ." దేవరింపులా చెప్పింది పార్వతి.
చిన్నగా నవ్వేస్తూ.. "అలా పిలవడమే నాకు ఇష్టం.. ఆ పిలుపు నా బలం.. రతీ." చాలా సొగసుగా చెప్పాడు శ్రీకంఠ.
పార్వతి కళ్లల్లో నీళ్లూరుతున్నాయి.
కదిలి, శ్రీకంఠని కౌగలించుకుంటుంది.
రెండు నిముషాల తర్వాత..
"నేను తొందరగా సాయంకాలమే వచ్చేస్తాను. సరితను తీసుకొని మనం అలా బయటికి వెళ్దాం. తను కూడా మన మూలంగా ఇన్నాళ్లు సఫరయ్యింది." చెప్పాడు మెల్లిగా శ్రీకంఠ.
కౌగిలి నుండి బయటికి వచ్చి.. 'సరే' అన్నట్టు తలాడించింది పార్వతి.
శ్రీకంఠ.. తన కుడి చూపుడు వేలుతో.. పార్వతి కన్నీరును తుడిచి.. "బై రతీ." నిండుగా అన్నాడు. బేగ్ తో కదిలాడు.
పార్వతి అతడినే చూస్తూ ఉండిపోయింది.
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comments