top of page

ప్రేమ తరంగాలు - పార్ట్ 5

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Prema Tharangalu - Part 5 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 02/12/2024

ప్రేమ తరంగాలు - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


జరిగిన కథ:

అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.  

సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు.   

కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.

ఫ్లయిట్ లో మురళీధర్ తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ.


పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది.

చెన్నైలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్ గా భావిస్తుంది. మానసకు తోడుగా కార్లో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది.



ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 5 చదవండి.



మానస, భామ స్నానాలు ముగించారు. రాజ్యలక్ష్మి ముగ్గురు పిల్లలకు, భర్తగారికి భోజనాన్ని వడ్డించింది.


మానస, భామ తిని మానస గదికి వెళ్ళిపోయారు. మానసలోని నిరుత్సాహాన్ని... రాజ్యలక్ష్మి, మాధురి గమనించారు. భోజనం చేస్తూ వున్న తల్లి ప్రక్కన కూర్చొని మాధురి...

"అమ్మా!... అక్కలో ఎంతో మార్పు వచ్చిందమ్మా!.... పూర్వంలా నాతో కాని.... నీతో కాని మాట్లాడటం లేదు" బుంగమూతి పెట్టి ముద్దుగా పలికింది మాధురి.


ఆ అనుమానం తనకూ కలిగినా... బయటికి వ్యక్తం చేయకుండా....

"ప్రయాణం బదలిక. చెన్నై నుండి ఇక్కడికి కార్లో రావడం అంటే సామాన్యమా!... తెల్లవారి బాగా మాట్లాడుతుందిలే. నీవు నీ గదికి వెళ్ళి చదువుకో పో" అనునయంగా చెప్పింది రాజ్యలక్ష్మి.


మాధురి తన గదికి వెళ్ళిపోయింది.

వరండాలో కూర్చున్న సత్యనారాయణకు ఏదో అనుమానం... అల్లుడు రాకుండా అమ్మాయి ఒక్కతే మరో అమ్మాయితో కలిసి వచ్చిందంటే... ఆ భార్యాభర్తల మధ్యన ఏదైనా... సమస్య రేకెత్తిందా!.... తాను వస్తున్నట్లు ఫోను గాని లెటర్ గాని ఏమీ లేదు. చెప్పా పెట్టకుండా ఇలా వచ్చి ముందు నిలబడితే... 


పాడు మనస్సున పిచ్చి పిచ్చి ఆలోచనలు. అన్నీ అపశృతులే... తెగని ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కింది.


"ఏమండీ!...." అన్న రాజ్యలక్ష్మి పిలుపు విని తొట్రుపాటుతో ఆమె ముఖంలోకి దీనంగా చూచాడు సత్యనారాయణ.


"ఈ పిల్ల... ఈ ఆకస్మిక రాకకు అర్థం ఏమిటండీ!" 

ఆశ్చర్యాందోళనతో అడిగింది రాజ్యలక్ష్మి.


"నేనూ అదే ఆలోచనతో సతమతమౌతున్నాను. వెళ్ళి చూడు. మానస ఏం చేస్తూ వుందో. ఈ టెన్షన్ తట్టుకోలేకున్నా. విషయం ఏమిటో అడిగి తెలుసుకుందాం."


"అల్లుడుగారు రాలేదా అని నేను అడిగిన దానికి ’లేదు’ అని ముక్తసరిగా జవాబు చెప్పిందంటే.... వారిరువురి మధ్యన ఏదో గొడవ జరిగి వుంటుందని నా మనస్సు కీడును శంకిస్తూ వుందండీ" విచారంగా చెప్పింది రాజ్యలక్ష్మి.


"చెప్పానుగా!... నా పరిస్థితీ అంతేనే. మానసను పిలువు అడిగి తెలుసుకొందాం. వెళ్ళి ఆమెను పిలూ..."


రాజ్యలక్ష్మి మానస గదివైపుకు నడిచింది. మానస, భామ ఆమెకు ఎదురైనారు.


"పెద్దమ్మగారూ!... మీరు వచ్చింది మా కోసమేగా. పదండి వరండాలో కూర్చొని మాట్లాడుకొందాం. పెదనాన్నగారు అక్కడే వున్నారుగా!" అడిగింది భామ.


"ఆఁ..... వున్నారు" అంది రాజ్యలక్ష్మి.


ముగ్గురూ వరండాలోకి వచ్చారు. కూర్చున్నారు.

మానస ఏం చెప్పబోతుందో అని ఆ దంపతులిద్దరూ ఆమె ముఖంలోకి ఆత్రంగా చూడసాగారు.


ఎదిగిన బిడ్డలను ఏదైనా అడగాలంటే... సభ్యత కల తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తారు. వారు అడిగిన దానికి వినయంగా బిడ్డలు సమాధానం చెబితే... వారికి ఆనందం. నిర్లక్ష్యంగా జవాబు చెబితే వారికి ఆవేదన. తల్లిదండ్రుల ఈ మనస్తత్వాన్ని ఎరిగి వర్తించే యువతీ యువకులు ప్రస్తుత సమాజంలో వున్నది... చాలా తక్కువమంది. 


ఆ కారణంగా పెద్దలు పిన్నలను ఏదైనా అడగాలంటే సావధానంగా వినయంతో అడగవలసిన స్థితికి చేరారు. తాము కని... పెంచి పెద్ద చేసిన పిల్లల ఈసడింపులు ప్రతి తల్లిదండ్రులకు కష్టాన్ని కలిగిస్తాయి కదా!... ఆ కారణంగా ఆ దంపతులు... అడగాలనుకొన్న విషయాన్ని అడగలేక... మానస, భామల ముఖాలను మార్చి మార్చి చూస్తూ విచారంగా ఉండిపోయారు.


వారి స్థితిని గ్రహించిన మానస, భామ ముఖంలోకి దీనంగా చూచింది.


మానస ఉద్దేశ్యాన్ని గ్రహించిన భామ... ముందుగా తనకు మురళీధర్‍కు అయిన పరిచయాన్ని... అతను తాను ప్రేమించుకొన్న విషయాన్ని... తాను అతనితో చేసిన డేటింగ్ వివరాలను... ఆ సందర్భంలో న్యాన్‍సి రంగప్రవేశం... మురళీధర్‍కు న్యాన్‍సికి జరిగిన సంభాషణ... తాను అతని బారి నుండి తప్పించుకొన్న రీతిని వివరంగా ఆ పెద్దలకు తెలియజేసింది భామ.


తన కథను భామ చెబుతున్నప్పుడు ఆవేదనను అణచుకోలేక మానస భోరున ఏడ్చింది. ఆమె కసాయి వాడి చేత సంవత్సరం రోజులు అనుభవించిన నరకయాతనను విని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. రాజ్యలక్ష్మి కూతురు తలను హృదయానికి హత్తుకొని భోరున ఏడ్చింది. సత్యనారాయణ స్థితి కూడా అంతే.


పండు వెన్నెలను కురిపిస్తున్న పున్నమి చంద్రుని కారు మేఘం కమ్ముకుంది. వెన్నెలతో మురిసిపోతున్న పుడమి... కారు చీకట్లతో కలవరపడింది.


మేఘం గర్జించింది. కుండపోతగా వర్షం కురియసాగింది.క్షణాల్లో ప్రకృతిలో జరిగిన ఆ మార్పుకు నలుగురు నివ్వెరపోయారు. ఒకరి ముఖాలొకరు చూచుకొన్నారు. నలుగురి ముఖంలోనూ ఒకే భావన.


"అమ్మా సత్యా!...చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లీ. నీవు నా బిడ్డకు చేసిన సహాయాన్ని నేను నా జన్మలో మరిచిపోలేను. అమ్మా!... నీవు, మానస ఆ రాక్షసుడి బారినుండి తెలివిగా తప్పించుకొని క్షేమంగా స్వదేశానికి చేరినందుకు నాకు చాలా సంతోషంగా వుందమ్మా!" గద్గద స్వరంతో చెప్పాడు సత్యనారాయణ.


భామ చెప్పిన కథను విని తన తల్లిదండ్రులు తనను ఒక్కమాట కూడా అనకుండా తనమీద పూర్వపు అభిమానాన్ని.... ఆప్యాయతను చూపినందుకు మానస సంతోషించింది.


"అమ్మా!.... నాన్నా!... మీరు నన్ను ఆడపిల్లగా భావించి నాకు చేయవలసిన వన్నీ ఎంతో గొప్పగా నిర్వహించారు. నా క్షేమ సౌఖ్యాలను కోరారు. కానీ విధి నిర్ణయం వేరుగా వున్న కారణంగా... నేను ఈ స్థితిలో మీ ముందు వుండవలసిన పరిస్థితి ఏర్పడింది. యికపై మీరు నన్ను కూతురుగా భావించవద్దు. కొడుకుగా భావించండి. ఒక కొడుకునై నేను... నా తల్లిదండ్రులకు, వారి శేష జీవిత కాలంలో ఆనందాన్ని కలిగించే అవకాశాన్ని నాకు మీరు ఇవ్వాలి. 


నా భవిష్యత్తును నేను తీర్చి దిద్దుకోగలను. మీకు ఆనందాన్ని కలిగించగలను. జీవితం అంటే కేవలం పెండ్లి... పిల్లలు... భర్త... సంసారమే కాదు. మనలను అభిమానించే వారికోసం పాటు పడాలి. మన చర్యల వలన వారు ఆనందించేలా నడుచుకోవాలి. మీ నుండి నేను కోరేదల్లా ఒక్కటే. ఆ వ్యక్తికి నేను విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకొన్నాను. దాన్ని మీరు కాదనకుండా ఆమోదించాలి" ఎంతో ఆవేశంతో చెబుతూ వచ్చిన మానస తన ప్రసంగాన్ని ఆపి... భామ ముఖంలోకి చూచింది.

ఆ చూపుల్లో... నేను మాట్లాడింది రైటా... తప్పా అనే భావన భామకు గోచరించింది.


"అక్కా!... నేను నీకు ముందే చెప్పానుగా!...ఇక ముందు అన్ని విషయాల్లో నీకు అండగా వుంటానని. నీవు చెప్పిన ప్రతి మాట నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది" నవ్వుతూ చెప్పింది భామ.


"అమ్మా!... మానసా!... ఇకపై నీవు ఏమి చేయదలచుకొంటే అది చెయ్యి. నీ తండ్రిగా నా జీవితాంతం నీకు అండగా నేను వుంటాను తల్లీ" అనునయంగా చెప్పాడు సత్యనారాయణ.


"అమ్మా!.... నీ నిర్ణయం?" అడిగింది మానస.


"తల్లీ!.... మీ నాన్నగారి నిర్ణయాన్ని నేను ఏనాడు కాదనలేదు. మా తనువులు వేరే. కానీ మాట ఒక్కటే" చిరునవ్వుతో చెప్పింది రాజ్యలక్ష్మి.


ఆకాశాన కమ్మిన కారు మబ్బులు చెదిరిపోయాయి. వాన వెలిసింది. తారానాథుని వెన్నెల విరిసింది.

"అమ్మా పొద్దుపోయింది. ఇక వెళ్ళి పడుకోండి" చెప్పాడు సత్యనారాయణ.


అందరూ లేచారు. మానస, భామ.... మానస గదికి, రాజ్యలక్ష్మి, నారాయణ వారి గదికి వెళ్ళిపోయారు.

భామ గదిలోనికి రాగానే మంచంపై వాలిపోయింది. మానస తలుపు గడియ బిగించి వచ్చి భామ ప్రక్కన మంచంపై కూర్చుంది.


ఆమె మదిలో.... తల్లిదండ్రుల ముందు తాను పలికిన వీరాలాపాలు గుర్తుకు వస్తున్నాయి. జీవితం వింత ఆకృతిని సంతరించుకొంది. కనుచూపు మేరలో అంతా చీకటిగానే కనిపిస్తూ ఉంది.


ఈ కారు చీకట్లను చీల్చుకొని తాను వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి? ఎలా భావి జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలి? తన వ్యక్తిత్వాన్ని పదిమంది గౌరవించే దానికి తాను ఏం చేయాలి?"


ఈ ఆలోచనలతో ఆమె మనస్సు సతమతమౌతూ ఉంది. మౌనంగా ఆలోచనలో వున్న మానసను భామ చూచింది.

"అక్కా!... ఇంకా ఏమిటీ నీ ఆలోచన. నీ సమస్యను నేను పరిష్కారం చేశానుగా" పరీక్షగా మానసను చూస్తూ అడిగింది భామ.


"సత్యా!.... నీవు నాకు చేసిన సహాయాన్ని నేను నా జీవితాంతం మరువలేను. మన ఇరువురికీ ఈనాటి ఈ బంధం ఏమాటి ఋణాను బంధమో!... నా తల్లితండ్రులు నన్ను చక్కగా అర్థం చేసుకొని అభిమానించేలా నీ మాటల గారడితో వారిని ప్రసన్నులను చేశావు" ఆనందంగా నవ్వింది మానస.


"నీవు నన్ను నీ చెల్లిలా భావిస్తున్నావా లేదా!..."


"నీవు నాకు నా చెల్లికంటే ఎక్కువ. నీయందు నాకు వున్న అభిమానాన్ని మాటలతో చెప్పలేను సత్యా!..."


"అక్కా!... నీ దృష్టిలో నేను చాలా గొప్పదాన్ని కావచ్చు. కానీ... యధార్థంగా నేను చాలా అహంకారిని. స్వార్థపరురాలిని. మురళీధర్ మోహంలో పడిపోయి నేను నావారినందరినీ ఎదిరించాను. ధిక్కరించాను. దానికి తగిన ఫలితాన్ని అనుభవించాను. నిన్ను కలిసిన తర్వాత.... నీ కథ వినగానే, నాలో జ్ఞానోదయం కలిగింది. నా తప్పు నాకు తెలిసి వచ్చింది. తల్లితండ్రి బంధువుల విలువలను తెలుసుకోగలిగాను. 


నాలో ఇంతటి మార్పుకు కారణం నీవు. మన ఇరువురం ఒకే వ్యక్తి స్వార్థానికి బలి అయిన వాళ్ళం. వాడి కపట ప్రేమకు మోసపోయిన వాళ్ళం. ఓడిపోయిన వాళ్ళం. కానీ... ఎప్పుడూ ఇకపై ఆ చేదు జ్ఞాపకాలను తలుచుకొంటూ కృంగి కృశించిపోకూడదు. ఆ గతాన్ని సమాధి చేసి... మన భావి జీవితాన్ని మంచి ఆలోచనలతో, ఆచరణతో చక్కగా తీర్చిదిద్దుకోవాలి. దానికి నేను నీకు... నీవు నాకు ఎప్పుడు అండగా ఐక్యంగా వుండాలి. ఏమంటావ్ అక్కా!" దీనంగా అడిగింది భామ.


భామను చూచిన మానస.... తన గతాన్ని తలచుకొని, పైకి ఎంతో గంభీరంగా మాట్లాడుతున్నా... హృదయంలో సత్య బాధపడుతూ ఉందని మానస గ్రహించింది.


"సత్యా!... నీ చివరి మాటలు నాకు ఆమోదం. నీకోసం నన్ను నీవు ఏమి చేయమన్నా చేసేదానికి నేను సంసిద్ధం. జీవితంలో ఒకసారి మోసపోయిన మనం ఇకపై ఎన్నడూ అలాంటి స్థితిని ఎదుర్కొనబోము. కారణం... ఆ చేదు జ్ఞాపకాలు మన నుండి మనం చచ్చేంత వరకూ వీడిపోవు కాబట్టి... 


మన భావి జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం మన వంతు. మన పెద్దలను గౌరవించి అభిమానించడం మన కర్తవ్యంగా భావించాలి. ఎందుకంటే వారు జీవించి వున్నంత కాలం.... మనం అన్నివిధాలా ఆనందంగా హాయిగా వుండాలని మన కోసం... తాపత్రయపడేది వారే కనుక" సాలోచనగా చెప్పింది మానస.


"అక్కా!... నీతో నేను ఏకీభవిస్తున్నాను" తన చేతిని మానస చేతిలో వుంచింది భామ.


"నేను బి.ఇడి చదవాలని నిర్ణయించుకొన్నాను సత్యా!"


"అంటే టీచర్‍గా వెళ్ళాలనా!"


"అవును. నాకు ఆ చిన్నారుల ముఖాలన్నా... ఆ ప్రశాంత వాతావరణం... ఆ గౌరవం... అంటే ఎంతో ఇష్టం" చిరునవ్వుతో చెప్పింది మానస.


"అక్కా!... నీ నిర్ణయం చాలా మంచిది. నా చిన్నప్పుడు మా నాయనమ్మ చెబుతూ ఉండేది ’అన్ని దానాల్లోకి గొప్పది విద్యా దానమని’ నేనూ... వూరికి వెళ్ళి అమ్మానాన్నలతో మాట్లాడి ఓ కాన్వెంట్ స్కూలును ఓపెన్ చేస్తాను. నీ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నీవు టీచరుగా నా స్కూలుకు రావాలి" నవ్వుతూ భామ చేయి జాచింది.


మానస ఆనందంగా ఆమె చేతిలో తన చేతిని ఉంచింది.

"రేపు లాయర్‍ను కలిసి విషయం చెప్పి నీచేత విడాకుల పత్రాల మీద సంతకం చేయించి... వాటిని సాంబయ్యకు చేర్చే ఏర్పాటు చేయడమే మన పని. అక్కా!... నిద్ర వస్తూ ఉంది. ఇక పడుకుందాం" అంది భామ. ఇరువురూ... ప్రశాంత చిత్తంతో శయ్యపై వాలారు.

*

మరుదినం ఆదివారం. ఉదయాన్నే మంచి టైం చూచుకొని మానస, భామ, నారాయణ విజయనగరం వెళ్ళి లాయర్ పురుషోత్తమరావు గారిని కలిశారు.


భామ మురళీధర్ తన విషయంలో మానస విషయంలో చేసిన మోసాన్ని... మానసను గురి చేసిన చిత్రహింసలను గురించి వివరించింది. అన్ని వివరాలు వారు శ్రద్ధగా వున్నారు.


"అమ్మా!... మానసా!... నీకు విడాకులు సమ్మతమేనా!"


"సమ్మతం సార్!"


"నారాయణగారూ!... మీకు?"


"మనసా వాచా సమ్మతం సార్!" నిట్టూర్పుతో చెప్పాడు నారాయణ.


"అమ్మా!.... మీపేరు సత్యభామ అన్నారు కదూ!"


"అవును సార్!"


"మీది ఏ వూరమ్మా!"


"నెల్లూరు"


"మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?"


"వారూ అడ్వకేట్"


"పేరు!..."


"ముకుందవర్మ!..."


"నీవు ముకుందవర్మ కూతురివా!..." ఆశ్చర్యంతో అడిగాడు డెభ్భై ఐదు సంవత్సరాల పురుషోత్తమరావు.


"వాడు నా శిష్యుడుమ్మా!"


"అలాగా సార్!" సంతోషంగా అడిగింది భామ.


"అవునమ్మా!... చాలా మంచివాడు" తల ఎగరేస్తూ చెప్పాడు పురుషోత్తమరావు. 


క్షణం తర్వాత....

"అమ్మా మానసా!... మరోసారి ఆలోచిస్తావా!"


"ఇకపై ఆలోచించేదానికి ఏమీ మిగలలేదు సార్!" తన నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేసింది మానస.


"సరే... నీ ఇష్టం. ఈ కాగితాల మీద సంతకం చెయ్యి" కాగితాలను మానసకు అందించాడు.


వారు ఇంటూ పెట్టి వున్న చోట్ల తన సంతకాన్ని చేసింది మానస. సుదీర్ఘమైన నిట్టూర్పును విడిచింది.


’నా ఈ సంతకాలతో.... ఆ రాక్షసుడికీ నాకు వున్న వివాహ బంధం తెగిపోయింది’ అనుకుంది మనసున మానస.


"మూడు నాలుగు వాయిదాలు పడతాయి. జడ్జీగారు తీర్పు చెప్పి విడాకుల పత్రాలు మీ చేతికి వచ్చేదానికి ఏడు ఎనిమిది మాసాలు పట్టవచ్చు. ఈలోగా ప్రతి వాయిదాకూ ఆ అబ్బాయి అమెరికా నుండి వచ్చిపోయే నాటికి వాడికి జీవితం మీద విరక్తి పుడుతుంది" చిరునవ్వుతో చెప్పాడు పురుషోత్తమరావు.


పదివేలు వారి ముందుంచింది భామ. పురుషోత్తమరావు ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూచాడు. "సార్!... ప్రస్తుతానికి దీన్ని తీసుకోండి. కేసు వీలైనంత త్వరలో ముగిసి విడాకుల పత్రాలు మా అక్కయ్య చేతికి వచ్చేలా చూడండి" వినయంగా చెప్పింది భామ.


"అమ్మా!.... దాన్ని నీవు చేతికి తీసుకో. నీ దగ్గర నేను డబ్బు తీసుకొన్నానని మా ముకుందవర్మకు తెలిస్తే వాడు బాధపడతాడమ్మా. దాన్ని నీవు చేతికి తీసుకో" అనునయంగా చెప్పాడు పురుషోత్తమరావు.


"స్నేహం... అభిమానం... బాంధవ్యం వేరు. వ్యవహారం వేరు కదా సార్. నాన్నగారు ఏమీ అనుకోరు. మీరు దాన్ని తీసుకోండి. అసలు అక్క విషయం నేను అమ్మా నాన్నలకు చెప్పదలచుకోలేదు" చిరునవ్వుతో చెప్పింది భామ.


"ఇక మేము వెళ్ళొస్తాం సార్" అన్నాడు నారాయణ.


"మంచిది. నేను చేయవలసిన ప్రయత్నాన్ని నేను గట్టిగా చేస్తాను. వీలైనంత త్వరలో విడాకుల పత్రాలు మీ మానసకు అందేలా చూస్తాను."


"థాంక్యూ సార్" తృప్తిగా పలికింది మానస.


"ధన్యవాదాలు సార్!" చేతులు జోడించింది భామ.


"వెళ్ళి రండి" నవ్వుతూ చెప్పాడు పురుషోత్తమరావు.


ముగ్గురూ వారి గదినుండి బయటికి వచ్చారు.

"అక్కా!... ఇప్పుడు నీ మనస్సు శాంతంగా వుందా!" 

కనురెప్పలు ఎగరేస్తూ అడిగింది చిరునవ్వుతో భామ.


"చాలా ఆనందంగా వుంది సత్యా!" తృప్తిగా చెప్పింది మానస.


వారిరువురి మాటలను విన్న నారాయణ కళ్ళు చెమ్మగిల్లాయి. అవి... మానస విడాకుల పత్రాల మీద సంతకం చేసి వివాహ రద్దును కోరినందుకు కాదు. ఇంతకాలం ఆ నీచుడి సహచర్యంతో తన బిడ్డ ఎన్ని కష్టాలు అనుభవించిందో అనే మాట జ్ఞాపకం వచ్చినందుకు.


"పెదనాన్నా ఏడుస్తున్నారా!" దీనంగా అడిగింది భామ.


తండ్రి ముఖంలోకి ఆత్రంగా చూచింది మానస.

"నాన్నా!...." ఆవేదనతో పలికింది.


"అమ్మా!... ఇవి కన్నీరు కాదమ్మా!... ఆనంద భాష్పాలు. చట్టపూర్వకంగా నీపై ఆ రాక్షసుడికి ఎలాంటి అధికారం లేకుండా త్వరలో పోబోతున్నందుకు ఆనందిస్తున్నాను తల్లీ. ఆనందిస్తున్నాను" పై పంచతో కన్నీటిని ఒత్తుకున్నాడు నారాయణ.


దగ్గరలో వున్న రామాలయంలో గుడి గంటలు మ్రోగాయి.

"అమ్మా!.... ఆలయానికి వెళ్ళి...."


"స్వామిని దర్శించి వెళదాం పెదనాన్నా" నారాయణ పూర్తిచేయకముందే భామ మానస కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది.


మానస ’సరే’ అన్నట్లు తలాడించింది చిరునవ్వుతో.


ముగ్గురూ రామాలయంలో ప్రవేశించారు. శ్రీ సీతారామా లక్ష్మణ అంజనా సుతులను దర్శించారు. వారి వారి కోరికలను విన్నవించుకొన్నారు. చేసిన తప్పులను మన్నించమని వేడుకొన్నారు. 


ఆ దేవతా మూర్తుల పాదపద్మాలపై లగ్నం చేసిన వారి మనస్సులకు ఎంతో శాంతి కలిగింది. మూడు ప్రదక్షిణలు చేశారు. తీర్థ ప్రసాదాలను తీసుకొన్నారు. ప్రశాంత చిత్తంతో ఆలయం ముందున్న మండపంలో కూర్చొని.... కొన్ని క్షణాలు ధ్యానించి లేచి నిలబడ్డారు. భామ సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది తల్లి నీలవేణి.


"అమ్మా!"


"అవునే, అమ్మనే. నిన్న రాత్రి మీ నాన్నగారు అమెరికా నుంచి తిరిగి వచ్చారు. రావడంతోటే నీ గురించి అడిగారు. నిన్ను చూడాలని ఆందోళనగా వున్నారు. ఎక్కడ వున్నావు? ఎప్పుడు వస్తావు?" ఆత్రంగా అడిగింది నీలవేణి.


"ఇక్కడకు అంటే విజయనగరానికి నేను వచ్చిన పూర్తయింది. రేపు వేకువన వూరికి బయలుదేరుతున్నాను. రేపు సాయంత్రానికల్లా ఇంటికి చేరుతాను. నా గురించి నీవు భయపడకు."


"ఆఁ.... భయపడకుండా ఎలా వుండగలను చెప్పు. నీవు ఇంటికి రాలేదని వినగానే మీ నాన్నగారు ఆవేశంతో నన్ను అనరాని మాటలన్నారు. నేను నిన్ను సక్రమంగా పెంచలేదట. నాకు పిల్లలను పెంచడం చేతకాదట. అబ్బబ్బా... వారి మాటలతో నా తల పగిలిపోయింది. నీవు నీ వంశం చల్లగుండా. త్వరగా బయలుదేరిరా తల్లీ!" ఆవేశంగా చెప్పింది నీలవేణి.


"చెప్పాను కదమ్మా!... రేపు సాయంత్రానికల్లా నీ సమక్షంలో వుంటానని..." విసుగ్గా చెప్పింది భామ.


"సరే జాగ్రత్తగా రా!"


"అలాగే" ఫోన్ కట్ చేసింది భామ.


ఆలయాన్నించి ఎంతో ఆనందంగా బయలుదేరబోయిన భామ గుండెల్లో తల్లిగారు తన తండ్రిగారిని గురించి చెప్పిన మాటలు ఈటెల్లా గుచ్చుకొన్నాయి.


’అవును... నేను చేసింది పెద్ద తప్పు. ఎవరూ క్షమించలేని నేరం. పెద్దలను ధిక్కరించి పర పురుషుడితో విదేశంలో డేటింగ్ చేయడం... ఆ దేశపు వాసులకు నాగరీకత కావచ్చునేమో కాని మన దేశ వాసులకు.... మన హిందూ కుటుంబాలకు.... సాంప్రదాయాలకు... అది తగని పని. 


కానీ... తాను జాతినీ రీతిని విస్మరించి ఆవేశంతో విచక్షణా రహితంగా సంచరించింది. అందరికీ ఆవేదనను కలిగించింది. అమెరికాలో... మామయ్య అన్ని విషయాలూ నాన్నగారికి తప్పకుండా చెప్పి వుంటారు. వారి తల తిరిగిపోయి వుంటుంది. ఒకవైపున అనుమానం... మరోవైపున ఆవేదన.... తనకు నా గురించి తెలిసిన విషయాలు నాన్న అమ్మతో చెప్పి వుండరు. 


నా విషయంలో అమ్మ మనస్తత్వం ఎలాంటిదో నాన్నకు బాగా తెలుసు. నేను నాన్నగారు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వుండి వుంటే.... వారు నాతో ఏకాంతంగా మాట్లాడి వివరాలను తెలుసుకొనేవారు. నేను వారు వచ్చేసరికి ఇంట్లో లేని కారణంగా... తన ఆవేశాన్ని అమ్మపై చూపించి వుంటారు. నా కారణంగా అమ్మ మాటలు పడవలసి వచ్చింది. 


పాపం... పిచ్చి నా తల్లి. తనకు నేనంటే పంచ ప్రాణాలు. యిక్కడ అక్క విషయంలో చేయాలనుకొన్నది చేసేశానుగా!... తను ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇంటికి వెళ్ళి వెంటనే వూరికి బయలుదేరితే అమ్మా నాన్నలను త్వరగా కలిసికొన్నదాన్నవుతాను. నాన్నగారు లెసన్ సీరియస్‍గా తీసుకుంటారు. మౌనంగా తలదించుకొని వారి మాటలను అంగీకరించడమే నా వంతు. అంతకన్నా వేరే ఏం చేయగలను తప్పు నాదైనప్పుడు. తప్పును ఒప్పుకొని వారిని క్షమాపణ కోరడం నా కర్తవ్యం’ 


ఈ నిర్ణయానికి వచ్చిన భామ..

"అక్కా!.... నేను ఇంటికి వెళ్ళగానే వూరికి బయలుదేరుతాను. పాపం అమ్మ నా గురించి చాలా బాధపడుతూ వుంది. పైగా నాన్నగారు కూడా అమెరికా నుండి తిరిగి వచ్చారట. నీవు వూహించుకోగలవు కదా నా విషయంలో వారిరువురి మధ్యనా ఎలాంటి పరిస్థితి ఏర్పడి వుంటుందో!" అభ్యర్థనగా చెప్పింది భామ.

"సత్యా!... ఇంతవరకూ నీవు మౌనంగా వున్న కారణంగా నీ మనోవేదన నాకు అర్థం అయింది. నీవు ఇంటికి వెళ్ళగానే.... వెంటనే బయలుదేరు." ప్రీతిగా చెప్పింది మానస.


ముగ్గురూ బస్టాండుకు వెళ్ళి బస్సు ఎక్కి మానస గ్రామం చేరారు. ఈ విషయాలేవీ రాంబాబుకు తెలియకూడదని వారు కార్లో రాలేదు.


భోజనం చేసి మానస వూరికి బయలుదేరే దానికి సిద్ధం అయింది.


"పెదనాన్నా!.... పెద్దమ్మా!... ఏయ్ చెల్లీ మాధురీ!... వెళ్ళొస్తాను. అందరూ మానసను జాగ్రత్తగా చూసుకోండి. మీ అందరినీ తాను ఒక్కతే చూచుకోగలదు. కదా అక్కా!" నవ్వుతూ చెప్పింది భామ.


మానస భామను సమీపించింది. ఆమె రెండు చేతులను తన చేతులతో పట్టుకొంది. "మరోసారి చెబుతున్నాను సత్యా!... నీ రుణాన్ని తీర్చుకొనే దానికి నాకు ఈ జన్మ చాలదు చెల్లీ!" ఆ క్షణంలో మానస కంఠం బొంగురుపోయింది. కళ్ళల్లో కన్నీరు. దీనంగా భామ ముఖంలోకి చూచింది.


నాలుగు కళ్ళూ కలిశాయి. భామా అదే స్థితికి రాబోయింది. తలను ప్రక్కకు త్రిప్పి కొన్ని క్షణాలు తమాయించుకొని....

"అక్కా!.... అక్కా చెల్లెళ్ళూ మధ్యన ఎప్పటికీ ఋణం అనేది వుండబోదక్కా మన మధ్యన శాశ్వతంగా వుండబోయేది... ప్రేమ..... ప్రేమ.... సరేనా!... ఇక నేను బయలుదెరుతాను. జాగ్రత్త" అనునయంగా చెప్పింది భామ.


పెద్దలిరువురి పాదాలను తాకి కళ్ళకద్దుకొంది. మాధురిని దగ్గరకు తీసుకొని నొసటన ముద్దుపెట్టి "చిన్నా!... బాగా చదువు" అంది. కారును సమీపించింది.


డ్రైవర్ సీట్లో తాను కూర్చుంది. బాబు వెనుక సీట్లో కూర్చున్నాడు.


 ’బై’ చెప్పి భామ కారును స్టార్ట్ చేసింది.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


25 views0 comments

Comments


bottom of page