#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #ప్రేమతరంగాలు, #PremaTharangalu, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు
Prema Tharangalu - Part 9 - New Telugu Web Series Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 31/12/2024
ప్రేమ తరంగాలు - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అడ్వొకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్ గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతుంటాడు ముకుందరావు.
సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చెయ్యడంతో అమెరికా బయలుదేరుతాడు ముకుందరావు.
కూతురు హద్దు మీరలేదనీ, ఇండియా బయలుదేరిందనీ తెలుసుకుంటాడు.
ఫ్లయిట్ లో మురళీధర్ తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ.
పక్క సీట్ లో ఉన్న మానస, మురళీధర్ ని వివాహం చేసుకొని మోసపోయినట్లు తెలుసుకుంటుంది.
చెన్నైలో తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన తండ్రి అసిస్టెంట్ బాబును డ్రైవర్ గా భావిస్తుంది. మానసకు తోడుగా కార్లో విజయనగరం దగ్గర ఉన్న తన ఊరికి వెళ్తుంది. మానస పేరెంట్స్ తో మాట్లాడి మురళీధర్ తో మానస కు విడాకుల ఏర్పాట్లు చేస్తుంది. తండ్రికి అన్ని విషయాలూ చెప్పి, అమెరికాకు ఇక వెళ్లనని, ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది. భామకు రాంబాబు పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది.
తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. మానసను వెంటనే రమ్మంటుంది.
ఇక ప్రేమ తరంగాలు - పార్ట్ 9 చదవండి.
ఉదయం పదిగంటల ప్రాంతంలో మానస ఫోన్ చేసి.. పదకొండు గంటలకు నెల్లూరులో తాను దిగుతున్నట్లు భామకు చెప్పింది.
భామ.. రాంబాబును పిలిచి మానస వస్తుందని, నెల్లూరుకు వెళ్ళి తీసుకొని రావలసిందిగా కోరింది.
రాంబాబు నెల్లూరుకి వెళ్ళి మానసను రిసీవ్ చేసుకొని గ్రామానికి వచ్చాడు.
కారు దిగి మానస వేగంగా భామ గదికి వెళ్ళింది.
రాంబాబు ఆమె గదిలోకి ప్రవేశించగానే తాను క్రిందికి వెళ్ళిపోయాడు.
"అక్కా.. వచ్చావా.." మంచంపై నుంచి లేచి భామ మానసను కన్నీటితో కౌగలించుకొంది.
తన పవిటతో మానస.. భామ కన్నీటిని తుడిచింది. తలుపు గడియ బిగించింది. భామను తన ప్రక్కన కూర్చోపెట్టుకొని ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడిగింది.
భామ.. నిన్న తన తల్లితండ్రి గోదావరి పుష్కరాలకు బయలుదేరిన దగ్గరనుంచీ తాను యింటికి నిన్న ఏ స్థితిలో తిరిగి వచ్చింది.. రాంబాబు తనకు చేసిన సహాయాన్ని.. అంతా వివరంగా చెప్పింది.
"అక్కా! మనం లేడీ డాక్టర్‍ను వెంటనే కలుసుకోవాలి."
"నీకు నెల్లూరులో ఎవరన్నా తెలుసా సత్యా!"
"తెలీదక్కా!"
"సరే ఫరవాలేదు. అక్కడకు వెళ్ళి తెలుసుకొందాం. ఈ మన పయనంలో రాంబాబు మనతో రాకుండా వుండటం మంచిది."
"అతను మనతో వచ్చినా.. కోర్టుకు వెళ్ళిపోతాడక్కా. మనతో రాడు. రేపటిదాకా ఆగడం ఎందుకు?"
"అక్కా!.. నీకు నెల్లూరులో ఏదో పని వుందని చెప్పి మనిద్దరం బయలుదేరి వెళదాం. నాకు చాలా టెన్షన్‍గా వుంది భరించలేకపోతున్నాను."
"సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. మనమిద్దరం బయలుదేరుదాం. రాంబాబుకు అనుమానం కలుగకుండా నీవు అతనికి ఏదైనా చెప్పాలి."
"ఆ పని నీవు చేస్తేనే బాగుంటుంది కదా అక్కా!"
"ఓకే.. నేను చెబుతాను. స్నానం చేసి డ్రెస్ మార్చుకొని మనం బయలుదేరుదాం."
మానస స్నానం చేసి డ్రస్ మార్చుకొని క్రిందికి వచ్చి ఆఫీసు గదిలో రాంబాబును కలిసింది.
"రాంబాబు గారూ!"
"చెప్పండి మేడమ్!"
"నేను, సత్యా నెల్లూరు దాకా వెళ్ళి వస్తాము. మా బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్. సాయంత్రం ఏడు ఎనిమిది కల్ల వచ్చేస్తాం. ఒకవేళ రాలేకపోతే.. ఫోన్ చేస్తాను."
"మంచిది మేడమ్, వెళ్ళిరండి"
భామ క్రిందికి వచ్చింది. ఆమెను పరీక్షగా చూచాడు రాంబాబు.
"అక్క విషయాన్ని చెప్పింది కదూ!" రాంబాబును సమీపించి అడిగింది భామ.
"చెప్పారండి, జాగ్రత్తగా వెళ్ళి రండి. కారును నెమ్మదిగా డ్రైవ్ చేయండి"
"అలాగే"
భామ మానస కారును సమీపించి కూర్చున్నారు. భామ కారును స్టార్ట్ చేసింది.
"సత్యా!.. జాగ్రత్త" రాంబాబు నోటినుండి ఆ మాటలు అప్రయత్నంగా వెలువడ్డాయి.
నవ్వుతూ భామ కారును కదిలించింది.
లేడీ డాక్టర్ విద్య భామను పరీక్షించింది. భామను బయటికి పంపి.. మానసను లోనికి పిలిచి భామ గర్భవతి అని చెప్పింది.
ఆ మాటను విన్న మాసన నిశ్చేష్టురాలైంది. ఈ విషయాన్ని తాను భామకు ఎలా చెప్పాలి! చెబితే ఆమె పరిస్థితి ఏమిటి? తన ఈ గర్భానికి కారణం ఎవరు? మురళీధరా!.. మరెవరన్నానా!.. ఎంతో తెలివైన భామ ఎలా మోసపోయింది. ఆమె జీవితానికి ఈ కళంకాన్ని అంటగట్టిన ఆ నీచుడు ఎవరు? ఈ విషయాన్ని భామ విని తట్టుకోగలదా!.. తాను ఎలాంటి నిర్ణయం తీసుకొంటుంది? మస్తిష్కాన్ని తొలిచే ప్రశ్నలతో మానస సతమతమైంది.
డాక్టర్ గది నుంచి ఎంతసేపటికీ రాని మానస కోసం భామ ఆ గదిలోనికి వచ్చింది. విచార వదనంతో ఆ ద్వారం ప్రక్కన నిలబడి వున్న మానసను చూచింది.
"అక్కా!.. డాక్టర్ ఏం చెప్పారు?" దీనంగా అడిగింది.
మానస కన్నీటితో తనకు డాక్టర్ చెప్పిన విషయాన్ని భామకు చెప్పింది.
భామ భోరున ఏడ్చింది. ఆమె తలను తన హృదయానికి హత్తుకొని మానస భామను ఓదార్చింది.
"అక్కా!.. ఇప్పుడు నేను ఏం చేయాలి" కన్నీటితో దీనంగా అడిగింది భామ.
"అబార్షన్" నిశ్చలంగా చెప్పింది మానస.
"అక్కా!.." గద్గద స్వరంతో దీనంగా పలికింది భామ.
"నీ భవిష్యత్తు బాగుండాలంటే.. అంతకంటే వేరే మార్గం నాకు తోచడం లేదమ్మా!.. ఈ విషయం అమ్మా నాన్నలకు తెలిస్తే.. వారు ఎంతగా బాధపడతారో ఆలోచించు. నిన్ను ఈ స్థితికి గురి చేసిన వ్యక్తి నీకు తెలియదు. మరో రెండు నెలల్లో నీ శరీర స్థితిలో కలిగే మార్పులు.. నీవు దాచాలనుకొన్న నిజాన్ని బట్టబయలు చేస్తాయి. నీకు అమ్మా నాన్నలకు అందరికీ తలవంపులు. కనుక.. నీవు అబార్షన్‍కు సిద్ధపడి తీరాలి సత్యా!.." గద్గద స్వరంతో చెప్పింది మానస.
అయోమయ పరిస్థితిలో భామ రోదిస్తూ మానసను చుట్టుకొంది.
"సత్యా!.. రెండు మూడు రోజుల్లో పుష్కర యాత్ర ముగించుకొని అమ్మా నాన్నలు వస్తారు కదా!.. ఈలోగా ఆ పని జరిగిపోవడం నీకు ఎంతో మంచిది. నేను నీ క్షేమాన్ని కోరేదానినని నా మీద నీకు నమ్మకం వుందిగా!.. నీవు సరే అంటే నేను డాక్టర్ గారితో మాట్లాడుతాను.
రాంబాబుకు ఫోన్ చేసి బంధువులు మమ్మల్ని వెళ్ళనివ్వలేదని ఎప్పుడు వచ్చేది రేపు ఫోన్ చేస్తామని చెబుతాను. నా నిర్ణయం ప్రకారం ఈరోజే ఆ పని జరిగిపోతే ఎంతో మంచిది" అనునయంగా చెప్పింది మానస.
పవిటతో.. కన్నీటిని తుడుచుకొని.. గద్గద స్వరంతో భామ.. "సరే అక్కా!.. నీవు డాక్టర్ గారితో మాట్లాడు" విచారమైన వదనంతో మెల్లగా చెప్పింది.
మానస డాక్టర్ గారిని కలుసుకొని సమస్యను గురించి వివరించింది. భామ పరిస్థితిని అర్థం చేసుకొన్న డాక్టర్ విద్య.. అబార్షన్ చేసేదానికి అంగీకరించింది. వారికి ఒక గది కేటాయించింది.
ఫార్మాలిటీస్ ముగించి భామకు డ్రెస్ మార్చి.. గదిలోనికి తీసుకొని వెళ్ళేదానికి నర్స్ సిద్ధం చేసింది.
మానస.. భామ భుజంపై చెయ్యి వేసి.. "భయపడకు" అని ధైర్యం చెప్పి లోనికి పంపింది. డాక్టర్ భామను గదిలోనికి తీసుకొని వెళ్ళింది.
మానస రాంబాబుకు ఫోన్ చేసి మేము ఈరోజు తిరిగి రావడం లేదని.. ఎప్పుడు వచ్చేది రేపు ఫోన్ చేసి చెబుతామని చెప్పింది.
"మేడమ్! సత్యను జాగ్రత్తగా చూచుకోండి. ఆమె ఆరోగ్యం సరిగా లేదు. మీరు వచ్చారనే ఆనందంతో మీతో బయలుదేరింది. ఆమెలో ఎంతటి ఆవేశం వుందో.. అంతే అమాయకత్వమూ వుంది మేడమ్. ఆమెను నేను జాగ్రత్తగా చూసుకొంటాననే నమ్మకంతో మా బాస్‍గారు మా పెద్దమేడమ్‍గారు గోదావరి పుష్కరాలకు వెళ్ళారు" వినయంగా చెప్పాడు రాంబాబు.
అతని మాటల్లో.. మానసకు అతనికి భామపట్ల ఎంతటి అభిమానం వుందో అర్థం అయింది.
"సార్!.. నేను సత్యను జాగ్రత్తగా చూచుకొంటాను. నా మాటను నమ్మండి"
"థాంక్యూ మేడమ్ గుడ్ నైట్" రాంబాబు సెల్ కట్ చేశాడు.
రెండు గంటల తర్వాత భామను స్ట్రెచ్చర్‍పై వారు తీసుకొన్న స్పెషల్ రూముకు మార్చారు. బెడ్‍పై పడుకోబెట్టారు. భామ సమస్య తీరిపోయింది.
మానస డాక్టరు గారిని ఎప్పుడు వెళ్ళవచ్చని అడిగింది. రేపు వెళ్ళవచ్చని ఆమె జవాబు చెప్పింది. డాక్టర్‍కు ధన్యవాదాలు చెప్పి.. మానస ఆ గదిలోకి వచ్చింది.
మానసను చూచిన నర్స్.. "ఆహారం లిక్విడ్‍గా ఏదైనా ఇవ్వండి. పాలు బ్రెడ్ మేము ఇస్తాము" అంది.
"అలాగే"
మానస గొంతు విని భామ కళ్ళు తెరిచింది. భామను సమీపించి మానస ఆమె చేతిని తన చేతిలోకి ప్రీతిగా తీసుకొంది. దీనంగా మానస కళ్ళల్లోకి చూచింది భామ.
"సత్యా!.. ఇంతవరకూ జరిగిన దాన్నంతా మరిచిపో. ఏ విషయాన్ని గురించీ ఆలోచించకు. నీవు చాలా మంచిపిల్లవు. ఆ దేవుడు నీకు ఎప్పుడూ అండగా వుంటాడు" అనునయంగా చెప్పింది మానస.
కన్నీటితో దీనంగా చూచింది భామ.
"నా ఈ స్థితికి కారకులు ఎవరో నా ఊహకు అందడం లేదు అక్కా!" విచారంగా చెప్పింది భామ.
"నేను ఇంతకు ముందేగా చెప్పాను. నీవు దేన్ని గురించి ఆలోచించవద్దని, ఇది నీవు ఆలోచించ వలసిన సమయం కాదు. విశ్రాంతి తీసుకోవలసిన సమయం. సంతోషించ వలసిన తరుణం. అమ్మా నాన్న సమయానికి వూర్లో లేకుండా పోవడం నీకు ఆ దేవుడు చేసిన మేలు. వారు ఊర్లో వుండి, వారి ముందు నీవు వాంతి చేసుకొని వుంటే వారు ఎంత బాధపడేవారు. నిన్ను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళి వుండేవారు.
డాక్టర్ చెప్పిన వార్త విని వారు ఎలాంటి స్థితికి లోనై వుండేవారో.. నిన్ను గురించి ఏ రీతిగా వూహించుకొని వుండేవారో.. తలచుకొంటే గుండె దడ. అలాంటి స్థితికి నిన్ను లోను కానియ్యకుండా ఆ దేవుడు రక్షించాడు. నీకు పట్టిన గ్రహణాన్ని వదిలించాడు. ఆ దైవానికి ధన్యవాదాలు చెబుతూ ప్రశాంతంగా నిద్రపో. రేపు ఈ పాటికి మనం మన ఇంట్లో వుంటాం. నీవు ఆనందంగా నీ భవిష్యత్ ప్రణాళికలను కొనసాగించవచ్చు. ప్రశాంత చిత్తంతో నిద్రపో సత్యా!.. నా బంగారు చెల్లివి కదూ!" ఎంతో అనునయంగా చెప్పింది మానస.
నర్స్ బ్రెడ్, పాలు తీసుకొని వచ్చింది. మానస వాటిని అందుకొంది. భామను లేపి బలవంతంగా బ్రతిమాలుతూ.. తినిపించి పాలను త్రాగించింది.
నర్సును అక్కడ వుండమని చెప్పి.. తాను క్యాంటిన్‍కు వెళ్ళి టిఫిన్ చేసి పావుగంటలో గదికి వచ్చింది. నర్స్ వెళ్ళిపోయింది. నర్స్ యిచ్చిన మాత్రతో భామ కళ్ళు మూతలు పడ్డాయి. పక్కన వున్న బెంచ్‍పై మానస వాలింది.
*
అది మహానది గోదావరీ తీరం.. ముకుందవర్మ, నీలవేణి.. బాలగోవిందయ్య, అతని భార్య వనజాక్షి పుష్కర స్నానం చేసేటందుకు.. లాడ్జి నుండి నదీ తీరానికి బయలుదేరారు.
ఉదయం ఏడున్నర ప్రాంతంలో ఆ నలుగురూ స్నాన ఘట్టానికి చేరారు. గోదావరి స్నానం చేశారు. ఉదయించే సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించారు.
’తల్లి గోదావరమ్మా!.. నాకు నా ఇల్లాలికి ప్రస్తుతంలో కావలసింది మా సత్యభామ వివాహం. నా దృష్టిలో మా అక్క కొడుకు ధనుంజయ్ ఆమెకు అన్ని విధాలా తగినవాడు. కానీ ఆ అమెరికా సంబంధం నా యిల్లాలు నీలవేణికి యిష్టం లేదు. నేను ఆమె మాటను కాదని నా పంతాన్ని నెగ్గించుకోగలను. కానీ.. అలా చేస్తే.. నీలవేణి నన్ను ఈ జన్మలో క్షమించదు. ఆమె అభిమానం, ఆవేశం నాకు బాగా తెలుసు.
కాబట్టి నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. నా నీలవేణితో ఏకీభవిస్తున్నాను. ఆమె కోరిన విధంగా ఆమెకు బాగా నచ్చిన మంచి సంబంధం మాకు సంప్రాప్తించేలా చేసి.. మా భామ వివాహం మేము త్వరలో జరిపించ కలిగేలా మమ్మల్ని ఆశీర్వదించు మాతా!’ నదీ స్నానంలో ఆ నదీ మాతకు ముకుందవర్మ చేసిన విన్నపం యిది.
’తల్లీ!.. నాకు ఒకే ఆడబిడ్డ. ఆమె ఇష్టానుసారంగా చదివించాము. అమెరికా పంపించాము. నా జీవిత కాలంలో నా బిడ్డ నాకు దగ్గరలో తన కుటుంబంతో వుండేలా చూడు. మంచి సంస్కార వంతుడైన యువకునితో ఆమె వివాహం.. నా ఇష్టానుసారంగా జరగాలి. ఈ విషయంలో నా మాటలను మావారు.. నా కూతురూ కాదనక.. వినేలా వారి తత్వాలను మార్చు. వచ్చే పుష్కరాలకు నేను మా వారు నా కూతురు, అల్లుడు వారికి పుట్టబోయే పిల్లలు నా కొడుకు వచ్చి నీ ఒడిలో జలకాలాడేలా నన్ను ఆశీర్వదించు మాతా!’ ఇది ఆ మహానది పుష్కర సమయంలో నీలవేణి ఆ నదీ మాతను కోరిక కోరిక.
ఆరు అడుగుల ఎత్తు.. తెల్లటి దేహఛ్ఛాయ.. వుంగరాల జుట్టు.. చక్కటి రూపం.. విశాలమైన నేత్రాలు ముఖంలో ఎంతో ప్రసన్నత.. గల యువకుడు.. అతని ప్రక్కన.. నెలరోజుల క్రిందట వారి యింటికి వచ్చిన రాంబాబులాంటి మరో అబ్బాయి.. ఆ స్నాన ఘట్టానికి స్నానం చేసేటందుకు వచ్చారు.
ఆ రెండవ యువకుని చూచి ముకుందవర్మ కుమారుడు ఆనంద్ వర్మ..
"నాన్నా అమ్మా!.. రాంబాబు లాంటి మనిషి వచ్చాడు. అటు చూడండి" ఆశ్చర్యంతో చెప్పాడు.
ఆ ఇరువురూ అతన్ని చూచారు. వారూ ఆశ్చర్యపోయారు. అతను రాంబాబులా వున్నందుకు. ఆ యువకుడు రాంబాబులాగానే వున్నాడు. ఆ వచ్చిన యిరువురూ నదిలో దిగారు. వీరిని వారూ చూచారు.
బాలగోవిందయ్యా.. అచ్చం రాంబాబులా వున్న యువకుని చూచి ఆశ్చర్యపోయాడు.
ముకుందవర్మ.. నీలవేణీలు, బాలగోవిందయ్య ఆయన భార్య వనజాక్షి ఆ వచ్చి ఇరువురు యువకులనూ పరీక్షగా చూచారు.
ఆ ఇరువురూ నీట మునుగుతూ.. తేలుతూ ఎంతో ఆనందంగా వున్నారు.
"బాలగోవిందయ్యా!.." పిలిచింది నీలవేణి.
బాలగోవిందయ్య నీలవేణిని సమీపించి..
"ఏమ్మా!.." అడిగాడు.
"ఆ ఇరువురూ ఏ వూరి నుంచి వచ్చారో కనుక్కోండి" అంది మెల్లగా నీలవేణి.
ముకుందవర్మ ఆమె ముఖంలోకి చూచి నవ్వాడు.
ఆ నవ్వులో.. ’ నీ ఉద్దేశ్యం నాకు అర్థం అయింది నీలూ!’ అన్నట్లు గోచరించింది నీలవేణికి.
భర్త కళ్ళల్లోకి క్షణంసేపు చూచి.. సిగ్గుతో నవ్వుతూ తలదించుకొంది.
"అయ్యా!.. తమరిది ఏ వూరు?" ఆ ఇరువురినీ సమీపించి అడిగాడు బాలగోవిందయ్య.
"మాది పూర్వం విజయనగరం. ప్రస్తుతం.. విశాఖపట్నం.. మీదేవూరండి?" అడిగాడు రాంబాబును పోలిన యువకుడు.
"మాది నెల్లూరు."
"ఓహో!.. చాలా మంచి ఊరు" నవ్వుతూ అన్నాడు ఆ యువకుడు.
"వారూ!"
"నా యజమాని.. కాదు, కాదు, మా అన్నయ్యగారు"
"వారి పేరు?"
"డాక్టర్ శ్యాంబాబు!"
"మీకు నా పేరు తెలుసుకోవాలని లేదా!"
"చెప్పండి బాబు.. మీ పేరేమిటి?"
"బాబు"
"మీ అన్నగారికి వివాహం అయిందా!"
"కాలేదు. మీకు తెలిసిన.. బాగా చదువుకొన్న.. మంచి అమ్మాయి వుంటే చెప్పండి. మేము పెళ్ళి చూపులకు వస్తాం. మీ నెల్లూరంటే, మా అన్నయ్యగారికి చాలా ఇష్టం" నవ్వుతూ చెప్పాడు బాబు.
వారిరువురి సంభాషణను చిరునవ్వుతో విన్నాడు శ్యాంబాబు.
"రేయ్ బాబూ!.. ఇక ఆపు" మందలింపుగా నవ్వుతూ అన్నాడు.
"అన్నయ్యా!.. తప్పుగా ఏం మాట్లాడలేదుగా!.. సారీ!.." అన్నాడు బాబు.
బాలగోవిందయ్య మెల్లగా జరిగి ముకుందవర్మ.. నీలవేణీలను సమీపించాడు.
వారిరువురూ వీరంతా నదీజలాల నుండి ఒడ్డుకు చేరి.. తమ తమ బసలకు వెళ్ళిపోయారు.
వస్త్రాలు మార్చుకొన్న తర్వాత.. బాలగోవిందయ్య తను సేకరించిన వివరాలను ముకుందవర్మ, నీలవేణిలకు తెలియజేశాడు.
"ఏమండీ!.. ఆ అబ్బాయి ఎలా వున్నాడు?"
"పున్నమి చంద్రుడిలా వున్నాడు"
"విశాఖపట్నం వెళ్ళి.." నీలవేణి పూర్తిచేయకముందే..
"వూరికి వెళ్ళి.. మనకు కావలసిన అన్ని వివరాలను సేకరించేటందుకు బాలగోవిందయ్యను పంపుదాం" నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ.
"వూరికి పోగానే మీరు ఆ పని చెయ్యాలి."
"తప్పకుండా!"
"అబ్బాయి నిజంగా చాలా బాగున్నాడు కదా అండీ!.. పైగా డాక్టర్. భామకు అతనికి ఈడూ జోడూ చాలా బాగుంటుంది కదూ!.."
"అవును. మన ప్రయత్నం మనం చేద్దాం" నవ్వుతూ చెప్పాడు ముకుందవర్మ.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
సి ఎస్ శర్మ గారి "ప్రేమ తరంగాలు" ... అలనాటి హీరోయిన్ లక్ష్మి నటించిన మొదటి హిందీ చిత్రం "జూలీ" గుర్తుకు తెచ్చింది.
-------- X X X -------------
పి.వి.పద్మావతి మధు నివ్రితి