top of page

ప్రేమ తరంగాలు - పార్ట్ 13

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Prema Tharangalu - Part 13 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 27/01/2025

ప్రేమ తరంగాలు - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. 


కూతురు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు. 


ఫ్లయిట్ లో పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. భామను కలవడానికి వచ్చిన మురళీధర్ ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు. 


యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు. అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు. శ్యాంబాబు అసిస్టెంట్ బాబు ద్వారా అతని వివరాలు తెలుసుకుంటాడు బాలగోవిందయ్య.

ఆశ్రమంలో తల్లి ద్వారా శ్యాంబాబు, రాంబాబు, బాబు అన్నదమ్ములని తెలుస్తుంది.


ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 13 చదవండి. 


మానవతావాది శ్యాంబాబు... సాటి మనిషి ఎవరైనా సరే... ఎంతగానో గౌరవిస్తాడు. అభిమానిస్తాడు. వృత్తిరీత్యా డాక్టర్ అయినందున... అతని మనస్సు ఎప్పుడూ ఎంతో శాంతంగా ప్రశాంతంగా వుండేలా చూచుకొంటాడు.


శ్రీ కాళహస్తిలో జరిగిన విషయాన్ని పెంపుడు తల్లి జానకమ్మకు శ్యాంబాబు చెప్పలేదు. కారణం..... తనకు జన్మనిచ్చిన తల్లిని ఇరవై సంవత్సరాల తర్వాత కలిశానని... అంతేకాకుండా తన ఇరువురు తమ్ములు ఎవరన్న విషయం చెబితే... డెభ్భై ఏళ్ళ ప్రాయంలో వున్న ఆ తల్లి మనస్సును... ఈ యదార్థ విషయాలు ఏరీతిగా బాధిస్తాయో అనే భయం. తన్ను ఇంతచేసిన ఆ తల్లి తన శేష జీవితంలో అన్ని విధాలా ఆనందంగా వుండాలన్నదే అతని ఆకాంక్ష.


బాబును తన సొంత తల్లిని... పెంపుడు తల్లి ఇంటికి దూరంగా వేరే ఇంట ఉండేలా చేశాడు. రోజూ రాత్రి తను జానకమ్మ వుండే యింటికి డ్యూటీ ముగించుకొని బయలుదేరి... తల్లి శారదను చూచి పలకరించి.. ఆమెతో కొంతసేపు గడిపి ఆ ఇంటికి చేరేవాడు.


బాబు తల్లిని ప్రాణంతో సమానంగా చూచుకొనేవాడు.


రాంబాబు... అంతవరకూ అతనికి జీవితం పట్ల వున్న నిరాశ నిస్పృహల స్థానంలో... తను ఏకాకిని కానని తల్లి అన్న తమ్ముడు వున్నారని తెలిసిన క్షణం నుంచీ... ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగాయి. ఆశ్రమంలో తాను శ్యాంబాబుతో గడిపిన కొన్ని గంటల్లో... అతనితో వున్న శాంతం, సహనం, అభిమానం ఈ లక్షణాలు రాంబాబుకు ఎంతగానో నచ్చాయి. అలాంటి ఉత్తమమైన వ్యక్తి తనకు అన్నయ్య అయినందుకు ఎంతగానో సంతోషించాడు. బాబులోని అమాయకత్వం... కల్లాకపటం లేని అతని మనస్సు కలుపుగోలు తనంతో అతను మాట్లాడే మాటలు గొప్పగా నచ్చాయి. ’నా తమ్ముడు అమాయకుడు’ అనుకొని నవ్వుకొన్నాడు.


ముగ్గురు అన్నదమ్ములూ తరుచుగా ఫోన్‍లో మాట్లాడుకొనేవారు. అన్నకు తమ్ముడికి రాంబాబు అమ్మను జాగ్రత్తగా చూచుకొండని కోరేవాడు.


నెలరోజుల్లో రెండు పర్యాయాలు విశాఖకు వెళ్ళి అమ్మను అన్నా తమ్ముడిని చూచి వచ్చాడు.

***

ఐదు వారాలుగా రాంబాబు ముఖంలో, మాట తీరులో కలిగిన మార్పును గమనించిన భామ...

"లాయర్‍గారూ! ఈ మధ్యకాలంలో చాలా హుషారుగా కనబడుతున్నారు. కారణం ఏమిటో!" వ్యంగ్యంగా నవ్వుతూ అడిగింది భామ.


"నన్ను రెచ్చకొట్టడంలో నీకు ఎంతో ఆనందం అన్న విషయం నాకు బాగా తెలుసు సత్యా! యదార్థం చెప్పాలంటే నీ గెస్ నిజమే!"


"ఏమిటా నిజం!"


"చెప్పాలా!"


"జవాబు చెప్పకుండా ప్రశ్నించడం తప్పు కదూ!" బెదిరించినట్లు చెప్పింది భామ.


"నీవు నామీద ప్రయోగించేదాన్ని నేను నీమీద ప్రయోగించా అంతే" నవ్వాడు రాంబాబు.


"నవ్వును ఆపి... అసలు విషయం ఏమిటో చెప్పండి"


"నీకు లేదు అనుకొన్నది... వున్నది అని తెలిస్తే నీవు ఎలా ఫీలవుతావు!"


"యిది నా ప్రశ్నకు జవాబా!"


"అవును"


"నాకేం అర్థం కాలేదు"


"కొన్ని విషయాలు అర్థం కాకుండా వుంటేనే మంచిది" చిరునవ్వుతో చెప్పాడు.


"నేను మిమ్మల్ని తత్వాలను బోధించమని అడగలేదు" చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ అంది భామ.


"సత్యా!... నీవు నవ్వుతూ మాట్లాడితే ఎంతో బాగుంటావ్."


"నేను మిమ్మల్ని కాళిదాసులా మారి నన్ను వర్ణించండని చెప్పలేదే!" అసహనంగా అంది భామ.


"పూర్తి పేరు అర్థం... నీ ముఖంలో ఇప్పుడు స్పష్టంగా కనబడుతూ వుంది" గలగలా నవ్వాడు రాంబాబు.


"నన్ను ఏడిపించాలని నిర్ణయించుకొన్నావా!... ఛీ... పో" రుసరుసలాడుతూ తన గదికి వెళ్ళిపోయిది భామ.


ముకుందవర్మ బాలగోవిందయ్య కోర్టు నుంచి వచ్చారు. స్కూలు భవన నిర్మాణం ప్రారంభం అయిన కారణంగా రాంబాబు వారితో కోర్టుకు వెళ్ళలేదు. భామతో కలిసి నిర్మాణ కార్యక్రమాలను గమనిస్తూ వుండిపోయాడు ముకుందవర్మ ఆదేశం ప్రకారం.


ముకుందవర్మ ఆఫీసు గదిలో ప్రవేశించాడు. రాంబాబు, బాలగోవిందయ్య వారి ఎదుట కుర్చీలలో కూర్చున్నారు.


పనిమనిషి మల్లి ట్రేలో మూడు టీ కప్పులతో ఆ గదిలో ప్రవేశించింది. ముగ్గురికీ అందించింది. ఆమె వెనకాలే నీలవేణి వచ్చింది. సోఫాలో కూర్చుంది. 

"ఏమిటి సార్ కోర్టు విశేషాలు!" చిరునవ్వుతో అడిగింది నీలవేణి.


"టీ త్రాగి చెప్పనా... త్రాగుతూ చెప్పనా!" చిలిపిగా భార్య ముఖంలోకి చూస్తూ చెప్పాడు ముకుందవర్మ.


"ఇది కోర్టు కాదు నా ఇల్లు. త్వరగా టీ త్రాగి, కప్పును మల్లికిచ్చి చెప్పండి."


నవ్వాడు ముకుందవర్మ.


"బాలగోవిందయ్యా!.... మీ ఆవిడ కూడా!"


"సేమ్ టు సేమ్ సార్!"


"బాలగోవిందయ్య గారూ!" ’రూ’ దీర్ఘాన్ని లాగింది నీలవేణి.


"అమ్మా!... అమ్మా!... నేను అన్నది తమరిని గురించి కాదు."


"సేమ్ అంటే ఏమిటి రాంబాబు!"


"సార్!.... నేను చాలా చిన్నవాణ్ణి సార్. ఈ ద్వందార్థ ఆంగ్ల పదాల అర్థాన్ని నేను తెలుగించలేను సార్!"


ముకుందవర్మ రాంబాబు ముఖాన్ని చూస్తూ గలగలా నవ్వాడు. బాలగోవిందయ్య, నీలవేణి వంత కలిపారు. రాంబాబు బిత్తరపోయి వారి ముగ్గురినీ మార్చి మార్చి చూచాడు.


"చూడు నీలు! జడ్జీగారికి ట్రాన్స్ ఫర్ అయింది. పైగా రెండు వారాలు సెలవులు. ఈరోజు కోర్టులో ఏ కేసూ విచారణ జరుగలేదు. మా గురువు పురుషోత్తమరావు గారు ఫోన్ చేశారు. రాంబాబు సమయస్ఫూర్తిగా వర్తించి యిక్కడికి వచ్చిన మురళీధర్‍ను గురించి ఎస్.పి ప్రతాప్‍కు ఫోన్ చేసి, వాణ్ణి అరెస్టు చేయించి జైల్లో త్రోయించిన కారణంగా... తర్వాత నేను వాడి బెయిల్ గ్రాంట్ కాకుండా చేయించిన మూలంగా... మానస యిచ్చిన వాంగ్మూలాన్ని అనుసరించి... పైవారం మాసనకు విడాకుల ఆమోదం లభిస్తుందని చెప్పారు. ఇది మనందరికీ ఎంతో సంతోషకరమైన విషయం. అమ్మాయితో చెప్పు. ఆనందిస్తుంది" నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ.


"అవునూ!... మన అమ్మాయి నిశ్చితార్థాన్ని గురించి మా అన్నయ్యకు ఫోనులో మీరు చెప్పారుగా!"


"నిశ్చితార్థం జరిగిన మరుదినమే చెప్పాను నీలూ!"


"అయితే వాడు మనతో ఇంతవరకూ మాట్లాడలేదేం?"


ముకుందవర్మ సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది నీలవేణి అన్నయ్య... సైంటిస్టు పరమశివం.

"ఒరే!... నీకు నూరేళ్ళురా!"


"బావా!..." నవ్వాడు పరమశివం.


"నేను మీ అక్కా నీ గురించే మాట్లాడుకొంటున్నాము. ఇంతలో నీవు ఫోన్ చేశావు. చెప్పు విషయం ఏమిటి?"


"మన పల్లవి వివాహం... నిశ్చితార్థం, వివాహం మూడురోజుల వ్యవధిలో. ఈరోజు తారీఖు ఎనిమిది. ఇరవై ఒకటిన నిశ్చితార్థం. ఇరవై నాలుగున వివాహం. నీవు చెల్లి భామా కనీసం వారం రోజులు ముందుగా రావాలి. అబ్బాయి పేరు విక్రమ్. వాళ్ళది అనకాపల్లి. ఇద్దరు అన్నదమ్ములు. విక్రమ్ పెద్దవాడు. చిన్నవాడు శ్యామ్. కుటుంబం అంతా అమెరికాలోనే వున్నారు. నాకు మీ చెల్లికి అమ్మాయికి... వారంతా బాగా నచ్చారు. అబ్బాయి పైలెట్" ఏకధాటిగా చెప్పుకొచ్చిన పరమశివం ఆపాడు.


"బావా!.... చాలా సంతోషం. ఇదిగో మీ చెల్లికి ఇస్తున్నా మాట్లాడు" ఫోన్ నీలవేణికి అందించాడు ముకుందవర్మ.


"ఏరా అన్నయ్యా... నా కూతురు నిశ్చితార్థం జరిగిందని ఫోన్ చేస్తే... నీ నుండి జవాబే లేదు?"


"నీలూ!... నీ కోడలి వివాహ విషయంలో చాలా బిజీగా వున్నందున ఫోన్ చేయలేకపోయాను. తప్పుగా అనుకోకు. బావ చెప్పాడు. నీకు అన్ని విధాలా నచ్చిన సంబంధం అని. నాకు చాలా సంతోషం కలిగింది."


"అందుకేనా ఫోన్ చేయలేదు!"


"నీలూ!... కారణాన్ని చెప్పానుగా!"


"సరే... యింకేమిటి విశేషాలు?"


"పదిరోజులు ముందుగా నీవు మావారు భామ రండి. ఎన్నో విశేషాలు నీకు నేను చూపిస్తాను."


"ఫోన్ నందినికి ఇవ్వు."


"నేను ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నా నీలూ!"


"అలాగా!"


"అవును"


"సరే పెట్టేయనా! ఆగు ఆగు ఒక్కమాట!"


"ఏమిటి నీలూ!"


"కొడుక్కి సంబంధం ఏదైనా చూచావా లేదా!"


"వాడు మరో సంవత్సరం తర్వాత గాని చేసుకోనంటున్నాడు"


"వాడు అలాగే అంటుంటాడు. డాక్టర్ కదా!... నీకు ఈ సామెత తెలుసుగా!... బ్రహ్మచారి ముదిరినా... బెండకాయ ముదిరినా...."


"పనికిరావు అన్నారు పెద్దలు. నీలూ!... ఎదిగిన వారికి ఒకసారి చెబుతాం. రెండుసార్లు చెబుతాం. వారి ధోరణిలో మార్పు రాకపోతే మనం ఏం చేయగలం నీలూ!" జిజ్ఞాసగా చెప్పాడు పరమశివం.

"సరేరా అన్నయ్యా!.... బాధపడకు. కాలం కలిసివస్తే అన్నీ సవ్యంగానే జరుగుతాయి. వదినను అడిగినట్లు చెప్పు సరేనా!"


"అలాగే నీలూ" పరమశివం ఫోన్ కట్ చేశాడు.


ముకుందవర్మ... నీలవేణి చేసిన సంభాషణను జాగ్రత్తగా విన్నాడు.

’గిల్లడం, జోకొట్టడం అతివలకు వెన్నతో నేర్పిన విద్య’ అనుకొన్నాడు,.

భామ అక్కడికి వచ్చింది. అందరినీ పరీక్షగా చూచింది.

"పల్లవికి వివాహం నిర్ణయం జరిగిందట. మనం అమెరికా వెళుతున్నాము" కూతురును చూచి చెప్పింది నీలవేణి.


"మీరు వెళ్ళిరండి. నేను రాను" నిర్లక్ష్యంగా చెప్పింది భామ.


"ఏమండీ!... విన్నారా దాని మటలు!"


"నాకూ రెండు చెవులున్నాయిగా కండీషన్‍లో..... విన్నాను. స్కూలు పనులు జరుగుతున్నాయి. తను ఇక్కడ వుండటం ఎంతో ముఖ్యం. మన ఇరువురం వెళ్ళి మన ధర్మాన్ని మనం నిర్వర్తించి తిరిగి వద్దాం సరేనా!"


"ఆ... సరే!..." నిట్టూర్చి నీలవేణి లేచి బయటికి వెళ్ళిపోయింది. భామ... కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి కళ్ళల్లోకి చూచింది. నవ్వుతూ ’వెళ్ళు’ అన్నట్లు కళ్ళతో సైగ చేశాడు ముకుందవర్మ.

*

మానస... తనకు విడాకుల ఆమోదపత్రాలు చేతికి అందాయని ముకుందవర్మకు భామకు ఫోన్ చేసి సంతోషంగా చెప్పింది.


ముకుందవర్మ... తను నీలవేణి, పల్లవి వివాహానికి అమెరికా వెళుతున్నట్లు చెప్పి.. వీలుంటే వచ్చి భామకు తోడుగా వుండవలసినదిగా కోరాడు.


తన తల్లి ఆరోగ్యం మెరుగుపడినందున తప్పకుండా వస్తానని చెప్పింది మానస.

ముకుందవర్మ, నీలవేణిలను రాంబాబు చెన్నైకి వచ్చి విమానం ఎక్కించాడు.

వారు వెళ్ళిన నాలుగురోజులకు మానస తన చెల్లి మాధురితో ఆ గ్రామానికి వచ్చింది. వారిని చూచి భామ పరమానంద భరితురాలైంది.


భామ తమ్ముడు ఆనంద్ వర్మ, మానస చెల్లెలు మాధురీ కొన్ని గంటల్లోనే మంచి స్నేహితులుగా మారిపోయారు.

వీరందరినీ కంటికి రెప్పలా చూచుకొనేవాడు రాంబాబు.


భామ, మానస, రాంబాబు జరుగుతున్న స్కూలు పనులు వీక్షించారు. మరో మూడు నెలల్లో పనులన్నీ పూర్తి అవుతాయని ఇంజనీర్ హరి కాంట్రాక్టర్ వారికి తెలియజేశారు.


"సత్యా!... నీ కల త్వరలో ఫలించబోతూ వుంది. నీవు గొప్ప అదృష్టవంతురాలివి. నీవు తలుచుకొంటే దేన్నైనా సాధిస్తావ్. నాకు చాలా ఆనందంగా వుంది" సంతోషంతో చెప్పింది మానస.


"అవునవును. మానసగారూ!... మీరు చెప్పింది యదార్థం" భామ ముఖంలోకి క్రీకంట చూస్తూ చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు.


"అక్కా!...."


"ఏం సత్యా!"


"ఈ మధ్య ఈ పిల్ల లాయర్ గారు మహా జోక్‍గా మాట్లాడుతున్నారు. గమనించావా!"


"పాపం సత్యా!... రాంబాబు గారు అన్నమాటల్లో తప్పేముంది?"


"వుంది"


"మానసగారూ!... కొందరికి అబద్ధం రుచించినంతగా నిజం రుచించదు కదూ!"


"ఆ మాటా నిజమే రాంబాబు గారూ!"


"థాంక్యూ మేడమ్.... మీరు యదార్థాన్ని గ్రహించినందుకు నాకు చాలా సంతోషం."


"అక్కా!."


"ఏమిటి సత్యా!"


"నీవు రాంబాబుకు సపోర్టు చేస్తున్నావు. ఇది అన్యాయం" బుంగమూతి పెట్టి చెప్పింది భామ.


"భామగారు!... ఈ పిల్ల లాయర్ గాడి సతాయింపు ఇంక ఎన్నాళ్ళండీ. మరో ఐదు వారాలు. ఆ తర్వాత మీకు వివాహం... నాకు... ఈ వూరికి దూరంగా మీరు మీ అత్తగారి యింటికి విశాఖపట్నం వెళ్ళిపోతారు. ఈలోగా నేను ఏదన్నా మీ విషయంలో.... మీకు బాధ కలిగేలా మాట్లాడితే... నన్ను నిలదీసి మీ అభిప్రాయాన్ని నాకు చెప్పండి. నా తప్పును నేను సవరించుకొంటాను. ఎదుటి వారికి ఆనందం కలిగించాలనే ఆలోచిస్తాను గాని... కష్టం కలిగించాలని నేను ఏదీ మాట్లాడను. అలాంటి పనులనూ చేయను. నా మాటలు మీకు కష్టాన్ని కలిగించి వుంటే నన్ను క్షమించండి" క్షణంసేపు భామ ముఖంలోకి చూచి... వారిరువురికీ దూరంగా వెళ్ళిపోయాడు రాంబాబు.


"సత్యా!.... నీ మాటలు రాంబాబుగారిని నొప్పించాయి. అతని ముఖాన్ని గమనించావా!"


భామ ఆలోచించసాగింది. అది ఆషాడమాసం. సమయం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతం. సూర్యుడు పశ్చిమదిశలో అస్తమించబోయే తరుణం. 


ఆకాశం మేఘావృతం అయింది. కారుచీకట్లు కమ్ముకొన్నాయి. వర్షం ప్రారంభమయింది. చలిగాలి ఘోరున వీచసాగింది.


భామ.... మానస ఫ్లాటులో వున్న లేబర్ షెడ్‍లో దూరారు. వర్షంలో తడుస్తూనే రాంబాబు కారును చేరి స్టార్ట్ చేసి వారిరువురూ వున్న లేబర్ షెడ్ ప్రక్కన ఆపి దిగి... కారు వెనుక సీట్లో వున్న గొడుగును చేతికి తీసుకొని గుడిసెను సమీపించి....

"మానసగారూ!... గాలీవానా తీవ్రరూపం దాల్చేలా వుంది. ఇదిగో గొడుగు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఇంటికి వెళ్ళిపోదాం" తన చేతిలోని గొడుగును మానసకు అందించాడు. 


తనను పిలవకుండా మానసను పిలిచినందుకు భామ రాంబాబును గుర్రున చూచింది.

మానస భామ గొడుకు క్రిందికి దూరి... మెల్లగా కారును సమీపించి డోర్ తెరిచి వెనుక సీట్లో కూర్చున్నారు.


రాంబాబు వానలో తడుస్తూనే కారును సమీపించి డ్రైవర్ స్థానంలో కూర్చొని కారును స్టార్ట్ చేశాడు. కారు పదినిముషాల్లో భామ భవంతి పోర్టికోలో ఆగింది. ఇరువురూ కారు దిగి హాల్లోకి వెళ్ళిపోయారు.

పూర్తిగా తడిసిపోయిన రాంబాబు వరండాలో నిలబడి షర్టును విప్పి నీటిని పిండి... ముఖాన్ని చేతులను తుడుచుకొని షర్టును మరోసారి పిండి తగిలించుకొన్నాడు.


భామ టవల్‍ తీసుకొని వరండాలోనికి వచ్చింది. టవల్ అందివ్వబోయింది.

"వద్దండి పూర్తిగా తడిసిపోయాను. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను. ప్రస్తుతం నా డ్యూటీ మీకు కాపలాయే కదా!" విరక్తిగా నవ్వి కురిసే వానలో తడుస్తూ తన నిలయం వైపుకు వెళ్ళిపోయాడు రాంబాబు.


మానస కూడా వరండాలోకి వచ్చింది. ఆ ఇరువురూ... ఎలాంటి తొట్రుపాటు లేకుండా వర్షంలో ముందుకు వెళుతున్న రాంబాబును కొన్ని క్షణాలు పరీక్షగా చూచారు.

’మొండి మనిషి’ స్వగతంలో అనుకొంది భామ మెల్లగా.


"సత్యా! ఏమన్నావ్?"


"మొండి మనిషి అన్నాను" బిగ్గరగా చెప్పింది.


ఆ క్షణంలో... మానస, భామ ముఖంలో కొంత విచారాన్ని చూడగలిగింది.

"రా అక్కా!... లోనికి పోదాం" అంది భామ.


"పద..."


ఇరువురూ భామ గదికి వెళ్ళి... డ్రెస్ ఛేంజ్ చేసుకొని హాల్లోకి వచ్చి... మల్లిని పిలిచి టీ ఆర్డర్ చేశారు.

భామ తమ్ముడు ఆనంద్ వర్మ, మానస చెల్లి మాధురీ, వీరి మాటను విని వర్మ గది నుండి క్రిందికి వచ్చారు.


"మల్లీ!.... రెండు టీ!" అరిచాడు ఆనందవర్మ.


పది నిముషాల్లో మల్లి నాలుగు టీ కప్పులతో హాల్లోకి వచ్చింది. అదే సమయానికి రాంబాబు డ్రెస్ మార్చుకొని రెయిన్ కోట్ తగిలించుకొని వరండాలో ప్రవేశించాడు.

"మల్లీ!... మరో టీ తీసుకురా!" రాంబాబును చూచిన భామ చెప్పింది.


"మల్లీ!.... నాకు టీ వద్దు" రెయిన్ కోటును వూడదీస్తూ చెప్పాడు రాంబాబు.


రాంబాబు ముఖంలోకి తీక్షణంగా చూచింది భామ. 

"మీకు కోపం నామీదనా!... టీ మీదనా!"


"కోపం నాకు ఎవ్వరిమీదా లేదు. నేను త్రాగి వచ్చాను" చెప్పి రాంబాబు ఆఫీసు గదివైపుకు నడుస్తూ....

"ఏదైనా అవసరం వుంటే పిలవండి. వస్తాను" గదిలోనికి వెళ్ళిపోయాడు రాంబాబు.


"అక్కా!... చూచావా ఎంత పొగరో!..."


"త్రాగి వచ్చాడు కాబట్టి వద్దన్నాడు. నీవు ఎందుకు అంతగా ఫీలై పోతున్నావు!"


ఆనంద్‍వర్మ.... మాధురీలు, టీ కప్పులను టీపాయ్‍పై వుంచి సోఫా నుంచి లేచారు. 

"అక్కా!... రాంబాబు ఎప్పుడూ అబద్ధం చెప్పడు" అక్క ముఖంలోకి చూచి చెప్పి... "మాధురీ అక్కా!... రా మనం నా గదికి వెళ్ళి క్యారమ్స్ ఆడుకొందాం" అన్నాడు ఆనంద్‍వర్మ.


ఆ ఇరువురూ ఆనంద్‍వర్మ గదికి వెళ్ళిపోయారు.

"సత్యా!... నిన్ను ఒక విషయం అడగనా!" మెల్లగా అడిగింది మానస.


"అడుగక్కా!"


"నీవు రాంబాబుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు నాకు అనిపిస్తూ వుంది" చిరునవ్వుతో భామ ముఖంలోకి చూచింది మానస. 


భామ గలగలా నవ్వింది. 

"ప్రిఫరెన్సా అది ప్రిఫరెన్స్ కాదు మై డియర్ సిస్టర్... జాలి, దయ, అభిమానం కారణం... అతను ఒక అనాధ, అతని పట్ల నాకు వున్నది కేవలం సానుభూతి అంతే!"


"పది గంటలకు వచ్చాను. టిఫిన్ తినిపించి సైట్‍కు తీసుకొని వెళ్ళావు. మధ్యాహ్నం భోజనాన్ని అక్కడికే తెప్పించావు. వనభోజనం చేశాము. పద నీ గదికి. నీ ఉడ్‍బి ఫొటోను చూపించి వారి వివరాలను చెబుతువుగాని" నవ్వుతూ చెప్పింది మానస.


"సరే పద...."


ఇరువురూ మానస గదిలో ప్రవేశించారు. టేబుల్ డ్రాయర్ తెరిచి శ్యాంబాబు ఫొటో వున్న కవర్‍ను చేతికి తీసుకొంది. సోఫాలో కూర్చొనియున్న మానస ప్రక్కన కూర్చుంది.

"ముందు వివరాలు చెబుతాను. ఆ తర్వాత ఫొటోను చూపిస్తాను" నవ్వుతూ చెప్పింది భామ.


"సరే..."


"వారు వుండేది విశాఖపట్నం. వృత్తి డాక్టర్. ఒక్కడే కొడుకు. నాన్నగారు స్వర్గస్తులైనారు. డెభ్బై సంవత్సరాల తల్లి ఉంది. మా అమ్మానాన్నలు.... వారిని గోదావరి పుష్కర స్నాన సమయంలో గోదావరిలో చూచారు. అమ్మకు వారు బాగా నచ్చారు. వివరాలు సేకరించేదానికి మా బాల గోవిందయ్య అంకుల్‍ను విశాఖ పంపారు. కులగోత్రాలు సరిపోయాయి. వారికి, వారి తల్లికి నేను బాగా నచ్చానట. పెండ్లి చూపుల తంతు లేకుండా సరాసరి వచ్చి నిశ్చితార్థాన్ని జరుపుకొని వెళ్ళిపోయారు."


భామ సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది నీలవేణి. ఫొటో కవర్‍ను చేతపట్టుకొని అటూ ఇటూ పచారు చేస్తూ ఆ తల్లి అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పింది భామ. 

చివరగా "భామా!... రాంబాబును మన ఇంట్లోనే పడుకోమని చెప్పు. ఈ నిర్ణయం నాది మాత్రమే కాదు మీ నాన్నగారిది కూడా!"


"అలాగే అమ్మా!..." సెల్‍ను కట్ చేసి "అక్కా! ఇదిగో ఫొటో. బాగా చూడు. నేనుక్రిందికి వెళ్ళి రాంబాబుతో మాట్లాడి వస్తాను" కవర్‍ను మానస చేతికి అందించి భామ వేగంగా మెట్లుదిగింది.


మానస... కవర్‍లో వున్న ఫొటోను బయటికి తీసింది. ఫొటోను చూచింది. ఆశ్చర్యపోయింది. కొన్నిక్షణాలు కళ్ళు మూసుకొంది. తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి ఫొటోను మరోసారి చూచింది. ఆ ఫొటోలో వున్నది శ్యాంబాబు.


తాను ఎంతగానో ప్రేమించిన డాక్టర్ శ్యాంబాబు!!!


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


30 views1 comment

1 Comment


ప్రేమ తరంగాలు (సీరియల్: 13 వ భాగం)


ప్రపంచం ప్రేమ తరంగాల తో నిండాలి , స్నేహం - అనురాగం - ఆత్మీయత తో వెలగాలి

...

యుద్ధ తరంగాలతో కాదు, ద్వేషం, కకృతి, కష్టం - నష్టం కలిగించటం కాదు.


ఇదెలా సాధ్యం?


తేలిక! ... ఇష్టం లేని మనుషులకి, స్థలాలకు, విభజన మాటలకు దూరంగా ఉండాలి


I)

మంచిని పంచాలి - పెంచాలి, లేకుంటే ఊరికే ఉండాలి ... చెడు మటుకు చేయ కూడదు.


Ii)

మంచి మాటలు, ప్రోత్సాహం, సహాయం ఓ జట్టు లా చేయాలి ... లేకుంటే మౌనం గా ఉండాలి.


మా దైవం (సీనియర్ ఎన్. టి. ఆర్) సినిమాలో ... బాలు పాడిన పాట


"

ఒకే కులం, ఒకే మతం, అందరు ఒకటే

అందరినీ కాపాడే దేవుడొక్కడే

అందుకే ఆతనికి తల వంచాలి

అను దినము ఆ దేవుని పూజించాలి


చెడును చూడకు, చెడు పలుకులు వినకు ... చెడు మాటలు నీ నోట మాటలాడకు ... పగ యే నీ శత్రువని నిజం తెలుసుకో ... ప్రేమతో పగను…


Like
bottom of page