కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Premaku Avali Thiram' written by Yasoda Pulugurtha
రచన : యశోద పులుగుర్త
విధి చేసే గాయాలకు కాలమే మందు.
సాక్షి ప్రాణంగా ప్రేమించిన భర్త ధీరజ్, ఆమెకు దూరమయ్యాడు.
నెమ్మదిగా అతని జ్ఞాపకాలని పక్కకు నెట్టి, తన జీవితంలోకి ప్రవేశించిన విశాల్ కు మనసులో చోటిచ్చింది. ఆమె మానసిక సంఘర్షణను ఈ కథలో చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు.
ఆ అందమైన సాయంత్రం చల్లని ఆహ్లాదకరమైన గాలి శరీరాన్ని తాకుతూ ఉంటే ఇంటిముందు పూల చెట్లకు నీళ్లు పడుతున్న 'సాక్షి' కి మాత్రం ఆ వాతావరణం ఏమాత్రం ఆనందాన్నీ, మనశ్శాంతినీ కలిగించలేకపోతోంది. తను మనసారా కోరుకుందా, మళ్లీ ఇటువంటి జీవితం కావాలని ? లేదే ? తను ఎంతగానో ప్రేమించిన భర్త ధీరజ్ సంవత్సరం క్రితం హఠాత్తుగా గుండెపోటుతో మరణించినపుడు లోకమే శూన్యంగా కనిపించింది.. నీకిది న్యాయమా ధీరజ్ అని తను ఏడుస్తూ ఉంటే తను ఎందుకేడుస్తోందో అర్ధంకాక, తన చీర కుచ్చెళ్లల్లో ముఖం దాచుకుంటూ మూడేళ్ల తరుణ్ అమ్మా అంటూ ఏడుస్తున్నపుడు బాధ్యత తనని వెన్ను తడుతూ ఉలిక్కి పడేలా చేసింది...
వెనుక నుండి ‘అమ్మా!’ అని తరుణ్ పిలిచేసరికి తను చేస్తున్న పనికి మనసులో చెలరేగుతున్న సంఘర్షణలకు అంతరాయం కలగడంతో వెనక్కి తిరిగి చూసింది..
మూడేళ్ల తన చిన్నారి తరుణ్.. బొద్దుగా, బూరె బుగ్గలతో నల్లని పెద్ద పెద్ద కళ్లతో అమాయకంగా తనవైపే చూస్తూ.. అచ్చు ధీరజ్ రూపురేఖలను పుణికి పుచ్చుకున్నాడు. . ‘ఏంటి నాన్నా’ అంటూ వాడిని ఎత్తుకుని బుగ్గలమీద ముద్దు పెట్టుకుంటూ లోపలకు నడిచింది.. సాక్షి ఆ ఇంటివారి కోడలు..
పెళ్లై కొన్ని రోజులు మాత్రమే అయింది. ఎంతగానో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఆమె మొదటి భర్త ధీరజ్ దారుణమైన రోడ్ ఏక్సిడెంట్ లో చనిపోయాడు.. వారి అనురాగానికి ప్రతీకగా రెండేళ్ల తరుణ్ ని సాక్షికి అప్పగించి ఈలోకం నుండి శాశ్వతంగా నిష్క్రమించాడు..
భర్త పోయాక చిన్నారి తరుణ్ తో పుట్టింటికి చేరుకుంది.. లోకమే శూన్యంగా అయిపోయింది. కూతురిని. ఆ మూడేళ్ల పసికందుని చూస్తూ ఆమె తల్లితండ్రులు దుఖంతో కుమిలిపోతున్నారు. . పాతిక సంవత్సరాలకే భర్తపోయి, మోడుబారిన కూతురి జీవితాన్ని తలచుకుంటూ ఆవేదన చెందుతున్నారు..
ధీరజ్ చనిపోయి అప్పుడే సంవత్సరం దాటిపోయింది..
ఊహించని విధంగా సాక్షి నాన్నగారైన మాధవరావుగారిని ఆయన దూరపు బంధువొకాయన కలవాలని రావడం, ఆ బంధువుకి బాగా కావలసిన ఒక కుటుంబంలోని అబ్బాయికి డైవర్స్ అయి మూడు సంవత్సరాలైందని, ద్వితీయ వివాహ చేసుకోవాలనుకుంటున్నట్లు, సాక్షి గురించి వివరాలడిగి తీసుకోవడం, అవతలవారు వచ్చి సాక్షిని చూసుకోవడం, బిడ్డ ఉన్నా తమకేమీ అభ్యంతరం లేదంటే సాక్షి తల్లీ తండ్రీ ఆమె మీద ఒత్తిడి తెచ్చారు.
భర్తలేని ఒంటరిస్త్రీ ఈ సమాజంలో పిల్లవాడిని పెంచడం కష్టం అంటూ కన్నీళ్లూ అభ్యర్ధనలతో సాక్షిని బలవంతం చేస్తే విశాల్ చేత మెడలో తాళి కట్టించుకోవలసిన పరిస్తితి వచ్చింది.. విశాల్ కు భార్యగా తన మూడేళ్ల కొడుకుతో అత్తవారింట్లో అడుగుపెట్టింది సాక్షి...
అలవాటు లేని ప్రదేశం, మనుషులూ… విశాల్ కూడా సాక్షితో ముభావంగా దూర దూరంగానే ఉంటున్నాడు… బాబుని వీళ్లందరూ ఎలా చూస్తారోనన్న భయం కల్గుతోంది. తను ఈ కొత్త జీవితానికి ఎలా అలవాటుపడుతుందో అర్ధం కావడంలేదు. సిగ్గుదొంతరల మధ్య అరమోడ్పు కనులతో తన కలల రాకుమారుని చేతులలో వాలిపోవాలన్న ఉద్విగ్నత, ఆరాటం ఆమెలో మచ్చుకైనా లేవు. అది ఒకప్పటి గతం. ఏదో ఒకటీ అరా పనులు కల్పించుకుంటూ తన గతాన్ని మరచిపోతూ వాస్తవానికి అలవాటు పడడానికి ప్రయత్నం చేస్తోంది. తరుణ్ కి అన్నం తినిపించి తన గదిలోనే వాడిముందు కొన్ని బొమ్మలిచ్చి ఆడుకొమ్మంది..
ధీరజ్ తో పెళ్లై అత్తవారింటికి వచ్చిన తొలిరోజులు సాక్షి స్పృతి పధంలో నిలిచాయి. .
ధీరజ్ అమ్మగారు పరమ సాధ్వి, అమాయకురాలు. ప్రతీ చిన్న విషయానికి ‘అమ్మాయ్ సాక్షీ! ఇదెలాగ, అదెలాగ…’ అంటూ సలహాలడుగుతూ ఉండేవారు.
అప్పుడప్పుడు ధీరజ్ కొంటెంగా తనవైపు చూస్తూ " అమ్మని భలే బుట్టలో వేసుకున్నావే, ఏమి మాయ చేసారో రాణీగార”నగానే “చూడండత్తయ్యా!” అని తను అత్తగారికి ఫిర్యాదు చేయడం, ఆవిడ తనని వెనకేసుకుని రావడం జరిగేది.. ధీరజ్ జ్నాపకం వచ్చేసరికి కళ్లు కన్నీటి వరదలైనాయి. ధీరజ్ జ్నాపకాలు నీడలా తనని వెన్నాడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఈ కొత్తజీవితంలో తను ఇమడగలదా ? ధీరజ్ స్పర్శకు మాత్రమే స్పందించే తన తనువు, అతని పిలుపుకి పురివిప్పి నెమలిలా నాట్యం చేసే తన మనసు విశాల్ సాన్నిహిత్యాన్ని మనఃపూర్వకంగా అంగీకరించగలదా ?
ఇంతవరకూ విశాల్ తో ఒకటీ అరా మాటలు తప్పించితే మనస్సు విప్పి మాట్లాడుకోవడం జరగనే లేదు. బాబుని అలాగే వదిలి విశాల్ గదిముందుకెళ్లి నిలబడింది. తలుపు తెరిచే ఉన్నా కర్టెన్ వేసి ఉన్న మూలాన విశాల్ లోపల ఏం చేస్తున్నాడో తెలియదు. నెమ్మదిగా కర్టెన్ ని పక్కకి లాగి లోపలకు అడుగువేసింది. విశాల్ తలవంచుకుని లేప్ టాప్ లో పనిచేసుకుంటున్నాడు. గాజుల శబ్దానికి తలెత్తి చూసాడు. పది రోజుల క్రితం తను పెళ్లిచేసుకున్న అమ్మాయి. ఇంతరకు ఇద్దరూ మనస్సు విప్పి మాట్లాడుకోలేదు. ఏమిటో మాట్లాడాలంటే బెరుగ్గా ఉంది. మాట్లాడితే అతిచొరవ తీసుకున్నానని అనుకుంటుందేమోనని భయం...
కానీ పలకరించాలి, బాగోదు అనుకుంటూనే సాక్షి వైపు తలెత్తి చూస్తూ " ఈ కొత్త ప్రదేశం నీకు అలవాటు అవుతోందా, ఏమైనా ఇబ్బందిగా ఉందా ?” అన్నాడు.
" అదేమీ లేదు. మిమ్మలని భోజనానికి పిలుద్దామని వచ్చాను!” అంది సాక్షి
" సారీ, నేను తరువాత తింటాను, మీరంతా తీనేయం”డంటూ మళ్లీ లేప్ టాప్ లో పనిచేసుకోనారంభించాడు.
ఇంకేమీ మాట్లాడలేక వెంటనే వెనుతిరిగి వచ్చేసింది. .
ధీరజ్ ఉండగా తనెప్పుడూ ఒంటరిగా భోజనం చేయలేదు. . ఇద్దరూ బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ, జోకులువేసుకుంటూ, ధీరజ్ చెప్పే ఆఫీస్ జోకులకు తను కడుపుపట్టుకుని నవ్వేది.. ఒకోసారి పొలమారిపోయి కళ్లమ్మట నీళ్లు కారిపోతుంటే తనని దగ్గరకు అదుముకుంటూ నీళ్లుతాగించేవాడు. .
ఏమిటిది ధీరజ్ ? నీ జ్నాపకాలు చాలావా నాకు బ్రతకడానికి ? మళ్లీ ఈ జీవితం, కొత్త మనుషులతో ముడిపడిన బంధాలు ఎందుకు ? నీవు నన్నిలా ఒంటరిదాన్ని చేసిన మూలానే కదా ఇన్ని సమస్యలనుకుంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది.
రెండురోజులు మామూలుగానే గడచిపోయాయి. తనతో పెద్దగా ఎవరూ మాట్లాడడం లేదు. ఇక్కడకు రాగానే తను గ్రహించింది. విశాల్ ఎక్కువ మాట్లాడడని. అత్తగారికి వంట, పూజలు, ఇవి తప్పితే మరో ప్రపంచంలేనట్లే లోపల ఎక్కడో ఉంటారు. తరుణ్ ని కూడా ఎవరూ చేరదీయడం లేదు. వాడిని బయటకు రాకుండా గదిలోనే ఉంచేస్తుంటే మనుషులు కనపడక ఏడుస్తున్నాడని వాడిని స్వేఛ్చగా వదిలేసింది. బొద్దుగా అందంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండే తరుణ్ మెల్లి మెల్లిగా ఆ ఇంట్లో అన్నిగదుల్లోకి వెళ్లి ఆడుకోవడం ప్రారంభించాడు. .
ఆ రోజు అత్తగారు నడుంనొప్పితో లేవలేకపోయారు. బాబుకి పాలకోసం వచ్చిన సాక్షి వంటగదిలో విశాల్ కాఫీ తయారు చేయడం చూసి, నొచ్చుకుంటూ, " నేను చేస్తాను ప్లీజ్! పక్కకు జరగం”డంటూ చొరవగా కాఫీ కలపసాగింది.
" అమ్మకు నడుంనొప్పి వస్తే నాలుగురోజులవరకు లేవలేదు, అందుకని…” అంటూ "సంజాయిషీ ఇస్తున్నట్లుగా అన్నాడు.
" ఫరవాలేదు నేను చేస్తా”నంటూ చక చకా అన్నీ మొదలుపెట్టింది.
‘అత్తయ్యగారికి బాగాలేదన్న విషయం నాకు చెప్పవచ్చుకదా’ అని మనసులో అనుకుని బాధపడింది.
‘ఏదైనా కావాలంటే చెపితే షాప్ కెళ్లి తీసుకువస్తా’నంటూ క్షణం సేపు సాక్షి జవాబుకోసం అక్కడే నిలబడ్డాడు.
హమ్మయ్య, ముత్యాలు రాలుతున్నాయి, ఫరవాలేదనుకుంటూ, " చెపుతాను అవసరమైతే " అని జవాబిచ్చింది. .
తను వంట బాగా చేస్తుంది. వంట చేయడం అంటే తనకి చాలా ఇష్టం. అసలు వంటగదే ఒక అద్భుత ప్రపంచం. మనసులోని ఆలోచనలకూ, మధురజ్నాపకాలకూ ఆలవాలమైన ప్రదేశం . ధీరజ్ కు తను చేసిన సాంబారు, గుత్తివంకాయకూరంటే ప్రాణం.
'' నీ వలపంతా కూరి చేసావా సాక్షీ '' అంటూ ప్రేమగా తన నడుంచుట్టూ చేతులేసి దగ్గరకు తీసుకుంటూ పెదాలను ముద్దాడేవాడు. తను వంటింట్లో ఉంటే పని చేసుకోనీయకుండా వెంట వెంటే తిరుగుతూ అల్లరిచేస్తూ ఉండేవాడు. కళ్లల్లోకి ఊటబావిలా నీళ్లూరి మసక మసగ్గా అయిపోతుంటే, తనని ఎవరూ చూడడం లేదు కదా అనుకుంటూ కొంగుతో కళ్లు ఒత్తుకుంటూ పనిలో నిమగ్నమైంది.
వంట పూర్తవగానే, అత్తగారి గదిలోకి వెళ్లి ‘మందులు వేసుకున్నారా’ అంటూ పలకరించింది. భోజనం వడ్డించి తినిపించింది.
‘వంటలన్నీ నోటికి హితవుగా రుచిగా ఉన్నాయమ్మా సాక్షీ’ అంటూ మెచ్చుకున్నారు.
మామగారు కూడా విశాల్ డైనింగ్ టేబిల్ మీద అమర్చిన పదార్ధాలను వడ్డించుకుంటూ "“వంట చాలా బాగుంది విశాల్, మీ అమ్మ చేసిన దానికంటే బాగుంది” అంటుంటే విశాల్ తలవంచుకున్నాడు. ఆయనకు అర్ధమై సాలోచనగా తల పంకించారు. దూరంనుండి గమనిస్తున్న సాక్షి చిరుకోపంతో ‘ఏం? నేను చేసానని చెపితే ఈయనగారి సొమ్ము ఏమిపోతుందో’ అనుకుంది మనసులో...
వారం రోజులు అత్తగారిని లేవనీయకుండా అంతా తనే చేసింది. పొద్దుటే లేవడం, స్నానం పూజ, కాఫీ, టిఫిన్, భోజనాలూ, ఇంటికొక కళ వచ్చినట్లనిపించింది ఆవిడకు. విడాకులు తీసుకుని వెళ్లిపోయిన కోడలు ఏనాడూ ఇంట్లో ఇంత ముద్ద వండి పెట్టిన పాపాన పోలేదు.. అహంకారం ఎక్కువ.
‘అత్తయ్యా!’ అని పిలవమంటే ‘ఆంటీ’ అనే పిలిచేది. ఈ ఇల్లు ఒక పరాయిల్లులాగా తనొక అతిధి లాగ ప్రవర్తించేది. ఇన్నిరోజులు సాక్షిపట్ల తన మవసులో ఏదోమూల ఒక తేలిక భావం ఉండేది. తరుణ్ ‘తాతా.. బామ్మా’ అంటూ వెంటపడుతుంటే ఎప్పుడూ వాడ్ని దగ్గరకు తీయలేదు... ఈవారం రోజులూ సాక్షిని దగ్గరనుండి గమనించిన ఆవిడకు " బిడ్డను కన్నాక భర్త అర్ధాంతరంగా చనిపోతే, విధిలీలకు ఈ అమాయకురాలు చేసిన పాపమేమిటని" జాలిపడింది. విశాల్ కు పట్టిన పీడ తొలిగిపోయి సాక్షిలాంటి మంచి అమ్మాయి ఆ ఇంటికి కోడలిగా వచ్చినందుకు ఆవిడకు చాలా తృప్తిగా ఉంది. భర్తతో కోడలి మంచితనం, అణుకువ గురించి పదే పదే చెప్పేది. .
బాబు మెల్లి మెల్లిగా అందరికీ దగ్గరౌతున్నాడు. వాడి చెప్పే కబుర్లకు ఆ పెద్దవాళ్లిద్దరూ మురిసిపోతున్నారు.
" కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు" అంటే ఇదేనేమోననుకుంటూ సంబర పడుతున్నారు. ‘ఏరా మనవడా’ అంటూ మామగారు వాడిని ఒళ్లో కూర్చోపెట్టుకోవడం చూసింది సాక్షి ఒకసారి.. ఒకరోజు విశాల్ కారులో బయటకు వెడ్తూంటే నేనూ వస్తానని చేతులు చాచిన తరుణ్ ని ఎత్తుకుని తన పక్కనే కూర్చోపెట్టుకుని బయటతిప్పి తీసుకువచ్చాడు.
కాలం ఎవరికోసమూ ఆగదు. ఆరోజు వరలక్ష్మీవ్రతం.
పొద్దుటే స్నానం చేసి దేవుడి ముందు అలంకరణలు మొదలు పెట్టింది సాక్షి.
వరలక్ష్మీ వ్రతం వస్తోందంటే వారంరోజులనుండే తను హడావుడి పడడం, ధీరజ్ ను హడావుడి పెట్టడం ఎలా మరచిపోతుంది ?
ప్రతీ చిన్న పనిలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ తనని ప్రోత్సహించే ధీరజ్ . . . . . గడచిపోయిన జ్ఞాపకాల కన్నీటి తలపులు తనని తనని వేదనకు గురిచేస్తుంటే మనసు భారమైపోయింది. కళ్లమ్మట కారుతున్న కన్నీటి బొట్లు నునుపైన ఆమె బుగ్గలపై ముత్యాల్లా మెరుస్తుంటుంటే, తనని తాను సంభాళించుకోడానికి చాలా సమయమే పట్టింది...
అమ్మవారి విగ్రహాన్ని అందంగా తీర్చిదిద్ది పట్టుచీర కట్టి నగలతో అలంకరించింది. అత్తగారివన్నీ చూసి మురిసిపోయారు.
“నేను ఇవేమీ చేయలేనమ్మా, కలశం మాత్రం పెట్టి పూజ చేస్తా”నని చెప్పింది. తొమ్మిది రకాల పిండివంటల తో బాటూ వంటమొత్తం పూర్తిచేసి పూజకు అన్నీ రెడీ చేసి అత్తగారిని కూడా పూజకు కూర్చోమని చెప్పి తను పట్టుచీర కట్టుకుందామని తనగదిలోనున్న బీరువా తెరిచింది.
పట్టుచీరల దొంతర్ల మధ్యనుండి ఆకుపచ్చని కంచిపట్టుచీర తీయబోతుంటే ధీరజ్ ఎంతో మనసుపెట్టి తన పుట్టినరోజుకని కొన్న మైసూర్ సిల్క్ చీర కుబుసంలా తన చేతిలోకి వచ్చేసింది. వళ్లు ఝల్లుమంది. బంగారపు వర్ణంలో చిన్న చిన్న బంగారు బూటాలతో, సన్నని జరీ అంచుతో ఎంతో బాగుంటుంది. సర్ప్రైజ్ గిఫ్ట్ గా తనని ఊరించి, మురిపించి మరీ ఇచ్చాడు. ఆ చీర కట్టుకున్న తనవైపు ఆరాధనగా చూస్తూ పసిడిబొమ్మలా ఉన్నావు సాక్షీ అనేవాడు.ఆ స్పృతులు తన మనసుని గాలిదుమారంలా చుట్టముట్టేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే సాక్షి చిగురుటాకులా వణికిపోతోంది. కడుపులోనుండి దుఖం తన్నుకుంటూ వచ్చేసింది. ఇంతలో ‘సాక్షీ’ అంటూ అత్తగారు పిలిచేసరికి గబ గబా పట్టుచీర కట్టుకుని కళ్లుతుడుచుకుని పూజలో కూర్చుంది.
ఆరోజు సాయంత్రం అత్తగారు వచ్చి, ‘సాక్షీ అబ్బాయి పిలుస్తున్నాడు చూడ’నగానే, వెంటనే వెళ్లింది. తలంటుపోసుకుని అల్లుకున్న బారెడు జడలో సన్నజాజుల మాల, పట్టు చీరలో, చెవులకు బంగారు లోలకలు, మెడలో కెంపుల నెక్లస్ అలంకరించుకున్న సాక్షి సాక్షాత్తూ లక్ష్మీదేవిలా మెరిసిపోతోంది. సాక్షి ఏదో చెప్పబోయేంతలో విశాల్ ఒక పేకట్ సాక్షి చేతికిస్తూ, ఈరోజు వరలర్ష్మీ వ్రతం కదా, నీకు పట్టుచీర కొన్నాను . ముందరే కొనుంటే బ్లౌజ్ కుట్టించుకునేదానివేమో’ అంటూ ‘ముందు చీర చూడు, కలర్ నీకు నచ్చిందా’ అంటూ ఆత్రంగా అడిగాడు. చీర చాలా బాగుంది. మంచి సెలక్షన్ అనుకుంటూ తీసుకోడానికి సంశయించేసరికి బలనంతంగా చేతిలో పెట్టేసాడు. .
" ఆ, ఏదో చెప్పాలనుకుంటున్నావ్, ఏమిటి సాక్షీ" ?
" నాకు మీరో సాయం చేయాలి విశాల్. తరుణ్ ని కిండర్ గార్డన్ స్కూల్ లో వేద్దామని. రేపు మంచిరోజు. మన ఇంటికి దగ్గరలోనే ఉందిట. రేపూ మీరూ నాతో వస్తే వాడిని చేర్పిద్దాం!”
"అలాగే తప్పకుండా వస్తాను".
“ధాంక్యూ” అంటూ వెనుతిరిగి వచ్చి, విశాల్ కొన్న పట్టుచీర అమ్మవారిముందు పెట్టి ఒక్క క్షణం కళ్లుమూసుకుంది. " ధీరజ్ పట్ల నా గుండెల్లో దాచిన ప్రేమ అగ్నిపర్వతంలా పేలి, లావాలా ఉబికివచ్చి నన్ను నిలువెల్లా దహించి వేస్తోంది. నా ఈ జ్నాపకాల సునామీ నుండి నన్ను కాపాడలేవా తల్లీ. విశాల్ ను మనస్పూర్తిగా ప్రేమించే శక్తిని ప్రసాదించు. ఇలా అడగడం భావ్యమో కాదో నాకు తెలీదు కానీ నీవు ప్రసాదించిన నా కొత్తజీవితానికి అర్ధమేమిటి ? మనసులో ఒకరిని నింపుకుని మరొక వ్యక్తితో దాంపత్యజీవనం చేయడం ఏ స్త్రీకి సాధ్యం కాదమ్మా, అది అపవిత్రత కూడా. ఎదురుగా ఉన్న విశాల్ ను నేను మనసావాచా అంగీకరించేటట్లు, నా ఈ కొత్త జీవితానికి అలవాటుపడేటట్లుగా అనుగ్రహించమ్మా” అని కోరుకుంటూ ఆ చీర కట్టుకుని అత్తగారికి మామగారి పాదాలకూ దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకుంది. .
తరువాత విశాల్ గదిలోకి వెళ్లి అతనిపాదాలను స్పృశించింది. హృదయం కరిగి కన్నీటి రూపంలో అతనిపాదాలను అభిషేకించాయి. తన గుండెల్లో పేరుకుపోయిన బాధనంతా కన్నీళ్ల రూపంలో వినిపిస్తూ ఉన్న ఆమె భుజంపై అతని చేతి స్పర్శ ఆమెను స్పృహలోనికి తెచ్చింది. .
“నా ప్రవర్తన నిన్ను కష్టపెట్టింది కదూ, ఐ యామ్ సారీ సాక్షీ ! నీతో చొరవగా ప్రవర్తించడానికి సంశయించాను. నీవు నా గురించి ఏమనుకుంటావోనన్న సంధిగ్ధం.. నా మొదటి వివాహం నా మనసుపై తీవ్రప్రభావం చూపింది సాక్షీ.. నా భార్యకు నిస్వార్ధంగా ప్రేమను అందివ్వాలని ఆశపడ్డాను. అలాగే తననుండి కూడా ప్రేమను ఆశించిన నాకు పరాజయం ఎదురైంది... ఇరువైపుల పెద్దల అంగీకారంతో జరిగిన నా మొదటి పెళ్లి అంతా బూటకమే. . పెళ్లికి ముందే తన క్లాస్ మేట్ ని ప్రేమించిందిట.. అతనితో కూతురి పెళ్లి జరిపించడం ఇష్టంలేని ఆమె తల్లితండ్రులు చస్తామని బెదిరిస్తే, భయపడి నన్ను పెళ్లిచేసుకుని ఆ తరువాత నన్ను అన్నిరకాలుగా టార్చర్ చేసింది... కపట ప్రేమతో నన్ను వంచించింది. చాలా కాలం వరకు భ్రమలో ఉన్నానని అర్ధంకాలేదు. నాకు అర్ధమైన మరుక్షణం ‘ఏమిటిదీ’ అంటూ గట్టిగా నిలదీసి అడిగినందుకు నీతో భార్యగా కలసి ఉండలేనంటూ నానుండి విడాకులు తీసుకుని వెళ్లిపోయింది . ఆడవాళ్లంతా ఇంతేనేమోనన్న ఒక దురభిప్రాయం కూడా నా ప్రవర్తనకు కారణమవ్వచ్చు. .
మనిద్దరం జీవితంలో ఎన్నో అనుభవాలను చవిచూసాం... ఇద్దరం ఒకటై, ఒక మంచి స్నేహితులుగా, భార్యా భర్తలుగా జీవితాంతం తోడూనీడగా ఉండలేమా అనుకున్నాను... . నిన్ను చూసాక నా కలలు నెరవేరతాయని ఆశపడినమాట వాస్తవం. నిన్నూ, తరుణ్ నీ నా ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకుంటాను సాక్షీ” అంటూ మాట్లాడుతున్న అతని మాటలు, తమ ఇద్దరి గుండెచప్పుళ్లతో ఏకతాళమై , ఆ పరిసరాల్లోని గాలికూడా వారికి సహాయం చేసినట్లు, ఒక సన్నని చిరుగాలి మేనుని తాకుతూ ఉంటే అతనికి మరింత చేరువవ్వాలని ఆమె మనస్సు ఉవ్విళ్లూరింది…
తనకు అతి సమీపంగా నిలబడిన సాక్షి మోమును తన చేతిలోకి తీసుకుని ఆమె కన్నీటిని తుడిచి, ఆమె నుదుటిని మృదువుగా ముద్దు పెట్టుకుంటూ " నిన్ను ప్రేమకు ఆవలితీరంలోనున్నమరో అందమైన ప్రపంచంలోకి తీసుకువెడ్తాను సాక్షీ, నాతో కలసి వస్తావుకదూ!” అంటూ ఆర్తిగా అడిగాడు.
ఆ స్పర్శకు ఆమె అంతరంగం పాలకడలిలా పరవశించి వస్తానన్నట్లుగా తల ఊపింది…
శుభం.
***శుభం***
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.
Comments