#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Prema Tharangalu - Part 10 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 07/01/2025
ప్రేమ తరంగాలు - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.
సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు. ఫ్లయిట్ లో మురళీధర్ తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ.
పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది.
చెన్నైలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్ గా భావిస్తుంది. మానసకు తోడుగా కార్లో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తండ్రికి అన్ని విషయాలూ చెప్పి, అమెరికాకు ఇక వెళ్లనని, ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది. భామకు రాంబాబు పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది.
తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. మానసను వెంటనే రమ్మంటుంది.
యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనితో ఉన్న యువకుడు డాక్టర్ అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు.
భామ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 10 చదవండి.
భామ, మానస సాయంత్రం ఐదు గంటలకు గ్రామానికి చేరారు. రాంబాబు నెల్లూరులో కోర్టు వ్యవహారాలు చూచుకొని ఆరుగంటలకు ముకుందవర్మ యింటికి వచ్చాడు. భామను మానసను పలకరించి ఆఫీసు గదిలో కూర్చొని కేసు కట్టలను పరిశీలిస్తూ వుండగా వీధి వాకిట్లో ఒక కారు వచ్చి ఆగడాన్ని కిటికీ గుండా చూచాడు.
రాంబాబు సెల్ మ్రోగింది. చేతికి తీసుకున్నాడు.
"హలో!"
"చెప్పండి మేడం"
"వాకిట్లో ఓ కారు ఆగింది చూచారా!"
"చూచాను"
"ఆ కార్లో వచ్చిన వారిని లోనికి రానివ్వకండి. మీరు వెంటనే వీధి వాకిట్లోకి వెళ్ళండి. వారు భామను నన్ను గురించి అడగవచ్చు. మేము ఇంట్లో లేమని వూరికి వెళ్ళామని చెప్పి.... వారిని పంపించేయండి. త్వరగా వీధి వాకిటివైపుకు వెళ్ళండి ప్లీజ్."
మానస మాటలను విని రాంబాబు వేగంగా వీధి వాకిటివైపుకు నడిచి వీధి గేటును సమీపించాడు.
"హలో!..."
"ఎవరండి మీరు?"
"భామ ఇంట్లో వుందా!"
"లేదండీ... వూరికి వెళ్ళి వున్నారు. మీరెవరో చెప్పండి వారు రాగానే చెబుతాను."
"నా పేరు మురళీధర్... ఇతను నా ఫ్రెండ్ కిరణ్. భామ అమెరికాలో నాకు ఫ్రెండ్. చూడాలని వచ్చాను. వాళ్ళ అమ్మా నాన్న వున్నారా!"
"లేరు. వారు వూరికి వెళ్ళారు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండీ. వారు రాగానే ఇచ్చి మీకు ఫోన్ చేయమని చెబుతాను సార్!"
"మీరెవరు?"
"అడ్వకేట్... ముకుందవర్మ గారి అసిస్టెంట్‍ను"
"మీ పేరు?"
"రాంబాబు"
"భామ ఎప్పుడు వస్తుంది?"
"ఆ వివరం నాకు తెలియదు సార్!"
"సరే... వస్తే మురళీధర్ వచ్చాడని చెప్పండి. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి"
మురళీధర్ చెప్పిన ఫోన్ నెంబర్‍ను రాంబాబు సెల్లో నోట్ చేసుకున్నాడూ.
"ప్రస్తుతం మీరు ఎక్కడ వుంటున్నారు సార్!"
"నెల్లూరులో సింహపురి హోటల్లో"
"ఎన్నిరోజులు వుంటారు?"
"భామను కలిసి మాట్లాడేవరకు"
"ఓకే సార్!... వారు రాగానే మీ నెంబరు వారికి ఇచ్చి మీకు ఫోన్ చేయమని చెబుతాను"
"గుడ్ థాంక్యూ"
"నో మెన్షన్ ప్లీజ్"
మురళీధర్, కిరణ్ కార్లో కూర్చున్నారు. మురళీ కారును స్టార్ట్ చేశాడు. కొద్ది క్షణాల్లో కారు వీధి మలుపు తిరిగింది.
రాంబాబు ఆ కారును తన సెల్‍తో ఫొటో తీశాడు. లోనికి నడిచాడు.
మానస ఆత్రుతతో మెట్లు దిగి క్రిందికి వచ్చింది. ఆమె ముఖం ఎంతో ఆందోళనగా వుంది.
"ఏమిటి మేడమ్!... అదోలా వున్నారు?"
"వచ్చింది మురళీధర్ కదూ!"
"అవును మేడమ్... వారు మీకు తెలుసా!"
అవునన్నట్లు తలాడించింది మానస.
"ఏమడిగాడు?"
"భామ తన స్నేహితురాలని, చూచి మాట్లాడాలని వచ్చానని చెప్పాడు"
"మీరేం చెప్పారు?"
"వారు వూరికి వెళ్ళారని ఇంట్లో లేరని చెప్పాను"
"వెరీ గుడ్ రాంబాబు గారు. మీరు చాలా తెలివిగా ప్రవర్తించారు. థాంక్యూ"
"నేను ప్రత్యేకించి నా తెలివితో ఏమీ చేయలేదు. మీరు ఫోనులో నాకు చెప్పిన దాన్ని అనుసరించి తగిన రీతిలో వారితో మాట్లాడాను. అంతే...." చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు. క్షణంసేపు తర్వాత.... "సత్యగారు ఏం చేస్తున్నారు?... వారి ఆరోగ్యం ఎలా వుందండి?"
"షి ఈజ్ ఆల్‍రైట్. గదిలో టీవీ చూస్తూ ఉంది."
"నేను వారిని చూడవచ్చా!"
"రండి..." మానస మెట్లు ఎక్కడం ప్రారంభించింది. రాంబాబు ఆమెను అనుసరించాడు.
ఇరువురూ గదిలో ప్రవేశించారు. రాంబాబు గది తలుపుకు గడియ బిగించాడు.
భామ, మానస అతని చర్యకు ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూచారు.
"భయపడకండి. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మల్లి గబుక్కున లోనికి రాకుండా వుండే దానికి తలుపు బిగించాను. సత్యగారూ!... ఎలా వున్నారు? ఫంక్షన్ బాగా జరిగిందా!... బాగా ఎంజాయ్ చేశారా!"
భామ రాంబాబు ముఖంలోకి చూచింది తొట్రుపాటుతో. వెంటనే చిరునవ్వుతో...
"అయాం ఫైన్ రాంబాబుగారు" అంటూ మానస ముఖంలోకి చూచింది.
"మేడమ్! నేను మీ ఇరువురిని... మీ క్షేమం దృష్ట్యా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలచాను. నన్ను మీరిరువురూ మీ స్నేహితునిగా భావించి యధార్థాన్ని తెలియజేస్తే... నేను మీ సమస్యకు పరిష్కార మార్గాన్ని చెప్పగలను. మీరు ప్రశాంతంగా వుండేలా చేయగలను. మీరు నా మాటలను నమ్మి అడగమంటే నా సందేహాలను అడుగుతాను. ‘నీకు మాకు ఏమిటి సంబంధం... నీవు ఆఫ్ట్రాల్ మా నాన్నగారి అసిస్టెంట్‍వి…’ అని మీరు భావిస్తే చెప్పండి. మారు మాట్లాడకుండా క్రిందికి వెళ్ళిపోతాను" అనునయంగా చెప్పాడు రాంబాబు.
మానస, భామ ముఖంలోకి చూచింది.
"రాంబాబు గారూ!... మీరు ఐదు నిముషాలు గది బయటికి వెళతారా!" మెల్లగా అడిగింది భామ.
"తప్పకుండా!...." వెంటనే రాంబాబు గది బయటికి నడిచాడు. తలుపును తనే మూశాడు.
"అక్కా!... అతను చెప్పిన మాటలకు నీ ఉద్దేశ్యం ఏమిటి?"
"మన సమస్య అతనికి కొంతవరకూ అర్థం అయిందని నా అభిప్రాయం."
"అంటే.... పూర్తి వివరాలు అతనికి చెప్పడం మంచిదంటావా!"
"నేను మీ స్నేహితుణ్ణి అన్నాడు కదా!... ఆ మురళీగాడికి మనకు వున్న సంబంధాన్ని వివరంగా అతనికి చెప్పడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. పైగా వాడు మన ఇంటిదాకా వచ్చాడు కదా!... యధార్థాన్ని అతనికి తెలియజేస్తే... అతను ఏం సలహా ఇస్తాడో... విందాం. వాణ్ణి ఇంట్లోకి రానియ్యకుండా మాట్లాడి పంపించింది అతనే కదా!"
"అవును...." సాలోచనగా అంది భామ.
"పిలవనా!"
"పిలువు అక్కా!"
మానస వెళ్ళి తలుపు తెరిచి... రాంబాబును లోనికి రమ్మని పిలిచింది. రాంబాబు గదిలోనికి వచ్చాడు. ఈసారి మానస తలుపు మూసింది.
"కూర్చోండి" చెప్పింది భామ.
రాంబాబు కుర్చీలో కూర్చున్నాడు. మానస వచ్చి భామ ప్రక్కన మంచంపై కూర్చుంది. భామ ముఖంలోకి చూచింది. అడగమను అన్నట్లుగా భామ కళ్ళతో సైగ చేసింది, మానస కళ్ళల్లోకి చూస్తూ.
"రాంబాబు గారూ!.... మీరు అడగదలచుకొన్న ప్రశ్నలను అడగండి" చెప్పింది మానస.
"భామగారూ!.... ఈరోజు మీ ఇంటి ముందుకు వచ్చిన ఆ మురళీధర్‍నే కదూ ఆ రోజు మీరు చెన్నైలో న్యూవుడ్ ల్యాండ్స్ హోటల్లో చూచి భయపడింది?"
"అవును"
"అతను మీకు స్నేహితుడని చెప్పాడు. అది నిజమా!"
"కాదు..."
"అతనితో మీకు అమెరికాలో ఎలాంటి పరిచయం?"
ఈ ప్రశ్నను వినగానే భామ కళ్ళు చెమ్మగిల్లాయి. దీనంగా మానస ముఖంలోకి చూచింది.
తన ప్రశ్న భామను ఏడ్పించినందుకు రాంబాబు ’అడగకూడని ప్రశ్నను అడిగానా! సత్య బాధపడుతూ వుంది.’ ఆమెనే పరీక్షగా చూస్తూ అనుకొన్నాడు.
"సత్యా!... ఏడవకు. రాంబాబుగారి ప్రశ్నకు నేను జవాబు చెబుతాను" అంది మానస.
భామ నిట్టూర్చి పవిటతో కన్నీటిని తుడుచుకొంది. మానస మురళీధర్‍కు తనకు వున్న సంబంధాన్ని... భామకు అతనికి వుండిన స్నేహాన్ని గురించి... న్యాన్‍సిని గురించి వివరంగా తెలియజేసి... వారిరువురూ అమెరికాలో అతని బారి నుండి ఎలా తప్పించుకొని ఇండియాకు వచ్చిన వివరాలను విపులంగా చెప్పింది.
అంతా విన్న రాంబాబు "మీరు ఇక నిర్భయంగా వుండండి. వాడి విషయాన్ని నేను చూచుకొంటాను. వాడు ఇకపై మిమ్మల్ని కలవబోడు. మానసగారూ!... మీరు ఒక కాగితం మీద సంతకం చేయాలి. నాతో ఆఫీస్ గదికి రండి" కుర్చీ నుంచి లేచాడు రాంబాబు.
భామ దీనంగా రాంబాబు ముఖంలోకి చూచింది. "సత్యా!... ఎక్కడా మీ పేరును వాడను. భయపడకండి" చెప్పి తన గది బయటికి నడిచాడు రాంబాబు.
మానస అతన్ని అనుసరించింది. ఇరువురూ ఆఫీసు గదిలో ప్రవేశించారు. రాంబాబు తెల్లకాగితం మీద మానస సంతకాన్ని తీసుకొన్నాడు.
"మానసగారూ!...మరో మూడు గంటల్లోపల... ఆ మురళీధర్ గాడు కటకటాల వెనుక వుంటాడు. మీరు నిర్భయంగా ఆనందంగా మీ స్నేహితురాలితో జాలీగా వుండండి."
"థాంక్యూ రాంబాబుగారూ!" చిరునవ్వుతో చెప్పి మానస భామ గదికి వెళ్ళిపోయింది.
రాంబాబు తన స్నేహితుడు ఎస్.పి ప్రతాప్‍కు ఫోన్ చేసి మురళీధర్ యొక్క నీచతత్వాన్ని గురించి చెప్పి... సింహపురి హోటల్లో వున్నాడని, వెంటనే అరెస్ట్ చేసి జైల్లో త్రోయమని చెప్పాడు. వాడి కిరాతక చర్యలకు ఆశ్చర్యపోయిన ప్రతాప్.... అనుచరులతో సింహపురి హోటల్‍కు వెళ్ళి మురళీధర్‍ను అరెస్ట్ చేసి జైల్లో త్రోసి విషయాన్ని రాంబాబుకు చెప్పాడు.
*
పుష్కర యాత్ర ముగించుకొని ముకుందవర్మ నీలవేణి బాలగోవిందయ్య వనజాక్షి శ్రీశైలం వెళ్ళి ఆ మహాక్షేత్రాన్ని దర్శించి వారంరోజుల తర్వాత స్వగ్రామానికి చేరారు.
భామ, తల్లిదండ్రులకు మానసను పరిచయం చేసింది. ఆమెను చూచిన వారు... ఆమె అందానికి, వినయ విధేయతలకు ఎంతగానో సంతోషించారు. తాము వూర్లో లేని సమయంలో మానస ఆ గ్రామానికి వచ్చి భామకు తోడుగా వున్నందుకు ఆమెను అభినందించారు.
ముకుందవర్మ ఏకాంతంలో మానసకు మురళీధర్ వలన కలిగిన కష్టానికి... ఆమె తీసుకొన్న నిర్ణయానికి ఆమెను అభినందించాడు. ఆమె సమక్షంలో తన గురువుగారైన అడ్వకేట్ పురుషోత్తమరావు గారికి ఫోన్ చేసి మానసకు ఆ రాక్షసుడి నుండి త్వరలో విడాకులు లభించేలా చూడవలసినదిగా మరోమారు చెప్పారు.
ముకుందవర్మ తనయందు చూపుతున్న ఆదరాభిమానాలకు మానస ఎంతగానో సంతోషించింది. కన్నీటితో కృతజ్ఞతా పూర్వకంగా చేతులు జోడించింది మానస.
"అమ్మా మానసా!... నీవు నాకు పెద్ద బిడ్డతో సమానం... ఈ పినతండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ వుంటాయి. త్వరలో ఆ దేవుడు నీకు అన్ని విధాలా మేలు చేస్తాడు. నా మాట నమ్ము" ఎంతో అభిమానంగా చెప్పాడూ ముకుందవర్మ.
ఆ సాయంత్రం... రాంబాబు ఆఫీసు గదిలో ముకుందవర్మకు మురళీధర్ అక్కడికి వచ్చిన సమాచారాన్ని భామ, మానస అతన్ని చూచి భయపడ్డ విషయాన్ని... మానస మూలంగా అతడు ఎవరన్నదీ తెలుసుకొని తాను ఎస్.పి ప్రతాప్‍తో మాట్లాడి అతన్ని అరెస్టు చేయించిన వివరాలనన్నింటినీ తెలియజేశాడు. సమయస్ఫూర్తితో ధైర్యంగా రాంబాబు వ్యవహరించిన తీరుకు అతన్ని ముకుందవర్మ ఎంతగానో అభినందించాడు.
ఎస్.పి ప్రతాప్‍తో మాట్లాడి బెయిల్‍కు అనుమతించవద్దని అతన్ని కఠినంగా శిక్షించవలసి వుందని చెప్పాడు. ముకుందవర్మ ఎస్.పి ప్రతాప్ గారికి బాగా తెలిసివున్నందున వర్మగారి ప్రతి మాటనూ ప్రతాప్‍గారు అంగీకరించారు.
నాలుగురోజులు... ఆ ఇంట్లో భామ మానస ఆనందవర్మ కలిసి ఎంతో ఆనందంగా గడిపారు. వారి సఖ్యత ఒకరి పట్ల ఒకరికి వున్న ప్రేమాభిమానాలకు ముకుందవర్మ నీలవేణి దంపతులు ఎంతగానో ఆనందించారు. మానసను గొప్పగా మెచ్చుకొన్నారు.
రాంబాబుతో... ఆనందవర్మ.... బాలగోవిందయ్యలు నీలాంటి రూపురేఖలు వున్న మరో వ్యక్తిని మేము గోదావరీ పుష్కర స్నాన సమయంలో చూచామని చెప్పారు.
’మనిషిని పోలిన మనిషి వుండటం సహజమే కదా!....’ అని రాంబాబు వారికి చిరునవ్వుతో చెప్పాడు.
ఆ రోజు మానస ప్రయాణం. భామకు మానస వూరికి వెళ్ళడం ఇష్టం లేదు. మరో వారంరోజులు వుండీ వెళ్ళమని బ్రతిమాలింది. వచ్చి పదిరోజులైంది. వెళ్ళక తప్పదని వారందరికీ నచ్చచెప్పి మానస బయలుదేరింది.
చీరలు రవికలు తాంబూలం ఇచ్చి దీవించి సాగనంపింది మానసను నీలవేణి. కన్నిటితో వీడ్కోలు చెప్పింది భామ. రాంబాబు మానసను నెల్లూరికి కార్లో తీసుకొని వెళ్ళి రైలు ఎక్కించి వచ్చాడు.
*
మానస వెళ్ళిపోయిన తర్వాత... భామ చాలా ఫీలైంది. తనకు పట్టిన దుస్థితి... తన మాట విని పరుగున వచ్చి సాయం చేసి... తన్ను కాపాడిన మానసను తలచుకొంటే ఆమెకు ఏడుపు వచ్చేది. అక్క సమయానికి రాకపోయి వుంటే తన గతేమిటని బాధపడేది. కానీ... తల్లిదండ్రుల ముందు ఎంతో గాంభీర్యంగా నటించేది.
శ్యాంబాబును గురించి నీలవేణి... ముకుందవర్మ సమక్షంలో... భామకు వివరించింది. ’మీకు ఇష్టమైతే నాకూ ఇష్టమేనమ్మా!’ చెప్పి భామ తన గదికి వెళ్ళిపోయింది.
ముకుందవర్మ ఆదేశానుసారం బాలగోవిందయ్య విశాఖపట్నానికి బయలుదేరాడు.
శ్యాంబాబు డాక్టర్ అయినందున వారి ఇల్లు.... హాస్పిటల్ కనుక్కొనేటందుకు బాలగోవిందయ్య అతిగా శ్రమించలేదు.
అచ్యుతరామశర్మ అనే రామాలయం పూజారిని కలిశాడు. ఆ ఆలయం వున్న వీధిలోనే శ్యాంబాబు గారి ఇల్లు ఉంది. ఆ ఆలయాన్ని నిర్మించింది శ్యాంబాబు తాతగారు. వారు కీర్తిశేషులు. వారి తండ్రిగారు సత్యనారాయణగారు స్వర్గస్థులు. వారు గతించి ఐదు సంవత్సరాలైంది. ఆ ఇంట ప్రస్తుతంలో వుంటున్నది శ్యాంబాబు, తల్లి జానకమ్మ, ఆమె తమ్ముడు శేషయ్య, అతని సతీమణి అహల్య, వారి కుమార్తె బాలమ్మ. ఆమె వయస్సు ఇరవై సంవత్సరాలు. బి.టెక్ చదువుతూ ఉంది.
శేషయ్యకు ఏ విధంగానైనా సరే... అక్క జానకమ్మను ఒప్పించి.... తన కుమార్తె బాలమ్మతో శ్యాంబాబు వివాహం జరిపించాలనే కోరిక.
ఆ విషయాన్ని అక్కగారితో తిధి వార నక్షత్రాలు బాగా వున్నప్పుడు... సంవత్సరం క్రిందట ప్రస్తావించటం.... ఆమె అందుకు అంగీకరించి... శ్యాంబాబుతో చర్చించడం.. అతను ప్రస్తుతంలో నాకు వివాహం చేసుకోవాలని లేదని... బాలమ్మకు వేరే సంబంధం చూచి వివాహాన్ని జరిపించండని చెప్పడం..... జరిగింది. అక్క అల్లుడి మీద ఆగ్రహంతో… శేషయ్య తన కుటుంబంతో విజయనగరం ప్రక్కన వున్న స్వగ్రామం చేరాడు.
ఇరవై ఎనిమిది సంవత్సరాల వయస్సు వచ్చినా శ్యాం వివాహానికి అంగీకరించని కారణంగా... లోకులు అతన్ని గురించి రెండు విధాలుగా అనుకొనసాగారు. మొదటిది... అతను నపుంసకుడని... రెండవది కాలేజీ రోజుల్లో ఎవరినో ప్రేమించి, ఆమె అతన్ని మోసం చేసి మరొకరిని వివాహం చేసుకొన్న కారణంగా అతనికి స్త్రీల పట్ల ద్వేషం ఏర్పడిందని....
పై రెండింటిలో ఏది నిజమో!... ఏది అబద్ధమో!... లోకులు కాకులు. ఎవరికి తోచిన రీతిలో వారు అనుకోవడం... తమ మాటలను శ్రద్ధగా వినేవారికి చెప్పడం సహజం కదా!...
తొమ్మిది మాసాల క్రిందట విశాఖలో ఇల్లు హాస్పిటల్ కట్టించి విజయనగరం నుండి తల్లితో విశాఖకు వచ్చాడు శ్యాంబాబు.
కానీ... డాక్టరుగా శ్యాంబాబుకు చాలామంచి పేరు. అతని హస్తవాసి.. చాలా మంచిదని జనం... అనుకొంటుంటారు. ఆ నమ్మకంతో వచ్చే జనంతో అతని హాస్పిటల్ చాలా రద్దీగా... పేషంటులతో నిండి ఉంటుంది.
అతని క్రింద ముగ్గురు డాక్టర్‍లు షిఫ్టు వారీగా పని చేసేటందుకు ముఫ్ఫై మంది నర్సులు ఆఫీసు స్టాఫ్ వున్నారు.
ఆధునిక పరికరాలన్నీ రోగుల టెస్టుల కోసం... అతని హాస్పిటల్లో వున్నాయి. దినానికి పన్నెండు గంటలకు పైగా అతని హాస్పిటల్లో పనిచేస్తాడు. పేదవారికి ఉచితంగా చికిత్స వేస్తాడు. ప్రతి ఆదివారం తమ టీమ్‍ను ఆ నగరానికి ప్రక్కన వున్న కుగ్రామాలకు పంపి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ను నిర్వహిస్తూ వుంటాడు.
’మానవసేవే మాధవసేవ’ అనే సూక్తిని మనసా వాచా నమ్మి వర్తించే విశాల హృదయుడు డాక్టర్ శ్యాంబాబు.
అచ్యుత రామశర్మ మూలంగా పై వివరాలనన్నింటినీ సేకరించాడు బాలగోవిందయ్య. శర్మ గారి మూలంగా ముకుందవర్మ గారిది... శ్యాంబాబుగారిది ఒకే కులం అనే విషయాన్ని కూడా తెలుసుకొన్నాడు బాలగోవిందయ్య.
రామాలయ కార్యక్రమాలను ముగించి ఆ ఇరువురూ శ్యాంబాబు గారి ఇంటికి వెళ్ళారు.
అచ్యుతరామశర్మ గారిని బాగా ఎరిగి వున్న జానకమ్మ... వారిని సాదరంగా ఆహ్వానించింది. ఉభయులు ఆశీనులైనారు.
"అమ్మా!.... వీరి పేరు బాలగోవిందయ్యగారు. మనవాళ్ళే. నెల్లూరి నుండి వచ్చారు" చెప్పాడు అచ్యుతరామయ్య.
బాలగోవిందయ్య సవినయంగా జానకమ్మ గారిని చూస్తూ... నవ్వుతూ నమస్కరించాడు.
"ఏ పని మీద వచ్చారు?" అడిగింది జానకమ్మ.
"వీరి యజమాని ముకుందవర్మ గారు సీనియర్ క్రిమినల్ లాయర్. వారు... మన శ్యాంబాబు గారిని రాజమండ్రి నగరంలో... పుష్కర స్నాన ఘట్టంలో చూచారట. శ్యాంబాబు వారికి బాగా నచ్చాడట. వారికి ఒక అమ్మాయి వుందట."
"ఓహో!... పెండ్లి సంబంధం రీత్యా వచ్చారన్నమాట..." చిరునవ్వుతో అంది జానకమ్మ.
"అవునండీ..." జేబునుండి సత్యభామ ఫొటోను తీసి... "అమ్మగారూ!.... ఇది మా అమ్మాయి ఫోటో" చిరునవ్వుతో జానకమ్మ చేతికి అందించాడు బాలగోవిందయ్య.
జానకమ్మ... కొన్ని క్షణాలు సత్యభామ ఫొటోను పరీక్షగా చూచింది.
"అమ్మాయి చాలా బాగుందండి. ఎంతవరకూ చదివింది?"
"అమ్మా!... అమ్మాయి గారు బి.ఎస్సీ, ఎం.బి.ఎ వరకూ చదివారండీ. నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ... మేనమామ గారి వద్ద అమెరికాలో వుండి వివాహ నిమిత్తం వచ్చేశారండి. మా అమ్మగారికి.. తన కూతురు వారికి దగ్గరగా మన దేశంలోనే వుండాలని ఆశ. వారికి మీ అబ్బాయిగారు బాగా నచ్చారమ్మ. మిమ్మల్ని కలిసి మాట్లాడేటందుకు నన్ను పంపారు" వినయంగా ఆ వూరికి తాను వచ్చిన కారణాన్ని తెలియజేశాడు బాలగోవిందయ్య.
"మా అబ్బాయికి ఈ ఫొటోను చూపించి మాట్లాడి... మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాము. ముకుందవర్మ గారి అడ్రస్ ఫోను నెంబర్ ఈ కాగితం మీద వ్రాయండి" టీపాయ్ పై వున్న ప్యాడ్‍ను అందించింది జానకమ్మ.
బాలగోవిందయ్య... ముకుందయ్యగారి విలాసాన్ని ఫోన్ నెంబరును వ్రాసి జానకమ్మకు ప్యాడ్‍ను అందించాడు.
"అబ్బాయిగారి ఫొటో..."
బాలగోవిందయ్య పూర్తిచేయక మునుపే....
"ఇస్తాను" చెప్పి జానకమ్మ గారు హాలుకు ప్రక్కనున్న గదిలోనికి వెళ్ళారు.
"అమ్మగారూ.." నవ్వుతూ అన్నాడు బాలగోవిందయ్య.
"చాలా మంచివారు" అన్నాడు అచ్యుతరామశర్మ.
జానకమ్మ గారు వచ్చారు. శ్యాంబాబు ఫొటోను బాలగోవిందయ్యగారికి అందించారు.
వంటమనిషి రెండు గ్లాసులతో పాలను తీసుకొని వచ్చి అచ్యుతరామశర్మకు... బాలగోవిందయ్యకు అందించి లోనికి వెళ్ళిపోయింది.
"తీసుకోండి" అంది జానకమ్మ.
ఇరువురూ పాలు త్రాగి గ్లాసులను టీపాయ్‍పై వుంచారు.
"అమ్మా!... అబ్బాయిగారిని నేను చూచేటందుకు వీలౌతుందా!" మెల్లగా అడిగాడు బాలగోవిందయ్య.
"మధ్యాహ్నం భోజనానికి వాడు ఇంటికి రాడు. రాత్రి పదిన్నర ప్రాంతంలో ఇంటికి వస్తాడు. మీరు వాణ్ణి చూడాలనుకొంటే హాస్పిటల్‍కు వెళ్లాలి."
"నేను అక్కడికి వెళ్ళి వారిని చూచి వెళతానమ్మా!"
"మంచిది"
ఇరువురూ లేచి జానకమ్మకు నమస్కరించి బయటికి నడిచారు.
"శర్మగారూ!"
"ఏమిటి సార్!"
"నాతో మీరు హాస్పిటల్ దాకా రాగలరా!"
"మీరు మంచి విషయానికి అంత దూరాన్నుంచి... వచ్చారు. కిలోమీటర్ దూరంలో వుండే హాస్పిటల్‍కు నేను రానని మీతో ఎలా చెప్పగలనండీ. పదండి" నవ్వుతూ చెప్పాడు అచ్యుతరామశర్మ.
ఆటోను ఆపి ఇరువురూ ఎక్కారు. పది నిముషాల్లో హాస్పిటల్‍ను సమీపించారు.
రిసెప్షన్‍లో శ్యాంబాబును గురించి విచారించారు. వారు ఆపరేషన్ ధియేటర్‍లో వున్నారని... ఓ అరగంట వెయిట్ చెయ్యాలని చెప్పారు.
ఇరువురూ అక్కడ వున్న కుర్చీల్లో కూర్చున్న వారినందరినీ పరీక్షగా చూచాడు. ఒక వ్యక్తి బాలగోవిందయ్యను... చూచి... ఆశ్చర్యంతో నిలబడిపోయాడు.
బాలగోవిందయ్య కూడా అతన్ని పరీక్షగా చూస్తూ... "వీరు!..." అచ్యుతరామయ్య గారి ముఖంలోకి చూచాడు.
"శ్యాంబాబు గారి పి.ఎ. ఈ హాస్పిటల్‍కు పి.అర్.ఓ. ఈ హాస్పిటల్లో డాక్టర్లను తప్ప, మిగతావారినందరినీ అజమాయిషీ చేస్తూ... వారి వారి విధులను వారు సవ్యంగా నెరవేర్చే రీతిగా అందరినీ క్రమబద్ధంగా నడిపే నాయకుడు. పేరు బాబు" నవ్వుతూ చెప్పాడు అచ్యుతరామశర్మ.
బాబు... అనే పేరు వినగానే ఆనందంగా బాలగోవిందయ్య లేచి అతన్ని సమీపించాడు.
"సార్!.... నేను మిమ్మల్ని పుష్కర సమయంలో గోదావరి నదిలో కలిశాను కదూ!" నవ్వుతూ అడిగాడు బాబు.
"అవును బాబు... బాగున్నావా!"
"ఓ... నాకేం తక్కువ. హాయిగా వున్నాను. సార్!... ఇక్కడ మీరూ!... ఏమిటి విషయం?" ఆశ్చర్యంతో అడిగాడు బాబు.
తాను విశాఖపట్నానికి వచ్చిన కారణాన్ని.. జానకమ్మగారితో మాట్లాడి సత్యభామ ఫొటోను ఇచ్చిన విషయాన్ని... ప్రస్తుతంలో శ్యాంబాబును కలిసేటందుకు వెయిట్ చేస్తున్నానని చెప్పాడు బాలగోవిందయ్య.
అంతా విని బాబు సాలోచనగా "అలాగా!" అన్నాడు.
"ఏం బాబూ!... నా మాటలను విన్న తర్వాత మీ ముఖంలో రంగులు మారాయి" సంశయంతో అడిగాడు బాలగోవిందయ్య.
చిరునవ్వుతో కళ్ళుమూసుకొని తలాడిస్తూ... "పై వాడి నిర్ణయం ఎలా వుందో.... మీ ప్రయత్నం మీరు చేయండి" నవ్వుతూ చెప్పాడు బాబు.
ఎవరో... బాబును పిలిచారు. ఆ వైపుకు చూచి "వస్తున్నా!..." చెప్పి, బాలగోవిందయ్య ముఖంలోకి చూస్తూ... "మీరు ఏ హోటల్లో దిగారు?" అడిగాడు.
హోటల్ పేరును బాలగోవిందయ్య చెప్పాడు.
"నేను మిమ్మల్ని ఈ సాయంత్రం ఎనిమిది గంటలకు కలుస్తాను" చెప్పి వేగంగా లోనికి వెళ్ళిపోయాడు బాబు.
అతను వెళ్ళిన ఐదు నిమిషాలకు డాక్టర్ శ్యాంబాబు... ఆందోళనగా వేగంగా రిసెప్షన్ ఏరియా దాటి... కార్లో కూర్చొని వెళ్ళిపోయాడు. ఆ బాబు మమ్మూర్తులా మా రాంబాబులాగే వున్నాడని మరోసారి అనుకొన్నాడు బాలగోవిందయ్య.
రిసెప్షన్‍లో కూర్చొని వున్నవారిని ఎవరినీ శ్యాం గమనించలేదు.
వెళ్ళిపోయిన శ్యాంను చూచిన అచ్యుతరామశర్మ రిసెప్షనిస్టును సమీపించి....
"అమ్మా!... అప్పుడు వెళ్ళింది డాక్టర్ శ్యాంబాబే కదూ!" అడిగాడు.
"అవునండి..."
"ఎప్పుడు వస్తారు?"
"నాకు తెలీదండీ... ఎక్కడో... ఏదో యాక్సిడెంట్ జరిగిందట అక్కడికి వెళ్ళారు" వినయంగా చెప్పింది ఆ యువతి.
ప్రక్కనే వున్న బాలగోవిందయ్యకు విషయం అర్థం అయింది.
"శర్మగారూ!... ఇక మనం నిరీక్షించి ప్రయోజనం లేదు కదూ!"
"అవునండి... పదండి మనం వెళదాం"
ఇరువురూ వీధిలో ప్రవేశించారు.
"నిరుత్సాహపడకండి. సాయంత్రం... బాబు మిమ్మల్ని కలిసేదానికి వస్తానన్నాడుగా. అతనితో చెప్పండి మీరు శ్యాంబాబును కలిసేదానికి అతను ఏర్పాటు చేయగలడు" అనునయంగా చెప్పాడు అచ్యుతరామశర్మ.
"చాలా కృతజ్ఞతలు శర్మగారు" చేతులు జోడించాడు బాలగోవిందయ్య.
"మీతో... ఇంతవరకూ వుండి, నేను నా ధర్మాన్ని నిర్వహించాను. అంతే... శలవు"
శర్మగారు వారి ఇంటివైపు, గోవిందయ్య తన లాడ్జివైపుకు వెళ్ళిపోయారు.
=======================================================================
ఇంకా వుంది..
ప్రేమ తరంగాలు - పార్ట్ 11 త్వరలో..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments