#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Prema Tharangalu - Part 8 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 23/12/2024
ప్రేమ తరంగాలు - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.
సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు.
కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.
ఫ్లయిట్ లో మురళీధర్ తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ.
పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది.
చెన్నైలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్ గా భావిస్తుంది. మానసకు తోడుగా కార్లో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తండ్రికి అన్ని విషయాలూ చెప్పి, అమెరికాకు ఇక వెళ్లనని, ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది. భామకు రాంబాబు పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 8 చదవండి.
సత్యభామ, ముకుందవర్మ, నీలవేణి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని భోజనం చేస్తున్నారు.
"నాన్నా!... మీ శిష్యుడు చాలా మంచివాడు" నవ్వుతూ చెప్పింది భామ.
"తల్లీ!... వాడి జన్మ తరించింది" తల త్రిప్పుతూ చెప్పింది నీలవేణి.
"చూచారా నాన్నా!.... అమ్మ నన్ను హేళన చేస్తూ ఉంది" తల్లి ముఖంలోకి సీరియస్‍గా చూస్తూ చెప్పింది భామ.
ముకుందవర్మ చిరునవ్వుతో యిరువురి ముఖాల్లోకి చూచాడు.
"అమ్మా!... మీ అమ్మ చెప్పింది నిజమే కదా!... చిన్న వయస్సు నుంచీ నీకు సాధారణంగా ఎవరూ నచ్చరుగా!"
"నాన్నా!... అంటే నీవు అమ్మకే సపోర్టు చేస్తున్నావన్నమాట" రోషంగా తండ్రి ముఖంలోకి చూచింది భామ.
"సపోర్టు కాదమ్మా!.... నేను చెప్పింది యదార్థం. కానీ ఒకమాట మాత్రం నిజం... నీలో నేను, మీ అమ్మా వూహించని మార్పును చూస్తున్నాము."
"అవును నాన్నా!... నేను పూర్తిగా మారిపోయాను. నాలో వున్న అహంకారం నశించింది" సాలోచనగా మెల్లగా చెప్పింది భామ.
"అమ్మా!... నేను నిన్ను ఒకమాట అడగనా!"
"అడగండి నాన్నా!"
"నేనూ నిన్ను ఒకమాట అడగనా భామా!" అడిగింది తల్లి నీలవేణి.
"అడుగమ్మా!"
"మన ఇద్దరిలో ముందు ఎవరు అడగాలి!" ముకుందవర్మ ముఖంలోకి చూస్తూ అంది నీలవేణి.
"తల్లివి కదా!.... ముందు నీవే అడుగు" చిరునవ్వుతో చెప్పాడు ముకుందవర్మ.
"సరే!.... భామా!... నేను నీకు త్వరలో.... నీకు, మాకు నచ్చిన యువకుడితో నీ వివాహాన్ని జరిపించాలని నా నిర్ణయం. ఏమండీ!... మీరు అడగదలచుకొన్నది అడగండి" భర్త ముఖంలోకి చూస్తూ అంది నీలవేణి.
"నేను అడగదలచుకొన్నదీ అదే విషయం నీలూ!"
నీలవేణి ముఖంలో చిరునవ్వు, భార్యా భర్తల అన్యోన్యతకు వారి మనోభావాలు నిదర్శనాలు.
"చెప్పు నీ జవాబు భామా!... మా ఇరువురి ప్రశ్న ఒక్కటే" నవ్వింది నీలవేణి.
భామ కొన్నిక్షణాలు తల్లిదండ్రుల ముఖాల్లోకి చూచి సాలోచనగా తలదించుకొంది.
"మీ నిర్ణయమే నా నిర్ణయం" మెల్లగా చెప్పింది.
నీలవేణి, ముకుందవర్మల ముఖాల్లో ఎంతో ఆనందం.
"సంబంధాన్ని చూడమంటావా తల్లీ!" అనునయంగా అడిగాడు ముకుందవర్మ.
"చూడండి నాన్నా!... ఆ వ్యక్తి మీకు నచ్చితే నాకు నచ్చినట్లే..."
"అమ్మా!... భామ.. నీవు అన్నది!"
"నిజం అమ్మా!... నా మాటను నమ్మండి"
ఆ దంపతులిద్దరూ... భామ ముఖంలోకి ఎంతో ప్రీతిగా చూచారు.
భామ చిరునవ్వుతో వారి ముఖాల్లోకి చూచింది.
భోజనాన్ని ముగించి ముగ్గురూ హాల్లోకి వచ్చారు.
బాలగోవిందయ్య వారికి హాల్లో ప్రత్యక్షమైనాడు.
"ఈ టైములో వచ్చావు. ఏమిటి గోవిందయ్యా విశేషం" అడిగాడు ముకుందవర్మ.
"అయ్యా!... నిజంగా విశేషమే!.... గోదావరీ నది పుష్కర సమయం కదయ్యా ఇది. ఆడవాళ్ళు వెళ్ళాలని పట్టుబట్టారు. అందుకని తమరితో..."
"ఏమండీ!... మనమూ పుష్కరాలకు వెళదాం అండీ" ఆత్రుతతో అడిగింది నీలవేణి.
ముకుందవర్మ ఆశ్చర్యంగా భార్య ముఖంలోకి చూచాడు.
"నా మాటను కాదనకండి. మనం తప్పకుండా వెళ్ళాలండీ!...." ప్రాధేయపూర్వకంగా అడిగింది నీలవేణి.
"సరే!.... వెళదాము. అమ్మా, భామా!... నీవూ వస్తావా!"
"లేదు నాన్నా.... నేను స్కూలుకు సంబంధించిన పనులు చూచుకోవాలి కదా!.... అమ్మా, మీరు వెళ్ళిరండి" చిరునవ్వుతో చెప్పింది భామ.
"ఇంతలోకే అంటే నాలుగు రోజుల్లో ఏం మునిగిపోతుంది!... యాత్రకు వెళ్ళి వచ్చి చూచుకోవచ్చుగా!" నిష్టూరంగా అంది నీలవేణి.
"అమ్మా!.... ప్లాను అప్రూవల్... కాంట్రాక్టర్ ఫైనలైజేషన్ పనులన్నీ చేయాలమ్మా!.... మీరు ఆనందంగా వెళ్ళిరండి... నేను నా పనులు చూచుకొంటాను." అనునయంగా చెప్పింది భామ.
"సరే తల్లీ!... నీ పనులు నీవు చూచుకో. రాంబాబుతో చెబుతాను నీకు సాయంగా ఉండమని. ఆఁ... నీలూ నీవు నేను... మన బాలగోవిందయ్య గారి కుటుంబంతో కలిసి గోదావరి పుష్కరాలకు వెళుతున్నాము. గోవిందయ్యగారూ!... మాకూ ట్రైన్‍లో టిక్కెట్లను ఏర్పాటు చేయండి."
"అయ్యా!.... యధార్థం చెప్పాలంటే.... ఆ ఏర్పాటును చేసేశానయ్యా. ఎల్లుండి మన ప్రయాణం."
"ఓ అలాగా! చాలా సంతోషం" నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ.
"అయ్యా!... ఇక నేను బయలుదేరుతాను."
"మంచిది బాలగోవిందయ్యగారు.... మీ మూలంగా మాకు గోదావరీ పుష్కరస్నానం ప్రాప్తించబోతూ వుంది" నవ్వుతూ చెప్పింది నీలవేణి.
అంతవరకూ బాలగోవిందయ్య ప్రక్కన నిలబడి జరుగుతున్న సంభాషణనంతా విన్నాడు రాంబాబు. ముకుందవర్మ రాంబాబును సమీపించి....
"మా అమ్మాయి నీకు మంచి సర్టిఫికేట్ యిచ్చిందయ్యా!.... నాలుగైదు రోజుల్లో వూర్లో వుండటం. అమ్మాయికి కాస్త సాయంగా వుండాలి. సరేనా!"
భామ రాంబాబు ముఖంలోకి ముఖం చిట్లించి చూచింది. క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచి..."
"అలాగే సార్!" అన్నాడు రాంబాబు.
"అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా నీవు తోటే వెళ్ళాలి. అర్థం అయిందిగా!" ఆజ్ఞాపించినట్లుగానే అంది నీలవేణి.
"అయిందమ్మగారూ!" చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు.
కళ్ళు పెద్దవి చేసి అతని ముఖంలోకి చూచింది భామ. రాంబాబు నిట్టూర్చి తలను ప్రక్కకు త్రిప్పుకొన్నాడు.
"సరే ఇక వెళ్ళిరండి" చెప్పాడు ముకుందవర్మ.
బాలగోవిందయ్య రాంబాబులు హాల్లో నుంచి బయటికి నడిచారు.
తర్వాత.... భామ తన గదికి, నీలవేణి ముకుందవర్మలు వారి గదికి వెళ్ళిపోయారు.
ముకుందవర్మ మంచంపై వాలిపోయాడు. మంచంపైన కూర్చొని నీలవేణి.....
"ఏమండీ!... ఒక విషయం గమనించారా!"
"ఎవరి విషయంలో నీలూ!"
"మన అమ్మాయి విషయంలోనండీ!... దాని మాట తీరులో ఎంతమార్పు!.... మమ్మీ... డాడీ అని మనలను పిలిచే పిల్ల, ఇప్పుడు అచ్చతెలుగులో మన చెవులకు ఆనందం కలిగేలా అమ్మా నాన్నా అని ఎంత సొంపుగా పిలిస్తూ వుందో!... అంతేకాదు యింతకు ముందులాగా జీన్స్ ప్యాంట్లు, టీషర్టులు వేసుకోవడం లేదు. చీరలు కడుతూ వుంది. నొసటన బొట్టు పెట్టుకుంటూ వుంది. అమ్మాయిలో ఇంతమార్పు వచ్చేదానికి కారణం ఏమయ్యుంటుందండీ!... అమ్మాయిలో ఎంతో మంచిమార్పు" సంతోషంగా చెప్పింది నీలవేణి.
"అవును నీలు!... కొత్త అనుభవాల చేదు... పాత అనుభవాల తీపిని గుర్తుకు తెస్తుంది. మన భామ విషయంలో అదే జరిగింది. తాను ఎంతగానో అభిమానించిన పాశ్చాత్య నాగరీకతను... మన నాగరీకతనూ పోల్చి చూచుకొని... మన నాగరీకత మిన్న అని గ్రహించి.. అమెరికాను వదలి మన వూరికి వచ్చేసింది. ఆ కారణంగానే... మనం ఈనాడు అమ్మాయిలో ఆ మార్పును చూస్తున్నాము."
"తన వివాహ విషయంలో కూడా మనకు పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని యిచ్చిదంటే... నిజంగా అమ్మాయిలో గొప్ప మార్పు వచ్చిందండీ. నాకు చాలా ఆనందంగా వుంది. అమ్మాయి కోసం మంచి సంబంధాన్ని చూడాలండీ. అతను ఇంటల్లుడుగా వుండే రీతిగా దొరికితే... మనకంటే అదృష్టవంతులు వేరే ఎవరూ వుండరండి. ఏమంటారు?"
"నీ మాటల్లో నీకు... నీ కూతురు మీద వున్న అభిమానం ఎంతో వ్యక్తమైంది. తల్లిగా నీకు అలాంటి ఆశ వుండటం సహజమే!.... కానీ, అలాంటి యువకుడు మనకు దొరకాలిగా!"
"ప్రయత్నే ఫలి... మన ప్రయత్నం మనం చేద్దామండి. ఆపైన దైవేచ్ఛ"
"అలాగే నీలూ!... పొద్దుపోయింది. ఇక పడుకో"
నీలవేణి మంచంపై వాలింది. ముకుందవర్మ కళ్ళు మూసుకొన్నాడు.
తన గదిలో.... మంచంపై పడుకున్న భామకు నిద్ర పట్టలేదు. డైనింగ్ టేబుల్ ముందు తనతో తల్లి తండ్రి చేసిన సంభాషణ గుర్తుకు వచ్చింది. ఆ క్షణంలో తాను వారి మాటలను కాదనలేక వివాహానికి ఒప్పుకుంది.
కానీ... మనస్సు కొంతకాలం వివాహాం చేసుకొనేటందుకు అంగీకరించడం లేదు. కనీసం స్కూలు నిర్మాణం, అడ్మిషన్స్ పూర్తి అయ్యేదాకా వాయిదా పడేలా చూడాలనుకొంది. కానీ... అమ్మ నాన్నలకు నచ్చిన మంచి సంబంధం ఈలోగా వస్తే తాను మాట ఇచ్చిన కారణంగా వారి మాటను కాదనగలదా!... మనస్సు నుండి వెలువడే జవాబు... అనలేదని....
ఈ మధ్య కాలంలో తను రాంబాబు పదే పదే గుర్తుకు వస్తున్నాడు. అతని అమాతకత్వం... మితభాషణ.... తాను తన యజమాని గారి కూతురుననే భావంతో అతను తనకు ఇచ్చే మర్యాద, గౌరవం... తనకు బాగా నచ్చాయి.
మనస్సున ఒక మూల.... అలాంటివాడు తనకు భర్తగా దొరికితే ఎంతో బాగుంటుంది కదూ... అనే భావన.... ఇది కేవలం అతన్ని గురించి తనకు ఉన్న మంచి అభిప్రాయమా లేక తన మనస్సు అతని స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని శాశ్వతంగా కోరుతూ వుందా!
అలాంటి కోరికకు తావు లేదు. కారణం అతను నిరుపేద. తమ కుటుంబంతో సరితూగగల అర్హత అతనికి లేదు. అతన్ని గురించి ఆలోచించే కొద్ది మనస్సున పిచ్చి పిచ్చి ఆలోచనలు.... ఇలాంటి ఆలోచనలను మనస్సున రానియ్యకూడదు. నక్కకు నాగలోకానికి వున్నంత వ్యత్యాసం మా ఇరువురి మధ్యనా వుంది. పాడు మనస్సు దీనికి నిలకడ లేదు. ఏది సమస్యాత్మకమో దాన్ని గురించే ఆలోచిస్తూ వుంటుంది. ఎప్పుడూ.... ఇది ఒక బలహీనత... నేను ఇలాంటి బలహీనతకు లొంగిపోయి... మరోసారి... నవ్వులపాలు కాకూడదు. తాను సమస్యగా తన తల్లిదండ్రులకు ఇకపై కాకూడదు. వారి మాట ప్రకారమే తన వివాహ విషయంలో నడచుకోవాలి. వారు మెచ్చిన వ్యక్తినే నేను వివాహం చేసుకోవాలి. వారికి ఆనందాన్ని కలిగించాలి.
రాంబాబును మంచి స్నేహితునిగా భావించాలి. అభిమానించాలి. గౌరవించాలి. ఈ సృష్టిలో అన్నింటికన్నా గొప్పది మంచి స్నేహమే కదా!... ఆడపిల్లగా మానస... మగవాడుగా రాంబాబు నాకు ఎప్పటికీ మంచి స్నేహితులుగా వుండాలి. అలాంటి స్నేహాన్ని వారిరువురి విషయంలో కోరుతూ తాను దానికి తగిన రీతిలో... వారి విషయంలో వర్తించాలి. ఈ నిర్ణయానికి వచ్చిన భామ కళ్ళు మూసుకొంది.
*
రాంబాబు, సత్యభామ... ముకుందవర్మ, నీలవేణి, బాలగోవిందయ్య దంపతులతో స్టేషనుకు వచ్చి వారిని రైలు ఎక్కించి ఇంటికి తిరిగి బయలుదేరారు.
రాంబాబు కారు నడుపుతున్నాడు. భామ అతని ప్రక్కన కూర్చొని వుంది. సాధారణంగా ఏదో ఒక విషయాన్ని గురించి రాంబాబుతో తర్కించే భామ మౌనంగా దిగాలుపడి కూర్చోవడం రాంబాబుకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
’సరే ఎంతసేపు అలా కూర్చుంటుందో కూర్చోని... మనం కూడా మౌనంగా మన పనిని చేసుకుపోదాం’ అనుకొన్నాడు రాంబాబు.
వయస్సులో వున్నవాడు... తెలివిగలవాడు... అందగాడు... అతని మనస్సున కూడా భామ మాటలను వినాలనే భావన... ఆమెను ఆమె చూడకుండా చూడాలనే ఆశ.... ఈ మధ్య కాలంలో అతని మదిలో ఏర్పడిన తలంపులు. క్రీకంట భామ ముఖంలోకి చూచాడు.
అతని దొంగ చూపులను భామ గమనించింది.
"చూడదలచుకొంటే నేరుగా చూడవచ్చుగా. ఆ దొంగ చూపులు ఎందు?" అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది భామ.
’ఒరే రాంబాబు!.... నీకెందుకు పుట్టిందిరా ఈ పాడు బుద్ది. నిద్రపోతున్న పులిని లేవావు కదరా’ అనుకొన్నాడు రాంబాబు.
"నేను చెప్పింది వినబడలేదా!" ఓరకంట చూచింది భామ.
’ఈసారి జవాబు చెప్పక తప్పదు ఏం చెప్పాలి!’ క్షణం ఆలోచించి....
"ఎప్పుడూ ఏదో సరదాగా మాట్లాడుతుంటారుగా.... ఈరోజు మౌనంగా కూర్చున్నారు కదా... అందుకని అలా చూచాను. సారీ!..."
"సారీ ఎందుకు?"
"మీ దృష్టిలో తప్పు చేశానుగా!... అందుకు"
"అది తప్పని నేను అనలేదే!"
"నేను చేసింది తప్పని నాకే తోచిందండి" మెల్లగా చెప్పాడు రాంబాబు.
"మనం మంచి స్నేహితులుగా వుందాం అని చేతులు కలిపాం కదా మరిచిపోయారా!"
"లేదండీ"
"మరోమాట"
"చెప్పండి మేడమ్"
"స్నేహితుల మధ్యన అండీలు... మేడమ్‍లు వాడకూడదు. నా పేరేమిటి?"
"సత్యభామగారు"
"గారు నా పేరా!"
’కాదు’ అన్నట్లు తలాడించాడు అమాయకంగా రాంబాబు.
"నన్ను మీరు ఏమని పిలవాలో నేను చెప్పింది మరిచారా!"
"మీరు మరోసారి చెప్పండి!"
"సత్య..."
"భామ కాదండీ!"
"కాదు... సత్య... సత్య..."
"అలాగేనండీ"
"అండీని వాడవద్దన్నానా!"
’అవును’ అన్నట్లు తలాడించాడు రాంబాబు.
"ఏదీ, ఒకసారి నన్ను పిలవండి."
"అలా నేను పిలిస్తే... మీ అమ్మా నాన్నగార్లు వింటే.... వారు నన్ను ఏమైనా అనవచ్చు కదా!..."
విచారంగా భామ ముఖంలోకి చూచాడు రాంబాబు.
"ఆ విషయాన్ని నేను చూచుకొంటాను. నా పేరేంటి?"
"సత్య!..." మెల్లగా చెప్పాడు రాంబాబు.
అతని వాలకాన్ని చూచిన భామకు నవ్వొచ్చింది. కిలకిలా నవ్వింది.
రాంబాబులో క్రొత్త శక్తి ప్రవేశించింది. చిరునవ్వుతో....
"మీరు నవ్వితే చాలా అందంగా వుంటారు" ఆవేశంతో అనేశాడు.
వెంటనే నాలుక కరుచుకొని ’ఒరేయ్!.... రాంబాబు తప్పుగా వాగావు కదరా!.... దీని ఫలితం ఎలా వుంటుందో!....’ కళ్ళు పెద్దవి చేసి వెనక్కు వెళుతున్న దృశ్యాలను దిగాలుపడి చూచాడు.
"నా ఫ్రెండ్స్ అందరూ అదేమాట అంటుంటారు" ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో చెప్పింది భామ.
’హమ్మయ్యా!... ఒరేయ్ రాంబాబు!... నీ యోగం బాగుందిరా. ఎలాంటి ఉత్పాతం రేగలేదు’ ఆనందంగా నవ్వుకొన్నాడు రాంబాబు.
భామకు కడుపులో ఏదో సంకటం కలిగినట్లు భావన. ప్రక్కన వున్న వాటర్ బాటిల్ తీసుకొని నీళ్ళు త్రాగింది. బాటిల్‍ను యధాస్థానంలో వుంచింది. శరీరానికి చెమటలు పట్టాయి. తల తిరిగినట్లు అనిపించింది.
"రాంబాబూ! కారును ఆపండి" ఆందోళనగా అంది భామ.
రాంబాబు కారును రోడ్డు ప్రక్కన ఆపాడు. భామ కారు దిగింది. పెద్ద వాంతిని చేసుకొంది.
రాంబాబు ఆశ్చర్యపోయాడు. కారు దిగి భామను సమీపించాడు ఆందోళనగా....
"ఏమైందండీ!"
భామ కళ్ళల్లో ముక్కుల్లో నీళ్ళు...
"నాకు ఏమీ అర్థం కావడం లేదు" నీరసంగా అంది భామ.
"వెనక్కు వెళ్ళి నెల్లూరులో డాక్టరుకు చూపించుకొని వెళదాం సత్యా!...."
"ఏమన్నారు!"
ఆ స్థితిలో కూడా నవ్వుతూ రాంబాబు ముఖంలోకి చూచింది భామ ఆనందంగా.
"మీరు నన్ను అలా పిలవమన్నారుగా... అందుకే పిలిచాను" అందోళనతో అన్నాడు రాంబాబు.
"ఇప్పుడు నీమీద నాకు నమ్మకం కలిగింది. నీవు నిజంగా నా స్నేహితుడివి... నా చేతిని పట్టుకో!"
ఆ మాటలను విన్న తర్వాత "రండి కార్లో కూర్చోండీ"
భామ చేతిని పట్టుకొన్నాడు రాంబాబు. భామ కారులో కూర్చుంది.
"నెల్లూరుకు వద్దు. మన వూరికి పోనివ్వు"
"డాక్టరు గారికి చూపించుకొంటే మంచిది కదా. పైగా అమ్మా నాన్న కూడా ఇంట్లో లేరు" ఆందోళనగా చెప్పింది భామ.
రాంబాబు కారును స్టార్ట్ చేశాడు. అతని ముఖంలో అప్రసన్నత, భయం.
"నాకు నిద్ర వస్తూ వుంది. నీ భుజంపై తల పెట్టుకొని నిద్రపోతాను"
రాంబాబు దగ్గరగా జరిగి అతని భుజానికి తలను ఆనించి కళ్ళు మూసుకొంది భామ.
అయోమయస్థితిలో.... రాంబాబు కారును ముందుకు నడపసాగాడు.
ఎంతో సరదాగా మాట్లాడుతున్న సత్యగారిలో క్షణాల్లో... కలిగిన ఈ మార్పుకు కారణం ఏమిటి? ఫుడ్ పాయిజన్ వల్లనా!..... టిఫిన్ ఇంట్లోనే కదా తిన్నారు!... వచ్చేటప్పుడు దార్లో ఎక్కడ ఏమీ తీసుకోలేదు కదా!... వాంతి ఎందుకు అయినట్లు? వాంతి కాగానే ఎంతగానో నీరసించిపోయారు. కారణం ఏమైఉంటుంది? పాపం సమయానికి తల్లి తండ్రీ కూడా దగ్గర లేరు. తను వారితో పాటు గోదావరి పుష్కరాలకు వెళ్ళి వుంటే ఎంతో బాగుండేది. ఇలాంటి సమయాల్లో ఆడపిల్లకు తల్లి చెంతన వుంటే ఎంతో బాగుంటుంది. వారికి ఎంతో అనుభవం వుంటుంది కాబట్టి... కారణాన్ని వెంటనే కనిపెట్టగలుగుతారు. తగిన చికిత్స చేయగలుగుతారు. తనకా ఏమీ తెలీదు. ’భగవాన్ నాకు పరీక్ష పెట్టకు. నా ప్రాణ విలువ ఎంతో నీకు తెలుసు. నాకు తెలియని విషయాన్ని సమస్యగా నా ముందు నిలిపి నా శక్తిని పరీక్షించకు. నేను సత్యగారి ఈ స్థితికి ఏమి చేయగలను? తండ్రీ!.... ఆమె ఆరోగ్యానికి స్వస్థత చేకూర్చు. నీకివే నా శతకోటి వందనాలు."
చేతులు జోడించి సర్వేశ్వరుని మనసారా దీనంగా వేడుకొన్నాడు రాంబాబు.
భామ నిద్రపోతూ వుంది. కారును భవంతి ముందు కార్ పోర్టికోలో ఆపాడు.
"సత్యా!... ఇంటికి వచ్చేశాము. లేవండి" మెల్లగా చెప్పాడు రాంబాబు.
భామ కళ్ళు తెరిచింది.
"నన్ను నా గదికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టు రాంబాబు ప్లీజ్!" దీనంగా అడిగింది భామ.
రాంబాబు కారు దిగాడు. పనిమనిషి మల్లి వరండాలోకి వచ్చింది. కారు ముందు సీట్లో నీరసంగా కూర్చొని యున్న భామను చూచింది. ఆందోళనగా కారును సమీపించింది.
"ఏమైంది చిన్నమ్మగారూ!" కళ్ళను పెద్దవి చేసి అడిగింది.
"నాకేం కాలేదు. నీవు లోనికి వెళ్ళి రెండు కప్పుల కాఫీని నా గదికి తీసుకురా, పో" అంది భామ.
మల్లి ఆందోళనగా లోనికి వెళ్ళిపోయింది.
"రాంబాబూ!... నన్ను ఎత్తుకొని నా గదికి తీసుకొని వెళ్ళు" ప్రాధేయపూర్వకంగా నీరసించిన చూపులతో అడిగింది భామ.
మల్లి వంటగదికి వెళ్ళిందా లేదా అని లోనికి చూచి రాంబాబు భామను తన చేతుల్లోకి తీసుకొని వేగంగా హాల్లోకి మెట్లు ఎక్కి... భామను ఆమె గదిలోని మంచంపై పడుకోబెట్టాడు.
"మెనీ మెనీ థాంక్స్!.... మై డియర్ ఫ్రెండ్...."
"మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి"
క్షణం తర్వాత.....
"ఈ వూర్లో వున్న డాక్టర్‍ను పిలుచుకురానా!" ప్రీతిగా అడిగాడు రాంబాబు.
"వద్దు నాకేం కాలేదు"
"చాలా నీరసంగా వున్నారే!"
"మల్లీ కాఫీ తెస్తుందిగా... త్రాగుతాను. శక్తి వస్తుంది"
"మీరు చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు."
"అవును. నేను చిన్నపిల్లని కానా రాంబాబు!"
"దయచేసి మీరు మాట్లాడకండి. కళ్ళు మూసుకొని పడుకోండి."
"నేను మీకు శ్రమ కలిగించాను కదూ!"
"స్నేహితుల మధ్యన శ్రమ అనే పదానికి తావు లేదన్న విషయం మీకు తెలుసుగా!"
"యస్!.... యు ఆర్ రైట్!" నీరసంగా నవ్వింది భామ.
మల్లి ట్రేలో రెండు కాఫీ కప్పులతో గదిలోనికి వచ్చింది. ఒక కప్పును భామకు అందించింది. రెండో కప్పును రాంబాబుకు అందించింది.
"కూర్చోండి" అంది భామ.
రాంబాబు మంచం ప్రక్కన వున్న కుర్చీలో కూర్చున్నాడు.
"మల్లీ!... నీవు క్రిందికి వెళ్ళిపో. పది నిముషాల తర్వాత రా."
మల్లి మౌనంగా క్రిందికి వెళ్ళిపోయింది.
భామ కాఫీ త్రాగింది. రాంబాబు ఆమె చేతిలోని కప్పును అందుకొని టీపాయ్‍పై ఉంచాడు.
తను కాఫీ త్రాగడం ముగించి...
"నేను క్రింద ఆఫీసు గదిలో వుంటాను. ఏదైనా అవసరం అయితే పిలవండి."
"అలాగే!" చెప్పి భామ మంచంపై వాలిపోయింది.
రాంబాబు మెట్లు దిగి ఆఫీసు గదిలో ప్రవేశించాడు. తనకు ముకుందవర్మ చెప్పిన కేసు కట్టలను తీసి చదవసాగాడు.
భామ గదిలో అరగంట ప్రశాంతంగా సాగిపోయింది. పనిమనిషి పది నిముషాల తర్వాత భామ గదికి వెళ్ళి నిద్రపోతూ వున్న భామను చూచి... ఖాళీ కప్పులను చేతికి తీసుకొని వంట గదివైపుకు వెళ్ళిపోయింది.
అరగంట తర్వాత భామ వులిక్కిపడి లేచింది. బేసిన్ వైపుకు పరుగెత్తింది. వాంతి... త్రాగిన కాఫీ... పూర్తిగా వాంతి అయిపోయింది.
భామ మనస్సులో ఏదో అనుమానం!?... చన్నీళ్ళతో ముఖాన్ని కడుక్కుంది. టవల్‍తో ముఖాన్ని తుడుచుకొని సెల్‍ఫోన్ చేతికి తీసుకొని మానసకు ఫోన్ చేసింది.
"సత్యా ఎలా వున్నావ్?"
"అక్కా!... నీవు ఇక్కడికి వెంటనే రావాలి. నాకు నీ సలహా, సాయం కావాలి" దీనంగా చెప్పింది భామ.
"విషయం ఏమిటమ్మా. నీకేమైంది?" ఆత్రంగా అడిగింది మానస.
"అక్కా!... నేను మెన్సస్ కాలేదు. వాంతులు అవుతున్నాయి" గద్గద స్వరంతో చెప్పింది భామ.
మానస తలపై పిడుగు పడినట్లయింది. వెంటనే బదులు మాట్లాడలేకపోయింది.
"ఏందమ్మా!... నీవంటున్నదీ?"
"అవునక్కా!... నేను చెప్పేది నిజం. ప్లీజ్ అక్కా నీవు వెంటనే బయలుదేరి రావాలి. అమ్మా నాన్న కూడా వూర్లో లేరు. గోదావరి పుష్కరాలకు వెళ్ళారు."
"సరే!... నేను వెంటనే బయలుదేరుతున్నాను. భయపడకు. ధైర్యంగా వుండు. నేను వస్తున్నానుగా, కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం."
"అలాగే అక్కా! త్వరగా రావాలి. ఎదురు చూస్తూ వుంటాను."
"అలాగే" మానస ఫోన్ కట్ చేసింది.
నిట్టూర్చి భామ సెల్‍ను మంచంపై పడేసింది. ఆమె మనస్సున అనుమానం... అపశృతి... భయం... బాధ... గట్టిగా కళ్ళు మూసుకొంది.
రాంబాబు గంట తర్వాత భామ గదిలోనికి వచ్చాడు. మంచాన్ని సమీపించి వంగి ఆమె ముఖంలోకి చూచాడు.
ఆమె కళ్ళనుండి కారిన కన్నీటి చారలు చెక్కిళ్ళ మీద విద్యుత్ దీపకాంతికి మిలమిలా మెరుస్తున్నాయి. పరీక్షగా ఆమె ముఖంలోకి చూచి వెనుదిరిగి రెండు అడుగులు ముందుకు వేశాడు.
తన తలను ఆమె తలకు దగ్గరగా జేర్చి చూస్తున్న సమయంలో... రాంబాబు నిశ్వాస గాలి భామ ముఖానికి వేడిగా తగిలినందున భామకు మెలకువ వచ్చింది. ముందుకు కదిలిన రాంబాబు చేతిని తన మంచం చివరకు జరిగి పట్టుకొంది.
తొట్రుపాటుతో రాంబాబు వెనక్కు తిరిగి చూచాడు.
"వెళ్ళిపోతున్నారా!"
"యింటికి కాదు క్రిందికి వెళుతున్నాను. మీరు నిద్రపోతున్నందున పలకరించలేదు."
"మీ వేడి నిశ్వాస గాలి నన్ను మేలు కొలిపింది."
"ఇప్పుడు మీకు ఎలా వుంది?"
"ఫర్వాలేదు... ఈ రాత్రికి మీరు ఇక్కడే వుండగలరా!..."
"వుంటాను. మీకు తోడుగా మల్లిని మీ గదిలో పడుకోమని చెప్పండి."
"ఏం మీరు పడుకోలేరా!"
రాంబాబు క్షణంసేపు భామ ముఖంలోకి పరీక్షగా చూచాడు.
"అమ్మా నాన్నగార్లకు తెలిస్తే... బాగుండదు."
"ఎవరు చెబుతారు."
"మల్లి"
"మీమీద మీకు నమ్మకం లేదా!"
"నామీద నాకు పూర్తి నమ్మకం వుంది. కానీ మనుషుల తత్త్వాల మీదనే నాకు నమ్మకం లేదు. నేను మగవాణ్ణి నన్ను ఎవరు ఏమన్నా సహించగలను. భరించగలను. కానీ... నా కారణంగా మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను భరించలేను" కాస్త ఆవేశంగానే చెప్పాడు రాంబాబు.
"నామీద మీకు అంతటి అభిమానమా!"
"అభిమానం కాదు స్నేహధర్మం. మీరు మీ ఈ స్నేహితుని మాట వినాలి. మల్లిని మీ గదిలో పడుకోమని చెబుతాను. నేను క్రింద హాల్లో పడుకొంటాను. గంట గంటకూ వచ్చి మిమ్మల్ని గమనిస్తూ ఉంటాను. ఏదైనా కావాల్సి ఉంటే ఇస్తాను. ఈ నా నిర్ణయాన్ని కాదనకండి" అభ్యర్థనగా చెప్పాడు రాంబాబు.
"సరే!... మీ యిష్టప్రకారమే చేయండి."
"థాంక్యూ!"
"స్నేహితుల మధ్యన మీరు అన్న ఆ మాట అవసరమా!"
"మీరు నాకు స్నేహితురాలే కాదు. నా యజమాని గారి కుమార్తె కూడా. ఆ స్థానానికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వడం నా ధర్మం."
"సరే సార్!... మీతో వాదించే ఓపిక నాకు లేదు. మీ ఇష్టప్రకారమే కానివ్వండి."
"ఏదైనా తింటారా!"
"ఏదీ తినాలని లేదు. కళ్ళు మూసుకొని నిద్రపోవాలని వుంది."
"సరే!... ప్రశాంతంగా నిద్రపోయేదానికి ప్రయత్నించండి. దేన్ని గురించీ ఆలోచించకండి."
"అలాగే!"
రాంబాబు క్రిందికి వచ్చాడు. మల్లిని పిలిచాడు.
"ఏం బాబుగారూ!...." మల్లి రాంబాబును సమీపించింది.
"అయ్యగారూ అమ్మగారూ లేరుగా!... నీవు అమ్మాయి గారి గదిలో తోడుగా పడుకో. నేను క్రింద హాల్లో పడుకొంటాను."
"అట్లాగే బాబు. ఇంటిదాకా ఎల్లి ఓ అరగంటలో వస్తా"
"సరే వెళ్ళి త్వరగారా"
"అట్టాగే బాబు"
మల్లి తన ఇంటికి వెళ్ళిపోయింది. రాంబాబు ఆఫీసు గదిలోకి వెళ్ళాడు.
మానస భామకు ఫోన్ చేసి తాను బయలుదేరినట్లు చెప్పింది. భామ మనస్సుకు కొంత వూరట కలిగింది. రేపు పన్నెండు గంటల లోపల మానస తన వద్దకు వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత, ఆమెతో కలిసి తాను డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. మెన్సస్ కాని దానికి... వాంతులకు... కారణం ఏమిటో తెలుసుకోవాలి. మానస ప్రక్కనుంటే తనకు కొండంత బలం.
గతం గుర్తుకు వచ్చింది... మురళీధర్ తనను ఏనాడైనా... తనకు తెలియకుండా... మోసం చేశాడా... తన శీలాన్ని దోచుకొన్నాడా..... ఎంతగా ఆలోచించినా ఆ ప్రశ్నలకు భామకు గుర్తుకు వచ్చే జవాబు అలాంటిదేదీ జరుగలేదనే... ఆ ఆలోచనలలోనే సతమతమౌతూ భామ నిద్రపోయింది. మల్లి వచ్చి ఆమె గదిలో పడుకొంది. రాంబాబు హాల్లో పడుకొని ఆ రాత్రి ఆరుసార్లు భామ స్థితిని గమనించాడు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Коментарі