top of page

ప్రేమ తరంగాలు - పార్ట్ 6

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు

Prema Tharangalu - Part 6 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 08/12/2024

ప్రేమ తరంగాలు - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:

అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.  

సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు.   

కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.

ఫ్లయిట్ లో మురళీధర్ తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ.


పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది.

చెన్నైలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్ గా భావిస్తుంది. మానసకు తోడుగా కార్లో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది.



ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 6 చదవండి.


"అమ్మా!..."


"ఎక్కడ వున్నావు తల్లీ!"


"పది నిముషాల్లో నీ ముందు వుంటానమ్మా!... నాన్నగారు ఇంట్లో వున్నారా!"


"లేరు.... కోర్టుకు వెళ్లారు. ఏం....?"


"ఏం లేదమ్మా!... వూరికే అడిగాను కట్ చేస్తున్నా!" సెల్ కట్ చేసింది భామ. సుదీర్ఘంగా నిట్టూర్చింది.


’హమ్మయ్యా!.... నేను ఇంట్లో ప్రవేశించే సమయానికి నాన్నగారు ఎక్కడ ఇంట్లో వుంటారో అని భయపడ్డాను. నా మొర దేవుడు ఆలకించాడు. నాన్నగారు కోర్టుకు వెళ్లారు. నిర్భయంగా ఇంట్లో ప్రవేశించవచ్చు’ అనుకొంది భామ ఆనందంగా.


కారు హారన్ వినగానే హాల్లో కూర్చొని కూతురు రాకకై ఎదురు చూస్తున్న నీలవేణి పరుగున వరండాలోకి వచ్చింది.


డ్రైవర్ సీట్లో నుంచి దిగిన కూతురును చూచి.... ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబైపోయింది. కన్న కూతురును చూచి సంవత్సరం కావస్తూ ఉంది. ఎదురొచ్చి కూతురును గట్టిగా కౌగలించుకొంది నీలవేణి.


ఆ తల్లి ఎదపరిష్వంగణ సుఖంలో భామ పదినెలల పొత్తిళ్ళ బిడ్డలా మారిపోయింది.

బాబు వెనుక సీట్లో వున్న భామ లగేజిని క్రిందికి దించి ఒక్కొక్క దాన్ని హాల్లోకి చేర్చాడు. ఆ తల్లి కూతుర్లను చిత్రంగా చూస్తూ.


కొన్ని నిముషాల తరువాత పరవశత నుండి వాస్తవానికి వచ్చిన భామ....

"అమ్మా!... ఈ డ్రైవర్ బాబు చాలా చాలా మంచివాడమ్మా!" ఎంతో ఆనందంగా చెప్పింది భామ.

ఆమె మాటలను నీలవేణి "భామా!.... ఏమిటి నీవు అంటున్నది?" ఆశ్చర్యంతో అడిగింది.


"నేను చెప్పింది ఈ డ్రైవర్ గురించమ్మా!"


"అతను డ్రైవరా!"


"కాక!?"


"నీతో అలా చెప్పాడా!" ఆశ్చర్యంగా బాబు, భామ ముఖాలను మార్చి మార్చి చూచింది నీలవేణి.


"అతను చెప్పలేదమ్మా!... నాకు ఆమాత్రం తెలీదా అతను డ్రైవరని!"


"మొద్దు... అతను డ్రైవర్ కాదు"


"మరెవరు?...." ఆశ్చర్యపోయింది భామ.


"లాయర్!.... మీ నాన్నగారి జూనియర్!"


బాబు చిరునవ్వుతో నిలబడి వారి మాటలను వింటున్నాడు. భామకు కరెంట్ షాక్ తగిలినట్లు నిలబడిపోయింది.


"బాబూ!"


"చెప్పండమ్మగారూ!"


"అయ్యగారు నిన్ను ఈ రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకోమన్నారు. రేపు ఉదయం తొమ్మిది గంటలకు రమ్మన్నారు."


"అలాగే మేడం. నేవెళ్ళొస్తాను" క్షణంసేపు భామ ముఖంలోకి చూచి చిరునవ్వుతో తల త్రిప్పుకొని వీధి వాకిటవైపుకు నడిచాడు.


ఎంతో హుందాగా నడిచి వెళుతున్న బాబును భామ చిత్రంగా చూస్తూ... చిత్తరువులా నిలబడింది. భామ ఆ వెర్రి చూపులను చూచి, నీలవేణి.... "నీతో వచ్చినవాడే కదా!... ఎందుకు అంత వింతగా చూస్తున్నావ్. పద లోపలికి" అంది.


తల్లీ కూతుళ్ళు ఇంటి హాల్లోకి ప్రవేశించారు. సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు.

భామ మనస్సున బాబును గురించిన ఆలోచనలు. మద్రాసులో అతను తనకు కనిపించినప్పటి నుంచి... తాను అతన్ని డ్రైవర్‍గానే భావించింది. అతని యొక్క డ్రైవింగ్ సామర్థ్యాన్ని చూచి సంతోషించింది. సమర్థుడని, సహనశీలుడని, కష్టజీవి అని భావించింది. తల్లి అతను ఎం.ఎ.బి.ఎల్ అడ్వకేట్ అని చెప్పగా విని ఆశ్చర్యపోతూ వుంది.


"ఏమిటే!... మాటా పలుకూ లేకుండా అలా ఏదో ఆలోచనలో కూర్చుండిపోయావు?"


"నా ఆలోచన ఆ బాబును గురించమ్మా!"


"అవునూ!.... ఈసారి నా గొంతు వినగా అమ్మా... అమ్మా అంటూ అచ్చ తెలుగు పదాన్ని పలుకుతున్నవు. ఆ మమ్మీని ఏం చేశావ్ బంగారం!" లాలనగా నవ్వుతూ అడిగింది నీలవేణి.

"ఆ పదం మీద అసహ్యం వేసి వచ్చేటప్పుడు అట్లాంటిక్ సముద్రంలో పారేశానమ్మా!... ’అమ్మ” అనే పిలుపులోని ఈ మాధుర్యం ఆ ఆంగ్ల పదంలో లేదమ్మా"


"నీలో ఏదో గొప్ప మార్పు కనిపిస్తూ వుంది"


"అవునమ్మా!... నేను మారిపోయాను. కొన్నాళ్ళుగా అమెరికాలో వున్నందున... నాకు నేను నిర్లక్ష్యం చేసిన నా జాతీ, రీతి... ఔన్నత్యం.... ఆదర్శం... గురించి ఆలోచించి యధార్థాన్ని తెలుసుకోగలిగాను. అమెరికా జీవితానికి స్వస్థి చెప్పి మా అమ్మానాన్నలైన మీ వద్ద శాశ్వతంగా బ్రతికినంత కాలం వుండి మీ ఇష్టానుసారంగా నడుచుకోవాలి... మీకు ఆనందం కలిగించాలని తిరిగి వచ్చాను."


"ఏమిటే వింతగా పెద్ద పెద్ద మాటలను విచిత్రంగా మాట్లాడుతున్నావు?" ఆశ్చర్యంతో అడిగింది నీలవేణి.


"నేను మాట్లాడింది వింతా కాదు. విచిత్రమూ కాదు. యదార్థం. గత జీవితం నాకు నేర్పిన పాఠం" 

క్షణం తర్వాత... 

"అవునూ... అమ్మా!.... తప్పుగా అనుకోకు. ఆ బాబు నిజంగా లాయరేనా!"


"మీ నాన్నగారికి అసిస్టెంట్ అని చెప్పాను కదే. నీకు ఇంకా అతని మీద అనుమానమా!"


"అనుమానం కాదు"


"మరేమిటి?"


"ఆవేశం!"


"ఎందుకు? నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చినందుకా!"


"కాదు... నన్ను మోసం చేసినందుకు?"


"మోసమా!"


"అవునమ్మా అతడు నన్ను మోసం చేశాడు. నాతో నిజం చెప్పలేదు"


"ఏ నిజం?"


"తాను లాయర్... అని నాతో చెప్పలేదు!"


"ఓసి నీ ఇల్లు బంగారం గాను. ఇంతేనా!... చెప్పే అవకాశాన్ని నీవు ఇచ్చి వుండవు. వాడు పిచ్చుక లాంటి వాడు. వాడి మీద నీవు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకు. పాపం.... అల్పజీవి"


"అల్పజీవి కాదమ్మా... లోతు మనిషి... అలాంటి వారితో చాలా జాగ్రత్తగా వుండాలి."


"ఆ అమాయక ప్రాణి సొది ఆపి స్నానం చేసిరా. ఆనంద్ కూడా వచ్చేవేళ అయింది. అందరం కలిసి భోజనం చేద్దాం."


"అలాగే అమ్మా!..." చెప్పింది భామ లేచి తన గదివైపుకు పోయింది.


అంతకుముందే పనిమనిషి మల్లి భామ లగేజ్‍ని ఆమె గదికి చేర్చింది.

స్నానం చేస్తుండగా భామకు మానస గుర్తుకు వచ్చింది. ’పాపం.... నా ఫోన్ కోసం ఎదురు చూస్తూ వుంటుంది’ అనుకొంది.

స్నానం ముగించి డ్రెస్ మార్చుకొని మానసకు ఫోన్ చేసింది.

"హలో... అక్కా!"


"ఆ.... సత్యా!... క్షేమంగా చేరావుగా!"


"అవునక్కా.... అందరికీ చెప్పు."


"అలాగే. అమ్మా నాన్నలకు విషయం చెప్పావా?"


"నాన్నగారు కోర్టుకు వెళ్ళారు. సాయంత్రానికి వస్తారు. ఆ తర్వాతనే చెప్పాలి. భయంగా ఉంది"

"భయపడకు, మనకు కనబడని దేవుని అండ మనకు ఎప్పుడూ ఉంటుంది. ఆయన్ని నమ్ముకొంటే చాలు. మన సమస్యలు తీరిపోతాయి. నా విషయంలో నేను నమ్మిన ఆ దేవుడే నీ రూపంలో నాకు సాయం చేశాడు. దైవాన్ని నమ్ము. శరణు వేడు. ఆయన ఒక్కడే మన కష్టాలను తీర్చగలడు. సరేనా!"


"అలాగే అక్కా!"


హాల్లో నుంచి పిలిచిన తల్లి పిలుపు వినిపించింది భామకు. మేడపైని తన గది నుండి క్రిందికి వచ్చింది.

అదే సమయానికి తమ్ముడు ఆనందవర్మ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. భామను చూడగానే ఎంతో ప్రేమతో ఆమెను సమీపించాడు. భుజంపై చేయి వేసి అతన్ని దగ్గరకు తీసుకొంది భామ. యోగక్షేమాలను విచారించింది.


ఆనంద్ నవ్వుతూ భామ అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాడు.

నీలవేణి హాల్లోకి వచ్చింది. ఇరువురూ ఆమె వెనకాల డైనింగ్ రూమ్ వైపుకు నడిచారు. భోజనం చేసి ఆనంద్ కాలేజీకి వెళ్ళిపోయాడు.

తల్లీ కూతుళ్ళు హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. నీలవేణి సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది ముకుందవర్మ.


"ఏమండీ!... మన అమ్మాయి వచ్చేసింది"


"ఎలా వుంది?"


"బాగా ఆరోగ్యంగా వుంది"


"చెన్నై నుండి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిందట!"


"నేను మీతో యింతకుముందే చెప్పాను కదండీ! తన స్నేహితురాలితో వారి వూరైన విజయనగరం వెళ్ళిందని, మరిచిపోయారా!"


"వయస్సు అవుతూ వుంది నీలూ.... జ్ఞాపకశక్తి తగుతున్నట్లనిపిస్తూ వుంది" విరక్తిగా నవ్వాడు ముకుందవర్మ.


"జ్ఞాపకశక్తి లేకుండా కోర్టులో వాదనలు సాగిస్తున్నారా!"


"అమ్మాయి ఏం చేస్తూ ఉంది?"


"నాముందు కూర్చుని టీవీ చూస్తూ ఉంది. తను ఇకపై అమెరికాకు వెళ్లదట. ఫోన్ అమ్మాయికి ఇవ్వనా!"


"ఇవ్వు!" అగాధంలోనుంచి వెలువడినట్లు వుంది ఆ రెండు అక్షరాల సవ్వడి.


నీలవేణి ఫోన్‍ను భామకు అందించింది నవ్వుతూ.

"అమ్మా!.... అమ్మా!..." భయంతో మెల్లగా అంది భామ.


క్షణం తర్వాత...

"నాన్నా!.... మీరు బాగున్నారా!... నేను వచ్చేశాను నాన్నా!" ఆ క్షణంలో భామ కంఠం బొంగురుపోయింది.


కూతురు ముఖ భంగిమలో కలిగిన మార్పు.... కంఠ స్వరాన్ని విని నీలవేణి ఆందోళనగా....

"ఏమైందే ఏడుస్తున్నావ్!"


"బాధపడకు తల్లీ!.... సాయంత్రం మాట్లాడుకొందాం అమ్మతో ఏ విషయం చెప్పకు" అనునయంగా చెప్పాడు ముకుందవర్మ. సెల్ కట్ చేశాడు.


వారి మాటలు భామకు ఎంతో వూరటకు కలిగించాయి. సమాళించుకొని...

"ఏం లేదమ్మా!... నాన్న ఎంతో ఆప్యాయంగా ’ఎలా వున్నావురా’ అని అడిగారు. వారి ప్రేమ పూరితమైన ఆ మాటలను విని.. నా ఇష్టానుసారంగా స్వేఛ్ఛగా బ్రతికినందుకు నాకు ఇప్పుడు బాధగా వుందమ్మా!..." జలజలా కన్నీరు కార్చింది బాధతో భామ.


నీలవేణి లేచి భామ ప్రక్కన కూర్చొని భుజంపై చేయివేసి...

"మేమిరువురం నీ ఆనందమే మా ఆనందంగా భావించాము గాని... నిన్ను గురించి తప్పుగా ఏనాడు ఒక్కమాటను మాట్లాడూకొని ఎరుగము. ఆయనకు నీవంటే పంచప్రాణాలు. ఇప్పుడు వచ్చేశావుగా. ఇక మా ఆనందానికి హద్దులు లేవు. ప్రయాణ బడలిక నీ ముఖంలో కనిపిస్తూ ఉంది. వెళ్ళి రెండు గంటలసేపు హాయిగా నిద్రపో తల్లీ" ఎంతో ప్రీతిగా చెప్పింది నీలవేణి.


భామ తల్లి ముఖంలోకి క్షణంసేపు చూచి.... లేచి తన గదిలోనికి వెళ్ళిపోయింది. మంచంపైన వాలిపోయింది.


ముకుందవర్మ ఎంతో అభిమానంగా... ’బాధపడకు తల్లి.... సాయంత్రం మాట్లాడుకొందాం. అమ్మతో ఏ విషయం చెప్పకు’ అన్న మాటలు భామ చెవుల్లో మారుమ్రోగాయి.


’యింతటి ప్రేమాభిమానాలను తన పట్ల వున్న తల్లిదండ్రులను తాను లక్ష్యపెట్టలేదు. స్వార్థంతో తన కళ్ళు మూసుకుపోయాయి. మురళీధర్ కపట ప్రేమను యధార్థంగా భావించింది. అతన్ని మనసారా ప్రేమించింది. తన తల్లిదండ్రుల మంచితనం.... వారికి దైవం మీద వున్న నమ్మకం.... వారు చేసే పూజా పునస్కారాలు... వారు తన క్షేమం కోసం ఆ దేవునికి చేసిన విన్నపాల ఫలితంగా ఆ దేవుడు తనను, తన అహంకారాన్ని.... మన్నించి ఆ పెద్ద ఆపద నుండి కాపాడాడు. ఈ నా తల్లిదండ్రుల ఋణాన్ని వారికోసం తాను ఈ జన్మలో ఏం చేసినా తీర్చుకొనలేదు. 


ఇకపై నాకు సంబంధించిన వారి ప్రతి నిర్ణయాన్ని తాను సమ్మతించాలి. తన ప్రవర్తనకు వారు సంతసించాలి. గడిచిన చేదు అనుభవాల జ్ఞాపకాలను మదినుండి తుడిచివేయాలి. అన్నివిధాలా తల్లిదండ్రులకు తనకు ఆనందం కలిగేలా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. పది మందికి మేలు చేయాలి. మంచి పేరును సంపాదించుకోవాలి. ఇకపై నా లక్ష్యం.... సాధన తన వారికి ఎంతో ప్రీతిపాత్రం కావాలి’ పరిపరివిధాల ఆలోచించి చివరకు... ఆ నిర్ణయానికి వచ్చింది భామ.

తండ్రి తనను చూచి ’ఏమంటాడో!.... ’ అనే భయం మనస్సున ఒక మూల వేధిస్తూ వుంది. ఆయన ఎంతో సంస్కారవంతుడు. గొప్ప జీవితానుభవం కల వ్యక్తి. అసభ్యమైన మాటలను తాను వారి నోట నుండి ఇంతవరకూ ఏనాడూ వినలేదు. కొన్ని విషయాల్లో తల్లి తనను బెదిరించినా.... ఆ తండ్రి నవ్వుతూ తల్లి నీలవేణికి సర్ది చెప్పేవాడు. ’చిన్నపిల్ల.... నీ అంత విజ్ఞత... వివేకం రావాలంటే ఇంకా ఎదగాలి నీలూ!... వూరికే కసరక’ అని నవ్వుతూ తన తల్లిని హెచ్చరించేవాడు.


అంతటి సహనమూర్తి.... తనను ఎంతగానో అభిమానించే తన తండ్రికి తన ముఖాన్ని చూపించే దానికి భయపడుతూ వుంది భామ. ఆ కలవరంతోనే కళ్ళు మూసుకొంది. కొంతసేపటికి నిద్రపోయింది.


ఆరుగంటలకు ముకుందవర్మ కోర్టునుండి.... తిరిగి వచ్చారు. భార్య ఎదురైంది. కూతురుని గురించి అడిగారు. తన గదిలో నిదురపోతూ వుందని నీలవేణి జవాబు చెప్పింది.


నేరుగా భామ గదిలోకి వచ్చారు. మంచాన్ని సమీపించి నిద్రపోతూ వున్న భామ ముఖంలోకి వంగి చూచాడు కొన్నిక్షణాలు.

నీలవేణి కూడా అతని వెనుకాలే ఆ గదిలోకి వచ్చింది. 


"నీలూ!... భామ నిద్రపోతూ ఉంది. పోనీ, పద మనం క్రిందికి వెళదాం. నిద్రలేచిన తర్వాత నేను మాట్లాడుతాను" మెల్లగా చెప్పాడు ముకుందవర్మ.


ఇరువురూ క్రింది హాల్లోకి వచ్చారు. శివాలయానికి వెళ్ళి వస్తానని చెప్పి.... నీలవేణి ఆలయం వైపుకు వెళ్ళింది.


ముకుందవర్మ స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొన్నారు. తన ఆఫీసు గదిలో కూర్చున్నారు. ఏదో కేసుకు సంబంధించిన కాగితాలను చూడసాగారు.

భామ.... నిద్రలేచింది. పనిమనిషి మల్లి గదిలోకి వచ్చి భామకు కాఫీ ఇచ్చింది. ముఖం కడుక్కొని భామ కాఫీ గ్లాసును అందుకొంది.

"మల్లీ! అమ్మ ఎక్కడ వుంది?"


"అమ్మగారు శివాలయానికి వెళ్ళారమ్మా!"


"నాన్నగారు!"


"ఆఫీసు గదిలో కూర్చొని వున్నారమ్మా!"


తాను తండ్రిని కలవడానికి ఇదే మంచి సమయంగా భావించింది భామ. కాఫీ త్రాగి గ్లాసును టీపాయ్‌పై వుంచి మెల్లగా మెట్లు దిగి తండ్రిగారి ఆఫీసు గదిని సమీపించింది భయంతో.

వాకిట్లో నిలబడి వున్న భామను ముకుందవర్మ చూచాడు. కుర్చీ నుండి లేచి ఆమెను సమీపించి "రా తల్లీ...." భుజంపై ప్రీతిగా చేయి వేసి సాదరంగా లోనికి నడిచాడు. తండ్రి ప్రక్కన వారి చేతి క్రింద తలవంచుకొని భామ గదిలోకి నడిచింది.


"కూర్చో అమ్మా!...." ప్రీతిగా చెప్పాడు ముకుందవర్మ. 


భామ మౌనంగా కుర్చీలో కూర్చుంది.

ఆమె ప్రక్కన వున్న కుర్చీలో ముకుందవర్మ కూర్చున్నాడు. ఆప్యాయంగా కూతురి ముఖంలోకి చూచాడు.


భయంతోనే తలను పైకెత్తి తండ్రి ముఖంలోకి చూచింది భామ. క్షణంసేపు వారి ముఖంలోకి చూచి.... తలను దోషిలా దించుకొని....

"నాన్నా!..... నేను తప్పుడు నిర్ణయాన్ని తీసుకొన్నాను. మీ మంచితనం వల్ల... నాకు నా తప్పు తెలిసింది. నా మనస్సు మారింది. ఎలాంటి కళంకం లేకుండా నేను మన ఇంటికి వచ్చేశాను నాన్నా!... నా తప్పును క్షమించండి." బేలగా బొంగురు పోయిన కంఠంతో చెప్పింది భామ.


"నీ సామర్థ్యం మీద నాకంటే మీ మామయ్యకు నమ్మకం ఎక్కువమ్మా!..... వాడి మాటే గెలిచింది. నీవు వాడికి పంపిన మెసేజ్‍ని వాడు నాకు చూపించాడు. దాన్ని చూసిన తర్వాత... అంతవరకూ నాలో వున్న అనుమానాలన్నీ ఎగిరి పోయాయమ్మా. ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాను. తల్లీ!.... 

ఆ చేదు అనుభవాలను, జ్ఞాపకాలను మరిచిపో. మంచి నిర్ణయాలు తీసుకో. ఆచరించు. నీకు జన్మనిచ్చిన ఈ తండ్రి నీకు అన్ని విషయాల్లో జీవితాంతం వరకూ అండగా వుంటాడమ్మా!.... నా మాటను నమ్ము. బాధపడకు. అమ్మకు ఆ విషయాలేవీ చెప్పకు." తన పై పంచెతో కూతురి కన్నీటిని తుడిచాడు ముకుందవర్మ.


భామ బాధతో అతని చేతుల్లో వాలిపోయింది. ముకుందవర్మ ప్రీతిగా భామ తల నిమురుతూ....

"అమ్మ రావచ్చు.... సమాళించుకో. నేను చెప్పానుగా తల్లీ నా జీవితాంతం వరకూ నేను నీకు అండగా వుంటానని. ఇంకా నీకు ఎందుకు భయం, దిగులు. వూరుకో.... వూరుకో అమ్మా!" అనునయంగా చెప్పాడు ముకుందవర్మ.


భామ ఆనందంగా ముకుందవర్మ ముఖంలోకి చూచింది. ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని... తన కుడిచేతిని ఆమె తలపై వుంచి మనసారా దీవించాడు ముకుందవర్మ.

"నాన్నా!"


"చెప్పమ్మా!"


ఫ్లైట్‍లో తనకు పరిచయమైన మానస కథనంతా చెప్పి... ఆమెతో వారి వూరికి వెళ్ళి తాను చేసిన పనిని వివరంగా ముకుందవర్మకు తెలియజేసింది భామ.


సాంతం విన్న ముకుందవర్మ.... తన కుమార్తె ధైర్యసాహసాలకు సంతోషించాడు. మానస తీసుకొన్న నిర్ణయాన్ని.... ఆమెకు భామ చేసిన సహాయాన్ని అభినందించాడు.

ఆ అడ్వకేట్ పురుషోత్తమరావు గారికి ఫోన్ చేసి మానసకు విడాకులు త్వరలో లభించేలా చేయవలసిందిగా కోరాడు. శిష్యుని మాటలను విన్న పురుషోత్తమరావు.... భామ సామర్థ్యాన్ని మెచ్చుకొని... మానసకు త్వరలో విడాకులు మంజూరయ్యేటట్లు చేస్తానని వాగ్దానం చేశాడు.

"నాన్నా!... నేను మన వూర్లో ఒక కాన్వెంట్ స్కూలును ప్రారంభించాలని నిర్ణయించుకొన్నాను" తన అభిప్రాయాన్ని తెలియజేసింది భామ.


"స్కూలా!"


"అవును నాన్నా!... అన్నీ దానాల్లోకి విద్యాదానం గొప్పదికదా నాన్నా!"


"అవును తల్లీ" చిరునవ్వుతో చెప్పాడు ముకుందవర్మ.


"అందుకే ఆ నిర్ణయం తీసుకొన్నాను" నవ్వుతూ అంది భామ.


"సరే..... నాకు పరిపూర్ణ సమ్మతం"


"నా సమ్మతంతో మీకు అవసరం లేదా!" గదిలోకి వస్తూ అడిగింది నీలవేణి.


"విషయాన్ని తెలుసుకొంటే... నీవూ తప్పక సమ్మతిస్తావు నీలూ!" నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ.


ఆ తండ్రీ కూతుళ్ళ నొసటన విభూతి కుంకుమలను తీర్చి దిద్దింది నీలవేణి. కుర్చీలో కూర్చుంది.

"ఇప్పుడు చెప్పండి విషయం ఏమిటి?"


"మన అమ్మాయి ఓ కాన్వెంట్ స్కూలు మన వూర్లో ప్రారంభిస్తుందట"


"అలాగా!"


"అవునమ్మా!"


"మంచి నిర్ణయం తల్లీ... నాకూ సమ్మతం" నవ్వుతూ చెప్పింది నీలవేణి.


"అమ్మా భామా!... ఫైనాన్స్ మినిస్టర్ గారి సమ్మతమూ లభించింది. యిక నీవు నీ ప్రయత్నాన్ని సాగించవచ్చు" చిరునవ్వుతో చెప్పాడు ముకుందవర్మ.


బాలగోవిందయ్య.... రాంబాబు వచ్చారు. వారిని చూచి భామ, నీలవేణి గదినుండి బయటికి నడిచారు.


"అమ్మా!... భామా!.... ఈ రాంబాబు నీకు తెలుసుగా నీకు ఏదైనా అవసరం అయితే ఇతనికి చెప్పు ఏర్పాటు చేస్తాడు" బాబు వైపుకు చూచి... "బాబూ!... అమ్మాయి కాన్వెంటు స్కూలు పెట్టాలని నిర్ణయించుకొంది. ఆ విషయంలో ఆమెకు నీవు సాయం చేయాలి" అన్నాడు ముకుందవర్మ.

"అలాగే సార్!" క్షణంసేపు భామ ముఖంలోకి చూచి వినయంగా చెప్పాడు బాబు.


భామ బాబు ముఖంలోకి సీరియస్‍గా చూచి తల్లితో కలిసి వెళ్ళిపోయింది.


=======================================================================

ఇంకా వుంది..

=======================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


33 views0 comments

Comments


bottom of page