'Premaku Artham Thelisindi' - New Telugu Story Written By Undavilli M
Published In manatelugukathalu.com On 22/12/2023
'ప్రేమకు అర్ధం తెలిసింది' తెలుగు కథ
రచన: ఉండవిల్లి.ఎమ్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఇంతమంది అమ్మాయిలలో, ఒకమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పేద్దామనుకున్నాను. అందరికీ ప్రేమ కలిగేంత సన్నిహితంగా వెంట తిప్పుకుంటున్నాను. ఎవరో ఒకరికే ఓటేయాలి. ఇందర్లో ఒకర్నే సెలెక్ట్ చేయడం నావల్ల కాదనిపించింది.
ఇదంతా తెలియాలంటే, నేను చెప్పే నాకథ మీరు విని తీరాలి మరి!
అందరితో వాట్సాప్ కాంటాక్ట్స్ లో ఉన్నాను. నా వాట్సాప్ లో పదహారు మంది అమ్మాయిల నంబర్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోలా మనసుని విస్తృతపరచి చూపించాను. కానీ, అసలు రూపం ఒకటే ఉంటుంది కదా, అందుకనే ఈరోజు, నా మనసుని పూర్తిగా పరచి, నిజాన్ని నిర్భయంగా అందరికీ చెప్పేసి, వాళ్ళ స్పందనను బట్టి ఒకర్ని ఎంచుకోవాలనుకున్నాను. భారీ సైజులో నా మనసు రూపురేఖల్ని విపులీకరిస్తూ మెసేజ్ తయారు చేసాను. ఇక సెండ్ బటన్ నొక్కితే అందరికీ సెకన్లలో మెసేజ్ వెళ్ళిపోతుంది.
అందరూ ఆశ్చర్యపోతారు. కొందరు జీర్ణించుకోలేరు. మరి కొందరు అసహ్యించుకుంటారు. కానీ, ప్రేమ వ్యవహారాల్లోకి రాకుండా, ఎప్పుడూ నా మనసుకి సమాంతరంగా సలహా చెప్పగలిగే వరూధిని మాత్రం ఖచ్చితమైన ఓ సలహా చెప్తుంది. ఆ ఆలోచన రాగానే సెండ్ బటన్ మీద వేలుని తీసేసాను.
త్వరగా కాలేజీకి రెడీ అయ్యి, కాలేజీలో ముందుగా వరూధినిని కలిశాను.
"కాలేజీ అయిన తర్వాత ఓ అరగంట ఆగు, నీతో మాట్లాడాలి" అన్నాను.
కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యమూ, నేనేదో చేస్తున్నాననే భావమూ ఆ కళ్ళలో చూపించింది వరూధిని.
"వస్తావా" మళ్ళీ అడిగాను.
"రాక చస్తానా" అంది నవ్వుతూ.
సాయంత్రం కాలేజీ బయట పార్కులో నాకంటే ముందుగా వచ్చి, సిమెంట్ చప్టా మీద కూర్చుని పుస్తకం చదూతుంది.
"వచ్చేసావా" అన్నాను.
పుస్తకాన్ని మడచి పక్కనబెట్టి, ఏంటి విషయం అన్నట్టు సూటిగా నా కళ్ళలోకి చూసింది.
నేను మాట్లాడకుండా, ఎలా చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయాను.
"పిలిచి, నీ ఆలోచనలేమిటి!? అంతా ఆలోచించాకే నన్ను పిలవకపోయావా!" అంది.
"ఎలా మొదలెట్టాలా అని ఆలోచిస్తున్నా" అన్నాను.
"ఎలా పెట్టినా పర్లేదు, సీరియల్ గా నేను కలుపుకుంటాన్లే" అంది ఫన్నీగా.
"నువ్వు ఎప్పట్నుంచో ఫ్రెండువి, నా గురించి తెలిసిన దానివని నీతో షేర్ చేసుకుంటున్నాను. నా మనసు స్థిరంగా ఉండటం లేదో, ఈ వయస్సులో మనసు రకరకాల దారుల్ని వెతుక్కుంటుందో, నాకేం తెలియడం లేదు. నేను అక్షితను ఇష్టపడ్డాను. ఆమె చాలాసార్లు నా ప్రాజెక్ట్ వర్క్స్ లో సహాయం చేసింది. గలగలా మాట్లాడుతుంది. ఏ సమస్య గురించి చెప్పినా, పద పరిష్కరిద్దాం, నీ వెంట నేనుంటా అంటుంది. నా మీద ఆమెకి అభిమానం చాలా ఉంది. నేను ప్రపోజ్ చేస్తే, ఒప్పుకునే స్థితి ఉంది. ఇలాంటి అక్షిత.. . "
"నాకిష్టం లేదని చెప్పిందా!!" అంది వరూధిని.
"కాదు, అడిగితే ఇష్టమనే చెప్తుంది. కానీ మధ్యలో శరణ్య అని బి. టెక్ అమ్మాయిని ఓ ఫంక్షన్లో చూసాను. ఆకర్షణగా ఉండటమే కాదు, ఆ ఫంక్షన్ లో చలాకీగా అందర్నీ రిసీవ్ చేసుకోవడం, వయస్సు మళ్ళిన వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లి కుర్చీలలో కూర్చోబెట్టడం, వచ్చిన వాళ్ళకి మర్యాదలు చూడటం, ఇవన్నీ విరామం లేకుండా చేయడం చూసి, ‘మీరు చాలా బాగా అన్ని పన్లు చక్కబెడుతున్నారు. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే, వచ్చి హెల్ప్ చేస్తారా మేడమ్’ అన్నాను నవ్వుతూ. ముందు ఆశ్చర్యంగా నన్ను చూసి, తర్వాత రెండు నిముషాలకి ‘తప్పకుండా అండి’ అంది నవ్వుని విసురుతూ.
తర్వాత ఆ అమ్మాయి వైపు కూడా మనసు లాగుతుంది. తర్వాత నీలిమ అని ఆమె సింగర్. పాటలు చాలా బాగా పాడుతుంది. ఎన్నిసార్లో ఆమె పాటల్ని విని విని ఆమెని పరిచయం చేసుకున్నాను. నాకిష్టమైన పాటలు పాడమంటే పాడేది. ఇలా మనసు కొంతమంది వైపు అలా ఎలా జారిపోతుందో అర్ధం కాదు!" అన్నాను.
"ఒకవేళ అందరూ ఒకేచోట ఉంటే ఎవర్ని ఇష్టపడతావ్" అంది.
"ఏమో, తెలియదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే మనసు ఎవర్ని అంగీకరిస్తుందో చెప్పలేను" అన్నాను.
"అందంగా ఉన్నారు కాబట్టి, నచ్చినట్టు ఉంటుందా మనసుకి" అని అడిగింది.
"అందమైన వారని కాదు, సాదా సీదాగా ఉన్నా, వాళ్లలో ఏదో మనసుకి నచ్చుతుంది. " అన్నాను.
"ఇలా ఎన్నాళ్ళ నుంచి" అంది.
"కలల్ని దృశ్యాలుగా ఆవిష్కరించుకోవడం తెలిసిన దగ్గర్నుంచి" అన్నాను.
"అయితే, తాత్వికంలోకి వెళ్లిపోయావేం!” అంది నవ్వుతూ.
"అసలు దీనికోక ఉనికుందా!?" అన్నాను.
"చూడు వర్చ్యస్వి, ప్రేమ నువ్వనుకున్నట్టు అస్థిరమైంది కాదు. అది ఒకచోట నుండి మరోచోటకి సుళువుగా ప్రవహించేది కాదు! అసలు నిశ్చలత్వం లేని ప్రేమ ఉండదు" అంది.
"నాకు అర్ధం కాలేదు వరూధిని" అన్నాను.
"ఒకర్ని ఇష్టపడుతున్నపుడు కొన్నాళ్ళకి ఎవరైనా తారసపడినా మనసు వాళ్ళని ప్రేమించడానికి అంగీకరించదు. పదే పదే మన ఆలోచన్లు ప్రేమించిన వారి వైపే ప్రవహిస్తాయి" అంది.
"నా ప్రేమకి అర్ధం ఏంటి!?" అన్నాను.
"ప్రేమతత్వం ఎవరికీ అర్థంకాదు, ఒకే ప్రేమ అనేక అంశాలుగా ఒక్కొక్క చోట ఒకోలా పనిచేస్తుంది. బిడ్డ మీద తల్లికి ఉండే ప్రేమ, మంచి యజమాని దగ్గర పనివాడి ప్రేమ, క్లోజ్ ఫ్రెండ్ దగ్గరుండే ప్రేమ, నచ్చిన అమ్మాయి మీద ఉండే ప్రేమ, ఇవన్నీ వివిధంగా ఉంటాయని నాకనిపిస్తుంది. అవతలి వారిలో ఏదొక అంశం వాళ్ళ మీద ప్రేమకి దారి తీయొచ్చు. వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఏకం కాలేకపోయిన, ప్రేమ విఫలానికి కారణం కావొచ్చు. ఇలా ఫెయిల్ అవుతున్నవే ప్రేమ పెళ్లిళ్లు".
"నువ్వలా చెప్తుంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి భయం వేస్తోంది" అన్నాను.
"ఏదో నచ్చి ప్రేమించడంతో పాటు, వ్యక్తిగతమూ నచ్చితే వందశాతం ప్రేమ ఫెయిల్ కాదు" అంది.
"నేను ఈ ఐదారు సంవత్సరాల నుండి చాలా మందితో పరిచయాలు పెంచుకుని, చాలా మందిని ఇష్టపడుతున్నాను. అందరూ నచ్చినట్టే ఉంటారు. కానీ ఒకర్నే కదా పెళ్లిచేసుకోగలం" అన్నాను.
"సరే, నిజం చెప్పు, వీళ్ళల్లో ఎవరితోనైనా శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా!? ఇలా ఆడిగానని ఏమి అనుకోకు! నీ దగ్గర చనువుతో అడుగుతున్నాను. " అంది.
"వాళ్ళు నాకు దక్కాలని అనిపిస్తుంది. అయితే వాంఛతో కూడిన ఊహలు నాకెప్పుడూ కలగలేదు" అన్నాను.
"మంచిది. మరీ ఆకర్షణలోనూ పడిపోలేదు" అంది.
"నీ ఉద్దేశం ఏమిటి!?" అన్నాను.
"ముందు ప్రేమించాక, తర్వాత పెళ్లిచేసుకున్నాక, ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకి ఉంటాయి. కాబట్టి, జీవితంలో కలిగే చిన్న అమరికల్ని ఎడ్జస్ట్ చేసుకుంటూ సంవత్సరాలు సంవత్సరాలు నడిచాక, మొదట్లో ప్రేమించినంత ఇంట్రస్టు ఆ దశలో ఉండదు. కొంతైనా తగ్గిపోతుంది. కానీ, ఎడ్జస్ట్ అయిపోతారని చెప్పేగా, అలా అని ప్రేమని చివరి వరకు తీసుకుపోయిన వాళ్ళు లేకపోలేదు" అంది.
"నేనలా చివరిదాకా కంటిన్యూ చేయలేననా నీ భావం" అన్నాను.
"అఫ్ కోర్స్, వ్యక్తిగతమూ, కనబరిచే ప్రేమ రెండు సమైక్యం కాగలిగితే నువ్వు సక్సెస్ అయినట్టే" అంది.
"అదెలా తెలుస్తుంది" అన్నాను.
"నువ్వు ఇష్టపడుతున్న అమ్మాయిలకి కొంచెం డీప్ గా వెళ్ళు, అక్కడ కూడా మీకు నచ్చినట్టు ఉంటే, ప్రేమ ఎక్కువ శాతం బతుకుతుంది. " అంది.
"లోతుగా పరీక్షలు ఎలా పెట్టను" అన్నాను.
"అదికూడా నేనే చెప్పాలా, ఏదొకటి ఆలోచించు వర్చస్వి" అంది.
"నువ్వే చెప్పి, నాకొక అమ్మాయిని సెలెక్ట్ చేయి ప్లీజ్.. . " అన్నాను.
కొంతసేపు మౌనంగా ఉండిపోయింది.
"ఇదే విషయం వాట్సాప్ లో పెట్టేయాలనుకున్నాను వరూధిని. ఇష్టపడ్డవారే ముందుకు వస్తారని" అన్నాను.
"నువ్వు ఆ పనిచెయ్, తర్వాత ఇంకో ప్లాన్ వేద్దాం" అంది.
ఆరోజు వాట్సాప్ లో నా మనసు ఎన్ని రకాలుగా పోయి, ఎలా అమ్మాయిల్ని ఇష్టపడింది వివరంగా రాసిన మెసేజ్ సెండ్ బటన్ నొక్కాను. దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ్నుంచి వరూధిన్ని బస్సెక్కించి, నేను రూములోకి చేరిపోయాను.
రోజూ సాయంత్రం వచ్చే కొన్ని మెసేజ్ లు కొన్ని రాలేదు. కొంతమంది పిచ్చిపిచ్చిగానూ మరికొంతమంది అసహ్యించుకుని, మెసేజెస్ చేయడం మానేశారు. రోజూ కనబడే కొందరు ముఖం చాటేస్తారని నాకు అర్ధమైంది. నాకు ఇదంతా అయోమయంగా ఉన్నట్టుంది. ఇన్ని రకాలుగా పోయే ఈ మనసు కోరుకునేదేమిటి!? ఏం చూసి ఇష్టపడుతున్నాను!? తాజమహల్నో, అరకు లోయనో చూసి ఇష్టపడినప్పటి లాంటిదేనా!ఇదీనూ!? ఏమో, వస్తువైనా, మనిషైనా మాములుగా ఇష్టపడి ఆకర్షణగా కనబడ్డం వేరు, ఇష్టపడి, లోపలికంటా వెళ్లి మరీ ఇష్టపడ్డం ప్రేమేమో అన్పించింది.
మేడమీద గదిలో కిటికీలోంచి దూరంగా చెరువు, దానిలో ప్రతిబింబమైన పున్నమి చంద్రుడు అందంగా కనిపించి, ఆ దృశ్యం హత్తుకుంది. హత్తుకున్న దృశ్యాన్ని మనసులో స్థిరంగా ఉంచగలిగి, అలౌకికానందం పొందడమే దాని మీద ప్రేమనిపించింది. అయినా, అంతర్లీనంగా ప్రేమ ఇన్ని రూపాలుగా ప్రదర్శింపబడటం, అందరం ప్రేమంటే ఒకటే నిర్వచనం చెప్పుకోవడం, ఆ సమయంలో నాలో మరోకోణం ఆవిష్కృతమైంది.
ఆఖరి మెసేజ్ వచ్చింది. లావణ్య పంపించింది "నువ్వు ఇలాంటి వాడివనుకోలేదు. చీ!" అంది.
నాకేమి అనిపించలేదు. ఒక స్థిరమైన, ఏకీకృతంగా ఉండే భావం నాకు స్ఫురించలేదు. అందరూ చెప్తున్నవే, వినీ వినీ అనుభవంలో శోధించాక అనేక భావాలుగా, రూపాలుగా స్పష్టత కొద్ది కొద్దిగా ప్రేమలో కనబడుతుంది.
మర్నాడు వరూధినికి ఇవన్నీ చెప్పాను. ఆమె నవ్వింది.
"నీకు ఫేవర్ గా ఎంతమంది మెసేజ్ పంపించారు" అంది.
"ఆరుగురు" అన్నాను.
"మాములుగా నీకు నచ్చడమే కాకుండా, నువ్వంటే వాళ్ళకి, వాళ్లంటే నీకు దేనికో అన్నిట్లోనూ నచ్చుతుంది. అలా నచ్చడంతో, వాళ్ళ నెగెటివ్ నెస్ని కూడా డామినేట్ చేసి నిలబడగలుగుతుంది. అలా జరిగినప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టే" అంది.
"నాకు అర్ధమయ్యి, కానట్టుంది" అన్నాను.
"సరే, ఆ వాట్సాప్ నంబర్లు అన్నీ నాకివ్వు, రేపట్నుంచి నాల్గురోజులు హాలిడేస్ కదా, నేను మెసేజ్ లు పెడతాను. దానికి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుస్తుంది. నీ మనసు కూడా దానికి ఎలా స్పందిస్తుందో అర్ధమవుతుంది. అప్పుడు ఆలోచిద్దాం "అంది.
నేను "ఓకే" అన్నాను.
నాకు మెల్లగా మనసు నీరసించింది. ఇవన్నీ తలచుకుని అదోలా అయిపోయాను. విరహమూ కాదు, ప్రేమా కాదన్నట్లుంది నా స్థితి. ఇలాంటి ఆలోచన్లతో చదువు ఎలా చెడిపోతుందో కొంచెం అర్ధమైంది. స్థిమితంగా మనసును ఆధీనంలో ఉంచుకుని చదువుకుంటే బాగున్నని తెలుస్తూనే ఉంది. అయినా, చెయ్యలేని అగమ్యగోచరం. మనసు దేనికో పడిలేస్తూ, వెంపర్లాడటం, నేను డీలాపడి ఏమీ తినబుద్ధి కావట్లేదు. ఆరోజు జ్వరం కూడా వచ్చింది.
వరూధినికి తెలిసి, టాబ్లెట్లు తెచ్చి ఇచ్చింది. "జ్వరము, మనిషి డల్ అయిపోయాడు. అసలు హుషారుగా ఉండట్లేదు" అని అందరికి మెసేజ్ లు పెట్టింది.
ఎవరూ రాకపోయినా, అందరూ వాట్సాప్ లో మెసేజ్ లు పంపించి పలకరించారు.
జ్వరం కాస్తా, టైఫాయిడ్ లోకి మారింది. వరూధిని వచ్చి, హాస్పిటల్ కి తీసుకు వెళ్ళింది. ఆరోజు డబ్బులు కూడా తనే ఇచ్చింది. రోజూ క్యారేజీ తీసుకువచ్చి, తినేవరకూ ఉండి వెళ్ళేది. తగ్గేవరకూ ఆమె నన్ను విడిచిపెట్టలేదు.
నేను మాములుగా అయ్యాక"ఇలాంటి ఆలోచన్లు ఏవీ మనసులో పెట్టుకోకు, ముందు శ్రద్ధగా నీ చదువు చూసుకో, ఆరోగ్యమూ, చదువూ, తర్వాతే మిగతా జీవితం" అంది.
"ఇంక నేనేమి ఆలోచన్లు చెయ్యను. ఓకే ఆలోచన దగ్గర దృఢంగా ఉండిపోయాను" అన్నాను.
ఆశ్చర్యంగా చూసింది నా వైపు! ఏమిటన్నట్టు.
"బయట ఇష్టపడుతూ, లోపలికంటా వెళ్లి ఇష్టపడటమే ప్రేమ అన్నావు కదా! అందుకే నువ్వే నాక్కావాలి వరూధిని" అన్నాను.
"నేను నిన్ను ప్రేమించలేను వర్చస్వి, నువ్వు నీకు నచ్చిన అభిప్రాయాలు, నడవడిక ఉన్న వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసుకున్నావో, నాకూ మనసులో నేను ఇష్టపడే బిహేవిర్ ఉన్నవాళ్లు తారసపడే వరకు ఎదురు చూస్తుంటాను. వస్తాను, బాయ్" అంటూ ముందుకు నడిచింది.
ఒక్కక్షణం నా మనసు బాధతో మూల్గింది. అంతా తానై మరో ఊహ చొరబడని వేళలో, దురదృష్టం వెంటాడి, నాకు దుఃఖాన్ని మిగిల్చింది. మనసుని నిబ్బరం చేసుకున్నాను.
"వరూధిని నాకు ఈ క్షణం నుండి ఇక ఎవర్నీ ప్రేమించాలనిపించడం లేదు" అన్నాను.
ఒక్కసారి తిరిగి నావైపు చూసింది. కానీ, ముందుకు పోయే నడక ఆపలేదు.
"నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు ఎదురుపడితే, ఎవరైనా సరే, నేను మీ ఇద్దర్నీ కలుపుతాను. నేను జీవితకాలం నీకు సపోర్టుగా ఉంటాను వరూధిని" అన్నాను ఆర్ద్రతతో గట్టిగా.
ఆమె నడక ఆగిపోయింది. వెనుతిరిగి ప్రకాశంగా చూసి, "ఐ లవ్ యూ టూ" అంది.
నేను షాకయ్యాను. కన్ఫ్యూజన్ లో ఏమీ అర్ధం కాలేదు.
"నువ్వంటే ఇష్టంలేదని నేను చెప్పినా, నాకు సపోర్టుగా నిలబడతానన్నావు కదా, నాకు ఇలాంటి మనస్తత్వం ఉన్న మనిషే కావాలి" అంది నవ్వుతూ.
నాకళ్ళు చెమ్మగిల్లాయి. ఆనందంతో మనసు ఒక్కసారే రివ్వున ఎగిరింది.
"ప్రేమకు అర్ధం తెలిసింది! వరూధిని" అన్నాను.
"అవును, కావాల్సింది చెంతనే ఉన్నా, ఒక్కోసారి తెలుసుకోలేము" అంది కొంటెగా నా కళ్ళలోకి చూస్తూ.. .
౼౼౼౼౼
ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్
ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి.
'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి.
నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి.
చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి.
అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం!
Comments