#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Prema Tharangalu - Part 2 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 13/11/2024
ప్రేమ తరంగాలు - పార్ట్ 2 తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.
సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 2 చదవండి.
అది వీకెండ్ శనివారం. సోదరి నందిని, అల్లుడు ధనుంజయ్, కోడలు పల్లవి... ముకుందవర్మకు ఎంతో ఆదరాభిమానాలతో స్వాగతం పలికారు.
ఆ సాయంత్రం.... నాలుగు గంటల ప్రాంతంలో... ముకుందవర్మ, పరమశివం కలిసి మురళీధర్ వుండే ప్రాంతానికి వెళ్ళారు. అతన్ని గురించి విచారించారు. నిన్న సాయంత్రం గాల్‍విస్టన్ నగరానికి అతను వెళ్ళిపోయినట్లు సమాచారం తెలిసింది.
"బావా!.... గాల్‍విస్టన్ నగరం గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీర నగరం... సముద్ర తీరంలో వీకెండ్... జాలీగా గడిపేదానికి ఇరువురూ కలిసి వెళ్ళి వుంటారు. బహూశా... రేపు సాయంత్రానికి తిరిగి వస్తారనుకొంటాను" అన్నాడు పరమశివం.
ముకుందవర్మ మౌనంగా వుండిపోయాడు.
బదులు పలుకని బావగారి ముఖంలోకి చూచాడు పరమశివం. ముకుందవర్మ ముఖం.... అతనికి చాలా దీనంగా గోచరించింది. కారును తాను నడుపుతున్నందున చూపును రోడ్డువైపుకు సారించి...
"బావా!.... బాధపడుతున్నావా!" మెల్లగా అడిగాడు పరమశివం.
"లేదు బావా!.... ఈ సమస్య ఈరోజే పరిష్కారం అవుతుందనుకొన్నాను. మరో రోజుకు వాయిదా పడిందే... రేపటి పరిస్థితులు ఎలా వుండబోతాయో అనే ఆలోచన" విచారంగా చెప్పాడు ముకుందవర్మ.
"బావా!.... భామ వాడి తత్త్వాన్ని అర్థం చేసుకొనేటందుకు అతనితో ఈ డేటింగ్ చేస్తుందని, వారి మధ్యన ఎలాంటి తప్పు జరిగేదానికి అవకాశాన్ని ఆ మురళీధర్‍కు యివ్వదని నా నమ్మకం. షి ఈజ్.. ఎంత మోడ్రనో.... అంతకు పదింతలు ధైర్యం, విల్ పవర్ వున్న పిల్ల. మీరు అనవసరంగా భయపడకండి." అనునయంగా చెప్పాడు పరమశివం.
"బావా!.... ఆడపిల్లల జీవితం... అరటి ఆకులాంటిది. అది... గాలి ముల్లుకు తగిలినా... ముల్లు అరటి ఆకుకు తగిలినా... నష్టం అరటి ఆకుకే. ఈనాటి కొందరు ఆడపిల్లలు ఈ విషయాన్ని మరచి మగపిల్లలతో విచ్చలవిడిగా సంచరిస్తున్నారు. ఎదుటి వ్యక్తి నిజమైన స్నేహభావంతో వర్తిస్తే... ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. కానీ ఆ వ్యక్తి లింగ భేదంతో, వ్యామోహంతో చేయరాని పనిచేస్తే... నష్టం ఆడపిల్లకే కదా బావా!..." విచారంగా అడిగాడు ముకుందవర్మ.
కొన్నిక్షణాల తర్వాత....
"బావా!..... నేను నిన్ను ఒకమాట అడగాలనుకొంటున్నాను. అడగనా!" అడిగాడు ముకుందవర్మ.
పరమశివం... చిరునవ్వుతో.... "బావా!.... నీవు నను అడగాలనుకొన్నదేమిటో.... నేను చెప్పనా!" అన్నాడు.
ముకుందవర్మ కళ్ళు పెద్దవి చేసి పరమశివం ముఖంలోకి చూచాడు.
"నీ మనస్సులో వున్నదేమిటో నాకు తెలుసు బావా!"
"ఆ... అయితే చెప్పు..."
"ధనుంజయ్‍కి, సత్యభామకు వివాహం చేయాలని దానికి నా అభిప్రాయం ఏమిటని అడగాలనుకొంటున్నావు కదూ!..."
"అవును పరమ.... ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి?"
"నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు బావా!... కానీ నీ చెల్లెలు.... సత్యను తన కోడలిగా చేసికొనేటందుకు అంగీకరించదని నా అభిప్రాయం."
"దానికి కారణం.... భామ చేసే... ఆ డేటింగే కారణం కదూ!" విచారంగా అన్నాడు ముకుందవర్మ.
"సత్య యిక్కడికి వచ్చినప్పటి నుంచీ నేను నందినీని గమనిస్తూనే వున్నాను. భామ తనకు కాబోయే కోడలనే రీతిలో నందినీ ఏనాడు సత్యతో మాట్లాడలేదు. దగ్గరి చుట్టాన్ని చూచినట్లే చూస్తూ వుంది. బావా!.... మనం ఒకేచోట చిన్ననాటి నుంచీ కలిసి మెలసి చదువుకొన్నాము. పెరిగి పెద్దవాళ్ళ మైనాము. బాంధవ్యం కన్నా... మన మధ్య వున్నది మంచి స్నేహం. పవిత్రమైన ప్రేమ బంధం. నేను ఏనాడూ నీతో అబద్ధం చెప్పలేదు. చెప్పబోను. అది ఎవరి విషయంలోనైనా సరే.... నా బావను నేను ఎన్నటికీ మోసం చేయలేను. అది నా తత్త్వం" అనునయంగా చెప్పాడు పరమశివం.
"పరమా!... నీ గురించి నాకు తెలియదా!... నీవు యదార్థవాదివి. రేయ్!.... ధనుంజయ్‍కి భామ పట్ల ఎలాంటి అభిప్రాయం వుందో గ్రహించావా!"
"వాడు భామతో సరదాగా మాట్లాడుతాడు. భామను వెక్కిరిస్తూ వుంటాడు. వాడి ధాటికి తట్టుకోలేక... బుంగమూతితో భామ నాతో ’మామయ్యా!.... బావ చూడండీ నన్ను క్రిటిసిజం చేస్తూ ఏడిపిస్తున్నాడు’ అని నాతో చెప్పిన సందర్భాలు ఎన్నో వున్నాయ్" నవ్వుతూ చెప్పాడు పరమశివం.
"అంటే.... నీవు ’భామను పెండ్లి చేసుకోవాలి’ అని వాడికి చెబితే... నీ మాటను వింటాడంటావా!" ఆశగా పరమశివం కళ్ళల్లోకి చూచాడు ముకుందవర్మ.
క్షణంసేపు ముకుందవర్మ ముఖంలోకి చూచి తలను రోడ్డువైపుకు సారించాడు పరమశివం.
"బావా!... నీ ఈ ప్రశ్నకు... నీకు ఆనందం కలిగేలా నేను యిప్పట్లో జవాబు చెప్పలేను" మెల్లగా చెప్పాడు పరమశివం.
కారు వారి భవంతి పోర్టికోలో ఆగింది.
’అవును... భామ విషయాన్ని తెలిసిన ధనుంజయ్ తన తండ్రి అడిగినా.... ఆమెతో వివాహానికి ఎలా ఒప్పుకుంటాడు?.... ఎదిగిన కొడుకుతో ఆ విషయాన్ని గురించి పరమశివం ఏరీతిగా చెప్పగలడు? వాడు కాదంటే.... అది పరమశివానికి అవమానం కదా!’ యిలాంటి అశాంతిపూరిత ఆలోచనలతో ముకుందవర్మ కారు దిగి పరమశివాన్ని మౌనంగా అనుసరించాడు.
హాల్లో కూర్చొని వున్న నందిని వారిని చూచి... "భామ కనిపించిందా!" అడిగింది.
లేదు అన్నట్లు పరమశివం తలాడించాడు.
అన్న... ముకుందవర్మ ముఖంలోకి చూచింది నందిని. వారి వదనం అప్రసన్నంగా అతని హృదయ ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉంది.
"బాధపడకన్నయ్యా!..... అన్నీ త్వరలో సర్దుకుంటాయ్. ఇది మనకు పరీక్షాకాలం" విచారంగా అంది నందిని.
డాక్టర్ ధనుంజయ్‍కు నైట్ డ్యూటీ. అతను ఆ బావ మన మరుదులు యింటికి చేరకముందే హాస్పిటల్‍కు వెళ్ళిపోయాడు.
పేరుకు... ఏదో ఎంగిలి చేసి ముకుందవర్మ పడుకొన్నాడు. నిద్ర రావడం లేదు. మనసంతా భామను గురించిన కలవరం.
’తాను భామకు యిచ్చిన స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలను ఆమె దుర్వినియోగం చేసింది. ఎంత చదివినా సంస్కారం లేని విజ్ఞానం.... అడవి కాచిన వెన్నెలే అవుతుంది. భామలో వున్నది కేవలం తన స్వార్థం. తల్లీ తండ్రి.... అత్త మామ.... అయినా వారి విషయంలో అణుమాత్రమంతైనా గౌరవాభిమానాలు లేవు. సాధారణంగా ఆ వయస్సులో కొందరు యువతీ యువకులకు అహంకారం... ఆవేశం తప్ప... మంచి చెడ్డలను గురించి ఆలోచించే విచక్షణా జ్ఞానం వుండదు. భామ ఆ వర్గానికి చెందినదే అయింది. ఆమెను రక్షించకలిగినది ఆ భగవంతుడే...’ తెగని ఆలోచనలతో... వికలమైన మనస్సుతో గట్టిగా కళ్ళు మూసుకొన్నాడు ముకుందవర్మ.
*
మరుదినం ఉదయం... ఆరున్నరకల్లా పరమశివం, ముకుందవర్మలు రెడీ అయ్యారు. వారు వుండే ప్రాంతం నుండి గంటసేపు కార్లో పయనిస్తే... మురళీధర్ వుండే ప్రాంతానికి చేరుకోగలరు. కనీసం ఏడున్నరకల్లా అక్కడికి చేరి... సత్యభామను మురళీధర్‍ను కలవాలని వారు నిర్ణయించుకొన్నారు. కారును సమీపించారు.
అదే... సమయానికి నైట్ డ్యూటీ ముగించుకొని వచ్చిన ధనుంజయ్ కారు పోర్టికోలో ఆగింది.
కారు దిగి... ఎదురైన తండ్రి మామయ్యలకు గుడ్ మార్నింగ్ చెప్పి... ధనుంజయ్ యింట్లోకి వెళ్ళిపోయాడు.
ఆ యిరువురూ కార్లో కూర్చున్నారు. వారి కారు వీధిలో ప్రవేశించింది.
’ఈ ప్రయత్నం అన్నా ఫలించి భామ కనిపిస్తే బావ మనస్సు కొంతవరకు శాంతి కలుగుతుంది’ అనుకొన్నాడు పరమశివం.
’నాకోసం లీవు పెట్టి పరమశివం నాతో తిరుగుతున్నాడు. శ్రమపడుతున్నాడు. నా సమస్యను పరిష్కరించాలనుకొంటున్నాడు. వీడి సాయం లేకపోతే నేను ఈ దేశం కాని దేశంలో ఒంటరిగా ఏం చేయగలను? భామను ఎక్కడ ఉందని వెదకగలను? భగవాన్.... వాడి ప్రయత్నం ఫలించి... నా ఆవేదన తీరేలా చూడు తండ్రీ.... నీకు శతకోటి వందనాలు’ విచారంగా ఆ దేవుని వేడుకొన్నాడు ముకుందవర్మ.
గంటలోపుగానే వారు ఆ ప్రాంతానికి చేరారు. మురళీధర్ వుండే క్వార్టర్‍ను సమీపించారు. ఆ ఫ్లాట్‍కు తాళం వేసి ఉంది. ప్రక్క ఫ్లాట్‍లో విచారిస్తే నాలుగు రోజులుగా మురళీధర్ కనిపించలేదని... ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్పారు.
ఆ విషయాన్ని విన్న ముకుందవర్మ.... పరమశివం దిగాలు పడిపోయారు. ముకుందవర్మ కళ్ళల్లో కన్నీరు. తన ఈ ప్రయత్నం ఈనాడు ఫలించనందుకు పరమశివం వదనంలో విచారం.
మౌనంగా ఎవరి బాధలో వారు కారును సమీపించి కూర్చున్నారు.
"బావా!.... ఇప్పుడు ఏం చేద్దాం!" మెల్లగా అడిగాడు పరమశివం.
"ఈరోజు సోమవారం కదా బావా! వాళ్ళు ఆఫీసుకు వెళ్ళాలిగా రావడంలో ఆలస్యం అయిందేమో!... కొంతసేఫు వెయిట్ చేసి చూద్దాం బావా!" దీనంగా చెప్పాడు ముకుందవర్మ.
"సరే బావా!... అలాగే"
కార్లో కూర్చొని ఆ యిరువురూ.... ఎవరి ఆలోచనలలో వారు వుండిపోయారు.
గంట ఎనిమిదిన్నర అయింది... వారు రాలేదు. వారిరువురూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొంటూ నిట్టూర్పులతో సమయాన్ని గడిపారు.
గంట పది... సత్యభామ, మురళీధర్‍ల జాడలేదు.
"బావా!.... ఒకవేళ వారు నేరుగా ఆఫీసుకు వెళ్ళి వుంటారేమో!" ఆశగా పరమశివం ముఖంలోకి చూస్తూ అడిగాడు ముకుందవర్మ.
"అయ్యి వుండవచ్చు.... వెళ్ళి ఆఫీసులో విచారిద్దాం బావా!" సాలోచనగా అన్నాడు. కారును స్టార్ట్ చేశాడు పరమశివం.
పదకొండు గంటలకు సత్యభామ... మురళీధర్ పనిచేసే ఆఫీసుకు చేరారు.
రిసిప్షన్‍లో వారిరువురిని అడిగారు. యిరువురూ... లీవులో వున్నారని, లీవు ఇంకా వారంరోజులు వుందని... వారు తెలియజేశారు.
అదే సమయానికి అక్కడికి ఒక అమెరికన్ యంగ్ ఉమెన్ రెండేళ్ళ బాబుతో రిసిప్షన్ కౌంటర్‍ను సమీపించింది. వారి సంభాషణ ఇంగ్లీషులో జరిగింది.
"మేడం.... మీరెవరు? ఎవరు కావాలి?"
"మురళీధర్... మై హస్బెండ్... నాపేరు న్యాన్‍సి"
"వారు లాంగ్‍లీవులో వున్నారు. వారం రోజుల తర్వాతే... ఆఫీసుకు వస్తారు."
"అలాగా!"
ఆ యువతి ముఖం వెలవెల పోయింది. వేగంగా వెళ్ళి కార్లో కూర్చొని వెళ్ళిపోయింది.
ఆ సంభాషణను విన్న ముకుందవర్మ... పరమశివం ఆశ్చర్యపోయారు.
ఆమె ఎవరు? అంటే.... ’యిప్పుడు వచ్చి వెళ్ళిన యువతి మురళీధర్ భార్యనా!’ ఆ బావమరుదుల మస్తిష్కంలో ఒకే ప్రశ్న!... ఆశ్చర్యం!....
యిరువురూ మెల్లగా నడిచి కారును సమీపించారు.
"బావా!...."
విచారవదనంతో అయోమయస్థితిలో... దీనంగా పరమశివం ముఖంలోకి చూచాడు ముకుందవర్మ.
"ఆ తెల్లపిల్ల రిసెప్షనిస్టుతో చెప్పిన మాటలు నీకు అర్థం అయినాయా!" మెల్లగా అడిగాడు పరమశివం.
"సరిగా అర్థం కాలేదు"
"ఆ పిల్లలు, ఆమె మురళీధర్ భార్య అట!"
"ఆఁ...."
"అంటే!"
"ఆ మురళీధర్ ఆ యువతిని వివాహం చేసుకొన్నాడనేగా అర్థం?"
పరమశివం చెప్పిన మాట విని ముకుందవర్మ ఆశ్చర్యపోయాడు.
"అంటే వాడు సత్యభామను...."
"మోసం చేసి ఆమె..."
"బావా!.... నీ నోటితో ఆ మాట అనకు నేను వినలేను" భోరున ఏడ్చాడు ముకుందవర్మ.
అతని స్థితిని చూచిన పరమశివం.... కళ్ళల్లో కూడా నీళ్ళు నిండాయి.
ముకుందవర్మ భుజంపై చెయ్యి వేసి... "బావా!... బాధపడకు. మనలనే అందరూ వింతగా చూస్తున్నారు. పద... యింటికి వెళ్ళి మాట్లాడుకొందాం." అనునయంగా చెప్పాడు పరమశివం.
ముకుందవర్మను కార్లో కూర్చోపెట్టాడు. తాను డ్రైవర్ స్థానంలో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు.
"బావా!... బి బ్రేవ్. మన భామ చాలా తెలివిగల పిల్ల. ఆమెను సులభంగా ఎవరూ మోసం చేయలేరు."
"నీవు ఏ ఉద్దేశ్యంతో ఈ మాటను చెబుతున్నావో నాకు అర్థం అయ్యింది బావా!.... కానీ, నీవు నాకు పంపిన మెసేజ్‍లో భామ వాణ్ణి ప్రేమించి డేటింగ్ చేస్తూ వుందన్నావుగా!.... అలాంటప్పుడు ఆ మురళీధర్ మాయ మాటలను మన పిల్ల నమ్మి...."
"బావా!... ప్రేమించి ఉండవచ్చు. కానీ పెండ్లికి ముందే అవసరపడే తత్త్వం... హద్దులు మీరడం అనే ఆలోచనలు.. మన భామకు కలగవనీ... వాడితో డేటింగ్‍కు ఒప్పుకొన్నది, వాణ్ణి బాగా స్టడీ చేసేటందుకేనని నా అభిప్రాయం." అనునయంగా చెప్పాడు పరమశివం.
సెల్‍లో మెసేక్ వచ్చిన శబ్దం. పరమశివం మెసేజ్‍ని ఓపెన్ చేసి పరీక్షగా చూచాడు.
’ప్రియమైన మామయ్యగారికి...
మీకు నేనంటే ఎంత యిష్టమో నాకు బాగా తెలుసు. అత్తయ్య కంటే మీరే నన్ను ఎక్కువగా అభిమానిస్తారు. నన్ను.... పల్లవినీ ఒకే రీతిగా చూచుకొంటారు. మురళీధర్ విషయంలో.. నేను మీ మాటను కాదన్నందుకు నన్ను క్షమించండి. వాడికి మూడేళ్ళ క్రిందట న్యాన్‍సీ అనే ఆంగ్ల యువతితో వివాహం జరిగింది. ఒక మగబిడ్డ కూడా!.... ఆ దేవుడు ఆ రాక్షసుడి బారి నుండి నన్ను కాపాడాడు. వాడు యింట్లో లేని సమయంలో వాడికోసం వచ్చిన న్యాన్‍సీ నాకు పై విషయాన్ని చెప్పింది. వాడు నన్ను మోసం చేశాడు. వాడి నిజరూపం తెలిసిన తర్వాత... నేను నా తప్పును తెలుసుకొన్నాను. ఇండియాకు వెళ్ళిపోతున్నాను. మీతో ఒక్కమాట కూడా చెప్పకుండా నేను తీసుకొన్న నిర్ణయానికి నన్ను మన్నించండి. అమ్మా నాన్నలతో అంతా చెప్పి... నేను మీకు ఫోన్ చేస్తాను.’
ఇట్లు
సత్యభామ
మెసేజ్ సాంతం చదివేసరికి పరమశివం ముఖంలో ఎంతో ఆనందం.
"బావా!... మన భామ క్షేమంగా ఉంది. ఇండియాకు బయలుదేరింది. ఈ మెసేజ్ చూడు" నవ్వుతూ తన ఐ ఫోన్‍ను ముకుందానికి అందించాడు పరమశివం.
ముకుందవర్మ ఆత్రంగా ఆ ఫోన్‍ను తన చేతికి తీసుకొన్నాడు. మెసేజ్‍ని సాంతం చదివాడు. అతని ముఖంలో ఆనందం. నవ్వుతూ పరమశివం ముఖంలోకి చూచాడు. అతని నయనాల్లో కన్నీరు.
"భగవాన్!... నా బిడ్డను కాపాడి యింటికి చేర్చుతున్నందుకు నీకివే నా ప్రణామాలు" చేతులు జోడించాడు.
"బావా!.... నేను చెప్పింది నిజం అయిందిగా. మన భామ తెలివిగా ఆ మురళీధర్ బారి నుంచి తప్పించుకొంది" నవ్వుతూ చెప్పాడు పరమశివం.
ఇరువురూ... ఆనందంగా యింటికి చేరారు. ఎదురైన నందిని... వారి ఆనందానికి కారణాన్ని అడిగింది. భామ ఇండియాకు వెళ్ళిపోయినట్లుగా పరమశివం.... భార్యకు తెలియజేశాడు.
తన సమస్య పరిష్కారానికి తనతో సహకరించిన పరమశివానికి ధన్యవాదాలు తెలియజేశాడు. ఆ మరుదినం.... బావ పరమశివం ఎయిర్‍పోర్టులో డ్రాప్ చేయగా... ఆనందంగా ఇండియాకు బయలుదేరాడు ముకుందవర్మ.
*
సత్యభామ ఎక్కిన అమెరికన్ ఎయిర్‍లైన్స్ విమానం పశ్చిమ దిశ నుండి తూర్పు దిశకు బయలుదేరింది. మురళీధర్ తనను ఫాలో చేసి బలవంతంగా తనతో ఈడ్చుకుపోతాడనే భయంతీరి శాంతంగా తన స్థానంలో కూర్చుంది.
డేటింగ్ పేర అతనితో కలిసి... పదిరోజులు గడిపింది సత్యభామ. డేటింగ్ ప్రారంభానికి ముందురోజున మురళీధర్‍కు తనకు జరిగిన సంభాషణ... ఆ పదిరోజుల్లో అతని ప్రవర్తన... ఆ చేదు జ్ఞాపకాలు... సత్యభామ మనోదర్పణం మీద ప్రతిబింబించాయి.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments