#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
![](https://static.wixstatic.com/media/acb93b_5ef32273574843ee94c4891d7f08eb15~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_5ef32273574843ee94c4891d7f08eb15~mv2.jpg)
Prema Tharangalu - Part 14 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 01/02/2025
ప్రేమ తరంగాలు - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు.
కూతురు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.
ఫ్లయిట్ లో పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. భామను కలవడానికి వచ్చిన మురళీధర్ ను అరెస్ట్ చేయిస్తాడు రాంబాబు.
యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు. అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు. శ్యాంబాబు అసిస్టెంట్ బాబు ద్వారా అతని వివరాలు తెలుసుకుంటాడు బాలగోవిందయ్య.
ఆశ్రమంలో తల్లి ద్వారా శ్యాంబాబు, రాంబాబు, బాబు అన్నదమ్ములని తెలుస్తుంది.
శ్యాంబాబుతో నిశ్చతార్ధం జరిగాక గతంలో మానస ప్రేమించింది అతణ్ణేనని తెలుసుకుంటుంది భామ.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 14 చదవండి.
మానస హృదయవేగం.. హెచ్చింది. కళ్ళల్లో కన్నీళ్ళు మనస్సున గత జ్ఞాపకాలు. వారి ఇరువురి మధ్యన జరిగిన మధుర సంభాషణలు.. ఒకరినొకరు చూచేటందుకు పరితపించిన క్షణాలు.. తీసుకొన్న నిర్ణయాలు.. తనతో ఒక్కమాట కూడా చెప్పకుండా రష్యాకు వెళ్ళిపోయిన శ్యాంబాబు నీచతత్వం.. అన్నీ మానస కళ్ళముందు ప్రతిబింబించాయి. దుఃఖం పొంగి వచ్చింది. ఫొటోను కవర్‍లో వుంచి టీపాయ్‍పై పెట్టి ఏడుస్తూ.. భామ వచ్చి తన స్థితిని చూస్తుందనే భయంతో రెస్టు రూముకు పరుగెత్తింది మానస.
అక్కడ వున్న ప్లాస్టిక్ స్టూలుపై కూర్చొని తనివి తీరా గత జ్ఞాపకాలతో ఏడ్చింది మానస.
’సత్య అతన్ని ఇష్టపడి.. వివాహానికి సమ్మతించింది. అతనికి తనకు వుండిన సంబంధాన్ని.. తీసుకొన్న నిర్ణయాలను.. అతడు తన్ను మోసం చేసిన రీతిని.. ఈ విషయాలను వేటినీ సత్యకు తెలియజేయకూడదు. ప్రస్తుతంలో తనలో చెలరేగిన ఆవేదనను ముఖంలో వ్యక్తం చేయకూడదు. దేవుడు ఎంతో గొప్పవాడు. రాంబాబుతో మాట్లాడాలనే సంకల్పాన్ని సత్యకు కలిగించి.. ఆమె తన ముందు నుంచి వెళ్ళిపోయేలా చేశాడు.
సత్య తన ఎదుటే వుండీ తాను ఆ ఫొటోను చూచి ఉన్నట్లయితే.. తన ముఖంలో మార్పులను.. కళ్ళల్లోని కన్నీటిని చూచిన సత్యకు అనుమానం కలిగి వుండేది. విషయం ఏమిటని నన్ను నిలదీసేది. నేను నిజాన్ని తప్పనిసరిగా ఆమె ప్రోద్భలంతో చెప్పవలసి వచ్చేదో!.. ఆమెకు నేనంటే ప్రాణం. ఎంతో అభిమానం. నిన్ను మోసం చేసిన అతన్ని నేను పెండ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేది. నావల్ల.. కుదిరిన సంబంధం చెదిరిపోయి వుండేది.
భగవాన్!.. నీకు శతకోటి వందనాలు. కుదిరిన వివాహం.. నా మూలంగా చెడిపోయిందనే నింద నాకు లేకుండా చేశావు. ప్రభూ!.. నీకు నా ధన్యవాదాలు" చేతులు జోడించి తన ఆరాధ్య దైవాన్ని వేడుకొంది మానస.
చన్నీటితో ముఖాన్ని కడుక్కొంది. హ్యాంగర్‍కు వున్న టవల్‍తో ముఖాన్ని తుడుచుకొంది. మదిలోని బాధను అణచుకొంది. నటన పూర్వక చిరునవ్వుతో ఆ గది తలుపును తెరిచి వచ్చి సోఫాలో కూర్చొని టీవిని ఆన్ చేసింది.
భామ వచ్చింది. "అక్కా!.. నీకు నచ్చాడా!" నవ్వుతూ అడిగింది.
"అది నేను అడగవలసిన ప్రశ్న సత్యా!.. నీ జవాబు" అంది మానస.
"ఓకే అక్కా!" నవ్వింది భామ సోఫాలో మానస ప్రక్కన కూర్చుంటూ.
ఐదు నిమిషాల తర్వాత "అక్కా!.. హాల్లో వున్నది. ప్లాజ్‍మా టీవీ కాదా! అక్కడికి వెళ్ళి చూద్దాం పద" అంది భామ.
మదిలో ఎంతో కలవరం. పైకి వదనంలో ఎంతో గాంభీర్యం. మౌనంగా తలాడించి భామను అనుసరించింది మానస. ఇరువురూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. భామ ప్లాజ్‍మా టీవిని ఆన్ చేసి వైల్డ్ లైఫ్ ప్రోగామ్‍ను పెట్టింది. మనస్సులో ఎంతో ఆవేదన.. వీడని శ్యాంబాబుకు సంబంధించిన జ్ఞాపకాలు. శిలా ప్రతిమలా టీవిని చూస్తూ కూర్చుంది మానస.
ఆనందవర్మ మాధురీ.. భామ గదిలోనికి ప్రవేశించారు. టీపాయ్‍పై నున్న కవర్‍ను చేతికి తీసుకొన్నాడు. అందులో వున్న ఫొటోను బయటికి తీసి చూచాడు ఆనంద్‍వర్మ.
"ఎవరిదా ఫొటో!" అడిగింది మాధురీ.
"నాకు కాబోయే బావగారిది.. "
"ఏదీ నన్నూ చూడనీ.. "
మాధురీ చేతికి ఫొటోను అందించాడు ఆనందవర్మ. ఆ ఫోటోను చూచి మాధురి ఆశ్చర్యపోయింది.
"ఈయనా!"
"అవును.. "
"వీరి పేరు శ్యాంబాబు కదూ!"
"అవును.. "
"ఇతను పచ్చి మోసగాడు మా అక్కను ప్రేమించి మోసం చేశాడు" ఆవేశంతో అంది మాధురి.
"ఏమిటీ.. మాధురీ అక్కా నీవు చెప్పింది!"
"అవును. నేను చెప్పింది నిజం ఆనంద్.. "
"నీవు చెప్పింది నిజమేనా అక్కా!"
"నిజం.. నిజం.. నిజం.. "ఆవేశంగా చెప్పి మాధురి ఆనంద్‍వర్మ గదికి వెళ్ళిపోయింది.
ఆనంద్‍వర్మ మెల్లగా మెట్లు దిగి.. భామను సమీపించాడు. ఆమె ముఖంలోకి పరీక్షగా చూచాడు.
"ఏరా!.. నీ ముఖం వాడిపోయింది. మాధురీ ఏమన్నా అందా!"
"లేదక్కా!.. నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి.. నాతోరా!"
ఆనంద్ వర్మ మేడమెట్లు వేగంగా ఎక్కసాగాడు. భామ అతన్ని అనుసరించింది. ఇరువురూ భామ గదిలో ప్రవేశించారు. తలుపు మూసి గడియబిగించాడు ఆనంద్ వర్మ.
"విషయం ఏమిట్రా!.. తలుపు ఎందుకు మూశావ్!" ఆశ్చర్యంతో అడిగింది భామ.
మాధురీ.. తనకు చెప్పిన విషయాన్ని.. భామకు తెలియజేశాడు ఆనందవర్మ.
భామ ఆశ్చర్యపోయింది. ఆమె ముఖంలో ఆవేదన.. ఆవేశం..
"ఏరా!.. నీవు చెప్పింది నిజమేనా!"
"సత్యం అక్కా!.. అమ్మ తోడు"
"సరే! నీవు వెళ్ళిపో"
ఆనంద్‍వర్మ గది తలుపును తెరిచి తన గదికి వెళ్ళిపోయాడు. భామ చేపట్టు గోడను సమీపించింది.
"అక్కా!.. పైకిరా!.. "
మానస తల త్రిప్పి భామను చూచింది. ఆమె ముఖంలో ఎంతో ఆవేశం గోచరించింది. మెల్లగా మెట్లెక్కి గదిని సమీపించింది మానస.
భామ గది తలుపులు బిగించింది. టీపాయ్‍పైనున్న కవర్‍ను చేతికి తీసుకొని అందులోని ఫొటోను బయటికి తీసింది.
"అక్కా!.. నా మీద ఒట్టు. ఈ ఫోటోలో వున్న వ్యక్తి నిన్ను మోసం చేశాడు కదూ!"
భామ సూటిగా అడిగిన ప్రశ్నకు వెంటనే మానస జవాబు చెప్పలేక పోయింది. అంతవరకూ హృదయంలో అణచుకున్న ఆవేదన పొంగి కన్నీరుగా మారింది. భోరున ఏడ్చింది మానస.
భామ ఆమె ప్రక్కన కూర్చొని వూరడించింది. యధార్థాన్ని తెలియజేయమని కోరింది.
తప్పించుకోలేని పరిస్థితిలో మానస.. తన శ్యాంబాబుల ప్రేమ కథను భామను వివరించింది. కథ.. సాంతం విన్న భామ అక్కా!.. రేపు మనం విశాఖ వెళుతున్నాం" అంది.
*
కన్నతల్లి శారదామాత కోర్కెమీద.. ఆమెను బాబును శ్యాంబాబు శ్రీకాళహస్తి ఆశ్రమానికి నాలుగు రోజులు వుండేదానికి పంపాడు.
ముకుందవర్మ.. నీలవేణిలు అమెరికా వెళ్ళినందున పైగా కోర్టుకు శలవులు అయినందున బాలగోవిందయ్య తన ఇల్లాలు వనజాక్షి కోరిక మీద శ్రీకాళహస్తీశ్వరుని ఆశ్రమాన్ని దర్శించేదానికి వచ్చారు. ఆలయంలో మాతా పితల దర్శనం అయింది. ఆశ్రమంలో ప్రవేశించారు.
స్వామీజీ ఉపన్యాసాన్ని ప్రారంభించి.. ముగించారు. అందరూ అరుగు దిగారు.
శారద.. దూరంగా వున్న బాలగోవిందయ్య దంపతులను చూచింది. బాబుతో కలిసి వారిని సమీపించింది.
"మామయ్యా!.. బాగున్నారా!" ప్రీతిగా పలకరించింది.
తొట్రుపాటుతో.. బాలగోవిందయ్య తల తిప్పి శారదను చూచాడు.
"అమ్మా.. మీరు!"
"శారద" మెల్లగా చిరునవ్వుతో చెప్పింది.
"అమ్మా!.. శారదా!. నీవా తల్లీ.. ఎంతగా మారిపోయావమ్మా!.. ఎక్కడ వుంటున్నావు తల్లీ!" ఆశ్చర్యంతో అడిగాడు బాలగోవిందయ్య.
"అమ్మా శారదా.. నీవా!" ఆప్యాయంగా శారద ముఖంలోకి చూచింది వనజాక్షి.
"అవును నేనే.. ఆ సర్వేశ్వరుని దయ వలన నాకు దూరం అయిన నా ముగ్గురు బిడ్డలూ.. ఈ ఆశ్రమంలోనే నాకు దగ్గరైనారు. వీడు చిన్నవాడు గోవింద్. "
బాబు చేతులు జోడించి.. వారికి నమస్కారం చెప్పాడు.
"అన్నా వదినలు.. పరమశివం కూతురు పల్లవి వివాహరీత్యా అమెరికా వెళ్ళారు. "
"ఆ అహంకారి ఎక్కడికి వెళితే నాకెందుకు మామయ్యా!.. వాళ్ళ విషయం నాకనవసరం. ముప్పయి రెండు సంవత్సరాల క్రిందట నాకు తిలోదకాలను యిచ్చిన వాడితో చెప్పండి. ముగ్గురు బిడ్డలతో కలిసి నేను ఆనందంగా బ్రతుకుతున్నానని.. నా పెద్దకొడుకు డాక్టర్.. రెండవ వాడు లాయర్.. మూడవవాడు పి. ఆర్. ఓ ఎదిగి బాగా ప్రయోజకులైనారని పదిమంది మెప్పును మన్ననలను పొందుతూ ఎంతో గౌరవంగా బ్రతుకుతున్నారని వాడికి చెప్పండి" కాస్తంత ఆవేశంగానే చెప్పింది శారద.
"తప్పకుండా చెబుతానమ్మా!.. చెబుతాను. పేదవాడైన పాండురంగను నీవు ప్రేమించి పెళ్ళి చేసుకొన్నందున నిన్ను వెలివేశాడు. ఆ గతాన్ని తలచుకొని నేను అప్పుడప్పుడూ నీవు ఎక్కడ వున్నావో.. ఎలా వున్నావో అని బాధ పడుతుంటానమ్మా!.. నీవు చెప్పిన మాటలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి తల్లీ. అమ్మా!.. పాండురంగ.. "
"వారు గతించి దాదాపు ఇరవై సంవత్సరాలు అయింది మామయ్యా!" విచారంగా చెప్పింది శారద.
నలుగురూ శివాలయానికి వెళ్ళి జగత్ మాతాపితలను దర్శించి స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోయారు.
*
భామ ఆఫీసు గదిలో ప్రవేశించింది. కేసు కట్టలను పరిశీలిస్తున్న రాంబాబు ఆమె రాకను గమనించి తలెత్తి చూచాడు.
"రాంబాబు గారూ!.. మీరు నాకు మా అక్క మానసకు ఎంతో సాయం చేశారు. మీ మేలును మేము ఈ జన్మలో మరిచిపోలేము"
"అది నా ధర్మంగా భావించానే కాని.. అందులో అతిశయోక్తిగాని ప్రశంశల ఆశ గాని లేదు. "
"సార్!.. నేను మీతో వాదనకు రాలేదు. నాదో విన్నపం.. "
"ఏమిటది?"
"మనం మరో అరగంటలో విశాఖపట్టణానికి బయలుదేరాలి. కారణం ఏమిటని మీరు అడగకూడదు. "
రాంబాబు.. ఆశ్చర్యంతో భామ ముఖంలోకి చూచాడు.
"ప్లీజ్! త్వరగా రెడీ కండి" చెప్పి భామ వెళ్ళిపోయింది.
’ఒరేయ్!.. రాంబాబు!.. ఈ పిల్ల మనస్తత్వం ఏమిటో నీకు అర్థం కాలేదు కదూ!’
’అవును.. చిత్రమైన క్యారెక్టర్.. ’ అనుకొన్నాడు రాంబాబు.
*
రోడ్లో పడివున్న డైభ్బై ఏళ్ళ రోగిని శ్యాంబాబు తన హాస్పిటల్‍కు తరలించి చికిత్స చేశాడు. అతను క్యాన్సర్ పేషంట్. లాస్ట్ స్టేజ్. కొన్ని గంటల్లో అతను మరణిస్తాడు. అన్నీ తెలిసినా.. ఒక డాక్టరుగా చివరి క్షణం వరకూ రోగిని రక్షించి ప్రాణాలను నిలబెట్టే ప్రయత్నం.. ప్రతి డాక్టర్ కర్తవ్యం. అదే చేశాడు ఆ వ్యక్తి విషయంలో శ్యాంబాబు.
ఆ వ్యక్తికి స్పృహ వచ్చింది. అతని స్థితి అతనికి బాగా తెలుసు. ప్రక్కన వున్న నర్సుతో డాక్టరు గారిని పిలవమని చెప్పాడు. నర్స్ విషయాన్ని శ్యామ్ బాబుకు చెప్పింది. అతను మృత్యు ముఖంతో వున్న ఆ వ్యక్తిని సమీపించాడు.
"సార్!.. ఇది నా మరణ వాగ్మూలం. కొద్ది నిముషాల్లోనే నేను చచ్చిపోతానని నాకు తెలుసు. శారద అనే ఒక మాహా యిల్లలి జీవితాన్ని నేను నాశనం చేశాను. ఉద్యోగం ఆశను చూపించి ఆమెను ఆమె భర్తను బాంబేకి తీసుకొని వచ్చాను. పరుగిడే బస్సు నుంచి ఆమె భర్తను క్రిందికి తోసి చంపాను. ఆమెను దుబాయ్ షేక్‍కు అమ్మాను. ఆమె కవల పిల్లలు. రెండు సంవత్సరాల వారిని వేరుచేసి.. ఒకరిని నెల్లూరు చర్చి వాకిట.. మరొకరిని గుంటూరు మసీద్ ముందు వదిలాను. నా దారిన నేను వెళ్ళిపోయాను.
ఆనాడు నేను అహంకారంతో చేసిన ఆ పాపాల ఫలితమే నాకు ఈనాడు ఈ రోగం. ఆ పిల్లల పేర్లు.. గోపాల్, గోవింద్. ఆ తల్లి పేరు శారద్. ఆమె భర్త పేరు పాండురంగ. వారి స్వస్థలం శ్రీకాళహస్తి. అయ్యా!.. వరుసకు నేను మా అమ్మకు బావను. ఈ పాపిని క్షమించగలరా!" దీనంగా కన్నీటితో శ్యాంబాబు ముఖంలోకి చూస్తూ వున్న అతని తల ఒరిగిపోయింది.
శ్యాంబాబు కొన్ని క్షణాలు.. మౌనంగా అతని ముఖాన్ని చూస్తూ.. అతను చెప్పిన కథకు తన తల్లి చెప్పిన గతానికి వున్న సంబంధాన్ని గురించి ఆలోచిస్తూ నిలబడి పోయాడు. బాబు.. అన్నను సమీపించాడు. విషయాన్ని గ్రహించిన బాబు అతని ముఖంపై తెల్లగుడ్డను కప్పాడు. ఇరువురూ మౌనంగా ఆ గదినుండి బయటకు నడిచారు.
ఒక మనిషిని ఏర్పాటు చేసి.. శ్యాంబాబు మానవతా వాదంతో ఆ వ్యక్తి అంతిమ క్రియను జరిపించాడు. స్మశానాన్నించి తిరిగి వస్తూ.. ’బాబూ!.. అమ్మ జీవితాన్ని నాశనం చేసింది అతనే’ అన్నాడు. ’అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ!.. అలాంటి వారే.. మా అన్నయ్య’ అనుకొన్నాడు బాబు.
*
భామ, శ్యాంబాబు పర్మిషన్‍తో ఆవేశంగా అతని ఆఫీసు గదిలో ప్రవేసించింది. ఆమె రుద్ర రూపాన్ని చూచి శ్యాం ఆశ్చర్యపోయాడు.
"మీ మీద నాకు ఇష్టం లేదు. నేను మిమ్మల్ని వివాహం చేసుకోను. జరిగిన నిశ్చితార్థం చెల్లదు. మీరు ఇంతకు ముందే ఒక ఆడపిల్లను ప్రేమించి.. మోసం చేసి నాతో వివాహానికి సిద్ధపడ్డారు. మీ కథంతా నాకు తెలిసిపోయింది మిస్టర్ శ్యాంబాబూ!" ఎంతో ఆవేశంగా చెప్పి గదినుండి బయటికి వచ్చి అక్కడ నిలబడి వున్న మానస చేతిని పట్టుకొని ఆ గది తలుపును తెరిచి, లోనికి నెట్టి తలుపు మూసి ఆగ్రహావేశాలతో కుర్చీలో కూర్చుంది.
వూహించని రీతిలో.. దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత తన ముందు ప్రత్యక్షమైన మానసను చూచి శ్యాంబాబు ఆశ్చర్యపోయాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు.
కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా సాగిపోయాయి. తర్వాత.. మెల్లగా మానసను సమీపించి..
"మానసా!.. "
మానస తలెత్తి అతని ముఖంలోకి చూచింది. ఆమె కళ్ళల్లో కన్నీరు. భోరున ఏడ్చింది.
తన చేతి రుమాలుతో మానస కన్నీటిని తుడిచాడు శ్యాంబాబు. ప్రక్కన వున్న సోఫాలో కూర్చోపెట్టాడు.
"మానసా!.. నీకు భామను ఏమిటి సంబంధం? నీ విషయంలో నేనేం తప్పు చేశానో చెప్పగలవా?"
"నాతో ఒక్కమాట కూడా చెప్పకుండా మీరు రష్యా వెళ్ళిపోవడమే మీరు చేసిన తప్పు. భామ నా చెల్లితో సమానం"
"మానసా! నేను వ్రాసిన ఉత్తరం నీకు చేరలేదా!"
"లేదు"
ఇరువురూ వారి వారి గతాన్ని గురించి వివరంగా మాట్లాడుకొన్నారు. వారి మనస్సుల్లో వున్న మబ్బు తెరలు వీడిపోయాయి.
"నేను భామతో వివాహానికి అంగీకరించేదానికి కారణం.. మా అమ్మ ఆనందం కోసం.. నేను నిన్ను మరువలేదు.. మోసం చేయలేదు మానసా!" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు శ్యాంబాబు.
క్షణం తర్వాత..
"నాకు నీ గత చరిత్ర అనవసరం. నీవు నాతో వివాహానికి సిద్ధమేనా మానసా!" అభ్యర్థనగా అడిగాడు శ్యామ్.
సిగ్గుతో తలవంచుకొని ’సరే’ అన్నట్లు తలాడించింది మానస. నవ్వుతూ వెళ్ళి తలుపు తెరిచాడు శ్యాంబాబు. అతని ప్రక్కకు వచ్చి నవ్వుతూ నిలబడింది మానస. విషయాన్ని గ్రహించిన భామ ముఖంలో ఎంతో ఆనందం.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
![](https://static.wixstatic.com/media/acb93b_5b9cf161e7bf4d898862e25c0f9ebe83~mv2.jpeg/v1/fill/w_865,h_1156,al_c,q_85,enc_auto/acb93b_5b9cf161e7bf4d898862e25c0f9ebe83~mv2.jpeg)
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments