#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Prema Tharangalu - Part 11 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 13/01/2025
ప్రేమ తరంగాలు - పార్ట్ 11 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు.
కూతురు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.
ఫ్లయిట్ లో పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తండ్రికి అన్ని విషయాలూ చెప్పి, అమెరికాకు ఇక వెళ్లనని, ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది.
తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. భామను కలవడానికి వచ్చిన మురళీధర్ ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు.
యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు. అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 11 చదవండి.
బాలగోవిందయ్య భోజనం చేసి తన గదికి చేరాడు. ముకుందవర్మకు ఫోన్ చేసి.. అంతవరకూ తాను చేసిన ప్రయత్నాన్ని గురించి వివరించాడు. శ్యాం ఫొటోను విలాసాన్ని తీసుకొన్నట్లుగా.. రేపు వూరికి బయలుదేరి వస్తున్నట్లుగా చెప్పాడు.
అంతావిని ముకుందవర్మ.. భార్య నీలవేణికి బాలగోవిందయ్య చెప్పిన వివరాలనన్నింటినీ విశదంగా చెప్పాడు.
నీలవేణి చాలా సంతోషించింది. తన కుమార్తె.. సత్యభామ గొప్ప అదృష్టవంతురాలని ఆనందించింది. రాత్రి ఎనిమిది గంటలకు బాలగోవిందయ్యకు చెప్పిన ప్రకారంగా బాబు వారి గదికి వచ్చారు.
"రండి బాబు రండి. మీరాక కోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోండి" ప్రీతిగా చెప్పాడు.
బాబు నవ్వుతూ.. "థాంక్యూ సార్!" అన్నాడు. కుర్చీలో బాలగోవిందయ్యకు ఎదురుగా కూర్చున్నాడు.
"బాబూ!.. మిమ్మల్ని నేను ఓ ప్రశ్న అడగనా!"
"ఒకటేమిటి సార్ వెయ్యి అడగండి. నాకు తెలిసిన నిజాన్ని నేను మీకు తప్పకుండా చెబుతాను" నవ్వాడు బాబు.
"బాబూ!.. మీ అయ్యగారు యింతవరకూ ఎందుకు పెండ్లి చేసుకోలేదు?" అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు బాలగోవిందయ్య.
"సార్!.. నెల్లూరి నుంచి మీరు.. మీ యజమానికి వారి అర్థాంగికీ మా శ్యాంబాబు నచ్చినందుకు వారి వివరాలను కుల గోత్రాలను తెలుసుకోవాలని వచ్చారని నాతో మీరు హాస్పిటల్లో చెప్పారు. మీరు అడిగిన ప్రశ్నకు వారిని గురించి నాకు తెలిసిన నిజాలను మీకు నేను చెబుతాను. కారణం వివాహం అనేది.. మన హైందవ జాతికి సంబంధించినంత వరకూ అది ఒక పరమ పవిత్రమైన వ్యవస్థ. నూరేళ్ళ పంట.
ఆ వ్యవస్థ.. ఆడ, మగ అనే వయస్సులో వున్న స్త్రీ.. పురుషునికి మాత్రమే పరిమితం కాదు. అది రెండు కుటుంబాల సభ్యులకూ పరిమితం. వారి అందరి ఆనందానికి.. వారి వారి జీవితాంతం వరకూ.. మరువలేని తియ్యని అనుబంధం. మన వివాహబంధం.
కానీ.. ఈనాటి నవ నాగరీకతా వ్యామోహంలో.. అమెరికన్ డాలర్ల అర్జన మోజులో.. కొందరు యువతీ యువకులు మన హిందూ వివాహ బంధాన్ని.. వ్యాపార దృష్టితో చూస్తూ.. కట్నం పేరున.. లాంఛనాల పేరున.. జీవితాంతం వరకు తనతో కలిసి కష్టసుఖాల్లో పాలు పంచుకొనే ఆడపిల్లలను ఆట వస్తువుగా భావించి.. మూడు ముళ్ళూ వేసి.. తనకు ఇకపై ఆమె విషయంలో.. సర్వాధికారాలు వున్నాయని భావించి.. కొద్దిరోజులు తమ ప్రేమ అనే.. పవిత్ర పదాన్ని ఉపయోగించి.. ఆమెను నమ్మించి.. అనుభవించి.. మోజు తీరగానే అన్నింటినీ మరచి.. విడాకులకు సిద్ధం అవుతున్నారు.
ఈతీరు.. కేవలం యువకులకే కాదు.. యువతులకూ వర్తిస్తుంది. వారూ.. ఈనాడు యువకులవలె ఈ విషయంలో సర్వస్వతంత్రులు.
నేను ఇంతవరకూ చెప్పింది.. నేడు మన వివాహ వ్యవస్థను కొందరు.. ఎలా వ్యాపారంగా సాగిస్తూ తమను తాము ఎలా మోసగించుకొంటున్నారనే విషయం. నేటి వారి వారి విజ్ఞానం.. విచక్షణా రహితంగా స్వార్థంతో ఎలాంటి రూపాంతరాలను దాల్చుతున్నదనే విషయం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి సార్!" చిరునవ్వుతో అడిగాడు బాబు.
"బాబూ!.. మీరు చెప్పింది నిజమే!.. నేటి నూతన విజ్ఞానంలో స్వార్థం తప్ప.. పరమార్థం.. ప్రేమాభిమానాలు పూర్తిగా సన్నగిల్లాయని నాకూ అనిపిస్తూ వుంది. బాబూ!.. కానీ ఈనాటి కొందరి యువతీ యువకులు.. వారి తల్లిదండ్రుల మనస్తత్వాలకు.. మీ అయ్యగారు ఇంతవరకూ వివాహం చేసుకోకుండా వుండేదానికి సంబంధం ఏమిటి?" ప్రశ్నార్థకంగా బాబు ముఖంలోకి చూస్తూ అడిగాడు బాలగోవిందయ్య.
"వుంది సార్!"
"అదేమిటో వివరంగా చెప్పగలవా?"
"తప్పక చెబుతాను సార్!.. వారి కథను చెప్పేదానికి ముందు మా అయ్యగారి తత్త్వం మీరు అర్థం అయ్యేదాని, ముందు నా కథను మీరు వినాలి" నవ్వుతూ చెప్పాడు బాబు.
"నీ కథ ఏమిటో చెప్పు బాబు వింటాను"
"సార్!.. నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. నాకు ఊహ తెలిసేనాటికి.. నన్ను మసీదు ముజావిల్ సయ్యద్ బాబా పెంచారు. నన్ను తన కన్నబిడ్డలా చూచుకొనేవాడు. నా వయస్సు పన్నెండేళ్ళ ప్రాయంలో నన్ను అంతవరకూ పెంచిన బాబా చనిపోయారు. నేను అనాధనైనాను. నన్ను ఎవరూ ఆదరించలేదు. అప్పటికి నేను ఏడవ తరగతి చదువుతూ ఉన్నాను. నా చదువు ఆగిపోయింది. కూలీనాలీ చేసుకొని పొట్ట నింపుకొనే వాణ్ణి.
ఒకరోజు రాత్రి మసీదులో పడుకొని వున్న నా దగ్గరకు పోలీసులు వచ్చారు. నిద్రపోతూ వున్న నన్ను తట్టి లేపారు. నేను తొట్రుపాటుతో లేచాను. వారు నా ప్రక్కన వున్న చిన్నమూటను చేతికి తీసుకొన్నారు. విప్పి చూచారు. అందులో డబ్బు కట్టలు వున్నాయి. దాన్ని నా ప్రక్కన ఎవరు వుంచి వెళ్లారో నాకు తెలియదు. కానీ ఆ పోలీసులు ఆ డబ్బును నేనే దొంగతనం చేశానని నన్ను జైలుకు లాక్కెళ్ళారు.
కోర్టు నన్ను దొంగగా తీర్మానించింది. ఆరునెలలు జైలు శిక్ష విధించింది. చేయని నేరానికి జైలు పాలైనందుకు నేను జైల్లో ఎంతగానో ఏడ్చాను. ఆ ఆరుమాసాలు నాకు దినం ఒక యుగంలా గడిచాయి. సమాజం మీద సాటి మనుషుల మీద ద్వేషం.. పగ పెరిగాయి. జైలు నుండి విడుదల కాగానే.. జేబు దొంగతనాలు చేయడం ప్రారంభించాను. ఆరు సంవత్సరాల కాలంలో జైలుకు అసలైన దొంగగా మూడు పర్యాయాలు వెళ్ళాను. దొంగిలించిన దానితో బాగా తినేవాణ్ణి.. త్రాగేవాణ్ణి.. కొంత సొమ్మును పేదలకు పంచేవాణ్ణి.
ఒకరోజు రాత్రి పదిగంటల ప్రాంతంలో ఎవరో చేసిన దొంగతనానికి నన్ను అనుమానించిన పోలీసులు నన్ను తరుముతూ వెంబడించారు. రోడ్డు ప్రక్కన ఆగి వున్న కారు వెనుక డోర్ తెరిచి లోన దాక్కున్నాను. పోలీసులు ఆ కారును దాటి వెళ్ళిపోయారు. అప్పటికి నా వయస్సు పదిహేను.
మా బాబుగారు వచ్చిన కార్లో కూర్చున్నారు. కారును స్టార్ట్ చేశారు. అరగంటలో కారు వారి భవంతి ముందు పోర్టికోలో ఆగింది. బాబుగారు దిగారు. నన్ను చూచారు. ఆశ్చర్య పోయారు. ఎవరని అడిగారు. నేను నా గత చరిత్రనంతా వారికి వివరించాను. అంతా విన్నవారు..
‘నీకు జీవితాంతం దొంగగానే బ్రతకాలని వుందా లేక.. మారి మంచి మనిషిగా బ్రతుకుతావా!’ అని అడిగారు. నేను వారి కాళ్ళపై పడి ’మంచి మనిషిగా బ్రతకాలని వుంది సార్!’ అని ఏడ్చాను. వారు నా పేరడిగి తెలుసుకొన్నారు.
వారు తన చేతులతో నా భుజాలను పట్టుకొని లేవదీసి..
’యికపై నేను చెప్పినట్లు నీవు నడుచుకోవాలి. నాతోనే వుండాలి సరేనా!’ అన్నారు.
’నేను ఆనందంగా అంగీకరించాను. వారు నన్ను అభిమానించారు. ఆదరించారు. తన తమ్మునిలా భావించారు. వారి తల్లిదండ్రులకు నన్ను పరిచయం చేసి.. ’యితని పేరు బాబు. ఇకపై ఇతను మన ఇంట్లోనే వుంటాడు. వీడిని మీరు మీ బిడ్డగా భావించాలి’ అని చెప్పారు.
ఆ దంపతులు ఆనందంగా మా బాబుగారి మాటలను అంగీకరించారు. వారి కలయికతో నా జీవితం పూర్తిగా మారిపోయింది. వారి మాటల ప్రకారం నడుచుకొంటూ వారు చెప్పిన పనులు చేస్తూ కొద్దిరోజుల్లో నేను ఆ యింటి వ్యక్తిగా మారిపోయాను.
నన్ను వారు చదివించారు. ఎం. ఎ పాసైనాను. తన హాస్పిటల్లో నాకు పి. ఆర్. ఓ హోదాను కల్పించారు. సార్!.. నాకు తెలిసిన నా దేవుడు, నా సర్వస్వం.. మా అన్నయ్య.. డాక్టర్ శ్యామ్‍బాబు’ ఎంతో ఆవేశంగా చెబుతూ వచ్చిన బాబు.. చెప్పడం ఆపాడు. అతని కళ్ళల్లో కన్నీరు.
"బాబూ!.. బాధపడకు. ఇప్పుడు నీవు అన్ని విధాలుగా బాగున్నావుగా!.. " అనునయంగా చెప్పాడు బాలగోవిందయ్య.
"ఇవి కన్నీరు కాదు సార్!.. ఆనందభాష్పాలు" కన్నీటిని చేతి రుమాలుతో తుడుచుకొంటూ చెప్పాడు బాబు.
క్షణం తర్వాత..
"సార్!.. ఇక మీకు కావలసింది మా అన్నయ్య కథ.. అవునా!"
"అవును బాబు"
"చెబుతాను వినండి.. " నిట్టూర్చాడు బాబు.
"సార్!.. మా అన్నయ్య మీరు చూచిన జానకమ్మ గారి సొంత కొడుకు కాదు. దత్తపుత్రుడు.
అన్నయ్యగారి సొంతవూరు నెల్లూరి దగ్గర గండవరం. వారి వయస్సు ఏడేళ్ళ ప్రాయంలో.. పేదరికం వలన వారి తల్లిదండ్రులు కోవూరులో తాలుకా జడ్జిగా పనిచేస్తూ వున్న జానకమ్మగారి భర్త సత్యనారాయణ గారి కోరిక మీద.. అన్నయ్యను వారికి దత్తు ఇచ్చారట. సొంత తల్లిదండ్రుల మీద మమకారంతో అన్నయ్య సత్యనారాయణ జానకమ్మలకు చెప్పకుండా వారి సొంత వూరికి అమ్మా నాన్నల దగ్గరకు తరుచుగా పారిపోయేవాడట.
అతని ఆ చర్యకు వారు విసిగి కోవూరును వదిలి దూరంగా ఉత్తరానికి ట్రాన్స్ ఫర్ చేయించుకొని వెళ్ళిపోయారట. వారి వివాహం జరిగిన పదిహేను సంవత్సరాలకు కూడా వారికి సంతానం కలుగనందున వారు అన్నయ్యను దత్తు తీసుకొన్నారు. అన్నయ్యకు సంవత్సరం వయస్సు గల ఇద్దరు తమ్ములు కవలలు కూడా వుండేవారట.
జానకమ్మ సత్యనారాయణ దంపతులతో దూర ప్రాంతానికి వచ్చినా అన్నయ్య ఆ చిన్న వయస్సులో తన సొంత తల్లితండ్రులను తమ్ముళ్ళను.. తలచుకొని ఎన్నోరోజులు ఏడ్చాడట. కాలక్రమేణా ఆ దంపతులు ప్రేమాభిమానాలతో వారి మాటలను వింటూ వారికి దగ్గరైనాడట. గతాన్ని గురించి బాధపడటం మాని.. బాగా చదివి గొప్ప డాక్టర్ కావాలని కలలు కన్నారట. వారి కలలను వారు సాధించారు. డాక్టర్ వృత్తిని ప్రారంభించిన కొద్ది నెలలకే మంచిపేరు.. సంపాదించారు.
నెలకు రెండూ పర్యాయాలు పరిసర గ్రామాలకు వెళ్ళి పేద రోగులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు ఇంజక్షన్స్ ఇచ్చేవారు. ఈనాటికీ ఆ కార్యక్రమం నిర్ణీత కాలంలో సక్రమంగా జరుగుతూ వుంది. విజయనగరంలో.. విశాఖలో.. రెండు హాస్పిటల్స్ నడుపుతున్నారు. వారు విజయనగరంలో వుండగా..
పేదల సేవకోసం ఆ ప్రోగ్రామ్స్ కు వెళ్ళిన ఒక గ్రామంలో వారికి.. మానస అనే అమ్మాయి పరిచయం అయింది. కొద్ది కాలంలో ఆ పరిచయం.. అభిమానంగా.. ప్రేమగా మారిపోయింది. అన్నయ్య ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. అదే సమయంలో రష్యాలో వారు అప్లయ్ చేసి వుండిన ట్రైనింగ్ ప్రోగ్రామ్‍కు కాల్ వచ్చింది. వారు రష్యా వెళ్ళిపోయారు.
ఆరునెలల తర్వాత తిరిగి వచ్చారు. మాసనను గురించి విచారించారు. ఆమెకు వివాహమై అమెరికా వెళ్ళిపోయిందని తెలుసుకొని.. ఎంతగానో బాధపడ్డారు. మానస చర్య అన్నయ్యకు ఓ పెద్ద షాక్. యిది జరిగి సంవత్సరం అయింది. వారు ఇంకా ఆ గత జ్ఞాపకాలతో బాధపడుతున్నారని నా అభిప్రాయం. ఆ కారణంగానే అమ్మ జానకమ్మ వివాహ ప్రసక్తి ఎత్తినప్పుడల్లా.. ’ఇప్పుడూ కాదులే అమ్మా!.. కొంతకాలం జరగనీ’ అని తన అసమ్మతిని అమ్మకు తెలియజేస్తుంటారు.
సార్!.. నాకు తెలిసినంతవరకూ.. నేను చెప్పిందంతా పచ్చి నిజం. ఇందులో ఒక్కమాట కూడా అబద్ధం లేదు. చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించాననుకొంటున్నాను. తెలిసిన నిజాన్ని చెప్పకపోవడం తప్పు అవుతుంది. నా మాటలు మీకు విసుగును కలిగించి వుంటే మీరు పెద్దలు.. నన్ను క్షమించండి" వినయంగా చేతులు జోడించాడు బాబు.
"బాబూ!.. నేను నిన్ను క్షమించేదానికి నీవు ఏ తప్పూ చేయలేదే!.. నాకు కావలసిన వివరాలను విశదంగా వివరించావు. నీకు నా కృతజ్ఞతలు. "
"మీరు పెద్దవారు నాకు మీ ఆశీర్వచనాలు కావాలి సార్!" బాబు వారి పాదాలను తాకాడు బాలగోవిందయ్య.
"లక్షణంగా అనుకూలవతి అయిన భార్య చక్కటి పిల్లలతో నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు బాబు" బాలగోవిందయ్య బాబును హృదయపూర్వకంగా దీవించాడు.
క్షణం తర్వాత..
"బాబూ!.. నేను మీ అన్నయ్యగారిని కలవడానికి వీలవుతుందా!"
"మీరు కలవాలనుకొంటే నేను కల్పిస్తాను సార్!"
"నేను వారిని కలవాలి.. "
"సరే.. రేపు ఉదయం ఏడుగంటలకు మీరు మా ఇంటికి రండి. నేను అక్కడ వుంటాను. మీరు అన్నయ్యను కలిసి మాట్లాడేలా చేస్తాను. "
"తప్పకుండా చేస్తావు కదూ బాబూ!"
"తప్పకుండా సార్!"
"నీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా!"
"చెప్పండి సార్!"
"మా అయ్యగారి అసిస్టెంట్.. పేరు రాంబాబు. అతను ముమ్మూర్తులా నీలాగానే వుంటాడు. "
"అలాగా సార్!"
"అవును. పద. క్రిందికి వెళ్ళి భోజనం చేద్దాం. "
"సరే సార్!"
ఇరువురూ గదినుండి బయటికి నడిచి డైనింగ్ హాల్ వైపుకు వెళ్ళారు.
*
"అమ్మా!.. పడుకోలేదేం!" హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న తల్లిని చూచి అడిగాడు శ్యాంబాబు.
అప్పుడు సమయం రాత్రి పదిన్నర. సంవత్సరం రోజుల క్రిందట తల్లికి చెప్పాడు శ్యాంబాబు.
"అమ్మా!.. నీవు రాత్రిపూట నా రాక కోసం ఎదురుచూస్తూ భోజనం చేయకుండా కూర్చోవద్దమ్మా. ఎనిమిదిన్నర కల్లా భోజనం చేసి పడుకో అమ్మా. నేను రావడంలో ఆలస్యం అవుతుంది. వయస్సు అయింది కదా. అమ్మా!.. నీవు ఆహారం.. నిద్ర విషయాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలమ్మా!.. " అనునయంగా చెప్పాడు తల్లి ప్రక్కన కూర్చొని.
ఆనాటి నుంచి జానకమ్మ తనయుని మాట ప్రకారం.. ఎనిమిదిన్నరకల్లా భోజనం చేసి, అరగంట సేపు వాకిట్లో అటూ ఇటూ పచార్లు చేసి శయనించేది.
కానీ ఈనాడు అతని రాకకోసం ఎదురుచూస్తూ హాల్లో కూర్చొని వుంది. కారణం.. బాలగోవిందయ్య ఆమెకు యిచ్చిన భామ ఫొటోలో వున్న భామ రూపం ఆమెకు ఎంతగానో నచ్చింది. ఆ ఫొటోను శ్యాంబాబుకు చూపించి అతన్ని ఆ పిల్లతో పెండ్లికి ఒప్పించాలనే నిర్ణయంతో.
"నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబూ!.. త్వరగా రా. నీకు అన్నం వడ్డిస్తూ చెబుతాను" చిరునవ్వుతో చెప్పింది జానకమ్మ.
తల్లి.. తనతో ఏ విషయాన్ని గురించి మాట్లాడదలచు కొన్నదనే విషయం కొంతవరకు తెలిసినా ఆత్రంగా..
"ఏమిటమ్మా!.. ఆ విషయం?" అడిగాడు శ్యాంబాబు.
"నీవు వెళ్ళి బట్టలు మార్చుకొని త్వరగా రా.. చెబుతాను" చిరునవ్వుతో చెప్పింది జానకమ్మ.
శ్యాంబాబు వేగంగా తన గదికి వెళ్ళి స్నానం చేసి టీషర్ట్ పైజామా ధరించి క్రిందికి వచ్చాడు. జానకమ్మ డైనింగ్ హాల్లో అన్నీ టేబుల్ మీద అమర్చి కుర్చీలో కూర్చొని వుంది.
శ్యాంబాబు కుర్చీలో కూర్చున్నాడు. కంచం ముందు పెట్టి వడ్డించింది. శ్యాంబాబు తినడం ప్రారంభించాడు. తల్లి ఆ విషయాన్ని గురించి చెబుతుందేమోనని రెండు మూడుసార్లు ఆమె ముఖంలోకి చూచాడు. ’బాగా ఈ వయస్సులో తినాలి’.. అని కొసరి కొసరి వడ్డిస్తూ అసలు విషయాన్ని చెప్పలేదు. ఆ తల్లి మనస్సులో.. తాను చెప్పబోయే విషయం శ్యాంబాబుకు నచ్చక సరిగా భోజనం చేయడేమో అనే అనుమానం.. కనుక ఆ విషయాన్ని గురించి మాట్లాడలేదు. ఇలాంటి భావన కలిగిన మనస్సు అంటే.. అది కేవలం ఒక తల్లి మనస్సే.
శ్యాంబాబు చాలారోజుల తర్వాత రాత్రిపూట తల్లి వడ్డించగా కడుపునిండా తిన్నాడు. అంతకుముందు అన్ని డైనింగ్ టేబుల్ మీద అమర్చి జానకమ్మ పడుకొనేది. ఏ పదిన్నరకో.. పదకొండుకో వచ్చి నాలుగు మెతుకులు తిని చేయి కడుక్కొని వెళ్ళి పడుకొనేవాడు.
"అమ్మా!.. ఈరోజు చాలా ఓవర్‍గా తిన్నానమ్మా" బేసిన్‍లో చేతులు కడుక్కొంటూ నవ్వుతూ చెప్పాడు శ్యాంబాబు.
"నాయనా!.. నీవు పడే కష్టానికి నీవు తిన్న తిండికి చాలదు. ఇంకా తినాలి" ప్రీతిగా చెప్పింది జానకమ్మ.
ఇరువురూ హాల్లోకి వచ్చారు. సోఫాలో కూర్చున్నారు. జానకమ్మ కొన్ని క్షణాలు పరీక్షగా శ్యాంబాబు ముఖంలోకి చూచింది.
"ఏమ్మా!.. అలా చూస్తున్నావు?"
"నాయనా!.. నాకు నీవన్నట్లుగానే వయస్సు మీరుతూ వుంది. ఆ పరమాత్ముని పిలుపు ఎప్పుడో మనకు తెలీదు కదా!.. నేను బ్రతికి వుండగానే నా మనవడు మనవరాలిని చూడాలనేది నా చిరకాల వాంఛ. ఈనాడు నీవు ఇంతకు మునుపులా నా మాటను కాదనకూడదు. బంగారంలాంటి సంబంధం వచ్చింది. ఇదిగో అమ్మాయి ఫొటో. సాక్షాత్ మహాలక్ష్మిలా వుంది. చూడు" భామ ఫొటోను ఆధ్యాత్మిక మాసపత్రిక నుంచి తీసి శ్యాంబాబుకు అందించింది నవ్వుతూ జానకమ్మ.
శ్యాంబాబు ఫోటోను అందుకున్నాడు. కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు.
చీరకట్టు.. నొసటన సింధూరం బొట్టు.. తల్లో మల్లెపూలు.. పెదవులపై చిరునవ్వు.. కళ్ళల్లో ఎంతో కాంతి.. ముఖంలో గొప్ప తేజస్సు.. వున్న భామను చూచిన శ్యాంబాబు.
’నిజంగా గొప్ప అందగత్తె’ అనుకొన్నాడు మనస్సున.
జానకమ్మ, అమ్మాయి చదువును గురించి.. వాళ్ళ తండ్రి గారికి లాయర్‍గా మంచి పేరు ప్రఖ్యాతులు వున్న వ్యక్తి అని.. బాలగోవిందయ్య తనకు చెప్పిన వివరాలన్నింటినీ వివరంగా తనయుడికి చెప్పింది. చివరగా "నాన్నా!.. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది. నీకూ నచ్చి వుంటుందని నా అభిప్రాయం. ఏమంటావ్?" ప్రాధేయపూర్వకంగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది.
తన చేతిలోని ఫొటోను తల్లి చేతికి యిచ్చి.. "నా నిర్ణయాన్ని నీకు రేపు ఉదయం చెబుతానమ్మా" శ్యాంబాబు లేచి తన గదికి వెళ్ళిపోయాడు.
సాలోచనగా వెళుతున్న శ్యాంబాబును కొన్ని క్షణాలు చూచి జానకమ్మ తన గదికి వెళ్ళిపోయింది.
మరుదినం ఏడుగంటల కల్లా బాలగోవిందయ్యగారు శ్యాంబాబు ఇంటికి వెళ్ళాడు.
ప్రతిరోజూ.. ఆరుగంటలకు శ్యాంబాబు.. బాబు జాగింగ్‍కు వెళ్ళి ఆరూ ముక్కాలుకు ఇంటికి చేరుతారు. ఆ రోజు శ్యాంబాబు కాలేజీ మీట్ జాగింగ్‍లో తటస్థపడగా అతనితో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అయింది.
జాగింగ్ చేసే సమయంలో ఆ కుటుంబ శ్రేయాభిలాషిగా శ్రీరామచంద్రునకు వాయునందనుని వలే శ్యాంబాబుకు నీడలా వర్తించే బాబు.. బాలగోవిందయ్య గారి రాకను గురించి.. వారు తమ తల్లికి తెలియజేసిన వివరాలను గురించి విపులంగా చెప్పాడు. చివరగా..
"అన్నా!.. నీవు అమ్మాయిని పెండ్లి చేసుకొని అమ్మకు ఆనందాన్ని కలిగించన్నా" దీనంగా కోరాడు.
సమాధానంగా శ్యాంబాబు తలాడించి జాగింగ్ కొనసాగించాడు.
తమ యింటి ముందు అటూ ఇటూ తిరుగుతున్న బాలగోవిందయ్యను చూచిన జానకమ్మ లోనికి పిలిచి హాల్లో కూర్చోపెట్టింది.
శ్యాంబాబు.. బాబు ఇంటికి చేరారు. జానకమ్మ బాలగోవిందయ్యను శ్యాంబాబుకు పరిచయం చేసింది. ఇరువురి మధ్యన నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి.
"సార్!.. మీరు నామీద కొండంత ఆశను పెట్టుకొని ఇంతదూరం వచ్చినందుకు నాకు చాలా సంతోషం. నేను మా అమ్మా మావాడు.. మంచిరోజు చూచుకొని మీ అమ్మాయిగారిని చూచేదానికి వస్తాము. మీకు ముందుగా విషయాన్ని తెలియజేస్తాము" నవ్వుతూ చెప్పాడు శ్యాంబాబు.
ఆ ముగ్గురి ముఖాల్లో ఎంతో ఆనందం. జానకమ్మ కొడుకును తన హృదయానికి హత్తుకొంది పరవశంతో.
=======================================================================
ఇంకా వుంది..
ప్రేమ తరంగాలు - పార్ట్ 12 త్వరలో..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
コメント