#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Prema Tharangalu - Part 3 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 20/11/2024
ప్రేమ తరంగాలు - పార్ట్ 3 తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.
సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు.
కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.
ఫ్లయిట్ లో మురళీధర్ తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 3 చదవండి.
"మురళీ!... నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?" అడిగింది భామ.
"నీకు మనిషి మీద... మాట మీద విశ్వాసం లేదా భామా!" ఆశ్చర్యంతో అడిగాడు మురళీధర్.
"నేను అడిగింది నీ ప్రేమను గురించి!"
"నాలో దాన్ని రేకెత్తించింది నీవే. అందుకే పిచ్చి కుక్కలా నీవు ఏమన్నా... నీవెంట తిరుగుతున్నాను. యింకా నీకు నా మాటల మీద విశ్వాసం లేదా!" విచారంగా అడిగాడు మురళి.
"సరే... మనం డేటింగ్ చేద్దాం. కార్యం కాని.... భార్యా భర్తలుగా నటిద్దాం. ఈ కార్యక్రమంలో నీవు నాకు, నీ ఇల్లాలికి ఇవ్వవలసిన గౌరవాన్ని.... చేయవలసిన సాయాన్ని చేయాలి. నేను నీ సహధర్మచారిణిగా నీ పట్ల నా బాధ్యతలను నెరవేరుస్తాను. మన పడక ఒకటి కాదు. వేరు వేరు. ఆ రోజుల్లో నా మాటలు, చర్యలు నీకు నచ్చకపోయినా.... నాకు నీ చర్యలు మాటలు నచ్చకపోయినా డేటింగ్ కట్ చేసి విడిపోయి... స్నేహితులుగా వుండిపోదాం.... దీనికి నీకు సమ్మతమా!"
"సమ్మతం...."
"మరోసారి చెబుతున్నాను. మనం ఆ డేటింగ్ పిరీడ్‍లో మనకు సినిమా తెరపై కనిపించే నాయికా నాయకుల వలెనే మసలుకోవాలి. వివాహమైన భార్యాభర్తల వలె కాదు" ఖచ్చితంగా చెప్పింది భామ.
"సరే.... నీ యిష్టం.... నన్ను కోరిన కోమలి కోర్కెను తీర్చడం నా కర్తవ్యం." నవ్వుతూ చెప్పాడు మురళీధర్.
అతని మాటలు భామను తృప్తిని... నమ్మకాన్ని కలిగించాయి.
ఆ మరుసటి దినం నుంచీ వారు ఒకేచోట వుంటూ డేటింగ్ సాగించారు.
ఓ వారం రోజులు ఆ ఇరువురూ వారి వారి పాత్రలను మాట్లాడుకొన్న రీతిలో ఆనందంగా ఒకరికొకరు యిష్టా.... అయిష్టాలను తెలుసుకొని వర్తిస్తూ.... ఆనందంగా గడిపారు.
పదిరోజులు సెలవు పెట్టి గాల్‍విస్టన్ నగరానికి వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో ఓ వారంరోజులు గడపాలని నిర్ణయించుకొన్నారు. బయలుదేరి అక్కడికి వెళ్ళిపోయారు.
అక్కడ ఆ ఇరువురు ఎంతో ఆనందంగా రెండు రోజులు గడిపారు. మూడవరోజు ఉదయం మురళీధర్ ఆరుగంటల కల్లా లేచాడు.
ఒళ్ళు... నలతగా ఉన్న కారణంగా భామ నిద్రపోతూ ఉంది. కాలింగ్ బెల్ మ్రోగింది. మురళీధర్ వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా నిలబడి వున్న న్యాన్‍సిని చూచి ఆశ్చర్యపోయాడు.
"నీతో వుండే ఆ పిల్ల ఎవరు?" కోపంగా అడిగింది న్యాన్‍సి.
"నాతో ఎవరూలేరు."
"సరే లోనికిపద"
"నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు?" న్యాన్‍సిని లోపలికి రానీయకుండా ద్వారానికి అడ్డంగా నిలబడి కోపంగా అడిగాడు మురళీధర్.
"నీవు నన్ను మోసం చేశావు. నీతో గదిలో ఒక ఆడపిల్ల వుంది" ఆవేశంగా అంది న్యాన్‍సి.
"అబద్దం. నేను యిక్కడికి ఆఫీస్ పనిమీద వచ్చాను. లోపల నా కోలిగ్ వున్నాడు. నీవు వెంటనే యిక్కడి నుంచి వెళ్ళిపో."
"నీవు చెప్పేది అబద్ధం. మనకు పుట్టిన ఈ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు. లోపల ఉన్నది నీ కోలిగ్‍నా లేక ఆడపిల్లనా!" న్యాన్‍సి బిగ్గరగా అరిచింది.
"లోపల వున్నది నా కోలిగ్. నీవు వెళ్ళిపో. ఐదు రోజుల్లో పని ముగించుకొని నేను వస్తాను."
"నీ ప్రతి మాటా అబద్ధం. నీవు నన్ను మోసం చేశావు. నేను నీ అంతు చూస్తాను. నిన్ను చంపేదానికి కూడా వెనుకాడను. జాగ్రత్త" ఆవేశంగా చెప్పి న్యాన్‍సి వెళ్ళిపోయింది.
నిద్రలేచిన భామ.... వారి సంభాషణంతా విన్నది. ఆమె శరీరం చెమటతో తడిసిపోయింది. న్యాన్‍సి మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. మురళీధర్ నిజరూపం ఆమెకు తెలిసిపోయింది.
మురళీధర్ తలుపు మూసి లోనికి వచ్చి భామను పరీక్షగా చూచాడు. దుప్పటి కప్పుకొని కదలకుండా నిద్రలోనే ఉన్నట్లు భామ నటించింది.
తనకు న్యాన్‍సికి మధ్య జరిగిన సంభాషణ భామ నిద్రపోతూ విననందుకు మురళీధర్ సంతోషించాడు. ఫ్రెష్ అయ్యేదానికి బాత్‍రూముకు వెళ్ళాడు.
న్యాన్‍సి రాకతో... భామకు మురళీధర్ వ్యక్తిత్వం తేటతెల్లం అయ్యింది. అతను.. భామ తల్లిదండ్రులకు ఒకే ఆడపిల్ల అని ఎంతో ఆస్థి వుందని... ఆమెను ప్రేమించినట్లు నటించి భామను తనదాన్ని చేసుకోవాలని... తనతో యింతగా నటించాడనే విషయం స్పష్టంగా అర్థం అయ్యింది.
తాను విన్న సంభాషణ.... భామకు తన కర్తవ్యాన్ని గుర్తుచేసింది. యిప్పటివరకూ నటించినట్లుగానే నటించి మురళీధర్‍ను నమ్మించి... సమయం చూచుకొని అతని బారినుండి తప్పించుకొని ఇండియాకు వెళ్ళిపోవాలని భామ నిర్ణయించుకొంది. ధైర్యాన్ని కూడగట్టుకుంది. ఇంతవరకూ సహజంగా నటించిన దానికన్నా మిన్నగా నటించి... అతనిని నమ్మించి హోస్టన్ చేరగానే... సమయం చూచుకొని అతని చెరనుండి పారిపోవాలని తీర్మానించుకొంది.
మరో రెండురోజులు అసలైన నట జీవితాన్ని మురళీధర్‍తో తియ్యని మాటలతో... వారి భావి వైవాహిక జీవితపు ముచ్చట్లతో... నవ్వులతో కేరింతలతో.... మురళీధర్‍ను ఎంతగానో ప్రేమించినట్లు నటించి... అతడు నమ్మేలా చేసింది భామ.
హోస్టన్ చేరిన రోజున.... తనకు చాలా అలసటగా వుందని రెస్టు కావాలని లాలనగా మురళీధర్‍కు చెప్పి... అతను ఆఫీసుకు వెళ్ళిపోయాక ఇండియాకు తన టికెట్‍ను బుక్ చేసుకొంది.
ఆత్రంగా సాయంత్రం యింటికి వచ్చిన మురళీధర్ భామ ప్రక్కన కూర్చొని ప్రీతిగా పలకరించాడు. అతి నీరసాన్ని ప్రదర్శిస్తూ భామ ’ఆరోగ్యం చెడిపోయింది’ అంది.
భామ చేయవలసిన పనులన్నీ మురళీధర్ చేశాడు. తన చేత్తో భోజనాన్ని ఆమె నోటికి అందించాడు.
’రేపు కూడా నీవు విశ్రాంతి తీసుకో’ అని ప్రేమగా చెప్పాడు.
మరుదినం... మురళీధర్ ఆఫీసుకు వెళ్ళగానే భామ ఎయిర్‍పోర్టుకు వచ్చి విమానం ఎక్కేసింది.
"ఎక్స్ క్యూజ్‍మి" ఎయిర్‍హోస్టర్ పిలుపు విని భామ కళ్ళు తెరిచింది.
"విస్కీ ప్లీజ్"
"నో థాంక్యూ"
తన ప్రక్కన కూర్చొని వున్న ఇండియన్ యువతి ఎయిర్ హోస్టర్ అందించిన గ్లాసును అందుకొంది. వితవుట్ బ్రేక్ త్రాగేసింది. ఎయిర్ హోస్టర్‍ను పిలిచి మరో గ్లాస్ అందుకొంది.
భామ... ఆ యువతి చూపులు కలిశాయి. ఆ యువతి ముఖం కళావిహీనంగా పస్తులు వున్న ముఖంలా నిర్జీవంగా... వ్యాధిగ్రస్థురాలిలా వుంది.
"మీది ఇండియానా!" అడిగింది భామ.
అవునన్నట్లు ఆమె తలూపింది.
"నా పేరు సత్యభామ... మీపేరు?" చిరునవ్వుతో అడిగింది భామ.
"మానస" చేతిలోని విస్కీని సిప్ చేస్తూ చెప్పింది.
"యిక్కడ అదే.... అమెరికాలో ఏం చేస్తుంటారు?" అడిగింది భామ.
"వూడిగం..."
భామ ఆ మాట విని ఆశ్చర్యపోయింది. కొన్ని క్షణాలు ఆమె ముఖంలోకి పరీక్షగా చూచింది. ఆమె ఏ కారణంగానో చాలా విచారంగా వున్నట్లు భామకు తోచింది.
"మీకు వివాహం అయిందా!"
"అయింది..."
"మీవారేం చేస్తుంటారు?"
"అందమైన... కలిగిన ఆడపిల్లలను వేటాడుతూ వుంటాడు. నీచుడు..." గ్లాసులోని విస్కీని గొంతులో పోసుకొని కళ్ళు మూసుకొంది మానస.
అంతవరకూ ఆమె కళ్లల్లో సుళ్ళు తిరుగుతున్న కన్నీరు చెక్కిళ్ళ పైకి దిగజారాయి.
"ఏ విషయానికో.... మీరు చాలా బాధపడుతున్నట్లున్నారు!" మాసన ముఖంలోకి చూస్తూ మెల్లగా అడిగింది భామ.
"అవును..." కళ్ళు తెరవకుండానే మానస ఇచ్చిన జవాబు.
"మాది నెల్లూరు... మీది ఏ వూరు?"
"విజయనగరం..."
"మీ వివాహం జరిగి ఎంతకాలం అయింది"
"దాదాపు సంవత్సరం..."
"మీరు అమెరికాకు ఎప్పుడు వచ్చారు?"
"పెండ్లి అయిన ఐదవరోజు"
"మీవారి పేరు?"
మాసన కళ్ళు పెద్దవిగా చేసి భామ ముఖంలోకి చూచింది.
"నేను అడిగింది మీకు తప్పుగా తోస్తే.... నన్ను మన్నించండి" ప్రాధేయపూర్వకంగా చెప్పింది భామ.
"మిమ్మల్ని చూస్తుంటే... నాకు నా చెల్లి మాధురి గుర్తుకు వస్తూవుంది." విరక్తిగా నవ్వింది మానస.
"నాకు ఒక చిన్న తమ్ముడు వున్నాడు. పేరు ఆనంద్ వర్మ. వాడి వయస్సు పదిహేను. ప్లస్ టు చదువుతున్నాడు. మా నాన్నగారి పేరు ముకుందవర్మ. వారు అడ్వకేట్. అమ్మపేరు నీలవేణి. హోం మేకర్.
మా నాన్నగారి పేరు సత్యనారాయణ. అమ్మ రాజ్యలక్ష్మి. నాన్నగారికి ఉద్యోగం లేదు. వ్యవసాయదారుడు. ఇరువురి వయస్సు అరవైకి పైనే. ఆ కాలంలో వారిది లవ్ మ్యారేజ్ అట" చిరునవ్వుతో చెప్పింది మానస.
"అలాగా!...."
"అవును.. మా అమ్మ, మా నాన్నగారి అక్క కూతురే!"
క్షణం తర్వాత..."నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నిజం చెప్పాలి సుమా!"
"అడగండి. నాకు తెలిసిన నిజాన్ని చెబుతాను."
"నేను మీ కళ్ళకు ఎలా కనబడుతున్నాను."
భామ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి మానస ముఖంలోకి చూచింది.
"ఏం అలా చూస్తున్నారు!" అడిగింది మానస.
"మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. ప్రస్తుతంలో మీరు ఏదో సమస్యతో బాధపడుతున్నట్లున్నారు. యిక... అందచందాల విషయానికి వస్తే... మీరు ఐశ్వర్యరాయ్‍లా వున్నారు" నవ్వుతూ చెప్పింది భామ.
"అందం ఆడదానికి శత్రువు అంటారు. ఈ విషయంలో మీ అభిప్రాయం?"
"అది తప్పా రైటా అనే విషయాన్ని నేను చెప్పలేను కాని... యుక్తవయస్సు ఆడపిల్లల పాలిటి...."
"నేను పూర్తి చేయనా..."
"చేయండి..."
"శాపం..." విరక్తిగా నవ్వింది మానస.
అవునన్నట్లు భామ సాలోచనగా తలాడించింది.
"నేను తప్పుగా చెప్పానా!"
"ఆలోచిస్తే మీరు చెప్పిన మాట నిజమేననిపిస్తూ వుంది."
క్షణం తర్వాత.... "అవునూ... మీవారు మీతో రాలేదా!"
"రాలేదు"
"కారణం?"
"మీకు నా కథ వినాలని వుందా!"
"చెప్పేదానికి మీకు అభ్యంతరం లేకపోతే..."
"వింటానంటారు..."
"అవును..."
"మీ పేరేమని చెప్పారు!"
"సత్యభామ... మీరు సత్య అని కాని, భామా అని కాని ఎలాగైనా పిలవచ్చు." నవ్వుతూ చెప్పింది భామ.
"నేను నిన్ను సత్య అని పిలుస్తాను."
"మీ యిష్టం... నేను మిమ్మల్ని అక్కా అని పిలవచ్చా!"
సరే అన్నట్లు మానస చిరునవ్వుతో తలాడించింది.
"సత్యా!...."
ఆత్రంగా మానస ముఖంలోకి చూచింది భామ.
"మాది మధ్యతరగతి కుటుంబం. చెప్పానుగా ముందే... నాన్నగారు వ్యవసాయదారుడు. పది ఎకరాల భూమి రెండు ఎకరాల్లో మామిడితోట. మా తాతగారు కట్టించిన పెంకుటిల్లు. యింటి చుట్టూ ఖాళీ స్థలం... కాంపౌండు గోడ ప్రక్కన బాదం, జామ, నిమ్మ, నారింజ, రకరకాల పూలచెట్లు... పెంకుటిల్లయినా మా యింటి పరిసరాలు చాలా బాగుంటాయి. నాకు ఎంతో యిష్టం.
నేను ఎస్.ఎస్.సి ఫస్ట్ క్లాసులో పాసైనాను. కంప్యూటర్ కోర్సును పాసైనాను.
నాన్నగారికి, అమ్మగారికి కులం, మతం అంటే చాలా గౌరవం, అభిమానం. వారి మాటలను కాదని వారి మనస్సుకు కష్టం కలిగించడం నాకు ఏనాడూ యిష్టం లేదు. వివాహ విషయంలో కూడా... వారి ఇష్టానుసారంగా వారికి నచ్చిన సంబంధాన్ని అంగీకరించాలనేది నా ఉద్దేశ్యం. కారణం.... వారు మనలను కనిపెంచి మన యిష్టానుసారం చదివించి పెద్ద చేసినవారు కాబట్టి... వివాహ విషయంలో వారు తీసుకునే నిర్ణయం సరైనదిగానే వుంటుందని నా నమ్మకం.
నేను చిన్నతనం నుంచీ... సోషల్ యాక్టివిటీస్‍లో ఉత్సాహంగా పాల్గొనేదాన్ని. వాన వచ్చినా, వరద వచ్చినా తోటి పిల్లలతో కలిసి యింటింటా చందాలు వసూలు చేసి ఆపదలో వున్నవారికి సహాయం చేసేదాన్ని. ఆ కారణంగా నాకు మా గ్రామంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం. అందరికీ నేనంటే ఎంతో అభిమానం. మా వూరికి విజయనగరానికి పది కిలోమీటర్లు.
ఒకరోజున మా యింటి ప్రక్కన వున్న పేదల పూరిగుడిసెలకు సాయంత్రం సమయంలో ఎవరో సిగరెట్ ముక్కను ఆర్పకుండా విసిరేసినందుకు ఆ గుడిసెలకు నిప్పు అంటుకొంది. సమయం రాత్రి ఏడుగంటలు. ఫైరింజన్ వచ్చేసరికి గుడిసెలన్నీ తగలబడిపోయాయి. అరవై సంవత్సరాల కళ్ళు లేని వృద్ధుడు ఆ మంటల్లో గుడిసెలో వుండిపోయాడు. నేను మరికొందరు కలిసి ఆ పెద్దమనిషిని రక్షించి... హాస్పిటల్‍కు తీసుకొని వెళ్ళాము.
అక్కడ నాకు డాక్టర్ శ్యాంబాబుతో పరిచయం కలిగింది. ఆ వ్యక్తికి వారు చికిత్స చేసి కాపాడారు. నన్ను అభినందించారు.
ఆ తర్వాత ఉచిత సేవ శిబిరాన్ని నెలకు రెండుసార్లు మా వూర్లో నడిపి పేదలకు వారు ఉచితంగా మందు ఇచ్చి వారి ఆరోగ్యాన్ని చక్కబరిచేవారు. వారు మావూరు వచ్చినప్పుడల్లా నన్ను కలిసి మాట్లాడేవారు. మా యిరువురి మధ్యన చనువు... స్నేహం ఏర్పడ్డాయి. ఒక్కో పర్యాయం మా యింట్లోనే భోజనం చేసేవారు.
ఒక పర్యాయం వచ్చినప్పుడు వారు నాతో... ’నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీవు సరే అంటే... నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడి నిన్ను వివాహం చేసుకొంటాను’ అని చెప్పారు.
నాకు చాలా ఆనందం కలిగింది ’సరే’ అన్నాను. వారు విజయనగరం వెళ్ళిపోయారు.
బొబ్బిలిలో మా నాన్నగారి స్నేహితుడు కాంట్రాక్టర్ సాంబయ్య వారి కొడుకు మురళీధర్.
ఆ పేరును వినగానే భామ ఆశ్చర్యంతో....
"అక్కా!... ఆ అబ్బాయి పేరేమిటి?" ఆత్రంగా అడిగింది.
"మురళీధర్!"
’నాకు తగిలిన మురళీధర్... ఈ మురళీధర్ ఒకరే కాదు కదా!.... సరే చూద్దాం’ అనుకొని "ఆఁ.. చెప్పండి అక్కా!" అంది భామ.
"నాన్నగారు బొబ్బిలికి వెళ్ళి సాంబయ్య గారితో మాట్లాడి... యింటికి వచ్చి అమ్మతో తన నిర్ణయాన్ని తెలియజేశారు.
అమ్మ సాంబయ్యగారి ఆస్థిపాస్తుల వివరాలను... అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తూ... లక్షలు సంపాదిస్తున్నాడన్న మాటలను విని సంతోషించింది. నాన్నగారి నిర్ణయాన్ని ఆమోదించింది. నన్ను చూచి.... నా బిడ్డ చాలా అదృష్టవంతురాలని పొంగిపోయింది.
నాన్న... అబ్బాయి ఫొటోను అమ్మకు చూపించగా ఎంతో ఆనందంగా ఆ ఫొటోను అమ్మ నాకు చూపించింది.
నా పరిస్థితి అయోమయం అయిపోయింది. డాక్టర్ శ్యాంబాబు చెప్పిన మాటలు... నేను వారికి నా సమ్మతిని తెలియజేసిన విషయాన్ని అమ్మకు చెప్పాలని ప్రయత్నించాను. అమ్మా నాన్నా నా మాటలను వినే స్థితిలోలేరు. వారికి సాంబయ్య కొడుకు సంబంధం అంతగా నచ్చింది. త్వరలో ముహూర్తాలు నిర్ణయించాలనే నిర్ణయానికి వచ్చారు.
నేను మా గ్రామాన్నించి విజయనగరం వచ్చి డాక్టర్ శ్యాంబాబును కలిసే దానికి ప్రయత్నించాను. హాస్పిటల్ బృందం... వారు రష్యాకు వెళ్ళినట్లుగా వచ్చేదానికి మూడు మాసాలకు పైగా కావచ్చునని తెలియజేశారు. వారిపట్ల నాకున్న ఆశ అణగారిపోయింది. కన్నీటితో యింటికి చేరాను.
సాంబయ్య దంపతులు వచ్చి నన్ను చూచారు. వారంరోజుల్లో నిశ్చితార్థం ఆ తర్వాత వారం రోజుల్లో వివాహ ముహూర్తం నిర్ణయం జరిగింది.
సాంబయ్య కుమారుడితో నా నిశ్చితార్థం.... వివాహం పెద్దలు నిర్ణయించిన ప్రకారం జరిగాయి.
అతనికి శలవులేని కారణంగా వివాహం అయిన అయిదవరోజే నేను మురళీధర్‍తో అమెరికాకు బయలుదేరాను. యిరువురం అతని నిలయానికి చేరాము.
ఆ సాయంత్రం... న్యాన్‍సి ఆ ఇంటికి వచ్చింది. ఆమెకు నన్ను తమ పనిమనిషిగా పరిచయం చేశాడు మురళీధర్.
అతని మాటలకు నాకు ఆశ్చర్యం.... ఏడుపు రెండు కలిగాయి. వారి మాటల వలన నాకు అర్థం అయింది. వారిరువురికి చర్చిలో వివాహం అయినట్లు వారికి ఒక సంవత్సరం బాబు వున్నట్లు ఒక వారం లోపల అర్థం అయింది. ఒకరోజు సాయంత్రం న్యాన్‍సి బిడ్డను యింటికి తీసుకొని వచ్చింది. ఆ ఇరువురూ ఉద్యోగాలకు పోయేవారు. ఆయాగా ఆ బిడ్డ సంరక్షణ చూచుకోవడం.... వారు కోరిన వంటలు చేసి వారికి వడ్డించడం.... బట్టలుతికి, ఆరవేసి, ఇస్త్రీ వేసి, క్రమంగా సర్దడం... యిల్లు వాకిలి వూడ్చి శుభ్రం చేయడం... ఈ విధుల నిర్వహణతో నా జీవితం ఆ యింట పనిమనిషి బ్రతుకుగా మారిపోయింది. వారు లేని సమయంలో ఏడ్చేదాన్ని. మనస్సు నిండా బాధ. అంతులేని ఆవేదన.
యిరువురూ కలిసి తాగేవారు. ఒక్కోరోజు... న్యాన్‍సీ తో ప్రేమ కలాపాలు సాగిస్తూ ఆమెను పూర్తిగా మందు మైకంలో ముంచి మంచంపై త్రోసి.... నా దగ్గరకు వచ్చి... నా యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా... నేను కాదన్నా... నా మీది తన కోర్కెను తన పశుబలంతో తీర్చుకొనేవాడు. ఒక్కోరోజు ఆఫీసుకు వెళ్ళిన కొన్ని గంటలకే తిరిగివచ్చి నన్ను తన యిష్టానుసారంగా నేను ఏడుస్తున్నా దయాదాక్షిణ్యాలు లేకుండా... అనుభవించేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే వాడు... మనిషి కాదు ద్విపాద పశువు.
దాదాపు మూడునెలలుగా నా దగ్గరకు రావడం మానేశాడు. అంటే వాడికి నామీద మోజు తీరిపోయింది.
వారిరువురి వాదప్రతివాదాల వలన నాకు తెలిసింది వాడు... ఎవరో మరో అమ్మాయితో తిరుగుతున్నాడని. ఎలాగైనా ఆ నరక కూపం నుండి బయటపడాలని నిశ్చయించుకొని... వారిరువురూ లేని సమయంలో వాడి బ్రీఫ్‍కేసులో వున్న నా పాస్‍పోర్టును చేతికి తీసుకొన్నాను. వాడు వేరే నగరానికి పనిమీద వెళుతున్నట్లు వారం రోజులు రానట్లు న్యాన్‍సీతో చెప్పిన మాటలు విని... నేను ఇండియాకు వెళ్ళేదానికి ఇదే తగిన సమయం అనే నిర్ణయానికి వచ్చాను.
వాడు న్యాన్‍సి... ఇంట్లో లేని సమయంలో ఎయిర్ లైన్స్ ఆఫీసుకు వెళ్ళి టికెట్ బుక్ చేసుకొన్నాను. న్యాన్‍సి బిడ్డను ప్రక్క ప్లాట్ వారి వద్ద వదిలి ఓ గంటలో తిరిగి వస్తానని చెప్పి.... ఎయిర్ పోర్టుకు వచ్చి ఆ ఫ్లైట్ ఎక్కాను. రావణుని చెర నుండి తప్పించుకొన్నాను. ఇకపై ఏం జరగనున్నదో ఆ దైవానికే తెలియాలి.
సత్యా!... నా మనస్సులోని యధార్థమైన కోరిక ఏమిటో తెలుసా... నాకు చచ్చిపోవాలని వుంది. జీవితం మీద నాకు ఆశ లేదు. నామీద నాకే అసహ్యంగా ఉంది. నాకు జరిగిన అన్యాయాన్ని మా అమ్మా నాన్నలకు చెప్పాలనేది నా కోరిక. అందుకే ఈపయనం" మానస చెప్పడం ఆపేసింది. ఆవేదనతో కళ్ళు మూసుకొంది. కళ్ళనుండి కన్నీరు రాలాయి.
భామకు... మానస చెప్పిన కథలో మురళీధర్ పేరు వినగానే... తనలో కలిగిన అనుమానం న్యాన్‍సి పేరు వినగానే వాడే వీడు అనే విషయం రూఢి అయింది. తాను ఎంత పెద్ద ఆపద నుండి బయటపడగలిగాననే విషయం అర్థం అయింది. మనస్సులో ఎంతో బాధ. నిగ్రహశక్తి క్షీణించింది. ఆమె నయనాలు ఆశ్రుధారలను వర్షించాయి.
భామ స్థితిని చూచిన మానస ఆశ్చర్యంతో "సత్యా!... నీవు ఎందుకు ఏడుస్తున్నావు? నా కథ నీ మనస్సును ఎంతో కలవరపరిచింది కదూ!" దీనంగా అడిగింది.
"అక్కా!... నీవు అన్నావే.... ఈ మధ్య కాలంలో వాడు ఎవరో ఆడపిల్ల వెంట తిరుగుతున్నాడని... ఆ పిల్ల ఎవరో కాదు నేనే" విచారంగా, దోషిలా బాధపడుతూ చెప్పింది భామ.
భామ మాటలకు మనస ఆశ్చర్యపోయింది.
"కాస్త వివరంగా చెప్పవూ!" దీనంగా అడిగింది మానస.
భామ... మురళీధర్‍కు తనకు ఏర్పడిన స్నేహాన్ని గురించి... తన అత్తామామల మాటలను లెక్కచేయకుండా అతనితో చేసిన డేటింగ్ విషయాన్ని... న్యాన్‍సి రాక వారిరువురి సంభాషణ... తన చివరి నిర్ణయాన్ని గురించి... విపులంగా మానసకు తెలియజేసింది.
ఇరువురి హృదయాలు తగిలిన గాయాల బాధతో సొమ్మసిల్లాయి. బరువైన కనురెప్పలను ఇరువురూ బలవంతంగా మూసుకొన్నారు.
రెండు పెగ్గుల విస్కీ మత్తు కారణంగా మానస నిద్రపోయింది.
కానీ.... భామకు నిద్ర పట్టలేదు. మురళీధర్ నీచ ప్రవృత్తి... అతను తనతో నటించి మాట్లాడిన తీరు... తన పొందు కోసం అతను పడ్డ తాపత్రయం... తాను అతన్ని హద్దులు దాటనియ్యకుండా కూడా వ్యవహరించిన రీతి... జ్ఞప్తికి వచ్చాయి. ఆవేశంతో తన అత్తామామల మాటలను ధిక్కరించి మురళీధర్‍ను తాను ఎంతగా విశ్వసించిందో...
అతన్ని తన భావి జీవితపు భాగస్వామిగా వూహించుకొని తాను కన్న కలలు..... ఆశలు... గాల్‍విస్టన్ నగరంలో... వారున్న లాడ్జికి న్యాన్‍సి రాక... మురళీధర్‍కు ఆమెకు జరిగిన సంభాషణ... వారిరువురి మధ్యన వున్న సంబంధం తెలిసిన తర్వాత... తాను ఎలాంటి ప్రమాదం నుండి తెలివిగా బయటపడగలిగిందో... తలచుకొని, ఎంతగానో పశ్చాత్తాపంతో బాధపడసాగింది. కలలన్నీ కరిగిపోయాయి.
మానస చెప్పిన కథ... ఆమె జీవితాన్ని ఏ రీతిగా నిర్ధయతో మురళీధర్ నాశనం చేసింది. మానస పడుతున్న ఆవేదన... తలచుకొని, మానస విషయంలో ఎంతగానో విచారపడింది.
అయినవారి మాటలను లెక్కచేయక తన ఇష్టానుసారం విచ్చలవిడిగా వర్తించినందుకు దేవుడు తనను శిక్షించకుండా... ఆపద నుంచి కాపాడి రక్షించాడని.... తాను ఈ మధ్య కాలంలో ఎన్నడూ తలవని దైవాన్ని తలచుకొని... ’క్షమించు దేవా....’ అని వేడుకొంటూ కన్నీరు కార్చింది. కలతతో బాధపడుతున్న భామను నిద్రామ తల్లి తన ఒడిలో చేర్చుకుంది.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments