top of page

ప్రేమ తరంగాలు - పార్ట్ 12

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Prema Tharangalu - Part 12 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 21/01/2025

ప్రేమ తరంగాలు - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. 

కూతురు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు. 


ఫ్లయిట్ లో పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. భామను కలవడానికి వచ్చిన మురళీధర్ ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు. 


యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు. అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు. శ్యాంబాబు అసిస్టెంట్ బాబు ద్వారా అతని వివరాలు తెలుసుకుంటాడు బాలగోవిందయ్య.


ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 12 చదవండి. 


వూరికి తిరిగి వచ్చిన బాలగోవిందయ్య గోదావరి నదిలో పుష్కర స్నాన సమయంలో తాము చూచిన.. శ్యాంబాబు వివరాలనన్నింటినీ విపులంగా ముకుందవర్మ, నీలవేణిలకు వివరించాడు. భామ ఫొటోను చూచి వారు సంతోషించిన రీతిని అమ్మాయిని చూచేటందుకు త్వరలో వస్తామని, ముందుగా తెలియజేస్తామని వారు చెప్పిన మాటలను విపులంగా చెప్పాడు.

బాలగోవిందయ్య తెలియజేసిన మంచివార్తకు ముకుందవర్మ.. నీలవేణీలు ఎంతగానో సంతోషించారు.


నీలవేణి.. శ్యాంబాబు ఫొటోను సత్యభామను చూపించింది. తన వివాహ విషయంలో.. తాను తల్లిదండ్రుల మాటను కాదనకూడదనే నిర్ణయానికి వచ్చియున్న భామ.. క్లుప్తంగా "అమ్మా!.. మీకు అన్నివిధాల నచ్చి యిష్టమైతే.. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదమ్మా. నా యోగక్షేమాలను గురించి మీకన్నా ఎవరమ్మా ఆలోచించగలరు!.." మనస్సులో బాధ వున్నా.. పైకి వ్యక్తం కానీయకుండా.. తన తల్లిదండ్రుల సంతోషమే తన సంతోషం.. వారి మాటలను గౌరవించి ఆదరించడం తన బాధ్యతగా భావించి.. అలా చెప్పింది భామ.

కుమార్తె తమ నిర్ణయాన్ని ఆమోదించినందుకు.. తమతో ఏకీభవించినందుకు ముకుందవర్మ ఎంతగానో ఆనందించారు.


మూడువారాల తర్వాత అమ్మాయిని చూచేదానికి నిశ్చితార్థం జరుపుకొనేదానికి వస్తున్నామని జానకమ్మ ముకుందవర్మగారికి ఫోన్ చేసి చెప్పింది.


నాలుగురోజుల్లో తన నిశ్చితార్థం అనగా.. సత్యభామ మానసకు ఫోన్ చేసి "తప్పక నీవు రావాలి అక్కా!" చెప్పింది.


"అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు సత్యా!.. నీ నిశ్చితార్థానికి నేను రాలేను. పెండ్లికి నాలుగు రోజులు ముందుగానే వచ్చి.. నీకు తోడుగా వుంటూ.. నిన్ను నా చేతులతో పెళ్ళి కూతుర్ని చేస్తాను" అనునయంగా చెప్పింది మానస.


మానస రానని చెప్పినందుకు భామ బాధపడింది. ఆమె కన్నీటిని చూచిన ముకుందవర్మ.. విషయాన్ని ఆమె నుండి తెలుసుకొని మానసకు రావలసిందిగా ఫోన్ చేశాడు. 

"నీవు రాకపోతే భామ బాధపడుతుందమ్మా!" విచారంగా చెప్పాడు.


"బాబాయ్!.. నాకు మీరు ఇంతగా చెప్పాలా!.. సత్య ఎవరు నా చెల్లి.. దాని నిశ్చితార్థానికి నేను రాలేనని అన్నానంటే యిక్కడి పరిస్థితి ఎలా వుందో మీరు ఆలోచించగలరు. సత్యకు నచ్చచెప్పగలరు. ప్లీజ్!.. బాబాయ్.. ఫోన్ సత్యకివ్వండి." అభ్యర్థనగా చెప్పింది మానస.


ఫోన్ భామను అందించి ముకుందవర్మ వెళ్ళిపోయాడు.

"సత్యా!.."


"అక్కా!.." భామ కంఠం బొంగురుపోయింది.


"బాధపడుతున్నావా!"


"అవునక్కా!.. యదార్థం చెప్పాలంటే.. యిప్పట్లో నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు. నేను సరే అన్నది కేవలం అమ్మా నాన్నల ఆనందం కోసం. నా గతం నాన్నకు తెలుసు. అమ్మకు తెలీదు. వారిరువురికీ తెలియని విషయం నీకు తెలుసు. వారు నిశ్చితార్థానికి వస్తున్నట్లు నాకు మూడువారాల క్రిందటే నాన్నగారు చెప్పారు. యాంత్రికంగా సరే అన్నట్లు తలాడించాను. కానీ.. అతనికి నేను ఎంతగానో నచ్చానట. అందుకే పిల్లను చూచిన రోజే నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారట. నాకు యిష్టం లేని కారణంగా నీకు వెంటనే చెప్పలేదు" విచారంగా చెప్పింది భామ.


"ఎప్పుడు చెబితే ఏం!.. నేను నిన్ను గురించి తప్పుగా అనుకొంటానా!.. చూడు సత్యా!.. నాకు నీమీద నమ్మకం.."


"ఏ విషయంలో అక్కా!"


"నీవు నా మాటను కాదనవని. నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం కోరుకున్న వాడికంటే.. మనలను కోరే వ్యక్తి మన భావి జీవితానికి చక్కని భాగస్వామి కాగలడు. వారికి నీవు నచ్చావంటే అది నీ గొప్ప అదృష్టం. ఇది నీవు ఆనందించవలసిన సమయం. గతాన్ని గుర్తుచేసుకొంటూ నీలో నీవు కుమిలిపోకు. అమ్మా నాన్నలను నేను చూచానుగా!.. వాళ్ళు నీ ముఖ భావాలను చూచే.. నీ మనస్సులో ఏముందో గ్రహించగలరు. నీవే అన్నావుగా ఈనా అంగీకారం వారి ఆనందం కోసమని.

అలాంటప్పుడు.. నీవు పాత జ్ఞాపకాలతో సతమతమౌతూ వుంటే.. నీ ముఖ భావాలు వారికి అనుమానాన్ని కలిగించవచ్చు. మరిచిపో.. ఆ చేదు గతాన్ని మరిచిపో. దైవాన్ని ప్రార్ధించు. ఆనందాన్ని ప్రశాంతాన్ని ప్రసాదించమని వేడుకో. ఆ దైవ కృప నీమీద పూర్తిగా వుంది. ఆ కారణంగానే.. నీవు నీకు వచ్చిన ఆపదల నుంచి క్షేమంగా బయటపడ్డావు. వీలు కల్పించుకొని ఎక్కువ సమయం దైవ చింతనకు వెచ్చించు. మనస్సుకు శాంతి, ఆనందం కలుగుతుంది. ప్రస్తుతం నేను చేసేది అదే. అందుకే నీకు చెబుతున్నాను. నా మాటలను పాటిస్తావనే నమ్మకంతో" మానస చెప్పడం ఆపింది.


ఆమె మాటలు భామ హృదయానికి కొంత శాంతిని కలిగించాయి.

"అలాగే అక్కా!.. నీ మాటలను పాటిస్తాను" భామ ఫోన్‍ను కట్ చేసింది.

*

శ్యాంబాబు, సత్యభామల నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.

జానకమ్మ పరమానందంగా విలువైన చీరలు, నగలు కోడలికి అందించింది.

బంధు జనాలకు, వూరి వారికి ముకుందవర్మ విందు భోజనాలను ఏర్పాటుచేశారు. ఆహూతులు అందరూ ఆ జంటను మనసారా దీవించారు.


ఆ రోజు నుండి డెభ్భై ఐదవ రోజున వివాహ ముహూర్తం నిర్ణయించబడింది. లగ్న పత్రికను వ్రాసి పురోహితులు ఇరువర్గాల వారికి ఇచ్చారు.

ముకుందవర్మ నీలవేణి దంపతులు తమ చిరకాల వాంఛకు చక్కని రూపకల్పన జరిగినందుకు పరమానందభరితులైనారు.


వధూవరులకు ఒకరి పట్ల ఒకరికి ఎంతో సంతృప్తి. 

’ఆరడుగుల అందగాడు’ అనుకొంది భామ.

’జగన్మోహిని’ అనుకొన్నాడు శ్యాంబాబు.


కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత.. ముకుందవర్మ, నీలవేణి దంపతులకు కృతజ్ఞతాపూర్వక నమస్కారాలను తెలియజేసి, ఆ సాయంత్రం ఐదు గంటలకు శ్యాంబాబు, జానకమ్మ, బాబు వారితో వచ్చిన వారి బంధువులు నెల్లూరికి బయలుదేర సిద్ధం అయినారు.


అంతవరకూ బాబు.. తన రూపురేఖలతో ఆ వూర్లో వున్న వ్యక్తి కనబడకపోవడంతో బాలగోవిందయ్యను సమీపించి..

"సార్!.."


"ఏం బాబు!"


"నాలాగా మీ దగ్గర ఒక వ్యక్తి వున్నాడని చెప్పారే.. వారు ఈ కార్యక్రమానికి రాలేదేం సార్!"


"ఈరోజు ఆదివారం కదా!.. అతను మాతాజీని చూచేటందుకు వెళ్ళి వుంటాడు. ప్రతి ఆదివారం అతను తప్పనిసరిగా అక్కడికి వెళుతుంటాడు."


"ఆ ఆశ్రమం ఎక్కడ వుంది సార్!" శ్యాంబాబు అడిగాడు.


"శ్రీకాళహస్తి"


"అలాగా!.."


"అవును బాబు"


అందరూ హాల్లో కూర్చున్నారు. బాబు బోలారోను స్టార్ట్ చేశాడు. చుట్టూ వున్నవారికి బై చెప్పి శ్యాంబాబు ముఖంలోకి చూచాడు.


భవంతి ముఖద్వారం వద్ద నిలబడి తమనే చూస్తున్న సత్యభామకు ఎడం చేతిని ఎత్తి కారు ముందు సీట్లో కూర్చొని వున్న శ్యాంబాబు ప్రత్యేకంగా ఆమెను చూస్తూ బై చెప్పాడు.

"బాబు!.. పోనీ" అన్నాడు.


బాబూ.. కారును కదిలించాడు. ఆ ఇరువురి చూపులు చెదిరిపోయాయి.

అరగంటలో కారు నెల్లూరు చేరింది. ఆ రాత్రి భోజనానంతరం జానకమ్మ తమతో వచ్చిన ముగ్గురు ముత్తైదువులతో హోటల్లో ఒక గదిలో పడుకొంది.

శ్యాంబాబు.. బాబు మరో గదిలో..

"బాబూ!.."


"ఏం అన్నా!"


"మనం రేపు ఉదయాన్నే శ్రీకాళహస్తికి వెళదాం రా. మనస్సును వెళ్ళమని ఆదేశిస్తూ వుంది."


బాబు నవ్వుతూ.. "అన్నా!.. నీ మనో ఆదేశ.. ఎప్పుడు మంచికి సంబంధించే వుంటుంది. నాకు తెలుసుగా!.. అమ్మకు చెప్పి ఉదయాన్నే బయలుదేరుదాం."


"వెళ్ళి ఆ ఆశ్రమాన్ని అక్కడ వున్న అమ్మగారిని చూచి వద్దాం సరేనా!"


"అలాగే అన్నా"


బాబూ బార్ లైట్ ఆర్పి బెడ్ లైట్ ఆన్ చేశాడు. ఇద్దరూ పడుకున్నారు.

ఉదయం ఆరుగంటలకు సిద్ధమై తల్లికి చెప్పి శ్యాంబాబు, బాబు శ్రీకాళహస్తికి బయలుదేరారు.

తొమ్మిదిన్నరకల్లా ఆశ్రమాన్ని చేరారు. ఇరువురూ కారు దిగారు. ప్రక్కనే పది అడుగుల దూరంలో ఎవరితోనో మాట్లాడుతున్న రాంబాబును బాబు చూచాడు. అతను ముమ్మూర్తులా రూపంలో తనలాగే వున్నందున బాలగోవిందయ్య చెప్పిన వ్యక్తి అతనేనని బాబు గుర్తించాడు.


"అన్నా!.. అలా చూడండి."


శ్యాంబాబు, బాబు చెప్పిన దిశకు తన చూపును త్రిప్పాడు.


"అన్నా!.. బాలగోవిందయ్య గారు చెప్పిన వ్యక్తి వారే అయ్యుంటారు. పేరు రాంబాబు. అవునో కాదో అడగనా!"


"అడుగు.."


’అవును.. పోలికలో బాబు, అతనూ ఒకేలాగున్నారు’ అనుకొన్నాడు శ్యాంబాబు.


బాబు.. ఆత్రంగా అతన్ని సమీపించాడు.

"సార్ ఎక్స్ క్యూజ్‍మి" వినయంగా చెప్పాడు బాబు.


"ఎస్!.. మీరెవరండి?"


అచ్చం తనలాగే వున్న వ్యక్తిని గోదావరీ పుష్కర స్నాన సమయంలో చూచినట్లు తనతో బాలగోవిందయ్య ఆనంద్ వర్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆశ్చర్యంతో బాబును పరీక్షగా చూచాడు రాంబాబు.


"నాపేరు బాబు సార్.. మీరు ముకుందవర్మ గారి అసిస్టెంట్ కదా సార్!"


"అవును."


ఇంతలో శ్యాంబాబు వారిరువురినీ సమీపించాడు. 


"వీరు డాక్టర్ శ్యాంబాబు. నాకు అన్నయ్యతో సమానం. నేను వారి దగ్గరే పని చేస్తున్నాను. దొంగగా బ్రతుకుతున్న నన్ను కాపాడి చదివించి ఉద్యోగం ఇచ్చి మనిషిగా చేశారు. మన ఇరువురం రూపంలో ఒకేలాగుంటామని బాల గోవిందయ్య గారు చెప్పారు. అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు నమ్ముతున్నాను. మిమ్మల్ని చూచినందుకు నాకు చాలా ఆనందంగా వుంది సార్!.."


"మిమ్మల్ని చూస్తుంటే నాకూ ఎంతో ఆనందంగా వుంది."


"నిశ్చితార్థం బాగా జరిగిందా!" అడిగాడు రాంబాబు.


"ఎస్. చాలా బాగా చేశారు" శ్యాంబాబు జవాబు.


"సార్ నా పేరు రాంబాబు. నమస్తే!" శ్యాంబాబును చూస్తూ చేతులు జోడించాడు రాంబాబు.


"నమస్తే!" నవ్వుతూ చెప్పాడు శ్యాంబాబు.


క్షణం తర్వాత..

"రాంబాబూ!.."


"చెప్పండి సార్!"


"ఎక్కడ ఎవరో మాత వున్నారని విని.. ఆమెను చూడాలని వచ్చాను."


"సార్!.. నేను ఒక అనాథను. నాకు తల్లితండ్రి ఎవరో తెలియదు. మూడు సంవత్సరాల క్రిందట ఈ ఆశ్రమానికి వచ్చాను. ఇక్కడ ఎందరో వున్నారు ప్రశాంత జీవితాన్ని గడిపేటందుకు. వారిలో ఒకరు మాత. నన్ను మొదటిసారి చూచిన మాత. నాతో ఎంతో ప్రశాంతంగా మాట్లాడారు. నీవు నా బిడ్డలాంటి వాడివన్నారు. ప్రస్తుతంలో వారికి ఎవరూ లేరని చెప్పారు. యధార్థం చెప్పాలంటే ఆమెను చూడగానే నా మనస్సు వారిపట్ల పూజ్య భావన కలిగింది. ఆమె మాటలను పదే పదే వినాలని మనస్సున ఆరాటం. అందుకే అప్పటినుంచీ ప్రతి ఆదివారం ఇక్కడికి వస్తాను. పగలంతా అమ్మ సాన్నిధ్యంలో గడుపుతాను. రాత్రి బయలుదేరి నెల్లూరికి వెళ్ళిపోతాను. ప్రస్తుతంలో అమ్మ ఆరోగ్యం సరిగా లేదు. ’ఈరోజు వుండి రేపు వెళ్ళూ బాబూ’ అని అమ్మ చెప్పారు నిన్న. అందుకే వెళ్ళకుండా ఆగిపోయాను."


"అమ్మ ఎక్కడ వున్నారు?" అడిగాడు శ్యాంబాబు.


ఎదురుగా వున్న ఓ గదిని చూపుడు వ్రేలితో చూపుతూ..

"ఆ గదిలో వున్నారు."


"వెళ్ళి చూద్దామా!" అడిగాడు శ్యాంబాబు.


"పదండి"


ముగ్గురూ.. ఆ గదిని సమీపించారు. గది తలుపు తెరిచి ఒక స్త్రీ వెలుపలికి వచ్చి తలుపును మూసింది.


 రాంబాబుతో "రాంబాబూ!.. అమ్మగారు నిద్రపోతున్నారు" మెల్లగా చెప్పి ముందుకు వెళ్ళిపోయింది.


వారు కిటికీని సమీపించి లోనికి చూచారు. వారికి అమ్మగారి వీపు భాగం గోచరించింది.

"రాంబాబూ!.. నిద్రపోతున్నారుగా!.. కొంతసేపు ఆగుదాం. రండి.. ఆ చెట్టు క్రింద కూర్చుని మాట్లాడుకొందాం" చెప్పాడు శ్యాంబాబు.


కాషాయపు రంగు చీర.. నెరిసిన జుట్టు.. శుష్కించిన శరీరం.. ఆ అమ్మ.. సంబంధించినవి.. శ్యాంబాబు కళ్ళముందు ప్రతిబింబించాయి.


ముగ్గురు చెట్టు క్రింద వున్న సిమెంట్ బెంచి పైన కూర్చున్నారు.

"రాంబాబు!.. అమ్మగారి జీవిత విశేషాలు మీకు ఏమైనా తెలుసా!.." సాలోచనగా మెల్లగా అడిగాడు శ్యాంబాబు.


"సార్!.. వారుగా నాకు ఏమీ చెప్పలేదు. నేనూ అడగలేదు. ఇక్కడ వున్నవారు చెప్పగా విన్నది.. ఎనిమిది సంవత్సరాల క్రిందట అమ్మగారు యిక్కడికి బొంబే నుంచి వచ్చారట. వారి వద్ద వున్న కొంత ధనాన్ని ఆశ్రమ స్వామీజీ వారి ఆదేశంతో నిర్వాహకులకు ఇచ్చారట. అప్పటి నుంచీ ఇక్కడే స్వామీజీ వారి బోధనలను వింటూ ఆశ్రమ శుభ్రతకు వారు చేయతగిన పనులను చేస్తూ ఇక్కడ వున్నవారితో కలిసి వుంటున్నారట" చెప్పాడు రాంబాబు.


కొన్ని క్షణాల తర్వాత..

"రాత్రి నేను నెల్లూరికి వెళ్ళవలసిన వాణ్ణి. అమ్మగారు వెళ్ళవద్దని చెప్పడంతో ఆగిపోయాను. నన్ను ఎందుకు వుండమన్నారో.. నాకు తెలియదు" చెట్టుపైన గూటిలో పిల్లలకు తన ముక్కుతో ఆహారాన్ని అందిస్తూ వుంటే ’కుహూ.. కుహూ..’ అని కూతపెట్టే ఆ శకున పక్షిపిల్లల గూటిని చూస్తూ చెప్పాడు రాంబాబు.


శ్యాంబాబు.. బాబు, రాంబాబు చూపులు పిల్లలు వున్న ఆ పక్షి గూటిపై లగ్నమైనాయి. తను తెచ్చిన ఆహారాన్ని పిల్లలకు పెట్టి.. ఆహారాన్ని తెచ్చేటందుకు తల్లి పక్షి ఎగిరిపోయింది.


"సార్!.. ఆ ఎగిరిపోయిన పక్షిని చూచారుగా.. ఆమె తల్లి పక్షి.. ఆహారాన్ని తెచ్చి బిడ్డలకు పెట్టి మరలా ఆహారాన్ని తీసుకు రావడానికి ఎగిరిపోయింది. నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఆదివారం.. ఈ చెట్టుపైని ఆ గుడ్లను.. ఆ తల్లి పక్షులను తమ సంతతి విషయంలో అవి తీసుకునే జాగ్రత్తలను గమనిస్తూ వుంటాను. అందులో నాకు ఎంతో ఆనందం. యదార్థంగా చెప్పాలంటే.. అంతే ఆవేదన కూడా నాకు కలుగుతుంది సార్!" విచారంగా చెప్పాడు రాంబాబు.


"ఆవేదనకు కారణం?" అడిగాడు శ్యాంబాబు.


"ఆ పక్షులకు తమ పిల్లల మీద వున్న ప్రేమాభిమానాలు నాకు జన్మనిచ్చిన తల్లికి నామీద లేకపోయినందుకు.. నన్ను చర్చి వాకిట పడేసి తాను వెళ్ళిపోయినందుకు.."


"ఆలోచిస్తే.. ఏ పరిస్థితుల్లో ఆ తల్లి అలా చేయవలసి వచ్చిందో ఆ విషయం మనకు తెలీదు కదా!.." అనునయంగా చెప్పాడు శ్యాంబాబు.


’అవును’ అన్నట్లు తలాడించాడు రాంబాబు. ఆ క్షణంలో అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి.

"దైవ నిర్ణయానికి అతీతంగా ఈ జగతిలో ఎవరి విషయంలోనూ.. ఏదీ జరుగదు. రాజీ.. ప్రతి వ్యక్తీ ఈనాడు జీవితంలో రాజీపడే బ్రతుకుతున్నాడు. కారణం మనం అనుకొన్నవి అన్నీ.. మన యిష్టానుసారం జరుగవు కదా!.. భూమికి చీకటి వెలుగులు ఎంతో.. ప్రతి వ్యక్తి జీవితానికి కష్టసుఖాలు అంతే. మన చేతిలో ఏదీ లేదని మనలను నడిపించేది ఒక దివ్యశక్తి. దేవుడు, దేవత అని నమ్మి మనం నిశ్చల మనస్సుతో సద్భావాలతో పరోపకార చింతనతో నీతికి నిజాయితీకి ధర్మానికి, న్యాయానికి కట్టుబడి మన లక్ష్య సాధనకు పాటుపడాలి. ఆ రీతిగా వర్తిస్తే.. మనకు శాంతి సౌఖ్య లక్ష్యసిద్ధి తప్పక కలుగుతాయి. ఇది నా స్వానుభవం రాంబాబూ!" అనునయంగా చెప్పాడు శ్యాంబాబు.


గది నుండి బయటికి వచ్చిన ఆవిడ వారిని సమీపించింది.

"రాంబాబూ!.. అమ్మగారు మేల్కొన్నారు. నీవు ఎక్కడ అని అడిగారు." రాంబాబు ముఖంలోకి చూస్తూ చెప్పింది.


"సార్!.. రండి అమ్మగారిని చూద్దాం" అన్నాడు రాంబాబు.


ముగ్గురూ వేగంగా ఆ గదిని సమీపించారు. ముందు రాంబాబు, అతని వెనుకాల శ్యాంబాబు, బాబు ఆ గదిలో ప్రవేశించారు.

వాకిటవైపుకు తిరిగి పడుకొని వున్న మాత మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమెకు దగ్గరగా వెళ్ళి మోకాళ్ళపైన కూర్చున్నాడు రాంబాబు.

"రాంబాబూ!.."


"ఏం అమ్మా!"


"వాళ్ళిద్దరు ఎవరు నాయనా!"


"వాళ్లది విశాఖపట్నం. ఈ ఆశ్రమాన్ని మిమ్మల్ని చూడాలని వచ్చారమ్మా!"


"నన్ను చూడాలనా!" పేలవంగా నవ్వింది మాత.


"అవునమ్మా!"


కొన్ని క్షణాలు శ్యాంబాబును.. బాబును పరీక్షగా చూచింది అమ్మ. చేతి సైగతో దగ్గరకు రమ్మని పిలిచింది. ఇరువురూ రాంబాబు ప్రక్కకు చేరి అతను కూర్చున్నట్లుగానే మోకాళ్ళపైన కూర్చున్నారు.


ముగ్గురూ తదేకంగా మాత కళ్ళల్లోకి చూడసాగారు. ఆమె కూడా వీరిని పరీక్షగా చూడసాగింది.

మధ్యన కూర్చొని వున్న శ్యాంబాబు మనస్సున పాత జ్ఞాపకాలు. తన పదేళ్ళ వయస్సున జరిగిన ఘటనలు.. తన తల్లి తండ్రి రూపురేఖలు.. అతని మనోదర్పణం మీద ప్రతిబింబించాయి. తన తల్లి పేరు శారద. తండ్రిపేరు పాండురంగ.


"నాయనా!.. మీరెవరో నాకు తెలియదు. నాలో ఏముందని నన్ను చూడవచ్చారు. జీవితంలో అన్నివిధాలా ఓడిపోయిన దాన్ని. ఎన్నో అవమానాలు సహించి.. ఎందరో స్వార్థపరుల దాహానికి బలైనదాన్ని. ఆత్మహత్మ మహాపాతకమని నమ్మి జీవచ్ఛవంగా బ్రతికి వున్నదాన్ని. 


ఆ చేదు జ్ఞాపకాలకు.. ఆ స్వార్థపరులకు దూరంగా.. ఈ ప్రశాంత ఆశ్రమంలో మనకు ఈ జన్మనిచ్చి.. ఆ సర్వేశ్వరుని ధ్యానించుకొంటూ.. స్వామీజీ వారి ప్రవచనాలను వింటూ వర్షపు బొట్టు కోసం వేచి వుండే చాతక పక్షిలా మరణ ఘడియల కోసం ఎదురుచూస్తూ వున్నదాన్ని నాయన రాంబాబూ!.. నీవు నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. నా జీవుడు ఈ కట్టెను వదిలి వెళ్ళిపోతే.. ఈ ఎముకల గూటిని కాల్చి బూడిద చేస్తావు కదూ!" ప్రాధేయపూర్వకంగా కన్నీటితో అడిగింది మాత.


శ్యాంబాబుకు ఆమె ఎవరో.. ఎవరో గుర్తుకు వచ్చింది. ఆమె.. తనకు జన్మనిచ్చిన తల్లి శారద. ఇరవై సంవత్సరాల క్రిందట.. తాను దత్తత పేరున ఆమె నుండి దూరం అయినాడు. ఆమె ఎవరన్నది గుర్తుకు వచ్చిన శ్యాంబాబు హృదయస్పందన వేగం అధికమైంది. జీవనాడులన్నీ పట్టు తప్పినట్లనిపించింది. నయనాలు ఆశ్రుపూరితాలైనాయి. నోటి నుంచి మాట పెగల్లేదు. కళ్ళనుండి కారే కన్నీటితో తన మాతృమూర్తిని.. పిచ్చివానిలా వెర్రిచూపులతో చూస్తూ వుండిపోయాడు.


అతని స్థితిని చూచిన రాంబాబు.. బాబు కూడా చలించిపోయారు. వారికీ మాటలు కరువయ్యాయి. ఎదుట వున్న మాతను.. ప్రక్కన వున్న శ్యాంబాబును ఆశ్రునయనాలతో మార్చి మార్చి చూస్తూ అచేతనంగా వుండిపోయారు.


"అయ్యా!.. మీరు నన్ను తప్పుగా అనుకోకండి. నేను చెప్పేది యదార్థం.. నాకు మీలాగే ముగ్గురు మగపిల్లలు. పెద్దవాడు గోవర్థన్ పది సంవత్సరాల వయస్సున నాకు దూరమైపోయాడు. పేదరికం వల్ల వాణ్ణి మేము కలవారికి దత్తు ఇచ్చాము. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో!.. ఎలా వున్నాడో!.. 


ఇకపోతే చిన్నపిల్లలు గోపాల్.. గోవింద్.. ఇద్దరు కవలలు. వారు.. వారు రెండు సంవత్సరాల ప్రాయంలో నాకు దూరమైనారు. ఒక దుర్మార్గుడు నన్ను మా వారిని నమ్మించి బాంబేలో ఇరువురికీ మంచి పని ఇప్పిస్తానని చెప్పి, సంవత్సరం రోజుల పిల్లలను అనాధ ఆశ్రమంలో వదలి.. డబ్బులు కూడగానే మీరు సంవత్సరం.. పిల్లలను మీరు మీ వద్దకు తెచ్చుకోవచ్చని చెప్పాడు. వాడి మాటలను నమ్మి బిడ్డలను వాడి చేతికి.. ఆశ్రమంలో వదిలేటందుకు ఇచ్చి, నేను మావారు.. వాడితో బాంబే వెళ్ళిపోయాము. 


రోడ్డు ప్రమాదంలో మావారు చనిపోయారు. నా రూపురేఖలకు వాడు వెల కట్టాడు. నన్ను దుబాయ్ షేక్‍కు అమ్మేశాడు. ఈ దిక్కులేని పక్షి షేఖ్ పంజరంలో దుబాయ్‍కి విమానంలో ఎగిరిపోయింది. పన్నెండు సంవత్సరాలు.. ఆ చెరను అనుభవించాను. నాపై మోజు తీరిన షేక్ నాకు విడుదలను ప్రసాదించాడు. స్వదేశానికి మా ఈ ప్రాంతానికి వచ్చాను. మనస్సున ఏ ఆశలూ లేవు. నా అనేవారు ఎవరూ లేరు. ఈ ఆశ్రమంలో ప్రశాంత్యంగా శేష జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొన్నాను. ఇక్కడ చేరాను. ఆ పైవాడి పిలుపు కోసం.. ఎదురు చూస్తున్నాను" విరక్తిగా నవ్వింది. 


ఆశ్రువులు ఆమె కళ్ళ నుండి చెక్కిళ్ళ పైకి దిగజారాయి. మనోవేదనతో కళ్ళు మూసుకొంది ఆ మాత.


శ్యాంబాబు.. కళ్ళ నుండి కన్నీటి ధారలు. వణుకుతున్న చేతులతో మాత చేతులను తన చేతుల్లోకి తీసుకొన్నాడు. 


"అమ్మా!.." గద్గద స్వరంతో మెల్లగా పిలిచాడు.


బరువైన కనురెప్పలను బలవంతంగా పైకెత్తి.. శ్యాంబాబు ముఖంలోకి చూచింది మాత.

"నే..ను.. నే..ను.. నీ పెద్ద కొడుకునమ్మా!" తన ముఖాన్ని ఆమె చేతుల్లో వుంచి భోరున ఏడ్చాడు శ్యాంబాబు.


అతని మాటలను విన్న మాత, రాంబాబు, బాబు ఆశ్చర్యపోయారు.

"అవునమ్మా!.. నేనేనమ్మా నీ గోవర్థనాన్ని" దీనంగా ఆ తల్లి కళ్ళల్లోకి చూస్తూ.. "దత్తు తీసుకొన్న వారు నా పేరును శ్యాంబాబుగా మార్చేశారమ్మా!"


"నీవు.. నీ..వు.. నా గోవర్థునుడివా!" పారవశ్యంతో మెల్లగా అడిగింది మాత.


"అవునమ్మా!.. నేను.. నేను నీ గోవర్థనాన్ని."


"నాయనా!.." తన చేతులను అతని తలకు చుట్టి హృదయానికి హత్తుకుంది మాత.


సర్వాన్ని మరిచి పసిబిడ్డలా ఆమె ఎదపై వాలిపోయాడు శ్యాంబాబు.

ఆ దృశ్యాన్ని చూస్తున్న రాంబాబు, బాబులకు ఏదో పారవశ్యం. వారి కళ్ళల్లో కన్నీరు. ముఖాల్లో సంతోషం.


"అమ్మా!.. నీ చిన్నపిల్లలకు ఎక్కడైనా పుట్టుమచ్చలు.. వున్నట్లు మీకు జ్ఞాపకమా!" అభ్యర్థనా పూర్వకంగా అడిగాడు రాంబాబు.


మాత, రాంబాబు ముఖంలోకి బాబు ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచింది.

"ఆ.. మీరిద్దరూ కవలల్లాగే వున్నారు. అన్నదమ్ములా!.."


"కాదమ్మా!" దీనంగా చెప్పాడు బాబు.


"నా బిడ్డలకిద్దరికీ గుండె స్థానంలో చింతగింజంత నల్లని పుట్టుమచ్చ వుండేది. అది నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది" దీనంగా చెప్పింది మాత.


రాంబాబు వెంటనే తన షర్టు బటన్స్ వూడదీసి తన ఛాతి ఎడం వైపున వున్న పుట్టుమచ్చను చూచాడు.

అదే రీతిగా.. బాబు తన గుండె భాగంలో వున్న పుట్టుమచ్చనూ చూచాడు.

ఆ ఇరువురి వదనాల్లో ఎంతో ఆనందం..


"బాబూ!.. మనం అన్నదమ్ములం. నాకు నీకు అమ్మ చెప్పిన చోటునే పుట్టుమచ్చలు వున్నాయి" సంతోషంగా నవ్వుతూ చెప్పాడు రాంబాబు.


మాత, శ్యాంబాబులు వారిరువురినీ ఆశ్చర్యంగా చూచారు.

"అమ్మా!.. మేమిద్దరం మీ చిన్న కొడుకులమమ్మా!.. మా ఎదలపైన వున్న పుట్టుమచ్చలను చూడండి."


ఇరువురూ వారి ఛాతిలపై వున్న పుట్టు మచ్చలను మాతకు చూపించారు. 

మాత తన చేతితో ఇరువురి పుట్టుమచ్చలను తాకింది. ఇరువురు ముఖాలను మార్చి మార్చి చూచింది. వారిరువురూ తన చిన్నబిడ్డలని గుర్తించింది. ఇరువురి శిరస్సులను తన హృదయానికి హత్తుకుంది.


శ్యాంబాబు పరమానందంతో తన చేతులను ఇరువురి సోదరుల వీపులపై వేశాడు. వారిపై పరవశంతో వాలిపోయాడు.


"అమ్మా!.. ఈరోజు మా ముగ్గురి జీవితాల్లో చాలా సుదినం. అమ్మా!.. ఆ సర్వేశ్వరుడు ఏనాడో మాకు దూరం అయిన మా తల్లిని మాతో కలిపాడు. పసికందులుగా వున్న నా తమ్ముళ్ళను మిమ్మల్ని తలచుకొని నేను ఎంతకాలం ఏడ్చానో మాటలతో చెప్పలేను. ఇప్పుడూ ఎదిగిన నా తమ్ముళ్ళను చూస్తుంటే నాకు.. నాకు ఎంతో ఆనందంగా వుందమ్మా!" ఎంతో సంతోషంగా చెప్పాడు శ్యాంబాబు కళ్ళనుండి కారుతున్న కన్నీటిని తుడుచుకొంటూ.


"అమ్మా!.. మీరు నాతో.. ’రాంబాబు!.. ఈరోజు వెళ్ళకు నాయనా, రేపు రాత్రికి వెళుదువు గాని’ అని చెప్పారు. అమ్మ ఇలా ఎందుకు చెప్పారని ఎంతగానో ఆలోచించాను. సమాధానం స్ఫురించలేదు. కానీ.. ఇప్పుడు నాకు అర్థం అయిందమ్మా!.. పెద్దల మాటల్లో వున్న గొప్పతనం. ఏకాకిని అనుకొన్న నాకు, తల్లి అన్నా, తమ్ముడు వున్నారు. ఓ శ్రీ కాళహస్తీశ్వరా!.. మాతా మహేశ్వరీ!.. మీకిదే నా నమస్సుమాంజలి" పరవశంతో పలికి కళ్ళు మూసుకొన్నాడు రాంబాబు. అతని కళ్ళనుండి కన్నీరు జలజలా రాలాయి.


శ్యాంబాబు మొదట రాంబాబును, తర్వాత బాబును ఆనందంగా తన హృదయానికి హత్తుకొన్నాడు.


ఆ అన్నదమ్ముల పరిష్యంగ సుఖం.. అనుభవించాలే తప్ప మాటలతో వర్ణనకు అందనిది.

ముగ్గురూ తల్లి పాదాలను తాకి కళ్ళకు అద్దుకొన్నారు. "నిండు నూరేళ్ళు చక్కని ఇల్లాలితో బిడ్డ పాపలతో సత్కీర్తితో వర్ధిల్లాలి" అని ఆ తల్లి వారిని దీవించింది.


"ఇప్పుడు నా మనస్సున వున్న ఆనందం.. నా భావి జీవితంలో ఏనాడూ లేనిది. సర్వేశ్వరా!.. ఈ క్షణం లోనే నా గుండె ఆగిపోయేలా చేయి స్వామీ!.. నాలో ఇప్పుడు ఏ ఆశలూ లేవు" చేతులు జోడించి కళ్ళు మూసుకొంది ఆ మాత.


శ్యాంబాబు అమ్మను తనతో విశాఖపట్నం తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకొన్నాడు. తమ్ముళ్ళకు చెప్పాడు. వారూ అంగీకరించారు. ఆశ్రమ స్వామీజీకి విషయాన్ని వివరించి.. వారి అనుమతిని పొందారు. అమ్మను ఒప్పించారు.


బాబు.. అమ్మతో చెన్నై వెళ్ళి ఫ్లైట్‍లో విశాఖకు బయలుదేరాడు.

=======================================================================

ఇంకా వుంది..

ప్రేమ తరంగాలు - పార్ట్ 13 త్వరలో..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


34 views0 comments

Comments


bottom of page