#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Prema Tharangalu - Part 4 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 26/11/2024
ప్రేమ తరంగాలు - పార్ట్ 4 తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.
సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు.
కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.
ఫ్లయిట్ లో మురళీధర్ తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ.
పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 4 చదవండి.
విమానం దుబాయ్ చేరగానే.. తన తల్లికి ఫోన్ చేసింది భామ. ముకుందవర్మ కేసు విషయంగా అమెరికాకు వెళ్ళినట్లు చెప్పింది నీలవేణి. ఆ మాట వినగానే భామలో ఎంతో కలవరం.
కారణం.. తన తండ్రి, తన మామయ్య పరమశివాన్ని అత్త నందినీని కలుస్తాడని.. వారు తాను వారి మాటలను ధిక్కరించి మురళీధర్‍తో చేసిన డేటింగ్ విషయాన్ని తండ్రికి తప్పక తెలియజేస్తారని.. ఈ పాటికి తన కథంతా తండ్రికి తెలిసి ఉంటుందని.. తనను ఎంతాగానో ప్రేమించి అభిమానించే తండ్రికి, తన పట్ల అసహ్యత ఏర్పడి ఉంటుందని.. వారు ఎంతగానో బాధపడి వుంటారని వ్యాకులతకు లోనైంది భామ.
"అమ్మా!.. కారును చెన్నైకి పంపించు. మరో నాలుగు గంటల్లో నేను చెన్నైకి చేరబోతున్నాను" అంది భామ.
"అలాగే తల్లీ.. వెంటనే పంపుతాను. నీవు జాగ్రత్తగా రా!" ఎంతో ఆప్యాయంగా చెప్పింది నీలవేణి.
మరో ఎనిమిది గంటల్లో కూతురును చూడబోతున్నందుకు ఎంతగానో సంబరపడింది నీలవేణి.
దుబాయ్ చేరేసరికి మానసకు జ్వరం.. భామ ఏదో మాత్రలను మానస చేత మ్రింగించింది. మనోవ్యాకులత.. మనిషిని కృంగదీస్తుంది. అదే జరిగింది మానస విషయంలో.
ఆమె మనోవేదన.. తాను తన ముఖాన్ని తన తల్లిదండ్రులకు ఎలా చూపాలి!.. అమెరికాలో కూతురు అల్లుడూ.. ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నారనే వారి భావన.. తనను చూడగానే.. తన కథను వినగానే వారి పరిస్థితి ఏ రీతిగా మారబోతుందో!.. వయస్సు మీరిన తల్లిదండ్రులు.. తన మూలంగా ఎలాంటి స్థితికి లోను కావలసి వుందో!.. తాను చెప్పబోయే యధార్థాన్ని విని వారు బ్రతుకగలరా!.. సిగ్గు విడిచి.. ఆ రాక్షసుడి రాక్షస చర్యలను గురించి తాను వారితో ఏ రీతిగా చెప్పగలదు?..
తన భావి జీవితం తనకే కాక కన్నవారికీ సమస్యగా మారిపోబోతూ వుంది. ఆ వయస్సు మీరిన వారు, ధైర్యంగా నిలబడి తన్ను అభిమానిస్తారా!.. లేక అల్లుణ్ణి వదలి అతనికి చెప్పకుండా నీవు ఇండియాకు పారిపోయి వచ్చి పెద్ద తప్పు చేశావని తనను ఆక్షేపిస్తారా!.. ఇంతవరకు అభిమానమున్న మనసులు అసహ్యంతో నిండిపోతాయా!.. యధార్థాన్ని గ్రహించి తన పట్ల జాలి, సానుభూతిని చూపించగలరా!..
అన్నీ ప్రశ్నలే.. ఏ ప్రశ్నకూ మానస మనస్సున జవాబు లేదు. మనస్సులో ముందు ఏం జరుగబోతుందో అనే భయం.. కలవరం..
వారు ఎక్కిన విమానం నాలుగు గంటల్లో చెన్నై చేరింది. అప్పుడు సమయం రాత్రి పదిన్నర.
భామ, మానస ఇరువురూ బయటికి వచ్చారు. ఒక యువకుడు.. చేతిలో సత్యభామ ఫ్రమ్ హోస్టన్ అనే బోర్డును పట్టుకొని నిలబడి వున్నాడు. అతన్ని సమీపించి "భామా ఫ్రమ్ హోస్టన్" స్టయిల్‍గా చెప్పింది భామ.
"థాంక్యూ!.. వెల్‍కమ్ మేడం" చిరునవ్వుతో చెప్పాడు ఆ వ్యక్తి.
"డ్రైవర్!.. లగేజీని తీసుకొని కార్లో పెట్టు" అంది భామ.
ఆ వ్యక్తి ఆమె ముఖంలోకి కొన్ని క్షణాలు చూచి లగేజిని అందుకొని కారు వైపుకు వెళ్ళిపోయాడు.
భామ, ప్రక్కనే వున్న మానస ముఖంలోకి చూచింది.
"అక్కా!.. నీవు చాలా నీరసంగా వున్నావు. నాతో మా వూరికి వచ్చి, మా ఇంట్లో రెండు రోజులు విశ్రాంతి తీసుకొని మీ వూరికి వెళుదువుగాని.. సరేనా!.." అనునయంగా అడిగింది భామ.
కాదు అన్నట్లు.. తలను త్రిప్పింది మానస. ఆమె కళ్లల్లో కన్నీరు..
"అక్కా!.. మన దేశానికి వచ్చేశాంగా.. ఇంకా ఎందుకు బాధ పడుతున్నావు?"
మానస.. భామ కళ్ళల్లోకి జాలిగా చూచింది. ఆమె తనతో ఏదో చెప్పాలని.. చెప్పేదానికి సంశయిస్తున్నదని భామ గ్రహించింది.
"అక్కా!.. నీవు నాతో ఏదో చెప్పాలనుకొంటున్నావు. అది ఏదైనా సరే నిర్భయంగా చెప్పు. నేను నీకు తప్పక కోరిన రీతిగా సాయం చేస్తాను" ప్రీతిగా చెప్పింది భామ.
"సత్యా!.. నీవు నాతో మా వూరి దాకా రాగలవా!" దీనంగా అడిగింది.
భామ ఆ మాటలను విని కొన్ని క్షణాలు ఆలోచించింది. "నీవు ప్రక్కన వుంటే.. నేను నా తల్లిదండ్రులకు నా అమెరికా జీవితాన్ని గురించి నిర్భయంగా చెప్పగలను. నీవు.. మురళీధర్‍తో నీకు కలిగిన అనుభవాన్ని వారికి చెబితే.. వారు నా మాటలను నమ్ముతారని నన్ను.. అసహ్యించుకోరని నా ఆశ" జాలిగా భామ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది మానస.
భామకు ఆమె హృదయవేదన.. సంశయం అర్థం అయింది.
"సరే! నేను నీతో మీ వూరికి వస్తాను. సంతోషమేగా!.. పద. అడుగో డ్రైవర్ మన కోసమే వస్తున్నాడు" నవ్వుతూ చెప్పింది భామ.
ఇరువురూ ముందుకు నడిచారు. డ్రైవర్ వారిని చూచి ఆగి.. తాను ముందుకు నడిచి కారును సమీపించాడు.
భామ మానస.. అతను డోర్ తెరువగా వెనుక సీట్లో కూర్చున్నారు.
ఆ యువకుడు కారును స్టార్ట్ చేశాడు.
"నీ పేరేమిటి?" అడిగింది భామ.
"బాబు.."
"ఎప్పుడు చేరావు?"
"నెల క్రిందట.."
"నాన్నగారు అమెరికా నుండి ఎప్పుడు వస్తారో తెలుసా!"
"తెలీదండి"
"మీది ఏ వూరు?"
"ప్రస్తుతానికి మీ వూరే నా వూరండి.."
"నేను అడిగింది మీ సొంత వూరు ఏదని?"
"నాకు తెలీదండి. నేను ఒక అనాథను."
"డ్రైవింగ్‍లో నీకు ఎన్ని ఏళ్ళ అనుభవం?"
"ఏడెనిమిది ఏళ్ళు.."
"విజయనగరం నీకు తెలుసా!"
"పేరు విన్నానండి.. వెళ్ళలేదు."
"రాత్రిపూట డ్రైవింగ్ చేసేదానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా!"
"లేదండి.."
"మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా!"
"నెల్లూరికి కదండీ!"
"కాదు.."
"మరి ఎక్కడికి వెళ్లాలండీ!" ఆశ్చర్యంతో అడిగాడు.
"విజయనగరం"
"ఆఁ.." ఆశ్చర్యపోయాడు.
"ఏం డ్రైవ్ చేయలేవా!"
"చేస్తానండి" మెల్లగా చెప్పాడు జవాబు.
’ఎక్కడ చెన్నై.. ఎక్కడ విజయనగరం.. ఈ రాత్రి..రేపు పగలంతా కారును నడిపితే సాయంకాలానికి విజయనగరం చేరగలను’ అనుకొన్నాడు బాబు.
"నీకు కష్టంగా ఉంటే నాకు చెప్పు. నేను నడుపుతాను" అతన్ని పరీక్షగా చూస్తూ చెప్పింది భామ.
"అలాగేనండి.. మీరు భోజనం చేయాలి కదండీ!" వినయంగా అడిగాడు బాబు.
"అక్కా!.. హోటల్‍కు వెళ్ళి ఏదైనా తిని బయలుదేరుదామా!" మానసను చూస్తూ అడిగింది భామ.
"నాకు తినాలని లేదు సత్యా!.. నీకు కావాల్సుంటే తిను.."
"నాకు పెద్దగా ఆకలి లేదక్కా!.. డ్రైవర్ నీవు భోజనం చేశావా?"
"చేశానండి."
"సరే.. నేరుగా అన్నా నగర్ రోడ్లో కారును పోనీ."
"అలాగే మేడం"
భామ తన తల్లికి ఫోన్ చేసి.. స్నేహితురాలితో విజయనగరం కార్లో వెళుతున్నానని.. రెండు రోజుల్లో వూరికి వస్తానని.. చెప్పింది. ఆమె అడిగే ప్రశ్నలను వినిపించుకోకుండా ఫోన్‍ను కట్ చేసింది. కళ్ళు మూసుకొంది.
బాబు రెండున్నరకల్లా నెల్లూరు దాటి హైవేలో కారును ముందుకు నడుపసాగాడు. మూడున్నరకు కావలి.. ఐదు గంటలకు ఒంగోలు చేరాడు. అప్పటికి భామ, మానసలు మేల్కొన్నారు.
"ఇది ఏ వూరు?" అడిగింది మానస.
"బాపట్లండి"
"విశాఖపట్నం ఎన్ని గంటలకు చేరగలం?" అడిగింది భామ.
"రెండు గంటలకల్లా చేరగలం అండి" చెప్పాడు బాబు.
"అక్కా!.. వైజాగ్ నుండి విజయనగరం ఎన్ని గంటలు ప్రయాణం?"
"బస్సులో నాలుగు గంటలు"
"ఇది కారుకదా!"
"ఓ గంట మైనస్ చెయ్యి"
"అంటే.. ఐదు గంటలకల్లా విజయనగరం చేరుతామన్నమాట"
"అవునండీ!" అన్నాడు బాబు.
"కాఫీ, టిఫిన్ ఎక్కడ తీసుకోవాలి?" అడిగింది భామ.
"విజయవాడలో అండి"
"సరే.. అక్కడ ఆపు"
విజయవాడలో ముగ్గురూ కాఫీ, టిఫిన్ తీసుకున్నారు. భామ డ్రైవర్ స్థానంలో.. ప్రక్కనే మానస.. వెనుక సీట్లో బాబు కూర్చున్నారు భామ మాట ప్రకారం..
ఒకటిన్నర కల్లా విశాఖపట్నం చేరారు. భోజనాన్ని ముగించి.. రెండు గంటలకు విజయనగరం వైపు బయలుదేరి బాబు కారును నడపసాగాడు.
సాయంత్రం ఐదున్నరకల్లా వారు విజయనగరాన్ని సమీపించారు.
అలుపు సొలుపూ లేకుండా బాబు చేసిన డ్రైవింగ్ భామకు ఎంతగానో నచ్చింది.
"బాబూ!.. యు ఆర్ ఏ గ్రేట్ డ్రైవర్" ఆనందంగా చెప్పింది భామ.
"పాపం.. మనకోసం వారు ఎంతగానో శ్రమించారు" సానుభూతితో చెప్పింది మానస.
"మరో అరగంటలో విజయనగరం చేరుతామండి" చెప్పాడు బాబు.
వూరి దగ్గరకు వచ్చే కొద్దీ మానస ముఖంలో ఎంతో విచారం. మానస వాలకాన్ని చూచిన భామ.. "అక్కా!.. దేనికీ భయపడకు నీవెలాంటి తప్పు చేయలేదు. ఆ కిరాతకుడి బారినుండి తప్పించుకొని వచ్చావు. నేను మీ అమ్మా నాన్నలకు మన ఇరువురి కథనంతా విపులంగా చెబుతాను. నీవు వారితో చెప్పవలసిందల్లా ఒక్కటే.."
"సత్యా!.. అదేమిటి?" ఆత్రంగా అడిగింది మానస.
"విడాకులు.. మురళీధర్‍తో నాకు విడాకులు కావాలని అమ్మా నాన్నలతో నిర్భయంగా చెప్పు. మన కథనంతా విన్న తర్వాత వారు.. నీ ఈ నిర్ణయానికి తప్పక అంగీకరిస్తారు. వారిని ఒప్పించి.. ఒక లాయర్‍ను కలిసి నీ చేత విడాకుల పత్రాల మీద సంతకం చేయించి ఆ సాంబయ్యకు పంపి.. నేను మా వూరికి బయలుదేరుతాను. నీవు సరే అంటే.. నీవూ నాతో మా వూరికి రా. మా నాన్నగారు లాయర్ కదా!.. వారితో విషయాన్ని చెప్పి త్వరలో కోర్టు విడాకుల ఆమోదం నీకు లభించేటట్లు నేను చూస్తాను.
గతాన్ని తలచుకొని బాధపడకు. అదంతా ఓ పీడకలగా భావించు. భవిష్యత్తును గురించి ఆలోచించు. నావల్ల నీకు ఏ సాయం కావాలన్నా నేను నీకు చేసేదానికి సంసిద్ధంగా వుంటాను. అమ్మా నాన్నలను చెల్లిని కలవబోతున్నాముగా ఆనందంగా నవ్వు" చిరునవ్వుతో మానస ముఖంలోకి చూస్తూ చెప్పింది భామ.
భామ మాటలు మానసకు ఎంతో వూరటను కలిగించాయి. తన కోర్కెను మన్నించి.. తనతో వచ్చిన భామ పట్ల మానసకు ఎంతో గౌరవం.. అభిమానం ఏర్పడింది.
"సత్యా!.. నీవు నాకు చేసిన ఈ సహాయాన్ని.. అంటే నాతో మా వూరికి వచ్చి.. నాకు అన్ని విధాలా ధైర్యాన్ని కల్పించినందుకు.. నేను నీ ఋణాన్ని ఏ రీతిగా ఈ జన్మలో తీర్చుకోగలనో నాకు తోచడం లేదమ్మా!.. నా భావి జీవితాన్ని గురించి నీవు నాకు ఎలాంటి సలహా ఇచ్చినా నేను దాన్ని ఆనందంగా ఆచరిస్తాను. కొన్ని గంటల్లో మనమిరువురం ఇంత సన్నిహితులమైనామంటే.. నా ఉద్దేశ్యం ప్రకారం అది ఆ దైవ నిర్ణయమేనని నా నమ్మకం" ఆనందంగా నవ్వుతూ చెప్పింది మానస.
"నా గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పి.. నన్ను చిన్నబుచ్చటం నీకు న్యాయం కాదక్కా. నేను ఏ క్షణంలో నిన్ను అక్కా అని సంభోదించానో ఆ క్షణం నుంచి నేను నాకు ఒక అక్కయ్య వుందని భావిస్తున్నాను. ఎప్పుడో చదివిన జ్ఞాపకం. జీవితం ఒక సమరం అని.. నేటి ఓటమి రేపటి విజయానికి నాంది అని.. కార్యదీక్షతో పట్టుదలతో ప్రయత్నం సాగించడం వివేకవంతుల లక్షణమని.. గతాన్ని మరచి మనం మన భవిష్యత్తును నిర్ణయించుకొని ఆ లక్ష్య సిద్ధికి పాటు పడడం మన ప్రస్తుత కర్తవ్యం. అవునా!" ప్రశ్నార్థకంగా మానస ముఖంలోకి చూచింది భామ.
"అవును. నీవు చెప్పింది సత్యం. మనం ఆ రీతిగానే నడుచుకోవాలి సత్యా!"
"మేడం మనం విజయనగరంలో ప్రవేశించాము. మీ ఇంటికి ఏ వైపున పోవాలో చెప్పండి" అడిగాడు బాబు.
మానస దారి వివరాలను చెప్పింది. ఇరవై నిముషాల్లో కారు విజయనగరం దాటి పచ్చటి పైరు పొలాల మధ్యన ముందుకు పోతూ ఉంది.
"అక్కా! విజయనగరం నుంచి మీ వూరు ఎన్ని కిలోమీటర్లు?"
"పది.."
కాలుగంటలో.. కారు గ్రామంలో ప్రవేశించింది.
మానస చెప్పిన రీతిగా కారును బాబు నడిపాడు. మరో ఐదు నిముషాల్లో కారు మానస ఇంటిని సమీపించింది. మానస మాట ప్రకారం బాబు కారును ఆపాడు.
మానస, భామ కారు నుండి దిగారు.
వాకిట్లో కారు ఆగిన శబ్దాన్ని విని.. మానస చెల్లెలు మాధురి పరుగున వాకిట్లోకి వచ్చింది. కారు దిగి లోనికి వస్తున్న మానసను, భామను చూచింది. వేగంగా ఇంటివైపు పరుగెత్తి.. "అమ్మా!.. అక్కయ్య వచ్చింది" బిగ్గరగా అరిచి అక్కకు ఎదురుగా వచ్చి.. "అక్కా!.." ప్రీతిగా కౌగలించుకొంది.
ఆ పిలుపును విని లోన ఉన్న రాజ్యలక్ష్మి, సత్యనారాయణ బయటికి వచ్చారు.
సమయం.. సాయంత్రం అరున్నర. ఆ రోజు పౌర్ణమి. ఆ దంపతులు ఇరువురూ ఆనందంగా ముందుకు వచ్చి మానసవైపు ఎంతో ప్రీతిగా చూచారు. ప్రక్కన వున్న భామను చూచి రాజ్యలక్ష్మి.
"అమ్మా!.. ఈ అమ్మాయి ఎవరు?.. రండి.. రండి" అభిమాన పూర్వకంగా సాదరంగా ఆహ్వానించింది.
"ఈమె పేరు సత్యభామ. నా స్నేహితురాలు. మన వూరు చూడాలని నాతో వచ్చింది"
"అల్లుడు గారు రాలేదా!" అడిగాడు సత్యనారాయణ.
"పెద్దమ్మా!.. పెదనాన్నా!.. చెన్నై నుంచి కార్లో వచ్చాము. ముందు స్నానం చెయ్యాలి. ఆకలి కూడా దంచేస్తూ ఉంది. ఏదైనా తిని.. ఆ తర్వాత అన్ని విషయాలు కూర్చొని మాట్లాడుకుందాం" నవ్వుతూ అంది భామ.
బాబు.. వారి లగేజ్‍ని తీసుకొని వచ్చి వరండాలో వుంచాడు.
"అతను మా డ్రైవర్. అతనికి స్నానం అదీ ఎక్కడ.. చేయాలో.. చెప్పండి పెదనాన్నగారూ!" నవ్వుతూ చెప్పింది భామ.
"అలాగే అమ్మా.. నేచెబుతాను. మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి."
రాజ్యలక్ష్మి, మానస, భామ లోనికి వెళ్ళారు. మాధురి వారి లగేజీని ఇంట్లోకి చేర్చింది.
బాబు.. సత్యనారాయణను సమీపించాడు.
"సార్!.. భామగారిని పిలుస్తారా!" ప్రాధేయపూర్వకంగా అడిగాడు.
సత్యనారాయణ లోనికి వెళ్ళి విషయాన్ని భామకు చెప్పాడు. భామ వరండాలోనికి వచ్చింది.
"మేడమ్! తప్పుగా అనుకోకండి. వచ్చేటప్పుడు నేను ఈ వూర్లో ఒక లాడ్జిని చూచాను. నేను అక్కడికి వెళతాను. ఉదయం ఎనిమిది గంటలకల్లా వస్తాను" వినయంగా చెప్పాడు బాబు.
అతని ముఖంలోకి పరీక్షగా చూచింది భామ. క్షణంసేఫు భామ కళ్ళల్లోకి చూచి తలదించుకొన్నాడు బాబు.
"సరే వెళ్ళు. ఉదయం ఎనిమిదికల్లా రా" అంది భామ.
"అలాగే మేడమ్"
"డబ్బులు వున్నాయా?"
"వున్నాయి మేడమ్"
"సరే వెళ్ళు. కొత్త వూరు.. జాగ్రత్త"
సరే అన్నట్లు తలాడించాడు బాబు.
భామ లోనికి వెళ్ళిపోయింది. బాబు లాడ్జివైపుకు నడిచాడు.
మానస, భామ స్నానాలు ముగించారు. రాజ్యలక్ష్మి ముగ్గురు పిల్లలకు, భర్తగారికి భోజనాన్ని వడ్డించింది.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Commentaires