#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Prema Tharangalu - Part 7 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 15/12/2024
ప్రేమ తరంగాలు - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.
సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు.
కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.
ఫ్లయిట్ లో మురళీధర్ తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ.
పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది.
చెన్నైలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్ గా భావిస్తుంది. మానసకు తోడుగా కార్లో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తండ్రికి అన్ని విషయాలూ చెప్పి, అమెరికాకు ఇక వెళ్లనని, ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 7 చదవండి.
భామ.... తండ్రి ముకుందవర్మ సలహాతో వారి ఇంటికి పరిసరాలకు కాలుమీటర్ దూరంలో వున్న ఆరు ఎకరాల స్థలాన్ని కాన్వెంట్ స్కూలుకుగా నిర్ణయించింది. ముకుందవర్మకు చెన్నైలో బాగా తెలిసిన కన్సల్టింగ్ ఇంజనీర్ మాధవరావును, తండ్రి కూతుళ్ళు కలుసుకొన్నారు. తమ నిర్ణయాన్ని వారికి తెలియజేశారు.
మాధవరావు నెల్లూరికి వచ్చి ఆ స్థలాన్ని చూచి కొలతలు తీసుకొని నెలరోజుల లోపల ప్లాన్స్ ఎస్టిమేట్, రెడీ చేసి ఇస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ముకుందవర్మ, భామ... జిల్లా పరిషత్ ఛైర్మన్ గారిని కలిసి తమ ప్రపోజల్ గురించి వివరించారు. వారి నిర్ణయానికి ఛైర్మన్‍గా సంతసించారు. తాను చేయగలిగిన సహాయాన్ని చేస్తానని హామీ ఇచ్చారు.
కాన్వెంట్‍కు ‘నీలు ముకుంద’ అనే పేరు నిర్ణయించారు. రిజిస్టర్ చేశారు. చెన్నై నుండి ఇంజనీర్ మాధవరావు ప్లాన్స్ అన్నీ రెడీ అయినాయని వస్తే అన్ని చూపించి వివరాలు తెలియజేస్తానని ఫోన్ చేశారు. కోర్టు కేసుల కారణంగా ముకుందవర్మ వెళ్ళలేకపోయారు. రాంబాబును, భామను వెళ్ళి మాధవరావు గారితో అన్ని వివరాలు మాట్లాడి ప్లాన్స్ తీసుకొని రావలసిందిగా చెప్పాడు ముకుందవర్మ.
రాంబాబు భామ కార్లో చెన్నై బయలుదేరారు. మాధవరావు గారిని కలిశారు. వారు ప్లాన్స్ అన్నీ చూపించి వివరాలను తెలియజేశారు.
"అమ్మా!.... ప్రస్తుతానికి ఈ స్కూలు భవనం రెండు ఫ్లోర్ల నిర్మాణం చేస్తే చాలు. ఒక్కొక్క ఫ్లోర్లో పది గదులు. హెడ్ మిసెస్ రూమ్, ఆఫీసు స్టాఫ్, టీచర్స్ రెస్ట్ రూం.... కుడివైపు భాగాన్ని ఆనుకొని వుంటాయి. ఈ అకామిడేషన్‍తో ఎనిమిది వందల పిల్లలు హాయిగా చదువుకోగలరు.
బిల్డింగ్ డిజైన్.... మరో మూడు అంతస్థులు కూడా ఉత్తరోత్తరా నిర్మాణం చేసేదానికి వీలుగా డిజైన్ చేయబడింది. ఈ రెండు అంతస్థులకు నూట ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది. ఇదిగో ఎస్టిమేట్ చూడండి" చిరునవ్వుతో డ్రాయింగ్స్ ను ఎస్టిమేట్‍ను అందించాడు మాధవరావు గారు.
అన్నింటినీ భామ పరిశీలనగా చూచింది. ఆమె కళ్ళల్లో కొత్త వెలుగు. తన కల నిజం కాబోతున్నందుకు మనస్సులో ఎంతో సంతోషం.
"బిల్డింగ్ ఎలివేషన్ చాలా బాగుంది సార్" ఆనందంగా చెప్పింది భామ. క్షణం తర్వాత.... "సార్!.... దీని నిర్మాణానికి ఎంత సమయం కావాలి?" వినయంగా అడిగింది.
"ఆరు మాసాలమ్మా!... ఇది అక్టోబర్ కదా... ఏప్రిల్ కల్లా భవంతి పని పూర్తవుతుంది. జూన్ నుండి మీరు క్లాసులు ప్రారంభించవచ్చు. క్రింది ఫ్లోరును మీరు మార్చి ఆక్రమించి మీ అడ్మిషన్ కార్యకలాపాలు సాగించవచ్చు."
"భవన నిర్మాణం మీ పర్యవేక్షణలోనే జగరాలి. నాన్నగారు మీతో ఈ మాట చెప్పమన్నారు."
"ముకుందవర్మ కోరడం... నేను కాదనడమా! తప్పకుండా నేను ఆ బాధ్యతను స్వీకరిస్తాను" నవ్వుతూ చెప్పాడు మాధవరావు.
"ఇక మేము బయలుదేరుతాం సార్" వినయంగా చెప్పింది భామ.
"ఆల్ ది బెస్ట్ వెళ్ళి రండి. శంకుస్థాపన ముహూర్తాన్ని నిర్ణయించి నాకు తెలియజేయండి. నేను వస్తాను."
"అలాగే సార్. నమస్తే..."
ప్రక్కనే నిలబడి వారిరువురి సంభాషణను మౌనంగా వింటున్న రాంబాబు ముఖంలోకి చూచింది భామ.
రాంబాబు ఆ చూపులకు బెదిరిపోయి ’ఏమిటీ’ అన్నట్లు ఆశ్చర్యంతో భామ ముఖంలోకి చూచాడు.
"మిస్టర్ రాంబాబు! వాటిని చేతిలోకి తీసుకోండి" వ్యంగ్యంగా అంది భామ.
వెంటనే రాంబాబు టేబుల్ మీద వున్న డ్రాయింగ్స్ ను ఎస్టిమేట్ ఫైల్స్ ను తన చేతికి తీసుకొన్నాడు.
"అన్ని డ్రాయింగ్సులో నేను సంతకం సీలు వేశాను. మీరు అప్రూవల్‍కు సబ్మిట్ చేయవచ్చు. నాన్నగారితో చెప్పండి" అన్నాడు మాధవరావుగారు.
"అలాగే సార్!" నవ్వుతూ చెప్పింది భామ.
రాంబాబు భామ కారును సమీపించారు. తన చేతిలోని వాటిని రాంబాబు కారు వెనుక సీట్లో పెట్టాడు. డోర్ తెరిచాడు. భామ ముందు కూర్చుంది. తాను డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు. భామ ముఖంలోకి చూచాడు.
"ఏమిటా చూపు?"
"స్టార్ట్ చేయమంటారా!"
"వేరే చెప్పాలా!"
క్షణంసేపు భామ ముఖంలోకి చూచి కారును స్టార్ట్ చేశాడు రాంబాబు.
"మీరు భోజనం చేయాలి కదండీ!" మెల్లిగా అడిగాడు.
"తమరు!!!... చేశారా!!!"
’లేదు’ అన్నట్లు బిక్కముఖంతో తలాడించాడు రాంబాబు.
"రాయపేట న్యూవుడ్ ల్యాండ్స్ హోటల్‍కు పోనియ్యండి. దారి తెలుసా!"
"తెలీదండి"
"కారును ప్రక్కన ఆపండి"
రాంబాబు రోడ్డు ప్రక్కన కారును ఆపాడు. కారు నుండి దిగాడు.
భామ డ్రైవర్ స్థానంలోకి జరిగింది. రాంబాబు ఆమె కూర్చొని వున్న స్థానంలో కూర్చున్నాడు. భామ కారును స్టార్ట్ చేసింది.
"మాధవరావు గారి ఆఫీస్ వున్న ప్రాంతం పేరు తెలుసా!" రాంబాబు ముఖంలోకి చూస్తూ అడిగింది భామ.
"మహా లింగపూర్ కదండీ!" మెల్లగా చెప్పాడు రాంబాబు.
"అబ్బ.... ఖచ్చితంగా చెప్పారు!" కిలకిలా నవ్వింది భామ.
అతని అమాయకత్వాన్ని చూచిన భామకు ఆనందం. ఆ మహానగరంలో ఎక్కడ ఏది వున్నదీ తెలియనందున రాంబాబుకు విచారం. మౌనంగా తలను ప్రక్కకు త్రిప్పి వెనక్కు వెళ్ళిపోతున్న షాపులను భవంతులను చూస్తూ వుండిపోయాడు రాంబాబు.
"అవునూ!.... అరగంట సేపు నేను మాధవరావుగారితో ఎన్నో విషయాలు మాట్లాడాను కదా!... మీరు ఒక్కమాట కూడా మాట్లాడలేదేం?"
"నాకు తెలియని సబ్జెక్టును గురించి నేను ఏమి మాట్లాడగలనండీ!" విచారంగా చెప్పాడు రాంబాబు.
"మాట్లాడి తెలుసుకోవాలని అనిపించలేదా!"
"అనవసరమైన విషయాల్లో జోక్యం కల్పించుకోవడం తప్పని నా అభిప్రాయం అండీ"
"అలాగా!"
"అవునండీ!"
"అవునూ!... నాతో విజయనగరం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని డ్రైవర్ అంటే... కాదు అని ఎందుకు చెప్పలేదు?"
"నాకు మీరు ఓ పేరు పెట్టేశారు కదండీ. మీతో వాదించకూడదని వూరుకున్నానండి."
"అంటే!"
"అంటే... వేరే ఏమీ లేదండి. నిజం నిలకడ మీద తెలుస్తుందిలే... అనుకొన్నానండి."
"ఓహో!.... అదా మీ ఉద్దేశ్యం!..."
"అవునండి. మీరు యజమానులు. నేను మీ నౌకర్ని. మీతో నాకు వాదులాట ఎందుకండి!"
"హో!.... అలాగా!"
"ఎస్ మేడమ్!"
క్షణంసేపు భామ అతని కళ్ళల్లోకి సీరియస్‍గా చూచింది.
"మీరు చాలా లోతు మనిషి... వెరీ డేంజర్"
రాంబాబు క్షణంసేపు భామ కళ్లల్లోకి చూచి తలను త్రిప్పుకొని తనలో తాను నవ్వుకున్నాడు.
కారు న్యూవుడ్ ల్యాండ్స్ ఆవరణంలో ప్రవేశించింది. భామ కారును పార్కింగ్ ప్లేసులో నిలిపింది. ఇరువురూ కారు దిగారు.
లోనికి వెళ్ళి అరగంటలో భోజనం ముగించి ఇరువురూ కారును సమీపించారు.
ప్రక్కన... మరో కారు వచ్చి ఆగింది. అందులో నుంచి మురళీధర్ మరో వ్యక్తి దిగారు. అతన్ని చూచిన భామ హడలిపోయింది. వెంటనే కార్లో కూర్చుంది.
"రాంబాబు!... కారును వెంటనే స్టార్ట్ చేయండి" ఆవేశంగా అంది.
క్షణాల్లో ఆమె ముఖం నిండా చెమట పట్టింది. ఆ క్షణంలో భామ ముఖంలో కలిగిన మార్పును రాంబాబు గ్రహించాడు. కారును వెంటనే స్టార్ట్ చేశాడు. కారు రోడ్డు మీదికి వచ్చేసింది. ప్రక్కనే ఎంతో ఆందోళనగా కూర్చున్న భామ ముఖంలోకి చూచాడు రాంబాబు.
హోటల్ బయట ఎవరినో చూచిన తర్వాత భామ ముఖంలో రంగులు మారాయి. అంతవరకూ ఎంతో సరదాగా వున్న ఆమెలో ప్రస్తుతపు ఈ మార్పుకు కారణం ఏమిటి?.... తాను ఎవరినో చూచి భయపడింది. అతను ఎవరు? పాపం భయంతో తల్లడిల్లిపోతూ వుంది. మాట కలిపి విషయాన్ని తెలుసుకొని వూరడించడం సాటి మనిషిగా నా కర్తవ్యం కాదా!..’ అలా ఆలోచించిన రాంబాబు మెల్లగా....
"మేడమ్"
భామ అతని ముఖంలోకి క్షణంసేపు చూచి తలను ప్రక్కకు త్రిప్పుకొంది.
"మేడమ్! మీరు ఎవరినో చూచి చాలా భయపడ్డరు... అతను ఎవరు?" అనునయంగా అడిగాడు రాంబాబు.
"అది మీకు అనవసరం" కసిరినట్లు జవాబు చెప్పింది భామ.
"చూడండి మేడమ్!.... నామీద నమ్మకంతో మీ నాన్నగారు నన్ను మీతో పంపారు. మిమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చడం నా బాధ్యత."
"నేను క్షేమంగానే వున్నానుగా!"
"అద్దంలో ఒకసారి మీ ముఖాన్ని చూచుకోండి. మీకే తెలుస్తుంది."
"నా ముఖాన్ని గురించి మీకెందుకు?"
"మీరు మాటను మభ్యపరుస్తున్నారు. నేనడిగిన ప్రశ్నకు ఇది జవాబు కాదు. మీరు ఎందుకో బాధపడుతున్నారు."
"చూడు మిస్టర్ రాంబాబుగారు. ప్రస్తుతంలో నా మూడ్ బాగాలేదు. దయచేసి నన్ను మీరు ఏమీ అడగకండి. నన్ను ప్రశాంతంగా కళ్ళు మూసుకోనివ్వండి. తమరు రోడ్డును చూస్తూ జాగ్రత్తగా మాట్లాడకుండా కారును నడపండి. కారాపండి. నేను వెనుక సీట్లో కూర్చుంటాను" రోషంగా చెప్పింది భామ.
రాంబాబు రోడ్డు ప్రక్కన కారు ఆపాడు. భామ వేగంగా దిగి వెనుక సీట్లో కూర్చుంది.
రాంబాబు దీక్షగా రోడ్డును చూస్తూ కారును నడుపుతున్నాడు. ’చాలా పెంకి ఘటం’ అనుకొన్నాడు రాంబాబు.
భామ కళ్ళు మూసుకొంది. ఆమె మస్తిష్కంలో మురళీధర్ ఆలోచనలు. వీడు ఇండియాకు ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు?... నాకోసమా లేక మానస కోసమా!... వాడు నన్ను చూచినట్లు లేదు. చూచి వుంటే పరిస్థితి ఏరీతిగా వుండేదో!... ఈ విషయాన్ని మానసకు వెంటనే తెలియజేయాలి. జాగ్రత్తగా వుండమని చెప్పాలి’ అనుకొంది భామ. చుట్టూ కలియ చూచింది. కారు సిటీ లిమిట్స్ దాటింది.
"రాంబాబుగారూ!"
"ఎస్ మేడమ్!"
"ముందు రోడ్డు విశాలాన్ని చూచి కారును ఆపండి"
"అలాగే మేడమ్"
కొద్ది నిమిషాల్లో.... రాంబాబు కారును రోడ్డు ప్రక్కన నిలిపాడు. భామ కారు నుండి దిగింది. కొంతదూరం ముందుకు నడిచింది. సెల్ ఆన్ చేసింది.
మానస కాల్ రిసీవ్ చేసుకొంది. "హలో..."
"అక్కా నేను....."
"సత్యా!... ఎలా వున్నావమ్మా!"
"నేను బాగున్నానక్కా. నీవు ఎలా వున్నావు?"
"నేను బి.ఇడిలో చేరాను సత్యా!"
"గుడ్. మంచిపని చేశావు. టైమ్ ప్రశాంతంగా చదువుతో సాగిపోతుంది. అమ్మా నాన్న చెల్లి బాగున్నారు కదూ!"
"అంతా బాగున్నారు. అప్పుడప్పుడూ అందరం కలిసి నిన్ను గురించి ఆనందంగా మాట్లాడుకొంటూ వుంటాము."
"అలాగా!.... అక్కా ఒక ముఖ్యమైన విషయం చెబుతాను జాగ్రత్తగా విను"
"చెప్పు"
"ఆ రాక్షసుడు ఇండియాకు వచ్చాడు. ముక్కాలు గంట క్రిందట నేను వాణ్ణి చెన్నైలో న్యూవుడ్ ల్యాండ్స్ హోటల్లో చూచాను. వాడి వెంట వేరెవరో వ్యక్తి వున్నాడు."
"అలాగా" ఆశ్చర్యంతో అడిగింది మానస.
"అవును"
"అక్కా! నీవు జాగ్రత్తగా వుండాలి. వాడు అక్కడికి తప్పక వస్తాడు. అమ్మా నాన్నలతో ప్రాధేయపూర్వకంగా మాట్లాడుతాడు. నిన్ను తనతో తీసుకొని వెళ్ళేదానికి గట్టిగా ప్రయత్నిస్తాడు."
"వాడు కంటబడితే నాన్న వాణ్ని చంపేస్తాడు. వాళ్ళ ఇంటికి పెద్ద మనుషులతో వెళ్ళి ఆ సాంబయ్య గాణ్ణి వీధిలోనికి లాగి పరువు తీసి వాడు చెంపలేసుకొనేలా చేసి వచ్చాడు నాన్న. కాని వాడు వచ్చినా... చచ్చినా నాకు ఎలాంటి బాధా లేదు. ఇక్కడ వాడు నన్ను ఏమీ చేయలేడు" ధీమాగా నిర్భయంగా చెప్పింది మానస.
"సరే అక్కా!.... ఎందుకైనా మంచిది. నీ జాగ్రత్తలో నీవు వుండు సరేనా!"
"అలాగే..."
"అమ్మా నాన్న చెల్లిని అడిగినట్లు చెప్పు."
"సరే సత్యా!... పెట్టేయనా!..."
"మంచిదక్కా!" సెల్ కట్ చేసి కారును సమీపించి కూర్చుంది భామ.
రాంబాబు కారును స్టార్ట్ చేశాడు. భామ మనస్సులో మురళీధర్‍ను గురించిన ఆలోచనలు... రాంబాబు మనస్సులో భామను గురించిన ఆలోచనలు. ఎవరి ఆలోచనల్లో వారు వుండిపోయారు మౌనంగా. కారు తడను సమీపించింది. భామకు చల్లగా కూల్ డ్రింక్ తాగాలనిపించింది.
"రాంబాబుగారూ!"
"ఏం మేడమ్ గారూ!"
"చల్లగా ఏదైనా త్రాగాలనిపిస్తూ వుంది" గోముగా అడిగింది భామ.
‘నీ అవసరానికి నీవు ఎంతో తియ్యగా మాట్లాడుతావు. అవసరం తీరాక లెప్ట్ రైట్ తీసుకుంటావ్’ అనుకొన్నాడు మనసున రాంబాబు.
"చాలా దాహంగా వుంది" హెచ్చుస్థాయిలో అరిచింది.
"అలాగా!"
"అవును. అబద్ధం కాదు నిజం"
రాంబాబు కారును రోడ్దు ప్రక్కన కూల్‍డ్రింక్స్ షాపు ముందు ఆపాడు. తను కారు దిగాడు.
"ఏం కావాలి?"
"మాజా!"
షాపు దగ్గరకు వెళ్ళి మాజా బాటిల్ తెచ్చి భామ చేతికి అందించాడు. గుటగుటా సగం బాటిల్ త్రాగేసింది. బ్రేక్ ఇచ్చి "ఎండగా వుంది కదా!... మీరూ త్రాగండి."
‘ఇది ఆదేశమా!... అభిమానమా!’ నవ్వుకొంటూ అనుకొన్నాడు రాంబాబు.
"నేను చెప్పింది మీకు వినిపించలేదా!"
ఖాళీ సీసాను రాంబాబు చేతికి అందిస్తూ వయ్యారంగా అంది భామ.
"వినిపించింది. నాకు దాహంగా లేదు" చెప్పి షాపు వైపుకు వెళ్ళి బాటిల్ డబ్బులు ఇచ్చి తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చొని కారును స్టార్ట్ చేశాడు.
"ఆగండాగండి"
రాంబాబు ప్రక్కకు జరిగి కూర్చున్నాడు. భామ డ్రైవర్ స్థానంలో కూర్చొని కారును స్టార్ట్ చేసింది.
కొన్ని నిముషాలు వారిరువురి మధ్యన మౌనంగా గడిచిపోయాయి. కళ్ళు మూసుకొని తన ప్రక్కన కూర్చొని వున్న రాంబాబును చూచి భామ....
"ప్రక్కన కూర్చొని నిద్రపోతే.... నాకూ నిద్ర వస్తుందిగా!" వ్యంగ్యంగా నవ్వుతూ అంది.
"నేను నిద్రపోవడం లేదు. మీకు నిద్ర వస్తే వెనుక కూర్చొని హాయిగా నిద్రపోండి. కారును నేను నడుపుతాను" కాస్త రోషంతో చెప్పాడు రాంబాబు.
"నాకు నిద్ర రావడం లేదు"
"అయితే మాట్లాడకుండా ముందు చూస్తూ కారు నడపండి"
భామ చిత్రంగా కళ్ళు త్రిప్పి రాంబాబు ముఖంలోకి చూచింది.
నవ్వుతూ.... "రాంబాబు గారూ!... నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా!"
"అడగాలని మీరు అనుకొన్న తర్వాత అడగకుండా వుండలేరు కదా! అడగండి" ఓరకంట చూస్తూ అన్నాడు రాంబాబు.
"అడుగుతున్నా!"
’సరే’ అన్నట్లు తల ఎగరేశాడు రాంబాబు.
"ఇప్పుడు ఎవరన్నా మన కారుకు అడ్డంగా వచ్చి ఆపి నన్ను బలవంతంగా లాక్కొని పోయేదానికి ప్రయత్నిస్తే మీరు ఏం చేస్తారు?"
రాంబాబు ఆశ్చర్యంతో భామ ముఖంలోకి చూచాడు.
"జవాబు చెప్పండి సార్!"
‘అబ్బో... మర్యాద గొప్పగా వుంది’ అనుకొని...
"వచ్చింది ఆడా? మగా?"
"ఏమిటి?" ఈసారి ఆశ్చర్యపోవడం భామ వంతు అయింది.
"నన్ను ఎగతాళి చేస్తున్నారా!"
"కాదు ఆనందింపచేయాలనుకొంటున్నాను"
"నా ప్రశ్నకు జవాబు యిది కాదు"
"నా ప్రశ్నకు మీరు సరైన జవాబు చెప్పలేదు."
"ఏమిటి మీ ప్రశ్న!"
"ఆ వచ్చింది ఎవరా అని"
"మగ"
"వాణ్ణి నాలుగు ఉతికి... మిమ్మల్ని కార్లోకి నెట్టి డ్రైవర్ సీట్లో నేను కూర్చొని యాక్సలేటర్‍ను గట్టిగా నొక్కుతాను. అవునూ.. మీకు ఇలాంటి ఆలోచనలు ఇప్పుడూ ఎందుకు వచ్చినట్లు?" ప్రశ్నార్థకంగా భామ ముఖంలోకి చూచాడు రాంబాబు.
"మీరు నన్ను కాపాడతారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలని అడిగాను. మీరు నాకు నచ్చిన జవాబు చెప్పారు. నాకు చాలా ఆనందంగా వుంది" కిలకిలా నవ్వింది భామ.
’నీకు ఎప్పుడు సంతోషం వస్తుందో... ఎప్పుడు కోపం వస్తుందో... నీ మూడ్ ఎరిగి నడుచుకోవడం చాలా కష్టం. మొత్తానికి నీది అదో టైపు. వున్న పొగరు. నీతో ఏం అంటే ఏం... అనడం నాకు గౌరవం’ అనుకొన్నాడు రాంబాబు.
"దేన్ని గురించి ఆలోచిస్తున్నారు?"
"నన్ను గురించి...."
"ఏమిటీ!...." ఆశ్చర్యంగా రాంబాబు ముఖంలోకి చూచింది భామ.
"అవును మేడమ్. నా జీవితాన్ని గురించి నేను ఆలోచిస్తున్నాను."
"మీ జీవితానికి సంబంధించిన ఏ విషయాన్ని గురించి?"
"అది పర్సనల్. ఇతరులతో చెప్పే విషయం కాదు."
"ఓహో అలాగా!"
"అవును మేడమ్."
"చూడండి మిస్టర్ రాంబాబు... ఇక మీదట మీరు నన్ను సత్యా! అని పిలవండి. మేడమ్ కాదు."
"అలా పిలవడం తప్పవుతుందండి."
"నేను చెప్పినప్పుడు... అలా పిలిచేదానికి మీకేం నష్టం?"
"నష్టం కాదండి కష్టం..."
"ఏమిటా కష్టం?"
"మీరు నా యజమాని గారి అమ్మాయిగారు."
"అవును.... అయితే..."
"మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే హక్కు నాకు లేదండీ"
"నేను ఇస్తున్నాను. నన్ను ఇకపై మీరు ఆ పేరుతోనే పిలవాలి."
చిరునవ్వుతో తలదించుకొన్నాడు రాంబాబు.
"చూడండి రాంబాబుగారు.... నేను మీకంటే చిన్నదాన్ని. మీరు నన్ను మేడమ్... మేడమ్... అని పిలుస్తుంటే నాకు వినేదానికి అసహ్యంగా వుంది బాబూ!"
"చూడండి మేడం... మీరు అమెరికన్ డాలర్. నేను ఇండియా రూపాయిని. మీరు కోటీశ్వరులు. నేను కూటికి లేనివాణ్ణి. వియ్యానికైనా... కయ్యానికైనా సరిజోడి అవసరం అంటారు పెద్దలు. నా హద్దులు నాకు తెలుసు. వాటిని నేను అతిక్రమించలేను" ప్రాధేయపూర్వకంగా చెప్పాడు రాంబాబు.
"రాంబాబు గారూ!"
"ఏం మేడమ్!"
"మీకు ఎవరూ అయిన వాళ్ళులేరా!"
వెంటనే జవాబు చెప్పక కొన్నిక్షణాలు వెనక్కు పరుగిడుతున్న చెట్లను చూచాడు రాంబాబు. తర్వాత... "నాకు ఎవరూ లేరండీ!" మెల్లగా చెప్పాడు.
"నన్ను మీ స్నేహితురాలిగా భావించగలరా!"
రాంబాబు ఆశ్చర్యంతో భామ ముఖంలోకి చూచాడు.
భామ నవ్వుతూ... "అవును. నేను చెప్పింది నిజం. ఫ్రమ్ నౌ ఆన్ వడ్స్ యు ఆర్ ఫ్రెండ్స్" తన చేతిని రాంబాబు వైపుకు చాచింది.
చిరునవ్వుతో రాంబాబు తన చేతిని ఆమె చేతిలో వుంచాడు.
=======================================================================
ఇంకా వుంది..
ప్రేమ తరంగాలు - పార్ట్ 8 త్వరలో..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments